Wednesday, April 24, 2013
Saturday, April 20, 2013
నాలుగు శతాబ్దాల హైదరాబాద్-2: కుతుబ్‌షాహీ రాజులు: వనం జ్వాలా నరసింహారావు
నాలుగు
శతాబ్దాల హైదరాబాద్-2
కుతుబ్‌షాహీ
రాజులు
వనం
జ్వాలా నరసింహారావు
ప్రశ్నలు: జవాబులు
1.
ఒకటవ కుతుబ్‌షాహీ సుల్తాన్ కులీ
కుతుబ్-ఉల్-ముల్క్ పుట్టిన, అధికారంలోకి వచ్చిన, చనిపోయిన
సంవత్సరాలు ఏవి? (1445,
1518, 1543)
2.
కుతుబ్‌షాహీల వంశంలో ఐదవ రాజుకు కూతురు, ఆరవ
రాజుకు భార్య, ఏడవ రాజుకు తల్లి అయిన వ్యక్తి ఎవరు?
("మా సాహెబా" గా పిలువబడే హయత్ బక్షీ బేగం)
3.
సుల్తాన్ కులీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? గవర్నర్‍గా,
గోలకొండ సుల్తాన్‌గా ఎన్నేళ్లు వ్యవహరించారాయన? (48, 23, 25)
4.
చారిత్రాత్మక బన్నిహట్టి యుద్ధం ఎవరెవరి మధ్యన, ఎప్పుడు,
ఎవరి పాలనా కాలంలో జరిగింది? (ఇబ్రహీం కులీ కుతుబ్
షా కాలంలో; గోలకొండ, బీజాపూర్, అహ్మద్ నగర్ ల సంయుక్త రాజ్య కూటమికి, విజయనగర
సామ్రాజ్యానికి మధ్యన జరిగింది)
5.
ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో ఆవిర్భవించి, దరిమిలా
ఉర్దూ భాషగా ప్రసిద్ధికెక్కిన జాతీయాన్ని ఏమని పిలిచేవారు? (దఖని
జాతీయం)
6.
కులీ కుతుబ్ షా 1589 లో నిర్మించిన హాల్
ఆఫ్ జస్టిస్ లేక న్యాయస్థానపు విశాలమైన గదిని ఏమని పిలిచేవారు? (దాద్
మహల్)
7.
సెప్టెంబర్ 21, 1687 న మొగలాయిల
చేతిలో ఓటమి పొందిన గోలకొండ సుల్తాన్ కుతుబ్ షాహీ అబుల్ హసన్ తానాషాను ఎక్కడ
బందీగా వుంచారు? (దౌలతాబాద్ లోని కాలా మహల్ రాజ ప్రాసాదంలో)
8.
హైదరాబాద్ నగర శంఖు స్థాపన సందర్భంగా కులీ
కుతుబ్ షా భగవంతుడిని ఏమని ప్రార్థించారు? (నదిలో చేపలు వృద్ధి పొందే
రీతిలో హైదరాబాద్ నగర జనాభా పెరగాలని ఆయన ప్రార్థించారు)
9.
కుతుబ్ షాహీ సుల్తానులు నిర్మించిన ఐదు రకాలైన
చారిత్రాత్మక కట్టడాలను ఏమని పిలిచేవారు? (కోట, సమాధులు,
మస్జీదులు, రాజప్రాసాదాలు, ప్రజోపకర భవన సముదాయాలు)
10.
కుతుబ్ షాహీ వంశీయుల ఆద్యుడైన సుల్తాన్ కులీ
కుతుబ్-ఉల్-ముల్క్ 1518 లో నిర్మించిన ఏకైక మస్జీద్ పేరేమిటి? (మస్జీద్-ఇ-సఫా లేక జామి మస్జీద్. ఇది గోలకొండ కోటకు చెందిన బాల హిసార్
దర్వాజాకు కొద్దిగా ఆవలి భాగాన వుంది)
11.
ముబారిజ్ ఖాన్, నిజాం ఉల్ ముల్క్ ల మధ్య
సెప్టెంబర్ 30, 1724 న జరిగిన ఘోరమైన
యుద్ధంలో ముబారిజ్ ఖాన్ మరణానికి దారి తీసిన స్థలం పేరేమిటి? తరువాతి
కాలంలో దాని పేరు ఏమని మార్చారు? (షకర్ కేడా, ఫతే కేడా)
12.
అశూర్ ఖానా బాద్ షాహీ అంటే ఏమిటి? (హైదరాబాద్
నగర నిర్మాత కులీ కుతుబ్ షా 1592 లో నిర్మించిన ఓ భవనం. రెండవ ఆసఫ్ జాహీ నిజాం అలీఖాన్ దీనిని
ఆధునీకరించారు)
13.
1463 లో దక్కన్ అల్లర్లను అణచివేయడానికి పంపి, ఆ
తరువాత 1495 లో తెలంగాణకు
సుబేదారుగా నియమించబడిన బహమనీ టర్క్ ఉన్నత సైనికాధికారి ఎవరు? (1518-1687 మధ్య కాలంలో కుతుబ్
షాహీల వ్యవస్థాపక రాజు కులీ కుతుబ్-ఉల్-ముల్క్)
14.
కుతుబ్ షాహీల పాలన అంతమైన తదుపరి
"సుబేదారు" బిరుదుతో హైదరాబాద్ కు నియమించబడిన అనేక మంది గవర్నర్లలో
మొగలు చక్రవర్తి నియమించిన మొదటి వ్యక్తి ఎవరు? (జాన్ సాగర్ ఖాన్)
Thursday, April 18, 2013
మోడీకి మోకాలడ్డు: వనం జ్వాలా నరసింహారావు
Has the countdown for split between BJP and JD(U) begun? Will BJP dare to loose Nitish for Modi? Will...: http://www.youtube.com/watch?feature=player_embedded&v=uVGnvBaDTbk
Tuesday, April 16, 2013
ఆనం రామనరాయణ రెడ్డి జగన్ పై చేసిన వ్యాఖ్యలు సరైనవేనా?: వనం జ్వాలా నరసింహారావు
Please click here for a debate on TV 5: Jwala
ఆనం రామనరాయణ రెడ్డి జగన్ పై చేసిన వ్యాఖ్యలు సరైనవేనా?: వనం జ్వాలా నరసింహారావు: http://www.youtube.com/watch?v=jik6MsFJnys&list=PL5BBA60E1DA7DDA24&feature=player_detailpage
Friday, April 12, 2013
ప్రధానిగా 'నాయకుడు': వనం జ్వాలా నరసింహారావు
ప్రధానిగా 'నాయకుడు'
వనం జ్వాలా నరసింహారావు
రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని ఎవరన్న
చర్చ రాజకీయాలలో ఆసక్తి వున్న ప్రతి ఇద్దరి మధ్య నడుస్తోంది. ఉత్తర ప్రదేశ్ శాసనసభ
ఎన్నికలలో రాహుల్ గాంధీ చురుకైన పాత్ర వహించిన నాటినుంచి, ఆ మాటకొస్తే
అంతకంటే ముందునుంచే, ఆయనను కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి
అభ్యర్థిగా తెరమీదకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ
నిర్వహించిన చింతన్ బైటక్ దరిమిలా ఆయనకు పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో
ఆయన జపం మరింత వేగం పుంజుకుంది. అదే విధంగా గుజరాత్ ఎన్నికలలో భారతీయ జనతా
పార్టీకి అఖండ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టినప్పటినుంచి నరేంద్ర మోడీ పేరును
బీజేపీ తన పార్టీ అభ్యర్థిగా తెర పైకి తెచ్చింది. తనకు ప్రధాన మంత్రి కావాలని
లేదంటున్నప్పటికీ, రాహుల్ జపం మాత్రం పార్టీ కార్యకర్తలు
మానలేదు. ఇక మోడీ విషయానికొస్తే ఆయనను బీజేపీ పార్లమెంటరీ పార్టీ సభ్యుడిగా
నియమించి ఆ పార్టీ కూడా ఆయనను ప్రధానమంత్రిని చేసే విషయంలో మరో అడుగు ముందుకు
వేసింది. వారిద్దరికీ తోడు నితీష్ కుమార్, ములాయం సింగ్
యాదవ్, శరద్ పవార్, మాయావతి.....ఇలా
మరి కొన్ని పేర్లు ప్రధాని పదవికి పోటీలో వినపడుతున్నాయి. పనిలో పనిగా తానూ రేసులో
వున్నానని సంకేతాలిస్తున్నారు ప్రధాని మన్మోహన్ సింగ్. వీరిలో ఎవరు నాయకుడెవరనేది
తేల్చేది మొదట ఓటర్లయితే, ఆ తరువాత వారెన్నుకున్న కొన్ని
ప్రధాన రాజకీయ పార్టీలు.
కొంతకాలం
క్రితం, కాంగ్రెస్ అధినేత్రి-యుపిఎ
చైర్ పర్సన్ సోనియా గాంధి అనారోగ్యానికి గురై, అమెరికాలో
చికిత్స పొందడానికి వెళ్లినప్పుడు, ఇక్కడ పార్టీ బాధ్యతలను
ఆమె అప్పగించిన నలుగురిలో ఆమె తనయుడు రాహుల్ గాంధి ఒకరు. వెంటనే,
సోనియా-రాహుల్ గాంధీల భజన బృందం, భావి భారత ప్రధాని "రాహులే" అంటూ "బృంద గానం" ఆలాపించడం
మొదలెట్టింది ఆనాటినుంచి. సోనియా కోలుకోవడానికి మరి కొన్ని
రోజుల వ్యవధి వుండడంతో-ఆమె ఆరోగ్యం కుదుట పడుతుండడంతో,
అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో అన్నా హజారే-ఆయన
బృందం ఆరంభించిన నిరాహార దీక్ష దరిమిలా తలెత్తిన సమస్యాత్మక పరిణామాలను
పరిష్కరించడానికి తన వంతు "నాయకత్వ" పాత్ర పోషించేందుకు, రాహుల్ గాంధీ దేశానికి
తిరిగొచ్చారని భావించారు పలువురు అప్పట్లో. ఇక ఆయన భజన బృందం
ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. కాకపోతే, ఢిల్లీ వచ్చిన నాటినుంచి, హజారే దీక్షకు స్పందనగా,
పార్లమెంటులో "సెన్స్ ఆఫ్ ద హౌజ్"
తీర్మానం ఆమోదించేంతవరకూ, ఏ స్థాయిలోను,
రాహుల్ నాయకత్వ లక్షణాల ప్రదర్శన కించిత్తు కూడా జరగకపోవడం విచారకరం.
హజారే సృష్టించిన సమస్యల విషయంలో కనీసం కొంత అవగాహనైనా ఆయనకు
కలిగుంటే సంతోషించాలి. వాస్తవానికి, అదీ
జరగలేదనడానికి నిదర్శనమే, ఆయన సాంప్రదాయాలకు విరుద్ధంగా,
లోక్ సభలో లోక్ పాల్ బిల్ల్లును ఉద్దేశించుతూ చేసిన (చదివిన) ప్రసంగం. ప్రతిపక్ష
నాయకురాలు సుష్మా స్వరాజ్, రాహుల్ చేసిన ప్రసంగాన్ని
పరోక్షంగా ప్రస్తావించి, ఘాటుగా విమర్శించారు కూడా.
మరో వైపున, ప్రతిపక్ష ఎన్డీయే
భాగస్వామ్య పక్షంలోని బిజెపి లోక్ సభ సభ్యుడు, సంజయ్ గాంధి
కుమారుడు, వరుణ్ గాంధి, ఆశువుగా చేసిన
హిందీ ప్రసంగం, జూనియర్లతో సహా సీనియర్ పార్లమెంటేరియన్ల
ప్రశంసలనందుకుంది. ఆయన హావ భావాలు, సందర్భోచితంగా
చేసిన వ్యాఖ్యలు, అధికార పక్ష సభ్యులు లేవనెత్తిన
అంశాలకిచ్చిన జవాబులు, నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న
అసలుసిసలైన కార్య నిర్వహణ అధికారిని గుర్తుకు తెచ్చాయి. అంత
మాత్రాన ఆయన ప్రధాని కాకపోవచ్చు. కానివ్వక పోవచ్చు. ఒక వేళ
అయ్యే అవకాశాలొచ్చినా అదృష్టం వరించక పోవచ్చు. కాని, అవేవీ వరుణ్ గాంధీని నాయకుడు కాకుండా చేయలేవు. ఆయనే
కనుక, నెహ్రూ-గాంధీ వారసత్వ పరంపరలో
రాజకీయాలలో వున్నట్టయితే, ఇదే రాహుల్ భజన బృందం,
"దేశ్ కీ నేతా వరుణ్ గాంధీ" అంటూ
నినాదాలిచ్చే వారు. విధి బలీయమంటే ఇదేనేమో!
ఈ
నేపధ్యంలో, భావి భారత ప్రధాని కావడానికి గుజరాత్ ముఖ్య
మంత్రి నరేంద్ర మోడీకి అన్ని అర్హతలున్నాయని, ఆయనే భారతీయ
జనతా పార్టీ పక్షాన రాబోయే ఎన్నికలలో ప్రధాని కాబోయే అభ్యర్థిగా ప్రచారం లోకి
దిగుతామన్న భావన కలిగే రీతిలో ఎల్. కె. అద్వానీ మాట్లాడారు ఆ మధ్యన. అదే సమయంలో
యాధృఛ్చికంగానో-లేక సాధారణంగానో, అమెరికా
చట్ట సభకు అనుబంధంగా పనిచేస్తున్న "కాంగ్రెషనల్
రీసెర్చ్ సర్వీసెస్" అనే సంస్థ, మోడీని
ఆకాశానికి ఎత్తేస్తూ ఒక సర్వే నివేదికలోని అంశాలను బహిర్గతం చేసింది. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో, బిజెపి ప్రధాని
అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి మోడీ గట్టి పోటీ ఇస్తారని కూడా ఆ సంస్థ పేర్కొన్నది.
ఇంకేముంది కలకలం బయలుదేరింది. ఇప్పటికిప్పుడు
రాహుల్ ను ప్రధానిగా చూడాలని ఆశిస్తున్న కొందరు కాంగ్రెస్ నాయకులు, అప్పుడే నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిగా ఊహించుకుంటున్న భారతీయ జనతా
పార్టీలోని ఆయన అభిమానులు, వాద-ప్రతివాదనలకు
దిగారు. రాహులే గొప్ప నాయకుడని కాంగ్రెస్ వారు, మోడీని మించిన నాయకుడే లేరని బిజెపి వారు, సాక్ష్యాధారాలతో
సహా చర్చలకు నడుం బిగించారు. వారిద్దరిలో ఎవరు ప్రధాని
అవుతారు, ఎవరు కారో, అసలు ఇద్దరిలోనూ
ఒకరన్నా అవుతారో, ఎవరూ కారో చెప్పే ముందర వీరిరువిరిలో
ఎక్కువ నాయకత్వ లక్షణాలెవరికి వున్నాయో బేరీజు వేయడం అవసరం. నాయకుడు
ఐనంత మాత్రాన ప్రధాని కావాలని లేదు కాని, ప్రధాన మంత్రి
స్థాయి వారికి నాయకత్వ లక్షణాలు తప్పనిసరిగా వుండి తీరాలి. లేక
పోవడం వల్ల ఎలా వుందో కొంతలో కొంత అనుభవంలో చూస్తూనే వున్నాం కదా!
జవహర్లాల్
నెహ్రూ మరణానంతరం ఆయన వారసులెవరన్న మీమాంస వచ్చినప్పుడు, తన
తర్వాత ప్రధాని కావాల్సింది కూతురు ఇందిర కాదని, లాల్ బహదూర్
ఆ పదవికి తగిన వాడని, స్వయంగా నెహ్రూ అన్నాడంటారు. వాస్తవానికి, తండ్రి చాటున వుంటూనే ఇందిరా గాంధీ,
తప్పో-ఒప్పో, అప్పటికే
ఒక నాయకురాలిగా (తిరుగులేని) నిర్ణయాలు
తీసుకునే స్థాయికి ఎదిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ
అధ్యక్షురాలి హోదాలో, కేరళలో ఎన్నికైన ప్రప్రధమ కమ్యూనిస్ట్
ప్రభుత్వాన్ని రద్దు చేయించి, రాష్ట్రపతి పాలన విధించాలన్న
నిర్ణయాన్ని తీసుకుని నాటి గవర్నర్తో అమలు చేయించగలిగింది! ఆమె
తీసుకున్న ఆ చారిత్రాత్మక (అప్రజాస్వామిక) నిర్ణయం నెహ్రూ చని పోవడానికి పదేళ్ల క్రితం నాటిది. ఐనా, ఆమెకు ప్రధానిగా నాయకత్వ బాధ్యతలను తన తదనంతరం
వెంటనే అప్పగించడానికి నెహ్రూ సుముఖంగా లేరంటే, ఆమెలో ఏదో
కొంత నాయకత్వ లోటు అప్పటికింకా వుందనుకోవాలి. ఆ తర్వాత
జరిగింది చరిత్రే కదా! ఆమె తన రెండు విడతల ప్రధాన
మంత్రిత్వంలో తిరుగులేని నాయకురాలిగా దేశ-విదేశాలలో
గుర్తింపు తెచ్చుకుంది. గెలిచింది-ఓడింది-ఓడి గెలిచింది. తనకు తానే ప్రత్యర్థులను
సృష్టించుకుంది. ఆ ప్రత్యర్థులను మట్టి కరిపించింది. అదీ నాయకత్వ లక్షణాలంటే!
తన
తదనంతరం ఎవరనేది, ఇందిర మనసులో నిర్ధారించుకుని, మొదలు సంజయ్ గాంధీని, ఆయన దుర్మరణం తర్వాత రాజీవ్
గాంధీని నాయకత్వానికి సిద్ధం చేయసాగింది. ఆమె హత్యానంతరం,
అప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చురుగ్గా
పనిచేస్తూ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటున్న రాజీవ్
గాంధీ, ఇందిర వారసుడుగా ఏకైక అభ్యర్థిగా మిగిలిపోయాడు.
అంత మాత్రాన ఆయన నాయకత్వం ప్రజలంగీకరించినట్లు భావించలేం. కాని, ఆయనకా లక్షణాలున్నాయని, ఇందిర
హత్యానంతరం 1984 లో
జరిగిన ఎన్నికలలో నిరూపించబడింది. కేవలం ఎన్నికలలో విజయమే
కాకుండా, ఇతర విధాలుగా కూడా, నాయకత్వ పటిమను
నిరూపించుకున్నారు రాజీవ్ గాంధీ. 1989 ఎన్నికలలో ఓడినా,
పార్టీ నాయకుడుగా రాజీవ్ ను ఆయన హత్యకు గురయ్యేంత వరకు, శ్రేణులు అంగీకరించడమే నాయకత్వ లక్షణం. రాజీవ్
తర్వాత, తానింకా నాయకురాలి స్థాయికి ఎదగలేదనే భావనతో సోనియా
పార్టీ పగ్గాలను ఆరేడు సంవత్సరాల వరకు చేపట్టలేదు. అలా
గుర్తించడం కూడా నాయకత్వ లక్షణాలే! పదిహేనేళ్ల క్రితం
కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సోనియా, ఒక
విధంగా చెప్పుకోవాలంటే, రాజీవ్ తల్లి-తాతల
కంటే కూడా, వంశపారంపర్యంగా ఆ కుటుంబ సభ్యురాలు కాకపోయినా,
నెహ్రూ-గాంధీ కుటుంబ వారసురాలిగా అపారమైన
నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు-ఇంకా ప్రదర్శించుతూనే
వున్నారనాలి. తాను కాదల్చుకుంటే ప్రధాని కాగలిగినా, తన నాయకత్వం మీదున్న అపార నమ్మకంతో, మరొకరిని
ప్రధానిని చేసి, తానే నాయకురాలిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కు సారధి-నాయకులు ఎవరు అంటే, సోనియా అంటారు కాని మన్మోహన్ అనరు. ప్రధాని కానంత
మాత్రాన నాయకులు కాకుండా పోరు. ప్రధాని కాగలిగినా నాయకత్వం
కలిగుండాలని లేనే లేదు.
ఇన్ని
తెలిసిన సోనియా రాహుల్ గాంధీని పార్టీ స్థాయిలోనే ఇప్పటికీ శిక్షణ ఇస్తున్నదంటే,
ఆమె దృష్టిలో రాహుల్ ఇంకా నాయకుడుగా ఎదగలేదన్నా అనుకోవాలి, ఆయనకా లక్షణాలింకా అబ్బలేదన్నా అనుకోవాలి, అవకాశమిచ్చినా
నాయకత్వ పటిమను నిరూపించుకోవడంలో రాహుల్ విఫలమయ్యాడన్నా అనుకోవాలి. ఇందులో ఏవన్నా వుండి వుంటే, ఏ క్షణంలోనైనా రాహుల్ ను
ప్రధానిగా చూడవచ్చు. ఆయన ఆ తర్వాత సఫలమో-విఫలమో ప్రజలే నిర్ణయిస్తారు. ఇక మోడీ విషయానికొస్తే,
ఆయన పార్టీ అగ్ర నాయకుడే, ఆయనను నాయకుడంటుంటే,
కాదనేదెవరు? కాకపోతే, ప్రధానిగా
నాయకుడు కావాలంటే 2014 వరకు ఆగాల్సిందే!
సోనియా మనసులో, రాహుల్ కు మారుగా ప్రియాంకా గాంధీని నాయకురాలిని చేయాలని మనసులో వుందన్న
వార్తలు కూడా వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగొచ్చు!
Thursday, April 11, 2013
Sabita Indrareddy in CBI Charge sheet-Debate on TV5: Vanam Jwala Narasimha Rao
Please click here to view a video from TV 5 Top Story
http://www.youtube.com/
http://www.youtube.com/watch?feature=player_detailpage&v=XVgaJi5chqg
Wednesday, April 10, 2013
నాలుగు శతాబ్దాల హైదరాబాద్-1: కుతుబ్‌షాహీల పాలన నుండి స్వతంత్ర భారతావనికి: వనం జ్వాలా నరసింహారావు
నాలుగు
శతాబ్దాల హైదరాబాద్-1
కుతుబ్‌షాహీల
పాలన నుండి స్వతంత్ర భారతావనికి
వనం
జ్వాలా నరసింహారావు
ప్రశ్నలు: జవాబులు
1.
170 సంవత్సరాల సుదీర్ఘ కుతుబ్‌షాహీ వంశీయుల గోలకొండ పాలనకు చరమగీతం
పాడినది ఎవరు? (మొగలాయి చక్రవర్తి ఔరంగజేబ్)
2.
మొగలాయిల పాలన తరువాత ఏ రాజవంశం అధికారంలోకి
వచ్చింది?
(ఆసఫ్ జాహీ రాజవంశం)
3.
ఆంగ్లేయులకు, హైదరాబాద్ సంస్థానానికి మధ్య
పటిష్ఠమైన సంబంధ బాంధవ్యాలు దేనితో ప్రారంభమయ్యాయి? (హైదరాబాద్
నిజాం, బ్రిటీష్ ప్రభుత్వంతో 1800 వ సంవత్సరంలో
కుదుర్చుకున్న "ఆశ్రిత మైత్రి ఒడంబడిక" లేక సబ్సిడియరీ ఎలయన్స్ ట్రీటీ)
4.
హైదరాబాద్‌ను పాలించిన ఆసఫ్ జాహీ వంశీయులు తొలుత
ఏ దేశానికి చెందినవారు? (టర్కీ-మధ్య ఆసియా దేశపు రాజ కుటుంబానికి చెందిన టర్కీ
యులు)
5.
ఆసఫ్ జాహీ వంశీయుడైన నిజాం-ఉల్-ముల్క్ ఎప్పుడు
జన్మించారు?
ఎప్పుడు మరణించారు? (1724,
1748)
6.
ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్
పరిపాలకుడుగా ఎప్పుడు నియుక్తులయ్యారు? (సెప్టెంబర్ 18, 1911)
7.
ప్రధమ ప్రపంచ సంగ్రామం ఆసాంతం, దివాన్‌గా
కూడ బాధ్యతలు నిర్వహించిన హైదరాబాద్ నిజాం ఎవరు? ( ఏడవ నిజాం
మీర్ ఉస్మాన్ అలీఖాన్)
8.
గుల్ జార్ హౌజ్, బాద్-ఎ-షాహి, అశూర్ ఖానాలు, జామె-మస్జీద్, దాదా
మహల్, చందన్ మహల్, లఖిన్ మహల్ లాంటి
రాజ ప్రాసాదాలను నిర్మించింది ఎవరు? (హైదరాబాద్ మహానగరాన్ని
అతి వైభవోపేతంగా 1591 లో భాగ్యనగర్
అనే పేరుతో నిర్మించిన మహ్మద్ కులీ కుతుబ్ షా)
9.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున వున్న మక్కా మస్జీద్‍కు
శంఖుస్థాపన చేసింది ఎవరు? ఎప్పుడు? (మహ్మద్ కులీ కుతుబ్
షా, 1617)
10. కుతుబ్ షాహీ రాజ
వంశానికి చెందిన రాజులు ఎందరు? (ఎనిమిది మంది)
11. పురాతన గోలకొండ
మట్టిబురుజు పునాదులపై సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ నిర్మించిన మహానగరం పేరేమిటి? (మహ్మద్
నగర్)
12. కుతుబ్ షాహీ
ఎలా చనిపోయారు? అది సహజ మరణమేనా? (సహజ మరణం
కాదు. అతడి సొంత కుమారుడు, ఆయన వారసుడిగా-ప్రభుత్వాధినేతగా
అధికారం చేపట్టిన జమ్‍షద్ కులీ చేతుల్లో హత్యకు గురయ్యాడు)
13. చరిత్రకారుల
దృష్టిలో కుతుబ్ షాహీ రాజవంశీయులలోని ఎవరి పాలనలో హైదరాబాద్ నగరం అంగరంగ వైభోగంగా
పేర్కొనబడింది? (1580-1612
మధ్య
కాలంలో
పాలించిన మహ్మద్ కులీ కుతుబ్ షా పాలన రోజుల్లో)
14. కులీ కుతుబ్ షా
ప్రేమికురాలిగా గణుతికెక్కి, భాగ్యనగర్ నిర్మాణానికి ప్రేరణ కలిగించిన నాట్యగత్తె
భాగుమతి నివసించిన గ్రామం పేరేమిటి? ప్రస్తుతం ఆ స్థలంలో ఏ
కట్టడం వుంది? (చిచేలం. చార్మీనార్)
15. భాగ్యనగర్ పేరును హైదరాబాద్‌గా
మార్చే ముందు భాగుమతికి ప్రదానం చేసిన బిరుదేమిటి? (హైదర్ మహల్)
16. కులీ కుతుబ్ షా ఏకైక
కుమార్తె పేరేమిటి? (హయాత్ బక్షీ బేగం)
17. మొగలు చక్రవర్తి ఔరంగజేబును
ఎదుర్కొని ఓడిపోయిన ఎనిమిదవ చివరి గోలకొండ రాజెవరు?ఆయన ఎప్పుడు పాలించారు? ఎప్పుడు మరణించారు? ( సహనశీలి, మృధు స్వభావుడుగా ప్రసిద్ధికెక్కిన అబుల్ హసన్ తానాషా. 1672-1687. 1699)
18. హైదరాబాదీ సంస్కృతిపై
చెరగని ముద్రవేసి, హైదరాబాద్ నగర రూపురేఖల తయారీతో ప్రత్యక్ష సంబంధమున్న కుతుబ్ షాహీల కాలం
నాటి పెద్దమనిషి ఎవరు? (1585 లో పీష్వాగా నియుక్తుడైన
మీర్ మొమిన్ పీష్వా)
19. 1656 లో ఔరంగజేబ్ సైన్యాన్ని ఎదుర్కొని, గోలకొండ కోటను
రక్షించిన సేనానాయకుడు ఎవరు? (మూసా ఖాన్ మహల్ దార్)
20. కుతుబ్ షాహీల కాలంలో వెలసిన
చారిత్రాత్మక కట్టడం చార్మీనార్‍ను నిర్మించిన మహానుభావుడెవరు? ఎప్పుడు? (మహ్మద్ కులీ కుతుబ్ షా, 1590-1591)
21. హైదరాబాద్, సికిందరాబాద్ జంట
నగరాలను కలిపేది, విడదీసేది ఏ నిర్మాణం? (హుస్సేన్ సాగర్-టాంక్ బండ్)
22. ప్రప్రధమ భారత ప్రధాని
పండిట్ జవహర్లాల్ నెహ్రూ,
హైదరాబాద్ నగరాన్ని ఏమని వర్ణించారు? (భారతీయ
సంస్కృతికి "విశ్వం" లాంటిదని)
23. దక్కన్ రాజధానిని, ఔరంగాబాద్ నుండి హైదరాబాద్‌కు
మార్చినది ఎవరు? ఎప్పుడు? (రెండవ ఆసఫ్
నిజాం అలీఖాన్, 1763)
24. ఆధునిక హైదరాబాద్ నిర్మాత
పూర్తి పేరు, బిరుదులతో సహా ఏమిటి? (లెఫ్ట్ నెంట్ జనరల్, హిజ్ ఎక్జాల్టెడ్ హైనెస్, రుస్తుం-ఇ-దౌరాన్, అరస్తు-ఇ-ఇజామాం, సిఫాసాలార్, ఆసఫ్
జా, ముజఫర్-ఉల్-ముల్క్-వాల్-మామాలిక్, నిజాం-ఉల్-ముల్క్,
నిజాం-ఉద్-దౌల్హా, నవాబ్ సర్ మీర్ ఉస్మాన్
అలీఖాన్ బహదూర్, పతేజంగ్, సుల్తాన్-ఉమ్-ఉలూమ్,
జి.సి.ఎస్.ఐ.జి.బి.ఐ, బ్రిటీష్ ప్రభుత్వ
విశ్వాస పాత్రుడు, హైదరాబాద్-చీరాల నిజాం)
25. మూడవ ఆసఫ్ జాహి, సికిందర్ జాహి
పేరుమీద నిర్మించిన నగరం పేరేంటి? ( జంట నగరాలలో ఒకటైన
సికిందరాబాద్)
26. హైదరాబాద్ నగరానికి
సంబంధించినంతవరకు ఫిబ్రవరి 5, 1885
ఎందుకని ముఖ్యమైన దినంగా చెప్పుకోవచ్చు? ( ప్రప్రధమంగా బ్రిటీష్ రాణి ప్రత్యేక దూతగా
హైదరాబాద్ నగరానికి విచ్చేసిన భారత వైస్రాయ్ సమక్షంలో, ఆయన
చేతుల మీదుగా మీర్ మెహబూబ్ అలీఖాన్ నిజాం నవాబ్‍గా పట్టాభిషిక్తుడైన రోజది. అలా
పట్టాభిషిక్తుడైన మొదటి నిజాం ఆయనే)
27. హైదరాబాద్ సంస్థానాన్ని
భారత యూనియన్‌లో విలీనం చేసే ప్రయత్నంలో భాగంగా పోలీసు చర్య ఎప్పుడు ప్రారంభమైంది? దరిమిలా నిజాం
మంత్రివర్గం రాజీనామా చేసిందెప్పుడు? (సెప్టెంబర్ 13, 1948: సెప్టెంబర్ 17, 1948)
28. భారత సైన్యం హైదరాబాద్‌ను
ఆక్రమించుకున్నదెప్పుడు? ఎప్పుడు సైనిక పాలన విధించడం జరిగింది? తుదకు భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం జరిగిందెప్పుడు?
(సెప్టెంబర్ 19, 1948)
29. హైదరాబాద్ నగరం
నడి మధ్యలో ప్రవహిస్తుండే మూసీ నదికి భీభత్సమైన వరదలు సంభవించిందెప్పుడు? (సెప్టెంబర్
28, 1908 మంగళవారం)
30. ఆధునిక
హైదరాబాద్ రూపురేఖల రూపకల్పనలో మహ్మద్ కులీ కుతుబ్ షా కు సహాయకుడుగా వ్యవహరించిన
పీష్వా ఎవరు?
(మీర్ ముమీన్ అస్ట్రాబడి)
31. ఆధునిక
హైదరాబాద్ నగరానికి 1591
వ
సంవత్సరంలో సుల్తాన్ కులీ కుతుబ్ షా శంఖుస్థాపన చేసిన రోజు శుభ దినం కాదని
కొందరంటారు. కారణమేంటి? (చంద్రుడు సింహరాశి నక్షత్ర మండలంలోను, బృహస్పతి తనదైన వేరే మార్గంలోను కదులుతున్న రోజైనందున ఆ దినాన్ని
అశుభమైనదిగా కొందరు పరిగణిస్తారు)
32. హైదరాబాద్ అసలు
పేరేంటి? ఎవరి పేరుపై అలా పిలవడం జరిగిందసలు? (ఇస్లాం నాల్గవ
మత ప్రవక్త హజ్రత్ అలీ బిరుదు ఆధారంగా, హయిదరాబాద్ అనీ,
హయిదర్ నగరమనీ పిల్చేవారు)
33. భాగుమతి పేరు
మీద హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరం అని పిలవడానికి మరేదైనా కారణం కూడా వుందా? (భాగ్
నగర్ అంటే ఉద్యానవనాల నగరం అని కూడా అర్థం)
34. కులీ కుతుబ్ షా
పాలనా కాలంలో హైదరాబాద్ నగరం ఎన్ని ముహల్లాలుగా విభజించడం జరిగింది? ప్రధాన
రహదారులలో ఆ రోజుల్లో వున్న భవంతులెన్ని? (12, 000
; 14, 000)
35. కులీ కుతుబ్ షా
కాలం నాటి హైదరాబాద్ నగరంలో, ఏఏ ప్రాంతాలను రాజ ప్రాసాదాల కొరకు, ప్రభుత్వ కార్యాలయాల నిమిత్తం కేటాయించారు? ప్రముఖుల
నివాసం కొరకు ఏర్పాటు చేసిన ప్రాంతం ఏది? (వాయువ్య, ఈశాన్య ప్రాంతాలు)
36. కులీ కుతుబ్ షా
కాలంలో, ఆధునిక హైదరాబాద్ నిర్మాణాలలో భాగంగా, పూర్తిగా
విభజించబడిన ప్రప్రధమ కట్టడం ఏది? (1592 నాటి చార్మీనార్)
37. ఫ్రాన్స్
దేశానికి చెందిన ప్రముఖ యాత్రీకుడు, వ్యాపారస్తుడు టావర్నీర్ 1652 వ సంవత్సరంలో, హైదరాబాద్
నగరాన్ని దర్శించిన తరువాత దానిని ఏ నగరంతో పోల్చాడు? (ఫ్రాన్స్
దేశంలోని ఆర్లియన్స్)
38. రాష్ట్ర
రాజధానిగా హైదరాబాద్ నగరం ఎంతకాలం పాటు వ్యవహరించబడలేదు? తిరిగి
ఎవరి చొరవతో అది తన పూర్వ వైభవాన్ని పొందగలిగింది? (1687-1763 మధ్య కాలంలో 76 సంవత్సరాల
పాటు. రెండవ ఆసఫ్ జాహి నిజాం అలీఖాన్ చొరవతో)
39. నిజాం-ఉల్-ముల్క్
కు చెందిన ఆరు ప్రాంతాలను ఆ రోజుల్లో ఎన్ని సర్కారులు గాను, ఎన్ని
పరగణాలు గాను విభజించడం జరిగింది? (93 సర్కార్లు, 1228 పరగణాలు)
40. హైదరాబాద్-సికిందరాబాద్
జంట నగరాల అభివృద్ధి కార్యక్రమంలో ప్రధాన భాగంగా, ఒక నూతన
శకారంభం ఎప్పుడు-ఎందువలన జరిగింది? (1798 లో కుదుర్చుకున్న ఆశ్రిత
మైత్రీ ఒడంబడిక వలన సికిందరాబాద్ కంటోన్మెంటు బ్రిటీష్ సైనికుల స్థావరంగా
తయారైంది. అభివృద్ధి కార్యక్రమాల అమలులో అలా ఒక నూతన శకం ఆరంభమైంది)
41. ప్రప్రధమంగా
హైదరాబాద్ శాసనసభను ఏర్పాటు చేసినప్పుడు ఎందరు సభ్యులుండేవారు? వారిలో
ఎన్నికైన వారెందరు? నామినేటెడ్ ఎందరు? (మొత్తం 132, ఎన్నికైన వారు 76, నామినేటెడ్ 56)
42. ఏఏ రాజ
ప్రముఖుల జన్మ దినాలను అధికారిక శెలవు రోజులుగా అలనాటి హైదరాబాద్లలో పరిగణించేవారు? (నిజాం
పుట్టిన రోజు, విక్టోరియా మహారాణి పుట్టిన రోజు, బ్రిటీష్ రాజు జన్మ దినం)
43. ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ నగరం ఎప్పుడైంది? (నవంబర్ 1, 1956
న-
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత)
Monday, April 8, 2013
రాహుల్ కోసం అధిష్ఠానం ఆరాటం: వనం జ్వాలా నరసింహారావు
రాహుల్ కోసం అధిష్ఠానం ఆరాటం
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
మరో మారు రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి సారించారనడానికి నిదర్శనం, ఈనెల
18న ఢిల్లీకి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స
సత్యనారాయణలకు ఆయన దగ్గరనుంచి పిలుపు రావడమే. ఏ క్షణాన్నైనా జాతీయ స్థాయిలో సార్వత్రిక
ఎన్నికలు, తదనుగుణంగా రాష్ట్రంలో ఎన్నికలు, రాష్ట్ర మంత్రులపై సీబీఐ కేసులు, ఇతరత్రా సమస్యల నేపథ్యంలో
రాహుల్ రాష్ట్రంపై దృష్టి సారించవచ్చు. ఈ సమావేశంలో,
రాహుల్ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముందని రాజకీయ పరిశీలకులు
భావిస్తున్నారు. అలానే తెలంగాణ అంశానికి సంబంధించి కూడా ఆయన కొన్ని సూచనలు చేయవచ్చేమో.
కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రాహుల్ పార్టీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులతో కొన్నాళ్ల క్రితం భేటీ అయ్యారు. రాహుల్‌గాంధీ ఇప్పటికే
6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులతో సమావేశమై పార్టీ
పరిస్థితులను సమీక్షించారు. ఆ కొనసాగింపుగా, ఈనెల 17,
18, 19 తేదీల్లో పలు రాష్ట్రాల సీఎంలు,
పీసీసీ నేతలతో భేటీ కావాలనుకుంటున్నారట. ఇందులో భాగంగానే 18వ తేదీన ఆంధ్రప్రదేశ్,
కేరళ, తమిళనాడు నేతలతో రాహుల్ సమావేశమవుతున్నారు.
రాష్ట్ర-దేశ రాజకీయాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆసక్తిగా
గమనిస్తున్న పరిశీలకులు అసలేం జరుగుతోంది? జరుగబోతోంది? అన్న మీమాంసతో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రానికి
సంబంధించినంతవరకు, మరి కొద్ది రోజుల్లో తేలనున్న జగన్ వర్గ
కాంగ్రెస్-తెలుగుదేశం అసంతృప్తి ఎమ్మెల్యేల అనర్హత
భవితవ్యంలో, ఆ తరువాత తేలనున్న ఉప ఎన్నికల ఫలితాలను ఇప్పటి
నుంచే వివిధ కోణాలనుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు విశ్లేషకులు.
ఈ మొత్తం వ్యవహారంలో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చాలా తేలికగా
కనిపించవచ్చు కాని వాస్తవానికి అంత చిన్న విషయమేమీ కాదనాలి. ప్రపంచంలోనే
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతావనికి, ప్రభుత్వ పదవి లేకపోయినా-ప్రధాని కాకపోయినా, మకుటం లేని మహారాణిగా చెలామణి అవుతున్న సోనియా
గాంధీ, ఆమె కుమారుడు-ఢిల్లీ పీఠం బావి వారసుడు రాహుల్
గాంధీల ఆధిపత్యం ఏం కాబోతున్నదా అన్న అనుమానం రాబోయే రాష్ట్ర ఉప ఎన్నిక-దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాల ద్వారా కలగక మానదంటున్నారు ఆ పరిశీలకులు.
ఆంధ్ర ప్రదేశ్ లో పాద రసంలాగా ఎగబాకుతున్న యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగు రీతిలో రాజకీయ
గుణపాఠం చెప్పి తీరాల్సిందే అన్న పట్టుదలతో యావత్ కాంగ్రెస్ అధిష్ఠానం ముందడుగు
వేస్తోంది.
జైలుపాలైన జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరిని-తిరుగుబాటు
ధోరణిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సహించే స్థితిలో లేదు. ఆయనకు
ముక్కుతాడు వేసే ప్రయత్నం చేసింది-ఇంకా చేస్తూనే వుంది.
గతంలో జరిగిన ఉప ఎన్నికలను కూడా, తమకు అనుకూలంగా, ఒక ఆయుధంలాగా మలచుకుందామని, జగన్ పార్టీలోకి వలసలను ఆపు చేద్దామని అపోహపడింది అధిష్ఠానం. కాని
దురదృష్ట వశాత్తు అది సాధ్యపడలేదు. వీటన్నింటి నేపధ్యం ఒకటే!
సామ-దాన-భేద-దండోపాయాలను ఉపయోగించి సోనియా-నెహ్రూ-గాంధీ కుటుంబాల వారసత్వానికి, ఆధిపత్యానికి తిరుగులేని అవకాశం కలిగించి, రాహుల్ గాంధీని ఢిల్లీ గద్దె ఎక్కించడమే! భావి
భారత ప్రధానిగా చూడడమే! అది సాధ్యపడుతోందా? లేదా? అంటే అది వేరే సంగతి!
అధిష్ఠానంకు ఈ తరహా ఆలోచన రావడం, అమలుచేయడం,కొత్తేమీకాదు. గతంలో కూడా, అధిష్ఠానానికి ఎదురుతిరిగిన మహామహులను-ఉద్దండ
పిండాలను నిరంకుశంగా కాల రాసింది. ఎంతో మంది అతిరథ-మహారథులను అర్థ రధులుగా చేసింది. ఒక్క మాటలో
చెప్పాలంటే, "సమిష్ఠి నాయకత్వం" అన్న
మాటే గిట్టదు అధిష్ఠానానికి. అధిష్ఠానం అంటే ఎవరో కాదు.
ఒకనాడు నెహ్రూ అయితే, ఆ తర్వాత ఇందిర, రాజీవ్ (మధ్యలో సంజయ్) లు కాగా
ఇప్పుడు సోనియా. ఆ ఏక వ్యక్తుల అభిప్రాయమే ఏకాభిప్రాయం-సమిష్ఠి అభిప్రాయం. ఆ సుప్రీం లీడర్‌కు అంతా సలాం
కొట్టాల్సిందే! అడుగుజాడలలో నడవాల్సిందే!వారెంత ప్రజాదరణ కల నాయకులైనా, పరిణితి చెందిన నాయకులైనా, ఎన్ని రకాల శక్తి సామర్ధ్యాలున్న వారైనా, తలవంచక-దాసోహం అనక తప్పదు. ఏడాది తరువాత రానున్న సార్వత్రిక ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీకి అంతగా అనుకూలంగా లేని
ప్రస్తుత పరిస్థితులలో, మరో ప్రాంతీయ పార్టీని
బ్రతికి బట్ట కట్టనిస్తుందా? ఆంధ్ర
ప్రదేశ్ లో ఇప్పటికే ఒకటి-రెండు ఉప ఎన్నికల ఫలితాల ద్వారా, పరువు-ప్రతిష్ఠలను పూర్తిగా కోల్పోయిన
కాంగ్రెస్ అధిష్ఠానం, జగన్ పార్టీని
మనుగడ చేయనిస్తుందా? పోనీ ఏం చేయగలుగుతుంది? అన్నింటికన్నా ముఖ్యమైంది, పవర్ పాలిటిక్స్ ను అర్థం చేసుకోగలగడం. పవర్
పాలిటిక్స్ ను అనుసరించాలంటే, ఊహ కందని వ్యూహాలను పన్నాలి. వాటికి నైతికత అక్కర
లేదు. పవర్ పాలిటిక్స్ ఆట ఆడడంలో ఢిల్లీ అధినాయకత్వానికి
తెలియని కిటుకు లేదు. ఆ ఆట ఆడడానికి అనుసరించని నిరంకుశ
ధోరణి లేదు. "నెహ్రూ-ఇందిర-గాంధీ" వారసత్వ సంపదను పదికాలాలపాటు పదిలంగా
ఉంచడానికి, కాంగ్రెస్ అధిష్టానం, పవర్ పాలిటిక్స్ ను, అవసరమైతే, జాతీయ అవసరాలను పక్కన పెట్టినా సరే, తమకు అనుకూలంగా మలచుకుంటూ వస్తున్నది. కాకపోతే, అన్నివేళలా అధిష్ఠానం ఆలోచనలు
విజయవంతమవుతున్నాయా అంటే, బెడసి కొట్టిన
సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ ఆటలో ఏకైక వ్యూహం ఒక్కటే. ఏదో
విధంగా రాహుల్‌ను ప్రధాని పీఠం ఎక్కించడమే! దానిని
అడ్డగించినవారికి చుక్కలు చూపించే ప్రయత్నం చేయడమే!
ప్రధాన మంత్రి పదవికి ప్రణబ్ కుమార్ ముఖర్జీ కంటే అర్హుడు మరెవ్వరూ
లేరనాలి. ఆయన ఆ పీఠాన్ని అధిరోహించితే అడ్డు చెప్పేవారు కాని, చెప్పగలిగేవారు కాని పార్టీలో ఎవరూ లేరు. అందుకే, రాహుల్‌కు దారి సుగమం చేయడానికి ప్రణబ్‌కు మరో
విధంగా పదోన్నతి కలిగించి రాష్ట్రపతి పదవి కట్టబెట్టింది నెహ్రూ-ఇందిర-గాంధీ వారసత్వం. ఇప్పుడిప్పుడే రాజకీయ పాఠాలు
నేర్చుకునేవారు సైతం ఈ కుట్రను అర్థం చేసుకోవడం తేలికే! యుపిఎ
భాగస్వామ్య పార్టీల ప్రస్తుత-మాజీ నాయకులు శరద్ పవార్, అజిత్ సింగ్, మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, కరుణానిధి లాంటి కాకలు తీరిన యోధుల పాదాలు చల్లబడేట్లు
చేసింది సోనియా నిర్ణయం. ఒకవేళ వీరిలో ఎవరన్నా నోరు మెదిపితే, ఎల్లప్పుడూ వాడే సిబిఐ దర్యాప్తు లాంటి బ్లాక్
మెయిల్ ఆయుధం వారిపై కూడా ప్రయోగించే వీలుందని అందరికీ తెలిసిన విషయమే! ఇక
రాష్ట్రం విషయానికొస్తే, జగన్మోహన్
రెడ్డి తిరుగుబాటు బావుటాను ఎదుర్కునేందుకు అధిష్ఠానం తనముందున్న తురుఫ్ ముక్కలన్నింటినీ
బయటకు తెచ్చింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన తీవ్ర పదజాలంతో కూడిన
వ్యాఖ్యలు కూడా అందులో భాగమే. గతంలో, ఎప్పుడైతే పద్దెనిమిది
మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యులు పార్టీ ఫిరాయించనున్నారని పసికట్టిందో, అప్పుడే, చిరంజీవిని తనవైపు గుంజుకుంది. ఆ
తరువాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రి పదవి
కట్టబెట్టింది. కీలకమైన (గత) ఉప ఎన్నికల సమయంలో జగన్‌ను జైలు పాలు చేసింది. ఇంకా జైలులోనే కొనసాగించే వ్యూహం
పన్నింది.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు, ఒక వైపు జబ్బు ముదురుతుండగా, మరోవైపు, రోగ లక్షణాలు
ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. రోజు-రోజుకూ ఇన్‌ఫెక్షన్
వేగంగా పాకుతుండడంతో, వ్యాధిని నియంత్రించడం
కష్ట తరమై పోతోంది. బహుశా నూట ఇరవై ఎనిమిదేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ పరిస్థితిని, ఇంతకంటే మంచిగా ఎవరూ వర్ణించలేరేమో! స్వాతంత్ర్యం
వచ్చిన నాటినుంచీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం
ఏర్పాటైన నాటినుంచీ, కాంగ్రెస్ పార్టీకి
కంచుకోటగా వుంటూ వస్తోందీ దక్షిణ భారత ప్రాంతం. కాకపోతే మొట్ట మొదటిసారి 1983-89 లో, ఆ తరువాత 1994-2004 మధ్యలో, ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం చేతిలో ఓటమి పాలైనప్పటికీ, అస్తిత్వాన్ని మాత్రం ఏ నాడూ కోల్పోలేదు. 1983-89 లో అధికారాన్ని
కోల్పోయినా, డాక్టర్ మర్రి
చెన్నారెడ్డి సమర్ధవంతమైన నాయకత్వంలో 1989 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అదే
విధంగా 1994-2004 మధ్య కాలంలో
అధికారంలో లేకపోయినా డాక్టర్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2004 లో మళ్లీ పూర్వ
వైభవాన్ని పొంది 2009లో మరో మారు
ఎన్నికల్లో గెలిచి ఇంతవరకూ అధికారంలో కొనసాగుతోంది. దురదృష్టవశాత్తు అలాంటి రాజకీయ
స్టాల్వార్ట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం, ఆద్యతన భవిష్యత్‍లో అలాంటి వారు దొరుకుతారన్న
నమ్మకం కుదరకపోవడం, పార్టీని అపజయ పరంపరలకు
గురిచేస్తోంది.
అలనాడు నీలం సంజీవరెడ్డి, ఆయన తరువాత ఆయన వారసుడుగా వచ్చిన బ్రహ్మానందరెడ్డి, 1978-1989 ఎన్నికల్లో విజయం
సాధించి పెట్టిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, 2004-2009 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన డాక్టర్
రాజశేఖర రెడ్డి మినహా, ఈ రాష్ట్ర కాంగ్రెస్
ముఖ్య మంత్రులుగా పనిచేసిన వారందరూ, "దిగుబడి సరుకే"!. అధిష్ఠానం నమ్మిన వారో, అధిష్ఠానాన్ని నమ్మించిన వారో, అధిష్ఠానాన్ని ఆ కట్టుకోగలిగిన వారో, లాబీయింగ్ చేయగలిగిన వారో మాత్రమే ముఖ్యమంత్రులు
కాగలిగారు. ఆ ఆచారం జవహర్లాల్
నెహ్రూ కాలం నుంచి సోనియా హయాం వరకూ అలాగే కొనసాగుతూ వస్తోంది. దామోదరం సంజీవయ్య నుంచి నేటి కిరణ్ కుమార్
రెడ్డి వరకూ అదే వరస. వీరిలో సమర్ధులు లేరని
కాని, "దిగుబడి" కి సమర్ధత కొలమానం కాదని కాని భావన కాదు. ఇదంతా ఒక ఎత్తైతే, కాంగ్రెస్ ఓట్ బాంక్ వ్యవహారం మరో ఎత్తు. ఎన్టీ
రామారావు ప్రభంజనంలో ఓడినప్పుడు కాని, ఆ తరువాత చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం హయాంలో
ఓడినప్పుడు కాని, త్రి ముఖ పోటీ
జరిగినప్పుడు కాని, కాంగ్రెస్ ఓటు బాంక్ 35-40 శాతానికి తగ్గకుండా పదిలంగా వుంటూ వస్తుంది. మొట్టమొదటి
సారిగా దానికి భారీ గండి పడింది. గతంలో జరిగిన ఉప ఎన్నికల
ఫలితాలు ఆ విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పాయి. తెలంగాణ ప్రాంతంలో తెరాస గండి
కొడుతుంటే, సీమాంధ్రలో జగన్ పార్టీ
వైఎస్సార్ కాంగ్రెస్ ఆ పని చేసింది. ఓటింగు శాతం ఇరవైకి పడిపోయి ఘోర
పరాజయం పాలైంది కాంగ్రెస్ పార్టీ. డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014 లో ఎదురు కానున్న పరిస్థితి అగమ్య గోచరంగా కనిపించసాగింది.
2009 ఎన్నికల్లో
అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణ భూతుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి
హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణానికి గురైన దరిమిలా పార్టీకి ఈ దుస్థితి క్రమేపీ
ఏర్పడ సాగింది. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, భారతీయ జనతా పార్టీల సారధ్యంలో ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ
రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ను మట్టి కరిపిస్తుంటే, మరో పక్క కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి
నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ సీమాంధ్ర ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఎదగ సాగింది. నెత్తి
మీద కుంపటి దించుకున్న చందాన, చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం
చేసినా ఫలితం శూన్యం.
"టీ"-"జే" ల ఒత్తిడి మధ్య కొట్టు మిట్టాడుతున్న
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలి మధ్య
వున్నట్లుంది. ఇదే పరిస్థితి దాదాపు జాతీయ స్థాయిలో కూడా
నెలకొని వుంది. కళ్ల ముందర, ఈ పరిస్థితిని అధిగమించడానికి, మార్గాలేవీ కనిపించడం లేదు. గత
ఎన్నికల్లో యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదపడేందుకు, దేశంలోనే అధిక సంఖ్యలో-33 మంది ఎంపీలను సమకూర్చిన రాష్ట్ర
కాంగ్రెస్ పరిస్థితి ప్రభావం జాతీయ స్థాయిలో పార్టీ మీద పడక తప్పదు. పార్టీ-యుపిఎ అధికారానికి దూరం కాక తప్పదు. ఈ నేపధ్యంలో, మన్మోహన్ సింగ్ నుంచి అత్యంత అలవోకగా ప్రధాని
పదవిని తనయుడు రాహుల్ గాంధీకి బదలాయించాలని తాపత్రయ పడుతున్న సోనియా గాంధీ
ముందున్న సవాళ్లు ఏంటి? వాటిని ఆమె ఏ విధంగా
అధిగమించగలరు? కాంగ్రెస్ పార్టీ గడ్డు
కాలం ఎదుర్కుంటుందన్నది వాస్తవం. సవాళ్లను సోనియా ఎదుర్కునే ముందర,రాష్ట్రంలో అందరికీ అర్థం అవుతున్న కొన్ని నగ్న
సత్యాలను అధిష్ఠానం సహితం అర్థం చేసుకుంటే మంచిదేమో! మంచికో-చెడ్డ కో రోశయ్యను మార్చి కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని
అంటగట్టిన అధిష్ఠానం, ఏ నాడన్నా
ఆయనకు పరిపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చిందా? ఆయన మంత్రి వర్గాన్ని ఆయనే ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చిందా? పదవుల పందేరం చేయనిచ్చిందా?ఆయనకిష్ఠమైన వారిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష
పదవికి ఎంపిక చేసుకునే వీలు కలిపించిందా? తన మంత్రివర్గంలో అనునిత్యం తనను ఎదిరిస్తున్న వారి విషయంలో
కఠినంగా వ్యవహరించేందుకు కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం వుందా? ముందు వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం
అధిష్ఠానానికి ఉంది.
బహుశా, తమిళనాడు
తరహాలో, ఏదో ఒక ప్రాంతీయ
పార్టీతో అవగాహన కుదుర్చుకోక తప్పని పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్‌కు
తప్పదా? అలాంటప్పుడు, ఆ ప్రాంతీయ పార్టీ ఎలాగూ తెలుగుదేశం కాదు
కాబట్టి, తెరాసతోను-వైఎస్సార్ సీపీ తోను అవగాహన వుండే
అవకాశాలున్నాయా? రాష్ట్ర విభజన చేయక
తప్పదా? ప్రత్యేక తెలంగాణ
రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఏదో ఒక నిర్ణయం ప్రకటించక తప్పదా?
2014 లో జరుగనున్న
సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్‌ను సన్నద్ధం చేసేందుకు-బలోపేతం చేసేందుకు, జాతీయ స్థాయిలో పార్టీ అధి నాయకత్వం-అధిష్జ్ఠానం చేపడుతున్న చర్యల్లో భాగంగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా
గాంధీ కుమారుడు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, భావి భారత ప్రధానిగా భావించబడుతున్న రాహుల్‌గాంధీ, ముఖ్య భూమిక పోషించేందుకు సమాయత్త మౌతున్నారు. యువ నాయకుడు రాహుల్ గాంధీ కాయ కల్ప చికిత్స
మొదలు పెట్టారంటున్నారు. అందులో భాగంగానే, ఢిల్లీలో తల్లిని కలవడానికి వచ్చిన పెద్దా-చిన్నా పనిలో పనిగా రాహుల్ గాంధీని కూడా కలిసి
పోతున్నారు. అంతే కాదు. రాహుల్ గాంధీనే స్వయంగా ఎంపిక చేసిన కొందరికి
ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. రాష్ట్రంలోని సీనియర్ నేతలు పలువురితో వ్యక్తిగతంగా మంతనాలు
జరిపారు. అధినేత్రి సోనియా
ఆదేశాలతోనే రాహుల్ రంగ ప్రవేశం చేశారా? లేక స్వయంగా ఆయన తనంతట తానే చొరవ తీసుకుని ఇలా చేస్తున్నారా? అనేది ఇంకా తేలాల్సిన విషయమే.
ఏదేమైనా
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగయ్యే సూచనలు కనిపించడం లేదు. End
Wednesday, April 3, 2013
కాగ్ నివేదిక పరమార్థం: వనం జ్వాలా నరసింహారావు
కాగ్
నివేదిక పరమార్థమే!
శాసనసభలో ప్రవేశపెట్టిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)
నివేదికలో, 2006-2011 మధ్య ఐదు సంవత్సరాల
కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జరిపిన భూముల కేటాయింపులలో రు.50 కోట్ల పైగా విలువ
గల భూమి అక్రమ పద్ధతుల్లో అన్యాక్రాంతం జరిగిందని తేలింది. కాగ్ ఆడిట్ జరిపిన ఐదు
సంవత్సరాల మధ్య కాలంలో తొలుత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించగా, ఆ
తరువాత 15 నెలల పాటు రోశయ్య ముఖ్య మంత్రిగా పాలించాడు. అప్పట్నుంచీ ప్రస్తుత ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
హయాం కొనసాగుతూ వచ్చింది. ఈ ముగ్గురి పాలనలోనూ భూ కేటాయింపులలో అవినీతి జరిగిందని
కాగ్ నివేదిక ద్వారా తెలుస్తోంది. భూముల కేటాయింపులు ప్రధానంగా రాజశేఖర రెడ్డి
హయాంలోనే జరిగినప్పటికీ అప్పటి నిర్ణయాలను తదుపరి ముఖ్యమంత్రులు కొనసాగించారు.
రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అక్రమ కేటాయింపులను రద్దు చేయడానికి గానీ, సరి చేయడానికి గానీ వారు పూనుకోలేదు. కాగ్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని
తీవ్రంగా తప్పు పట్టింది. ఆర్ధిక పరమైన ఆస్తులకు సంబంధించిన చట్టాలను, నిర్దేశిత విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అనేక కేసుల్లో పూర్తిగా
విస్మరించిందని చెప్పింది. తీవ్రస్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని తేల్చింది.
తాత్కాలిక ప్రాతిపదికన, యధేఛ్చగా, విచ్చలవిడిగా
ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు, అత్యంత తక్కువ ధరలకు భూములు పందేరం పెట్టారని వెల్లడించింది. భూముల పందేరంలో రాష్ట్ర ప్రజల ఆర్ధిక భవితవ్యాన్నీ,
సామాజికార్ధిక ప్రయోజనాలను పరి రక్షించడంలో విఫలం అయ్యారని
పేర్కొన్నది. అదే విధంగా విద్యుత్ వ్యవహారంలో కూడా కాగ్ అక్షింతలు వేసింది.
కాకపోతే, కాగ్ నివేదిక బైబిల్, భగవద్గీత,
ఖురాన్ కాదని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాగ్ నివేదికలో
పలు అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉంటున్నాయన్నారు. కాగ్ చెప్పినవన్నీ నిజాలు కావని, మళ్లీ, కాగ్ నివేదికపై పీఏసీ పరిశీలన చేసి నివేదిక
ఇస్తుందన్నారు. కాగ్ విషయంలో ముఖ్యమంత్రి ఇంత తేలికగా ఎలా మాట్లాడగలిగారనేది అంతుపట్టని
విషయం. ఈ నేపధ్యంలో కాగ్ కు సంబంధించిన పూర్వాపరాలను గురించి తెలుసుకోవడం అవసరం.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, కార్యనిర్వాహక వ్యవస్థపై
చట్టసభలకు ఆధిపత్యం వుందని-వుండాలని తెలియచేస్తూ, తద్వారా
ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ఆచరణలోకి తేవడానికి ఉపయోగపడే అసలు-సిసలైన ఆయుధం,
ప్రభుత్వపరమైన ఆదాయ-వ్యయ లెక్కల తనిఖీ అనే ప్రక్రియ మాత్రమే. ద్రవ్య
వినియోగ విషయంలో చట్టసభలదే తుది తీర్పు, అత్యున్నత అధికారం
అనే విషయాన్ని కూడా స్పష్ట పరిచేందుకు, ఆదాయ-వ్యయ లెక్కల
తనిఖీ వ్యవస్థలు నెలకొల్ప బడి వేళ్లూనుకోసాగాయి. ఇవి అనాదిగా అమల్లో వున్న
వ్యవస్థలు. చట్టసభలకు సంక్రమించిన ఈ అధికారానికి రెండు మౌలికాంశాలు ప్రధానంగా
తోడయ్యాయి. ఒకటి ప్రభుత్వం తన మనుగడ సాగించడానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడం
కాగా, రెండోది ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని పర్యవేక్షించే
అధికారం. ఏనాడో 1866 లోనే, "ఎక్స్ చెక్కర్ అండ్ ఆడిట్ శాఖ" ను రాజ్యాంగపరంగా ఒక చట్టంగా ఏర్పాటు
చేయడం ద్వారా, పార్లమెంటరీ
ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటీష్ ప్రభుత్వం ఈ నాడు అమల్లో వున్న ప్రభుత్వ ఆడిట్
విధానానికి శ్రీకారం చుట్టిందనాలి. ఎక్స్ చెక్కర్ అండ్ ఆడిట్
శాఖ చట్టం కింద, ప్రతి ప్రభుత్వ
శాఖ విధిగా ఏటేటా, తన
శాఖకు చెందిన ద్రవ్య వినియోగ పద్దులను-ఆదాయ గణనలను పార్లమెంటు
ముందుంచి తీరాలి. అదే చట్టం కింద మొట్టమొదటి సారిగా, "కంప్ట్రోలర్
అండ్ ఆడిటర్ జనరల్" (కాగ్) అనే వ్యవస్థను ఏర్పాటుచేయడం జరిగింది. అలా “కాగ్” కు నాంది-ప్రస్తావన జరిగిందనాలి. ప్రభుత్వ
ఆదాయ-వ్యయాలపై కాగ్ నిర్వహించే దర్యాప్తు ఫలితాలను స్వతంత్ర ప్రతిపత్తిగల
బాధ్యతాయుతమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనే పార్లమెంటరీ కమిటీ పరిశీలించి, తద్వారా, ద్రవ్య వినియోగంపై పార్లమెంటరీ
ఆధిపత్యాన్ని నెలకొల్పడం జరుగుతుంది.
ప్రభుత్వ పరమైన ఆదాయ-వ్యయ సంబంధిత
లెక్కలు చూడడం, తనిఖీ చేయడం కొరకు ఉద్దేశించిన ఈనాటి ఇండియన్
ఆడిట్-అక్కౌంట్స్ శాఖ వ్యవస్థాగత ఏర్పాటు బ్రిటీష్ ప్రభుత్వ నమూనాలో, బ్రిటీష్ వారసత్వంగా మనకు సంక్రమించిందే. ఎప్పుడో-ఏనాడో 1858 లోనే, ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను
హస్తగతం చేసుకున్న నాటి బ్రిటీష్ ప్రభుత్వం, ప్రభుత్వ ఆదాయ-వ్యయ వ్యవహారాలు చూసేందుకు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాను
నియమించింది. 1919 లో ప్రవేశపెట్టిన
రాజ్యాంగ సంస్కరణలు, ఆడిటర్ జనరల్ పదవికి చట్టబద్ధత
కలిగించడానికి దోహదపడ్డాయి. 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం, ఆడిటర్ జనరల్ పదవికి
మరింత ప్రాముఖ్యత కలిగించింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత,
"కాగ్" కు
148 నుంచి 152 ప్రకరణల ద్వారా ప్రత్యేక హోదాను కలిగించడంతో
పాటు, రాజ్యాంగపరమైన భద్రత
కలిగించడం జరిగింది. 1971 కాగ్ చట్టం ద్వారా, ఆ వ్యవస్థకు వుండాల్సిన బాధ్యతలు,
అధికారాలు, హక్కులు స్పష్టంగా
క్రమబద్ధీకరించడం జరిగింది. రాజ్యాంగం 151 వ ప్రకరణలో
చెప్పినట్లు, కేంద్ర
ప్రభుత్వానికి సంబంధించినంతవరకు కాగ్ నివేదికలన్నీ భారత రాష్ట్రపతికి అందచేయాలి.
ఆయన ఆదేశాల మేరకు ఆ నివేదికలను భారత పార్లమెంటు ఉభయ సభల ముందుంచాలి. రాష్ట్రాలకు
సంబంధించినంతవరకు ఆయా రాష్ట్రాల గవర్నర్లకు వారి ద్వారా శాసనసభలకు సమర్పించడం
జరుగుతుంది. కాగ్ పదవికి సర్వసాధారణంగా ఇండియన్ ఆడిట్ అక్కౌంట్స్ సర్వీసెస్ కు
చెందిన సీనియర్ అధికారులనే నియమించే సంప్రదాయం చాలాకాలం వుండేది. 1978 తరువాత ఐఏఎస్ కు చెందిన అధికారులను
ఆ పదవిలో నియమించే ఆనవాయితి మొదలైంది. ఇది తరచూ
విమర్శలకు దారితీసింది కూడా. విమర్శించిన వారిలో పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ
అధ్యక్షుడు, మీడియా, సామాజిక కార్యకర్తలు ఇతరులు పలువురు
వున్నారు. కాకపోతే, భారత రాజ్యాంగంలో కాగ్ పదవికి ఫలానా
పూర్వ ఉద్యోగార్హతలుండాలని ఎక్కడా చెప్పడం జరగలేదు. ఐతే, రాజ్యాంగ
సభలో దీనిపై చర్చలు జరిగాయి. ఆర్థిక, ఆదాయ-వ్యయ వ్యవహారాలలో
అనుభవం గడించినవారిని మాత్రమే ఆ పదవిలోకి తేవాలని సూత్రప్రాయంగా
అంగీకరించారప్పట్లో.
ఇండియన్ ఆడిట్-అక్కౌంట్స్ శాఖాధిపతినే కంప్ట్రోలర్-ఆడిటర్ జనరల్ (కాగ్) అని పిలుస్తారు.
ఈ శాఖ కార్యాలయాలు దేశవ్యాప్తంగా వున్నాయి. సంఖ్యాపరంగా చూస్తే, 34 కేంద్ర ప్రభుత్వ ఆడిట్ కార్యాలయాలు, 60 రాష్ట్ర స్థాయి
కార్యాలయాలున్నాయి. ఆయా కార్యాలయ అధిపతిగా డైరెక్టర్ జనరల్
కాని ప్రిన్సిపాల్ ఆక్కౌంటెంట్ జనరల్ కాని వ్యవహరిస్తారు. సుమారు
60000 మంది సిబ్బంది కల ఈ
కార్యాలయాలలో గ్రూప్-ఏ కు చెందిన ఇండియన్ ఆడిట్-అక్కౌంట్స్ సర్వీసెస్
అధికారులు సుమారు 500 మంది వుంటారు.
ఈ శాఖల వార్షిక బడ్జెట్ సుమారు రు. 850 కోట్లవరకుంటుంది. చట్టసభలకు
కాని, కార్య నిర్వాహక వ్యవస్థకు కాని చెందక పోయినా రాజ్యాంగం
ద్వారా నియమించబడిన వ్యక్తి అయి వుంటారు కాగ్. భారత రాష్ట్రపతి కాగ్ ని నియమిస్తారు ఆ పదవిలో. మూడింట రెండు వంతుల మంది పార్లమెంట్ సభ్యులు
ఓటింగ్ ద్వారా మాత్రమే కాగ్ ను ఆ పదవి నుంచి వైదొలగించ వీలవుతుంది. కాగ్ పాలనాధికారాలను ఆయన సలహా సూచనలతో మాత్రమే రాష్ట్రపతి నిర్ణయిస్తారు.
ప్రస్తుత కంప్ట్రోలర్-ఆడిటర్ జనరల్‌గా వినోద్
రాయ్ వ్యవహరిస్తున్నారు. 11 వ కాగ్‍గా ఆయన నియామకం 7, జనవరి 2008 న
జరిగింది. టు-జి స్పెక్ట్రం, బొగ్గు గనుల స్కాం లాంటి పలు కీలకమైన అవినీతి ఆరోపణల వ్యవహారంలో వినోద్
రాయ్ వార్తల్లోకి ఎక్కారు చాలా సార్లు.
కాగ్ బాధ్యతలు అపారమైనవనవచ్చు. కేంద్ర, రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సంచిత నిధినుంచి వ్యయం చేసిన ప్రతి పైసా అది
ఉద్దేశించబడిన దాని కొరకే ఖర్చు చేయబడిందా? లేదా? అని నిర్ధారించే బాధ్యత కాగ్‍కు వుంది. ఆ మాటకొస్తే ఫలానా దాని కొరకు
వ్యయం చేయదల్చుకున్న నిధులు చట్ట రీత్యా ప్రభుత్వానికి అందుబాటులో వుందీ-లేంది
కూడా కాగ్ నిర్ధారిస్తుంది. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర,
కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల అత్యవసర నిధులనుంచి, ప్రభుత్వ పద్దుల నుంచి జరిగే అన్ని రకాల లావాదేవీల వ్యవహారంలో కూడా
చట్టబద్ధత నిర్ధారించేది కాగే. ఆయా ప్రభుత్వ శాఖల ఆర్థిక లావాదేవీలను, రాబడులను, వ్యయాన్ని, నిధుల
వినియోగాన్ని, దుర్వినియోగాన్ని విశ్లేషించేది కూడా కాగ్
మాత్రమే. కేవలం ప్రభుత్వ శాఖల ఆదాయ వ్యయాలు మాత్రమే కాకుండా, ప్రభుత్వం నుంచి గణనీయమైన మోతాదులో నిధులను పొందిన ప్రభుత్వేతర సంస్థల
ద్రవ్య లావాదేవీలను కూడా పరిశీలించే హక్కు కాగ్ కు వుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి
రాష్ట్రాలకు విడుదలయ్యే నిధుల సక్రమ వ్యయం జరిగిందా? లేదా?
అని చూసేది కూడా కంప్ట్రోలర్-ఆడిటర్ జనరలే. కంపెనీ చట్టం కింద
నెలకొల్పబడిన ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయ గణన కూడా కాగ్ పరిధిలోకే వస్తుంది.
రాజ్యాంగంలోని 151 వ
ప్రకరణకు అనుగుణంగా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన
రకరకాల ఆడిట్ నివేదికలను కాగ్ రూపొందించి, ఆ నివేదికలను
పార్లమెంటుకు, సంబంధిత రాష్ట్రాల శాసనసభలకు పరిశీలనకు సమర్పిస్తుంది.
అదే విధంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్య
వినియోగ పద్దులను, ఆర్థిక పద్దులను ధృవీకరించి ఆ పత్రాన్ని
చట్టసభల ముందుంచడానికి రాష్ట్రపతికి, గవర్నర్లకు పంపుతుంది
కాగ్. ఈ అధికారాలన్నీ రాజ్యాంగపరంగా కాగ్‍కు సంక్రమించినవే.
ఇంత చరిత్ర వున్న కాగ్‍ను బైబిలా, ఖురానా, భగవద్గీతా
అని హేళన చేసినట్లు మాట్లాడడం ముఖ్యమంత్రికి తగదు. శివుడాజ్ఞ లేనిది చీమైనా
కదలదన్నట్లు, కంప్ట్రోలర్-ఆడిట్ జనరల్ చేయి బడకుండా కేంద్ర
రాష్ట్రాల ఆదాయ వ్యయాల లెక్కలు ఒక కొలిక్కి రానేరావు. బడ్జెట్‌లో అనేక రకమైన
అంచనాలుంటాయి. పద్దులుంటాయి. వాటన్నిటినీ ఖర్చు చేసే విధానం కూడా తెలియచేయడం
జరుగుతుంది. మరి నిజంగా వీటన్నింటికీ చట్టబద్ధత వుందా? లేదా?
అని చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీదో ఒకరి మీద వుండాలి కదా! ఆ పనే
రాజ్యాంగం కంప్ట్రోలర్-ఆడిటర్ జనరల్‌కు అప్ప చెప్పింది. కాగ్ అటు పార్లమెంటుకు
కాని, ఇటు రాష్ట్రాల శాసనసభలకు కానీ సమర్పించే నివేదికలు అనేక
రకాల వడపోతలకు గురైన తరువాతే బయటకొస్తాయి. అవేవో ఆషామాషీగా తయారయ్యే లెక్కలు కావు.
ఆ నివేదికలు కేంద్ర, రాష్ట్ర, కేంద్ర
పాలిత ప్రాంతాల ప్రభుత్వ శాఖలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు,
ప్రభుత్వేతర సంస్థలకు
సంబంధించిన ఆదాయ-వ్యయాలకు అసలు సిసలైన కొలబద్దలే! బైబిల్, ఖురాన్,
భగవద్గీతలతో సమానమే!
Subscribe to:
Posts (Atom)