Tuesday, January 12, 2010

జ్వాలా మ్యూజింగ్స్-5 (హాలీవుడ్ యూనివర్సల్ స్టూడియో)

ఉడ్ లాండ్ హిల్స్-ఓక్ ఉడ్ అపార్ట్ మెంట్స్ నుంచి హాలీవుడ్ కు

వనం జ్వాలా నరసింహారావు

లాస్ ఏంజల్స్ కు వచ్చిన మూడో నాడు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం. దారిలో యూనివర్సల్ స్టూడియోలు చూసి వెళ్లాలన్నది ఆలోచన. లాస్ ఏంజల్స్ సబర్బ్ లోని ప్రశాంత్ వుండే ఉడ్ లాండ్ హిల్స్ నుంచి సుమారు 10 మైళ్ల దూరంలో వున్న స్టూడియోలకు వెళ్లడానికి డౌన్ టౌన్ మార్గంలో వెళ్లాల్సి వుంటుంది. అక్కడ నుంచి వెనక్కు రాకుండానే, అటు నుంచి అటే శాంతా క్లారాకు వెళ్లొచ్చు. కాలిఫోర్నియా-లాస్ ఏంజల్స్ కౌంటీ లోని అందమైన “ఫెర్నాండో లోయ” లో వుంది యూనివర్సల్ సిటీ ప్రాంతం. ఫెర్నాండో లోయ సుమారు 250 చదరపు మైళ్ల విస్తీర్ణంలో, వాయువ్యాన శాంత సుజనా కొండలు-పశ్చిమాన సిమి కొండలు-దక్షిణాన శాంత మోనికా కొండలు-తూర్పున వెర్డుగో కొండలు-ఈశాన్యంలో సాన్ గాబ్రియల్ కొండలతో వ్యాపించి వుంటుంది. లాస్ ఏంజల్స్ నది సమీపంలోనే ప్రవహిస్తుంటుంది. యూనివర్సల్ స్టూడియోలకు చెందిన 400 ఎకరాలకు (65 చదరపు మైళ్ల విస్తీర్ణంలో) పైగా వున్న సొంత స్థలంలో వుందీ యూనివర్సల్ సిటీ. ఇందులో డబ్బై శాతం లాస్ ఏంజల్స్ నగర సరిహద్దులకు వెలుపల, మిగాతాది సరిహద్దుల్లోను వుండడానికి కూడా తగిన కారణం వుంది. ఒక విధంగా స్టూడియోలు లాస్ ఏంజల్స్ లో వున్నాయని చెప్పుకునేందుకు, మరో విధంగా నగర స్థాయి వాణిజ్య పన్నులను-ఇతర నిబంధనలను అధిగమించేందుకు ఈ విధమైన ఏర్పాటుచేశారు నిర్వాహకులు. శాంత మోనికా కొండల పక్కనుంచి పోయే “ముల్హోలాండ్ డ్రైవ్”, ఫెర్నాండో లోయకు-హాలీవుడ్ కు మధ్య సరిహద్దని చెప్పుకోవచ్చు.


యూనివర్సల్ సిటీ ప్రాంతంలో, ఒక 36 అంతస్థుల భవనంతో సహా పది సిటీ ప్లాజాలు, హాలీ వుడ్ స్టూడియో-థీమ్ పార్క్, వాణిజ్య-వినోద కేంద్రమైన యూనివర్సల్ సిటీ వాక్, యూనివర్సల్ సెట్టింగుల లాంటివి అనేకం వున్నాయి. 36 అంతస్థుల భవనంలోనే యూనివర్సల్ స్టూడియోలు-అమెరికన్ టెలివిజన్ నెట్ వర్క్ నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ (ఎన్. బి. సి) లకు చెందిన వివిధ విభాగాలుంటాయి. ఎన్. బి. సి కి చెందిన ఒక విభాగమైన యూనివర్సల్ సిటీ స్టూడియోలు, అమెరికాలోని ఆరు భారీ సినీ స్టూడియోలలో ఒకటి. దీనికి చెందిన ప్రధాన నిర్మాణ-పంపిణీ యూనిట్ ను “యూనివర్సల్ పిక్చర్స్” అంటారు. సుమారు 100 సంవత్సరాల క్రితం, 1912 లో, జర్మనీ నుంచి వలస వచ్చిన జ్యూ స్థాపించిన అమెరికన్ మూవీ స్టూడియో ఇది.


రోజంతా-ఆ మాటకొస్తే నెల రోజులు కలియ తిరిగినా, ఇంకా-ఇంకా చూడాలని పించే ఆహ్లాద భరితమైన విహార స్థలం "లాస్ ఏంజల్స్ ఎంటర్ టైన్ మెంట్ రాజధాని" గా పేర్కొన బడే "హాలీవుడ్ యూనివర్సల్ స్టూడియోలు". ప్రశాంత్-వాడి భార్య-కూతురు మాతో పాటు రాకుండా కొంచెం ఆలశ్యంగా వచ్చి మాతో కలిసి తిరిగారు. మేం అక్కడకు చేరుకునే సరికి ఉదయం పది గంటల పైన అయింది. కారు పార్క్ చేసి, సిటీ ప్లాజా లిఫ్ట్ ద్వారా స్టూడియో ప్రాంగణం చేరుకున్నాం. వెలుపలే అద్భుత సుందర దృశ్యాలు కనిపిస్తాయి. అన్ష్ కెందుకో చిరు కోపం వచ్చి నందువల్ల వాడిని సముదాయించి, టికెట్ కొనుక్కొని, లోనికెళ్లాం. అలాంటి ప్రదేశాల్లో సరైన "ప్రణాళిక" తో చూడాల్సినవి ఎంపిక చేసుకోకపోతే సమయం వృధా కావడమే కాకుండా, ముఖ్యమయినవి చూడలేక పోతాం. ఆదిత్య అంతకుముందు రాకపోయినా కరపత్రాలలో సమాచారం ఆధారంగా ముందు-వెనుకల చూడాల్సిన వాటిని చక్కగా ప్లాన్ చేశాడు.


ప్రశాంత్ వాళ్లొచ్చే లోపు మేం ముగ్గురం చూసిన వాటిలో మొదటిది "సైమన్ జె స్మిత్" దర్శకత్వంలో నిర్మించిన పదహారు నిమిషాల నిడివిగల "ష్రెక్-4-డి" లఘు చిత్రం. మొదలు మమ్మల్నందరిని డంజన్ లాగా వున్న ఒక గదిలో కాసే పుంచి, ఇరువైపుల వున్న రెండు భారీ టెలివిజన్ మోస్తారు స్క్రీన్ల ద్వారా కథను టూకీగా తెలియచేస్తారు నిర్వాహకులు. లార్డ్ ఫార్క్వాద్ ప్రేతాత్మ, తానెలా సర్పా కార డ్రాగన్ నోటి నుంచి తప్పించుకొని, "పినొక్ జో", "జింగీ", "ఫెయిరీ టెయిల్ పాత్రలైన మూడు పంది పిల్లలను" బందీలుగా తన వద్ద వుంచుకొని చిత్రహింసలకు గురిచేస్తున్నదో తెలియచేసే సీన్ చూపిస్తారు. సినిమా చూడడానికొచ్చిన ప్రతి వారినీ తనకు కావాల్సిన సమాధానాలు వచ్చేంతవరకు హింసిస్తానని అంటుందా ప్రేతాత్మ. ప్రేక్షకులకు భద్రతకు సంబంధించిన సూచనలు-సలహాలు ఇచ్చిన తర్వాత థియేటర్ ద్వారాలు తెరుచుకుంటాయి. సినిమా ఆసాంతం, చూస్తున్నంతసేపు, మనమీదకు అందులోని పాత్రలు ఉరికొస్తున్న ఫీలింగ్‌ కలిగేలా వుంటుంది.కూర్చున్న కుర్చీలు, కదలాల్సిన సీన్ వచ్చినప్పుడల్లా, దడ-దడ శబ్దం చేస్తూ, గగుర్పొడిచే విధంగా ముందుకూ-వెనక్కూ కదుల్తుండే ఏర్పాటు ఆటోమాటిక్ గా చేసుంటుంది థియేటర్ లో. అందరం ఎంజాయ్ చేశాం. సినిమా చూడడానికి ప్రత్యేకంగా తయారు చేసిన కళ్లద్దాలనిస్తారు పెట్టుకునేందుకు. తిరిగెళ్లేటప్పుడు అవి వాపస్ చెయ్యాలి.


"రివెంజ్ ఆఫ్ ది మమ్మీ"-భయంకరమైన అనుభూతినిచ్చే ఒక అడ్వంచర్స్ రైడ్. సాంకేతిక సహాయంతో, వేలాది మైళ్ల వేగంతో వస్తున్నట్లనిపించే, మమ్మీల సందడితో సరదాగా వుందది. "జురాసిక్ పార్క్ రైడ్ అడ్వంచర్", నీళ్లలో కలిగించే మరో అనుభూతి. జురాసిక్ పార్క్ సినిమా ఇంకా నిర్మాణంలో వున్నప్పుడే, హాలీవుడ్ యూనివర్సల్ స్టూడియోలలో జురాసిక్ రైడ్ పేరుతో ఆరంభించారు. "అడ్వంచర్స్ ఆఫ్ క్యూరి యస్ గైడ్", "టెర్మినేటర్", "వాటర్ వరల్డ్", "హౌజ్ ఆఫ్ హారర్స్" లాంటివి మరికొన్ని చూశాం. ఇంతలో ప్రశాంత్ వాళ్లొచ్చి కలిశారు. అందరం మొదలు "స్టూడియో టూర్" కు బయల్దేరాం.


“స్టూడియో టూర్” కంటే ముందు అన్ష్ ఏదో చూద్దామంటే సుదూరంలో వున్న ఒక ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడకు పోవడానికి ఐదారు "ఎస్కలేటర్లు" దిగి, తిరిగి రావడానికి ఎక్కాలి. మా శ్రీమతి ఎస్కలేటర్ ఉపయోగించడానికి గత పదేళ్ల గా నేను చేసిన ఏ ప్రయత్నం ఫలించ లేదింతవరకు. లోగడ అమెరికా వచ్చినప్పుడు-ఇప్పుడు కూడా, అన్ని ఎయిర్ పోర్ట్ లలో లిఫ్ట్ ఎక్కడుందో వెతికి మరీ ఉపయోగించటం ఆమెకు అలవాటై పోయింది. ఎస్కలేటర్ అంటే ఎందుకో భయం ఆమెకు. ఆ భయం తీరేటట్లు చేశాడు ఆదిత్య-అన్ష్ కలిసి. ఎట్లాగో అందులో నిలిపి కిందకు దింపాం. అక్కడున్న రైడ్ చూసి, తిరిగి పైకెక్కుతుంటే-బహుశా అమెరికా చరిత్రలోనే మొదటిసారి అయుండాలి-మధ్యలో ఎస్కలేటర్ విద్యుత్ సరఫరా లోపంవల్ల ఆగిపోయింది. ఇంతవరకెప్పుడూ యూనివర్సల్ లో అలా జరగలేదని అక్కడివారందరూ అనుకుంటుంటే ఆశ్చర్యపోయాం. అది మా శ్రీమతి మహిమేనేమో! ఎస్కలేటర్ మెట్లెక్కి పైకొచ్చిందెలాగో. ఇక ఆమెను మళ్లీ ఎక్కించడం మా తరం కాదే మో అనుకున్నాం. అదేం మహిమోగాని, ఇక అప్పటి నుంచి, నాకంటే తనే ముందుగా ఎక్కడెక్కడ ఎస్కలేటర్ ఉపయోగించుకునే వీలుంటుందో అక్కడ పరిగెత్తి మరీ చేరుకుంటున్నది.


అన్నింటిలోకి అద్భుతమైన అనుభూతి “స్టూడియో టూర్”. అందరం కలిసి ట్రెయిన్ లాంటి బస్సెక్కాం. ప్రయాణం సాగినంతసేపు నిర్వాహకులకు చెందిన వ్యక్తి దారి పొడుగూ వ్యాఖ్యానం చెప్తూనే వుంటాడు. స్టూడియో ఆవరణలో వున్న ప్రదేశాలన్నీ చూపించడమే కాకుండా, సినిమాలు తీసేటప్పుడు ఉపయోగించే సాంకేతికపరమైన ట్రిక్కులు-టెక్నిక్కులు ప్రయోగాత్మకంగా దారి పొడుగూ ప్రదర్శించి చూపారు. సినిమాల్లో జలపాతాలను ఎలా సృష్టిస్తారో చూపించినప్పుడు ఆశ్చర్య పోయాం. అలానే అగ్నిప్రమాదాలు సంభవించడం, భూకంపాలు చోటుచేసుకోవడం సినిమాల్లో రూపొందించే విధానం చూసి సాంకేతిక పరంగా "సినిమా తీయడానికి కాదే దీ అనర్హం" అనిపించింది. ఎక్కడా అసహజంగా ఏదీ అనిపించదు. వర్షం కురిపించి-వరదలు-వాగులు సృష్టించి-అందులో కొట్టుకుపోతున్న వారిని చూసి క్షణం పాటు నివ్వెరపడి పోయాం. సినిమాల్లో ప్రమాదాలకు కార్లు గురైనప్పుడు అవి కింద-మీదా పడి ఎగురుతుంటే, బాంబు దాడుల్లో తునా-తునకలై పోతుంటే-అగ్ని ప్రమాదంలో మాడి-మసై పోతుంటే, ఇదంతా నిజంగా జరిగి నిర్మాతలకు నష్టం జరుగుతుందని బాధ పడతాం. అదంతా ఉట్టిట్టిదేనని స్టూడియో టూర్ లో తేలిపోయింది. అంతా సాంకేతికంగా జరిగే వ్యవహారమే. అలానే వంతెన మీద రైలో-బస్సో పోతుంటే, కూలినప్పుడు అందులో వున్న మనకు కలిగే భయబ్రాంతులను, భూకంపం వచ్చినప్పుడు మన మందులో ఇరుక్కొని పోతే ఎలా వుంటుంది కళ్లకు కట్టినట్లు చూడవచ్చు-అనుభూతి పొందవచ్చు. భారీ విమాన ప్రమాదం జరిగిన దుర్ఘటనలో చోటుచేసుకున్న పరిణామాలను దగ్గరగా చూడవచ్చు.

ఇవన్నీ చూసి, కలిసి అక్కడ దొరికిందేదో తిని, ప్రశాంత్ వాళ్లను వెళ్లమని చెప్పి, మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తిరుగు ప్రయాణమై, సాయంత్రం ఎనిమిది గంటల కల్లా శాంతా క్లారా చేరుకున్నాం. పారుల్ పెట్టిన భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాం.

No comments:

Post a Comment