Friday, March 23, 2012

ఉప సమరం నేర్పిన గుణపాఠాలు: వనం జ్వాలా నరసింహారావు



సూర్య దినపత్రిక (25-03-2012)
వనం జ్వాలా నరసింహారావు

కోస్తాంధ్రలో ఒక్క సీటుకు, ఉత్తర-దక్షిణ తెలంగాణాలో ఆరు సీట్లకు ముగిసిన ఉప ఎన్నికలలో ఓటర్లు ఇచ్చిన తీర్పు అమోఘం. అందరికీ అంతో-ఇంతో గుణపాఠం చెప్పకనే చెప్పారు. ఒక పక్క తెరాస అధ్యక్షుడు చంద్రశేఖరరావును, మరోపక్క వైఎస్సార్ సీపీ నేత జగన్మోహన్‌ రెడ్డిని హీరోలుగా అంగీకరించుతూనే, తస్మాత్ జాగ్రత్త అంటూ ఇతోధికంగా చురకలు కూడా వేశారు ఓటర్లు. ఇక ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి స్పష్టమైన హెచ్చరికలు చేశారు. అదే క్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, తాజా కాంగ్రెస్ నాయకుడు చిరంజీవికి, వారి-వారి జిల్లాలలో ప్రచార బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్-తెలుగుదేశం నేతలకు తగు సంకేతాలిచ్చారు. పార్టీల పరంగా తెరాసకు, తెలుగుదేశానికి, కాంగ్రెస్‌కు, భారతీయ జనతా పార్టీకి కొన్ని సంకేతాలిచ్చారు. ఐదు చోట్ల పోటీ చేసిన టీఆర్ఎస్‌ పార్టీ నాలుగు చోట్ల గెలిచి, తెలంగాణా సెంటిమెంటును ఎంత బలంగా నిరూపించిందో, అంతే మోతాదులో బీజేపీ పోటీ చేసిన ఒకే ఒక్క మహబూబ్‌నగర్ స్థానాన్ని కైవసం చేసుకుని నిరూపించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేసిన ఒక్క సీటునీ కైవసం చేసుకుని, సమీప భవిష్యత్‍లో జరుగనున్న పద్దెనిమిది శాసనసభ స్థానాల ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి, తెలుగు దేశానికీ ధీటుగా నిలవబోతోంది. పాలక, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, తెలుగుదేశం ఏడు చోట్లా పోటీ చేసి, ప్రతి చోటా ఓటమి చవిచూశాయి. కాంగ్రెస్‌ పార్టీ నాలుగు చోట్ల రెండో స్ధానంతోను, మూడు చోట్ల మూడో స్ధానంతోను సర్దుకోవాల్సి వచ్చింది. తెలుగు దేశం పార్టీ ఒక చోట నాలుగో స్ధానంలో, రెండు చోట్ల రెండో స్ధానంలో, నాలుగు చోట్ల మూడో స్ధానంలో ఉంది. రెండు చోట్ల డిపాజిట్ కూడా కోల్పోయింది.  ప్రతిష్టాత్మకమైన మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఇక్కడ టీఆర్ఎస్‌ ద్వితీయ స్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నెల్లూరు జిల్లాలోని కోవూరు గతంలో తెలుగుదేశం అధీనం లో ఉండేది. ఇప్పుడది జగన్‌ పార్టీ పరమైంది.

ఇంతకూ, గెలుపెవరిది? ఓటమి ఎవరికి? కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు సంబంధించినంతవరకు, కేవలం ఓటమి మాత్రమే కాకుండా, ఆ పార్టీల ప్రతిష్ట కూడా పూర్తిగా దిగజారి పోయిందనాలి. 2009 లో కాంగ్రెస్ గెల్చుకున్న రెండు స్థానాలను, ఇండిపెండెంటుగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన మరో సభ్యుడి స్థానాన్నీ, మొత్తం మూడు స్థానాలనూ కోల్పోయింది. పడ్డ ఓట్లు కూడా అంతంత మాత్రమే! తెలుగుదేశం దీ అదే పరిస్థితి. 2009 లో ఆ పార్టీ గెలిచిన నాలుగు స్థానాలలో దారుణంగా ఓటమి పాలైంది. ఆ పార్టీ ప్రతిష్టా మంట కలిసింది. భవిష్యత్‍లో తెలంగాణ ప్రాంతంలో జరగబోయే ఏ ఎన్నికైనా తెలంగాణ వాదంతోనే బలంగా ముడిపడి వుంటుందన్నతరహా తీర్పిచ్చారు ఓటర్లు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆ పార్టీలకు చెందిన ఇతర నాయకులు, వాస్తవానికి, తమ వంతుగా తెలంగాణ వాదాన్ని మొన్నటి ఉపఎన్నికలలో వినిపించే ప్రయత్నం చేశారు కూడా. తెలంగాణకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బాబు, తెలంగాణ సెంటిమెంటు గణనీయంగా వుందని, ఐనా ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రప్రభుత్వమే అని కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వాదానికి అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేయబట్టే, ఆ మాత్రం ఓట్లన్నా రాలాయి. ఆ రెండు పార్టీల భవిష్యత్ తెలంగాణకు సంబంధించినంతవరకు ఇక ప్రశ్నార్థకమే! సమైక్య్తవాదానికి కట్టుబడి పోటీ చేసిన ఏకైక పార్టీ సీపీఎం సోదిలోకి లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో ప్రత్యేక తెలంగాణ వాదాన్ని వినిపించడానికి నడుం బిగించిన భారతీయ జనతా పార్టీని, మహబూబ్‌నగర్‌లో, తెరాస కంటే ఎక్కువగా నమ్మారు ఓటర్లు. భవిష్యత్‍లో తెలంగాణ సాధన ప్రక్రియలో, కేవలం రాజకీయ ఐకాసలో కల్సి వుండడమే కాకుండా, ఎన్నికలలో కూడా, తెరాస-బీజేపీ అవగాహన కుదుర్చుకోవాలన్న సంకేతాన్ని కూడా ఓటర్లు మహబూబ్‌నగర్ స్థానం ఫలితం ద్వారా ఇచ్చారు.

తెలంగాణలో కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు పుట్టగతులు లేకుండా పోతుంటే, సీమలో-ఆంధ్రలో కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొన్నదనాలి. కోవూరు ఫలితమే దానికి ప్రత్యక్ష నిదర్శనం. ఏనాడైతే దివంగత ముఖ్యమంత్రి వారసుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భారత జాతీయ కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదో, ఆ నాడే, కాంగ్రెస్ తన అస్థిత్వాన్ని కోల్పోవడానికి తానే స్వయంగా బాటలు వేసుకుందనాలి. రాజశేఖర రెడ్డి వారసుడిగా బాధ్యతలు స్వీకరించిన రోశయ్య కానీ, ఆయన వారసుడిగా వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కానీ, జగన్ దూకుడుకు కళ్లెం వేయ లేకపోయారు. 154 మంది కాంగ్రెస్ శాసనసభ సభ్యుల మద్దతుతో-సంతకాలతో ప్రారంభమైన ఆయన అసమ్మతి ప్రస్థానం, "గోపీ" ల పుణ్యమా అంటూ,  17 కు పడిపోయినా, జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ మాత్రం వీసమెత్తైనా పడిపోలేదు. ఓదార్పు పేరుతో ఆయన చేపట్టిన వేలాది కిలోమీటర్ల రాష్ట్రవ్యాప్త ప్రజా యాత్ర, ఆబాలగోపాలాన్ని జగన్ చెంతకు చేర్చింది. ఏం జరిగినా-ఎంత ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డికి వున్నా, కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోక పోవడంతో, విసిగివేసారిన జగన్ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, తన తల్లి విజయమ్మతో కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించారు. తరువాత జరిగిన ఉపఎన్నికలలో కడప-పులివెందులల నుంచి అఖండ విజయం సాధించి, కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు ఆనాడే సవాలు విసిరారు జగన్. ఆ ఎన్నికలలో పోటీ చేసి ఘోర ఓటమి పాలై-డిపాజిట్ కూడా కోల్పోయిన మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డికి అప్పట్లో రాజీనామా చేయాలని తోచలేదు పాపం! దరిమిలా జగన్ అక్రమాస్తుల వ్యవహారం, సీబీఐ దర్యాప్తు ప్రక్రియ, శాసనసభలో అవిశ్వాస తీర్మానం అంశం లాంటివి జగన్ వెంట నడిచే నిఖార్సైన ఎమ్మెల్యేల-ఎంపీల సంఖ్యను తేల్చింది. ఎంపీ రాజమోహన రెడ్డి రాజీనామాతో సహా, పదిహేడు మంది జగన్ వర్గ ఎమ్మెల్యేలు సభ్యత్వం కోల్పోవడంతో జగన్ వర్గం మరింత బలపడ సాగింది. ఆ నేపధ్యంలో వచ్చిందే కోవూరు శాసనసభ ఉప ఎన్నిక. కడప-పులివెందుల ఫలితం ప్రభావం కోవూరు మీద స్పష్టంగా పడింది. భారీ మెజారిటీతో కాకపోయినా మంచి మెజారిటీతో ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి, కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు పెను సవాలు విసిరారు. తెలంగాణలో సెంటిమెంటుకు, (సీమ) ఆంధ్రలో సెంటిమెంటుకు కొంత తేడా వున్నప్పటికీ, అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం ఓటమి పాలు కావడానికి ఆ రెండు సెంటిమెంట్లే కారణమయ్యాయి. రాజశేఖర రెడ్డి వారసుడిగా, ఆయన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోదగ్గ వ్యక్తిగా, భావి ఆంధ్ర ప్రదేశ్ యువతరం నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటర్లు తీర్పిచ్చారు. ఇక ఆయనదే హవా!

అధికార పక్షానికి చెందినంతవరకు, ఉప ఎన్నికలలో ఓటమికి బాధ్యత ఎవరిది అన్న అంశంపై, సమ్మతి-అసమ్మతి రాగాలు ఆరున్నొక్క శ్రుతిని దాటాయి. అసమ్మతి రాగాల మాట అటుంచితే, సాక్షాత్తు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ గులాం నబీ ఆజాద్ రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డితో అన్నట్లుగా చెప్పుకుంటున్న మాటలు కొంచెం ముఖ్యమంత్రిని ఇబ్బందిలో పడేసి విగా వున్నాయనాలి. "ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ముఖ్యమంత్రిది కాకపోతే ఎవరిది బాధ్యత అవుతుంది?" అని ఆజాద్ వ్యాఖ్యానించారట. అసమ్మతి గళం విప్పినవారిలో అగ్రగణ్యుడు మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. కడప లోక్ సభ స్థానానికి ఓడినప్పుడు కూడా అంతగా బాధపడని డీఎల్, ఈ ఉపఎన్నికలలో ఓటమికి చాలా కలత చెందారు పాపం! మంత్రి మండలి మొత్తం రాజీనామా చేయాలన్న డిమాండుతో సరిపుచ్చుకోకుండా. ఆయన తన రాజీ-నామా పత్రాన్ని అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. కిరణ్ కుమార్ రెడ్డి మీద, బొత్స మీద పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి, తనదైన "క్రికెట్ స్టయిల్ లో" ఈ ఆటలో ఓడామని వ్యాఖ్యానించి సరిపుచ్చుకున్నారు. బొత్స కూడా రాజీనామా చేసే వరకు వ్యవహారం పోయిందంటారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా కిరణ్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఇక కే కేశవరావు, ఎంపీ వివేక్‌లు సరే సరి. ఇంత జరిగినా తప్పెవరిది అంటే అంతా గప్ చిప్!

ఒకరి మీద మరొకరి విమర్శనాస్త్రాలు తీవ్రతరమౌతున్నాయి. విభేదాలు పెరిగిపోతున్నాయి. హస్తంలో కీచులాటలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రకంపన లింకా ఆగలేదు. సరికదా ఊపందుకుంటున్నాయి. పార్టీలో సంపూర్ణ ప్రక్షాళన-దాదాపు కామరాజ్ నాడార్ ప్రణాళిక లాంటిది అవసరమనేంతవరకూ వెళ్లింది వ్యవహారం. ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ కార్యవర్గం మొత్తం రాజీనామా చేయాలంటూ సీనియర్ నేత, మాజీ మంత్రి శంకర్రావు డిమాండుతో మీడియా ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి బలహీనుడని, ఆయన పదవిలో కొనసాగాలా-వద్దా అనే విషయం ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నానని ఎంపీ వివేక్ వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు సహితం ముఖ్యమంత్రిదే బాధ్యత అన్నారు. సీఎం పక్షాన మాట్లాడేవారే కరవయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఇలా ఒక్కొక్కరు-ఒక్కొక్కవిధంగా మాట్లాడడం సరికొత్త అసమ్మతికి తెరలేపినట్లయింది. ఐనా, పూర్తిగా ముఖ్యమంత్రిదే ఓటమికి బాధ్యత అనడం ఎంతవరకు సబబు? ఆయనను ఆయన మానాన ఎన్నడన్నా వదిలేశారా ఇలా మాట్లాడుతున్న నాయకులు? ఉపఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడం దగ్గర నుంచి, ప్రచార బాధ్యతలను నెత్తిమీద వేసుకోవడం దాకా, ఏ కాంగ్రెస్ నాయకుడు ఎంతవరకు తమ వంతు పాత్రను సక్రమంగా పోషించారో వారికి వారే బేరీజు వేసుకోవడం మంచిది. మరోవైపు ముఖ్యమంత్రికి సన్నిహితంగా మెలుగుతున్నవారు, అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్న సీనియర్ నేతలపై యుద్ధాన్ని ప్రకటించేందుకు ప్రయత్నాలు ప్రారంభించడంతో, చివరకు పరిస్థితి ఎటు నుంచి ఎటు వైపునకు దారి తీస్తుందోనన్న ఆందోళన అధిష్ఠానానికి పట్టుకుంది. రాష్ట్రంలో అసమ్మతి నిప్పులపై నీళ్లు చల్లేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగవలసిన అవసరం ఏర్పడింది.

ఏదేమైనా, ఆద్యతన భవిష్యత్‍లో సీమాంధ్రలో జరుగనున్న పదిహేడు శాసనసభ స్థానాల ఉపఎన్నికలు, తెలంగాణలోని ఒక స్థానానికి జరగనున్న ఎన్నిక రాష్ట్ర రాజకీయ రంగంలో ఒక కీలకమైన మలుపుకు దారితీయనున్నది. కోవూరు ఓటమితో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు జగన్మోహన్ రెడ్డి పక్షానికి వలస పోయే అవకాశాలు రోజు-రోజుకూ పెరుగుతున్నాయి. ఇక తెలంగాణ ప్రాంతంలో, తెలుగుదేశం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలోకి వలసలు మొదలవుతాయి. ఒకవేళ అందరూ ఊహించినట్లుగానే, ఉపఎన్నికలు జరుగనున్న పద్దెనిమిది స్థానాలలో మెజారిటీ (లేదా అన్నింటిలో) స్థానాలలో కాంగ్రెస్-టీడీపిలు ఓటమి పాలైతే, ఇక ఆ పార్టీల పరిస్థితి, 2014 ఎన్నికలొచ్చే సరికి అగమ్యగోచరం అనక తప్పదు!

No comments:

Post a Comment