Monday, January 18, 2010

జ్వాలా మ్యూజింగ్స్-10 (వనం వారి కృష్ణా పురం)


"వనం వారి కృష్ణా పురం-సమీపంలోని నేలకొండపల్లి"

వనం జ్వాలా నరసింహారావు

వ్యవసాయం, కరిణీకం వృత్తిగా పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలో, సరైన రహదారి సౌకర్యంకూడా లేని కుగ్రామంలో నివసిస్తుండె, ఒక శుద్ధ ఛాందస కుటుంబంలో ఆగస్ట్ 8,1948 లో పుట్టాను నేను. నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తెలంగాణా సాయుధపోరాటం ఒకపక్క, వల్లభాయి పటేల్ ఆదేశాలతో పోలీస్ యాక్షన్ మరోపక్క జరుగుతున్న రోజులవి. మా కుటుంబం కాందిశీకులుగా ఆంధ్ర ప్రాంతంలో వున్న సరిహద్దు గ్రామం గండ్రాయిలో తలదాచుకుంటున్న రోజులవి. ఒక పేద పెరికవారి ఇంట్లో పుట్టాను. కొంతకాలానికి హైదరాబాద్ రాష్ట్రంకూడా భారత దేశంలో విలీనం కావడంతో మా కుటుంబం సొంత గ్రామానికి తిరిగొచ్చింది. నా బాల్యం చాలావరకు అమ్మా-నాన్నల దగ్గర, సొంత వూళ్లోనే గడిచింది. అయిదో తరగతి దాకా గ్రామంలోని పాఠశాలలో చదువుకున్నాను.

మా వూరిపేరు వనం వారి కృష్ణా పురం. మా కుటుంబం నిప్పులమీద నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకునేటంత ఛాందస కుటుంబం. మా వూరు ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో వుంది. అత్యధిక సంఖ్యలో గిరిజనులున్న జిల్లా మాది. షెడ్యూల్డ్ ప్రాంతంకూడా అత్యధికంగా వున్న జిల్లా మాదే. దండకారణ్యంలో, దేశంలో ప్రసిద్ధికెక్కిన భద్రాచల రామాలయం మా జిల్లాలోనే వుంది. రామాలయం కట్టించిన కంచర్ల గోపన్న-భక్త రామదాసు మా సమీప గ్రామం నేలకొండపల్లి వాస్తవ్యుడు. అది మా మేనమాముండే వూరు. నేలకొండపల్లిలో ఆయన పుట్టిన ఇంటిని భక్త రామదాసు ధ్యాన మందిరంగా ఇప్పటికీ పిలుస్తున్నారు. గ్రామంలో పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన నాలుగొందల ఏళ్ల క్రితం నిర్మించినట్లు చెప్పబడుతున్న వేంకటేశ్వరాలయం , భీమేశ్వరాలయం , వేణుగోపాల స్వామి , ఉత్తరేశ్వర ఆలయాలున్నాయి ఇక్కడే.

భక్త రామదాసుగా సుప్రసిద్ధమైన కంచర్ల గోపన్న తెలుగునాట జన్మించిన భక్త మహాశయులతో మహనీయుడు. ఆయన అచంచల రామ భక్తి జగత్‌ విఖ్యాతం. నేలకొండపల్లి గ్రామంలో అతి పేద కుటుంబంలో జన్మించి, చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న గోపన్న మేనమామలైన అక్కన్న, మాదన్న వద్ద పెరిగి పెద్దవాడయ్యాడు. ఆనాడు గోల్కొండను ఏలిన తానీషా వద్ద మంత్రులుగా వుండిన అక్కన్న, మాదన్న సాయంతో గోపన్న గోదావరి తీరంలోని భద్రాచలం పరగణాల తాహసీల్దారుగా నియమితుడయ్యాడు. మహా రామ భక్తుడైన గోపన్న పన్నుల రూపంలో వసూలు చేసిన ఆరులక్షలు వరహాలను వెచ్చించి భద్రాచలంలో శ్రీరాముడికి ఆలయం నిర్మించి, నవరత్న ఖచిత ఆభరణాలెన్నో చేయించాడు. విషయం తెలిసిన తానీషా గోపన్నకు 12 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించాడు. కారాగారంలో బందీ అయిన గోపన్న శ్రీరాముడిని భజిస్తూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, దెప్పుతూ, బెదిరిస్తూ, నిష్టూర మాడుతూ రోజు కొ కీర్తన చొప్పున కొన్ని వేల కీర్తనలు రచించాడు. గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై వచ్చి తానీషాకు గోపన్న చెల్లించవలసిన ఆరు లక్షల వరహాలు చెల్లించి గోపన్నను బంధ విముక్తుడిని చేశాడు. నాటి నుండి గోపన్న భక్త రామదాసుగా ప్రసిద్ధు డయ్యాడు. కారాగారవాసంలో రామదాసు రచించిన కీర్తనలే భద్రాచల రామదాసు కీర్తనలుగా ఖ్యాతి గడించాయి.

నేలకొండపల్లి గ్రామం గొప్ప చారిత్రక స్థలం. మహాభారతంతో ముడిపడ్డ కథలొకవైపు, బౌద్ధ అవశేషాల తాలూకు చారిత్రక వాస్తవాలు మరొక వైపు ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత నిస్తున్నాయి. మహాభారతంలో పాండవుల అజ్ఞాత కాలం నాటి విరాట నగరం నేలకొండపల్లి సమీపంలో వుంది. నేలకొండపల్లికి ఒక మైలు దూరంలో మహాభారత కథతో సంబంధం కలిగిన-విరాటరాజు కొలువుగా ఆ ప్రాంతం వాళ్లు భావిస్తున్న-పురా తత్వ శాస్త్రజ్ఞులు అంగీకరించిన, విరాటరాజు దిబ్బ, కీచక గుండం అనే స్థలాలున్నాయి. సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి వున్న విరాటరాజు దిబ్బ ప్రస్తుతం పురావస్తు శాఖ వారి అధీనంలో వుంది. సమీప గ్రామస్థులు కొన్నేళ్లకింద ఆ గడ్డను తవ్వగా అలనాటి నాణాలు దొరికాయని చెప్పుకుంటారిప్పటికీ. పాండవులు అజ్ఞాతవాస సమయంలో విరాట నగరాన్ని పాలించే విరాట రాజు కొలువులో మారువేషాల్లో చేరారు. విరాట రాజు బావమరిది కీచకుడు సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదిని కామించగా, వలలుడి వేషంలో ఉన్న భీముడు కీచకుణ్ణి చంపేశాడు. ఆ విరాట నగరం ఈ ప్రాంతమేనని పౌరాణిక గాధ. మహాభారతం జరిగిందని చెప్పబడుతున్న కాలం నాటి అవశేషాలు ఇక్కడ దొరకడం విశేషం.

బౌద్ధమతానికి సంబంధించిన పలు అధారాలు నేలకొండపల్లి పరిసరాల్లో, పురా తత్వ శాఖ వారు కొనసాగిస్తున్న తవ్వకాల్లో బయటపడుతున్నాయి. ప్రపంచంలో కల్లా అతి పెద్ద దిగా భావించబడుతున్న, సుమారు రెండు కిలోమీటర్ల విస్తీర్ణమున్న బౌద్ధ రామం, ఈ ప్రాంతంలోని భూగర్భంలో వుందంటున్నారు పరిశోధకులు. 1977లో జరిపిన తవ్వకాల్లో బౌద్ధ అవశేషాలు, స్థూపాలు, విగ్రహాలు దొరకడంతో ఈ ప్రాంతంలో బౌద్ధమతం విలసిల్లిందని రూఢి పరిచారు పరిశోధకులు. అమరావతి, నాగార్జునకొండ, నేలకొండపల్లి ప్రాంతాలలో చెక్కిన బుద్ధ విగ్రహాలు ఇండోనేషియా, జావా, సుమిత్ర మొదలైన దేశాలకు ఎగుమతి అవుతుండేవట ఒకప్పుడు.



No comments:

Post a Comment