Monday, November 27, 2023

కాశీ హిందూ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ సందర్శనం అపూర్వమైన అనుభవం (కాశీ, గయ యాత్రానుభవాల సమాహారం-మూడవ, చివరి భాగం) : వనం జ్వాలా నరసింహారావు

 కాశీ హిందూ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ సందర్శనం అపూర్వమైన అనుభవం

(కాశీ, గయ యాత్రానుభవాల సమాహారం-మూడవ, చివరి భాగం)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (27-11-2023)

ఇటీవల వారణాశి చేరుకున్న మొదటి రోజున (అక్టోబర్ 30, 2023) దైవ దర్శనం, బ్రహ్మస్వ భవనం ఆశ్రమంలో భోజనం, గంగానదిలో బోటు షికారు, గంగా హారతి దర్శనం, మర్నాడు (అక్టోబర్ 31 న) గయకు వెళ్లి పిండ ప్రదానం కార్యక్రమం ముగించుకుని, రాత్రికి వారణాశి చేరుకోవడం, చివరిరోజున (నవంబర్ 1, 2023) బ్రహ్మస్వ భవనంలో సంతృప్తిగా ఉదయం పలహారం పూర్తి చేసుకుని, దర్శనమ్ శర్మ గారి సూచన మేరకు, మా ఐదుగురు బంధు మిత్ర బృందం (డాక్టర్ మనోహర్ రావు, డాక్టర్ భరత్ బాబు, విజయ్ శంకర్, దర్శనమ్ శర్మ, నేను) బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని తెలుగుశాఖ భవనాన్ని సందర్శించాం. తొలుత పూర్వ శాఖాధిపతి ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి, ఆ తరువాత ప్రస్తుత శాఖాధిపతి ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు, వారి రీసెర్చ్ స్కాలర్లతో కూడి, మా బృందాన్ని సాదరంగా ఆహ్వానించి, వారి, వారి కార్యాలయాలలో గుణాత్మక సమయాన్ని మాకొరకు వెచ్చించి, విశ్వవిద్యాలయానికి, తెలుగుశాఖకు సంబంధించిన అనేకానేక విషయాలను ఆసక్తికరంగా తెలియచేశారు. వారిరువురుకీ మరీ, మరీ ధన్యవాదాలు.   

భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త, భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు మదన్ మోహన్ మాలవీయ మదిలో మెదిలిన ఆలోచనకు అనుగుణంగా, పవిత్ర గంగాతీరం వారణాశి పుణ్యక్షేత్రంలో వంద సంవత్సరాల క్రితం స్థాపించినదే బనారస్ హిందూ విశ్వవిద్యాలయం. దీని స్థాపనలో పండిట్ మదన్ మోహన్ మాలవీయకు, అన్నీ బెసెంట్, రామేశ్వర్ సింగ్, ప్రభు నారాయణ్ సింగ్, ఆదిత్య నారాయణ్ సింగ్‌లు తోడ్పడ్డారు. ఇది ప్రజల కృషి ఫలితంగా భారతదేశంలో (ఆసియాలోనే) స్థాపించబడిన  మొదటి అతిపెద్ద రెసిడెన్షియల్ కేంద్రీయ విశ్వవిద్యాలయం.

1916 ఫిబ్రవరి 4న వసంత పంచమి రోజున అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ హార్డింగే విశ్వవిద్యాలయపు ప్రధాన క్యాంపస్‌కు పునాది వేశారు. విశ్వవిద్యాలయానికి అవసరమైన 1300 ఎకరాల సువిశాల స్థలాన్ని కాశీ రాజు నరేష్ కేటాయించాడు, ఆయనే మొదటి ఉపకులపతి. మాలవీయ విజ్ఞప్తి మేరకు, నాటి హైదరాబాద్ నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కూడా విశ్వవిద్యాలయం కోసం భూరి విరాళం ఇచ్చారు. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దగ్గరికి మాలవీయ విరాళం కోసం కలిసినప్పుడు, ఆయన తొలుత ఆసక్తి కనపరచలేదని, ఆయన దగ్గరున్న ఏదైనా వస్తువును ఇస్తే దాన్ని వేలం వేసి, వచ్చిన మొత్తాన్ని విరాళంగా తీసుకుంటానని, నమ్రతగా చెప్పిన మాలవీయ నిబద్ధతకు అచ్చెరువొందిన నిజాం, భూరి విరాళం ఇచ్చారని చెప్పుకుంటారు.  విశ్వవిద్యాలయ విస్తరణను ప్రోత్సహించడానికి, మాలవీయ  ఆహ్వానం మేరకు మహాత్మా గాంధీ, జగదీష్ చంద్ర బోస్, సీవీ రామన్, ప్రఫుల్ల చంద్ర రే, సామ్ హిగ్గిన్ బాటమ్, పాట్రిక్ గెడ్డెస్, బెసెంట్ లు ‘యూనివర్శిటీ ఎక్స్‌టెన్షన్ లెక్చర్స్‌’ ను  పునాది వేసిన మర్నాటి నుండి 4 రోజులు వరుసగా అందించారు.

విశ్వవిద్యాలయపు పూర్వ ప్రముఖ విద్యార్థులలో విశ్వ విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త జయంత్ విష్ణు నర్లేకర్; భారత విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు;  భారతదేశ అణు శాస్త్రవేత్త, ఈసిఐఎల్ వ్యవస్థాపకుడు, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత ఏఎస్ రావు; భారతదేశపు ఆర్థిక వేత్త, భారతీయ రిజర్వ్ బాంక్ మాజీ గవర్నర్ ఎల్ కె ఝా; అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్; వేద పండితులు, మహామహోపాధ్యాయ శ్రీభాష్యం అప్పలాచార్యులు లాంటి ఎందరో, ఎందరో మహానుభావులు వున్నారు.

బనారస్ విశ్వవిద్యాలయంలోని తెలుగు విభాగం, తెలుగు భాష, సాహిత్యం మీద ప్రధానంగా దృష్టి సారిస్తూనే, ఇతర భారతీయ భాషలతో సంబంధం వుండేలా, ఆధునిక పద్ధతులకు అనుగుణంగా కృషి చేయడం అభినందనీయం. ఒకానొక రోజుల్లో విద్యార్థులు స్వయంగా అధ్యయనం చేసుకుంటూ, తమంతట తామే చదువుకొనే పద్ధతిన, బిఎ లో తెలుగు ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉండేది. అప్పట్లో మెట్రిక్యులేషన్, రెండేళ్ల ఇంటర్మీడియట్, రెండేళ్ల బిఎ లో మాత్రమే తెలుగుభాష ఒక అంశంగా పాఠ్యప్రణాళికలో వుండేది కాని, బోధనకై ప్రత్యేకంగా ఉపాధ్యాయులెవరూ లేరు. 1960వ సంవత్సరంలో నిబద్ధతత, పట్టుదల, తెలుగు భాష మీద ఎనలేని గౌరవం, విశేష ప్రావీణ్యం, ప్రజ్ఞా పాటవాలున్న బివి సూర్యనారాయణ అధ్యాపకుడిగా నియామకం జరిగింది. ‘Small is Beautiful’ అన్న ఆంగ్ల సామెతకు అనుగుణంగా, ఆయన పట్టుదలతో, కేవలం ఒకే ఒక విద్యార్థిని, ఇద్దరు విద్యార్థులతో బిఎ తెలుగు విద్యాబోధనకు అంకురార్పణ జరిగింది.

తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ భాషలతో 1961లో భారతీయ భాషా విభాగం ఏర్పాటైంది. అధ్యాపకుడు సూర్యనారాయణ ఒత్తిడితో క్రమంగా తెలుగు భాష అభ్యసించదానికి వివిధ శాఖలలో అవకాశం కల్పించింది విశ్వవిద్యాలయం. హిందీ ఎంఏ, బిఏ లలో తెలుగు భాష ఐచ్ఛిక విషయంగా (Optional Paper) చేర్చడం జరిగింది. దరిమిలా, 1968లో భారతీయ భాషల విభాగం ఒక శాఖగా గుర్తించింది విశ్వవిద్యాలయం. దానికి అప్పట్లో రీడర్ పదవిలో ఉన్న బివి సూర్యనారాయణ అధ్యక్షులయ్యారు. 1973లో మరొక అధ్యాపకురాలు బి రత్నావళి చేరారక్కడ. నిరంతరం విశ్వవిద్యాలయాధికారులతో, వైస్ ఛాన్సలర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో విన్నపాలు, వివాదాలు, వాగ్వాదాలు, కష్టనష్టాలు భరించి అలసిపోని పోరాటం సలిపి బివి సూర్యనారాయణ 1977లో తెలుగులో ఎంఏ, పి హెచ్ డి చేసే అవకాశాలు సాధించారు. 1981లో వారి పోరాటం ఫలించి 'తెలుగు శాఖ' స్వతంత్ర శాఖగా (డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగుగా) ఆవిర్భవించింది. ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా బిఎ, ఎంఎ, పీహెచ్ డి, తెలుగు బ్రిడ్జి కోర్సు, డిప్లమో కోర్సు, బిఏ హానర్స్ లాంటి కోర్సులు చేసే అవకాశాలున్నాయి ఇక్కడ.  

1980 లో ప్రఖ్యాత తెలుగు కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిని విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి, వారి ద్వారా పురస్కారాలు జరిపించడం విశ్వవిద్యాలయం చరిత్రలో ప్రప్రథమం. అదే సంవత్సరం నలుగురు మొదటి బ్యాచ్ విద్యార్థులకు పి హెచ్ డి పట్టాల ప్రదానం జరిగింది. ఇంతవరకూ ఈ విశ్వవిద్యాలయం తెలుగు పి హెచ్ డి పట్టాలను 56 మంది పొందారు. వీరిలో పదవీ విరమణ చేసిన ఎస్వీయు తెలుగు ఆచార్యులు జీ దామోదర్ రావు, బీ హెచ్ యులో పదవీ విరమణ  చేసిన ఆచార్య బి విశ్వనాథ్, బీ హెచ్ యులో ప్రస్తుతం పనిచేస్తున్న పూర్వ శాఖాధిపతి ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి, రాజమండ్రి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ డీన్ ఆచార్య డి భాస్కర్ రావు, డాక్టర్ ఇ పద్మావతి, పదవీ విరమణ చేసిన వైజాగ్ సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్ చామర్తి అన్నపూర్ణ తదితరులు వున్నారు.

పి హెచ్ డి పరిశోధన అంశాలలో కొన్ని చెప్పుకోవాలంటే: తెలుగు హిందీ సాహిత్యాల్లో 19 వ శతాబ్ది వరకు పొందిన గద్య వికాసం; తెలుగులో అవధానకవిత, చాటుకవిత; జంధ్యాల పాపయ్య శాస్త్రి రచనలు; వ్యాస పోతనల భాగవత దశమ స్కందాలు; విశ్వనాథ శ్రీమద్రామాయణ కల్పవృక్షం, అవాల్మీకాలు; శ్రీరామదాసు, త్యాగరాజు జీవితం, సంకీర్తనలు; తెలంగాణా స్త్రీవాద నవలల్లో సాంఘికోద్యమమ౦;, తెలుగు సాహిత్యంపై శ్రీకాకుళ ఉద్యమం ప్రభావం; చలం నవలల మీద విమర్శనాత్మక పరిశీలన లాంటివి వున్నాయి. విశ్వవిద్యాలయంలో భారతీయ భాషావిభాగాలన్నీ వున్న కారణాన తెలుగు భాషకు, ఇతర భారతీయ భాషలకు మధ్యన తులనాత్మక అధ్యయనం చేయడానికి అవకాశాలు ఎక్కువ. అందువల్లే, ఇక్కడి తెలుగు శాఖకు చెందినవారు, సంస్కృతం, హింది, కన్నడం, తమిళ్ మొదలైన ఇతర భాషలతో తెలుగు భాషకున్న తులనాత్మక అధ్యయనానికి సంబంధించిన అనేక సిద్ధాంతవ్యాసాలు రాశారు. మరికొందరు ఆ పరంపరను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏడెనిమిదిమంది దాకా వివిధ అంశాల మీద పి హెచ్ డి పొందేందుకు ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి,  ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గైడెన్స్ కింద ఇక్కడ అధ్యయనం చేస్తున్నారు.

క్రమేపీ, ఒక సంవత్సరం సర్టిఫికెట్ కోర్సు, రెండు సంవత్సరాల యుజి (Under Graduation), పిజి (Post Graduation), డిప్లమో కోర్సులు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఇంతవరకు ఎంఎ తెలుగు పూర్తిచేసిన 62 మందిలో ఎపి సాంఘిక సంక్షేమ పాశాలల సహాయ కమీషనర్ గా పనిచేసిన శేషతల్పశాయి, ఖమ్మం ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అట్లూరి వెంకట రమణ, రంగారెడ్డి జిల్లాలో గ్రేడ్ ఒకటి తెలుగు పండిట్ గా పనిచేస్తున్న కె సాయిబాబా తదితరులు వున్నారు. రీడర్ సూర్యనారాయణకు ఆచార్యుడి (Professor) గా పదోన్నతి ఇచ్చింది విశ్వవిద్యాలయం. మిగిలిన కోర్సుల లాగానే తెలుగు బోధనా తరగతులు కూడా నిర్విరామంగా ఉదయం నుండి సాయంకాలం వరకు నిర్వహించసాగారు. సుదూర ప్రదేశాల నుండి విద్యాభ్యాసానికి వచ్చే విద్యార్థులందరికీ, విశ్వవిద్యాలయంలో హాస్టల్ వసతి కల్పించారు. తెలుగు మాతృభాష కాని వారెందరికో తెలుగు విభాగంలో తెలుగు భాష నేర్చుకునే అవకాశం కల్పించడం జరిగింది. అలా, అలా ఉత్తర భారతదేశంలో ఉన్న ఏకైక స్వతంత్ర తెలుగు శాఖ 1985 లో రజతోత్సవాన్ని జరుపుకుంది.

తెలుగు శాఖా గ్రంథాలయంలో పరిశోధక విద్యార్థులకుపకరించే 6000 పైగా విలువైన పుస్తకాలు, అదనంగా విశ్వవిద్యాలయం సెంట్రల్ లైబ్రరీలో 4000 పైగా పుస్తకాలు వున్నాయి. ఎంతో విలువైన 'భారతి' సాహిత్య మాస పత్రికలు, సంవత్సరాల వారీగా 12 పత్రికలు ఒకే వాల్యూంగా, చాలా సంవత్సరాలవి ఇక్కడ లభ్యం కావడం విశేషం. ఆచార్య బివి సూర్యనారాయణ పదవీ విరమణ అనంతరం ఆచార్య జోస్యుల సూర్యప్రకాశరావు, ఆచార్య ఎన్ త్రివిక్రమయ్య, ఆచార్య భమిడిపాటి విశ్వనాథ్, ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి, శారద సుందరి, ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లుల సారథ్యంలో తెలుగు శాఖ అభివృద్ధి పథంలో సాగుతోంది. బనారస్ విశ్వవిద్యాలయములో తెలుగు శాఖ ఒక సర్వ స్వతంత్ర ప్రతిపత్తిగల దక్షిణాది భాషా శాఖగా స్థానాన్ని సంపాదించుకున్నది. ప్రస్తుతం తెలుగు శాఖాధిపతిగా వున్న ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లుకు ఇటీవలే అక్టోబర్ 31, 2023 న విశ్వవిద్యాలయం డి లిట్ ప్రదానం చేసింది.   

విశావిద్యాలయంలో తెలుగు శాఖ వికాసానికి పూర్వ శాఖాధిపతి ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి, ప్రస్తుత శాఖాధిపతి ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు అవిరళంగా కృషి చేస్తున్నారు. వీలైనన్ని సెమినార్స్ నిర్వహించడం, ఇతర విశ్వవిద్యాలయాల ఆచార్యులను ఆహ్వానించి, సాహిత్య ప్రసంగాలను ఏర్పాటు చేస్తున్నారు. 2017 ఫిబ్రవరిలో తెలంగాణా ప్రభుత్వం, ఉస్మానియా విశ్వవిద్యాలయాలతో ఉమ్మడిగా నిర్వహించిన తెలుగు శాఖ జానపద సాహిత్యం చర్చలతో బాటు 'జానపద కళా రూపాల ప్రదర్శన’ అపూర్వమైన ఆదరణ పొందింది. తెలుగువారి ఒగ్గుకథ, తోలు బొమ్మలాట, తప్పెటగుళ్లు, చిందు భాగవతుల కథలు వంటివి కేవలం తెలుగువారినే గాక  ఉత్తర భారతీయులను గూడ ఆనంద పరవశంలో ముంచెత్తాయి.

బనారస్ విశ్వవిద్యాలయం తెలుగు విభాగాన్ని సందర్శించిన దేశ, విదేశ ప్రముఖుల్లో, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, మంగళంపల్లి బాలమురళికృష్ణ, సి నారాయణరెడ్డి, పీవీ పరబ్రహ్మశాస్త్రి, భద్రిరాజు కృష్ణమూర్తి, దివాకర్ల వెంకటావధాని, తూమాటి దోణప్ప, జీవీ సుబ్రహ్మణ్యం, రవ్వా శ్రీహరి, నాయని కృష్ణకుమారి, ముదిగొండ వీరభద్రయ్య, కొలకలూరి ఇనాక్, బేతవోలు రామబ్రహ్మం, మాడుగుల నాగఫణిశర్మ, మేడసాని మోహన్, గొల్లపూడి మారుతీరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కాత్యాయని విద్మహే, ఎన్ గోపి తదితరులు వున్నారు.    

2018 మార్చి నెల మొదటి వారంలో, ‘భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమాఖ్య,’ విశ్వవిద్యాలయం తెలుగు విభాగాలు కలిసి ‘29వ భారతీయ శాస్త్రజ్ఞుల మహా సమ్మేళనం' నిర్వహించడం జరిగింది. శ్రీలంక, మలేషియా, కౌలాలంపూర్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, నేపాల్, భూటాన్ వంటి దేశాల నుండే కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుండి సుమారు 5000 మంది ప్రతినిధులు ఆ సమ్మేళనంలో పాల్గొన్నారు. వారంతా బనారస్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖను గూర్చి తెలుసుకుని ఆశ్చర్యపడ్డారు. ప్రస్తుతం ఇక్కడ తెలుగు శాఖలో ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు, ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి, ఇతర అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది పనిచేస్తున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఎంఏ లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తున్నదని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్మెంట్ సదుపాయం కూడా వున్నదిక్కడ. ఏదేమైనా బీ హెచ్ యు తెలుగు విభాగం ఉభయ తెలుగు రాష్ట్రాలలో వున్న ఏ విశ్వవిద్యాలయం తెలుగు విభాగాలకు తీసిపోని విధంగా భవిష్యత్తులో ఎదగాలని ఆశించుదాం. (అయిపోయింది)

No comments:

Post a Comment