మొక్కులు
ప్రభుత్వ పక్షానే....తప్పేంటీ?
వనం జ్వాలానరసింహారావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక (28-02-2017)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ
సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని బంగారు ఆభరణాలు సమర్పించిన
సమయంలో స్వామివారిని సమీపం నుండి తనివితీరా దర్శనం చేసుకున్న వారిలో నేను కూడా
వుండడం అరుదైన, అపురూపమైన అనుభవం. సీఎం సతీ సమేతంగా
దేవాలయానికి చేరుకోవడానికి అర గంట ముందరే ఆయనతో దర్శనం చేసుకోవడానికి తెలంగాణ
నుంచి వెళ్ళిన బృందంలోని వారందరినీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి లోనికి
తీసుకెళ్లారు దేవాలయాధికారులు. తొలుత రంగనాయక మండపంలో వుంచిన ఆభరణాలను
కళ్లకద్దుకోవడం, ఆ తరువాత ముఖ్యమంత్రి వెంట దర్శనం
చేసుకోవడం జరిగింది. పేరుపేరునా తన వెంట వచ్చిన ప్రతివారినీ తన సమీపంలోకి పిలుస్తూ, అందరికీ తనివితీరా దర్శనం చేయించారు
సీఎం. హారతీ, తీర్థం అందరికీ లభించింది.
సరిగ్గా
26 సంవత్సరాల క్రితం ఇదే ఫిబ్రవరి నెలలో, దాదాపు
ఇవే రోజుల్లో, అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ మర్రి
చెన్నారెడ్డి దగ్గర పీఆర్వోగా పనిచేస్తున్నప్పుడు కూడా నాకిలాంటి దర్శనమే
లభించింది. అప్పట్లో అమల్లో వున్న నిబంధనల ప్రకారం, సీఎం
వెంట వున్న వారందరినీ ముఖద్వారం నుంచే లోనికి అనుమతించినట్లు జ్ఞాపకం. కాకపోతే
అప్పుడు సీఎం తిరుమలకు వచ్చిన సందర్భం వేరు. కృష్ణా జలాల పంపకం విషయంలో నాటి
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్ పవార్, నాటి
కర్నాటక ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్ తో త్రైపాక్షిక చర్చలకు తిరుపతి వేదికైంది. ఆ
సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. నాకింకా ఆ సమావేశానికి సంబంధించిన ఒక అంశం
ఇప్పటికీ గుర్తుంది. వాస్తవానికి ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసిన ఉద్దేశం కేవలం
జలాల పంపిణీ విషయమే. రాజకీయాలు వారిమధ్య రాలేదు. నదీ జలాల సంబంధిత సమావేశం తరువాత, వాళ్లు, మళ్లీ తిరుపతిలో ఎక్కడా ప్రత్యేకంగా
కలవలేదు కూడా. అయినప్పటికీ,
ఒక ప్రముఖ పాత్రికేయుడు, అప్పట్లో జాతీయ స్థాయిలో బాగా పేరున్న
"బ్లిట్జ్" ఆంగ్ల వార పత్రికలో రాస్తూ...ఈ ముగ్గురూ కలిసి రాజీవ్
గాంధీకి వ్యతిరేకంగా ఒక కూటమిని తయారు చేస్తున్నారని పేర్కొన్నాడు. ఆ పత్రికలో
వచ్చిన అంశాన్ని నేను సీఎం చెన్నారెడ్డికి చూపించి, జరగని
విషయం రాశారని అంటే...."ఆ మాత్రం భయం రాజీవ్ గాంధీకి వుంటే తప్పేం లేదు"
అని ఆయన వ్యాఖ్యానించారు! ఎందుకో ఈ విషయం ఇప్పుడు మళ్లీ గుర్తుకొచ్చింది.
ఇవన్నీ
ఒక ఎత్తైతే...తిరుమల స్వామి దర్శనం మాటకొస్తే "దర్శనం స్వామి ఇస్తేనే దొరికేది"...అంతే కాని ఎవరూ ఇచ్చేది కాదు. అదో
నమ్మకం. సీఎం కేసీఆర్ ఆభరణాలు స్వామివారికి
సమర్పించిన తరువాత ఎస్వీబీసీ ఛానల్ తో మాట్లాడుతూ తన స్వానుభవం ఒకటి వివరించారు.
కొన్నేళ్ల క్రితం తిరుమలకు వచ్చి కూడా, దర్శనం
చేసుకోకుండా తిరిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, స్వామి
అనుజ్ఞ లేనిదే దర్శనం జరగదని,
అందుకే ఆభరణాలు ఇవ్వడానికి
ఇంత కాలం పట్టిందనీ,
అన్నారు. ఇది నూటికి నూరు
పాళ్లు వాస్తవం.
"వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే
నాస్తి కించన, వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి"… ఆ కలియుగ ప్రత్యక్ష దైవ దర్శనం ఒక్క
క్షణ కాలంపాటు కలిగినా చాలని,
వందల-వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి, లక్షలాది మంది భక్తులు, పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమల
కొండకు నిత్యం వెళుతుంటారు.
అలా తన భక్తులను తన వద్దకు
రప్పించుకుంటాడా కలియుగ దైవం!
ఇదిలా
వుంటే...ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వ పరంగా చెల్లించిన
మొక్కులపై అనవసర రాద్ధాంతం పూర్తిగా అసమంజసం. వీరి విమర్శలు మెజారిటీ తెలంగాణ
ప్రజల మనోభావాలను దెబ్బతీసే విగా,
వాళ్ల నమ్మకాలకు వ్యతిరేకంగా
వున్నాయి. ప్రజలచే ప్రజాస్వామ్య బద్ధంగా
ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి,
అందునా రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజల బాగోగుల కోసం, రాష్ట్రం బాగుకోసం, ప్రజల పక్షాన, ప్రభుత్వ పక్షాన మొక్కులు
చెల్లించుకోవడంలో తప్పేంటో అర్థం కావడం లేదు.
సీఎం
చేసిన ఆయుత చండీ యాగం మీద కూడా కొందరు ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తున్నారు. యాగాలు-యజ్ఞాలు చేయడం కొందరికి అదో నమ్మకం. వాటివల్ల లోక శాంతి, ప్రజా ప్రయోజనం వుంటుందని భావించడం
కూడా ఒక నమ్మకమే. భారతదేశంలోను, అనేక ప్రపంచ దేశాలలోను, అనేక మతాలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు ఆచరణలో వున్నాయి. చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశాలలో కూడా ఇప్పటికీ మావో కు ఎంత
ప్రాధాన్యం ఇస్తున్నారో అంతే ప్రాధాన్యం బుద్ధుడికీ ఇస్తున్నారు. కంబోడియాలో ప్రపంచంలో కెల్లా
అతిపెద్దదైన అంగ్కార్ వాట్ దేవాలయం వుంది. యజ్ఞయాగాదులనేవి
ఈ నాటివి కావు. మన భారతీయ సంస్కృతీ-సంప్రదాయాలతో పెనవేసుకునిపోయాయవి. మానవాళిని అహర్నిశలూ రక్షించేవి కూడా
యజ్ఞ ఫలాలే. మానవ జాతి జీవన విధానం ఆరంభానికి
కారణం కూడా యజ్ఞ యాగాలే.
మానవ జాతి సృష్టే యజ్ఞ
సహితంగా జరిగిందంటారు.
యజ్ఞం సాక్షాత్తు భగవత్
స్వరూపమే. మానవ జీవితాన్ని ఫలవంతం చేసుకునేందుకు, తనను తాను సంస్కరించుకుని, ఆత్మోన్నతిని పొంది విశ్వ శ్రేయస్సుకు
పాటుపడేందుకు యజ్ఞయాగాదులు చేయాలని పూర్వకాలం నాటి మహాఋషులు చెప్పారు. పూర్వకాలంలో మాదిరిగానే ఈ నాటికీ సాధన, సంపద, నిబద్ధత, సంస్కారం, పూర్వ జన్మ పుణ్యం, నలుగురికి మేలు చేయాలన్న ఆలోచన కలవారు, యజ్ఞ యాగాలు చేస్తూనే వున్నారు.
మొక్కుల
విషయానికొస్తే....తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఫలానా...ఫలానా...దేవుళ్లకు , ఫలానా...ఫలానా ఆభరణాలు మొక్కుగా చెల్లిస్తానని
సీఎం కాకముందు కేసీఆర్ మొక్కున్నారు. మొక్కుకున్నది రాష్ట్రం ఏర్పాటు
కోసం...రాష్ట్ర ప్రజల భవిత కోసం. ఆయన మొక్కుకు అనుగుణంగానే రాష్ట్రం సిద్ధించింది.
రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో,
సంపదతో జీవిస్తున్నారు. మరి, అలాంటప్పుడు, ఆ రాష్ట్ర ప్రజల కోసం, వారి పక్షాన, ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ శాఖ నిధులతో, ఆభరణాలు కొని మొక్కులు తీరుస్తే
తప్పేంటి? ఉదాహరణకు, ఏదైనా ఒక రాష్ట్రంలో విపత్తు లేదా
ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే,
పక్క రాష్ట్రం సహాయం చేయడం
సాధారణ విషయం. అలా చేసే సహాయం ప్రభుత్వ పరంగానే వుంటుంది కాని, రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత నిధులతో
చేయరు. సీఎం ఎప్పుడూ తన సొంత డబ్బుతో మొక్కులు చెల్లిస్తానని అనలేదే? అలాంటప్పుడు ఎందుకీ విమర్శలు?
ఇవేవీ ఆంధ్ర
ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాని, ఆ రాష్ట్ర ప్రజలు కాని, ప్రజా ప్రతినిధులు కాని పట్టించుకోలేదు. టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీ పార్టీలకు చెందిన నాయకులు సీఎం
పర్యటనలో పూర్తిగా పాల్గొన్నారు. తిరుమల తిరుపతి పర్యటన కోసం సతీ సమేతంగా, కుటంబ సభ్యులతో విమానాశ్రయం చేరుకున్న సీఎంకు ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల
గోపాల కృష్ణారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా మాజీ చైర్మన్ శంకర్ రెడ్డి
తదితరులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం
ఎదుట బ్రాహ్మణులు వేదమంత్రోచ్ఛారణలతో స్వాగతించారు. కేసిఆర్ అభిమానుల
పేరిట వందల్-వేల సంఖ్యలో విమానాశ్రాయానికి చేరుకుని స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులు, అధికారులు, ప్రముఖులు కూడా కేసిఆర్ ను కలిశారు. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం శ్రీవారికి ఆభరణాలు
సమర్పించలేదని, స్వతంత్ర భారత చరిత్రలో కేసిఆర్ కొత్త
సాంప్రదాయానికి నాంది పలికారని టీటీడీ కార్యనిర్వహణ అధికారి స్వయంగా అన్నారు. ప్రభుత్వ పరంగా, శ్రీకృష్ణ దేవరాయలు, మైసూర్ మహారాజు
లాంటి వారు మాత్రమే గతంలో శ్రీవారికి ఆభరణాలు సమర్పించారని చెప్పారు. ప్రభుత్వం తరఫున ఆభరణాలు సమర్పించడం కొత్తేమీ కాదనే కదా అర్థం?
ఈ నేపధ్యంలో, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆభరణాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సరిగ్గా గంటపాటు ఆలయంలో గడిపిన ముఖ్యమంత్రి ఆలయ సాంప్రదాయాల ప్రకారం
పూజలు నిర్వహించారు. ముందుగా, సీఎం కేసీఆర్
దంపతులు ప్రధాన ధ్వారం ద్వారా ఆలయ ప్రవేశం చేశారు. ఆ
తరువాత....రంగనాయక స్వామి మంటపంలో ప్రవేశించిన కేసీఆర్ స్వామికి సాంప్రదాయ బద్ధంగా ఆభరణాలు సమర్పించారు. బంగారు వాకిలి నుండి
ప్రధాన ఆలయం లోకి ప్రవేశించి, స్వామి వారి దర్శనం చేసుకుని, ప్రధాన అర్చకుడు ఎ.ఎస్.నర్సింహ దీక్షితులు
ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత, వకుళా మాత దర్శనం, పూజలు, విమాన
వెంకటేశ్వరస్వామి దర్శనం, సబేరా మందిరంలో స్వామి వారి వస్త్రాలను
కళ్లకద్దుకోవడం, హుండీలో కానుకలు వేయడం, భాష్య కార్ల సన్నిధిలో పూజలు, నర్సింహస్వామికి
పూజలు, మూల స్తంభానికి నమస్కారం, రంగనాయక స్వామి మంటపంలో వేద పండితుల ఆధ్వర్యంలో ఆశీర్వచనం స్వీకరించడం
చేశారు. ముఖ్యమంత్రి దంపతులకు, మంత్రులకు, కుటుంబ సభ్యులకు
ఆలయ ప్రసాదాలు అందించారు అధికారులు.
"తెలంగాణ వస్తే శ్రీ వెంకటేశ్వరస్వామికి, పద్మావతి అమ్మవార్లకు బంగారు ఆభరణాలు సమర్పిస్తానని ఉద్యమ సమయంలో
మొక్కుకున్నాను. స్వామి వారి దయవల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ ఆభరణాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి అనేక సార్లు ఇక్కడికి వద్దామని
అనుకున్నా కుదరలేదు. స్వామి వారు పిలిపించుకుంటే తప్ప ఇక్కడకు రావడం
సాధ్యం కాదు. గతంలో నేనొకసారి మా చిన్నాన్నతో కలిసి తిరుపతి దాక
వచ్చినా ఓ అశుభవార్త తెలియడంతో స్వామి వారిని దర్శించుకోకుండానే తిరిగి
వెల్లిపోయాను. స్వామి వారి అనుగ్రహం ఉంటే తప్ప ఇక్కడకు రావడం, దర్శనం కలగడం జరగదు. ఇవాళ దేవుడే నన్ను పిలిపించుకున్నాడు. ఇవాళ మనస్ఫూర్తిగా పూజలు చేశాను. తెలంగాణ రాష్ట్రం
బాగుండాలని దీవించమని ప్రార్ధించాను. రెండు రాష్ట్రాల ప్రజలు
బాగుండాలని, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని నిండు మనసుతో
కోరుకున్నా. రెండు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశం
భాగుండాలని కోరుకున్నా. సహకరించిన అందరికీ కృతజ్ఙతలు." అని రంగనాయక స్వామి మంటపంలో భక్తులను ఉద్దేశించి
ఇచ్చిన సందేశంలో ముఖ్యమంత్రి చెప్పారు. మరి ఎందుకీ అర్థం
లేని విమర్శలు?