వేల, లక్షల సంవత్సరాల క్రితంనాటి ‘మహర్షి వాల్మీకి’ అయోధ్య
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర దినపత్రిక (18-1-2024)
వర్తమాన చరిత్ర
చాలామందికి తెలుస్తుంది. తరువాతి వారికి
కొంత తెలుస్తుంది. కేవలం ఒక వంద సంవత్సరాలు మాత్రం గడిస్తేనే అది అవునో, కాదో అని అనుమానం కలగవచ్చు. అలాంటిది వేల, లక్షల సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఒక చరిత్రను యథాతథంగా అంగీకరించడమంటే, అది ఆ చరిత్రలోని అంశాలకు, దాన్ని రాసినవారి
గొప్పతనానికి, వాస్తవికతకు నిదర్శనంనాలి. అలాంటి అరుదైన చరిత్ర ‘అయోధ్య నగరం’ ఆధారంగా జరిగిన శ్రీసీతారామ చరిత్ర. ఇది వాల్మీకి కల్పించినది కాదు.
జరిగినది జరిగినట్లుగా, తాను చూసినది చూసినట్లుగా, రాసుకున్నాడు. అలా రాసుకున్నదాంట్లోనే ‘మహర్షి వాల్మీకి’ కాలంనుండి, నేటి
‘రాజర్షి నరేంద్ర మోడీ’ పాలన దాకా, ఎన్ని ఒడిదుడుకులు
ఎదురైనా, శోభాయమానంగా అలరారుతూ, వర్ధిల్లుతూ,
అద్భుతమైన చారిత్రాత్మక రామమందిరాన్ని నిర్మించుకుని, యుగయుగాలుగా నిలిచిన ‘అయోధ్యాపురి’
వుంది.
వాల్మీకి సంస్కృతంలో రచించిన
శ్రీమద్రామాయణం కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచింది, ఇందులోనాయిక సాక్షాత్తు
శ్రీదేవైన సీతా దేవి. నాయకుడు మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తి.
వీరిరువురు త్రేతాయుగంలో దుష్ట శిక్షణ-శిష్ట
రక్షణ చేసి, ధర్మ సంస్థాపన చేసేందుకు అవతరించారు. శ్రీమద్రామాయణం ‘సీతాయా శ్చరితం మహత్’ అంటే, సీతా దేవి మహాచరిత్రేనని, రామచంద్రమూర్తి
సాక్షాత్తు శ్రీమహవిష్ణువేననీ వాల్మీకంటాడు. వాస్తవానికి, బ్రహ్మదేవుడు మొదలు వీరి చరిత్రను, వీరు ఆచరించిన
ధర్మాలను ఓ బృహత్ గ్రంథంగా రచించి, నారదుడికి, ఇతర మహర్షులకు ఉపదేశించి, భూలోక వాసుల కొరకై
వాల్మీకికి ఉపదేశించమని నారదుడిని ఆదేశించాడు. నారదుడు
బ్రహ్మ చెప్పినట్లే చేశాడు. వాల్మీకి రచించిన రామాయణం నారద, బ్రహ్మల
ప్రేరణే.
మహర్షి వాల్మీకి, ఒక ఉదయం తమసా నదీతీరంలో
తిరుగుతూ,
ఒక క్రౌంచమిధునాన్ని చూస్తుండగానే, బోయవాడొకడు,
జంటలోని మగపక్షిని బాణంతో కొట్టి చంపుతాడు. ఆడపక్షి
ఏడుపు విన్న వాల్మీకి, జాలిపడి, బోయవాడిని
శపిస్తే, ఆయన నోటినుండి వెలువడిన వాక్యాలు సమాక్షరాలైన
నాలుగుపాదాల (‘మానిషాద ప్రతిష్ఠాం త్వ!
మగ మ శ్శాశ్వతీ స్సమాః ! యత్క్రౌంచ మిథునాదేక! మవధీః
కామమోహితం’) శ్లోకమయింది. నదీస్నానం ముగించుకుని వచ్చేసరికి, వాల్మీకి ఆశ్రమంలో
వున్న బ్రహ్మదేవుడు, ఆ శ్లోకాన్ని విస్తరించి, రామాయణం రాయమని ఆయనకు ఉపదేశించి, సర్వం ఆయనకు దూరదృష్టి
ద్వారా తెలిసేట్లు వరమిచ్చి పోయాడు. సంక్షిప్తంగా నారదుడు
చెప్పిన రామ చరిత్రనంతా యోగ దృష్టితో చూసిన వాల్మీకి, రామాయణాన్ని
వివరంగా రచించాలని నిశ్చయించుకున్నాడు. అలా
ఆదికావ్యం శ్రీరామాయణ రచనకు బీజంపడింది.
వాల్మీకి
రచించిన రామాయణం సంస్కృత భాషలో వున్నందువల్ల దాన్ని
యథావాల్మీకంగా, మహాకవి కీర్తి శేషులు వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు వంద సంవత్సరాల క్రితం తెనిగించారు.
ఆ మహానుభావుడి ‘ఆంధ్ర వాల్మీకి రామాయణం’ మందరాలలోని శ్రీరామాయణ
వ్యాఖ్యానంలో ‘జ్ఞాన పిపాసికి’ విజ్ఞాన సర్వస్వం దర్శనమిస్తుంది. పరిశోధకులకు వంద పీహెచ్‌డీలకు సరిపోయే విషయ సంపద లభ్యమవుతుంది. ఒక్కో కాండలో అద్భుతమైన రహస్యాలు అవగతమౌతాయి.
వాల్మీకి తాను రచించిన
రామాయణ మహాకావ్యాన్ని సీతారాముల (సీత అడవుల్లో వుండగా పుట్టిన) కుమారులు లవకుశులకు
గానం చేసేందుకు అనువైన రీతిలో నేర్పించాడు. అయోధ్యలో రామచంద్రమూర్తి చేస్తున్న
అశ్వమేధ యాగం చూడడానికి వచ్చిన మునీశ్వరులు, పురవీధుల్లో
గుంపులు-గుంపులుగా జనాలు, కుశ లవులు గానం చేస్తున్న రామాయణాన్ని విని మెచ్చుకున్నారు.
రాజవీధుల్లో గానంచేస్తున్న కుశ లవులను, శ్రీరామచంద్రమూర్తి తన
ఇంటికి పిలిపించుకుని, తమ్ములతో సహా వింటాడు. ఆ విధంగా రామ
చరిత్రను లవకుశులు బహిర్గతం చేశారు వివరంగా. శ్రీరామ జననం మొదలు నిర్యాణం వరకు
సాగిన శ్రీరామాయణం, ‘అయోధ్యాపుర’ వర్ణనతో, ఆ పురజనుల విశేషాలతో ‘బాలకాండ’ తో ఆరంభమవుతుంది. శ్రీరాముడు అరణ్యాలకు పోతున్నప్పుడు ‘అయోధ్య’ ప్రజలు స్పందించిన తీరును ‘అయోధ్యకాండ’ లో వివరించడం జరిగింది.
‘యుద్ధకాండ’ లో ‘శ్రీరామ పట్టాభిషేకం’ సందర్భంగా చివరగా
‘అయోధ్య’ ప్రస్తావన వుంది. అంతటి విశేషం సంతరించుకున్న
భాగ్యనగరమే అలనాటి, ఇలనాటి ‘అయోధ్య’.
వాల్మీకి
రామాయణంలో ‘రామజన్మబూమి’ గా
ప్రసిద్ధికెక్కిన ‘అయోధ్య’కు సంబంధించిన అనాది కాలంనాటి, సహజసిద్ధమైన విశిష్టత
సంతరించుకున్న, అనేక విషయాలను స్పష్టంగా వివరించడం జరిగింది. ఇప్పటిలాగానే,
ఆకాలంలో కూడా సరయూ నది ఒడ్డ్డ్డున కోసల దేశంలో
వున్న అయోధ్యా నగరానికి ఒకవైపున ‘గంగా, పంచల ప్రదేశ్’, మరోవైపున
‘మిథిలా’ వుండేవి. కాలక్రమేణా అయోధ్య పరిమాణంలో కుంచించుకు
పోవడమే కాకుండా, అక్కడి నదులు కూడా వాటి మార్గాన్ని
మార్చుకున్నాయి. ధనధాన్యాదులతో, భాగ్యవంతంగా, మనునిర్మితమైన కారణాన అందంగా,
రమ్యంగా, పన్నెండామడల పొడవు, మూడామడల వెడల్పు,
వంకర టింకర లేని వీధులు, రహదారికి ఇరు ప్రక్కల
సువాసనలు వెదజల్లే పుష్పాలను రాలుస్తున్న చెట్లు, తడుపబడిన
రాజవీధులతో అద్భుతంగా అలరారుతుండేది ‘అయోధ్యా నగరం’.
తీర్చిదిద్దిన వీధి వాకిళ్ళు, తలుపులు, మంగళకరమైన పచ్చని
తోరణాలున్న స్తంబాలు, ఎత్తైన మండపాల పై కట్టిన ధ్వజాలు, విశాలమైన అంగడి వీధులు, శిల్ప
కళాకారుల సమూహాలు, కలిమిడిగా వుండే నానా జాతులు, శ్రీమంతులైన పండితులు, నాట్యమాడే విదుషీమణులు, తియ్యమామిడి తోపులు, అయోధ్యా పురానికి
అందాన్నిచ్చేవి.
నవరత్నాలతో చెక్కబడిన
ఇళ్లతోను, ఇంటినిండా ఆరోగ్యవంతులైన కొడుకులు, కోడళ్లు, మనుమలు,
మునిమనుమలు, మనుమరాళ్లు, వయోవృద్ధులతోను, పుష్కలంగా పండిన ఆహార పదార్థాల నిల్వలతోను, నలు దిక్కులా
వ్యాపించిన రాచ బాటలతోను, వాటి మధ్యనే వున్న రాచగృహాలతోను నిండి వున్న అయోధ్యా నగరాన్ని
వాల్మీకి వర్ణించిన తీరు అద్భుతం. ప్రాకారం, అగడ్తలు,
గుర్రాలు, లొట్టిపిట్టలు, ఆవులు, ఎద్దులు, ఏనుగులు,
సామంత రాజులు, విదేశీ రాజులు, నానా దేశాల వ్యాపారులు, విశేష ధనవంతులైన వైశ్యులు,
నవరత్న ఖచితమైన రాజుల ఇళ్లు, చంద్రశాలలున్న
అయోధ్యా నగరం దేవేంద్రుడి రాజధాని అమరావతిని పోలి వుండేదని వాల్మీకి, వర్ణించారు. మద్దెలలు, వీణలు, ఉడకలు, పిల్లన గ్రోవులు, సుందరీమణుల
కాలి అందియలు, వీటివల్ల కలిగే ధ్వనులు, ఎల్లప్పుడు ఆటపాటలతో, ఉత్సవాలతో, ఆహ్లాద భరితంగా వుండేదా వూరు.
వర్తమాన
పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా, ప్రధాని నరేంద్ర మోడీ భవిష్యత్
విజన్ మేరకు, అయోధ్య నగరాన్ని, ప్రపంచ
స్థాయి మౌలిక సదుపాయాలతో, మెరుగైన అనుసందానాలతో, పౌర సౌకర్యాల కల్పన పునరుద్ధరణతో సహా, అనాదిగా, పరంపరగా వస్తున్న దాని
అద్భుతమైన వారసత్వాన్ని సంరక్షించే దిశగా పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే
డిసెంబర్ 30, 2023 న ప్రధాని మోడీ, అనేకానేక సౌకర్యాలతో
ఆధునీకరించబడిన ‘అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్’ భవనాన్ని, నూతనంగా నిర్మించిన ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని’ ప్రారంభించారు.
వాల్మీకి కాలంనాటి అయోధ్యా
పురంలోని బ్రాహ్మణులందరు అవిచ్ఛిన్నంగా అగ్నిహోత్రం కలిగుండే వారే. ఆరంగాలతో, నాలుగు వేదాలను నిరంతరం అధ్యయనం చేసిన వారే. సత్య వాక్య నిరతులే. వేదాల్లో
చెప్పిన కర్మ కార్యాలను నెరవేరుస్తూ, అడిగిన వారికి
శక్తికొలది దాన ధర్మాలు చేసేవారే. ఇంద్రియాలను జయించి, అహర్నిశలూ భగవత్ కథలనే
వల్లించి యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ, నిర్మల బుద్ధితో వుండేవారు.
దేవర్షులతో, మహర్షులతో సమానంగా, భగవధ్యానం చేస్తూ, సదాచార సంపన్నులై బ్రాహ్మణులు మెలగుతుండేవారు. బ్రాహ్మణులతో సమానంగా, ఇతర అయోధ్యా వాసులందరూ సంతుష్టిగల, ధర్మాన్నెరిగిన మనసున్నవారే. శాస్త్ర
సంబంధమైన ఆలోచనలు చెసే వారే. దేవుడిచ్చిన దాంతోనే సంతృప్తి చెందేవారు. త్యాగ
బుద్ధిగలవారు. తమకెంత అవసరమో అంత సంపాదన మాత్రమే చెసేవారు. కుటుంబం అంటే
శాస్త్రాల్లో ఎటువంటి నిర్వచనం చెప్పబడిందో, దానికనుగుణంగానే,
పదిమంది (తను, తన తల్లి, తండ్రి, భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు, ఒక కూతురు, ఒక అతిథి) కంటే
తక్కువున్న ఇల్లు ఆనగరంలో లేదు. దాన ధర్మాలు చేయనివారు, ఆ నగరంలో కనిపించరు.
చదువురాదనేవారు అయోధ్యలో లేనే లేరు. అంటే, పూర్వ కాలంలో
అన్ని జాతుల వారు విద్య నేర్చుకునేందుకు అర్హులనే విషయం స్పష్టమవుతున్నది.
అయోధ్యా వాసులందరూ ధర్మం, శీలం కలవారే. ప్రేమ స్వరూపులే. దోషరహితమైన నడవడిక గల వారే. ఋషితుల్యులే. నిష్కళంకమైన
మనసున్నవారే. అందచందాలున్న వారే. శాస్త్రోక్తమైన విహిత కర్మను బ్రాహ్మణులు
శ్రద్ధతో ఆచరిస్తూ,
విద్యా దానంలో, అధ్యయనంలో ఉత్తములై, దానానికి
పాత్రులై వుండేవారు. అయోధ్యలో నివసించే అన్ని
వర్ణాలవారు దైవ పూజ చేయకుండా, అతిథిని ఆదరించకుండా, భోజనం చేయని దీక్షాపరులు. అయోధ్యా పురవాసులు
శౌర్య పరాక్రమాలున్నవారు. బ్రాహ్మణులుపదేశించిన కార్యాలలో ఆసక్తి కలిగి
క్షత్రియులు నడచుకునేవారు. వైశ్యులు రాజులకు అనుకూలంగా వుండేవారు. బ్రాహ్మణ, క్షత్రియ,
వైశ్యులకు చేదోడువాదోడుగా, ఒకరికొకరు సహాయపడుతూ, కులవృత్తులు
చేసుకునే వారు వుండేవారు.
అయోధ్యా నగరాన్ని పాలించిన దశరథ
మహారాజుకు, భోగభాగ్యాలెన్ని వున్నా కుమారులు కలగని కారణాన, పుత్రకామేష్ఠి యాగం చేస్తుండగా, అగ్నిహోత్రం
మధ్యనుండి ప్రాజాపత్య మూర్తి దివ్యపరమాన్నమున్న బంగారు పాత్రతో వచ్చి, దానిని
ఆయనకిచ్చి, అందులోని పాయసాన్ని భార్యలతో తాగించమని చెప్పాడు.
పాయసం తాగిన భార్యలు గర్భవతులయ్యారు. పన్నెండో నెలలో, చైత్ర
మాసం, శుక్లపక్షం, నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలో,
అభిజిల్లగ్నం, కర్కాటక లగ్నంలో, చంద్రుడిని
కూడిన బృహస్పతి కలిగిన ఉదయాన, దశరథుడి జ్యేష్ట భార్య కౌసల్యాదేవి జగత్ పాలకుడైన
శ్రీమహావిష్ణువు అర్థాంశమూర్తి, శుభ లక్షణాల రఘువంశ వర్ధనుడిని, శ్రీ రాముడికి జన్మనిచ్చింది. మహావిష్ణువైన భగవంతుడు అక్కడ
పుట్టినందువల్లే, ఆ పుణ్య నగరం ‘అయోధ్యగా’ కీర్తించబడింది. అలా, అలనాటి ‘అయోధ్య’ శ్రీరాముడి జన్మస్థలం, లేదా, రామజన్మ భూమి అయింది. అదే అయోధ్యలో, ఈనాడు ‘రామ్ లల్లా
విగ్రహం’ వుండే చారిత్రాత్మక ‘రామమందిరం’ నిర్మితమయింది.
‘అయోధ్య’ గురించి మరింత ముందుకు వెళ్తే: సీతారాముల కల్యాణం అనంతరం నగరానికి వారు
తిరిగి వస్తున్న వార్త విన్న అయోధ్యా నగర వాసులు, రంగు రంగుల
పూల తోరణాలు కట్టి, మంగళ వాద్య ధ్వనులు మారుమోగించుకుంటూ,
దారంతా నీళ్లతో తడిపి, పుష్పాలు వెదజల్లి,
తోరణాలు కట్టి, రంగవల్లులు తీర్చిదిద్ది,
బంగారు ఆభరణాలు ధరించి, మంగళ వాయిద్యాలతో వారికి
ఎదుర్కోలుపల్కారు. అయోధ్యావాసుల ఆదరణకు ఇదొక నిదర్శనం. అయోధ్యలో శ్రీరామచంద్రుడు
సీతతో కలిసి, అనేక ఋతువులు, మనోహరమైన
విహార క్రీడల్లో ప్రియంగా గడిపారు. ‘అయోధ్యా నగరం’ లో శ్రీ సీతారాములు సర్వ సుఖాలు
అనుభవించారంటే, వారిద్దరి అన్యోన్యత, అనురాగం, అవతార నేపథ్యం లాంటి అనేక విషయాలు భావగర్భితంగా దర్శనమిస్తాయి.
కుమారుడు
శ్రీరాముడిని యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేయాలని భావించిన దశరథుడు, ‘అయోధ్య’ ప్రముఖులతో
ఆలోచనచేసి, వారి అంగీకారాన్ని పొందాడు. దశరథుడు, శ్రీరాముడికి సభాముఖంగా పౌరుల అభిప్రాయాన్ని
చెప్పి, పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయమని
వశిష్టుడిని కోరాడు. రామపట్టాభిషేక విషయాన్ని తెలుసుకున్న అయోధ్య పౌరులు గుంపులు, గుంపులుగా
వీధుల్లో గుమిగూడడమే కాకుండా, వీధులన్నీ కోలాహలమయ్యాయి. అంతటా నీళ్లు
చల్లి, అరటి స్థంబాలు కట్టి, ముగ్గులు వేసి,
జనం. మిద్దెల మీద, మేడల
మీద చేరిన తీరును అద్భుతంగా వర్ణించారు వాల్మీకి. దేవాలయాలలోను, నాలుగు వీధులు కలిసే చోటను, వర్తకుల అంగళ్లలోను,
జనులు కూడే చోటను, అన్ని ఇళ్లలోను, జండాలు కట్టారు. నటుల, నర్తకుల, గాయకుల పాటలు చెవుల పండుగగా వినిపించసాగాయి. దాదాపు అన్ని స్థలాలలోను
అలంకారాలు చేయడం జరిగింది.
సరిగ్గా
అప్పుడే రామాయణగాథకు కేంద్ర బిందువైన రాక్షస సంహారానికి ‘అయోధ్య’ అందచందాలు నాంది పలికాయి. దశరథుడి చిన్న భార్య, భరతుడి తల్లి కైకేయి దాసి మంథర చూసిన ‘అయోధ్య’ వీధులను వాల్మీకి, అద్భుతంగా వర్ణిస్తూ, వాటిని,
దుమ్ము లేవకుండా నీళ్లు చల్లి జిమజిమలాడుతూ, నానా రకాల పూలు వినోదంగా వెదజల్లిన, తోరణాలకు
పూల దండలు వ్రేలాడబడినవిగా చెప్పారు. జనులందరూ అభ్యంగన స్నానం చేశారని, ప్రతి ఇంటిమీద ధ్వజపటాలు ఎగురవేయడం జరిగిందని, అయోధ్యలోని
దేవాలయాలన్నీ సున్నం వేయబడి, తెల్లగా ప్రకాశిస్తున్నాయని, ఎక్కడ
చూసినా మంగళ వాద్యాలు మోగుతున్నాయని, సంతోషంతో కూడిన సమస్త
జనులతో వ్యాపించి, బ్రాహ్మణ ఆశీర్వాదాలతో నిండి, బాగా అలంకరించుకున్నట్లు కనిపిస్తున్న అయోధ్యా నగరమని శ్రీరామాయణంలో
వుంది. శ్రీరాముడి పట్టాభిషేక వార్తను మంథర కైకకు వక్రించి చెప్పడం, ఆమె కోరిన వరాల మేరకు తండ్రి ఆజ్ఞాపాలనకు, శ్రీరాముడు, సీతాలక్ష్మణ సమేతంగా అడవులకు పోవడం ఆ తరువాతి కథ.
దీని
పూర్వరంగంలో, మరోమారు ‘అయోధ్యను’
వర్ణించారు (ఆంధ్ర) వాల్మీకి. వశిష్ఠుడు సరయూ నదిలో స్నాన నిత్య కృత్యాలు
తీర్చుకుని, దశరథుడిని కలవడానికి వస్తున్నప్పటి పరిస్థితి
అది. అయోధ్య వచ్చే దారిలో కసవు చిమ్మి, నీళ్లు చల్లి,
రకరకాలుగా అలంకరించి, సంతోషంతో సంచరిస్తున్న
పుర ప్రజలు సకల పదార్థాలను అంగళ్లలో వుంచి, ‘శ్రీరామ
పట్టాభిషేకం, శ్రీరామ పట్టాభిషేకం’ అంటూ పదే పదే పొగుడుకుంటూ, కేరింతలు కొడుతూ, శ్రీగంధం, అగరు
లాంటి ధూప వాసనలు విరజిమ్మే వీధుల్లో వుండడం గమనించాడు వశిష్ఠుడు. ఆ తీరు చూసిన
వశిష్టుడు, దేవతల నగరమైన అమరావతితో సమానంగా అయోధ్య వుందని అనుకున్నాడు. అయోధ్య
ప్రజల అభిమానాన్ని తెలియచేసే ఒక సన్నివేశాన్ని వాల్మీకి. ఆంధ్రవాల్మీకి వర్ణించిన
తీరు ఇది.
అరణ్యాలకు
వెళ్లమని దశరథుడి ఆజ్ఞను తెలుసుకోవడానికి కైక మందిరానికి శ్రీరాముడు పోతున్న సందర్భంలో, అరణ్యాలకు
పోవాలన్న వార్త ఇంకా బయటకు పొక్కని నేపధ్యంలో, ‘అయోధ్య’ పరిస్థితిని చక్కగా వర్ణించారు వాల్మీకి,
ఆంధ్రవాల్మీకి. అగరు వత్తుల ఘుమ, ఘుమ సువాసనలు వీస్తుంటే, తెల్లటి
మబ్బుల లాగా సున్నపు పూతలు పూసిన ఇండ్లతో, అగరు చందనాల
సన్నని పట్టు వలువలతో, స్ఫటికాలు, ముత్యాలు పోసిన రాసులతో,
వివిధ రకాల పిండి వంటలతో నిండి వున్న అంగళ్ల వరుసలతో కూడి వున్న రాచ
మార్గంలో శ్రీరామచంద్రుడు పోతున్నప్పుడు, అక్షింతలతో శ్రీరాముడిని
సంతోషంగా దీవించారని వర్ణించారు.
సీతారామలక్ష్మణులు
రథమెక్కి అరణ్యాలకు పోతుంటే దుఃఖిస్తూ, హాహాకార ధ్వనులతో నిండిన ‘అయోధ్య’ నగరమంతా
జనుల కోలాహలంతో నిండిపోయింది. ‘అయోధ్య’ పురజనులు
అయ్యయ్యో, అయ్యయ్యో, అనుకుంటూ మూర్ఛ
పోయారు. ముసలి వారు బాలురతో సహా, కన్నీళ్లు కార్చుకుంటూ,
శ్రీరాముడి వెంట ఏడ్చుకుంటూ రథం పక్కనే పరుగెత్తసాగారు. రథాన్ని
పట్టుకుని వేళ్లాడారు. తపిస్తూ, విడవకుండా ఏకధారగా
జడివానలాగా కన్నీళ్లు కార్చుకుంటూ, శ్రీరాముడి వెంట పోసాగారు ‘అయోధ్యాపుర’ జనులు. వద్దన్నా వెంట వస్తున్న ప్రజలను తమసానది తీరం చేరిన తరువాత, ఏమరచి అరణ్యాలకు పోయారు సీతారామలక్ష్మణులు. అభిమానాన్ని ఎలా చాటి
చెప్పాలో అలా చేశారు అయోధ్యావాసులు.
తిరిగొచ్చిన
పౌరులకు అయోధ్యానగరమంతా పాడుపడ్డట్లుగా, చంద్రుడు
లేని ఆకాశం లాగా, నీళ్లెండి పోయిన సముద్రం లాగా, అందమే లేకుండా కనపడింది. శవాల్లాగా, వారివారి ఇళ్లకు
పోయి, భార్యా బిడ్దలను పట్టుకుని, రాముడేడీ
అని వాళ్లు ప్రశ్నిస్తుంటే, సిగ్గుతో, శోకంతో,
వెలెవెల బోయిన ముఖాలతో, చేతులు ముడుచుకుని,
ఏం చేద్దామా అని గట్టిగా ఏడ్చారు. ‘అయోధ్య’ పురప్రజల ఆవేదనకు ఇదొక నిదర్శనం. ఈ నేపధ్యంలో దశరథుడు మరణించడం, మేనమామ ఇంట్లో వున్న భరతుడిని రమ్మని కబురు చేయడం,
ఆయన రావడం జరిగింది. నగర ప్రవేశం చేస్తున్నప్పుడు భరతుడు చూసిన ‘అయోధ్య’ ను వర్ణించిన విధానం అద్భుతం.
రథసారథితో
భరతుడు ‘అయోధ్య’ గురించి, ‘నెత్తురులేనివాడి
ముఖంలా, తెల్లగా పాలిపోయిన ‘అయోధ్య’ లో దూరంనుంచే వినిపించే స్త్రీపురుషుల గలగల
ధ్వని దగ్గరకు వచ్చినా వినబడడంలేదు. విలాసంగా ఆడుకునే ఆసక్తిగలవారెవరూ కనబడడంలేదు.
మనుష్య సంచారం లేని అడవిలాగా వున్నది అయోధ్య. వాహనాలపైన ఎవరూ తిరగడం లేదు. తోటలు
కళావిహీనమై, ఉద్యానవనాలలో ఒక్కరైనా కనబడడం లేదు. వీనులకు ఇంపైన పక్షుల ధ్వని
వినబడడం లేదు. కమ్మని గాలి వీయడం లేదు. వీదులవెంట చూస్తుంటే, ఇళ్లల్లో కసుపు
వూడవలేదు, సువాసనకల పొగలు రావడం లేదు, వంటలు లేవు, పూజలు లేవు. ఇళ్లన్నీ
కాంతివిహీనంగా లక్ష్మి తొలగిపోయినట్లుగా వున్నాయి. దేవాలయాలు అలకలేదు. ముగ్గులు
పెట్టలేదు. పూడండలు వేలాడతీయలేదు. వైశ్యులు కొనడం, అమ్మడం లేదు అని అన్నాడు. స్వర్గసమానమైన
‘అయోధ్యానగరం’ దశరథుడి మృతితో (భరతుడికి
ఇంకా తెలియని) మారిన విధానాన్ని వాల్మీకి వర్ణన కలచివేస్తుంది.
అరణ్యాలలో
వున్న శ్రీరాముడిని వెనక్కు వచ్చి రాజ్యపాలన చేయమన్న భరతుడి విజ్ఞప్తిని కాదని, బదులుగా తన పాదుకలను కోరిన భరతుడికి ఇచ్చిన తరువాత, ఆయన ఆనందహీనమైన అయోధ్యాపురి ప్రవేశించిన తరువాత, అప్పటి
‘అయోధ్య’ వర్ణన కూడా వాల్మీకి లేదా ఆంధ్రవాల్మీకి రామాయణం
చదివితేనే అవగతమవుతుంది. ‘సీతారామలక్ష్మణులు లేని అయోధ్యను, పిల్లులు,
గూబలు విస్తారంగా తిరుగుతున్న దానిలాగా, బాధతో కూడుకున్నదిగా, కాంతిహీనమైనదిగా, చిమ్ముచీకట్లు కమ్ముకున్నట్లుగా వర్ణించారు. అప్పటిలాగా శుభకరమైన పాటలు,
మంగళ వాద్యాలు వినబడడం లేదని, ప్రసిద్ధమైన
చందనం వాసనతో, పూలదండల వాసనతో నిండిన మనోహరమైన గాలి వీయడం
లేదని, పల్లకీల మోతలు, ఏనుగుల
ఘీంకారాలు, గుర్రాల సకిలింపులు, రథాల
చప్పుడులు వినపడడం లేదని, ఎవరూ ఆభరణాలు ధరించలేదని, విలాసంగా తిరగడం లేదని, ‘అయోధ్య’ జడివానతో
కమ్ముకున్న శుక్ల పక్ష రాత్రిలాగా వుందని అనుకుంటాడు భరతుడు.’
అలాంటి
‘అయోధ్య’ లో వుండకుండా తక్షణమే భరతుడు నందిగ్రామం చేరి, అక్కడ పావుకోళ్లకు పట్టాభిషేకం చేసి, రాజ్యాన్ని శ్రీరాముడి పక్షాన పాలన చేశాడు. రావణవధ అనంతరం, అరణ్యవాసం ముగిసిన తరువాత, సీతాలక్ష్మణ సమేతంగా
నందిగ్రామం చేరుకున్న శ్రీరాముడికి రాజ్యం అప్పగించాడు. తరువాత,
శ్రీరాముడు అయోధ్యా పురం ప్రవేశించి, అక్కడి రాచబాటల వెంట పయనిస్తున్నప్పుడు,
‘అయోధ్య’ లో నగారా ధ్వనులు, శంఖాల మోతలు, వీణెల ధ్వనులు మోగుతుంటే ఆయన మేడలు, మిద్దెలు
చూసుకుంటూ పోవడాన్ని వర్ణించాడు వాల్మీకి అద్భుతంగా. రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి
జరిగిన ఏర్పాట్లు, సీతారాములను రత్నపీఠం మీద కూర్చోబెట్టి,
వశిష్టాదులు పవిత్ర జలాలతో అభిషేకించడం, ఋత్విజులు, బ్రాహ్మణులు,
కన్యలు, మంత్రులు, యోధులు, వైశ్యులు దివ్యమైన మూలికల రసంతో అభిషేక కార్యక్రమం జరిపించడం, వంశపారంపర్యంగా ధరించే కిరీటాన్ని శ్రీరాముడికి వసిష్టుడు అలంకరించడం, అంతా జరిగింది ఈ ‘అయోధ్య’ లోనే.
రామచంద్రమూర్తి
మనోహరంగా పదకొండు వేల సంవత్సరాలు భూమిని పాలించి నూరు అశ్వమేధ యాగాలు చేసి,
తమ్ములతో, చుట్టాలతో, ఆప్తులతో,
మిత్రులతో కలిసి అనేక విధాలైన యజ్ఞాలు చేసింది అయోధ్యలోనే. ఆయన
రాజ్యం ఏలుతున్నప్పుడు ‘అయోధ్య’ ప్రజలు మనోవేదనలు లేకుండా, స్నేహభావంతో,
కలహించుకోకుండా వుండేవారు. దొంగతనం అంటే
తెలియదు. దారిద్ర్యం అసలే లేదు. రామా! రామా! అని రామచంద్రమూర్తిని సర్వ వేళల
ధ్యానిస్తూ సమస్త జీవకోటి ధర్మ బుద్ధితో సంతోషంగా, సుఖంగా
వుండేది. ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు ఏనోట విన్నా రామశబ్దమే! ఏకథ విన్నా రాముడి
కథే! ప్రపంచం అంతా రామమయం అయింది. వృక్షాలు, ఋతువులు, నియమం లేకుండా సర్వదా పుష్పాలతో, పండ్లతో, కొమ్మలతో కూడి వుండేవి. కరువు భయం లేక సకాలంలో వానలు పడేవి. మహర్షి
వాల్మీకి రామాయణంలో చెప్పిన ‘రామరాజ్యం’ అదే!!
వాల్మీకి
మహర్షి రచించిన రామాయణమే ఆదికావ్యం. వేదార్థం ఇందులో విస్తరించి చెప్పడం జరిగింది.
ఇది పుణ్యం కలిగించి ఆయువును వృద్ధి చేస్తుంది. ఇది మిక్కిలి కీర్తికరం.
శ్రీరాముడు ఏనాడో మరణించాడు కదా! అలాంటివాడు సేవించినవారికి ఎలా సహాయం చేస్తాడని
ప్రశ్నించేవారికి సమాధానం రామాయణంలోనే వుంది. రామచంద్రమూర్తి నారాయణుడు. సమస్త
భూతాలకు స్థానమై సర్వం తానై వుండేవాడు. కాబట్టి ఆనాడున్నాడు, నేడు
లేడని అనకూడదు. సమస్త ప్రపంచానికి ప్రభువైన రాముడు లేకపోతే లోకం అనాయకమౌతుంది.
రామచంద్రమూర్తి లేడంటే భగవంతుడు లేడని అర్థం. అదే రామచంద్రమూర్తి ఈనాడు ‘రామ్
లల్లా’ గా అయోధ్య రామమందిరంలో కొలువు తెరుతున్నాడు.
అయోధ్యలో
నూతనంగా నిర్మించిన చారిత్రాత్మక రామ మందిరంలో, జనవరి 22, 2024
మధ్యాహ్నం 12.20 గంటల శుభముహూర్తాన చారిత్రాత్మక ‘ప్రాణ ప్రతిష్ట వేడుక’
కార్యక్రమానికి ముఖ్య అతిథి సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే. అదే రోజున,
యావత్ భారత దేశ ప్రజలు, వారివారి ఇళ్లల్లో ‘రామజ్యోతి’
వెలిగించి, దీపావళి పండుగలాగా ఆ వేడుకను శోభాయమానంగా జరుపుకుంటున్నారు.
‘శ్రీరామజన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్’ సభ్యులు, పారదర్శకంగా ఎంపికచేసిన,
ఐదేళ్ల వయసు పోలిన 51 అంగుళాల ‘రామ్ లల్లా విగ్రహానికి’ ప్రాణశక్తిని ఆవాహన చేసే ‘ప్రాణప్రతిష్ట
వేడుక’ను, ఆలయ ఆచారానికి, సాంప్రదాయానికి అనుగుణంగా
నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ సందర్భంగా జనవరి 16 న
ప్రారంభమై, ఏడు రోజులపాటు నిర్విరామంగా సాంప్రదాయ, ఆచార
బద్ధమైన పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వీటికి పూర్వరంగంలో, ట్రస్ట్ కార్యదర్శి చంపట్ రాయ్ పవిత్ర
అక్షతల పంపిణీ కార్యక్రమానికి ఆంగ్ల నూతన సంవత్సరంనాడు లాంఛనంగా శ్రీకారం చుట్టారు.
ఆధునిక భారతదేశ చరిత్రలో
‘అయోధ్య వివాదం’ వివిధ న్యాయ స్థానాలలో ఒక ప్రాధాన్యతను
సంతరించుకున్నది. అయోధ్యలోని ఒక ప్రాచీన కట్టడంలో వున్న వివాదాస్పద స్థలంలోనే
శ్రీరాముడు జన్మించాడని, అదే ఆయన జన్మభూమని, అక్కడొక రామాలయం వుండేదని, దాన్ని 1528 లో బాబర్
కూలగొట్టించి బాబ్రీ మసీదు నిర్మించాడని అందువల్ల ఆ స్థలంపై హక్కు తమదేనని హిందువులు
న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వివాదానికి స్వస్తివాక్యం పలుకుతూ, నవంబర్ 9,
2019 న ఐదుగురు సభ్యులున్న సుప్రీంకోర్ట్ ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఇచ్చిన ఆదేశంలో,
అయోధ్యలో వివాదాస్పద స్థలంలో ‘రామ్ మందిర్ దేవాలయం’
నిర్మించడానికి ట్రస్ట్ ను, ధర్మకర్తల మండలిని ఏర్పాటుచేయమని
చేయమని చెప్పింది.
ఆలయాన్ని నిర్మించేందుకు 2.77 ఎకరాల
వివాదాస్పద భూమిని హిందువుల ఆరాధ్య దైవం, సాక్షాత్తు భగవత్ స్వరూపుడు, కోర్ట్ న్యాయశాస్త్ర వ్యక్తిగా గుర్తించిన ‘రామ్ లల్లా విరాజ్మాన్’ కు అప్పగించాలని
కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. 2010 అలహాబాద్ హైకోర్టు తీర్పులో పేర్కొన్నట్లు, వివాదాస్పద
భూమి విభజన సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు, అయోధ్యలో ‘రామ్ మందిర్ దేవాలయం’ నిర్మించడానికి,
ఫిబ్రవరి 5, 2020 న, 15 మంది సభ్యులతో కూడిన ధర్మకర్తల
మండలిని ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. నిర్మాణానికి అవసరమయ్యే అంచనా
వ్యయమైన రు 18,000 కోట్లను ప్రజల నుండి విరాళాలుగా
సేకరిస్తున్నారు ట్రస్ట్ సభ్యులు. మొట్టమొదటి విరాళంగా కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి
ఇచ్చింది.
ఆగస్ట్ 5, 2020 న ప్రధాన మంత్రి
మోడీ భూమిపూజ చేసి ఆలయ పునాదిరాయి వేశారు. డిజైన్ మార్పువల్ల నిర్మిస్తున్న ‘రామ్
మందిర్ దేవాలయం’ మొదట్లో అనుకున్న దానికంటే
రెండింతలవుతున్నది. ట్రస్ట్ కు కేటాయించిన 70 ఎకరాల భూమి మీద
2.77 ఎకరాల స్థలంలో రామ్ లల్లా కేంద్ర బిందువుగా నిర్మిస్తున్న ప్రధాన దేవాలయంతో
సహా అనేక ఆలయాల నిర్మాణం జరుగుతున్నది. అష్టభుజ ఆకారపు గర్భగుడి, వృత్తాకార
చుట్టుకొలతల నిర్మాణాలు కూడా అక్కడ వుండబోతున్నాయి. ఆలయం నాలుగు మూలల గోడతో
చుట్టబడిన 750 మీటర్ల విస్తీర్ణం కలిగిన ప్రాకారం
కలిగివుంటుంది. భక్తులు ధ్యానం చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లున్నాయి.
‘రామ్ మందిర్ దేవాలయం’
నిర్మాణానికి, అసాధారణ రీతిలో, ద్విగ్విజయంగా పరిపూర్ణ కృషి
చేసిన వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోడీని, నిర్ద్వందంగా,
యావత్తు హిందు సమాజానికి చెందిన ఆబాలగోపాలం, ఆసేతు హిమాచలం,
ఎప్పటికీ విధేయతతో జ్ఞాపకం వుంచుకుంటుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే, ఆలయాన్ని కట్టాలని గుండె లోతుల్లోంచి భావించినా, కట్టలేకపోయిన మాజీ
ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావుకు, అయోధ్య వివాదాస్పద
కేసును విజయవంతంగా వాదించిన సీనియర్ అడ్వకేట్, 96ఏళ్ల పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత
కె పరాశరన్ కు, 1949 లోనే నెహ్రూ
ఆదేశాలనుకాదని రామజన్మభూమిలో పూజలు చేసుకోవడానికి హిందువులకు హక్కు కల్పించిన,
నాటి ఫైజాబాద్ కలక్టర్, ఐసీఎస్ అధికారి, స్వర్గీయ కేకే నాయర్ కు కూడా ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు
హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియచేయడం కనీస ధర్మం.
(ఆంధ్రవాల్మీకి
వావిలికొలను సుబ్బారావు ‘ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
No comments:
Post a Comment