సూర్య దిన పత్రిక (10-03-2012)
వనం జ్వాలా నరసింహారావు
ఏభై జిల్లాల్లో ఒక్క సీటూ రాని కాంగ్రెస్, బీజేపీ పరిస్థితీ అంతంత మాత్రమే! , ఓడిపోయినా గట్టి పోటీనే ఇచ్చిన బీఎస్పీ, ములాయంకే మేలు చేసిన రాహుల్ ప్రచారం, 2 శాతం ఓట్ల తేడాతో ఎస్పీ విజయకేతనం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య లీల ఇది!-ఎడిటర్ సూర్య
మినీ సార్వత్రిక ఎన్నికలలో ఒక్క మణిపూర్‌లో మినహా, మరే రాష్ట్రంలోనూ, కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ స్థానాలు రాలేదు. గోవా ఊడిపోయింది. ఉత్తరాఖండ్‍లో పరిస్థితి కొంచెం మెరుగే అనాలి. గెలుస్తామనుకున్న పంజాబ్‌లోనూ ఆశ్చర్యకరంగా ఎదురు దెబ్బే తగిలింది. ఇవన్నీ ఒక ఎత్తైతే అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో తగిలిన దెబ్బ ఇంకొంచెం ఘాటైందనే అనాలి. రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఎదురైన ఈ ఆశాభంగం దేనికి సంకేతమో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన ఎవరికైనా సహజంగానే బయటకు కనిపించేది, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఉమ్మడిగా-విడివిడిగా ప్రచారం చేసినప్పటికీ, ఉత్తర ప్రదేశ్ ఫలితాలు ఇంత ఘోరంగా వచ్చాయనేదే. మరీ విడ్డూరం రాయ్ బరేలి, అమేథిలలో ఎదురైన ఓటమి. సుమారు ఏబై జిల్లాలలో ఒక్క టంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి రాకపోవడం కూడా చెప్పుకోవాల్సిన విషయమే. భారత జాతీయ కాంగ్రెస్ పరిస్థితి ఇలా వుంటే, మరో జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రమే వుంది. ఒకవైపు సీట్ల సంఖ్య తగ్గడమే కాకుండా, మరోవైపు, ఓటర్లు కూడా నిరాదరణ కనబర్చారు బీజేపీ పట్ల. ఓడిపోతుందనుకున్న మాయావతి పార్టీ, ఓట్ల పరంగా చూస్తే గట్టి పోటీనే ఇచ్చిందనాలి. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో, అఖిలేష్-ములాయంల సమాజ్ వాదీ పార్టీ సంఖ్యాపరంగా తిరుగులేని మెజారిటీ సాధించి విజయ కేతనం ఎగురవేసింది. గెలిచింది "ముస్లిం-యాదవ్" ల కాంబినేషన్ ఫార్ములావల్లనా? యాంటీ మాయావతీ ఓటుతోనా? మాయావతికి అంటగట్టబడిన బ్రాహ్మణ వ్యతిరేకతా? రాహుల్ అసమర్థతా? స్థానిక కాంగ్రెస్ నాయకత్వం వైఫల్యమా? చిన్న రాష్ట్రాల వాదన-రాష్ట్ర విభజన ప్రతిపాదన సరైంది కాదన్న భావనా? అవినీతికి వ్యతిరేకంగా పడ్డ ఓటే ఐతే, పంజాబ్‌లో అకాలీ-బీజేపీ కూటమి ఎలా గెలిచింది? ఉత్తరాఖండ్‍లో ఖండూరీ ఓడిపోయి, అవినీతి ఆరోపణలున్న ఫోక్రాల్ ఎలా గెలిచారు? అవినీతి ఆరోపణలున్న బీజేపీకి అన్ని సీట్లు ఎలా వచ్చాయి? సరే, గోవాలో అవినీతికి కాంగ్రెస్ మూల్యం చెల్లించిందనుకుందాం కాని ఇతర రాష్ట్రాలలో పరిస్థితి అలా లేదే?
నిజంగా కాంగ్రెస్‌కు ఆశాభంగం కలిగిందా? యువరాజు రాహుల్ ఉత్తర ప్రదేశ్‌కు వచ్చి, నలుమూలలా తిరిగి, చెమటోడ్చినా ఫలితం దక్కలేదందామా? ఉత్తర ప్రదేశ్‌లో దాదాపు మరణావస్తలో వున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి జవ జీవాలు నింపేందుకు రాహుల్ ఏ మాత్రం కృషి చేయలేదా? రాహుల్ కరిష్మా అసలే మాత్రం పని చేయలేదా? ప్రియాంక పరిస్థితీ అంతేనా? యూపీలో తళుక్కుమంటూ మెరిసిన నవ యువ తార అఖిలేష్ సింగ్ యాదవ్ ముందు రాహుల్ ప్రభ వెలిసిపోయినట్లయిందా? చివరికి... సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీలో లోక్‌సభ నియోజకవర్గంలోనూ ఒక్క సెగ్మెంట్‌ను సొంతం చేసుకోలేక పోవడానికి కారణాలేమై వుండవచ్చు? మాయావతి నూతనంగా రూపొందించిన సామాజిక ఫార్ములా, బహుశా, ములాయం "ముస్లిం - యాదవ్ సమ్మేళన వ్యూహం" ముందు బలాదూరైందేమో? అగ్రవర్ణాల ఓట్లు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలిపోయి వుండవచ్చు. ములాయం సింగ్ యాదవ్-అఖిలేష్ సింగ్ యాదవ్‍ల సమాజ్ వాదీ పార్టీకి 29% మంది ఓటర్లు మాత్రమే మద్దతిచ్చి అఖండమైన మెజారిటీ ఇచ్చారందామా? లేక అధిక సంఖ్యాక 71% మంది ఓటర్లు వ్యతిరేకించి, కేవలం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పుణ్యమా అని వారికి అధికారంలో కొచ్చే వీలు కలిగించిందని హెచ్చరించుదామా? మాయావతి బహు జన సమాజ్ వాదీకి వచ్చిన ఓట్లు (26%) ములాయం కంటే కేవలం మూడు శాతమే తక్కువ. జాతీయ పార్టీలైన భారతీయ జనతా, కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన ఓట్ల తేడా కూడా (16% - 14%) రెండు శాతమే. ములాయంకు వచ్చిన ఓట్లలో సగం వచ్చినప్పటికీ కాంగ్రెస్ కు సీట్ల పరంగా పాతిక కూడా రాలేకపోవటం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బ్యూటీ!
ఉత్తర ప్రదేశ్‌లో, ఖచ్చితంగా చెప్పాలంటే, ఓటర్లు వ్యతిరేకించింది మాయావతి బహు జన సమాజ్ వాదీ పార్టీని. ఎందుకంటే అధిప్పుడు అధికారంలో వుంది కాబట్టి. అలానే, అధికారంలోకి రావాలని, ఒకప్పుడు ఒంటరిగా, కొంతకాలం సంకీర్ణంలో అధికారం వెలగబెట్టిన భారతీయ జనతాపార్టీని కూడా ఓటర్లు తిరస్కరించారు. వాస్తవానికి, ఓట్ల లెక్కింపు మొదలైన ఆరంభంలో, ఆధిక్యతలను బట్టి భారతీయ జనతా పార్టీకి గణనీయమైన స్థానాలు వస్తాయని, బీఎస్పీతో కల్సి ప్రభుత్వం ఏర్పాటు చేసినా చేయొచ్చనీ బీజేపీ నాయకులు కొందరు భావించారు. కాసేపట్లోనే వారి ఆశలు తారుమారయ్యాయి. అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీని కూడా ఓటర్లు మొదట్లో కొంచెం మురిపించారు. చివరకు వారి ఆశలూ అడియాశలయ్యాయి. బీఎస్పీ ఎలాగూ మొదటి నుంచీ ఓటమికి సిద్ధమయ్యే వుంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే, ఆ పార్టీని ఓటర్లు తిరస్కరించారనడం కంటే, అధికారంలోకి రావడానికి అంగీకరించ లేదనాలి. రాహుల్ "యాంటీ మాయావతి మంత్రం", ప్రచారం, కాంగ్రెస్ పార్టీకంటే కూడా సమాజ్ వాదీ పార్టీకే ఎక్కువ మేలు చేసింది. ఆ మాటకొస్తే, ములాయం సింగ్ యాదవ్ సారధ్యంలోని, అఖిలేష్ యువ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి ఓటర్లు గట్టి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అంతగా ఆదరించనూ లేదు. పెద్దగా అంగీకరించనూ లేదు. దానికి నిదర్శనం ఆ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన ఓట్లు, మద్దతుగా వచ్చిన వాటికంటే చాలా ఎక్కువ కావడమే!
రాహుల్ గాంధీ ఓటమిని ఒప్పుకున్నానన్నారు. ప్రయాణంలో పాఠాలు నేర్చుకున్నానన్నారు. ఆయన తల్లి సోనియా గాంధీ, అధిక ధరలకు-ఓటమికి లింక్ పెట్టింది. స్థానిక నాయకత్వం విషయంలోనూ, అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ, తప్పులు జరిగినట్లు అంగీకరించింది. మన్మోహన్ సింగ్‌ను మార్చే ప్రసక్తే లేదని బల్ల గుద్ది మరీ చెప్పింది. ఇంతకీ, రాహుల్ గాంధీని భవిష్యత్‍లో ప్రధానిని చేయడానికే సోనియా ఆయనను ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బరిలోకి ప్రచారానికి దింపిందనాలా? రాహుల్‌నే ప్రధానిని చేయదల్చు కుంటే సోనియాకు కేవలం ఐదంటే ఐదు నిమిషాల పని! దిగమని అనగానే దిగిపోయే మన్మోహన్ ఉన్నారు. ఆయన స్థానంలో రాహుల్ పేరు చెప్పగానే, "దేశ్ కీ నేతా రాహుల్" అని అరవడానికి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు-నాయకులు సిద్ధంగా వున్నారు. ఐనా అలా జరగలేదు. జరుగుతుందన్న నమ్మకమూ లేదు. రాహుల్ కూడా తాను ఒక నేతగా ముందు ఎదగాలనుకున్నాడు. తానేంటో-తన సత్తా ఏంటో నిరూపించాలనుకున్నాడు. దానికి తన రాజకీయ క్రీడాస్థలంగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికలను ఎంచుకున్నాడు. నెహ్రూ-గాంధీ కుటుంబ వారసుడుగా, రాజీవ్-సోనియాల కుమారుడుగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో బాధ్యతాయుతమైన పదవిలో వున్న వ్యక్తిగా, ఆయన జాతీయ నాయకుడిగా మాత్రమే ఎన్నికల ప్రచారంలో దిగుతానంటే కాదనే వారెవరూ లేరు. ఐనా, తనంతట తానే ఉత్తర ప్రదేశ్‌ను ఎంచుకున్నారు. 2007 శాసన సభ ఎన్నికలలో కేవలం 22 స్థానాలనే తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీకి, 2009 లోక్ సభ ఎన్నికలలో స్వయంగా ప్రచారం చేసి 22 లోక్ సభ స్థానాలను గెలిపించారు పార్టీకి. పటిష్టమైన పునాదిని కాంగ్రెస్ పార్టీ పరంగా వేసేందుకు మళ్లీ 2012 శాసనసభ ఎన్నికలలో కూడా రంగంలోకి, క్రియాశీలక పాత్ర పోషించి, అధికారంలో వున్న బీ ఎస్పీ ఓటమికి బాధ్యుడయ్యాడు. తన పార్టీ ఓడినా, మాయావతిని గద్దె దింపగలిగాడు. అంతవరకూ, రాహుల్ అభినందనీయుడే! ఇంతవరకూ, దశాబ్దాల తరబడి, ఏ కాంగ్రెస్ నాయకుడూ చేయని సాహసం చేసి, నాలుగు వందల స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్ట గలిగే స్థాయికి పార్టీని నడిపించగలిగాడు రాహుల్. ఓడితే ఓడు కాక! పార్టీని ఏక తాటిపై నిలపగలిగాడు. ఆయనకు తోడుగా స్థానిక నాయకత్వమే కనుక పనిచేసి వున్నట్లయితే, బహుశా ఫలితాలు మరికొంత మెరుగ్గా వుండేయేమో!
ఇంతకూ, రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారం ఇష్టం లేనివారు, ఆయనంటే గిట్టని వారూ, ప్రచారంలో ఆయన సఫలం కాకూడదని కోరుకున్నవారూ, ఓటమి పాలైతే మంచిదని మనసులో భావించిన వారూ, కాంగ్రెస్ పార్టీలో లేరని అనుకోరాదు. ఆయనెక్కడ ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారో, గెలిపించి ఎక్కడ ప్రధాని అవుతారో అని భయపడ్డ వారూ వున్నారు. నెహ్రూ-గాంధి కుటుంబీకుల అనుకూల-ప్రతికూల శక్తుల, వ్యక్తుల, ముఠా రాజకీయాల మధ్య జరుగుతున్న ఆధిపత్య సమరమే, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర. ముగ్గురు ప్రధాన మంత్రులను దేశానికిచ్చి, నాలుగో తరం (రాహుల్? ప్రియాంకా?) త్వరలో ఆ పదవిని చేపట్టడానికి సిద్ధంగా వున్న అరుదైన కుటుంబం అది. నాలుగు దశాబ్దాలు వివిధ దశల్లో, పాతిక పర్యాయాలు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన ఘనత కూడా ఆ కుటుంబానిదే. ఆ కుటుంబానికి వ్యతిరేకంగా అహర్నిశలూ, కాంగ్రెస్ పార్టీలో వుంటూనే, పనిచేసేవారూ చాలామంది వున్నారు. ఉదాహరణకు, ప్రణబ్ కుమార్ ముఖర్జీ గతంలో కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించినప్పుడు, రిజర్వ్ బాంక్ గవర్నర్ గా మన్మోహన్ సింగ్ పనిచేశారు. అదే ప్రణబ్ కుమార్ ముఖర్జీ ఇప్పుడు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పనిచేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీనియారిటీ, సోనియా నిర్ణయం ముందు పనికి రాలేదు. ఆయనకు ప్రధాని కావాలన్న ఆశా చావలేదు. అవకాశం వస్తే, ధిక్కరించగలిగితే, వదులుకుంటాడా? గతంలో రాజీవ్ గాంధి హయాంలో, ఇందిర హత్యానంతరం జరిగిన ఎన్నికల తర్వాత, నిర్లక్ష్యానికి గురై పార్టీని వీడి సొంత కుంపటి కూడా పెట్టుకున్నారు. తిరిగి పీవీ హయాంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా స్వగృహ ప్రవేశం చేసి, పార్టీకి-సోనియాకు విధేయుడిగా ఇప్పుడు కొనసాగుతున్నారు. ఆయనలోని అలనాటి రాజీవ్ (నెహ్రూ-గాంధి) వ్యతిరేకత దేనికైనా దారితీయవచ్చునేమో! శరద్ పవార్ మనసు మార్చుకుని, సోనియా సారధ్యంలోకి పరోక్షంగా చేరినప్పటికీ ప్రధాని కావాలన్న కోరిక దేనికైనా దారితీయవచ్చు. అలానే చిదంబరాలూ, ఆజాదులూ, యాంటోనీలు చాలామందే వున్నారింకా!
తనకు మద్దతు ఇస్తూనే-ఇస్తున్నట్లు నటిస్తూనే, పరోక్షంగా, అవకాశం కొరకు ఎదురుచూస్తున్న పార్టీ లోని సొంత మనుషుల వ్యవహారం సోనియాకు తెలియకుండా వుంటుందా? ప్రతిభా పాటిల్ పదవీ కాలం ముగియగానే, ఆమె స్థానంలో కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా మన్మోహన్ ను ప్రతిపాదించి, ప్రధాని పీఠంపై తనయుడు రాహుల్ గాంధీని కూచోబెట్టాలంటే, నామ మాత్రం వ్యతిరేకత కూడా లేకుండా జాగ్రత్త పడాలి. వచ్చిన చిక్కల్లా “కంట్లో నలుసుల” తోనే. అందుకే రాహుల్ సొంతంగా-స్వయంగా ఎదగాలని కోరుకుంది. ఇవ్వాళ ఉత్తర ప్రదేశ్‌లో రాహుల్‌కు అపజయం తాత్కాలికమే! భవిష్యత్‍లో అఖిలేష్ లాంటి వారిని రాహుల్ కలుపుకుని పనిచేయకూడదా? గుండాల-రౌడీల సమాజ్ వాదీ పార్టీకి రాహుల్ వ్యతిరేకుడు కాని, సౌమ్యుడు-సంయమనం పాటించేవాడూ ఐన అఖిలేష్ యాదవ్‌తో రాహుల్‌కు వైరం వుండాల్సిన అవసరం లేదే? End
No comments:
Post a Comment