Wednesday, April 3, 2013

కాగ్ నివేదిక పరమార్థం: వనం జ్వాలా నరసింహారావు


కాగ్ నివేదిక పరమార్థమే!
వనం జ్వాలా నరసింహారావు

నమస్తే తెలంగాణ దినపత్రిక (08-04-2013)

శాసనసభలో ప్రవేశపెట్టిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో, 2006-2011 మధ్య ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జరిపిన భూముల కేటాయింపులలో రు.50 కోట్ల పైగా విలువ గల భూమి అక్రమ పద్ధతుల్లో అన్యాక్రాంతం జరిగిందని తేలింది. కాగ్ ఆడిట్ జరిపిన ఐదు సంవత్సరాల మధ్య కాలంలో తొలుత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించగా, ఆ తరువాత 15 నెలల పాటు రోశయ్య ముఖ్య మంత్రిగా పాలించాడు. అప్పట్నుంచీ  ప్రస్తుత ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాం కొనసాగుతూ వచ్చింది. ఈ ముగ్గురి పాలనలోనూ భూ కేటాయింపులలో అవినీతి జరిగిందని కాగ్ నివేదిక ద్వారా తెలుస్తోంది. భూముల కేటాయింపులు ప్రధానంగా రాజశేఖర రెడ్డి హయాంలోనే జరిగినప్పటికీ అప్పటి నిర్ణయాలను తదుపరి ముఖ్యమంత్రులు కొనసాగించారు. రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అక్రమ కేటాయింపులను రద్దు చేయడానికి గానీ, సరి చేయడానికి గానీ వారు పూనుకోలేదు. కాగ్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఆర్ధిక పరమైన ఆస్తులకు సంబంధించిన చట్టాలను, నిర్దేశిత విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అనేక కేసుల్లో పూర్తిగా విస్మరించిందని చెప్పింది. తీవ్రస్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని తేల్చింది. తాత్కాలిక ప్రాతిపదికన, యధేఛ్చగా, విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు, అత్యంత తక్కువ ధరలకు భూములు పందేరం పెట్టారని వెల్లడించింది.  భూముల పందేరంలో రాష్ట్ర ప్రజల ఆర్ధిక భవితవ్యాన్నీ, సామాజికార్ధిక ప్రయోజనాలను పరి రక్షించడంలో విఫలం అయ్యారని పేర్కొన్నది. అదే విధంగా విద్యుత్ వ్యవహారంలో కూడా కాగ్ అక్షింతలు వేసింది. కాకపోతే, కాగ్ నివేదిక బైబిల్, భగవద్గీత, ఖురాన్ కాదని సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. కాగ్ నివేదికలో పలు అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉంటున్నాయన్నారు. కాగ్ చెప్పినవన్నీ నిజాలు కావని, మళ్లీ, కాగ్ నివేదికపై పీఏసీ పరిశీలన చేసి నివేదిక ఇస్తుందన్నారు. కాగ్ విషయంలో ముఖ్యమంత్రి ఇంత తేలికగా ఎలా మాట్లాడగలిగారనేది అంతుపట్టని విషయం. ఈ నేపధ్యంలో కాగ్ కు సంబంధించిన పూర్వాపరాలను గురించి తెలుసుకోవడం అవసరం.



పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, కార్యనిర్వాహక వ్యవస్థపై చట్టసభలకు ఆధిపత్యం వుందని-వుండాలని తెలియచేస్తూ, తద్వారా ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ఆచరణలోకి తేవడానికి ఉపయోగపడే అసలు-సిసలైన ఆయుధం, ప్రభుత్వపరమైన ఆదాయ-వ్యయ లెక్కల తనిఖీ అనే ప్రక్రియ మాత్రమే. ద్రవ్య వినియోగ విషయంలో చట్టసభలదే తుది తీర్పు, అత్యున్నత అధికారం అనే విషయాన్ని కూడా స్పష్ట పరిచేందుకు, ఆదాయ-వ్యయ లెక్కల తనిఖీ వ్యవస్థలు నెలకొల్ప బడి వేళ్లూనుకోసాగాయి. ఇవి అనాదిగా అమల్లో వున్న వ్యవస్థలు. చట్టసభలకు సంక్రమించిన ఈ అధికారానికి రెండు మౌలికాంశాలు ప్రధానంగా తోడయ్యాయి. ఒకటి ప్రభుత్వం తన మనుగడ సాగించడానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడం కాగా, రెండోది ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని పర్యవేక్షించే అధికారం. ఏనాడో 1866 లోనే, "ఎక్స్ చెక్కర్ అండ్ ఆడిట్ శాఖ" ను రాజ్యాంగపరంగా ఒక చట్టంగా ఏర్పాటు చేయడం ద్వారా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటీష్ ప్రభుత్వం ఈ నాడు అమల్లో వున్న ప్రభుత్వ ఆడిట్ విధానానికి శ్రీకారం చుట్టిందనాలి. ఎక్స్ చెక్కర్ అండ్ ఆడిట్ శాఖ చట్టం కింద, ప్రతి ప్రభుత్వ శాఖ విధిగా ఏటేటా, తన శాఖకు చెందిన ద్రవ్య వినియోగ పద్దులను-ఆదాయ గణనలను పార్లమెంటు ముందుంచి తీరాలి. అదే చట్టం కింద మొట్టమొదటి సారిగా, "కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్" (కాగ్) అనే వ్యవస్థను ఏర్పాటుచేయడం జరిగింది. అలా కాగ్ కు నాంది-ప్రస్తావన జరిగిందనాలి. ప్రభుత్వ ఆదాయ-వ్యయాలపై కాగ్ నిర్వహించే దర్యాప్తు ఫలితాలను స్వతంత్ర ప్రతిపత్తిగల బాధ్యతాయుతమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనే పార్లమెంటరీ కమిటీ పరిశీలించి, తద్వారా, ద్రవ్య వినియోగంపై పార్లమెంటరీ ఆధిపత్యాన్ని నెలకొల్పడం జరుగుతుంది.

                ప్రభుత్వ పరమైన ఆదాయ-వ్యయ సంబంధిత లెక్కలు చూడడం, తనిఖీ చేయడం కొరకు ఉద్దేశించిన ఈనాటి ఇండియన్ ఆడిట్-అక్కౌంట్స్ శాఖ వ్యవస్థాగత ఏర్పాటు బ్రిటీష్ ప్రభుత్వ నమూనాలో, బ్రిటీష్ వారసత్వంగా మనకు సంక్రమించిందే. ఎప్పుడో-ఏనాడో 1858 లోనే, ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను హస్తగతం చేసుకున్న నాటి బ్రిటీష్ ప్రభుత్వం, ప్రభుత్వ ఆదాయ-వ్యయ వ్యవహారాలు చూసేందుకు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాను నియమించింది. 1919 లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలు, ఆడిటర్ జనరల్ పదవికి చట్టబద్ధత కలిగించడానికి దోహదపడ్డాయి. 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం, ఆడిటర్ జనరల్ పదవికి మరింత ప్రాముఖ్యత కలిగించింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత, "కాగ్" కు 148 నుంచి 152 ప్రకరణల ద్వారా ప్రత్యేక హోదాను కలిగించడంతో పాటు, రాజ్యాంగపరమైన భద్రత కలిగించడం జరిగింది. 1971 కాగ్ చట్టం ద్వారా, ఆ వ్యవస్థకు వుండాల్సిన బాధ్యతలు, అధికారాలు, హక్కులు స్పష్టంగా క్రమబద్ధీకరించడం జరిగింది. రాజ్యాంగం 151 వ ప్రకరణలో చెప్పినట్లు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంతవరకు కాగ్ నివేదికలన్నీ భారత రాష్ట్రపతికి అందచేయాలి. ఆయన ఆదేశాల మేరకు ఆ నివేదికలను భారత పార్లమెంటు ఉభయ సభల ముందుంచాలి. రాష్ట్రాలకు సంబంధించినంతవరకు ఆయా రాష్ట్రాల గవర్నర్లకు వారి ద్వారా శాసనసభలకు సమర్పించడం జరుగుతుంది. కాగ్ పదవికి సర్వసాధారణంగా ఇండియన్ ఆడిట్ అక్కౌంట్స్ సర్వీసెస్ కు చెందిన సీనియర్ అధికారులనే నియమించే సంప్రదాయం చాలాకాలం వుండేది. 1978 తరువాత ఐఏఎస్ కు చెందిన అధికారులను ఆ పదవిలో నియమించే ఆనవాయితి మొదలైంది. ఇది తరచూ విమర్శలకు దారితీసింది కూడా. విమర్శించిన వారిలో పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ అధ్యక్షుడు, మీడియా, సామాజిక కార్యకర్తలు ఇతరులు పలువురు వున్నారు. కాకపోతే, భారత రాజ్యాంగంలో కాగ్ పదవికి ఫలానా పూర్వ ఉద్యోగార్హతలుండాలని ఎక్కడా చెప్పడం జరగలేదు. ఐతే, రాజ్యాంగ సభలో దీనిపై చర్చలు జరిగాయి. ఆర్థిక, ఆదాయ-వ్యయ వ్యవహారాలలో అనుభవం గడించినవారిని మాత్రమే ఆ పదవిలోకి తేవాలని సూత్రప్రాయంగా అంగీకరించారప్పట్లో.

ఇండియన్ ఆడిట్-అక్కౌంట్స్ శాఖాధిపతినే కంప్ట్రోలర్-ఆడిటర్ జనరల్ (కాగ్) అని పిలుస్తారు. ఈ శాఖ కార్యాలయాలు దేశవ్యాప్తంగా వున్నాయి. సంఖ్యాపరంగా చూస్తే, 34 కేంద్ర ప్రభుత్వ ఆడిట్ కార్యాలయాలు, 60 రాష్ట్ర స్థాయి కార్యాలయాలున్నాయి. ఆయా కార్యాలయ అధిపతిగా డైరెక్టర్ జనరల్ కాని ప్రిన్సిపాల్ ఆక్కౌంటెంట్ జనరల్ కాని వ్యవహరిస్తారు. సుమారు 60000 మంది సిబ్బంది కల ఈ కార్యాలయాలలో గ్రూప్-ఏ కు చెందిన ఇండియన్ ఆడిట్-అక్కౌంట్స్ సర్వీసెస్ అధికారులు సుమారు 500 మంది వుంటారు. ఈ శాఖల వార్షిక బడ్జెట్ సుమారు రు. 850 కోట్లవరకుంటుంది. చట్టసభలకు కాని, కార్య నిర్వాహక వ్యవస్థకు కాని చెందక పోయినా రాజ్యాంగం ద్వారా నియమించబడిన వ్యక్తి అయి వుంటారు కాగ్. భారత రాష్ట్రపతి కాగ్ ని నియమిస్తారు ఆ పదవిలో. మూడింట రెండు వంతుల మంది పార్లమెంట్ సభ్యులు ఓటింగ్ ద్వారా మాత్రమే కాగ్ ను ఆ పదవి నుంచి వైదొలగించ వీలవుతుంది. కాగ్ పాలనాధికారాలను ఆయన సలహా సూచనలతో మాత్రమే రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ప్రస్తుత కంప్ట్రోలర్-ఆడిటర్ జనరల్‌గా వినోద్ రాయ్ వ్యవహరిస్తున్నారు. 11 వ కాగ్‍గా ఆయన నియామకం 7, జనవరి 2008 న జరిగింది. టు-జి స్పెక్ట్రం, బొగ్గు గనుల స్కాం లాంటి పలు కీలకమైన అవినీతి ఆరోపణల వ్యవహారంలో వినోద్ రాయ్ వార్తల్లోకి ఎక్కారు చాలా సార్లు.

కాగ్ బాధ్యతలు అపారమైనవనవచ్చు. కేంద్ర, రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సంచిత నిధినుంచి వ్యయం చేసిన ప్రతి పైసా అది ఉద్దేశించబడిన దాని కొరకే ఖర్చు చేయబడిందా? లేదా? అని నిర్ధారించే బాధ్యత కాగ్‍కు వుంది. ఆ మాటకొస్తే ఫలానా దాని కొరకు వ్యయం చేయదల్చుకున్న నిధులు చట్ట రీత్యా ప్రభుత్వానికి అందుబాటులో వుందీ-లేంది కూడా కాగ్ నిర్ధారిస్తుంది. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల అత్యవసర నిధులనుంచి, ప్రభుత్వ పద్దుల నుంచి జరిగే అన్ని రకాల లావాదేవీల వ్యవహారంలో కూడా చట్టబద్ధత నిర్ధారించేది కాగే. ఆయా ప్రభుత్వ శాఖల ఆర్థిక లావాదేవీలను, రాబడులను, వ్యయాన్ని, నిధుల వినియోగాన్ని, దుర్వినియోగాన్ని విశ్లేషించేది కూడా కాగ్ మాత్రమే. కేవలం ప్రభుత్వ శాఖల ఆదాయ వ్యయాలు మాత్రమే కాకుండా, ప్రభుత్వం నుంచి గణనీయమైన మోతాదులో నిధులను పొందిన ప్రభుత్వేతర సంస్థల ద్రవ్య లావాదేవీలను కూడా పరిశీలించే హక్కు కాగ్ కు వుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు విడుదలయ్యే నిధుల సక్రమ వ్యయం జరిగిందా? లేదా? అని చూసేది కూడా కంప్ట్రోలర్-ఆడిటర్ జనరలే. కంపెనీ చట్టం కింద నెలకొల్పబడిన ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయ గణన కూడా కాగ్ పరిధిలోకే వస్తుంది. రాజ్యాంగంలోని 151 వ ప్రకరణకు అనుగుణంగా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రకరకాల ఆడిట్ నివేదికలను కాగ్ రూపొందించి, ఆ నివేదికలను పార్లమెంటుకు, సంబంధిత రాష్ట్రాల శాసనసభలకు పరిశీలనకు సమర్పిస్తుంది. అదే విధంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్య వినియోగ పద్దులను, ఆర్థిక పద్దులను ధృవీకరించి ఆ పత్రాన్ని చట్టసభల ముందుంచడానికి రాష్ట్రపతికి, గవర్నర్లకు పంపుతుంది కాగ్. ఈ అధికారాలన్నీ రాజ్యాంగపరంగా కాగ్‍కు సంక్రమించినవే.

ఇంత చరిత్ర వున్న కాగ్‍ను బైబిలా, ఖురానా, భగవద్గీతా అని హేళన చేసినట్లు మాట్లాడడం ముఖ్యమంత్రికి తగదు. శివుడాజ్ఞ లేనిది చీమైనా కదలదన్నట్లు, కంప్ట్రోలర్-ఆడిట్ జనరల్ చేయి బడకుండా కేంద్ర రాష్ట్రాల ఆదాయ వ్యయాల లెక్కలు ఒక కొలిక్కి రానేరావు. బడ్జెట్‌లో అనేక రకమైన అంచనాలుంటాయి. పద్దులుంటాయి. వాటన్నిటినీ ఖర్చు చేసే విధానం కూడా తెలియచేయడం జరుగుతుంది. మరి నిజంగా వీటన్నింటికీ చట్టబద్ధత వుందా? లేదా? అని చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీదో ఒకరి మీద వుండాలి కదా! ఆ పనే రాజ్యాంగం కంప్ట్రోలర్-ఆడిటర్ జనరల్‌కు అప్ప చెప్పింది. కాగ్ అటు పార్లమెంటుకు కాని, ఇటు రాష్ట్రాల శాసనసభలకు కానీ సమర్పించే నివేదికలు అనేక రకాల వడపోతలకు గురైన తరువాతే బయటకొస్తాయి. అవేవో ఆషామాషీగా తయారయ్యే లెక్కలు కావు. ఆ నివేదికలు కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ శాఖలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రభుత్వేతర  సంస్థలకు సంబంధించిన ఆదాయ-వ్యయాలకు అసలు సిసలైన కొలబద్దలే! బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో సమానమే!


1 comment:

  1. As prime minister said,politically they are taking so many decisions for the betterment of country and at the same time may do some wrong and they need not want any suggestions from CBI(coal scam).keeping in view our CM also denying CAG.No ethics to so called politicians.if i am wrong please for give me sir...

    ReplyDelete