Saturday, March 10, 2012

భద్రాచలంలో జరుగనున్న అత్యంత ప్రాచీన వైదిక పుణ్య యజ్ఞం: వనం జ్వాలా నరసింహారావు


"అతిరాత్రం"

భద్రాచలంలో "అతిరాత్రం"
ఆంధ్రజ్యోతి దినపత్రిక (24-03-2012)
వనం జ్వాలా నరసింహారావు
("అతిరాత్రం-2012" సారధ్య సంఘం సమన్వయకర్త)

సుమారు నాలుగు వేల సంవత్సరాల పూర్వం నుండి కేరళ రాష్ట్రంలో మాత్రమే నిర్వహిస్తూ వస్తున్న, ప్రాచీన వైదిక సాంప్రదాయక పుణ్య యజ్ఞం "అతిరాత్రం", మొదటిసారి మన రాష్ట్రంలో జరిపేందుకు రంగం సిద్ధమౌతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి మే నెల 2 వరకు, బధ్రాచలం సమీపంలోని ఎటపాక జటాయువు మండపం దగ్గర, వైదిక సాంప్రదాయ క్రమానుగతిని అనుసరించి, పన్నెండు దినాలు నిర్విరామంగా నిర్వహించనున్న అపురూపమైన అతిరాత్రం విన్యాసాన్ని కన్నుల పండుగగా వీక్షించడానికి పలువురు దేశ-విదేశీ ప్రముఖులు హాజరు కానున్నారు. మౌలిక ప్రమాణాలుగా చెప్పుకునే  వేదాలు భగవత్ ప్రేరితమేనని, మానవుల రచనలు కావని సాంప్రదాయుల విశ్వాసం. వేదవ్యాసుడు నాలుగు భాగాలుగా వేదాలను విభజించి, ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలని పేర్లు పెట్టాడు. అనాదిగా వస్తున్న ఆ వేదాలకు సంబంధించిన మూల గ్రంథాల్లో పేర్కొన్న ఒకానొక అతి ప్రాచీనమైన సాంప్రదాయ కర్మకాండే "అతిరాత్రం". పన్నెండు రోజులు, తెల్లవార్లూ-రాత్రింపగళ్లూ, అగ్ని హోమంతో నిర్వహించే "అతిరాత్రం", వైదిక కర్మకాండలన్నింటిలోకి అత్యంత సంక్లిష్టమైనది, మహోన్నత మైనదని, కేరళ రాష్ట్రానికి చెందిన నంబూద్రి బ్రాహ్మణులు అంటారు. వాల్మీకి రామాయణం బాల కాండలో, 14 వ సర్గలో, అశ్వమేధ యాగం ప్రస్తావనలో అతిరాత్రం గురించి పేర్కొనడం జరిగింది.
            
వైదిక పుణ్య యజ్ఞాల సాంప్రదాయాలను, మానవ సమాజం ఆచరణలో పెట్టడానికి, రెండు రకాల పద్ధతులున్నాయి. మొదటిది "గ్రహ్య", రెండోది "శ్రుత". వ్యక్తిగత ఆచార వ్యవహారాలైన ఉపనయనం, వివాహం లాంటివి మొదటి పద్దతికి చెందినవి. సంస్కార పూర్వ కంగా, అత్యంత ఉన్నత స్థాయిలో, శ్రుతి సాహిత్యంలో పేర్కొన్న విధంగా, మౌఖిక సాంప్రదాయ బద్ధంగా, ఋగ్వేద-యజుర్వేద-సామవేదాలలో చెప్పినట్లు తూచ తప్పకుండా ఆచరించేదే రెండో పద్ధతి. కీలకమైన ఈ రెండో రకమైన వైదికాచారాలను, కొద్దిమంది, అక్కడో-ఇక్కడో అడపాదడపా పాటించడం జరుగుతోంది. అలా పాటిస్తున్న వారిలో కేరళ నంబూద్రి బ్రాహ్మణులు ముందు వరుసలో వున్నారు. శంకరాచార్యుడు నంబూద్రి బ్రాహ్మణ శాఖకు చెందినవాడు. నంబూద్రీ కేరళ బ్రాహ్మణుల గురించి ఆసక్తికరమైన సమాచారం ఉంది. శాతవాహనుల తరువాత ప్రసిద్ధి చెందిన రాజవంశం కాదంబ వంశం. కాదంబులలో ప్రసిద్ధుడైన రాజు మయూర శర్మ కేరళ ప్రాంతాన్ని పాలించాడు. ఆయన తన స్వస్థలమైన కోనసీమ (తూర్పు గోదావరి) నుండి ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబాలను కేరళకు తీసుకు వెళ్ళాడు. ఆ కుటుంబాల వారే తరువాత నంబూద్రి బ్రాహ్మణులుగా పేరు పొందారు. ఈ విషయం బ్రహ్మ వైవర్త పురాణంలోను, మద్రాసు ప్రభుత్వం ప్రకటించిన తెలుగు గ్రంథం సంపుటాలలోను లభిస్తుంది. శంకరుడు తెలుగువాడు ఐనప్పటికీ వల్లభుడు, నింబార్కుడు, త్యాగరాజు, మొదలైన అనేకమంది మహాపురుషుల లాగే ఆయనకు తెలుగు కంటే ఇతర ప్రాంతాల్లోనే ఆదరణ, ప్రసిద్ధి కలిగింది.
          
వైదిక ఆచారాలు అంతరించి పోకుండా, కేరళ నంబూద్రి బ్రాహ్మణులు, ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్నారు. పన్నెండు రోజులు, అహోరాత్రులు, ఆరిపోకుండా అగ్నిహోత్రం వుంచడమనే ప్రక్రియ, నంబూద్రి బ్రాహ్మణులకు అత్యంత ఆకర్షణీయమైన విజ్ఞాన-వినోద దృశ్యం లాంటిది. సనాతన సంప్రదాయాన్ని ముమ్మూర్తులా ప్రతిబింబించే "అతిరాత్రం", భారతీయ మతాచారాలకు-నాగరికతకు అసలు-సిసలైన రూపురేఖగా నంబూద్రీలు భావిస్తారు. "అతిరాత్రం" నిర్వహణ శారీరక శ్రమతో కూడుకున్నది. క్రీస్తు పూర్వం పదవ శతాబ్దిలో మొదలైన ఈ ఆచారం, ఆరవ శతాబ్దం వరకూ కొనసాగింది. ఆ తర్వాత కాలంలో, ఎందరో, ఎన్ని విధాలుగానో దానిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేశారు. గుప్తుల, చోళుల కాలంలో పునరుద్ధరణకు నోచుకున్న అతిరాత్రాన్ని, పదకొండవ శతాబ్దం వచ్చే సరి కల్లా, కేరళ నంబూద్రి బ్రాహ్మణులు సజీవంగా కొనసాగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అదే ప్రక్రియ నేటికీ సాగుతోంది.

Poster Release by Endowments Minister
          
అతిరాత్రం ఆచారం ఒక రకమైన అద్భుత విన్యాసం. ఆ విన్యాసంలో ప్రధాన భాగమైన అగ్ని హోమం ప్రక్రియను నిర్వహించడానికి 17 మంది ఋత్విక్కులు (పూజారులు) వుంటారు. పన్నెండు రోజులపాటు జరిగే కార్యక్రమంలో మొదటి రోజున హోమం చేసే "యజమాని", ప్రత్యేకంగా తయారుచేసిన మూడు కుండలలో, పవిత్రమైన అగ్నిని నింపుకుని యజ్ఞ వాటికలో ప్రవేశిస్తాడు. "బంకమట్టి" తో తయారు చేసిన ప్రత్యేకమైన కుండలవి. నామ మాత్రంగా-లాంఛన ప్రాయంగా, వాయుదేవుడికి జంతు బలి జరిపించుతారు. ఐదుగురు ప్రధాన పూజారుల ఎంపిక జరుగుతుందప్పుడు. ఆ తర్వాత రాపిడి ద్వారా నిప్పు వెలిగించుతారు. యజమాని శిరస్సుకు తలపాగా లాంటిది కట్టుతారు. ఇక ఆ క్షణం నుంచీ, యజమానిని ప్రత్యేక రక్షణలో వుంచుతారు ఆ పన్నెండు రోజులు. పిడికిలి బిగించిన చేతులతో, మౌనంగా ఆ పన్నెండు రోజులు యజమాని యజ్ఞాన్ని చేయాలి. కాకపోతే, ఆయన చేయాల్సిన మంత్రోచ్ఛారణలకు మౌనం వీడవచ్చు. అలానే, స్నానం చేసేటప్పుడు పిడికిలి సడలించవచ్చు. అగ్నితో నింపిన ప్రధాన కుండను తీసుకుని, మూడడుగులు నడవాలి యజమాని ఆ తర్వాత. బధ్రాచలంలో జరుగనున్న యజ్ఞానికి యజమానిగా-ప్రధాన ఋత్విక్కుడుగా కేరళకు చెందిన బ్రహ్మ శ్రీ నడువం నారాయణన్ సోమయాజి, ఆయన ధర్మపత్ని సావిత్రి పఠనాడిని ఎంపిక చేశారు నిర్వాహకులు. అలానే జైమినీ సామ వేదంలో దిట్టలు, ఘనాపాఠీలు, ఋగ్వేదం-యజుర్వేదం ఆచారాలను-సాంప్రదాయాలను ఔపోసన పట్టిన వారైన బ్రహ్మ శ్రీ కృష్ణన్ నంబూద్రి, బ్రహ్మ శ్రీ కడలూర్ శ్రీ దాస్ నంబూద్రి అనే వైదిక పండితులిద్దరు అతిరాత్రం యజ్ఞాన్ని నిరాటంకంగా జరిపించేందుకు గత ఆరు మాసాలుగా దీక్షలో కూర్చున్నారు.

అతిరాత్రం యజ్ఞంలో భాగంగా, రెండో రోజున బంక మట్టితో ప్రత్యేకమైన కుండను తయారు చేస్తారు. మూడో రోజున నైవేద్యం కొరకు ప్రత్యేకంగా ఒక స్తంభాన్ని తయారు చేస్తారు. "మహావేది" గా పిలువబడే యజ్ఞ వాటిక కొలతల ప్రకారం, లాంఛనప్రాయంగా బలి ఇవ్వడానికి, పక్షి ఆకారంలో బలిపీఠం నమూనాను తయారు చేస్తారు అదే రోజున. నాలుగో రోజున దేవతల రాజైన ఇంద్రుడిని యాగానికి ఆహ్వానించే కార్యక్రమం జరుగుతుంది. మహావేది వున్న ప్రదేశాన్ని నాగలితో దున్ని, అందులో విత్తనాలు చల్లి, మొదటి రోజున తయారు చేసిన ప్రధాన కుండను భూమిలో పాతిపెట్టు తారు. పక్షి ఆకారంలో బలిపీఠం నిర్మాణం ఆరంభమవుతుంది అదే రోజున. ఐదు, ఆరు, ఏడు దినాల్లో, బలి పీఠం నిర్మాణాన్ని అంచలంచలుగా కొనసాగిస్తూ, రాత్రివేళల అగ్నిహోత్రం పనిని యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది. ఎనిమిదో రోజున, బలి పీఠంలో మరొక అంతస్తు వేయడంతో పాటు, దానికి ఉపయోగించిన ఇటుకలను గోవులుగా మారాలని యజమాని ప్రార్థన చేస్తాడు. రుద్ర పూజ కూడా జరిపించుతారు పూజారులు. అంతవరకూ ఉపయోగించిన పనిముట్లను, పూర్తి చేయబడిన బలి పీఠంలో, మానవ ఆకారంలో పేర్చుతారు తొమ్మిదో రోజున. ఆ ప్రదేశంలో మళ్లీ అగ్నిని వుంచడం జరుగుతుంది. మంత్రోచ్ఛారణల మధ్య అగ్ని హోమంలో నెయ్యి పోసుకుంటూ అతిరాత్రం కొనసాగుతుంది. లాంఛనప్రాయంగా-నామ మాత్రంగా జంతు బలి ఇవ్వడం ఆ తర్వాత ప్రక్రియ. చివరి మూడు రోజులు రాత్రింబగళ్ళు యాగం కొనసాగుతూనే వుంటుంది. బలిపీఠం చుట్టూ, పదవ రోజున, యజమాని పూజారులతో కలిసి, పాములాగా తిరగాలి. నామ మాత్రంగా (వాస్తవంగా కాదు) పదకొండు జంతువులను బలి ఇవ్వడం జరుగుతుంది. పన్నెండో రోజున యజమాని భార్యా సమేతంగా "అవభ్రత స్నానం" చేసి, మేక బలిని (వాస్తవంగా కాదు) ఇచ్చి, ఇంటికి తిరిగొచ్చి మూడు చోట్ల అగ్నిని పేర్చి, ఆ అగ్నిహోత్రాన్ని జీవితాంతం చేస్తూ పోతుండాలి. పన్నెండు రోజులు ఒకే రకమైన కర్మ కాండలుండవు. అగ్నిలో ప్రధానంగా సోమ రసం ఉపయోగించుతారు. వైదిక గ్రంధాల్లో చెప్పిన ప్రకారం రెండు రకాల కట్టెలను రాపిడి చేసి నిప్పు పుట్టిస్తారు.

హైదరాబాద్‌కు చెందిన బ్రహ్మ శ్రీ హరి హరనాథ్ శర్మ, ఆయన కుమారుడు-స్మార్త వేద పండితుడు రాజశేఖర శర్మ, వారు నెలకొల్పిన "సమతా లోక్ సేవా సమితి" ఆధ్వర్యంలో, స్వయంగా కేరళకు వెళ్లి పంజాల్‍లో జరిగిన యాగాన్ని చూసి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో కూడా దాన్ని నిర్వహించాలని నిశ్చయించుకున్నారు. హరి హరనాథ్ శర్మ ఈ పాటికే విజయవంతంగా పదహారు ఉత్కృష్ట యాగాలను నిర్వహించారు. ఇది పదిహేడోది. సమతా లోక సేవా సమితి నిర్వహించ తలపెట్టిన ఈ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిపేందుకు పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్య నిర్వహణ అధికారి పి.వి.ఆర్.కే. ప్రసాద్ అధ్యక్షతన పలువురు ప్రముఖులతో ఒక సారధ్య సంఘం ఏర్పాటైంది. ఈ ప్రముఖులంతా ఒక బృందంగా ఏర్పాటై, అతిరాత్రం ఆచారాన్ని మన రాష్ట్రంలో కూడా నెలకొల్పాలని సంకల్పంతో పనిచేస్తున్నారు. ఆ అద్భుత అపురూపమైన సనాతన సాంప్రదాయిక విన్యాసాన్ని మరో రెండు నెలలలో బధ్రాచలంలో ప్రదర్శించబోతున్నారు. ఏప్రిల్ 21-మే 2 మధ్య నిర్వహించనున్న అతిరాత్రం రిహార్సల్లు మొదలయ్యాయి. ఎటపాకలో జరుగనున్న ఈ కార్యక్రమాన్ని, నాలుగువేల ఏళ్ల క్రితం ఎలా జరిగిందో, అచ్చు అలానే జరపడానికి అన్ని జాగ్రత్తలు సారధ్య సంఘం తీసుకుంటున్నది. పనిముట్లన్నీ ఆ ప్రాంతంలో లభ్యమయ్యే కట్టెతోనే తయారవుతున్నాయి. ఏ రకమైన లోహ సామగ్రిని ఉపయోంచడం జరగదు. బలి పీఠానికి వాడే ఇటుకలు కూడా కట్టెతో తయారుచేసినవే. అవన్నీ కేరళలోనే తయారవుతున్నాయి. అతిరాత్రంలో పన్నెండు రోజులు కూచోగల సామర్థ్యం యజమానికి కలగడానికి చర్యలు చేపట్టారు. పుణ్య యజ్ఞంలో అతి భారమైన యజుర్వేద పఠన బాధ్యతను కాప్రా కుటుంబీకులు, బ్రహ్మ శ్రీ కాప్రా నారాయణన్ నంబూద్రి సారధ్యంలో, తమ భుజాలపై మోపుకున్నారు. ఋగ్వేదం నిర్వహణను నారాస్ కుటుంబీకులు, సామవేదాన్ని తోట్టం కుటుంబీకులు చేపట్టుతున్నారు.

బధ్రాచలం దేవాలయ ట్రస్టు బోర్డు అధ్యక్షుడు కురిచేటి పాండురంగా రావు తాత్కాలిక ప్రాతిపదికపైన విరాళంగా ఇచ్చిన సుమారు ఏబై ఎకరాల భూమిలో, అవసరమైన అనుమతులతో, కార్యక్రమం ఏప్రిల్ నెలలో నిర్విఘ్నంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. భౌగోళిక-వాస్తు పరమైన సిద్ధాంతాల ప్రాతిపదికగా యజ్ఞ వాటికను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులను, దేవా దాయ శాఖ మంత్రిని, తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులను, పారిశ్రామిక వేత్తలను, రాజకీయ ప్రముఖులను, దాతృత్వ స్వభావం వున్న లోకోపకారులను, సారధ్య సంఘం కలిసి, వారి సహాయాన్ని కోరుతోంది.

ఎటపాక అద్భుత విన్యాసానికి ముస్తాబవుతోంది. హిందువుల నమ్మకాలుసంస్కృతీ సాంప్రదాయాలువైదిక కర్మ కాండలువేదాల్లో ఉటంకించిన విషయాలువాటిని ఆచరిస్తున్న కేరళ నంబూద్రి బ్రాహ్మణుల తరహా సంప్రదాయ నిబద్ధత లాంటివి అక్షరాలా ఆచరించడానికి రంగం ఏర్పాటవుతోంది. "మంత్రాలకు చింతకాయలు రాలు తాయా" అని వాదించే ప్రభుద్ధులకు ప్రత్యక్ష నిదర్శనం పంజాల్ గ్రామంలో గత ఏడాది నిర్వహించిన యజ్ఞం పరిసమాప్తమైన వెంటనే జరిగిన సంఘటనే! అతిరాత్రం పుణ్య యజ్ఞం సరిగ్గా పన్నెండు రోజులు నిర్విరామంగా-నిర్విఘ్నంగా, శాస్త్రోక్తంగా,  వేద పండితులు ఋత్విక్కులుగా వ్యవహరిస్తుండగా జరిగింది. ఏ రోజుఏ సమయంలోఏదిఎలా నిర్వహించాల్నో అనేది శాస్త్రోక్తంగా, ముందే ప్రణాళికా బద్ధంగాసిద్ధం చేసుకుని అలానే ముందుకు సాగారు. దాని ప్రకారంముగింపు రోజున యాగ శాలను అగ్నికి ఆహుతి చేయాల్సిన సమయం కొన్ని నిమిషాలు మాత్రమే ఆలశ్యమైంది. అయితేమరి కొన్ని నిమిషాలలోయాగ శాలను అగ్నికి ఆహుతి ఇవ్వ పోతుండగాఅనుకున్న సమయానికేఆకాశం చిల్లులు పడినట్లుగాకుండ వృష్టితోభారీ వాన పడింది పంజాల్ పరిసరాల్లో. పుణ్య యజ్ఞాన్నిఆ క్షణానకను లారా వీక్షిస్తున్న సుమారు పది లక్షల మందిఆ వర్షంతోయజ్ఞం పరిసమాప్తమవుతుంటేపులకించి పోయారు. అంటే, సరిగ్గా నాలుగువేల సంవత్సరాల క్రితం జరిగిన విధంగానే...గత ఏప్రిల్ నెలలో కూడా...అచ్చు.. అలానే "అతిరాత్రం" జరిగిందని చెప్పగల ధైర్యం, దాఖలాలు కూడా వున్నాయి. యజ్ఞం పూర్తవగానే, యజ్ఞ శాలపై ఆకాశంలో ఒకే ఒక గద్ద ఎగురుతూ కనిపించితే, ఆ క్షణంలో ఆకాశం మేఘావృతమై వర్షం కురిస్తే, దేవతలు సంతోషించారనడానికి నిదర్శనం అని అతిరాత్రం గట్టిగా విశ్వసించే నంబూద్రి బ్రాహ్మణులు అంటారు. అంతా అలానే జరిగింది.

దేశ విదేశాలకు చెందిన పలువురు పరిశోధకులు, ఘనాపాఠీలు, పండితులు, విద్యావేత్తలు అతిరాత్రం తీరుతెన్నులను అధ్యయనం చేసేందుకు బధ్రాచలం రానున్నారు. అతిరాత్రం వైదిక సాంప్రదాయ ఆచారాన్ని, దాన్ని జరిపించే తీరుతెన్నులను, అతిరాత్రం సంబంధించిన పలు ఇతర అంశాలను శాస్త్రీయ పరంగా అధ్యయనం  భావి తరాల వారికి పని కొచ్చే రీతిలో బధ్ర పరిచేందుకు కృషి జరుగుతోంది. వైదిక మంత్రోచ్ఛారణలు, యాగాలు, వ్యవసాయ రంగంపైన, సూక్ష్మ క్రిముల చూపే ప్రభావం గురించిన విషయాలపై పరిశోధనలు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పనిచేసి, ఇటీవలే మరణించిన ఇండాలజిస్ట్ డాక్టర్ ఫ్రిట్స్ స్టాల్, రాబర్ట్ గార్డినర్ "అతిరాత్రం" ఆచారానికి సంబంధించిన అనేక విషయాలను యధాతధంగా రికార్డు చేసి, భావితరాల వారికొరకు భద్రపరిచారు. ప్రొఫెసర్ స్టాల్ అన్న వాక్యాలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం మంచిది. "దేవాలయాలు, చర్చిలు, ఆకాశ హర్మ్యాలు నిర్మించడం, కాలం గడిచే కొద్దీ అవన్నీ శిథిలం కావడం తెలిసిందే. భాషలు-మతాలు పుట్టాయి, గిట్టాయి. ప్రపంచంలో అనేకానేక యుద్ధాలు జరిగాయి. అవన్నీ తాత్కాలికమే. వేదాలు, వైదిక సాంప్రదాయాలు-ఆచార వ్యవహారాలు, అనాదిగా మౌఖికంగా  ఒకరి నుంచి మరొకరికి-గురువు నుంచి శిష్యుడికి-తండ్రి నుంచి కుమారుడికి, శాశ్వతంగా ప్రచారం-ప్రసారం అవుతున్నాయి. పదార్థం-భౌతిక శరీరాలకున్న హద్దులకు అతీతంగా మానవ స్ఫూర్తి సాధించిన విజయం అమోఘం!"

మనం చేయాల్సిందల్లా, మన జీవితకాలంలో , మన రాష్ట్రంలో జరుగుతున్న అతిరాత్రం పుణ్య యజ్ఞం వీక్షించడమే! చేతనైతే మన వంతు భాగస్వాములం కావడమే!  End

8 comments:

  1. ధన్యవాదములు అతిరాత్రం-2012" సారధ్య సంఘం సమన్వయకర్తగా మీకు అబినందనలు , ఎటపాక దగ్గర జరుగుతున్నదా ! :) తప్పక నావంతు సహకారం అందచేస్తాను , 1998lo అనుకొంటాను ఖమ్మం డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో కృష్ణ మూర్తి గారి ఆద్వర్యం లో దోస యాగం అని నిర్వహించారు మేము ఏడుగురు స్నేహితులం సుమారు యాబై రోజులదాకా పాల్గొన్నాం ఆ ఋత్వికుల ని , భక్తులని ,యాగశాలలను చూడటం మొదటి రోజు విత్తిన దోస విత్తనాలు పెద్దవిఅయి వాటికి కాయ కాసి ఆ కాయ పండి తీగనుండి విడిపోయిన తరువాత ఆ కాయను హోమ గుండం లో వేయటం ద్వారా ఆ యాగం పూర్తవుతుంది ! . ఇక కరివేన వారి సత్రం లో రూములు బుక్ చేయాల !
    కశ్యప్ పలివెల

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ...మీ దోసకాయ యాగం అనుభవం చాలా బాగుందండీ.. నాదీ ఖమ్మం జిల్లానే.. ఖమ్మం కాలేజీలోనే చదువుకున్నాను...కాకపోతే 1966 లోనే డిగ్రీ పూర్తి చేశాను. మీరు దయచేసి 040-27070505 and or 8179372367 నంబర్లను కాని, info@athirathram2012.com ఈ-మెయిల్ ను కాని సంప్రదించండి. జ్వాలా నరసింహారావు

      Delete
  2. మంచి విషయాన్ని తెలియజేసినందుకు కృతజ్ఞతలు. నా వంతు సహకారం కూడా తప్పని సరిగా అందిస్తాను... మీ ఎస్పీ జగదీష్

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ...మీరు దయచేసి 040-27070505 and or 8179372367 నంబర్లను కాని, info@athirathram2012.com ఈ-మెయిల్ ను కాని సంప్రదించండి. జ్వాలా నరసింహారావు

      Delete
  3. శ్రమదానంకు నేను సిద్ధం.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ...మీరు దయచేసి 040-27070505 and or 8179372367 నంబర్లను కాని, info@athirathram2012.com ఈ-మెయిల్ ను కాని సంప్రదించండి. జ్వాలా నరసింహారావు

      Delete
  4. వనం జ్వాలా నరసింహా రావు గారు...నేను ఉండేది భద్రాచలంలోనే...ఏటిపాక ఇక్కడికి ౨ లేదా ౩ కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది...నా వంతు సహాయం అందించడానికి నేను సిద్ధం. నా మెయిల్ ఐ.డి మీ మొబైల్ కి మరియు మీ మెయిల్ ఐ.డి కి పంపుతున్నాను. తప్పక సంప్రదించండి.

    ReplyDelete
  5. మీ ప్రొఫైల్‌లో నరసింగపాడు అని వ్రాసారేమిటి?

    ReplyDelete