Sunday, January 10, 2010

జ్వాలా మ్యూజింగ్స్-3 (శాంతా క్లారా టు లాస్ ఏంజల్స్)

శాంతా క్లారా నుండి లాస్ ఏంజల్స్ కు కారులో ప్రయాణం

వనం జ్వాలా నరసింహారావు

అమెరికా-ఉత్తర కాలిఫోర్నియాలోని "శాన్ ఫ్రాన్ సిస్కో" సాగర తీరానికి దక్షిణ భాగాన వున్న అందమైన లోయ ప్రదేశమే "శాంతా క్లారా వాలీ". శాంతా క్లారా కౌంటీ లోని ఎక్కువ భాగంతో సహా శానోజ్ నగరం కూడా ఈ లోయలోనే వున్నాయి. "హృదయాలను పులకరించే మధురమైన లోయ" గా ఒకప్పుడు కవులచే అభివర్ణించబడిన ఈ లోయ ప్రాంతమంతా, ఇప్పటికీ మైళ్ల పర్యంతం, అందమైన వృక్షాలు-పూల పొదలు-పళ్ల చెట్లు-కూరగాయల తోటలు, వ్యాపించి వుంటాయి. 1960 సంవత్సరం వరకు, ప్రపంచంలోనే అతి పెద్ద పళ్ల ఉత్పత్తి ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిందీ లోయ. చుట్టుపక్కలంతా సారవంతమైన భూమి వుండడంతో, వ్యవసాయ ప్రాధాన్యమైన ప్రాంతంగా ఒకప్పుడుండే శాంతా క్లారాలోని చాలా భాగం, క్రమేణ నగరంగా మారిపోయినప్పటికీ, ఇంకా గ్రామీణ ఛాయలు పరిసరాల్లో-ముఖ్యంగా లాస్ ఏంజల్స్ దిక్కుగా పోతుంటే ప్రస్ఫుటంగా దర్శనమిస్తాయి. వాస్తవానికి, "శాంతా క్లారా వాలీ", ఈనాడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన "సిలికాన్ వాలీ", ఒకదానిలో ఇంకోటి అంతర్భాగమే. శాంతా క్లారా వాలీ ఉత్తర కొనే, శాన్ ఫ్రాన్ సిస్కో సాగర తీరానికి దక్షిణాన చివరి ముక్క. వాలీకి నైరుతీ భాగాన అందమైన "శాంతా క్రజ్ పర్వత సముదాయం", ఈశాన్య భాగాన "డైబ్లో కనుమలు" వ్యాపించి వుంటాయి. శాంతా క్లారా నగర ప్రాంతంలోని లిక్ మిల్ రోడ్ లోని ఒక భవన సముదాయంలో మా అబ్బాయి ఆదిత్య వుండే ఫ్లాట్ వుంది.


శాంతా క్లారా చేరుకోవడానికి, హైదరాబాద్ శంషాబాద్ నుంచి బయలుదేరిన మే మెక్కిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ విమానం, శాన్ ఫ్రాన్ సిస్కో విమానాశ్రయంలో లాండ్ అవుతుంటే అదో అద్భుత దృశ్యంలాగా వుంటుంది. సరాసరి సముద్రం మీదనుంచి, అందులో పడబోతోందా అన్న భయం కలిగే విధంగా, పక్కనే నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుంది. ఈ ఒక్కటే కాదు: చుట్టుపక్కలున్న, ఓక్ లాండ్, శాంతా క్లారా, శానోజ్ విమానాశ్రయాలు కూడా అలానే వుంటాయిక్కడ. చుట్టూ సముద్రం-మధ్యలో ఒక ద్వీప కల్పం లాగా విమానాశ్రయం.


శాంతా క్లారా నుండి లాస్ ఏంజల్స్ కు సుమారు 350 మైళ్ల దూరం. విమానాలు, బస్సులున్నప్పటికీ, అక్కడినుంచి డిస్నీ లాండ్ కు-హాలీవుడ్ స్టూడియోలున్న ప్రదేశానికి వెళ్లి రావడానికి నిర్ణయించుకున్నందున మేం (అబ్బాయి ఆదిత్య, శ్రీమతి విజయలక్ష్మి, మనుమడు అన్ష్, నేను) కారులో వెళ్లాం. అక్కడెలాగు మా శ్రీమతి అక్క కొడుకు ప్రశాంత్ ఉద్యోగ రీత్యా వుంటున్నందువల్ల వాడింట్లోనే వుండి చుట్టుపక్కల ప్రదేశాలను చూద్దామనుకున్నాం.


సుమారు ఐదున్నర గంటల ప్రయాణం ఆహ్లాద భరితంగా గడవడానికి కారణం ఆరు సంవత్సరాల వయసున్న మా మనుమడు అన్ష్. వాడికెందుకో నామీద ఆ ప్రయాణంలో కోపమొచ్చింది. హైదరాబాద్ నుంచి శాన్ ఫ్రాన్ సిస్కోకు చేసిన విమాన ప్రయాణంలో వాడికిష్టమైన వాడిని నేనైతే, ఈ ప్రయాణంలో, ఆ ఇష్టం వాడి అమ్మమ్మ మీదికి పోయింది. పైగా నాపై ప్రదర్శించిన కోపానికి వాడిదైన పరిభాషలో, నా పై సినిమా తీసే ప్రతిపాదన దాకా పోయింది. ఆ సినిమాకు వాడే పేరు పెట్టాడు. వాడు తీద్దామనుకున్న ఆ సినిమా పేరు: "అల్ట్రా నైట్రోజెన్ ఉల్టా తాతయ్య-ప్యార్ కర్నేసే వజే ట్రబుల్ కర్తా హై". దారి పొడుగూ, వాడెలా ఆ సినిమాకి కథ, మాటలు, పాటలు రాయ దల్చుకుంది, స్క్రీన్ ప్లే ఎలా వుండబోతుంది, సంగీతం ఎలా సమ కూర్చదల్చాడు అన్నీ వివరించాడు. సినిమాలో నన్ను విలన్ పాత్రకు, వాడి అమ్మమ్మను ప్రధాన పాత్రకు ఎంపిక చేశాడు. నన్నెలా వాడు తన ఆధీనంలో వుంచుకోదలిచాడో అసలు-సిసలైన అనుభవజ్ఞుడైన సినీ దర్శకుడిలా వర్ణిస్తుంటే ఆనందం-ఆశ్చర్యం కలిగింది. గర్వంగా కూడా ఫీలయ్యాం.


శాంతా క్లారా-లాస్ ఏంజల్స్ మధ్య కారు ప్రయాణం చేస్తుంటే విస్తారమైన పంట భూములు, ట్రాక్టర్ల సహాయంతో వ్యవసాయం చేస్తున్న అమెరికన్లు, లారీలలో నింపుకొని తీసుకెళ్తున్న టొమాటోలు-బంగాళ దుంపలు, దారి పొడుగూ కనిపించే రోడ్ పక్కనున్న పంటపొలాల్లో ఏర్పాటు చేసిన కూరగాయల-పళ్ల అమ్మకం దుకాణాలు, సాగునీరు-తాగు నీరు సరఫరాకు సంబంధించిన చెరువులు-నదులు, వాటిపై నిర్మించిన ఆనకట్టలు-రిజర్వాయర్లు, అనేకం దర్శనమిస్తాయి. మన దేశంలో ప్రయాణం చేస్తున్నట్లే అనిపిస్తుంది మధ్య-మధ్యలో. ఆ సుందర దృశ్యాలను ఆస్వాదించుకుంటూ ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో బయలుదేరిన వాళ్లం, సాయంత్రం అయిదింటికల్లా ప్రశాంత్ వుండే ఫ్లాట్ కు చేరుకున్నాం. అమెరికాలో ఎవరినీ అడ్రెస్ అడగక్కరలేదు. జీ.పి.ఎస్ సహాయంతో సరాసరి ఇంటి ముందు వాలొచ్చు. వెళ్తూనే కాళ్లు-చేతులు కడుక్కొని, చీకటి పడగానే, ప్రశాంత్-వాడి భార్య-కూతురుతో సహా అందరం సమీపంలోని "మాలిబు బీచ్" చూడ్డానికి వెళ్లాం.


కాలిఫోర్నియా-పశ్చిమ లాస్ ఏంజల్స్ కౌంటీ లో, సుమారు 20 మైళ్ల నిడివున్నపసిఫిక్ సముద్ర తీరప్రాంతమే "మాలిబు" అని పిలువబడే చిన్న పట్టణం. పూనా-ముంబై మధ్యలో, ఖండాలా లోయలో, హిందీ సినిమా యాక్టర్లు కట్టుకున్నట్లే, హాలీవుడ్ కు చెందిన ఎందరో సినీ తారలు మాలిబు పరిసరాల్లో ఆకాశ హర్మ్యాలను నిర్మించుకున్నారు. మాలిబు బీచ్, లాస్ ఏంజల్స్ ప్రాంతంలో చలి వున్నప్పుడు కూడా, వేడిగా వుంటుందని ప్రతీతి. దక్షిణ ప్రాంత కాలిఫోర్నియాకు చెందిన ధనవంతులైన పారిశ్రామిక వేత్తల ఇళ్లు కూడా మాలిబు బీచ్ ప్రాంతంలోనే వుంటాయి. పసిఫిక్ మహాసముద్రం తీరానికి కేవలం వందల మీటర్ల దూరంలోనే, దాదాపు సముద్రాన్ని ఆనుకొనే వీళ్ల ఇళ్లుంటాయక్కడ. అలా అంత చేరువలో వుంటూ సముద్రాన్ని-బీచ్ నూ అనునిత్యం దర్శించుకొని ఆనందిస్తుంటారు.


మాలిబు బీచ్ కు మేం చేరుకొనేసరికి సుమారు రాత్రి ఎనిమిదయింది. అయినా వందల సంఖ్యలో పర్యాటకులున్నారింకా. సముద్రంలో దిగి కాసేపు, బీచ్ లో కూచొని ఇంకొంచెం సేపు, సరదాగా గడిపాం. మాకంటే కూడా చిన్న పిల్లలిద్దరు బాగా ఎంజాయ్ చేశారు. మర్నాడు ఉదయమే డిస్నీ లాండ్ ప్రోగ్రాం వుంది కనుక ఆలశ్యం చేయకుండా, త్వరగా ఇల్లు చేరుకున్నాం.

No comments:

Post a Comment