Friday, April 12, 2013

ప్రధానిగా 'నాయకుడు': వనం జ్వాలా నరసింహారావు


ప్రధానిగా 'నాయకుడు'
వనం జ్వాలా నరసింహారావు

రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని ఎవరన్న చర్చ రాజకీయాలలో ఆసక్తి వున్న ప్రతి ఇద్దరి మధ్య నడుస్తోంది. ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రాహుల్ గాంధీ చురుకైన పాత్ర వహించిన నాటినుంచి, ఆ మాటకొస్తే అంతకంటే ముందునుంచే, ఆయనను కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా తెరమీదకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన చింతన్ బైటక్ దరిమిలా ఆయనకు పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో ఆయన జపం మరింత వేగం పుంజుకుంది. అదే విధంగా గుజరాత్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అఖండ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టినప్పటినుంచి నరేంద్ర మోడీ పేరును బీజేపీ తన పార్టీ అభ్యర్థిగా తెర పైకి తెచ్చింది. తనకు ప్రధాన మంత్రి కావాలని లేదంటున్నప్పటికీ, రాహుల్ జపం మాత్రం పార్టీ కార్యకర్తలు మానలేదు. ఇక మోడీ విషయానికొస్తే ఆయనను బీజేపీ పార్లమెంటరీ పార్టీ సభ్యుడిగా నియమించి ఆ పార్టీ కూడా ఆయనను ప్రధానమంత్రిని చేసే విషయంలో మరో అడుగు ముందుకు వేసింది. వారిద్దరికీ తోడు నితీష్ కుమార్, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్, మాయావతి.....ఇలా మరి కొన్ని పేర్లు ప్రధాని పదవికి పోటీలో వినపడుతున్నాయి. పనిలో పనిగా తానూ రేసులో వున్నానని సంకేతాలిస్తున్నారు ప్రధాని మన్మోహన్ సింగ్. వీరిలో ఎవరు నాయకుడెవరనేది తేల్చేది మొదట ఓటర్లయితే, ఆ తరువాత వారెన్నుకున్న కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలు.

          కొంతకాలం క్రితం, కాంగ్రెస్ అధినేత్రి-యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధి అనారోగ్యానికి గురై, అమెరికాలో చికిత్స పొందడానికి వెళ్లినప్పుడు, ఇక్కడ పార్టీ బాధ్యతలను ఆమె అప్పగించిన నలుగురిలో ఆమె తనయుడు రాహుల్ గాంధి ఒకరు. వెంటనే, సోనియా-రాహుల్ గాంధీల భజన బృందం, భావి భారత ప్రధాని "రాహులే" అంటూ "బృంద గానం" ఆలాపించడం మొదలెట్టింది ఆనాటినుంచి. సోనియా కోలుకోవడానికి మరి కొన్ని రోజుల వ్యవధి వుండడంతో-ఆమె ఆరోగ్యం కుదుట పడుతుండడంతో, అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో అన్నా హజారే-ఆయన బృందం ఆరంభించిన నిరాహార దీక్ష దరిమిలా తలెత్తిన సమస్యాత్మక పరిణామాలను పరిష్కరించడానికి తన వంతు "నాయకత్వ" పాత్ర పోషించేందుకు, రాహుల్ గాంధీ దేశానికి తిరిగొచ్చారని భావించారు పలువురు అప్పట్లో. ఇక ఆయన భజన బృందం ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. కాకపోతే, ఢిల్లీ వచ్చిన నాటినుంచి, హజారే దీక్షకు స్పందనగా, పార్లమెంటులో "సెన్స్ ఆఫ్ ద హౌజ్" తీర్మానం ఆమోదించేంతవరకూ, ఏ స్థాయిలోను, రాహుల్ నాయకత్వ లక్షణాల ప్రదర్శన కించిత్తు కూడా జరగకపోవడం విచారకరం. హజారే సృష్టించిన సమస్యల విషయంలో కనీసం కొంత అవగాహనైనా ఆయనకు కలిగుంటే సంతోషించాలి. వాస్తవానికి, అదీ జరగలేదనడానికి నిదర్శనమే, ఆయన సాంప్రదాయాలకు విరుద్ధంగా, లోక్ సభలో లోక్ పాల్ బిల్ల్లును ఉద్దేశించుతూ చేసిన (చదివిన) ప్రసంగం. ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, రాహుల్ చేసిన ప్రసంగాన్ని పరోక్షంగా ప్రస్తావించి, ఘాటుగా విమర్శించారు కూడా.

మరో వైపున, ప్రతిపక్ష ఎన్డీయే భాగస్వామ్య పక్షంలోని బిజెపి లోక్ సభ సభ్యుడు, సంజయ్ గాంధి కుమారుడు, వరుణ్ గాంధి, ఆశువుగా చేసిన హిందీ ప్రసంగం, జూనియర్లతో సహా సీనియర్ పార్లమెంటేరియన్ల ప్రశంసలనందుకుంది. ఆయన హావ భావాలు, సందర్భోచితంగా చేసిన వ్యాఖ్యలు, అధికార పక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలకిచ్చిన జవాబులు, నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న అసలుసిసలైన కార్య నిర్వహణ అధికారిని గుర్తుకు తెచ్చాయి. అంత మాత్రాన ఆయన ప్రధాని కాకపోవచ్చు. కానివ్వక పోవచ్చు. ఒక వేళ అయ్యే అవకాశాలొచ్చినా అదృష్టం వరించక పోవచ్చు. కాని, అవేవీ వరుణ్ గాంధీని నాయకుడు కాకుండా చేయలేవు. ఆయనే కనుక, నెహ్రూ-గాంధీ వారసత్వ పరంపరలో రాజకీయాలలో వున్నట్టయితే, ఇదే రాహుల్ భజన బృందం, "దేశ్ కీ నేతా వరుణ్ గాంధీ" అంటూ నినాదాలిచ్చే వారు. విధి బలీయమంటే ఇదేనేమో!

          ఈ నేపధ్యంలో, భావి భారత ప్రధాని కావడానికి గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడీకి అన్ని అర్హతలున్నాయని, ఆయనే భారతీయ జనతా పార్టీ పక్షాన రాబోయే ఎన్నికలలో ప్రధాని కాబోయే అభ్యర్థిగా ప్రచారం లోకి దిగుతామన్న భావన కలిగే రీతిలో ఎల్. కె. అద్వానీ మాట్లాడారు ఆ మధ్యన. అదే సమయంలో యాధృఛ్చికంగానో-లేక సాధారణంగానో, అమెరికా చట్ట సభకు అనుబంధంగా పనిచేస్తున్న "కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీసెస్" అనే సంస్థ, మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ ఒక సర్వే నివేదికలోని అంశాలను బహిర్గతం చేసింది. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో, బిజెపి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి మోడీ గట్టి పోటీ ఇస్తారని కూడా ఆ సంస్థ పేర్కొన్నది. ఇంకేముంది కలకలం బయలుదేరింది. ఇప్పటికిప్పుడు రాహుల్ ను ప్రధానిగా చూడాలని ఆశిస్తున్న కొందరు కాంగ్రెస్ నాయకులు, అప్పుడే నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిగా ఊహించుకుంటున్న భారతీయ జనతా పార్టీలోని ఆయన అభిమానులు, వాద-ప్రతివాదనలకు దిగారు. రాహులే గొప్ప నాయకుడని కాంగ్రెస్ వారు, మోడీని మించిన నాయకుడే లేరని బిజెపి వారు, సాక్ష్యాధారాలతో సహా చర్చలకు నడుం బిగించారు. వారిద్దరిలో ఎవరు ప్రధాని అవుతారు, ఎవరు కారో, అసలు ఇద్దరిలోనూ ఒకరన్నా అవుతారో, ఎవరూ కారో చెప్పే ముందర వీరిరువిరిలో ఎక్కువ నాయకత్వ లక్షణాలెవరికి వున్నాయో బేరీజు వేయడం అవసరం. నాయకుడు ఐనంత మాత్రాన ప్రధాని కావాలని లేదు కాని, ప్రధాన మంత్రి స్థాయి వారికి నాయకత్వ లక్షణాలు తప్పనిసరిగా వుండి తీరాలి. లేక పోవడం వల్ల ఎలా వుందో కొంతలో కొంత అనుభవంలో చూస్తూనే వున్నాం కదా!

          జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం ఆయన వారసులెవరన్న మీమాంస వచ్చినప్పుడు, తన తర్వాత ప్రధాని కావాల్సింది కూతురు ఇందిర కాదని, లాల్ బహదూర్ ఆ పదవికి తగిన వాడని, స్వయంగా నెహ్రూ అన్నాడంటారు. వాస్తవానికి, తండ్రి చాటున వుంటూనే ఇందిరా గాంధీ, తప్పో-ఒప్పో, అప్పటికే ఒక నాయకురాలిగా (తిరుగులేని) నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలి హోదాలో, కేరళలో ఎన్నికైన ప్రప్రధమ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని రద్దు చేయించి, రాష్ట్రపతి పాలన విధించాలన్న నిర్ణయాన్ని తీసుకుని నాటి గవర్నర్తో అమలు చేయించగలిగింది! ఆమె తీసుకున్న ఆ చారిత్రాత్మక (అప్రజాస్వామిక) నిర్ణయం నెహ్రూ చని పోవడానికి పదేళ్ల క్రితం నాటిది. ఐనా, ఆమెకు ప్రధానిగా నాయకత్వ బాధ్యతలను తన తదనంతరం వెంటనే అప్పగించడానికి నెహ్రూ సుముఖంగా లేరంటే, ఆమెలో ఏదో కొంత నాయకత్వ లోటు అప్పటికింకా వుందనుకోవాలి. ఆ తర్వాత జరిగింది చరిత్రే కదా! ఆమె తన రెండు విడతల ప్రధాన మంత్రిత్వంలో తిరుగులేని నాయకురాలిగా దేశ-విదేశాలలో గుర్తింపు తెచ్చుకుంది. గెలిచింది-ఓడింది-ఓడి గెలిచింది. తనకు తానే ప్రత్యర్థులను సృష్టించుకుంది. ఆ ప్రత్యర్థులను మట్టి కరిపించింది. అదీ నాయకత్వ లక్షణాలంటే!

          తన తదనంతరం ఎవరనేది, ఇందిర మనసులో నిర్ధారించుకుని, మొదలు సంజయ్ గాంధీని, ఆయన దుర్మరణం తర్వాత రాజీవ్ గాంధీని నాయకత్వానికి సిద్ధం చేయసాగింది. ఆమె హత్యానంతరం, అప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చురుగ్గా పనిచేస్తూ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటున్న రాజీవ్ గాంధీ, ఇందిర వారసుడుగా ఏకైక అభ్యర్థిగా మిగిలిపోయాడు. అంత మాత్రాన ఆయన నాయకత్వం ప్రజలంగీకరించినట్లు భావించలేం. కాని, ఆయనకా లక్షణాలున్నాయని, ఇందిర హత్యానంతరం 1984 లో జరిగిన ఎన్నికలలో నిరూపించబడింది. కేవలం ఎన్నికలలో విజయమే కాకుండా, ఇతర విధాలుగా కూడా, నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు రాజీవ్ గాంధీ. 1989 ఎన్నికలలో ఓడినా, పార్టీ నాయకుడుగా రాజీవ్ ను ఆయన హత్యకు గురయ్యేంత వరకు, శ్రేణులు అంగీకరించడమే నాయకత్వ లక్షణం. రాజీవ్ తర్వాత, తానింకా నాయకురాలి స్థాయికి ఎదగలేదనే భావనతో సోనియా పార్టీ పగ్గాలను ఆరేడు సంవత్సరాల వరకు చేపట్టలేదు. అలా గుర్తించడం కూడా నాయకత్వ లక్షణాలే! పదిహేనేళ్ల క్రితం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సోనియా, ఒక విధంగా చెప్పుకోవాలంటే, రాజీవ్ తల్లి-తాతల కంటే కూడా, వంశపారంపర్యంగా ఆ కుటుంబ సభ్యురాలు కాకపోయినా, నెహ్రూ-గాంధీ కుటుంబ వారసురాలిగా అపారమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు-ఇంకా ప్రదర్శించుతూనే వున్నారనాలి. తాను కాదల్చుకుంటే ప్రధాని కాగలిగినా, తన నాయకత్వం మీదున్న అపార నమ్మకంతో, మరొకరిని ప్రధానిని చేసి, తానే నాయకురాలిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కు సారధి-నాయకులు ఎవరు అంటే, సోనియా అంటారు కాని మన్మోహన్ అనరు. ప్రధాని కానంత మాత్రాన నాయకులు కాకుండా పోరు. ప్రధాని కాగలిగినా నాయకత్వం కలిగుండాలని లేనే లేదు.

          ఇన్ని తెలిసిన సోనియా రాహుల్ గాంధీని పార్టీ స్థాయిలోనే ఇప్పటికీ శిక్షణ ఇస్తున్నదంటే, ఆమె దృష్టిలో రాహుల్ ఇంకా నాయకుడుగా ఎదగలేదన్నా అనుకోవాలి, ఆయనకా లక్షణాలింకా అబ్బలేదన్నా అనుకోవాలి, అవకాశమిచ్చినా నాయకత్వ పటిమను నిరూపించుకోవడంలో రాహుల్ విఫలమయ్యాడన్నా అనుకోవాలి. ఇందులో ఏవన్నా వుండి వుంటే, ఏ క్షణంలోనైనా రాహుల్ ను ప్రధానిగా చూడవచ్చు. ఆయన ఆ తర్వాత సఫలమో-విఫలమో ప్రజలే నిర్ణయిస్తారు. ఇక మోడీ విషయానికొస్తే, ఆయన పార్టీ అగ్ర నాయకుడే, ఆయనను నాయకుడంటుంటే, కాదనేదెవరు? కాకపోతే, ప్రధానిగా నాయకుడు కావాలంటే 2014 వరకు ఆగాల్సిందే!

          సోనియా మనసులో, రాహుల్ కు మారుగా ప్రియాంకా గాంధీని నాయకురాలిని చేయాలని మనసులో వుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగొచ్చు!

3 comments:

  1. అవునవును.
    ప్రజాస్వామ్యంలో యేదైనా జరగ వచ్చును.
    అలా ప్రజాస్వామ్యం పేరుతో మనదేశంలో జరిగే వాటికి ప్రజలకు ప్రేక్షకపాత్ర తప్ప మరే‌ పాత్రా లేక పోవచ్చును కూడా!

    ReplyDelete
  2. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రధాని అయితేనే ప్రజలకి న్యాయం జరుగుతుంది.
    నాయకులు ఎన్నుకున్న నాయకుడు ప్రధాని అయితే నాయకులకే న్యాయం జరుగుతుంది.

    ReplyDelete
  3. "...దేశ్ కీ నేతా వరుణ్ గాంధీ" అంటూ నినాదాలిచ్చే వారు. విధి బలీయమంటే ఇదేనేమో!..."

    Well said just taking it out of the Chamchas' mindset.

    "తానే ప్రత్యర్థులను సృష్టించుకుంది. ఆ ప్రత్యర్థులను మట్టి కరిపించింది. అదీ నాయకత్వ లక్షణాలంటే!"

    If that is acclaimed as leadership quality, there is no wonder or conspiracy that we are getting the kind of leaders we are getting now. Surely we are just getting Leaders we squarely deserve.

    "కాని, ఆయనకా లక్షణాలున్నాయని, ఇందిర హత్యానంతరం 1984 లో జరిగిన ఎన్నికలలో నిరూపించబడింది."

    Great analysis. If that is so why he could not win elections afterwards! He won riding on the sympathy wave of his Mother's assassination and not surely of any so called leadership qualities he is alleged to be possessing.

    "..ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగొచ్చు!..."

    Yes true, may be Varun Gandhi may be invited to join Congress party and he may do so also. Then what would be the scenario!?!?!?!?



    ReplyDelete