Tuesday, November 14, 2023

అరకొర స్థానాలా? అభివృద్ధా? : వనం జ్వాలా నరసింహారావు

 అరకొర స్థానాలా? అభివృద్ధా?

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (15-11-2023)

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడడానికి ముందునుంచే రాష్ట్ర స్థాయి జాతీయ రాజకీయ నాయకులు, వారి పక్షాన రాష్ట్రానికి వచ్చిపోతున్న పొరుగు రాష్ట్రాల, జాతీయ నాయకులు, రాష్ట్రంలోని చిన్నా-చితకా పార్టీల నాయకులు, తమపార్టీకి ఓటర్లలో బలం లేకున్నా, అరకొర స్థానాలను స్వంతంగానైనా, లేదా, ఇతర పార్టీల మీద ఆధారపడైనా గెలవాలనుకునే మరికొందరు నాయకులందరి ఏకైక ఆశయం, ఎన్నికలలో భారత రాష్ట్ర సమితిని (బీఆర్ఎస్) ఓడించడమే. ఒకవైపి, బీఆర్ఎస్ అన్ని స్థానాలకు పోటీ చేయడానికి అభ్యర్థులను అందరికంటే చాలా ముందుగా ప్రకటించి, తొమ్మిదిన్నర సంవత్సరాల రాష్ట్రాభివృద్ధి ప్రాతిపదికగా, గెలుపు దిశగా పురోగమిస్తున్నది. బీఆర్ఎస్ విజయం ఖాయమని సర్వత్రా వినిపుస్తున్నది. మరోవైపు, కొన్ని పార్టీలు ఇప్పటికీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేకపోవడం గమనించాల్సిన విషయం.     

పొత్తుల విషయంలో, రాజకీయ పునాదులు లేని చిన్నా- చితకా పార్టీలు మల్లగుల్లాలు పడడం సహజమే కాని, ఒకానొక సమయంలో దేశ రాజకీయాలలో జాతీయ, రాష్ట్రాల స్థాయిలో తమకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని, ప్రజా బలాన్ని, చట్ట సభలలో పెద్ద సంఖ్యలలో ప్రాతినిధ్యాన్ని కలిగివున్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, కామ్రేడ్లు సహితం, నేడు అరకొర స్థానాల కోసం వెంపర్లాడడం, అవి రావని తెలుసుకున్న తరువాత ఎవరికో నష్టం చేయాలనో, లేదా, మరెవరికో లాభం చేయాలనో లక్ష్యంగా పెట్టుకుని, తమకు బలముందో లేదో తెలియని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం విడ్డూరంగా వుంది.

1962 లో భారత కమ్యూనిస్ట్ పార్టీలో చీలిక అనంతరం, 1964 లో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) {సీపీఐ (ఎం)} పార్టీ, బలీయమైన శక్తిగా ఎదిగి, అలనాటి ఆపార్టీ నాయకత్వం కింద ప్రజా ఉద్యమాలు నిర్వహించడంలో ముందు వరుసలో వుంటూ, వామపక్షాలలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలకు సారధ్యం వహించే స్థాయికి చేరుకొని, దరిమిలా కేరళ రాష్ట్రానికే పరిమితమైంది. ‘తెలంగాణా సాయుధ పోరాటానికి’ నాయకత్వం వహించిన నాటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ మనుగడ నేడు పూర్తిగా ప్రశ్నార్థకమైంది. శాసించే స్థాయి నుండి అర్థించే స్థాయికి దిగజారింది. కమ్యూనిస్ట్-మార్క్సిస్ట్ మేథావుల వారసత్వానికి బహుదూరంలో వుండే ఈతరం నాయకత్వానికి సిద్ధాంతపరమైన అవగాహన ఎంతమేరకు వుందో మార్క్స్ మహానీయుడికే అవగతం కావాలి!!! ఒకవైపు అభ్యర్థులను ప్రకటిస్తూనే, ఇంకా దింపుడు కళ్లెం ఆశతో కనీసం రెండి సీట్లయినా కేటాయించకపోతారా అని కాంగ్రెస్ పార్టీ మీద ఆశలు పెట్టుకున్నది. ఇక సేపేఐ అవిరళ కృషి చేసి ఒక్క స్థానాన్ని, భవిష్యత్తులో రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఖరారు చేసుకుంది. ఎంత విడ్డూరం!!

సీపీఐ (ఎం) ఆరోహణ, అవరోహణ ఒక సమకాలీన రాజకీయ పాఠం. మార్క్సిజం-లెనినిజం యోధానయోధులైన పుచ్చలపల్లి సుందరయ్య, ఇఎంఎస్ నంబూద్రీపాద్, హరికిషన్ సింగ్ సూర్జిత్, ప్రమోద్ దాస్ గుప్తా, ఏకే గోపాలన్, బీటీ రణదివే, మాకినేని బసవపున్నయ్య, పి రామమూర్తి, జ్యోతి బోసు లాంటి వారి సారధ్యంలో పురుడుపోసుకుని, అంచలంచలుగా ఎదిగి, భారత దేశంలో అతి పెద్ద కమ్యూనిస్ట్ పార్టీగా పేరుతెచ్చుకున్న భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మూడంటే మూడు లోక్ సభ స్థానాలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో తెలంగాణాలో సీపీఐ (ఎం) పార్టీకి ఒక్క స్థానం కూడా రాలేదు. మున్ముందు వస్తాయన్న నమ్మకం కూడా అసలేలేదు. 2014 లో ఒకే ఒక్క స్థానం గెల్చుకున్న సీపీఐకి 2018 లో అదికూడా దక్కలేదు. అయినా కామ్రేడ్స్ ఓటమి పాఠం నేర్చుకోకపోవడం దురదృష్టం.

ఉభయ కమ్యూనిస్టులు తమకు కేటాయించాలని ప్రధానంగా కోరిన ఖమ్మం జిల్లాకు, రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం (నవంబర్ 5,2023) నాడు ఖమ్మం పట్టణానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తన ప్రసంగంలో ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా అనీ, పోరాటాల ఖిల్లా అనీ, చైతన్య పరచడంలో కమ్యూనిస్టుల కృషి కూడా వుందని, విచక్షణతో ఆలోచించి ఎవరు గెలిస్తే తెలంగాణ సురక్షితంగా వుంటుందో ఆలోచించాలని అన్నారు. ఇది వందశాతం వాస్తవం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఖమ్మం జిల్లా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, సర్వదేవభట్ల రామనాధం, మంచికంటి రామకిషన్‌రావు, రావెళ్ళ సత్యనారాయణ వంటి యోధులు ఉద్యమంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాకు ‘మార్క్సిస్టు, కమ్యూనిస్టుల కంచుకోట’ అన్నపేరు వుండేది. క్రమేపీ, బలమైన ఉద్యమ నేపధ్యంలో నిర్మించబడిన కమ్యూనిస్ట్ పార్టీ, ప్రజా ఉద్యమాలకు దూరమై, అంతర్గత కుమ్ములాటలతో, సొంతకంటిలో వేలుపొడుచుకున్న విధంగా బలహీనపడిపోయి, అలా అనిపించుకునే అర్హత కోల్పోయింది.

ఉమ్మడి పార్టీ చీలిపోవడంతో సీపీఎం బలమైన శక్తిగా ఎదుగుతూ, రాష్ట్రం మొత్తంలో సీపీఎంకు పట్టున్న జిల్లాగా పేరుతెచ్చుకుంది. రాష్ట్ర చరిత్రలో, ఆ మాటకొస్తే దేశచరిత్రలోనే పౌరహక్కుల ఉద్యమాలకు నాంది పలికింది డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, అడ్వకేట్‌ రాధా కృష్ణ, అడ్వకేట్ సుబ్బారావుల (మేథావిత్రయం) నాయకత్వంలో ఖమ్మం జిల్లాలోనే అనాలి. ఒకానొక రోజుల్లో ఖమ్మం జిల్లాలో దాదాపు అన్ని శాససభ స్థానాలను ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ, ఆ తరువాత విడిగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు గెలుచుకునేవి. ఇక ఖమ్మం మునిసిపాలిటీ సంగతి చెప్పనే అక్కరలేదు. చిర్రావూరి లక్ష్మీనర్సయ్య జీవితాంతం చైర్మన్ గా వుండేవారు. ఖమ్మంతో సహా నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలోను, ఇతర జిల్లాలలోను, పార్టీకి ప్రాబల్యం వుండేది. ఇప్పుడు లేదనే విషయం విదితమే!!!

1989, 1996, 2004 ఎన్నికల అనంతరం కేంద్రంలో కీలకమైన పాత్ర పోషించిన సీపీఐ (ఎం) అవసరం 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రానికి ఏ మాత్రం కలగలేదు. ఇంత భారీ స్థాయిలో ఉభయ కమ్యూనిస్టుల ప్రాబల్యం పడిపోతే, లాభ పాడేది, ఇంతింతై చందాన బలపడుతున్న జాతీయ మతతత్వ అతివాదమే. ఇది అభిలషణీయం కాదు. ఇంత జరిగినా పాఠాలు నేర్వకుండా, అరకొర సీట్లకోసం వెంపర్లాట తప్ప, మతతత్వ అతివాదాన్ని ఎదిరించే పార్టీకి, రాష్ట్రం ఏర్పాటైననాటి నుండి ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీకి తమవంతు సహకారాన్ని అందించాలన్న ఆలోచన కామ్రేడ్స్ చేయకపోవడం విచారకరం. ఇకనైనా వీరు పునరాలోచించాలి. సీపీఎం మానిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశం తెలంగాణ తొమ్మిదిన్నర సంవత్సరాల అభివృద్ధిలో భాగమే. మరెందుకు ప్రజా పోరాటం కామ్రేడ్స్? మరెందుకు ఒకటి-రెండు సీట్ల కోసం తపన?

తెలంగాణ అస్తిత్వం కోసం ఆదినుండీ కమ్యూనిస్టులు కలిసిరాలేదన్న సంగతి తెలిసిందే. అది వారి విధానం కావచ్చు. 1953లో తెలంగాణ కోసం కొందరు గొంతు విప్పిన నేపధ్యంలో, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ‘సమైక్యాంధ్ర’ కు  అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉదృతంగా మొదలైన తరువాత, తెలంగాణలోని మొత్తం జిల్లాలకన్నా ముందుగా ఖమ్మంలో సమైక్యత కోసం సిపిఎం ప్రయత్నం చేసింది. 2001 లో మొదలైన మలివిడత ఉద్యమం సందర్భంలో సమైక్యతకు మద్దతుగా వెనుకటి క్రియాశీల పాత్ర సిపిఎంలో లోపించినప్పటికీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీలో ప్రాతినిధ్యం నిరాకరించడం, సమైక్యాంధ్రకు సైద్ధాంతికంగా కట్టుబడి వున్నామని చెప్పడం, తమ పార్టీ చిన్నదనీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆపే శక్తి లేదనీ అనడం, కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామంటే వద్దన్నామా అని అనడం ద్వారా, తెలంగాణ (ఏర్పాటు) పట్ల వారి వైఖరి సులభంగా అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణలో ఎన్నికల నేపధ్యంలో వామపక్ష ఐక్యత అనీ, కలిసి పోటీ చేస్తామనీ ముందు ప్రకటనలు ఇచ్చి, తరువాత అరకొర స్థానాలు పొందడానికి మొదలు బీఆర్ఎస్ తో, తరువాత కాంగ్రెస్ పార్టీతో పోత్తులకోసం తహతహలాడారు. గత చరిత్ర అవలోకిస్తే, వామపక్ష ఐక్యత అభిలషనీయమే అయినా, సులభం కాదు. ‘వ్యక్తిగత అహం’, ఒకరినొకరు దెబ్బతీయాలనే బలీయమైన అంతర్లీన భావన దీనికి కారణం. ఉదాహరణకు 1999 ఎన్నికలలో ఖమ్మం నియోజక వర్గంలో సిపిఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వర రావుకు సిపిఎం పార్టీ మద్దతు ప్రకటించింది. కాని జిల్లా నాయకత్వం పువ్వాడను ఓడించే ప్రయత్నం చేసిందని అంటారు. రాష్ట్ర స్థాయి అగ్రనాయకత్వానికి కూడా అందులో అంతో ఇంతో భాగం వుందనే విషయం అప్పుడు బహిర్గతమైంది కూడా. ఇలా ఒకటికంటే ఎక్కువ సార్లు జరిగింది.

  ఒకానొక రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ప్రతివారిని, నాయకత్వం నిశితంగా పరిశీలించడం, తదనుగుణంగానే పార్టీలో బాధ్యతలు అప్పగిచడం, సభ్యత్వం దొరకాలంటే అనేక వడపోతలు పోయడం, అదే పద్ధతిలో ఎన్నికలలో పోటీ చేయాల్సిన అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగేది. ప్రస్తుత వర్తమాన కాలంలో పార్టీ క్రమశిక్షణకు అంతా అతీతులే! వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట విప్లవ రథ సారధులలో ముఖ్యుడు, సిపిఎం వ్యవస్థాపకుల్లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య లాగా కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన వారు అరుదుగా కనిపిస్తారు. ఆ నిబద్ధతతో వర్తమాన నాయకత్వం ప్రజా ఉద్యమాల నిర్మాణం కొనసాగించినట్లయితే, పరిస్థితి ఇంత దారుణంగా ఉండకపోయేది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి గణనీయంగా జరుగుతున్న నేపధ్యంలో, తమవంతు పాత్రగా కమ్యూనిస్టులు దాన్ని ప్రజలకు తెలియచెప్పడమే ఈ కాలపు అవసరాల నిజమైన ప్రజా ఉద్యమం.

నిశితంగా పరిశీలిస్తే, కమ్యూనిస్ట్ పార్టీల కేడర్లను, లీడర్లను బూర్జువా రాజకీయ పార్టీలనుసరిస్తున్న విధానాలు, అంటే, ఆస్తులను సమకూర్చుకోవడంతో పాటు, వ్యాపార-వాణిజ్యాలకు తమ రాజకీయ పలుకుబడిని సంధానం చేయడం, ఎన్నికలలో పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ధనాన్ని పెద్దమొత్తంలో వ్యయం చేయడం జరుగుతున్నదన్న ఆరోపణలున్నాయి. ప్రాణాలను, ఆస్తులను, కుటుంబ బాధ్యతలను లెక్క చేయకుండా, సుందరయ్య, రావి నారాయణరెడ్డి గార్ల లాంటి మహా నాయకులు, పార్టీని పటిష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాలామంది పాల్గొనడానికి కారణం ప్రజల్లో పార్టీ పట్ల, పార్టీ నాయకుల పట్ల వున్న విశ్వాసమే. క్రమేపీ, ప్రజలకు దూరం కాసాగింది కమ్యూనిస్ట్ పార్టీ, ఆ పార్టీ నాయకత్వం. దీనివల్ల, ప్రజలతో సంబంధాలు తెగిపోవడం సహజం. ప్రస్తుతం ఎన్నికలలో అరకొర సీట్ల కొరకు కామ్రేడ్స్ పాకులాడడం చూస్తుంటే, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఎంత ఊబిలో కూరుకుపోయాయో, పోబోతున్నాయో అర్థం చేసుకోవడం ఏమంత కష్టం కాదు. ప్రజలతో సంబంధాలు పెట్టుకోకుండా పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో ఎలా గెలుస్తారో నాయకత్వం ఆలోచించాలి?

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల వైఖరి, ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ వైఖరి స్పష్టం కావడం లేదు. మునుగోడు ఉపఎన్నికలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం వల్లనే మితవాద, అతివాద భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, సెక్యులరిజం నినాదాన్ని క్రమేపీ విడనాడుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయారనడంలో సందేహం లేదు. అంతమాత్రాన తమ బలాబలాల అంచనాను నిశితంగా సమీక్ష చేసుకోకుండా, తమకు కొన్ని స్థానాలను కేటాయించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిగణలోకి తీసుకోకుండా, రాజకీయ వ్యూహాన్ని అర్థం చేసుకోకుండా, రాష్ట్రాభివృద్ధిని పరిగణలోకి తీసుకోకుండా, బీఆర్ఎస్ కు మద్దతు వద్దనుకుని, కాంగ్రెస్ పార్టీతో బేరాలు చేశారు. అప్పుడు పనికిరాని పార్టీ ఇప్పుడు ఎలా పనికొస్తుందో వారికే తెలియాలి. చివరి క్షణం వరకూ కనీసం ఒక్క స్థానమైనా ఇవ్వమని వెంపర్లాట ఎందుకో మహోద్యమ చరిత్ర కలిగిన సేపేఐ, సీపీఐ (ఎం) కామ్రేడ్స్ అంతర్మధనం చేసుకోవాలి.

కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలలో కూడా అధికార స్వామ్య ధోరణి బలపడి పోతుంది. తాము చెప్పిందే వేదం అన్న భావన నుండి బయట పడలేక పోతున్నారు. మరింత మంది మిత్రులను సంపాదించుకోవడమెలా? ప్రజలను అధికంగా ఆకట్టుకోవడం ఎలా? వాస్తవాలను అర్థం చేసుకోవడం ఎలా, అన్న దానికి భిన్నంగా, శత్రువులను పెంచుకుంటూ పోయే ధోరణి, మిత్రులను కూడా శత్రువులుగా మార్చుకునే ధోరణి పెరుగుతుంది. తమతో నూటికి నూరు శాతం ఏకీభవించిన వారే మిత్రులుగా, ఒక్క శాతం విబేధించినా శత్రువులుగా పరిగణిస్తున్నారు. తమ చుట్టూ తామే ఇనుప గోడలు కట్టుకునో, లేక, వెనుకటి సుశ్రోత్రియులలగా మడి కట్టుకునో వుంటున్నారు.

కామ్రేడ్స్ ధోరణిలో గణనీయమైన మార్పు రావాలి. వచ్చి తీరాలి. రాకపోతే, జాతీయ మతతత్వ అతివాదం, మితవాద అతివాదం మరింతగా ప్రబలిపోయి ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం పొంచివుంది. ఏ మాత్రం గెలిచే అవకాశాలు ఎట్టిపరిస్థితుల్లోనూలేని, అరకొర స్థానాలలో కామ్రేడ్స్ పోటీచేయడం మాని, రాష్ట్రాభివృద్ధికి దోహదపడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం ఉభయతారకం. అదే నిజమైన ప్రజాపోరాటాల అజెండా కామ్రేడ్స్!!!

1 comment:

  1. మతతత్వ అతివాదమా ? అంటే BRS MIM తో చెట్ట పట్టాల్ కాదా.

    ఆధ్యాత్మిక రచనలు చేసే మీరు కమ్యూనిస్టుల, మజ్లిస్ పార్టీల తో brs భాయి భాయి సమర్థించడం మహా బాగుంది. ఎదుటి మనిషి కి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి.

    ReplyDelete