Wednesday, November 15, 2023

‘పునరేకీకరణ’ ఆవశ్యకత కేసీఆర్ కు తెలుసు!....వనం జ్వాలా నరసింహారావు

 ‘పునరేకీకరణ’ ఆవశ్యకత కేసీఆర్ కు తెలుసు!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (16-11-2023)

(సంక్షేమాభివృద్ధి దిశగా అప్రతిహతంగా ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రంలో, బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్నికల అనంతరం చిన్నాచితకా ఇబ్బందులు ఏవైనా ఎదురైతే, రాష్ట్రం ఏర్పాటుకు పూర్వం తెలంగాణ ప్రజలు పడ్డ గోసే పునరావృతం కావచ్చనే ఆందోళనతోనే అసలుసిసలైన తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ లో చేరుతున్నారు)

ఇది ఎన్నికల వేళ. పార్టీ మారి వేరే పార్టీలలో చేరేవారందరికీ సహేతుకమైన కారణాలు అవసరం లేని వేళ. ఘనత వహించిన కొన్ని పార్టీలు ‘చేరికల కమిటీలను’ కూడా ఏర్పాటు చేశాయి!!! ఫక్తు రాజకీయ, వ్యాపార లబ్దికి పార్టీలు మారేవారు కొందరైతే, సైద్ధాంతిక ప్రాతిపదికన రాష్ట్ర సంక్షేమాభివృద్ధిని త్రికరణశుద్ధిగా కాంక్షిస్తూ, ‘రాజకీయ పునరేకీకరణ’ లో భాగంగా, అధికార పార్టీలోకి మారేవారు మరికొందరుంటారు. శాసనసభకు ఎన్నికల తేదీలు ప్రకటించక పూర్వమే, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తమ పార్టీ పక్షాన పోటీ చేయబోతున్న అభ్యర్థుల పేర్లు ప్రకటించడం, బీ-ఫారాలు అందచేయడం ఒక రికార్డ్. టికెట్ దొరకని కొందరి అసంతృప్తి కూడా అంతగా బయటపడలేదు. సర్వేలన్నీ ఆ పార్టీ విజయాన్నే సూచిస్తున్నాయి. దీనికి భిన్నంగా, ఇతర పార్టీలవారు మల్లగుల్లాలు పడి, అడిగినవారికి, అర్హులకు అభ్యర్థిత్వం నిరాకరించి, వద్దు మొర్రో అన్నవారికి, కేవలం రాజకీయ లబ్దికే పార్టీలు మారినవారికి, ఆర్థిక స్థోమత కలవారికి టికెట్లిచ్చారని రాజకీయ విశ్లేషకుల భావన.    

బీఆర్ఎస్ పార్టీ టికెట్ దొరికే అవకాశాలు ఏమాత్రం లేవని స్పష్టంగా తెలిసి కూడా, అను నిత్యం, గణణీయమైన సంఖ్యలో పలువురు ప్రముఖులు (వారి సహచర కార్యకర్తలతో సహా) సంవత్సరాల తరబడి తామున్న పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరడానికి ‘చిల్లర రాజకీయాలు’ కారణం కానేకాదు. సంక్షేమాభివృద్ధి దిశగా అప్రతిహతంగా ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రంలో, వూహకందని విధంగా, జరగకూడనిది ఏదైనా జరుగుతే, బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్నికల అనంతరం చిన్నాచితకా ఇబ్బందులు ఏవైనా ఎదురైతే, రాష్ట్రం ఏర్పాటుకు పూర్వం తెలంగాణ ప్రజలు పడ్డ గోసే పునరావృతం కావచ్చనే ఆందోళనే ప్రధాన కారణం. అందుకే, రాజకీయ పునరేకీకరణ ఆవశ్యకతను గుర్తించిన అసలుసిసలైన తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ పార్టీకి, సాధారణ విజయమే కాకుండా, గతంలో లాగా తిరుగులేని విజయం చేకూర్చాలన్న దృఢ సంకల్పంతోనే బీఆర్ఎస్ లో చేరుతున్నారు.

ఒక మహోన్నత ఉద్యమ నేపధ్యంలో, కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ, ‘బంగారు తెలంగాణాగా’ అవతరించాల్సిన ఆవశ్యకత నేపధ్యంలో, రాష్ట్రం ఏర్పాటైన నాటినుండి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపట్టి, అమలు పరచిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల సుస్థిరతకు, స్థిరీకరణకు, నిర్విరామంగా, నిర్విఘ్నంగా కొనసాగింపుకు, రాజకీయ పునరేకీకరణ అవశ్యం. చిల్లర రాజకీయాల కోసం కాకుండా, సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల సుస్థిరతకు, అభివృద్ధి ఫలాలు అట్టడుగుగు వర్గాలవారికి, మరింత ప్రయోజనకరంగా చేరువ కావడానికి, వేరే పార్టీల నుండి వచ్చినవారిని చేర్చుకుంటే, అది సహేతుకమే. ఏక సూత్ర కార్యాచరణ ప్రణాళికతో అభివృద్ధి నిరోధక శక్తులన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఐక్యమై, అధికార బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించాలని నిర్ణయించుకున్నప్పుడు, తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే శక్తులన్నీ సహజంగానే ఏకమై, అలాంటి శక్తులను ఎదుర్కోక తప్పదు. అందుకే రాజకీయ పునరేకీకరణ అవశ్యం.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ రథసారథిగా, వందకు వంద శాతం గాంధేయ మార్గంలో, సుమారు 14 సంవత్సరాలపాటు అలుపెరుగని పోరాటం చేశారు. చివరకు తన శవయాత్రో, లేదా, తెలంగాణ జైత్రయాత్రో, జరగాలని నిర్ణయించుకుని, చావు నోట్లో తలపెట్టి, గత్యంతరంలేని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీని అంగీకరించేట్లు చేశారు. జూన్ 2, 2014 న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఎన్నికలలో ప్రజాభిప్రాయం మేరకు, పార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు ఒంటరిగా పోటీ చేసి, మెజారిటీ స్థానాలు సాధించి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల మానిఫెస్టోలో వాగ్దానం చేసిన, చేయని, అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి, అమలు పరచారు. రెండవ సారి జరిగిన శాసనసభ ఎన్నికలలో అఖండ విజయం సాధించి, మరోమారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత, మరెన్నో సంక్షేమాభివృద్ధి పథకాలకు రూపకల్పన చేసి, అమలు పరిచారు,తెలంగాణ అభివృద్ధి మోడల్’’ ను దేశానికే రోల్ మోడల్ గా ఆకాశం ఎత్తున నిలిపిన మహోన్నతమైన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

సందర్భం వచ్చినప్పుడల్లా, వేదిక లభించినప్పుడల్లా, సహచర మంత్రులు కానీ, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కానీ, పాత్రికేయ మిత్రులు కానీ, ఆసక్తికల తదితరులెవరైనా కానీ, ఒకింత తీరిక సమయాలలో తనను కలిసినప్పుడు, 1969 నాటి తొలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని, అది విఫలమైనా మలి దశ ఉద్యమానికి బలమైన పునాదులు వేసిన వైనాన్ని, ఉద్యమనాయకులను, కేసీఆర్ గుర్తు చేసుకుంటారు, స్వీయానుభవాలను పంచుకుంటారు. తెలంగాణా ఉద్యమాల పట్ల కేసీఆర్ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. అలాంటి సందర్భాలలో ‘రాజకీయ పునరేకీకరణ’ ఆవశ్యకతను కేసీఆర్ సోదాహరణంగా వివరించే వైనం, ఆసక్తికరమైన ఉద్యమ స్వీయ అనుభవాలు, పదిమంది తెలుసుకోవాల్సిన అక్షర సత్యాలు. నడుస్తున్న చరిత్రకు సజీవ సాక్ష్యాలు. తెలంగాణ గెలిచి నిలిచేందుకు అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగానే రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన ఆవశ్యకతను, హేతుబద్ధతను, అలాకాకపోతే జరిగే నష్టాన్ని కూడా విడమర్చి చెప్పేవారాయన. శాసనసభకు మూడోసారి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన మాటలకు ఎంతో ప్రాధాన్యత వుంది.

తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి అడుగడుగునా ఆసాంతం కుట్రలు, కుతంత్రాలు జరిగినట్లే, ఏర్పాటైన తరువాత కూడా పోరాడి సాధించుకున్నతెలంగాణను అస్థిర పరచడానికి కూడా అహర్నిశలు వరుస కుట్రలు జరిగాయి. వాటన్నింటిని ఎదుర్కోవడానికి ‘రాజకీయ పునరేకీకరణ’ అవసరమయిందని కేసీఆర్ చెబుతారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యలో 1969లో జరిగిన మహోన్నత ఉద్యమం నుంచి 2014 వరకు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా కుట్రలు ఎలా, ఏవిధంగా జరిగాయో, ఎలా విఫలమయ్యాయో సోదాహరణంగా కేసీఆర్ వివరిస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ ఒక్కడే 2001లో బయలు దేరడం, తర్వాత కొందరు మిత్రులు ఆయనతో కలవడం లాంటి, ఉద్యమ ప్రస్తానాన్ని కూడా వివరించేవారు.  మలిదశ ఉద్యమం ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదని, ‘ఆంధ్ర గో బ్యాక్‌’ లాంటి నినాదాలు లేవనీ,తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు’ తెలంగాణ వారికే దక్కడం కోసం తెలంగాణ కావాలి కానీ, ఎవరికో వ్యతిరేకంగా కానే కాదనీ మరీమరీ విడమర్చి చెప్పారు. తెలంగాణ సమాజాన్నంతా ఒకవైపుకు తిప్పగలిగితే రాష్ట్రం ఏర్పడి తీరుతుందనే తన అభిప్రాయాన్ని, వ్యూహాన్ని, ఆనాడే నమ్మకంగా స్పష్టం చేశారాయన.

 తెలంగాణ ఉద్యమం ఓ రాజకీయ పార్టీగా ముందుకు పోతుండడంతో వ్యతిరేక రాజకీయ శక్తులు ఎప్పటికప్పుడు జిత్తులమారి కుట్రలు పన్నుతూ, ఉద్యమాన్ని నీరు కార్చేందుకు గట్టిగా ప్రయత్నించారు. తెలంగాణ సమాజాన్ని విడదీసి, ఐక్యత లేకుండా చేయడమనే విభజించి పాలించు పద్దతిని;  తెలంగాణ ఉద్యమ నాయకత్వ వ్యక్తిత్వ హననం (క్యారెక్టర్‌ అసాసినేషన్) ద్వారా ప్రజల్లో ఉద్యమ నాయకత్వం పట్ల విశ్వసనీయత పోగొట్టే మార్గాన్ని; మీడియా ద్వారా అబద్దాలు ప్రచారం చేయడాన్ని; ప్రభుత్వ అండతో ఉద్యమాన్ని అణచివేసే చర్యలు చేపట్టడాన్ని చేసి, ఉద్యమానికి విఘాతం కలిగించి, స్వరాష్ట్ర ఆకాంక్షను రూపుమాపాలని నిరంతర ప్రయత్నాలు జరిగాయి. తెలంగాణ ఎప్పటికైనా స్వరాష్ట్రంగా మారుతుందని మనసా వాచా కర్మణా  నమ్మిన కేసీఆర్, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యమాన్ని తదేక దీక్షగా కొనసాగించారు.  

ఆ నేపధ్యంలో, 2004 ఎన్నికల తర్వాత కేసీఆర్ కేంద్ర మంత్రి కావడం వల్ల ఢిల్లీలో ఎక్కువగా వుండడంతో తెలంగాణ కోసమే తన సమయమంతా కేటాయించి, ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిరిగి, 36 రాజకీయ పార్టీలను తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఒప్పించారు. ఉదాహరణకు, సిపిఐ నాయకుడు బర్ధన్‌ తో 30సార్లు, బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతితో 19 సార్లు ఇలా చాలా మందితో సమావేశమయ్యారు. తెలంగాణ గోస గురించి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకత గురించి సిడి రూపొందించి, 20 వేల కాపీలు చేయించి, ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నాయకులను తన ఇంటికి పిలిచి భోజనం పెట్టి, తెలంగాణ గురించి సిడి వేసి చూపించడంతో సహా, ఎంపీలకు, పార్టీలకు కొరియర్‌ చేశారు. మొత్తం మీద అందరికీ తెలంగాణ గోస అర్ధమయింది కానీ, తెలంగాణ వస్తుందనే నమ్మకం మాత్రం చాలా మందికి కలగలేదు. ‘తెలంగాణ రాష్ట్రం రాదు అనే అపనమ్మకం’ కలగడానికి కారణం, తొలిదశ ఉద్యమం అర్థాంతరంగా ఆగిపోయిన గత అనుభవమే.

         1969 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సారధ్యం వహించిన స్వర్గీయ డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి గొప్ప తెలంగాణ బిడ్డ అనీ,  ఆయన ఉద్యమాన్ని ఆకాశం ఎత్తుకు లేపారనీ, ఆనాటి ఆయన ఉద్యమమే మలిదశ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని అంటుండేవారు కేసీఆర్ ఎప్పుడూ. ఆయన సారధ్యంలోని తెలంగాణ ప్రజాసమితి 1971 ఎన్నికలలో ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి 11 లోక సభ స్థానాలను గెలుచుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఆ విధంగా అప్పుడే వ్యక్తమైంది. అయినా, తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరగదని ఇందిరాగాంధీ తేల్చి చెప్పడంతో, చెన్నారెడ్డి నాయకత్వాన్ని తిట్టడం మొదలైంది. తెలంగాణలోని కొందరు చెన్నారెడ్డిని ద్రోహిగా చిత్రీకరించడం వెనుక ఆంధ్రా కాంగ్రెస్ నాయకుల కుట్ర వుందనేవారాయన.

         ఆ విధంగా, చెన్నారెడ్డి రోజులనుంచి, తన (కేసీఆర్) సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్రలు జరిగాయని, తెలంగాణ బతికి బట్ట కట్టదని ప్రచారం జరిగిందని, రాష్ట్రం మనుగడ సాగదని అన్నారని, రాష్ట్రపతి పాలన విధించే ప్రయత్నాలు కూడా జరిగాయని, ఆ నేపధ్యంలో ప్రభుత్వానికి అండగా వుండాలని భావించి చాలా మంది విడతలు, విడతలుగా తమతో కలిసారని, రాజకీయ పునరేకీకరణ ద్వారా ప్రభుత్వం మరింత బలపడిందని అన్నారు. ప్రజలకు కూడా తమ అవసరాలు తెలియడం, తదనుగుణంగా ప్రభుత్వం వాటిని తీర్చడం, ఆర్థిక పరిపుష్టి కలగడం, వృద్ధి రేటు పెరగడం, తెలంగాణ అన్ని రకాల బాగుపడే దిశగా ముందుకు సాగడం, తెలంగాణ నిలిచి గెలవడం వర్తమాన చరిత్ర అన్నారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే శక్తులన్నీ ఏకంకావడమంటే, రాష్ట్ర సమగ్ర సంక్షేమాభివృద్ధి సుస్థిరత, స్థిరీకరణలకై జరిగే రాజకీయ పునరేకీకరణ తప్ప మరేమీకాదు. తెలంగాణలో సాధించిన రాజకీయ సుస్థిరత, ఆర్థిక సుస్థిరత నిర్విఘ్నంగా, నిర్విరామంగా కొనసాగాలి.

No comments:

Post a Comment