Monday, April 24, 2023

ఉత్తమోత్తమ ఇతిహాసమైన శుక మహర్షి జన్మ వృత్తాంతం, ఆయన సిద్ధుడైన నేపధ్యం ..... ఆస్వాదన-117 : వనం జ్వాలా నరసింహారావు

 ఉత్తమోత్తమ ఇతిహాసమైన శుక మహర్షి జన్మ వృత్తాంతం,

ఆయన సిద్ధుడైన నేపధ్యం

ఆస్వాదన-117

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (24-04-2023)

శుకుడు వ్యాసమహర్షి పుత్రుడనే విషయం మినహా అతడి జన్మవృత్తాంతం కాని, చిన్నతనంలోనే అతడు మహానుభావుడైన విధానం కాని, సిద్ధుడైన నేపధ్యం కాని తనకు తెలియదని, అవన్నీ తనకు తెలుపవలసిందని ధర్మరాజు భీష్మ పితామహుడిని ప్రార్థించాడు. ధర్మరాజు ప్రశ్నకు సమాధానంగా ఆ వివరాలను తెలియచేశాడు భీష్ముడు ఈ విధంగా.

‘మేరుపర్వత సానువులలో కర్ణికారవనం ఉన్నది. అక్కడ పార్వతీ-పరమేశ్వరులు విహరిస్తుంటారు. అందులో వేదవ్యాసుడు కుమారుడి కొరకు తపస్సు చేశాడు. వ్యాసుడి తపస్సుకు శివుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకొమ్మని వ్యాసుడికి చెప్పాడు. పంచభూతాలతో సమానమైన శక్తి యుక్తులు కలిగిన పుత్రుడిని వరప్రసాదంగా అనుగ్రహించమని వ్యాసుడు శివుడిని వేడుకొన్నాడు. వ్యాసుడు కోరినట్లే దయామయుడైన శివుడు ఆయనకు కొడుకును వరంగా ప్రసాదించి అంతర్ధానమయ్యాడు’.    

‘వరం పొందిన వ్యాసుడు ఒకనాడు తన ఆశ్రమంలో అగ్నికార్యాలు నిర్వహించడం కోసం అరణిని (గుండ్రటి చెక్క మీద పుల్లతో మథించి అగ్నిని పుట్టిస్తారు. ఆ చెక్కను అరణి అంటారు) మథిస్తూ ఉండగా ఘృతాచి అనే అప్సరస కనపడింది. మహర్షికి ఆమెను చూసి కామప్రకోపం కలిగింది. దానిని గమనించిన అప్సరస భయపడి చిలకగా మారిపోయింది. వ్యాసుడు మనస్సు చిక్కబట్టుకొని అరణిని చిలకడం ప్రారంభించాడు. వ్యాసుడి మనస్సులో అప్సరస రూపమే నిలిచి పోయింది’. 

‘ఘృతాచిపై కలిగిన కామభావంవలన వ్యాసుడికి వీర్యస్ఖలనం అయి అరణిలోపడి ప్రకాశించింది. అయినప్పటికీ వ్యాసుడు నిర్వికార చిత్తంతో అరణి మథనం కొనసాగించాడు. అందులోనుండి తేజస్వి అయిన శుకుడు పుట్టాడు. రూపంలో ముమ్మూర్తులా ఆ పిల్లవాడు వ్యాసుడే. యజ్ఞకుండంలో ఆజ్యంపోస్తే అగ్ని ఎలా ప్రకాశిస్తుందో శుకుడు గొప్ప తేజస్సుతో అలాగే వెలిగిపోతున్నాడు. సరిగ్గా అప్పుడే గంగానది స్త్రీ రూపంలో వచ్చింది.

‘ఆ బాలుడికి గంగాదేవి మంగళ స్నానం చేయించింది. ఆకాశంనుండి కృష్ణాజినం, దండం వచ్చి పడ్డాయి. పూలవాన కురిసింది. దేవ దుందుభులు మ్రోగాయి. ఇంద్రాది దేవతలు గౌరవంతో వచ్చారు. పార్వతీపరమేశ్వరులు శుకుడికి ఉపనయనం చేశారు. దేవేంద్రుడు తళతళలాడే కమండలం ఇచ్చాడు. దేవతలు దివ్యమైన వస్రాలు సమర్పించారు. శుకుడిది దివ్యమైన పుట్టుక. మునుపు వ్యాసుడు పుట్టగానే వేదాలు అతడిని పొందిన విధంగానే, ఇప్పుడు కూడా వేదశాస్త్రాలు శుకుడిని పొందాయి. శుకుడు బృహస్పతిని తన గురువుగా వరించాడు. బృహస్పతి చదివిస్తుంటే శుకుడు వేదాలు, వేదాంగాలు, సకల శాస్త్రాలు క్రమంగా అభ్యసించాడు. బ్రహ్మచర్య వ్రతదీక్షతో ఆ నియమాలు పాటిస్తూ గురువుగారి దగ్గరే వుండిపోయాడు. శుకుడు ఎల్లప్పుడూ తన తండ్రిని అనుసరిస్తూ వుండేవాడు. కుమారుడికి వ్యాసుడు సాంఖ్యయోగ శాస్త్రాలను బోధించి అహంకార-మమకారాలను విడిచిపెట్టే పద్ధతిలో అభివృద్ధి చేశాడు. దానితో శుకుడు విరాగయ్యాడు.

‘మోక్షాన్ని ఇచ్చేది ఏదనే జిజ్ఞాస శుకుడిలో మొదలయింది. తండ్రిని మోక్షవిద్యను బోధించమని కోరాడు. తన కుమారుడు మోక్షాన్ని సందర్శించాలి అనే కోరికతో ఉన్నాడని వ్యాసుడు గమనించాడు. ఆయన జనకమహారాజును అడుగుమని, ఆయన మోక్ష ధర్మం ఉపదేశిస్తాడని చెప్పాడు. తండ్రి సూచనమేరకు శుకుడు కాలినడకతో మిథిలానగరానికి చేరాడు. మార్గమధ్యంలో అనేక పర్వతాలను, నదులను దాటాడు. పుణ్యతీర్థాలు దర్శించుకున్నాడు. జనక మహారాజు ప్రవేశద్వారం వద్ద సేవకులు శుకుడిని ఆపివేసిన తరువాత, జనకుడికి విషయం తెలిసి, మొదలు పురోహితుడిని పంపి, అ ఆతరువాత స్వయంగా ఆయనే వెళ్లి, లోపలికి తీసుకువచ్చి, ఆసనం మీద కూచోబెట్టాడు. శాంతచిత్తుడైన శుకుడు జనకుడి అభిమానాన్ని పొందాడు. ఆ రాజిచ్చిన సత్కారాలను నిరాసక్తతతో శుకుడు గ్రహించాడు. మరునాడు ఉదయం శుకుడు, బ్రాహ్మణుడు చేయతగినది ఏదని, ముక్తి దేనితో పొందవచ్చునని, జనకరాజును ప్రశ్నించాడు. జవాబుగా జనక మహారాజు ఇలా చెప్పాడు’.

‘బ్రాహ్మణుడు ముందు ఉపనయనం చేసుకొని, బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించాలి. వేదాధ్యయనం చేయాలి. ఆ తరువాత వివాహం చేసుకొని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి. సంతానం పొందాలి. గృహస్థుడిగా చేయాల్సిన యజ్ఞయాగాదులు చేయాలి. ఆ తరువాత అరణ్యానికి వెళ్లి వానప్రస్థం స్వీకరించాలి. దాని తరువాత వైరాగ్యపూర్ణమైన మనఃప్రవృత్తితో పరమప్రశాంతిని పొంది సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించాలి. లోక వినాశనం, కర్మసాంకర్యం జరగకుండా వుండడానికే బ్రహ్మచర్యాది నాలుగు ఆశ్రమాలను ఏర్పాటుచేసి మన పూర్వ మహర్షులు ఆశ్రమ ధర్మాలను దృఢంగా నడిపారు.    

‘బ్రహ్మజ్ఞానం పుట్టుకతో వచ్చినవాడు కాని, అభ్యాస వశంతో పొందినవాడు కానీ చతుర్విధాశ్రమాల వరుసలో ప్రయాణం చేసి చివరకు ముక్తి పొందుతాడు. పూర్వ జన్మ సంస్కారం వలన ముక్తి హేతువులు సిద్ధిస్తే బ్రహ్మచర్యంలోనే జీవన్ముక్తుడౌతాడు. జ్యోతిస్వరూపమైన పరతత్త్వం ప్రతి వ్యక్తికి ఆత్మలోనే ఉంటుంది. ఏకాగ్రత సాధించిన యోగి ఆ జ్యోతిని తనలోనే తాను దర్శించగలుగుతాడు. ఇతరులవలన తనకూ, తనవలన ఇతరులకు ఏ విధమైన భయమూ లేని నిర్భయస్థితి అలవడినప్పుడు ద్వంద్వాతీత స్థితిని పొంది పరమాత్మను సాధకుడు చూడగలుగుతాడు. జనకుడి మాటలు శుకుని అనుమానాలను తీర్చాయి. తిరుగు ప్రయాణం అయ్యాడు’.

‘శుకుడు ఉత్తర దిశగా బయల్దేరాడు. వాయు మార్గంలో పయనించి హిమవత్పర్వతంలోని వ్యాసాశ్రమానికి చేరాడు. శుకుడికంటే ముందే అక్కడికి వ్యాసుడు చేరుకున్నాడు. సుమంతు, వైశంపాయన, జైమిని, పైలుడు అనే నలుగురు శిష్యులకు వేదం నేర్పుతున్నాడు. తన కొడుకు తిరిగి రావడాన్ని వ్యాసుడు సంతోషించాడు. జనకుడితో తనకు జరిగిన సంభాషణను శుకుడు తండ్రికి వినిపించాడు. వ్యాసుడు తన కొడుకు శుకుడిని తన నలుగురు శిష్యులతో కలిపి మొత్తం అయిదుగురికి అధ్యాపనం చేస్తున్నాడు’.   

‘వేదప్రచారం కొరకు వ్యాసుడి ఆదేశానుసారం ఆయన నలుగురు శిష్యులు వివిధ ప్రదేశాలకు పోగా శుకుడూ, వ్యాసుడూ మాత్రమే ఆశ్రమంలో ఉంటున్నారు. ఒకనాడు నారదుడు వచ్చి తండ్రి కొడుకుల నడుమ వేదాధ్యయన వ్రతం నిరంతరంగా సాగాలని కోరాడు. వేదాధ్యయనం కొనసాగించడానికి, తన కొడుకైన శుకుడితో కలిసి ఉత్తమోత్తమమైన వేదాధ్యయనం తక్షణమే ప్రారంభించి, ముల్లోకాలను వేదధ్వనితో నింపి వేశాడు. ఇలా ఇద్దరూ వేదాధ్యయనం చేస్తుంటే ఒకనాడు భయంకరంగా పెనుగాలి వీచింది. వ్యాసుడు ఆరోజును అనధ్యయన దినంగా ప్రకటించాడు. ఆ పెనుగాలి ఎక్కడి నుండి వీస్తున్నదో కొడుక్కు విడమర్చి చెప్పాడు వ్యాసుడు. దేవతా విమానంలో విష్ణుమూర్తి, పితృదేవతల విమానంలో సూర్యుడు కిందికీ, మీదికీ ప్రయాణం చేయడం వల్ల ఆ పెనుగాలి ఏర్పడిందని, హిమాలయాలను కూడా కదలించేస్తుందా అన్నంతగా ఆ గాలి వుంటుందని అన్నాడు. అలాంటి సమయంలో వేదాధ్యయనం చేస్తే కీడు కలుగుతుందని ఆపుచేయాల్సి వచ్చిందని చెప్పాడు. కాసేపటికి సుడిగాలి సద్దు మణిగింది’.  

‘వ్యాసుడు స్నానానికి వెళ్ళినప్పుడు శుకుడు మానవుడికి హితమైనదేదని అడుగగా, నారదుడు ఆ వివరాలను చెప్పాడు. సత్యమే తపస్సు, జ్ఞానమే కన్ను, త్యాగమే సుఖం, రాగమే దుఃఖం. నరుడు మోక్షం కొరకు ప్రయత్నించకుండా సంసారబంధాలలో తగుల్కొంటే మరో జన్మలో కూడా ముక్తి సాధ్యం కాదు. కామక్రోదాలే ముక్తికి శత్రువులు. అహింస, ఇంద్రియ నిగ్రహం, నైరాశ్యం, ఆచపలత్వం అనే ఉత్తమగుణాలు వున్నవాడికి అంతరాత్మతత్త్వం తేటతెల్లమవుతుంది. బంధుమిత్రుల పట్ల వ్యామోహితుడైనవాడు ఊబిలో దిగబడిన ఏనుగువలె హింసకు గురి ఔతాడు. భోగలాలసుడు వలలో చిక్కుకొన్న మృగంవలె, చేపవలె గిలగిలలాడతాడు. అహింసను అలవరచుకొని అధర్మాన్ని వదలాలి. సంకల్పాలను త్యజించి ధర్మాన్ని వదలించుకొనాలి. బుద్ధిబలంతో సత్యాసత్యాలను తొలగించుకొనాలని నారదుడు చెప్పగా శుకుడు సూర్యుడి దయవలన యోగసిద్ధి పొందుతానని బయలుదేరాడు’.

‘వ్యాసుడు వారించినా ఆగక శుకుడు కైలాస పర్వతానికి వెళ్ళి సూర్యుడి అనుగ్రహాన్ని పొందాడు. తాను యోగసిద్ధిని పొందినట్లు నారదుడికి తెలిపి, గరుత్మంతుడివలె ఎగురుతూ ఆకాశమార్గాన బయలుదేరాడు. సిద్ధులూ, సాధ్యులూ, మహర్షులు ఆ యోగసిద్ధిని చూచి ఆశ్చర్యపోయారు. వ్యాసుడు పుత్రవ్యామోహంతో బయలుదేరాడు. శుకుడు మార్గమధ్యంలో ఉన్న మృగాలనూ, పక్షులనూ, పర్వతాలనూ, నదులనూ, కొలకులనూ, గుట్టలనూ, తీగలనూ చూచి “మా తండ్రి నా వెంట వస్తూ నా పేరుతో పిలుస్తూ ఉంటే మీరు '' అని బదులు పలకాలి సుమా!” అనగానే అవి అందుకు అంగీకరించాయి. శుకుడు త్రిగుణాలను త్యజించి ఉత్తరంగా వెళ్ళుతుండగా ఒక మహాపర్వత శిఖరాలు రెండు అడ్డంగా ఉన్నా, వాటిని తన గమనవేగంతో భగ్నంచేస్తూ సాగిపోయాడు. దేవతలు అతడిపై పూలవాన కురిపించారు”.

‘శుకుడు గంగానదిపై తక్కువ ఎత్తులో పోతూ ఉండగా క్రింద ఉన్న గంగానదిలో అప్పరసలు దిగంబరంగా జలక్రీడలాడుతున్నారు. వారంతా శుకుడిని చూచారు. కాని, ఏ వికారమూ పొందలేదు. శంకించలేదు. సిగ్గుపడలేదు. ఎప్పటివలె జలక్రీడలు సాగించారు. ఆ సమయంలో వ్యాసుడు తన కుమారుడి వెనుక గొప్ప యోగవిద్యవలన లభించిన గమనాన్ని స్వీకరించి వెంటబడ్డాడు. అప్పటికి ఆ శుకుడు వాయుమార్గం దాటి పంచభూతాలకు అంతర్యామి అయ్యాడు. అప్పుడు వ్యాసుడు పిలిచేసరికి శుకుడికి తెలిసింది. అతడిప్పుడు సర్వభూతాత్మకుడుగా మారిపోయాడు. కాబట్టి రూపం కనపడదు. అయినా వ్యాసుడికి వినిపించేటట్లు '' అనే ధ్వని ఆకాశమంతటా వ్యాపించి మారుమ్రోగేటట్లు చేశాడు. వ్యాసుడు ఆశ్చర్యపోయి తన కుమారుడి అనంతమైన మహిమను తెలిసికొన్నాడు’.

‘అదే పర్వతశిఖరంమీద వ్యాసుడు అట్లాగే నిలబడిపోయాడు. ఆ వ్యాసుడిని చూచి అప్సరసలు సిగ్గు ఎక్కువ కాగా అందరూ బట్టలు కట్టుకొన్నారు. దివ్యజ్ఞానం కలిగిన ఆ వ్యాసుడు, తన కుమారుడు అదే దారిలో వెళ్ళినప్పుడు వారికి శంక లేదన్న నిజాన్ని గ్రహించి, కుమారుడి విముక్త స్థితిని, తన ఆసక్త స్థితిని గ్రహించి కుమారుడి ఔన్నత్యానికి సంతోషించాడు. తన స్థితికి సిగ్గుపడ్డాడు. అట్లా దిగులు పడుతున్న వ్యాసుడి వద్దకు గంగాధరుడు వచ్చాడు. మునులూ, సిద్ధులూ, దేవతలూ ఆ దేవుడివెంట వచ్చారు. శంకరుడు తాను ముందు వ్యాసుడికి పంచభూత సమవీర్యుడిని కొడుకుగా అనుగ్రహించిన అంశాన్ని జ్ఞాపకం చేసి, విచారించవలసిన అవసరం లేదని ఓదార్చాడు. శుకుడి కీర్తి ప్రపంచం ఉన్నంతకాలం నిత్యంగా ఉంటుందని ప్రకటించాడు. వ్యాసుడు కోరితే శుకుడి నీడ అతడిని అనుసరిస్తుందని పేర్కొని, శివుడు అంతర్ధానమయ్యాడు’.

ఇది ఉత్తమోత్తమ ఇతిహాసమని, దీనిని చదివినవారికి, విన్నవారికి, దీర్ఘాయుర్దాయం లభిస్తుందని, సకల సంపదలు, యశస్సులు, అనేకమైన అభ్యుదయాలు కలుగుతాయని, చివరకు సద్గతులను, ఉత్తమలోకాలను ప్రసాదిస్తుందని ఫలశ్రుతిగా భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, షష్టాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

 

No comments:

Post a Comment