ప్రజాసంబంధాలతోనే పథకాల సక్సెస్, ఆ ప్రయోగంతో సత్ఫలితాలు
(పౌరుల
అవసరాలకు ప్రజాసంబందాల అధికార్ల ఆవశ్యకత)
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ
దినపత్రిక (18-1-2024) & (19-1-2024)
పార్లమెంటరీ ప్రజాస్వామ్యమంటేనే అటు కేంద్రస్థాయిలో కానీ, ఇటు రాష్ట్రస్థాయిలో
కానీ ఎన్నికైన ప్రజా ప్రభుత్వాల పరంగా, ఒక హక్కుగా లబ్దిపొందే వివిధ పథకాల విషయంలో
ప్రజలకు అనేక ఆశలు, ఆశయాలు, అభిలాషలు, ఆకాంక్షలు, అవసరాలు, కోరికలు, సమస్యలు, ఇలా
ఎన్నో వుండడం సర్వసాధారణం. వాటిని తీర్చడానికే అనేక సంక్షేమ, అభివృద్ధి
పథకాలను, ఎన్నికల మానిఫెస్టోలో రాజకీయ పార్టీలు వాగ్దానం చేయడం, ఇచ్చిన
హామీలకు అనుగుణంగా, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలుచేసే చర్యలు
చేపట్టడం సర్వత్రా జరిగేదే. అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ది
మాత్రమే కాకుండా, అదనంగా పౌరులకు విద్యా, వైద్య
ఆరోగ్యం లాంటి వివిధ రకాల అవసరాలు, అత్యవసరమైన మరికొన్ని ఊహించని అవసరాలు తరచు
కలిగే అవకాశం వున్నది.
తామెన్నుకున్న ప్రభుత్వం తమ అవసరాలను తీర్చే విషయంలో కానీ, ఎన్నికల్లో
చేసిన సంక్షేమ, అభివృద్ధి
పథకాలకు సంబంధించిన వాగ్దానాలు నెరవేర్చే విషయంలో కానీ, ఉదాసీనత
ఏమాత్రం కనపర్చకుండా ప్రతి పథకం అమలుకు ఎన్ని విధాల వీలుంటుందో, అన్ని విధాల
చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు, ప్రభుత్వాన్ని
అభినందిస్తారు. మళ్లీ-మళ్లీ గెలిపిస్తారు. లబ్దిదారుల అభిప్రాయ సేకరణ కూడా
ఎప్పటికప్పుడు తీసుకునే యంత్రాంగం కూడా అవసరమే. అలా జరగకపోతే ఫలితం ఎలాగైనా
వుండవచ్చననేది సర్వత్రా అనుభవంలోకి వస్తున్నదే. ఈ నేపధ్యంలోనే, ఇటీవల కొందరు
భావసారూప్యతకల రాజకీయ, అధికారస్వామ్య పెద్దలు, చిన్నలు తమదైన నిరాడంబర శైలిలో ఒక
గోష్టి నిర్వహించి ఈ విషయాలపై కూలంకషంగా చర్చించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత మొదటి పదిసంవత్సరాల
పాలనలో, ప్రప్రధమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని భారత
(తెలంగాణ) రాష్ట్ర సమితి ప్రభుత్వం, దేశంలో ఎక్కడా లేని విధంగా అమలుచేసిన లెక్కకు
మించిన పథకాలను గురించి, అమలుతీరును గురించి, లబ్దిదారుల
అభిప్రాయం గురించి కొంత లోతైన విశ్లేషణ చేశారు వీరు. మరోవైపు, ఆ ప్రభుత్వ పథకాలను
మించి, మరింత లబ్దిదాయకమైన పథకాలను (ఆరు గారెంటీల లాంటివి) కాంగ్రెస్ పార్టీ
అమలుచేస్తుందని ప్రగాఢంగా విశ్వసించి, కోటి ఆశలతో ప్రజలు రేవంత్
రెడ్డి నాయకత్వంలోని ఆ పార్టీని గెలిపించి, అధికారం అప్పగించారు. అందరూ భావించినట్లే గెలిచిన కాంగ్రెస్ పార్టీ
అధిష్టానం, ప్రభుత్వ పాలనా పగ్గాలను రేవంత్ రెడ్డి అప్పగించినందువల్ల, తెలంగాణ
రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వాగ్దానాల అమలుకు సమర్థవంతమైన,
అనుభవుజ్ఞులైన వారితో కూడిన సహచర మంత్రివర్గాన్ని, అధికార
స్వామ్యాన్నీ ఏర్పాటు చేసుకున్నారు. వాగ్దానాల అమలుకు వడివడిగా, విజయవంతంగా
అడుగులు వేస్తున్నారు.
ప్రజల బాగోగులే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో కూడా పాలన
సాగుతుందనీ, అలా సాగాలనీ, ఆ గోష్టిలో పాల్గొన్నవారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
కాకపోతే, ఎంత పకడ్బందీగా పథకాల అమలుకు ఎన్నిరకాల చర్యలు తీసుకున్నప్పటికీ అర్హులైన
అందరూ వాటి ఫలాలను ఎంతమేరకు ఆస్వాదించగలుగుతారో అనే విషయంలో చర్చలో పాల్గొన్న వారు
వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ప్రభుత్వ ఉద్దేశం ఎంత మంచిదైనప్పటికీ, అమలు వరకు
వచ్చేసరికి వుండాల్సిన సాంకేతిక, ఇతర సమస్యలు వుంటాయనే భావన గోష్టిలో
వెల్లడైంది. పథకాల పటిష్ట, విజయవంత అమలుకు, ఒక క్రమపద్ధతిలో లబ్దిపొందినవారి
అభిప్రాయ సేకరణకు, మంచి చెడుల బేరీజు వేసుకోవడానికి, తప్పులను
సరిదిద్దుకుని మెరుగు పరచుకోవడానికి, పౌరుల ఇతర ఆవసరాలకు
తోడ్పడడానికి, వివిధ
స్థాయిలలో ‘ప్రజాసంబంధాల అధికార్ల’ ఆవశ్యకత అనే అంశం గోష్టిలో పాల్గొన్న వ్యక్తులు
వెల్లడి చేసిన అభిప్రాయాలలో ప్రధానమైంది.
కేసీఆర్ ప్రభుత్వ హయంలో అద్వితీయంగా లక్షలాదిమంది లాభపడేలా అమలైన
వివిధ పదకాలైన రెండు పడక గదుల ఇళ్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారాక్, విదేశీ విద్య
స్కాలర్ షిప్, ఆసరా పించన్లు, కేసీఆర్
కిట్స్, రైతు భీమా, రైతు
బందు, దళిత బందు, గొర్రెల పంపిణీ, లేదా మరే పథకమైనా
సంబంధిత లబ్దిదారుడు ఎలా పొందగలరో చాలామందికి (సరైన) అవగాహన వుండేది కాదని పలువురి
అభిప్రాయంగా గోష్టిలో పాల్గొన్నవారు భావించారు.
పథకానికి చెందిన సమాచారం ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు కొంతమేరకు అర్థమై, దాని ఫలాలను
పొందే వీలుకలిగినప్పటికీ, లబ్దిపొందడానికి అవసరమైన విధి-విధానాలు
క్షుణ్ణంగా తెలుసుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బందులు తలెత్తాయని
పలువురి అభిప్రాయం. వీటిలోని నిజానిజాల నిర్ధారణ జరుగుతేనే వాస్తవాలు వెలుగులోకి
రావచ్చు. కాని తత్సంబంధితమైన అభిప్రాయ సేకరణ అధికారికంగా జరగలేదనే భావన కూడా
వెల్లడైంది. పథకాలే కాకుండా జనన-మరణ ధృవీకరణ పత్రాలను, ఆదాయ
సర్టిఫికేట్లను, కుల ధృవీకరణ
పత్రాలను, విద్యా, వైద్యారోగ్య, లాంటి మరికొన్నిటిని సమస్యలులేకుండా
పొందడానికి ప్రతి పౌరుడికీ ప్రభుత్వంతో అనునిత్యం అవసరం వుంటూనే వుంది. ఆ అవసరాలలో
సహాయపడడానికి, ప్రభుత్వ
సహాయం అందేలా చూడడానికి ‘ప్రజాసంబంధాల అధికార్ల’ ఆవశ్యకత వున్నది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణలో ప్రజాపాలన
తెస్తామని హామీ ఇచ్చింది. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు మాట ఇచ్చింది. అవేవీ
కేవలం జనాకర్షక పథకాలు కావు. పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే కాంతిరేఖలు. తెలంగాణ
సామాజిక ముఖచిత్రాన్ని మార్చే ‘గేమ్ ఛేంజర్లు.’ భవిష్యత్తు పట్ల ప్రతి తెలంగాణ
పౌరుడిలో ఆత్మవిశ్వాసం సమృద్ధిగా కలిగించే విలువైన పెట్టుబడులు. ఒకవైపు రాష్ట్రంలో
‘తలసరి ఆదాయం’ పెరిగిందనీ, రాష్ట్ర
సంపదే పెరిగిందనీ, అనుకుంటున్నప్పటికీ, ఇంకా, ఇంకా దారిద్ర్య
రేఖ దిగువన వున్న చాలామంది పేదలను ఎగువకు తీసుకురావడానికి నూతనంగా ఏర్పాటైన
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసే మొదటి అడుగుగా ఈ ఆరు గ్యారంటీలను ప్రభుత్వం పరిగణిస్తున్నదని
భావించాలి. ప్రజలు కూడా అలాగే విశ్వసించి ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించి
అధికారాన్ని అప్పచెప్పారు.
ఎన్నో ఆశలతో, ఎంతో నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని
దీవించి ఇచ్చిన అధికారం అది. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా, వారి ఆశలకు, ఆకాంక్షలకు
అనుగుణంగానే పాలన సాగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద నిర్ద్వందంగా వున్నది. అందుకే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం మొదటి రోజు నుంచి చాలా
అప్రమత్తతతో ఉంటున్నది.
మొదటి అడుగు నుంచి ప్రతి అడుగు అత్యంత జాగ్రత్తగా
వేస్తున్నది. తెలంగాణ సమాజంలో చిట్టచివరన, అట్టడుగున ఉన్న ప్రతివారు ప్రభుత్వం
కల్పిస్తున్న అవకాశాలు పొందే వెసులుబాటును, ధైర్యంతో
ముందుకు వచ్చే వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వం బాధ్యత. ఆ దిశగానే ‘ప్రజాసంబంధాల అధికార్ల’
ఆవశ్యకత వున్నది.
నిజమైన ప్రజా పాలన మొదలైనా కొనసాగే వాతావరణం నిరంతరాయంగా
ఏర్పడాలి. ఎవరో ఎక్కడో కూర్చుని నిర్ణయాలు తీసుకోవడం, అవి
సాధ్యమైనవా?
కావా? వాటి ద్వారా
లబ్ది పొందడం ప్రజలకు ఎలా అర్థం కావాలి? అనే ప్రశ్న కూడా
వేసుకునే అవకాశం లేకుండా ప్రభుత్వ పాలన సాగరాదు. ప్రభుత్వం ఉన్నత స్థాయిలో
తీసుకున్న పథకాల రూపకల్పనకు, అమలుకు సంబంధించిన విధివిధానాల ఆచరణలో ఉండే
ఇబ్బందులు ఏమిటి? అనే విషయాలు సాధారణ ప్రజల విషయం అటుంచి, చివరికి అఖిలభారత
సర్వీసు అధికారుల స్థాయి వారికి కూడా ఏమైనా సందేహాలు వస్తే తీర్చేవారు లేని
పరిస్థితులు వుండేవి. క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించే అవకాశం కూడా
అధికారులకు లేదనే భావన కూడా కలిగేది. దీని వల్ల ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేసే
సందర్భంలో అనేక ఇబ్బందులు పడే అవకాశం వుంది.
గడిచిన నెలకు పైగా రోజుల్లో ఆరుగారంటీల అమలు దిశగా ప్రభుత్వం ఎలా
ఉండబోతున్నాదో,
ప్రజలే
కేంద్రంగా నిర్ణయాలు ఎలా జరగబోతున్నాయో ప్రజలకు రుచి చూపించింది. ప్రభుత్వ
నిర్ధేశించుకున్న అత్యున్నత లక్ష్యాలు, ఆ లక్ష్యాలను
చేరుకోవడానికి ఎంచుకున్న అత్యుత్తమ మార్గాలు కూడా ప్రజలకు అనుభవంలోకి వచ్చాయి. తెలంగాణ
రాష్ట్రం ముందడుగు వేస్తున్నది. పది రోజులపాటు సాగిన ‘ప్రజాపాలన’ కార్యక్రమం
ద్వారా ప్రభుత్వం హామీ ఇచ్చిన వివిధ పథకాలకు భవిష్యత్ లబ్దిదారుల ఎంపికకు వివరాలను
సేకరించింది. దరఖాస్తుల ద్వారా కుటుంబ వివరాలు (చిరునామా, ఆదార్, రేషన్
కార్డుల నంబర్లతో సహా) సేకరించింది. అలాగే ‘అభయహస్తం గ్యారంటీ’ పథకాలైన
‘మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత’ లకు లబ్ది
పొందడానికి వివరాలు కూడా సేకరించింది. దరఖాస్తులను నింపడానికి సహాయం చేసేవారిని
కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇది కేవలం పదిరోజులు మాత్రమే సాగే కార్యక్రమం
కాదని నిరంతర ప్రక్రియ అని కూడా ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి ప్రభుత్వం
చెప్పినట్లు ఇది నిరంతర ప్రక్రియ కావాలన్నా, ఇప్పటికే
దరఖాస్తు చేసుకున్నవారికి వారు కోరుకున్న లబ్ది ఎప్పుడు లభిస్తుందని
తెలుసుకోవాలనుకున్నా, అసలు అర్హత వుందో లేదో తెలుసుకోవాలన్నా, సహాయపడేందుకు
తోడ్పడే ‘ప్రజాసంబంధాల అధికార్ల’ ఆవశ్యకత వున్నది.
‘ప్రజాసంబంధాల
అధికార్లు’ ఒక రకమైన ‘చేంజ్ ఏజంట్లు’. వీళ్ళు ప్రజావసరాల విషయంలో ప్రతి పౌరుడికీ
వారి-వారి అవసరాలకు తగ్గట్లు, అర్హత ఆధారంగా, ఏఏ పథకానికి
వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చో, ఎలా చేసుకోవచ్చో, ఎప్పుడు
చేసుకోవచ్చో, ఎందుకు
చేసుకోవచ్చో అనే విషయాల్లో నిరంతర అవగాహన కలిగించడం దగ్గరనుండి దరఖాస్తు చేసుకుని
లబ్ది పొందేటంతవరకు సహాయకులుగా వుంటారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రవేశ పెట్తున్న
నూతన పథకాలను ప్రజల్లోకి తీసుకు పోవడం దగ్గరనుండి, పాత పథకాల్లో
చోటు చేసుకున్న మార్పులు-చేర్పుల గురించి కూడా అవగాహన కలిగిస్తారు. ఉదాహరణకు మహాలక్ష్మీ
పధకమే తీసుకుంటే ఇది కొత్త పధకం. దీనికింద ప్రతినెల రు. 2500 ఆర్ధిక సహాయం
ప్రభుత్వం ఇస్తుందనీ, రు. 500 కే గాస్ సిలిండర్ లభిస్తుందనీ విరివిగా ప్రచారంతో
పాటు, అవి పొందడానికి తోడ్పడాలి. అలాగే రైతు భరోసా పధకం (అప్పటి రైతుబందు)
కొత్తదని, ఒకప్పుడు ఎకరానికి రు. 10,000 మాత్రమే వచ్చేవనీ, ఇప్పుడు
దాన్ని రు. 15,000 పెంచడమే
కాకుండా కౌలు రైతులకు కూడా లబ్ది జరుగుతున్నదని లబ్దిదారులకు అర్థం అయ్యే రీతిలో
చెప్పేవారు కావాలి. అలాగే మిగిలిన ప్రభుత్వ పధకాలు కూడా. అందుకే ‘ప్రజాసంబంధాల అధికార్ల’
ఆవశ్యకత వున్నది.
ఈ రకమైన ‘ప్రజాసంబంధాల అధికార్లు’ లేదా ‘చేంజ్
ఏజంట్లు’ ప్రభుత్వ పరంగా మొదలు తాత్కాలికంగా, ఆ తరువాత
శాశ్వతంగా, పనిచేసే వీలు
కలిగించవచ్చు. వీరు ఏ విషయంలోనైనా పౌరుడికి ఆద్యంతాలు అండగా వుంటారు. పౌరులకు, లబ్దిదారులకు
ప్రభుత్వ పక్షాన ఒక కౌన్సిలర్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక
ఉపాధ్యాయుడిలాగా, ఒక పరిశోధకుడిలాగా, ఒక
సలహాదారుడిలాగా,
ఒక
మధ్యవర్తిలాగా, ఒక అడ్వొకేట్
లాగా వ్యవహరిస్తారు. ప్రభుత్వానికీ, పౌరుడికీ మధ్య ఒక వారదిలాగా వుంటారు.
ఒక్కోసారి ఏదైనా ఒక ప్రత్యేక వ్యక్తిగత అవసరం (విద్యా, వైద్యారోగ్య, విదేశీయాన
లాంటి) వుంటే తగు రీతిలో సలహా కూడా ఇవ్వడానికి వీలుంటుంది. ఒక మెంటార్లాగా, ఒక
ఫెసిలిటేటర్ లాగా, వ్యక్తులకు సంబంధించిన ప్రతి వివరాల సంరక్షకుడిలాగా కూడా
వ్యవహరిస్తారు. ప్రతి పౌరుడి వివరాల డేటా బాంక్ కూడా రూపొందించుకోవడానికి
వీలవుతుంది.
2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణాలో
సుమారు 2 కోట్ల మంది జనాభా పల్లెల్లో, 1.5 కోట్ల మంది జనాభా
పట్టణాల్లో-నగరాల్లో నివసిస్తున్నారు. లెక్కలో కొంచెం అటు-ఇటుగా మార్పులు వుంటే దాన్నే
ఆధారంగా తీసుకోవచ్చు. అదే లెక్కల ప్రకారం అక్షరాస్యుల శాతం 66.46%. దీనర్థం మిగతా
మూడవ వంతు ప్రజలు నిరక్షరాస్యులు. అక్షరాస్యులలో కూడా కంప్యూటర్ నిరక్షరాస్యులు
చాలా మంది వుండే అవకాశం వుంది. వీరికి నిరక్షరాస్యుల లాగానే ఐటీ సంబంధిత సేవలు
అర్థం కావు. ఎంత గొప్పగా ప్రభుత్వం ప్రచారం కలిగించినా, ఎంత భారీ
మోతాదులో ప్రజలను చైతన్య పరిచినా, ఇంకా-ఇంకా చాలా మంది ప్రభుత్వ పథకాలను
క్షుణ్ణంగా అర్థం చేసుకుని వాటికి తామెంత మేరకు అర్హులమో నిర్ణయించుకుని, తదనుగుణగా
దరఖాస్తు చేసుకుని ఫలితాలను పొందగలరనేది మనసుపెట్టి ఆలోచించాల్సిన విషయమే.
గ్రామీణ ప్రాంతాలలో ప్రతి 2000 మందికి ఒకరు చొప్పున పదివేలమంది, పట్టణ-నగర
ప్రాంతాలలో ప్రతి 3000 మందికి ఒకరు చొప్పున ఐదువేలమంది, మొత్తం (10,000+5,000) 15,000 మంది ‘ప్రజాసంబంధాల
అధికార్లు’ లేదా ‘చేంజ్
ఏజంట్లు’ కావాల్సి వుంటారు. వీరికి నెలకు సుమారు రు.35,000-రు.50,000
మధ్యజీత భత్యాల కింద ఇస్తే మొత్తం నెలకయ్యే వ్యయం రు.52.5-75 కోట్లు, అంటే సంవత్సరానికి
అయ్యే వ్యయం కేవలం రు.630-900 కోట్లు మాత్రమే. ఆర్థికరంగ నిపుణుల అంచనా మేరకు ‘ఆరు
గారంటీల’కు,
ఇతర
ఆర్థికపరమైన పథకాల అమలుకు కావచ్చనుకున్న సుమారు రూ 2.15 లక్షల కోట్లు వ్యయంలో ఇది
అతి స్వల్పం. ఎందుకీ ఆలోచన చేయకూడదు? కళాశాలల నుండి,
విశ్వవిద్యాలయాల నుండి, వృత్తి విద్యా సంస్థలనుండి, డిగ్రీ, పీజీ, ఎంబీయే, జర్నలిజం, పబ్లిక్
రిలేషన్స్ లాంటి కోర్సులను పూర్తిచేసిన
యువతీ, యువకులను ప్రత్యేక నియామక పద్ధతిలో ఎంపికచేసి, ‘ప్రజాసంబంధాల
అధికార్లు’ లేదా ‘చేంజ్
ఏజంట్ల’గా ప్రయోగాత్మకంగా నియమిస్తే మంచిదేమో! భావ సారూప్యత కల కొందరు నిర్వహించిన
గోష్టిలో వెలువడ్డ అభిప్రాయం ఇదే!!! ఇది అవసరమనుకుంటే, ఆచరణ
సాధ్యమైతే మార్పును కోరుకుంటున్న ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తే మంచిదేమో!
Good idea
ReplyDelete