Sunday, November 8, 2020

సంక్షిప్త రామాయణం సమాప్తం .... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-30 : వనం జ్వాలా నరసింహారావు

 సంక్షిప్త రామాయణం సమాప్తం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-30

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (09-11-2020)

రామాయణ పఠనంవల్ల ఇహపర లోకాల్లో సౌఖ్యంకలిగే విషయాన్ని నారదుడు చెప్తాడీవిధంగా: "రామాయణం పరిశుద్ధంగా చదివేవారికి, వినేవారికి మూడు విధాలైన సమస్త పాపాలు హరించి పోయి, ఏమాత్రం ఆలస్యం లేకుండా మోక్ష ఫలం కలుగుతుంది. అంతశక్తి దీనికుండటానికి కారణం, ఇది వేద స్వరూపమై, వేదార్థాన్నే బోధిస్తుంది కాబట్టి. అంతేకాదు, సంసార సాగరాన్ని తరింపచేస్తుంది కూడా. ఇది వినేవారు-చదివేవారు, అంతమాత్రాన సన్యాసులు కానవసరం లేదు. ఆయుస్సు పెరిగి, కొడుకులు-కూతుళ్లతో, మనుమలు-ఇష్ట బంధువులతో అనుభవించి, మరణించిన తర్వాత మోక్షాన్ని-బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. పరిమితి చెప్పనలవికాని మహత్త్వమున్న యీ రామాయణ గ్రంథాన్ని శాస్త్ర ప్రకారం చదివినా, ఇతరులు చదవగా విన్నా, అర్థ విచారం చేసినా, బ్రాహ్మణుడికి వేద వేదాంగాలు అధ్యయనం చేస్తే ఎలాంటి ఫలం కలుగుతుందో అలాంటిదే కలుగుతుంది. క్షత్రియుడికి సర్వాధిపత్యం కలుగుతుంది. వైశ్యుడికి వ్యాపార లాభం కలుగుతుంది. శూద్రుడికి అపారమైన గొప్పతనం లభిస్తుంది. కాబట్టి నాలుగువర్ణాలవారు, స్త్రీ-పురుషులు, దీన్ని చదవాలి-వినాలి. విషయ చింతన చేయాలి. వినేవారుంటే చదివి వినిపించాలి. చదివేవారుంటే వినాలి. ఈ రెండూ జరగని కాలముంటే, విన్నదానిని-కన్నదానిని, విశేషంగా మననం చేయాలి. ఏదోవిధంగా మనస్సు దీనిపై నిలపాలి".

         (ఇక్కడితో సంక్షిప్త రామాయణం సమాప్తం. దీనిని బాల రామాయణం అని కూడా అంటారు. ఇదే సంస్కృతంలో ప్రధమ సర్గ. ఈ సర్గ మొదటి శ్లోకంలో, మొదటి అక్షరం "త" కారం తో మొదలవుతుంది. ఇది గాయత్రి మంత్రంలోని మొదటి అక్షరం. కడపటి శ్లోకంలోని కడపటి అక్షరం "యాత్". గాయత్రి మంత్రం లోని కడపటి అక్షరమూ ఇదే. గాయత్రిలోని ఆద్యంతక్షరాలు చెప్పడంతో ఈ సర్గ గాయత్రి సంపుటితమని తెలుస్తున్నది. ఈ నియమం ప్రకారమే వాల్మీకి వేయి గ్రంథాలకు మొదట ఒక్కొక్క గాయత్రి అక్షరాన్ని వుంచడంతో 24,000 గ్రంథమయింది. 24,000 గ్రంథమంటే 24,000 శ్లోకాలని అర్థంకాదు. 32 అక్షరాల సముదాయానికి గ్రంథమని పేరు. "గ్రంథోధనే వాక్సందర్భే ద్వాత్రింశ ద్వర్లసంహతౌ" అన్న శ్లోకంలో ఇది విశదమవుతుంది.


ఒక శ్లోకంలో 32 అక్షరాల కంటే ఎక్కువ వుంటే, 32 అక్షరాలు మాత్రమే గ్రంథంగా భావించాలి. ప్రధమ సర్గలో ఆద్యంతక్షరాల మధ్యభాగంలో, తక్కిన అక్షరాలుండవచ్చేమోనన్న సందేహంతో, వాసుదాసుగారు, ఆ దిశగా శోధించినా కానరాలేదు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఆయన, ఎరిగిన విజ్ఞులు ఎవరైనా వుంటే, మరింత వివరంగా దీనికి సంబంధించిన అంశాలను వెల్లడిచేస్తే, వారికి సవినయంగా నమస్కరిస్తానని, తన అంధ్ర వాల్మీకి రామాయణంలోని బాల కాండ మందరంలో రాసారు. ఒకవేళ తక్కిన అక్షరాలు కనిపించకపోయినా లోపంలేదనీ, ఆద్యంతాక్షరాలు గ్రహించడంతో సర్వం గ్రహించినట్లేనని అంటారు వాసుదాసుగారు. ఏదేమైనా శ్రీమద్రామాయణం "గాయత్రి సంపుటితం" అనడం నిర్వివాదాంశం. యతిని అనుసరించే, ఆంధ్ర వాల్మీకి రామాయణంలోని కడపటి శబ్దం "అరయన్" య కారంతో ముగించబడింది. తెలుగులో "త్" శబ్దం కడపట రాకూడదు-దానికి ముందున్న "య" కారాన్నిగ్రహించాలి).

Friday, November 6, 2020

వేదాలను, పురాణాలను లోకానికి అందించిన వేదవ్యాసుడు, ఫలశ్రుతి ..... శ్రీ మహాభాగవత కథ-88 : వనం జ్వాలా నరసింహారావు

 వేదాలను, పురాణాలను లోకానికి అందించిన వేదవ్యాసుడు

ఫలశ్రుతి  

శ్రీ మహాభాగవత కథ-88

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై

వేదవ్యాసుడు వేదాలను, పురాణాలను లోకానికి అందించిన విషయాన్ని సూతుడు శౌనకుడికి వివరించాడు. పరాశర మహర్షి పుత్రుడైన వేదవ్యాసుడికి పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు అనే నలుగురు శిష్యులు వుండేవారు. వీరు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని వున్న నాలుగు వేదాలను వ్యాసమహర్షి ఉపదేశించిన క్రమంలో అన్ని లోకాలలో ఆవిష్కరించారు. మొట్టమొదట బ్రహ్మ హృదయాకాశంలో ఒక నాదం ఉత్పన్నమైంది. ఆయన ఆత్మయోగంతో చిత్తవృత్తులను నిరోధించి వున్నప్పుడు ఆ నాదం ఆయన శ్రవణ పుటాలలో వ్యక్త రూపాన్ని పొందింది.

బ్రహ్మ హృదయాకాశంలో ఉదయించిన ఆ నాదం, బృహతీ వాక్కుగా, ‘ఓమ్’ అన్న ధ్వనిగా వినిపించి, అక్షరాకృతిని ధరించింది. ఆ ఓంకారమే బ్రహ్మవిద్యాసర్వస్వములైన అన్ని మంత్రాలకు, అన్ని ఉపనిషత్తులకు, పుట్టినిల్లైన వేదమాత అని చెప్పబడింది. ఆ ఓంకారం త్రిగునాత్మకమైనది. అంటే, సత్త్వరజస్తమస్సులనే మూడు గుణాలు, ఋగ్యజుస్సామములనే మూడు నామాలు, భూర్భువస్సువస్సులనే మూడులోకాలు, జాగ్రత్స్వప్నసుషుప్తులనే మూడు వృత్తులను కలిగినది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ ఓంకారం నుండి స్వరాలు, స్పర్శలు, అంతస్థములు, ఊష్మములు (హ్రస్వములు, దీర్ఘములు) మొదలైన లక్షణాలతో కూడిన అక్షర సమామ్నాయాన్ని రూపొందించాడు. ఆ అక్షరాల సహాయంతో ఆయన తన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలను ఉద్భవింపచేశాడు. ఆయన మానస పుత్రులైన మరీచి మొదలైన వారు ఆయన ఉపదేశానుసారం ఆ వేదాలను నేర్చుకుని, తమ శిష్యగణానికి బోధించారు. ఆ విధంగా ఒక్కొక్క యుగంలో మహర్షులు గురుముఖతః వేదాలను అభ్యసిస్తున్నారు.

కాలమహిమ వల్ల వేదాలను సమగ్రంగా అధ్యయనం చేసే శక్తి లేనివారికి దారి చూపడానికి ద్వాపర యుగారంభంలో దాశరాజు కూతురు సత్యవతీదేవి కడుపున భగవంతుడు స్వయంగా పరాశర మహర్షికి పుత్రుడై అవతరించాడు. అనంతమైన వేదరాశిని ప్రకరణానుసారం, ఛందస్సుల ప్రకారం, ఋగ్యజుస్సామాధర్వములని నాలుగు సంహితలుగా చేసి, వాటిని పైల, వైశంపాయన, జైమిని, సుమంతులనే నలుగురు శిష్యులను పిలిచి, ఒక్కొక్కటి వారికి ఉపదేశించారు.

పైలమహర్షి అధ్యయనం చేసిన ఋక్సంహిత పరిమాణం చాలా పెద్దది. ఋక్కుల సంఖ్య చాలా ఎక్కువ. దాన్ని అందుకే బహ్వ్ఋచ సంహిత అనేవారు. పైలుడు దాన్ని రెండుగా విభజించి ఇంద్రప్రమితికి, భాష్కలుడికి బోధించాడు. భాష్కలుడు తన భాగాన్ని నాలుగు శాఖలుగా పునర్విభాగం చేసి, తన శిష్యులైన బాద్య, యాజ్ఞవల్క్య, పరాశర, అగ్నిమిత్రులకు నేర్పాడు. ఇంద్రప్రమితి తన సంహితభాగాన్ని తన కొడుకు మాండూకేయ ఋషికి ఉపదేశించాడు. మాండూకేయుడు తన శిష్యుడు దేవమిత్రుడికి బోధించిన విద్యను సౌభరి మొదలైన ఋషులు నేర్చుకున్నారు. సౌభరి కొడుకు శాకల్యుడు తాను నేర్చుకున్న శాఖను ఐదుగా విభజించి తన శిష్యులైన వాత్స్య, మౌద్గల్య, శాలీయ, గోముఖ, శిశిరులకు ఉపదేశించాడు. వారు జాతుకర్ణికి, ఆయన బలాకుడు, పైంగుడు, వైతాలుడు, విరజుడు అనే ఋషులకు నేర్పాడు. భాష్కలుడి కొడుకు భాష్కలి వాలఖిల్య సంహితను సంకలనం చేసి తన శిష్యులు బాలాయని, గర్గ్యుడు, కాసారుడు అనేవారికి చెప్పాడు. అలా, అలా, బహ్వ్ఋచ సంహితను సత్సంప్రదాయానుగుణంగా బ్రహ్మర్షులంతా అధ్యయనం చేశారు.

వైశంపాయనుడు యజుర్వేదాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. అతడి శిష్యులు చరకుడు, అధ్వర్యువు. వారు గురువుగారి దగ్గర అన్ని క్రతువులు సలక్షణంగా చేయించడం నేర్చుకున్నారు. ఒకసారి ఆ శిష్యులు చేపట్టిన కర్మకాండను వైశంపాయనుడి మరో శిష్యుడు యాజ్ఞవల్క్యుడు అధిక్షేపించాడు. దానికి కోపగించుకున్న వైశంపాయనుడు యాజ్ఞవల్క్యుడిని ఆయన నేర్చుకున్న వేదాన్ని మొత్తం అక్కడ వదిలి తక్షణమే వెళ్లిపొమ్మన్నాడు. యాజ్ఞవల్క్యుడు మొత్తం కక్కేసి వెళ్లిపోయాడు. ఆ కక్కును ఆయాశాఖాధి దేవతలు తిత్తిరి పక్షుల రూపంలో భుజించారు. అప్పటి నుండి ఆ భాగానికి తైత్తిరీయ శాఖ అన్న పేరొచ్చింది. ఆ తరువాత యాజ్ఞవల్క్యుడు సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకుని, ఇతరులకు తెలియని యజుర్వేద సూత్రాలను నేర్చుకున్నాడు. ఆ నవీన శుక్లయజుర్వేద భాగం వాజసనేయ సంహితగా ప్రసిద్ధికెక్కింది.

సామవేదాన్ని నేర్చుకున్న జైమిని మహర్షి తన కొడుకైన సుమంతుడికి ఉపదేశించాడు. సుమంతుడు ఆయన కొడుకైన సుకర్ముడికి నేర్పాడు. అతడు సామవేద తరువును వేయి శాఖలుగా విభజించి శిష్యులకు నేర్పాడు. అధర్వవేద పండితుడైన సుమంతుడు తన విద్యను కబంధుడనే శిష్యుడికి, అతడు పధ్యుడికి, వేదదర్శుడికి, వారు వారి శిష్యులకు, అలా అలా శాఖోపశాఖలతో అధర్వవేదం వృద్ధి చెందింది.

త్రయ్యారుణి, కశ్యపుడు, సావర్ణి, అకృతవ్రణుడు, వైశంపాయనుడు, హారీతుడు అనే ఆరుగురు వేదాంగవేత్తలు సూతుడి తండ్రి రోమహర్షుడి దగ్గర పురాణాలను నేర్చుకున్నారు. సూతుడు వారి దగ్గర శిష్యరికం చేసి పురాణ సంహిత మొత్తాన్నీ అభ్యసించాడు. కశ్యపుడు, సూతుడు, సావర్ణి, అకృతవ్రణుడు, రోమహర్షుడి దగ్గర మూల సంహితలు నాలుగూ నేర్చుకున్నారు.

పద్దెనిమిది మహాపురాణాలు: బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, భాగవత, భవిష్య, నారద, మార్కండేయ, అగ్ని, బ్రహ్మవైవర్త, లింగ, వరాహ, స్కాంద, వామన, కూర్మ, మత్స్య, బ్రహ్మాండ, గరుడ పురాణాలు. ఇవి కాకుండా ఉపపురాణాలు కూడా వున్నాయి.

పద్దెనిమిది మహా పురాణాల పరిమాణం వేర్వేరుగా వుంటుంది. బ్రహ్మ పురాణం పదివేల శ్లోకాలతో కూడి వున్న గ్రంథం. పద్మ పురాణం 55 వేల, విష్ణు పురాణం 23 వేల, శివ పురాణం 24 వేల, శ్రీమద్భాగవత పురాణం 18 వేల, నారద పురాణం 25 వేల, మార్కండేయ పురాణం 9 వేల, అగ్ని పురాణం 15400, భవిష్యోత్తర పురాణం 14500, బ్రహ్మవైవర్త పురాణం 18 వేల, లింగ పురాణం 11 వేల, వరాహ పురాణం 24 వేల, స్కాంద పురాణం 81100, వామన పురాణం 10 వేల, కూర్మ పురాణం 17 వేల, మత్స్య పురాణం 14 వేల, గరుడ పురాణం 19 వేల, బ్రహ్మాండ పురాణం 12 వేల శ్లోకాలు వుంటాయి.

ఇలా నాలుగు లక్షల శ్లోకాలతో కూడి వున్న అష్టాదశ పురాణాలలోను, భాగవత పురాణం శ్రేష్టమైనది. భాగవత పురాణాన్ని పఠించినవారు శ్రీమహావిష్ణువుతో సాయజ్యముక్తిని పొందుతారు.   

ఫలశ్రుతి

         సర్వ పురాణాలలో శ్రేష్టతమమైన భాగవతాన్ని వినేవారు, వినిపించేవారు, చదివేవారు, వ్రాసేవారు, ఆయురారోర్గ్య ఐశ్వర్యాలు సిద్ధించి శ్రీమహా విష్ణువుతో సాయుజ్యం పొందుతారు. ఆసక్తితో ఆదివారం నాడు భాగవత పఠనం గావించిన భక్తుడు సంసార సాగరాన్ని అవలీలగా దాటుతాడు.

         పరమాత్మ సకల గుణాతీతుడు, సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, అఖిల లోకాధారుడు, ఆదిదేవుడు, త్రిదశాభివందితపాదాబ్జుడు, వనధిశయనుడు, ఆశ్రితమందారుడు, ఆద్యంతశూన్యుడు, వేదాంతవేద్యుడు, విశ్వమయుడు, కౌస్తుభ శ్రీవత్స కమనీయవక్షుడు, శంఖచక్రగదాసిశార్జ్గధరుడు, శోభనాకారుడు, పీతాంబరాభిరాముడు, రత్నరాజిత మకుట విభ్రాజమానుడు, పుండరీకాక్షుడు, మహనీయ పుణ్యదేవుడు అని స్తుతించిన సూతుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని సర్వకాల సర్వావస్థలలోనూ తలచుకుంటూ, సన్నుతిస్తూ వుంటానని శౌనకుడికి చెప్పాడు.

         ఇలా స్తుతించి భాగవతాన్ని ఆసాంతం సూతుడు చెప్పగా, మునులంతా విని, శ్రీ వాసుదేవుడిని హృదయ మందిరాలలో నిలుపుకుని, ఆయన గుణాలను కొనియాడుతూ, పరవశులై, ఉత్సాహం పొంగుతుండగా, తమతమ నివాసాలకు తరలి వెళ్లారు.   

          (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Thursday, November 5, 2020

కలియుగ రాజవంశాల, కల్క్యావతార సూచన, కాలవర్తన క్రమం .... శ్రీ మహాభాగవత కథ-87 : వనం జ్వాలా నరసింహారావు

 కలియుగ రాజవంశాల, కల్క్యావతార సూచన, కాలవర్తన క్రమం

శ్రీ మహాభాగవత కథ-87

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై

శ్రీ శుక యోగీంద్రుడు పరీక్షిన్మహారాజుకు శ్రీకృష్ణుడు వైకుంఠపదాన్ని అలంకరించేంతవరకు ఆయన అవతార కథలను వివరంగా చెప్పాడు. కలియుగం రాబోతున్నందున ఇక ముందు జరగబోయే పరిణామాలన్నీ కూడా చెప్పమని అడిగాడు పరీక్షిత్తు శుకుడిని. ప్రారబ్ధ కర్మాధీనాలైన కార్యగతుల విపరీత పరిణామాలను చెప్పడం ఎవరికీ సాధ్యం కాదని, తాను తన దర్శన శక్తితో సమీక్షించి, రానున్న కాలపు పోకడలను కొంతమేరకు వివరిస్తానని చెప్పసాగాడు శుకుడు. కలియుగంలో రాజుల ప్రవర్తన తీరెలా వుంటుందో తెలియ చేశాడు. గతంలో మగధరాజు బృహద్రథుడి వంశం పురంజయుడి దాకా వేయి సంవత్సరాలు కొనసాగిన సంగతికి కొనసాగింపుగా ఇతర వంశాల గురించి చెప్పాడు.

శిశునాగ వంశంలో పురంజయుడి మంత్రి శునకుడు రాజును హత్య చేసి రాజ్యపాలన చేపట్టుతాడు. ఆయన వంశంలో మొత్తం పదిహేనుమంది జన్మించి శైశునాగులుగా ప్రసిద్ధికెక్కి, కలియుగంలో 360 సంవత్సరాలు భూమండలాన్ని పాలిస్తారు. ఆ వంశక్రమంలో చివరివాడైన మహానందికి నందరాజు పుట్టిన తరువాత ఆయన కాలంలో సుక్షత్రియ వంశం అంతరిస్తుంది. మొత్తం మీద వీరంతా కలిసి మరో నూరు సంవత్సరాలు పాలిస్తారు. ఆ తరువాత నవనందులు రాజ్యానికి వస్తారు. నవనందులను చాణక్యుడు నిర్మూలిస్తాడు. అప్పుడు మౌర్యులు రాజ్యానికి వస్తారు. మౌర్య చంద్రగుప్తుడు మగధ దేశాధిపతి అవుతాడు. మౌర్య వంశానికి చెందిన పదిమంది భూమిని 330 సంవత్సరాలు పాలిస్తారు. ఆ తరువాత శుంగ వంశీయుల పాలన మొదలవుతుంది.

శుంగరాజుల అధికారం 112 సంవత్సరాలు సాగుతుంది. ఆ తరువాత గుణహీనులైన కణ్వుల పాలన 345 సంవత్సరాలు సాగుతుంది.  కణ్వవంశంలోని సుశర్ముడనే రాజును అతడి సేవకుడు వృషలుడు అనే ఆంధ్ర జాతీయుడు వధించి అధర్మ మార్గంలో రాజ్యపాలన చేస్తాడు. అతడి వంశీయులు 456 సంవత్సరాలు భూమిని పాలిస్తారు. ఆ తరువాత ఏడుగురు ఆభీర వంశపు రాజులు, పదిమంది గర్ధబులు, పదహారు మంది కంక వంశీయులు పాలిస్తారు. ఆ తరువాత యవనులు ఎనిమిది మంది, బర్బరులు (తురుష్క జాతీయులు) పద్నాలుగురు, గురుండులు పదమూడు మంది, మౌన వంశీయులు పదకొండు మంది, 65 మంది అభీరాదులు, 1099 సంవత్సరాలు పాలిస్తారు. ఇలా సాగుతుంది రాజ్యపాలన.

కలియుగంలో క్రమక్రమంగా దేశం అంతా అధర్మం తాండవిస్తుంది. పాపవర్తనులు భూపాలకులవుతారు. రాజులు అధర్మపరులై అనాచారాన్ని వ్యాప్తికి తెస్తారు. దీని ఫలితంగా నానాటికీ సత్యం, శౌచం, దయ, దానం మొదలైన ధర్మాలన్నీ అడుగంటి పోతుంటే ఆశ్చర్యంగా వుంటుంది. డబ్బున్న వారెవరైనా భూమిని పాలించవచ్చనే రోజులు వస్తాయి. బలవంతుడిదే రాజ్యం. ప్రజలు ద్రవ్యహీనులవుతారు. శరీరారోగ్యం క్షీణిస్తుంది. వర్ణ ధర్మాలను, ఆశ్రమ ధర్మాలను కూలదోసి ధర్మభ్రష్టలై సంచరిస్తారు ప్రజలు. రోగాలను హరించే ఓషధీలతలకు జీవశక్తి లోపించి, వాటితో తయారయ్యే ఔషధాల గుణం అతి స్వల్పంగా వుంటుంది. పండే పంటలలో సారం, సమృద్ధి వుండదు.

ఇలా లోకంలో ధర్మం పూర్తిగా అడుగంటినప్పుడు, ముకుందుడు, తనను ఆరాధించే భక్తుల కోసం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం, శంబల అనే గ్రామంలో విష్ణుయశుడు అనే బ్రాహ్మణుడికి కుమారుడిగా కల్కి రూపంలో అవతరిస్తాడు. సమస్త దేవతా సమూహం ఎదురు చూస్తుంటే, దేవదత్తమనే మహాశ్వాసాన్ని అధిరోహించి, శిష్టాచార విహీనులైన వారిని తన ఖడ్గంతో ఖండఖండాలుగా నరికి వేస్తాడు. అప్పుడు ధరణీ మండలం శాంతి సౌఖ్యాలతో వెలుగొందుతుంది. మానవులు విష్ణు ధ్యానం చేస్తూ, శ్రీమన్నారాయణుడి మీద భక్తి తత్పరులై వుంటారు. సకల జనులు కృతార్థులవుతారు. విశ్వమంతా కృతయుగపు ధర్మం తిరిగి నెలకొంటుంది.

ఈ విషయాలను చెప్పిన శ్రీ శుక మహర్షి, పరీక్షిత్తు కోరిక ప్రకారం కాల స్వరూపుడైన భగవానుడి ఉనికి వర్ణించడానికి ప్రాతిపదికైన కాలవర్తన క్రమాన్ని, చంద్ర, సూర్య గ్రహాలూ సంచరించే మార్గాల వివరాలను చెప్పాడు.

ఆకాశంలోని సప్తర్షి మండలంలో ఒక్కొక్క మనువు పరిపాలనా కాలంలో అక్కడుండే ఋషులు ఏడుగురూ మారుతుంటారు. వైవస్వత మన్వంతరంలో బ్రహ్మ మానస పుత్రులైన మరీచి, అంగిరసుడు, పులస్త్యుడు, వశిష్ఠుడు, పులహుడు, అత్రి, క్రతువు సప్తర్షులు. తూర్పున మొనతేలి వున్న బండి ఆకారంలో సప్తర్షి మండలం కనిపిస్తుంది. అందులో అగ్రస్థానంలో మరీచి, ఆయనకు పడమట దిక్కున అరుంధతీ సమేతుడైన వశిష్ఠుడు, అక్కడి నుండి పశ్చిమాన కొంచెం పైన అంగిరసుడు, ఇంకా పడమట చతురస్రాకారంగా అమరిన నాలుగు తారలలో ఈశాన్యాన అత్రి, ఆయనకు దక్షిణాన పులస్త్యుడు, పశ్చిమాన పులహుడు, ఉత్తరాన క్రతువు వున్నారు. ఈ సప్తర్షి మండలం ఉదయించినప్పుడు మున్ముందుగా రెండు తారలు కనబడతాయి. ఆ రెంటి నట్టనడుమ ఒక నక్షత్రం కనిపిస్తుంది. ఇది కనిపించిన వంద సంవత్సరాలకు శ్రీకృష్ణావతారం పరిసమాప్తి జరిగింది. శ్రీకృష్ణుడు భూమ్మీద వున్నంత కాలం కలి ప్రవేశించ లేదు.

మఖ నక్షత్రంలో సప్తర్షులు ప్రవేశించేనాటికి కలి ప్రవేశం జరిగి పన్నెండు వందల సంవత్సరాలు అవుతోంది. సప్తర్షులు ఒక్కో నక్షత్రంలో వంద సంవత్సరాలు వుంటారు. సప్తర్షి మండలం పూర్వాషాడలోకి ప్రవేశించినప్పుడు కలిపురుషుడు రెచ్చిపోతాడు. కలి ప్రవేశించి ఎన్నో వేల దివ్య సంవత్సరాలు గతించిన తరువాత, కలి నాలుగో పాదం చివరి రోజుల్లో తిరిగి కృతయుగ ధర్మం మొదలవుతుంది.

ఈ విషయాలను చెప్పి శుక మహర్షి యుగాలను, ఆయా యుగ ధర్మాలను, వాటి పరిణామాలను చెప్పాడు పరీక్షిత్తుకు. యుగాలు నాలుగు: కృత, త్రేతా, ద్వాపర, కలి. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగ ధర్మం వుంటుంది. ధర్మానికి సత్యం, దయ, తపస్సు, దానం అని నాలుగు పాదాలు. కృత యుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది. త్రేతాయుగంలో మూడు పాదాలుంటాయి. ద్వాపర యుగం వచ్చేనాటికి రెండు పాదాల తేజస్సు తరిగి ప్రవర్తిల్లుతుంది. ఇక కలియుగంలో అధర్మ శక్తులు పెరిగిపోయి ధర్మం మరింత క్షీణిస్తుంది. జనులు అన్యాయాలు చేస్తారు. అసూయ, పిసినారి తనం పెరిగిపోతాయి. ప్రజలు అసత్యవాదులవుతారు. ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది. అందువల్ల కలియుగంలో కనీసం ఒకటి రెండు గంటలైనా నారాయణ నామస్మరణ చేయాలి.

కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు నాలుగూ కలిసి ఒక చతుర్యుగం. అలాంటి వేయి బ్రహ్మకు ఒక పగలు (దీన్నే ఒక కల్పం అంటారు). మరో వేయి ఒక రాత్రి. అదే ఆయనకు విరామ సమయం. రాత్రీ-పగలూ కలిసి బ్రహ్మకు ఒక దివసం. అలాంటి 360 దివసాలు బ్రహ్మకు ఒక సంవత్సరం. ఒక్కొక్క బ్రహ్మకు నూరు సంవత్సరాలు ఆయుఃప్రమాణం. ఆ కాలాన్నే ద్విపరార్థం అంటారు. ఒక్కొక్క ద్విపరార్థం జరగ్గానే సర్వ ప్రళయం జరుగుతుంది. అప్పుడు సృష్టి కర్త వుండడు. సృష్టి జరగదు. దాన్నే ప్రాకృతిక ప్రళయం అంటారు. ప్రతి కల్పాంతంలో బ్రహ్మ నిద్ర కొరకు ఏర్పడిన ప్రళయాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. బ్రహ్మకు అవసాన కాలం సమీపించినప్పుడు, ప్రాకృతిక ప్రళయం జరిగే ముందు, వంద సంవత్సరాలు భూమ్మీద వర్షాలు పడవు. అంతా క్షామమే. జీవజాలం నశిస్తుంది.

ఇది జరిగిన తరువాత, సూర్యుడు సృష్టి సమస్తాన్నీ దహించి వేస్తాడు. అప్పుడు సంకర్షణుడనే ఆదిశేషుడి ముఖాల నుండి కాలాగ్ని వెలువడి, అన్ని దిక్కులకూ వ్యాపిస్తుంది. నూరు సంవత్సరాలు ప్రళయ వాయువులు విరామం లేకుండా మహావేగంగా వీస్తాయి. వాన చినుకు వుండదు. నూరేళ్లపాటు 12 మంది ఆదిత్యుల తీవ్ర కిరణాలు తాండవం చేస్తాయి. ఆ తరువాత నూరేళ్లు ప్రళయాగ్ని దహించి వేస్తుంది. ఆ తరువాత నూరేళ్లు మబ్బులు కమ్మి నీటి ధారలతో బ్రహ్మాండమంతా జలంతో నిండిపోతుంది. పృథ్వి తన రూపాన్ని కోల్పోయి జలంలో కలిసిపోతుంది. ఇక పృథ్వీపదార్ధం వుండదు. స్వరూప నాశం చెందిన జలం తేజస్సులో విలీనమైపోతుంది. దరిమిలా ప్రకృతి సత్త్వాది గుణాలను తనలోకి విలీనం చేసుకుంటుంది. అప్పుడు ప్రకృతికి అవయవాలు, పరిణామాలు వుండవు. ఆది, అంతం వుండవు. రూపాలు వుండవు. జాగ్రదవస్థ వుండదు.

ఆ నిర్మలమైన స్థితిలో అది ఊహకందనిదిగా అవుతుంది. దాన్ని ‘మూలభూతం పద మామనన్తి’ అంటారు. అన్నిటికీ మూలమైన కైవల్యపదం అది. ఇక ప్రళయాలు నాలుగు విధాలు. నిత్యం, నైమిత్తికం, ప్రాకృతికం, అత్యంతికం. భగవానుడు కాలస్వరూపుడు. అనంతమైన కాలప్రవాహంలో ఆది నుండి నారాయణుడు ధరించిన మూర్తులనూ, ఆయన లీలా విశేషాలనూ, కథలనూ, సమగ్రంగా బ్రహ్మరుద్రాదులతో సహా ఎవరూ వర్ణించలేరు.

ఇలా చెప్పి శుకుడు, అంతుచిక్కని సంసారమనే మహాసముద్రాన్ని దాటాలంటే శ్రీహరి కథ అనే నావ తప్ప వేరొక సాధనం లేదంటాడు. తక్షకుడు కరుస్తాడు, చనిపోతానన్న భయాన్ని వదిలి శ్రీకృష్ణపరమాత్మను ధ్యానం చేసుకొమ్మని చెప్తాడు. పరమాత్మను ఆత్మగతం చేసుకుని శ్రీ వాసుదేవుడి విరాడ్రూపాన్ని భావన చేయడం వల్ల విశేష ఫలితం వుంటుందని అంటాడు. కాటువేయబోయే తక్షకుడు, మృత్యుముఖంలో వున్న పరీక్షిత్తు, ఇద్దరినీ నడిపిస్తున్న సూత్రధారి శ్రీ వాసుదేవుడు ఒక్కడే అని, ఆయన మహిమను వర్ణించమని పరీక్షిత్తుకు చెప్పాడు శుకుడు. తన కర్తవ్యం ముగిసిందని అక్కడి నుండి బయల్దేరిపోయాడు శుకుడు.

శృంగి మంత్రపూర్వకంగా నియోగించిన తక్షకుడు, బ్రాహ్మణ వేషంలో పరీక్షిత్తును చంపడానికి బయల్దేరి వచ్చాడు. పరీక్షిన్మహారాజు దగ్గరలో వున్న వాళ్ల చేతిలో పండు పెట్టి వెళ్లిపోయాడు. వాళ్ళు ఆ పండును రాజుకిచ్చారు. పరీక్షిత్తు ఆ పండును రుచి చూసేసరికి దానిలో నుండి ఒక పురుగు రూపంలో తక్షకుడు బయటపడి సర్పాకృతిని ధరించి, రాజును కాటు వేశాడు. పరీక్షిత్తు ఆ విషాగ్ని వల్ల అక్కడికక్కడే చనిపోయాడు.

ఈ వృత్తాంతమంతా విన్న ఆయన కొడుకు జనమేజయుడు సర్పజాతిని నాశనం చెయ్యడానికి సర్పయాగానికి పూనుకున్నాడు. యాగాగ్నిలో వేలకొద్దీ పాములు వచ్చి పడిపోయి మరణించాయి. ఎదురు చూస్తున్న తక్షకుడు రాలేదు. అతడు ఇంద్రుడి దగ్గర ఆశ్రయం పొందాడని తెలుసుకుని, జనమేజయుడు, ‘సహేంద్రతక్షకాయానుబ్రూహి’ (ఇంద్రుడితో సహా తక్షకుడిని రప్పించండి) అనే మంత్రాన్ని ప్రయోగించాడు. తక్షకుడితో సహా ఇంద్రుడు కిందికి జారారు. అప్పుడు అంగిరసుడి వంశంలో జన్మించిన బృహస్పతి అనే ఆచార్యుడు అక్కడికి వచ్చి సర్పయాగం మానమని జనమేజయుడిని ప్రార్థించాడు. ఆ ఆచార్యుడి ఉపదేశానుసారం సర్పయాగాన్ని మాని, నగరంలోకి పోయాడు జనమేజయుడు.

          (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Wednesday, November 4, 2020

వైకుంఠనిలయానికి చేరిన శ్రీకృష్ణ బలరాములు ...... శ్రీ మహాభాగవత కథ-86 : వనం జ్వాలా నరసింహారావు

 వైకుంఠనిలయానికి చేరిన శ్రీకృష్ణ బలరాములు

శ్రీ మహాభాగవత కథ-86

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై

ఒకప్పుడు అమృతాన్ని తాగే అమరులు, గరుడులు, ఖేచరులు, విద్యాధరులు, శివుడు, విరించి, మహా మునులు, పుండరీకాక్షుడి దర్శనం కోసం ద్వారకానగరానికి వచ్చినారు. శ్రీకృష్ణమూర్తిని చూసి ఆయన్ను అర్చించుకున్నారు. ఆయన భూభారాన్ని తొలగించడం కోసం నేలకు దిగివచ్చి 125 సంవత్సరాలు కావస్తున్నదని, ఆయన ఇక వైకుంఠనిలయానికి రావాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రార్థించారు. సమాధానంగా శ్రీకృష్ణుడు, యాదవులందరికీ పరస్పర వైరానుబంధాలను కల్పించి, వారందరినీ అంతం చేసి, భూభారాన్ని తగ్గించి, వైకుంఠనిలయానికి వస్తాను, వెళ్లమని చెప్పాడు. ఆ తరువాత ద్వారకానగరంలో అనేకరకాల దుర్నిమిత్తాలు కనబడినాయి. అలాంటప్పుడు యాదవులు ఇక అక్కడ వుండడం క్షేమం కాదని, వారందరినీ, ప్రభాస తీర్థానికి బయల్దేరమని ఆజ్ఞాపించాడు కృష్ణుడు.

యాదవులంతా బంధుమిత్రులతో సహా కృష్ణుడు చెప్పినట్లే ద్వారక నుండి బయల్దేరారు. జరుగుతున్న విపరీత పరిణామాలను జ్ఞానదృష్టితో గ్రహించిన ఉద్ధవుడు శ్రీకృష్ణుడిని వేనోళ్ల సన్నుతించాడు. యదువంశాన్ని తుదముట్టించి కృష్ణుడు వెళ్లిపోతే తమకు దిక్కెవరని అడిగాడు ఆయన్ను. జవాబుగా కృష్ణుడు, బ్రహ్మాది దేవతలు వచ్చి చేసిన విన్నపాన్ని పురస్కరించుకుని తాను భూభారాన్ని తొలగించాల్సి వచ్చిందని, ఆ రోజు నుండి ఏడవ దినాన ద్వారకానగరాన్ని సముద్రుడు ముంచుతాడని, దానితో యదువంశ నాశనం పూర్తవుతుందని, అ ఆతరువాత అధర్మానికి ఆలవాలమైన కలియుగం ఆరంభం అవుతుందని, నాస్తికత్వం ప్రబలుతుందని చెప్పాడు. యుగాంతం సమీపిస్తున్నది కాబట్టి అన్ని బంధాలను తెంచుకోమని ఉద్ధవుడికి సలహా ఇచ్చాడు. ఆయన జ్ఞానవిజ్ఞాన యుక్తుడు కావాలని, ఆ ఆత్మానుభవంతో సంతృప్తి చెందితే ఆయనకు విశ్వమంతా వున్నది పరమేశ్వరుడే అన్న తత్త్వవిజ్ఞానం కలుగుతుందని అన్నాడు.

అప్పుడు ఉద్ధవుడు భక్తితో, సంసారంలో పడ్డ సామాన్యులు సంసార సాగరం నుండి ఈది, నది ఒడ్డుకు ఎప్పుడు, ఎలా చేరుతారని, ఏవిధంగా మోక్షం సిద్ధిస్తుందని అడిగాడు. కృష్ణుడి సేవకుడైన తనకు ముక్తి మార్గాన్ని చూపమని ప్రార్థించాడు. సన్మార్గం అవలంభించి, స్వధర్మాచరణతో తన నివాసానికి వెళ్లమని, తన రూపాన్ని మనస్సులో నిలుపుకోమని అంటూ, కృష్ణుడు ‘అవధూత యదు సంవాదం’ అనే ఒక ఇతిహాసాన్ని చెప్పాడు.

ఒకప్పుడు ఒక అవధూత యదు మహారాజు దగ్గరికి వచ్చి, 24 మంది గురువుల సాంగత్యంతో తాను విజ్ఞానినయ్యాను అని చెప్పగానే, జనార్దనుడిని  చేరుకునేది ఎలా అని ప్రశ్నించాడు రాజు. జవాబుగా అవధూత, పంకజనాభుడి పాదారవిందాలను భజిస్తూ, దానివల్ల అజ్ఞానం తొలగిపోగా, భగవదనుగ్రహం వల్ల కర్మదోషాలు నశించి కర్మల నుండి విముక్తి కలుగుతుందని చెప్పాడు.

నిత్య శుచిత్వాన్ని, నిర్మలత్వాన్ని, నిర్వికారతను, లోకోపకార గుణాన్ని, సంసారంపట్ల అనాసక్తిని, కర్మత్యాగాన్ని, ఇంద్రియ జయాన్ని, మొహాన్ని విసర్జించడాన్ని, ఇంద్రియ వశత్వాన్ని, వైరాగ్యాన్ని, మమత్వ పరిత్యాగాన్ని, విచార శూన్యతను, సంగత్యాగాన్ని, తదేక నిష్టను, భగవత్ తత్త్వాన్ని, సంసార పరిత్యాగాన్ని, కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యాలను జయించడాన్ని, నిత్య కర్మలను ఆచరించడం లాంటి వాటిని గ్రహించి పరమాత్మను గురించి తప్ప వేరొక చింతన చేయకూడదని అన్నాడు కృష్ణుడు ఉద్ధవుడితో. చివరకు సర్వసంగ పరిత్యాగాన్ని చేసి ఆత్మనిష్టతో పవిత్రమైన యోగి పరమాత్మలో ఐక్యాన్ని పొందుతాడని చెప్పాడు.

దేహం నిత్యమైన ఆత్మకాదని గ్రహించి, మోహబంధాలన్నిటినీ తెంచేసి, సద్వర్తనను పాటించి, ఇల్లు విడిచిన నరుడు పరమాత్మ జ్ఞానాన్ని ఆర్జించి, అఖండమైన మోక్ష లక్ష్మిని చూరగొంటాడని అన్నాడు కృష్ణుడు ఉద్ధవుడితో. భగవంతుడి రూపాన్ని ఏవిధంగా చూడవచ్చని అడిగాడు ఉద్ధవుడు. భక్తిభావనతో తన కథలను, తన అవతారాలను, తన లీలలను వింటూ, తనకు సేవకులైన భాగవతులను సందర్శించిన వారు భగవంతుడిని చూడవచ్చని జవాబిచ్చాడు కృష్ణుడు. ఇదే భక్తియోగ విధానం అన్నాడు.

ఆ తరువాత ఉద్ధవుడు, సనక సనందనాది యోగీంద్రులకు శ్రీకృష్ణుడు చెప్పిన యోగామార్గాన్ని గురించి అడిగాడు. అప్పుడు తాను వారికి చెప్పిన, బ్రహ్మాది దేవతలు గ్రహించిన సాంఖ్య యోగం గురించి చెప్పాడు. పిమ్మట ఉద్ధవుడి కోరిక మేరకు ధ్యాన యోగాన్ని గురించి చెప్పాడు. దానిలో భాగంగా అర్జునుడు రణరంగంలో విషాదమగ్నుడైనప్పుడు శ్రీకృష్ణుడు ఆయనకు బోధించిన తత్త్వాన్ని వివరించాడు ఉద్ధవుడికి. తానే చరాచరాత్మకమైన జగత్తుకు పరమాత్మనని, సృష్టిస్థితిసంహారకర్తనని, ఈశ్వరుడినని, మహత్తని, బ్రహ్మనని, అగ్నినని, విష్ణువునని, భృగువునని, నారదుడినని, కామధేదేనువునని, కపిలమహర్షినని, ప్రహ్లాదుడినని, చంద్రుడినని, ఐరావతాన్నని, ఉచ్చైశ్స్ర వాన్నని, వాసుకినని, సింహాన్నని, ఓంకారాన్నని, గంగనని, క్షీరసాగరాన్నని, మేరువునని, బ్రహ్మ యజ్ఞాన్నని, ఆత్మయోగాన్నని, ఋతువులనని, వాసుదేవుడినని, కుబేరుడినని, ఆంజనేయుడినని....ఇలా అన్నీ తానేనని కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పాడు.

ఆ తరువాత ఉద్ధవుడి కోరిక ప్రకారం, కృష్ణుడు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల పుట్టుక గురించి, ఆశ్రమ ధర్మాల గురించి, నాలుగు వేదాలలో చెప్పబడిన ధర్మాల గురించి, ప్రవృత్తి-నివృత్తి మార్గాల గురించి, వైరాగ్యం గురించి, విజ్ఞానం గురించి వివరించాడు. తన మీద చిత్తాన్ని నిల్పి, విద్యుక్త కర్మలను అనుష్టించి, కర్మఫలాన్ని ఆశించిన కర్మయోగులు ముక్తిపదాన్ని పొందారని చెప్పాడు. ఉద్ధవుడిని కూడా వారిలాగే చేయమని చెప్పాడు కృష్ణుడు. పరమాత్మను పూజించే విధానం చెప్పమని అడిగాడు ఉద్ధవుడు.

అప్పుడు శ్రీకృష్ణుడు అన్ని వర్ణాలవారికి యోగ్యమైన పూజా విధానం గురించి చెప్పాడు. రాతితో కాని, మట్టితో కాని, చెక్కతో కాని, కంచు లాంటి లోహంతో కాని, బంగారంతో కాని, వెండితో కాని తన ప్రతిమను నామరూపానుసారం ఏర్పరుచుకుని, ప్రతిమ రూపంలో తానే కొలువైనట్లుగా భావించి కొలిచేవారికి తాను ప్రసన్నుడిని అవుతానన్నాడు. ఇలా నిత్యం తనను ధ్యానించిన వారు కర్మానంతరం తనను కలుసుకుంటారని చెప్పాడు. ఇలా చెప్పి, ఉద్ధవుడిని బదరికాశ్రమానికి వెళ్లమని, తాను చెప్పినట్లు ఏకాగ్ర నిష్ఠతో యోగదీక్ష వహించి, తాను బోధించిన సాంఖ్యయోగాన్ని అంతరంగంలో నిలుపుకొమ్మని అన్నాడు శ్రీకృష్ణుడు. ఉద్ధవుడు కృష్ణుడి ఆనతి ప్రకారం బదరికాశ్రమానికి బయల్దేరాడు.

ఇదిలా వుండగా, శ్రీకృష్ణుడి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కార్యక్రమం పూర్తైన తరువాత అన్న బలరాముడితో కలిసి బయల్దేరాడు. మద్యపాన ప్రభావంతో యాదవులు కలహించి కనబడ్డవారితో కయ్యానికి కాలుదువ్వారు. మునిశాపం కారణాన, వారిలో వారే కలహించుకుంటూ, కొట్టుకున్నారు. శరీరాలు తెగిపోయాయి. ఇక ఆ యుద్ధంలో ఎవ్వరూ  బతికిబట్ట కట్టరని కృష్ణుడు చిరునవ్వు నవ్వుకుని, బలరాముడితో కలిసి బయల్దేరాడు. బలరాముడొకచోట యోగసమాధిలోకి పోయి తన మూలరూపమైన ఆదిశేషుడిని కలుసుకోగా పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు వేరొక మార్గాన వెళ్లాడు.

కృష్ణుడు, ఒకచోట ఒక పొదరిండ్లను చూసి, అక్కడ విశ్రమించి, ఒక చరణాన్ని వేరొక చరణం మీద లీలగా ఆనించి, ఆత్మానందుడై వున్నాడు. అలా వుండగా, ఒక బోయవాడు వేటాడుతూ అక్కడికి వచ్చి, చెట్టుచాటున వున్న పరమపురుషుడి చరణకమలం జింక చెవి అనుకున్నాడు. దాన్ని చూసి బాణాన్ని ఎక్కుబెట్టి విడిచేసరికి అది ఆకస్మికంగా వచ్చి తగిలిన శరాఘాతానికి శ్రీకృష్ణుడు హాహాకారం చేశాడు. అప్పుడాబోయవాడు పరమేశ్వరుడి సన్నిధానానికి వచ్చి, ఆయన్ను సాక్షాత్తు జగన్నాథుడని గుర్తించి, ఘోరాపరాధం చేశానని, మహాపాపం మూటగట్టుకున్నానని, పరిపరి విధాల దీనాలాపాలు పలికాడు. దుఃఖిస్తున్న బోయవాడిని చూసి శ్రీకృష్ణుడు, ఆయనేం తప్పు చేయలేదని, పూర్వ జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితం ఎవరైనా అనుభవించాల్సిందే అని, కర్మఫలం వూరికే పోదని అన్నాడు. బోయవాడు కేవలం నిమిత్తమాత్రుడే అని అన్నాడు. తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించిన బోయవాడు సర్వసంగ పరిత్యాగం చేసి, ఉపవాస దీక్ష చేసి, కర్మశేషం తీరగానే ప్రాణాలను విడిచి పరమపదమైన వైకుంఠలోకానికి చేరుకున్నాడు.

         ఆ సమయంలో అక్కడే వున్న కృష్ణుడి రథసారధి దారుకుడు ఇంకా ఏంజరగబోతున్నదో అని వీక్షించసాగాడు. కడగంటి చూపుతో కృష్ణుడు తనమీద దయారసాన్ని ప్రసరింప చేసి, తరింప చేయమని ప్రార్థించాడు. ఇలా అంటుండగానే దివ్యాయుధాలైన పాంచజన్య, సుదర్శన, కొమోదకీ నందకాలతోనూ, గరుడలాంఛనంతోనూ, శైబ్య సుగ్రీవ మేఘపుష్ప, బలాహక, హయాలు పూన్చిన దివ్యరథం ఆకాశానికి ఎగిరి అంతర్థానం అయిపోయింది. అప్పుడు నారాయణుడు దారుకుడిని చూసి, అక్రూర, విదురలకు జరిగిన వృత్తాంతమంతా చెప్పమని, ఆర్జునుడిని కలిసి అతడితో స్త్రీబాలవృద్ధులను, పెద్దలను హస్తినాపురానికి తీసుకెళ్లమని ఆదేశించాడు. దారుకుడు అలాగే చేశాడు.

శ్రీకృష్ణ పరమాత్మ దివ్యతేజోమయదేహుడై తరలి, నారదాది మునిగణం, బ్రహ్మరుద్రాది దేవతలు జయజయ ధ్వానాలతో కడలి వస్తుంటే వైకుంఠమందిరానికి చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు నిర్గమించిన చోట ఆయన విగ్రహం సముద్ర తీరాన జగన్నాథస్వరూపమై వెలసింది. ఈ కథను విన్నా, ఆలకించినా, వ్రాసినా, నిండైన ఐశ్వర్యం, మంచి కీర్తి, భోగభాగ్యాలు కలుగుతాయి. ఆరోగ్యంతో పాటు దీర్ఘాయువు పొంది, లోకుల మెప్పు పొందుతూ, మనిషి కలకాలం వుంటాడు.

          (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Tuesday, November 3, 2020

యదువంశంలో ముసలం, నారదుడు చెప్పిన విదేహార్షభ సంవాదం ..... శ్రీ మహాభాగవత కథ-85 : వనం జ్వాలా నరసింహారావు

 యదువంశంలో ముసలం, నారదుడు చెప్పిన విదేహార్షభ సంవాదం

శ్రీ మహాభాగవత కథ-85

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై

బలరామ కృష్ణులు యుద్ధాలలో అనేకమంది రాక్షస వీరులను సంహరించారు. అది చాలక కృష్ణుడు, భూభారం మరీ ఎక్కువగా వుందని, పాచికలాట నెపంతో దుర్యోధనుడినీ, కౌరవపాండవ బలగాన్నీ, కురుక్షేత్ర సంగ్రామంలో అంతరింప చేశాడు. ఇదంతా చూస్తున్న మునులకు ఆనందం కలిగింది. పుణ్యాత్ములైన నందాదులు సంతోషించారు. యదువంశం లోని గొప్పగొప్ప వీరులు అతిశయాన్ని పొందారు. శ్రీకృష్ణుడి మహిమ ముల్లోకాలకూ తెలిసింది. తన అవతార కార్యం నెరవేరిందని అమితానందంగా వున్నాడు కృష్ణుడు. ఈ నేపధ్యంలో యాదవ బలాలు వృద్ధి చెంది, ఉన్నతిని పొంది, భూమి బరువు మోయలేని స్థితికి వచ్చింది.

శ్రీకృష్ణుడి దృష్టి యదుముఖ్యుల వైపు మళ్లింది. ఎవరికీ అపకారం చేయని తన భక్తులైన యాదవులను అంతం చేసే శక్తి తనకు తప్ప వేరొకరికి లేదనుకున్నాడు. తనలో తానే తర్కించుకున్న కృష్ణుడు, యాదవ బలాలకు పరస్పర విరోధాలు కల్పించి, కర్మపరిణామాలను వారివారికి కలగచేసి, అందరినీ అంతమొందించాలనుకుని, దానంతటికీ బ్రాహ్మణ శాపం మూలం కాగలదని నిశ్చయించాడు.

భూభారాన్ని తగ్గించేందుకు యదువంశాన్ని సహితం అంతం చేయాలని శ్రీకృష్ణుడు అనుకుంటున్న సమయంలో, ఆయన దగ్గరికి విశ్వామిత్రుడు, అసితుడు, దుర్వాసుడు, భృగువు, అంగిరసుడు, కాశ్యపుడు, వామదేవుడు, వాలఖిల్యులు, అత్రి, వశిష్ఠుడు, నారదుడు మొదలైన వారు ద్వారకానగరానికి వచ్చారు. వచ్చి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. శ్రీకృష్ణుడు కూడా వారికి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులను సమర్పించాడు. మునులంతా శ్రీకృష్ణుడి మహిమలను కొనియాడి, ఆయన్ను స్తోత్రం చేశారు. దానికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రసన్నుడయ్యాడు. మహర్షులు తమ పారవశ్యాన్ని ‘కంజదళాక్షా!’ అన్న సంబోధనతో వినయపూర్వకంగా స్వామికి విన్నవించుకున్నారు.

మునులంతా తన ఇంటికి ఏ లోక కల్యాణాన్ని కోరి పావనం చేశారని శ్రీకృష్ణుడు అడిగాడు వారిని. ఆయన దివ్య చరణారవిందాలను సందర్శించుకోవడం కంటే వేరే వ్యాప్యమైన ధర్మం తమకేమీ లేదని వారు సమాధానం ఇచ్చారు. వారంతా అక్కడి నుండి బయల్దేరి ద్వారకానగరానికి దరిదాపుల్లోనే వున్న ‘పిండతారకం’ అనే పిండారక పుణ్య తీర్థానికి పితృదేవతలకు తర్పణాలు విడవడానికి వెళ్లారు. అప్పుడే అక్కడికి కొందరు యాదవులు దురుకుతనంతో శ్రీకృష్ణజాంబవతిల కొడుకు సాంబకుమారుడిని          గర్భం దాల్చిన జవరాలి వేషం వేసి సింగారించి అక్కడికి వచ్చారు.

యాదవులు అంతటితో వూరుకోకుండా పిండారక తీర్థానికి వెళ్తున్న ఋషులను ఆపి, నెలలు నిండి పురిటికి సిద్ధంగా వున్న ఆ జవరాలి కడుపున పుట్టేది అబ్బాయా? అమ్మాయా? అని ప్రశ్నించారు. వారి వేళాకోళానికి ఋషులకు కోపం వచ్చింది. ‘యదువంశాన్ని తుదముట్టించడానికి ఈ పిల్ల కడుపున రోకలి పుడుతుంది’ అని శపించారు మునులు. సాంబకుమారుడి పొత్తికడుపుకు కట్టిన మూటలు విప్పేసరికి ముసలం ఒకటి నేలమీద పడింది. దాన్ని తీసుకుని కృష్ణుడి దగ్గరికి పోయి జరిగినదంతా చెప్పారు.

మునుల శాపాన్ని అనుభవించాల్సిందేనని, యదువంశం నాశనం కావాల్సిందేనని అన్నాడు కృష్ణుడు. సముద్రం ఒడ్డున వున్న పెద్ద పర్వతం మీదున్న ఎత్తైన బండమీద యాదవులు తమ భుజ బలం కొద్దీ ఆ ఇనుప రోకలిని రాచి పొడి చేసి, సముద్రం నీళ్లలో కలిపి రమ్మని చెప్పాడు వాళ్లకు. వాళ్లు అలాగే ఆ ముసలాన్ని అరగదీసి, చివరకు మిగిలిన ఒక చిన్న ముక్కను సముద్రంలోకి విసిరేశారు. యాదవులు విసిరిపారేసిన ఇనుప ముక్కను ఒక చేప మింగింది. దాన్ని ఒక జాలరివాడు పట్టుకున్నాడు. దాని కడుపులో దొరికిన ఇనుప ముక్కను తన బాణం చివర ములికిగా పెట్టుకున్నాడు.

ఇదిలా వుండగా ఒకనాడు నారదుడు శ్రీకృష్ణుడిని దర్శించుకోవాలని వచ్చినప్పుడు వసుదేవుడు కలిశాడు. తనకు శ్రీ మహాభాగవతుల జీవిత కథలలోని ధర్మాలను చెప్పాలని అడిగాడు. బ్రహ్మానందనిలయమైన పరమపదాన్ని పొందగలిగే భాగవత ధర్మాలను వినిపించమని కోరాడు. ఆ ప్రశ్నకు నారద మహర్షికి అమితానందం కలిగింది. ఇది వేదశాస్త్రాల నిగ్గు తేల్చే ఒక గొప్ప ప్రశ్న అన్నాడు నారదుడు. శ్రీహరి గుణాలను గురించి చెప్పడమే ఆ ప్రశ్నకు సరైన సమాధానమని చెప్పాడు. పరమాత్మ స్వరూపుడైన వాసుదేవుడి మీద భక్తి కలిగించేదీ, అద్వితీయమైన పరబ్రహ్మపదాన్ని సంప్రాప్తింపచేసేదీ అయిన ‘విదేహార్షభ సంవాదం’ పేరుతో విదేహ నగర రాజు జనకుడికి, ఋషభదేవుడి కొడుకులైన తొమ్మిదిమంది అర్షభులకు మధ్య భాగవత ధర్మాలను గురించి జరిగిన సంభాషణను వసుదేవుడికి వినిపించాడు.

‘విదేహార్షభ సంవాదం’ వినిపించి నారదుడు వసుదేవుడితో ఇలా అన్నాడు. భాగవతోత్తముల కథలు విని వసుదేవుడు పాపాలన్నిటినీ పటాపంచలు చేసుకున్నాడని, ఆ పుణ్యఫలంగా ఆయనకు విశ్వ వ్యాప్తమైన విఖ్యాతి కలుగుతుందని, ఆమీదట కైవల్యపదం ఆయన్ను వరిస్తుందని, నారాయణుడు ఆయన కొడుకన్న వ్యామోహాన్ని విడిచి సాక్షాత్ విష్ణువని గ్రహించి ఆరాధించమని చెప్పాడు. కాబట్టి శ్రీకృష్ణుడు అంటే లోక రక్షణార్థం అవతరించిన పరమ పురుషుడే అని అన్నాడు వసుదేవుడితో. దేవకీవసుదేవులు నారదుడి మాటలకు ఆశ్చర్యచకితులై శ్రీకృష్ణుడిని పరమాత్మగా చూడసాగారు.                                         

          (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)