Sunday, January 3, 2010

ఉద్యమం తొలిపొద్దులో.. ... వనం జ్వాలా నరసింహారావు

Please click this link for my article published in Andhra Jyoti Daily in its Edit Page on 3rd January, 2010.

http://epaper.andhrajyothy.com/AJ/AJYOTHI/2010/01/03/ArticleHtmls/03_01_2010_004_002.shtml?Mode=1

http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2010/jan/3edit3


ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర నినాదమూ పుట్టిందనవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలుగు వారందరికీ న్యాయం జరుగుతుందని (నాడు) కొందరు భావిస్తే, తెలంగాణ ప్రాంత ప్రజలను తెలంగాణే తరులు దోపిడీకి గురిచేస్తారని-తమ సామాజిక, సాంస్కృతిక, భాషా విలువలను ఇతర ప్రాంతాల "తెలుగువారు" ఎద్దేవా చేస్తారని, తెలంగాణ కావాలని కోరుకున్న పలువురు ఆనాడే అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంత వాసులందరికి కాకపోయినా, చాలామందికి, విడిపోయి, "తెలంగాణ" రాష్ట్ర ఏర్పాటు జరిగి, ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలోనే వుంటూ, అన్నదమ్ములలాగా మెలుగుతే మంచిదన్న భావన బలంగా నాటుకు పోయింది.

అలా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటున్న వారిలో ఐదు దశాబ్దాల క్రితమే ఆ నినాదం లేవనెత్తిన కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి ఆ తరం వారితో సహా, తరాలు మారినా రెండో తరం-మూడో తరం వారూ, ఒక వంశపారంపర్య నినాదంలాగా-లక్ష్యం, ధ్యేయం లాగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాలని కోరుకుంటున్నారు. అయినా పాలకవర్గాలు ఆ నినాదానికున్న ఆదరణను సరిగ్గా అంచనా వేయడం లేదనే అనాలి.

సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం (మా) ఖమ్మం జిల్లాల్లో-ఖమ్మం, కొత్తగూడెం పట్టనాలలో, ఆరంభమైంది "ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం". కొత్తగూడెం సింగరేణి సంస్థలో పనిచేస్తుండే ఒక చిరుద్యోగి సర్వీసుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంలో అతడు తెలంగాణ వాడు కావడంవల్ల జరిగిన తీరని అన్యాయం జరిగింది. దీంతో ఆయన సహోద్యోగులందరూ తమ న్యాయమైన హక్కులకొరకు పోరాటం సాగించారు. ఆ పోరాటమే చిలికి చిలికి గాలివానగా మారి, ఖమ్మం పట్టణం చేరుకుంది. ఖమ్మం కళాశాల విద్యార్థి "రవీంద్రనాథ్" (మా జూనియర్) ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ "గాంధి చౌక్" లోని గాంధి విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. నాకు తెలిసినంతవరకు అతడే మొట్టమొదటి సారిగా తెలంగాణకొరకు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నవ్యక్తి. అప్పట్లో రాష్ట్ర హోం మంత్రిగా వున్న జలగం వెంగళ రావు ఉద్యమాన్ని అణచడానికి తన రాజకీయ చతురతను చూపాడు.

కొత్తగూడెం-ఖమ్మంలో ఉద్యమం మొదలవడానికి సుమారు ఆరు నెలల క్రితం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని "ఏ" హాస్టల్లో, నాటి విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి (నాకు నాలుగేళ్లు సీనియర్) రూమ్ లో, మల్లికార్జున్ (ఇప్పటి కీర్తి శేషులు) తో సహా పలువురు విద్యార్థి నాయకులు సమావేశమయ్యారు. "విద్యార్థి కార్యాచరణ కమిటీ" పేరుతో ఒక సంస్థను నెలకొల్పి ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమించాలని తీర్మానించారు. వాస్తవానికి శ్రీధర రెడ్డి, భవిష్యత్ లో రూపు దిద్దుకోనున్న, బ్రహ్మాండమైన వేర్పాటు ఉద్యమానికి తొలి రాష్ట్ర స్థాయి నాయకుడనాలి.

ఆయన నాయకత్వంలోని విద్యార్థులందరూ స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని (ఆయన రెండోసారి 1989-1990 లో ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆయనకు ముఖ్య పౌర సంబంధాల అధికారిగా పని చేశాను) కలిసి, ఉద్యమానికి నాయకత్వం వహించమని కోరారు. వందేమాతరం రామచంద్ర రావు వేసిన ఎన్నికల పిటీషన్ లో, ఉన్నత న్యాయస్థానం తీర్పు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా వచ్చిన నేపధ్యంలో, ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడైనందున, తన రాజకీయ పునరావాసానికి ప్రయత్నం చేస్తున్న రోజులవి. చెన్నారెడ్డి ఉద్యమానికి నాయకత్వం చేపట్టడానికి ముందే, ఉద్యమం వూపందుకోవడం-మధ్యలో ఖమ్మంలో విద్యార్థి వుద్యమం మొదలవడం, ఒకటి వెంట ఒకటి జరిగాయి.

చెన్నారెడ్డి నాయకత్వం వహించడానికి పూర్వమే జరిగిన ఉద్యమంలో శ్రీధర రెడ్డి, బద్రి విశాల పిట్టి, మల్లికార్జున్, ఆమోస్ లాంటి ప్రముఖులు అరెస్ట్ కావడం-జైలుకెళ్లడం జరిగింది. ఆ ఉద్యమం సాగుతున్న రోజుల్లోనే మాజీమంత్రి స్వర్గీయ మదన్ మోహన్ నాయకత్వంలో మరో సంస్థ ఆవిర్భవించింది. చివరకు అన్నీ కలిసి ఉమ్మడిగా ఉద్యమించాయి. ఏకమైన సంస్థలన్నీ కలిసి మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో "తెలంగాణ ప్రజా సమితి" పేరుతో బ్రహ్మాండమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపాయి.

హింసాత్మకంగా మారిన ఉద్యమంలో మూడొందల మంది పైగా యువకులు, విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు. 1971 సాధారణ ఎన్నికల్లో "టీ పీ ఎస్" పేరుతో రాజకీయ పార్టీగా బరిలోకి దిగిన తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీచేసి, 11 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రజాభిప్రాయం తెలంగాణ ఏర్పాటేనని స్పష్టంగా ఓటర్లు తెలియచేశారు. అప్పుడే నైతికంగా తెలంగాణ ఏర్పాటు జరిగిపోయుండాల్సింది. కాని జరగలేదు.

ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి తన ప్రజా సమితిని విలీనం చేశారు. తెలంగాణ ఏర్పడడానికి బదులు కేంద్రం మరికొన్ని రాయితీలను ఉపశమనంగా ప్రకటించింది. ఉవ్వెత్తున లేచిన ఉద్యమం మోసంతో అణచబడింది. ఉద్యమంలో పాలుపంచుకొని రాజకీయ లబ్ది పొందిన పలువురు నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పదవులనుభవించారు. ఇంకా అనుభవిస్తూనే వున్నారు. కొంద రైతే వారసత్వంగా అనుభవిస్తున్నారు.

వనం జ్వాలా నరసింహారావు

1 comment:

  1. తెలంగాణా చరిత్రకు సంబంధించిన విలువైన సమాచారం ఇస్తున్నట్లుంది కదూ. 1948 తర్వాత చరిత్రకు సంబంధించిన విశేషాలను హృద్యంగా చెప్పారు. అందుకు అభినందనలు. నా చందమామ బ్లాగులో మీ బ్లాగును జోడించాను. తప్పకుండా అనుసరిస్తాను.

    రాజశేఖర రాజు
    చందమామ
    krajasekhara@gmail.com
    rajasekhara.raju@chandamama.com
    blaagu.com/chandamamalu (my blog)
    telugu.chandamama.com (our website)

    ReplyDelete