Sunday, January 7, 2024

మానవజాతి అభ్యుదయానికి నియమబద్ధమైన జీవితం నేర్పినదే వేదం ...... ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-6 : వనం జ్వాలా నరసింహారావు

 మానవజాతి అభ్యుదయానికి నియమబద్ధమైన జీవితం నేర్పినదే వేదం

ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-6

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (8-1-2024)

         ‘భూలోకంలో సత్యమే భగవంతుడనీ, సత్యం మీదనే ధర్మం ఆధారపడి ఉందనీ, సత్యం అంటే నిజం చెప్పడం మాత్రమే కాదనీ, సమాజ జీవితం చాలావరకు నిజం మీదనే ఆధారపడి ఉందనీ, ప్రభుత్వ, న్యాయ యంత్రాంగం నిజం చెప్పించడానికే ఏర్పడిందనీ ఒక భావన వుంది. ఇందులోని నిజానిజాలు చర్చనీయాంశమే. దీనికి కారణం లేకపోలేదు. దురదృష్టవశాత్తు, అందరూ భావించిన విధంగా కాకుండా, దానికి భిన్నంగా, ప్రభుత్వ, న్యాయ యంత్రాంగం ఆసాంతం అబద్ధం మీదనే ఆధారపడింది! కార్యనిర్వహణ నిజం చెప్పదు, న్యాయం నిజం చెప్పదు, శాసనం నిజం చెప్పదు, అన్నింటిలోనూ అబద్ధాల సాక్ష్యాలే! ఎవరూ నిజం చెప్పరు.

ఈ సమాజం అసత్యాల మీద ఆధారపడి ఉంది. నిజం చెప్తే వ్యవస్థ పేకమేడలా కూలుతుంది. ఇలాగే వుంటుందని వేదాలు ఘోషించాయి. నిజానికి ఈ సమాజంలో విలువలేదు. ఒక ఆదర్శ సమాజాన్ని ఆలోచించాలి. అందరూ నిజమే చెప్తే ఈ వ్యవస్థ సాంతం వృథా అవుతుంది. వ్యర్థం అవుతుంది. పోలీసు, న్యాయ వ్యవస్థకు పని ఉండదు. రాజకీయులూ నిజం చెప్తారు! నిజాయితీగలవారే ఎన్నికవుతారు! ఇది ఆదర్శం! ఇది ఒక స్వప్నం. వేదం కోరిన విధం, విధానం. సామాన్యుడు సాధారణంగా అబద్ధం ఆడడం లేదు. అందువలననే జీవితం సాగిపోతున్నది. జీవితం ఎలా సాగుతున్నది? అని ప్రశ్నించుకుంటే వచ్చే జవాబు, సత్యవాదుల వలనేఅని.’

‘ద్రవ్యం వ్యయానికి సంబంధించిన విషయం. ధనం ద్రవ్యం అవుతుంది. ద్రవ్యానిది ద్రవ స్వభావం. ద్రవ్యానికి స్థిరత్వం లేదు. నిలకడ లేదు. ఒకచోట ఉండదు. మారుతుంటుంది. దాన్ని కదలకుండా కట్టిపెట్టేవారు లుబ్దులు. అంటే వారు ద్రవ్య ప్రకృతికి విరుద్ధం అయిన పని చేస్తున్నారు. ధనం చెలామణిలో ఉండాలి. అందువల్ల అది ప్రజలకు ఉపకరిస్తుంది. ఉత్పత్తిదారుడు మరింత ఉత్పత్తి చేయడానికి ఉపకరిస్తుంది. ఉత్పత్తివల్ల సంపద పెరుగుతుంది. వినియోగదారులు పెరుగుతారు. దాచిపెట్టడం వల్ల ఇవన్నీ నిలిచి పోతాయి. పెట్టుబడి పెట్టడం, బాంకుల్లో దాచడం కూడా సమాజానికి మేలు చేస్తుంది. సంపద వినిమయం పెరుగుతుంది. అది కళ్యాణ కారకం అవుతుంది. లుబ్దుడు సమాజానికి అపకారం చేస్తున్నాడు. అలుబ్దుడు అపకారం చేయడం లేదు. జీవనగమనానికి ఉపయోగపడుతున్నాడు’.

‘ఉపనిషత్ లోని ఒక శ్లోకం సమస్త విశ్వాన్ని దర్శింప చేస్తుంది. దాని ప్రకారం, ఈ లోకంలోని ధనద్రవ్యాలు, ఆస్తిపాస్తులు, పదవులు అధికారాలు, రాజ్యం, రాచరికం అంతా భగవానుడిదే. అతడే దీనినంతటినీ సృష్టించాడు. ఇవి ఎవరివీ కావు. ఈశ్వరుడివి. ఈశ్వరుడు కరుణామయుడు. దయతలచాడు. ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఇచ్చాడు. రక్షించనున్నాడు. అవి తనవి. తన పక్షాన ధర్మకర్తృత్వం నిర్వహించమన్నాడు. అతడు కర్త కాదు, ధర్మకర్త మాత్రమే! ధర్మ, అర్థ, కామాలు పురుషార్థాలు. ఇవి సామాజికాలు. అర్థ కామాలు లౌకికాలు. ఈ రెండూ ధర్మంతో కూడినపుడు న్యాయమవుతాయి. కోరిక కామం అవుతుంది. అది ధర్మాన్ని అనుసరించేప్పుడే న్యాయమైన కోరిక అవుతుంది. ప్రకృతి స్వభావం ఇవ్వడం. దానం దైవ స్వరూపం. ఈశ్వరుడు ఒకనికి ధనం ఇచ్చాడు. కొంతమంది నిర్ధనులను సృష్టించాడు. సంపన్నుడి ధనం స్వంత వినియోగానికి కాదు. ఇతర దీనుల, దరిద్రుల, అనాథల, అన్నార్తులకు ఇవ్వడానికి. సంపన్నుడి ధనం ఇలాంటి వారందరికీ చెందాల్సి ఉంది. అలా కాకుండా తానే అనుభవిస్తే వాడు దొంగతనం చేసిన వాడవుతాడు.

       వేదంలో చెప్పినట్లు యుగాంతం అవుతుంది. వేదాలు మాయం అవుతాయి. అప్పుడు బ్రహ్మ మహర్షులకు అనుమతిచ్చాడు. మహర్షులు ఇతిహాస సహితములైన వేదాలను మరల అందుకున్నారు. మానవ జీవితంలోని ప్రతి అంశం గురించి భారత మేధావులు, ఋషులు, మునులు, విద్వాంసులు చేసినంత అధ్యయనం, పరిశోధన, పరిశ్రమ, కృషి మరెవ్వరూ చేయలేదు. ఇది సత్యం, ఇది నిశ్చయం. ఋషి అనేవాడు మానవాభ్యుదయం కోసం సంసారాన్ని వదిలాడు. అన్యం ఎరుగడు. పరిశోధనే లక్ష్యం. ప్రాపంచిక విషయాలు ఎరుగడు. అంతటి దీక్ష అతడిది. అదే తపస్సు. అతనిని ఎవరూ నియమించలేదు. జీతభత్యాలు ఇవ్వలేదు. స్వచ్చందంగా పరిశోధనకు పూనుకున్నాడు. అతను కోరిందేమీ లేదు. కేవలం మానవాభ్యుదయం, మానవ కల్యాణం! మానవ జీవితం సుఖమయం, శాంతియుతం కావాలి. ఇదీ లక్ష్యం. ఇవ్వాల్టి మన ఈ మాత్రపు జీవితానికి మహర్షుల కృషి తపస్సు కారణం!’.

         “భారతీయులకు కాలం అనాది. అనంతం. అందరికీ అంతే! కాని అన్యులు మూర్ఖులు!! నమ్మలేరు. కాలం అనంతం అయినా మన శాస్త్రజ్ఞులు శాస్త్రీయంగా గుణించి లెక్కలు కట్టారు. పంచాంగం మీద చూస్తే సృష్టి నాది నుంచీ లెక్క కనిపిస్తుంది. శోభకృతు నామ సంవత్సరానికి (అంటే 2023-2024) సృష్టి మొదలై 194 కోట్ల 58 లక్షల, 85,123 సంవత్సరాలైంది. సృష్టి మొదలైన తరువాత 432 కోట్ల సంవత్సరాలకు ప్రళయం వస్తుంది. అప్పుడు సమస్తం జలమయం అవుతుంది. ఆ జలమయ జగత్తు 432 కోట్ల మానవ సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు విష్ణువు, శ్రీమన్నారాయణుడు మర్రి ఆకు మీద శయనించేంత వాడవుతాడు. వటపత్రశాయి అవుతాడు. అప్పుడు ఆ స్వామి ఒక్కడే మర్రి ఆకుమీద తేలియాడుతుంటాడు. మళ్లీ సృష్టి ప్రారంభం కావాలి. అప్పుడు స్వామి శేషశయనుడు అవుతాడు. అతని బొడ్లో నుండి తామరపూవు వెలుస్తుంది. దానిమీద చతుర్ముఖ బ్రహ్మ ప్రభవిస్తాడు. విష్ణుదేవుడు బ్రహ్మకు అనేకమైన వేదాలను ఉపదేశిస్తాడు.

         ‘432 కోట్ల మానవ సంవత్సరాలు వేదాలు నశించలేదు. సృష్టితో పాటు అంతర్హితాలయినాయి. అప్పుడు ఋషులు బ్రహ్మవలన అనుమతించబడ్డారు. ఆ మహర్షులు ఆ విధంగా వేదాన్ని దర్శించారు. కాబట్టి ఋషి వేదానికి ద్రష్ట, దర్శించినవాడు అయ్యాడు. స్మర్తి గుర్తుంచుకున్నవాడు మాత్రమే! కర్త మాత్రం కాడు. వేదవ్యాసుడు వేదకర్త కాడు. అతడు వేదం విభజన మాత్రం చేశాడు. చతుర్ముఖుడు వేదకర్త కాదు. అతనికి ఈశ్వరుడు ప్రసాదించాడు. జగదీశ్వరుడు వేదకర్త కాదు. అతడు కేవలం వ్యక్తపరిచాడు. వేదానికి కర్త లేడు. వేదం అపౌరుషేయం’.

         ‘వేదానికి శ్రుతి, ఆమ్నాయము, ఛందస్సు, స్వాధ్యాయము అని పేర్లు. వేదాన్ని మహర్షులు విననందున, శ్రుతి అన్నారు. వేదం ఛందోబద్ధం. సస్వరం. సమస్త సృష్టినీ ఇముడ్చుకుంది. అప్పటికే అక్షరం ఉన్నది. నిరంతరం అధ్యయనం చేయబడేది ఆమ్నాయం. అవిచ్చిన్నంగా సాగుతున్నది ఆమ్నాయం. వేదం ఉపదేశం వలన లభించింది. సస్వర వేదం ఉపదేశం వల్ల మాత్రమే సాధ్యం. సంప్రదాయం ప్రకారం లభించింది. ఇన్ని వేల సంవత్సరాల నుండి తరం నుంచి మరో తరానికి సంక్రమించింది. వేదం మానవజాతికి నియమబద్ధం అయిన జీవితం నేర్పినందున ఛందస్సు అయింది. అయితే ఛందో బద్ధం అయిందని మాత్రం కాదు. ఆదేశించేది, నియమించేది అని అర్థం. వేదం సంప్రదాయంగా వచ్చింది. ఉపదేశించవలసింది. ఈ రెండు గురుముఖతః జరిగేవి. అంతటితో అధ్యయనం ఆగిపోదు. వేద విద్యార్ధి తానూ స్వయంగా వేదాన్ని అధ్యయనం, పరిశోధన చేయాలి. అంతకు ముందు తెలియని అర్థాలు, వాస్తవాలు వెలికి తీయాలి. ఇది స్వాధ్యాయం అవుతుంది’.

         ‘ఋషి అతీంద్రియ దర్శి. జ్ఞానేంద్రియాలకు అతీతంగాగా చూడగలడు. సూర్యభగవానుడు సర్వసాక్షి అయినా అతడు చూడలేనిది ఋషి చూడగలడు. దివ్యదృష్టి దివికి సంబంధించినదే. దివ్యదృష్టి దేవతా సంబంధం, జ్ఞాన సంబంధం. జ్ఞానానికి అందనిది లేదు. జ్ఞానం సర్వాన్నీ దర్శించగలది. జ్ఞానం భూత భవిష్యత్తులను దర్శించగలదు. మానవ సమాజాన్ని గురించి భారత ఋషులు ఎంతో అధ్యయనం చేశారు. మానవుడి సుఖ దుఃఖాలను గురించి భారత ఋషులు, తత్త్వశాస్త్ర వేత్తలు, ఆచార్యులు ఎంతగానో పరితపించారు. దుఃఖ నివారణకు ఎంతో కృషి చేశారు. భవిష్యత్తును గురించి ఋషులు చెప్పిన దానికి ఇంటర్నెట్ యుగంలో మనం ఆశ్చర్యపోకుండా ఉండలేం! వేదవ్యాస మహర్షి మానవాళి కోసం తన జీవితాన్ని కప్పురంగా వెలిగించాడు. ద్వాపర యుగాంతంలో రానున్న కలియుగాన్ని గురించి అతని భవిష్యద్దర్శనం అద్భుతం, నిరుపమానం’.

         ‘శ్రీమహాభాగవతం ద్వాదశ స్కందంలో కలియుగాన్ని గురించి చెప్పబడింది. దాని సంగ్రహ స్వరూపం: కలికాలంలో దినదినం ధర్మం, సత్యం, శౌచం, క్షమ, ఆయువు, స్మృతి లోపిస్తుంటాయి. ధనమున్న వాడే కులీనుడు, ఆచారవంతుడు, గుణవంతుడు, బలవంతుడు, ధర్మపరుడు, న్యాయపరుడు, సర్వ నియంత అవుతాడు. పెళ్లిళ్లలో కులం, శీలం, యోగ్యత కన్నా, వధూవరులు ఒకరికొకరు నచ్చితే వివాహాలు జరుగుతాయి. నిజాయితీ లోపించును. మోసం చేయగలవాడు, అబద్ధాలాడగలవాడు, వ్యవహార దక్షుడవుతాడు. బ్రాహ్మణుడి బ్రాహ్మణత్వం, బ్రహ్మ జ్ఞానం ద్వారా కాకుండా జంద్యం ప్రదర్శన ద్వారా  వ్యక్తమవుతుంది. బ్రహ్మచారులు గాని, సన్యాసులు కాని ఆశ్రమ ధర్మాలు పాటించరు. వేసిన వేషంతో తృప్తి చెందుతారు. వాగినవాడు పండితుడు. అసాధుత్వమే సాధుత్వం, అసౌజన్యమే సౌజన్యం అవుతుంది. స్వీకారమే వివాహము అవుతుంది. దూరాన వున్న బురద గుంటే తీర్థమవుతుంది, వెంట్రుకలు పెంచడం లావణ్యం, కడుపు నింపుకొనుట పురుషార్థం, కుటుంబ పోషణ ఘన కార్యం, యశస్సు కోరుటే ధర్మం అవుతాయి. ఒక సారి పరికించి చూస్తే ఆనాడు ఋషులు చెప్పింది ఎంతటి యదార్థమైనదో తెలుస్తుంది. వారి దివ్య దృష్టికి ఆశ్చర్య పోవడం కన్నా ఏం చేయగలం? ఆనాటి ఋషిది ఎంతటి దివ్య దర్శిత్వం? కొనియాడడానికి పదాలు దొరకడం లేదు! ఆలోచనకు అందడం లేదు!!!’.

(డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)

 

No comments:

Post a Comment