హయస్థానపురం (హ్యూస్టన్) నెలనెలా వెన్నెల
(ఆగస్ట్ 22, 2026)
వాల్మీకి రామాయణంలో తెలిసిన,
తెలుసుకోవాల్సిన అంశాలు
ప్రసంగ సారాంశం: వనం జ్వాలా నరసింహారావు
హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (TCA) ఆధ్వర్యంలో సుదీర్ఘ కాలంగా సాగుతున్న అక్షర యజ్ఞం 'తెలుగు వెన్నెల'.
2009 సంవత్సరంలో (సుమారు 17 సంవత్సరాల క్రితం) ప్రారంభించిన
తొలి ఏడాదే నాకు పాల్గొనే అవకాశం కల్పించారు నిర్వాహకులు. అమెరికా, హ్యూస్టన్ వెళ్ళినప్పుడల్లా నేను తప్పక పాల్గొనే కార్యక్రమం
ఇది. ఆ క్రమంలోనే, 2026 ఆగస్ట్ 22,
శనివారం నాడు నిర్వహించిన 172వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు నాకు ఒక మధురమైన జ్ఞాపకాన్ని, అపురూపమైన గౌరవాన్ని కలిగించింది మరో పర్యాయం. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి
నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి, ‘వాల్మీకి రామాయణంలో
కొన్ని ఆసక్తికరమైన అంశాలు అనే అద్భుతమైన విషయంపై (నా సూచన మేరకు కూడా)
ప్రసంగించమని కోరడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.
తెలుగు వెన్నెల బృందం అందించిన ఈ
ఆహ్వానాన్ని అత్యంత గౌరవంగా స్వీకరిస్తూ, షుగర్ లాండ్ లోని
ఆత్మీయులు సాయి రాచకొండ గారి నివాసంలో ఏర్పాటు చేసిన సుందర వేదికపై, సాహితీ ప్రియుల సమక్షంలో దాదాపు గంటసేపు నా భావాలను పంచుకునే భాగ్యం నాకు
లభించింది. సాహితీ ఆతిథ్యమే కాకుండా, సాయి
రాచకొండ దంపతుల ‘చక్కటి రుచికరమైన, కాఫీతో కూడిన ఆహార పదార్ధాలతో’ ఆత్మీయ ఆతిథ్యం
చిరకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం.
ఈ వేడుక కేవలం ఒక సాహిత్య ప్రసంగంగా
కాకుండా,
మా కుటుంబానికి ఒక చిరస్మరణీయమైన పండుగలా సాగింది. నా ఈ
సాహిత్య యాత్రలో నా అర్ధాంగి విజయలక్ష్మి, నా ఇద్దరు కూతుళ్లు ప్రేమ, కిన్నెర కూడా నాతో పాటు పాల్గొని సభలో భాగస్వాములు కావడం అదనపు సంతోషాన్ని ఇచ్చింది.
ఈ సభ విజయవంతం కావడానికి,
నాకు ఈ విశిష్టమైన అవకాశం లభించడానికి ముఖ్య కారకులు
మిత్రులు సుధేష్ పిల్లుట్ల గారు. స్వయంగా శ్రీ వాల్మీకి రామాయణం అంశాలమీద అమోఘమైన అవగాహన
వున్న పరిశోధనాత్మక సాహిత్యాభిలాషి. వారి ప్రత్యేక చొరవ, సాహిత్యం పట్ల వారికి వున్న అపారమైన అనురాగమే నన్ను ఈ వేదికపై నిలబెట్టాయి.
హ్యూస్టన్ నగరంలోని ప్రసిద్ధ సాహితీ మూర్తులు, మేధావులు ఈ సదస్సుకు
హాజరై సభకు ఎంతో శోభను చేకూర్చారు.
తెలుగు వెన్నెల బృందం సభ్యులతో పాటు
సుధేష్ దంపతులు,
ఆతిథ్యమిచ్చిన సాయి రాచకొండ దంపతులు, ప్రవాసాంధ్ర సాహిత్య లోకంలో చిరపరిచితులైన వంగూరి చిట్టెన్ రాజు గారు, చిలుకూరి సత్యదేవ్ గారు, పాలపర్తి ఇంద్రాణి గారు, కాకాని గారు,
మానస-రావుగారు దంపతులు, సోనాలి ఆమె (వయో
వృద్ధులైన) తల్లిదండ్రులు,
ఉన్నవ వీణ గారు, నూతలపాటి సుగుణ గారు, సీతారాం గారు మరియు ఎందరో ఇతర ప్రముఖులు ఈ సభలో ఆశీనులై నన్ను ఎంతగానో
ప్రోత్సహించారు. నా ప్రసంగం తరువాత చిలుకూరి సత్యదేవ్ గారు తన రామాయణ పద్యాలతో
సభను ఆహ్లాదపరిచారు. పాలపర్తి ఇంద్రాణి గారు శ్రీశ్రీ స్థాయి కవితను అద్భుతంగా
చదివి శ్రోతల అభిమానాన్ని చూరగొన్నారు.
సభ అంతటా నిండిన ఆత్మీయత, రామాయణ గాథపై వారికున్న జిజ్ఞాస నా ప్రసంగాన్ని మరింత ఉత్సాహంగా సాగించేలా
చేశాయి. వాల్మీకి రామాయణం మనకు కేవలం తెలిసిన కథ మాత్రమే కాదు. తరతరాలుగా వింటూ, చదువుతూ వచ్చిన ఆ కథలో మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, సూక్ష్మమైన భావాలు,
జీవితానికి పనికొచ్చే విలువైన సందేశాలు దాగి ఉన్నాయి.
లోతుగా పరిశీలిస్తే కొత్త అర్థాలతో మన ముందుకు వస్తాయి. శ్రీరాముడి వ్యక్తిత్వం, ఆయన ఆచరించిన సామాన్య ధర్మం, విశిష్ట ధర్మం, రాజధర్మం,
కుటుంబ బాధ్యతలు, స్నేహం, నాయకత్వం,
పరిపాలన, కర్తవ్యనిష్ఠ వంటి ఎన్నో
అంశాలను వాల్మీకి మహర్షి కథలో భాగంగానే మనకు పరిచయం చేశాడు.
రాముడు, సీత, లక్ష్మణుడు,
భరతుడు, హనుమంతుడు, సుగ్రీవుడు,
మంధర, శూర్ఫనక, రావణుడు,
అంగదుడు, వంటి పాత్రల మాటల్లోనూ, ప్రవర్తనలోనూ మనిషి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఎన్నో కోణాలు
కనిపిస్తాయి. వాల్మీకి చెప్పిన ప్రతి విషయానికీ ఒకే అర్థం ఉండాలని లేదు. ఒక
సందర్భంలో చెప్పిన మాటకు మరో సందర్భంలో మరింత లోతైన అర్థం తరతరాలకు దార్శినికంగా అన్వయించుకోవచ్చు.
కొన్ని విషయాలు ధర్మాన్ని చెబుతాయి.
కొన్ని నాయకత్వాన్ని నేర్పుతాయి. కొన్ని మానవ స్వభావాన్ని అద్దంలా చూపిస్తాయి.
మరికొన్ని మనం ఈ రోజున జీవిస్తున్న సమాజాన్ని గుర్తు చేస్తాయి. అందుకే రామాయణాన్ని
కేవలం గతానికి సంబంధించిన మహాకావ్యంగా కాకుండా, మన జీవితాన్ని అర్థం
చేసుకోవడానికి ఉపయోగపడే శాశ్వత గ్రంథంగా చూడవచ్చు. ఈ కోణంలో చూస్తే రామాయణం
మరోసారి మన ముందుకు కొత్తగా తెరుచుకుంటుంది. కథ తెలిసినదే కావచ్చు, కానీ అందులోని కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినవే. ఎవరికైనా, ఎవరైనా, ఏదైనా
చెప్పే ముందు,
దాన్ని నిష్కపటంగా, నిర్మొహమాటంగా ఆచరించి
చూపాలి. ఈ మానవతా సూత్రాలకు తొలి, అత్యున్నత ఉదాహరణ
శ్రీరాముడే.
తన కర్తవ్యాన్ని శ్రీరాముడు ఏనాడూ
వదులుకోలేదు. ఆయనను విమర్శించినవారీతో సహా శ్రీరాముడి కర్తవ్యనిష్ఠను మాత్రం ఎవరూ
తప్పుపట్టలేకపోయారు. తన సుఖం కంటే సమాజ సుఖానికి, తన అభిప్రాయం కంటే ధర్మానికి, విమర్శల కంటే
కర్తవ్యానికి ప్రాధాన్యమిచ్చిన శ్రీరాముడి జీవితం అందుకే యుగాలు మారినా ఆదర్శంగా
నిలిచింది. వాల్మీకి రామాయణం ఒక సత్యచరిత్ర అని, అందులో జరిగిన విషయాలను జరిగినట్లుగానే వాల్మీకి మహర్షి చెప్పారని పలువురు
అంగీకరించారు. వాల్మీకి మహర్షి ఒకసారి నారదుడిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, నారదుడు శ్రీరాముడిలో ఉన్న పదహారు విశిష్ట గుణాలను వివరించాడు. ఇవి కేవలం
శ్రీరాముడిని గొప్పవాడిగా చెప్పడానికి వాల్మీకి ఉద్దేశించిన విశేషణాలు మాత్రమే
కావు. ఒక మనిషి తన జీవితాన్ని ఏ విలువలతో తీర్చిదిద్దుకోవాలో సూచించే లక్షణాలుగా
వీటిని చూడాలి.
విశ్వామిత్రుడు అడిగినది ఏదైనా
చేస్తానని, యాగరక్షణ కోసం తన వెంట శ్రీరాముడిని పంపమని
ఆయనకోరినప్పుడు,
నిరాకరించిన దశరథుడికి వశిష్ఠుడు నచ్చచెప్తాడు. ఇచ్చిన
మాటను ఎలాగైనా నిలబెట్టుకోవాలనే ధర్మసూక్ష్మాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. రాముడిని,
లక్ష్మణుడిని విశ్వామిత్రుడి వెంట యాగరక్షణకు పంపుతాడు. శ్రీరామచంద్రమూర్తి అవతార
కార్యం ఒక స్త్రీ (తాటక) వధతోనే ప్రారంభమవుతుంది. స్వధర్మాన్ని నిర్వర్తించాలంటే
ఒక స్త్రీని చంపవచ్చా అని రాముడు శంకించినప్పుడు, విశ్వామిత్రుడు రాముడికి ధర్మసూక్ష్మాన్ని వివరించాడు. అహల్యా శాపవిమోచనం
గురించి (నాతిని రాతిగ చేసి) ఎన్నో వక్రభాష్యాలు ప్రచారంలోకి వచ్చాయి. భర్త గౌతముడు
ఆమె చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా, అనేక సంవత్సరాలు గాలినే
ఆహారంగా తీసుకుంటూ,
అన్నపానీయాలు లేకుండా, ఆశ్రమంలో బూడిదలో పడి, ఎవరికీ కనిపించకుండా తాపంతో కఠినమైన జీవితం గడపాలని శపించాడు కాని శిలగా
మారమని కానేకాదు. శ్రీరాముడు రాగానే శాప విమోచనం కలిగింది.
ఘోరమైన తపస్సు చేసిన విశ్వామిత్రుడికి
బ్రాహ్మణత్వం లభించిందని బ్రహ్మ ప్రకటించినా, వశిష్ఠుడు స్వయంగా వచ్చి
తనకు బ్రాహ్మణ్యం లభించిందని అంగీకరించిన తరువాతే ఆయనకు నమ్మకం కలిగింది. ఇక్కడ
విశ్వామిత్రుడు బ్రహ్మ మాట కంటే బ్రహ్మర్షి వశిష్ఠుడి మాటకే ఎక్కువ విలువ ఇచ్చాడు.
ఎన్నో తపస్సులు చేసినా,
కోపాన్ని జయించనంతవరకు తపస్సు సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వదని
విశ్వామిత్రుడి జీవితం తెలియజేస్తుంది. బ్రాహ్మణ్యం అంటే కేవలం ఒక జన్మతో వచ్చే
స్థితి కాదు;
కామక్రోధాలను జయించి, వాటిని తనకు వశం
చేసుకున్న జీవన విధానం. కామం, క్రోధం వంటి సహజమైన
బలాలను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నవాడే నిజమైన బ్రాహ్మణోత్తముడు.
శ్రీరాముడిని యువరాజుగా చేయడానికి దశరథుడు
తనకా అధికారం ఉన్నప్పటికీ, పౌరులను, పెద్దలను,
రాజులను సంప్రదించి వారి అంగీకారం ఒకటికి రెండు సార్లు తీసుకున్నాడు.
విశేషమేమిటంటే,
రాముడి పట్టాభిషేకాన్ని చెడగొట్టడానికి కైకేయిని
ప్రేరేపించిన మంథర కూడా రాజధర్మాన్నే తన వాదనకు ఆధారంగా చేసుకుంటుంది. రాజనీతి
వేశ్యానీతితో సమానమని కూడా అంటుంది; అంటే, రాజధర్మాన్ని రాజుతోనే కాకుండా ఒక దాసితో కూడా మాట్లాడిస్తాడు మహర్షి వాల్మీకి.
అరణ్యవాసానికి వెళ్లాల్సిన వార్తను శ్రీరాముడు లక్ష్మణ, కౌసల్యలకు వివరిస్తూ,
తండ్రి మాటను నిలబెట్టుకోవడం తన ధర్మమని చెప్పాడు. రాజనీతి
అంతా ధర్మం కాదు గానీ ధర్మమంతా రాజనీతి అవుతుందని, ధర్మం,
కర్మం రెండూ అచేతనమైనవేనని, వాటికంటే మించిన దైవశక్తి ఒకటి ఉందని చెబుతాడు. తన పట్టాభిషేకానికి విఘ్నం
కలిగించింది కైకేయి వ్యక్తిగత ద్వేషం కాదని, ఇదంతా విధి చేష్టేనని
భావిస్తాడు.
అరణ్యవాసంలో కోసల సరిహద్దు
దాటేటప్పుడు ఆనవాయితీ కాగా,
రాముడు అయోధ్య వైపు తిరిగి గ్రామదేవతలను ప్రార్థించాడు.
భగవంతుని అవతారమైన రాముడు నదులకు, వృక్షాలకు నమస్కరించడం ద్వారా, లోకంలో ఒక శిష్టాచారాన్ని స్థాపించడానికి మార్గం చూపాడు. అలాగే, గంగానదిని, యమునానదిని
దాటుతున్నప్పుడు సీత చేతులు జోడించి భక్తితో ప్రార్థిస్తూ, వనవాసం పూర్తిచేసుకుని సుఖంగా తిరిగి వచ్చేలా అనుగ్రహిస్తే ఆవులను దానం
చేస్తానని,
కల్లు కుండలను సమర్పిస్తానని వేడుకుంది. హిందూ సంప్రదాయంలో
నమస్కారం బాహ్యరూపానికి కాదు; అంతర్యామిగా ఉన్న ఈశ్వర
తత్త్వానికి. సర్వప్రకృతిలోనూ దైవాన్ని దర్శించే భారతీయ సంస్కృతికి ప్రత్యక్ష
ఉదాహరణ.
మొదట్లో, అరణ్యంలో ప్రయాణించే క్రమంలో లక్ష్మణుడు ముందు, అతని వెనుక సీత,
ఆమె వెనుక రాముడు నడిచారు. ఇందులో ఒక తాత్త్విక అంతరార్థం
ఉంది.
సీత అనే ప్రకృతిని (దేహాన్ని) ముందుంచి, లక్ష్మణుడు అనే జీవుడు అనుసరిస్తే అపాయం తప్పదని. కాబట్టి చేతనుడైన జీవుడు ముందుకు సాగి, ప్రకృతి రూపమైన దేహాన్ని
తన వెంట నడిపించుకోవాలి. రాముడు ఇద్దరినీ రక్షిస్తూ వెనుక రావడం ప్రకృతిని, జీవుడిని రక్షించేవాడు ఈశ్వరుడే అనే సత్యానికి ప్రతీక. తర్వాత, దండకారణ్యంలో శ్రీరాముడు ముందు, మునులు ఆయన వెంట నడిచారు.
ఇక్కడ జీవుడైన లక్ష్మణుడికి, పరమాత్మ అయిన రాముడికి
మధ్యలో సీత అనే ప్రకృతి ఒక తెరలా ఉన్నందున, ఆ తెర తొలగాలంటే రాముడికీ
సీతకూ సేవ (కైంకర్యం) చేయాలనే తాత్త్విక భావాన్ని ఋషులు గ్రహించారు.
భరతుడు అరణ్యానికి వచ్చి రాముడిని అయోధ్యకు
తిరిగి రమ్మని వేడుకున్నప్పుడు రాముడు భరతుడికి రాజధర్మాన్ని బోధించాడు. రాజ్యపాలన
అనేది రాజు ఒక్కడి చేతిలో జరిగే వ్యవహారం కాదని, వివిధ బాధ్యతలను సమర్థులైన వ్యక్తులకు అప్పగించి ధర్మబద్ధమైన వ్యవస్థ ద్వారా
ప్రజలను పాలించడమే రాజధర్మమని స్పష్టం చేశాడు. ఇంతటి రాజధర్మాన్ని బోధించిన
శ్రీరాముడు తండ్రి మాట కోసం తనకు వచ్చిన రాజ్యాన్ని త్యజించడం ఆయన ధర్మనిష్ఠలోని
ప్రత్యేకత. జాబాలి రాముడి ఆలోచనను తీవ్రంగా విమర్శిస్తూ, భౌతికవాద దృష్టితో పట్టాభిషేకం చేసుకోమని సలహా ఇచ్చాడు. సర్వజగత్తుకూ సత్యమే
ఆధారమని రాముడు ఘాటుగా సమాధానమివ్వగా, జాబాలి తాను నాస్తికుడిని
కాదని, రాముడు రాజ్యాన్ని స్వీకరించేలా చేయడానికే సందర్భానుసారం ఆ వాదాన్ని
వినిపించానని స్పష్టం చేశాడు. అందరూ అనుకున్నట్లు జాబాలి నాస్తికుడు కాదనేది
వాల్మీకే స్పష్టం చేశాడు.
పంచవటి గోదావరీ నది తీరంలోనే ఉందనే
విషయం వాల్మీకి రామాయణంలోని వివరాల బట్టి నిర్వివాదాంశం. శూర్పణఖ రావణుడి కొలువుకు
వెళ్లి చేసిన ఆగ్రహం వెనుక కేవలం అవమానమే కాదు, రావణుడి క్షీణిస్తున్న
పాలనను, నాయకత్వ వైఫల్యాన్ని ప్రశ్నించే రాజధర్మ విమర్శ కూడా ఉంది. పాలకుడి వ్యక్తిగత
స్వభావం ఎలా ఉంటుందో రాజ్యం కూడా చివరకు అలాంటి దిశలోనే పయనిస్తుంది అనే సత్యాన్ని
వాల్మీకి ఇక్కడ చూపించాడు. శూర్ఫనక ద్వారా పాలన గురించి, నాయకత్త్వ లక్షణాలను గురించి,
వ్యక్తిత్త్వ వికాసాన్ని గురించి అద్భుతంగా చెప్పిస్తాడు.
జింక రూపంలో ఉన్న మారీచుడు చనిపోతూ 'హా! సీతా! హా! లక్ష్మణా!' అని అరిచినప్పుడు, సీత లక్ష్మణుడిని పంపించడానికి పరుషంగా మాట్లాడింది. రావణ సంహారం జరగాలంటే ఆమె
లంకకు వెళ్లాలి,
రామలక్ష్మణులు ఇద్దరూ ఉంటే రావణుడికి అవకాశం ఉండదు కాబట్టి, లక్ష్మణుడు వెళ్లేంతటి పరిస్థితి రావడానికి అతనిపై నిందలు వేయడం తప్ప మరో
మార్గం లేదని సీతకు తెలుసన్న భావనను ఇందులో చూడవచ్చు. గమనించదగ్గ విషయం ఏమిటంటే
లక్ష్మణుడు వెళ్తూ సీత చుట్టూ ఎలాంటి 'లక్ష్మణరేఖ' గీయలేదు,
వాల్మీకి రామాయణంలో లక్ష్మణరేఖ ప్రస్తావనే లేదు.
రావణుడు ఎడమ చేత్తో సీత తలవెంటుకలను, కుడిచేత్తో ఆమె తొడలను పట్టుకుని బలవంతంగా అపహరించాడు. వాల్మీకి రామాయణంలో రావణుడు సీతను తాకి అపహరించినట్లు స్పష్టమైన వచనాలు
ఉన్నాయి. రామ-సుగ్రీవుల మధ్య కుదిరిన స్నేహం అపురూపమైన స్నేహానికి పర్యాయపదం అనాలి.
వాలి వధ, రాముడి ధర్మ వచనాలు,
సుగ్రీవుడి పట్టాభిషేకం, తరువాత రాముడికి ‘ఇచ్చిన మాట’
ప్రకారం సీతాన్వేషణకు వానర వీరులను పంపే ముందు సుగ్రీవుడు నలుదిక్కులలోని దేశాలు, నదులు,
పర్వతాలు, చివరకు చేరగలిగే
సరిహద్దులను ఒక్కొక్కటిగా వివరించాడు. గూగుల్ మ్యాప్స్, GPS లకు తొలి మెట్టుగా వున్న ఈ ప్రాచీన భౌగోళిక విజ్ఞానం వశిష్టుడి విశిష్ట
మేధోసంపదకు నిదర్శనం.
అన్వేషణ గడువు ముగిసి తిరుగుబాటు
చేయాలనుకున్న అంగదుడిని హనుమంతుడు తన అపారమైన బుద్ధికుశలతతో, సామ-దాన-భేద-దండోపాయాలను ప్రయోగించి వానర రాజ్య సమైక్యతను కాపాడాడు. అశోకవనాన్ని
హనుమంతుడు ధ్వంసం చేసిన తరువాత రావణుడు ఒకేసారి పెద్ద సైన్యాన్ని పంపకుండా
కింకరులు,
మంత్రుల పుత్రులు, సర్వసైన్యాధ్యక్షులు, చివరకు అక్షకుమారుడిని దశలవారీగా పంపుతూ క్రమబద్ధమైన సైనిక వ్యూహాన్ని, సంక్షోభ నిర్వహణను చూపించాడు. అయితే దాని వెనుక ఉన్న నిర్ణయం అన్యాయంపై
ఆధారపడటం వల్ల ఆ వ్యూహం విఫలమైంది.
హనుమంతుడు అసాధ్యమైన రామకార్యాన్ని
ముగించి వచ్చినప్పుడు శ్రీరాముడి ముందు తన పరాక్రమాన్ని వివరించకుండా, సీతమ్మ క్షేమాన్ని కేవలం 'నియత- ప్రాణయుక్త-దేవి' అనే మూడు మాటల్లోనే తెలియజేసి తన అపారమైన వినయాన్ని చాటుకున్నాడు. సముద్రాన్ని
దాటేందుకు మార్గం చూపమని రాముడు ప్రార్థించినా సముద్రుడు ప్రత్యక్షం కానప్పుడు
రాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించదమంటే, అవసరమైనప్పుడు దండోపాయం రాజధర్మం అని అర్థం చేసుకోవాలి. విభీషణుడి రామపక్షం
చేరడమంటే,
అధర్మానికి దూరంగా ఉండి ధర్మాన్ని ఆశ్రయించడానికి చేసిన
నిర్ణయమే.
లక్ష్మణుడు యుద్ధంలో మూర్ఛపడిన
సందర్భంలో సుషేణుడు సంజీవకరణి మూలికల అవసరాన్ని చెప్పగా హనుమంతుడు దానిని తెచ్చాడు.
లక్ష్మణుడు మూర్ఛపడి ప్రాణాపాయస్థితికి చేరిన సందర్భంగా చూడాలి తప్ప చనిపోయినట్లు
కాదు. రావణవధకు ముందు విభీషణుడు అతడి మరణ రహస్యాన్ని (ఇంటిగుట్టు లంకకు చేటు) రాముడికి
చెప్పాడనే ప్రసిద్ధ కథనానికి వాల్మీకి రామాయణంలో ఎలాంటి ఆధారం లేదు. రాముడు సంధించిన బ్రహ్మాస్త్రమే నేరుగా రావణుడిని సంహరించింది. రావణవధ అనంతరం
సీత అగ్నిప్రవేశం చేయడం రాముడి ఆజ్ఞ వల్ల కాదు. సీతాదేవి స్వయంగా తన పవిత్రతను లోకసాక్షిగా ప్రకటించుకోవడానికి ఎంచుకున్న
స్వీయ నిర్ణయం.
చివరగా అయోధ్యలో వశిష్ఠుడి ఆధ్వర్యంలో
శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రాముడికి
వంశపారంపర్యంగా వచ్చే దివ్య కిరీటాన్ని వశిష్టుడు ధరింప చేయగా, సీతాదేవి తన మెడలోని ముత్యాల హారాన్ని భర్త అనుమతితో హనుమంతుడి మంచి బుద్ధి
పరాక్రమాలకు గౌరవంగా బహుకరించింది. రామాయణ పఠనం సర్వదుఃఖాలను హరిస్తుందని ఫలశ్రుతి
చెబుతోంది.
నా ప్రసంగం అనంతరం, నేను చెప్పినదానికంటే గొప్పగా కార్యక్రమంలో పాల్గొన్న పలువురు, అద్భుతమైన వివరణలు ఇవ్వడంతో, నాకు ఈ సమావేశం
‘రామాయణంలో నేను తెలుసుకోవాల్సిన అంశాలు’గా వుండడం మరో అదృష్టం.
(సుధేష్ పిల్లుట్ల గారికి ప్రత్యేక
ధన్యవాదాలు. వారు ఆహ్వాన పత్రికలో ఇలా...ఇలా... నాగురించి రాయడం: ‘ఈసారి వెన్నెల
కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేస్తున్న ప్రముఖ సాహితీవేత్త, పాత్రికేయులు శ్రీ వనం జ్వాలా నరసింహరావుగారు, వాసుదాసు స్వామి రచించిన తెలుగు రామాయణాన్ని సరళమైన ఆంగ్లంలోకి యథాతథంగా
అనువదించారు. ఈ అనువాద ప్రక్రియలో తాను గ్రహించిన, మనకు తెలియని,
తెలుసుకోవలసిన ఆసక్తికరమైన ఎన్నో విషయాలను ఆయన మనతో
పంచుకోనున్నారు.’ నాకంటే, అది వారి గొప్పదనమని అనాలి.
అలాగే వాసుదాసుగారిని అద్భుతంగా పరిచయం చేశారు ఇలా: శ్రీ వావిలికొలను సుబ్బారావుగారు ‘ఆంధ్ర వాల్మీకిగా ప్రసిద్ధి పొందిన మహానుభావులు. సంస్కృత, తెలుగు పండితులు, రామభక్తులు, గ్రాంథికవాదులు, రచయితలు, సంపాదకులు. హఠయోగం నుంచి భక్తియోగం వైపు సాగిన ఆయన అంతర్ముఖ పరివర్తన, ఆయనను ‘ఆంధ్ర వాల్మీకి’గా, ‘వాసుదాసు స్వామిగా, అభినవ రామదాసుగా నిలబెట్టింది. వాల్మీకి రామాయణంలోని 24,000 శ్లోకాలనూ తెలుగులో పద్యరూపంలోకి అనువదించారు. యథా వాల్మీక రామాయణము అనే ఈ గ్రంథం, మూల సంస్కృత రామాయణానికి అత్యంత నిష్ఠతో చేసిన అనువాదం. దీనిని ఆయన ఒంటిమిట్ట శ్రీరామచంద్రునికి అంకితం చేశారు.’


హయస్థాన పురం - 🤔 ఎవరూ కనిపెట్టక పోతే కొత్త పదాలు ఎలా పుడతాయి.
ReplyDelete