Sunday, February 12, 2017

శ్రీ సీతారామాంజనేయులకు మంగళం ....ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 31వ భాగం : వనం జ్వాలా నరసింహా రావు

శ్రీ సీతారామాంజనేయులకు మంగళం
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
31 భాగం
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (13-02-2017)

సీతాదేవి అగ్నిప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్న తరువాత, శివుడు-ఇతర దేవతలు సీతారామ లక్ష్మణులను ఆశీర్వదిస్తూ, అయోధ్యకు వెళ్లి ధర్మ సంస్థాపన చేయాలని అంటారు. మరణించిన దశరథుడు ఆకాశంలో వున్నాడని, ఆయన ఆశీర్వాదం కూడా తీసుకొమ్మని సూచించాడు శివుడు. ఆ సందర్బంలో దశరథుడు సీతాదేవిని ఓదార్చుతూ, ఆమె పాతివ్రత్యంలో ప్రసిద్ధికెక్కిన దానిగా పొగడుతూ, ఆమె భర్తపై కోపగించుకోవద్దని చెప్పిన మాటలను "మత్తకోకిలము" వృత్తంలో రాశారు కవి.

మత్తకోకిలము:        
కోపగింపకు మమ్మ నీ పతిఁ గోడలా! యిటు సేఁ తకున్
                నీ పతివ్రతమున్ జగంబుల నిత్యమై వెలుఁ గొందెడిన్
                బాపదూర వటంచుఁ దెల్పఁ గ బాల్పడెన్ హితకామియై
                సాపరాధుఁ డు గాఁ డు కూరిమి సైపవమ్మ సతీమణీ! -136

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ", , , , , " గణాలు. పదకొండవ స్థానంలో యతి.
కాండ చివరలో, "ఫలశ్రుతి" లో రాసిన పద్యాలలో ఒకటి "మానిని" వృత్తంలో వుంది. శుభకరమైన రామాయణ కావ్యాన్ని చదివినా, విన్నా పరమార్థమైన మోక్షం లభిస్తుందని అంటూ రాశారా పద్యాన్ని.

మానిని:
          ఈరహి మించుమహత్త్వముఁ గల్గిన యిట్టిపురాతన వృత్తమణిన్
        మీరు పఠింపుఁ డు సంశయ మూనక నిండుమనంబున నమ్మి జనుల్
        దూరములై చను దోషములన్నియు దోరపుభద్రము మీకు నగున్
        వారక విష్ణుమహామహిమోన్నతి వర్ధిలుతం గడువర్ధిలుతన్-137

తాత్పర్యం:     ఇందులో రామాయణము పురావృత్తమని చెప్పడం జరిగింది. పురావృత్తాలెన్నో వున్నా, అవి రామాయణానికి సరైనవి కావు అనే అర్థం స్ఫురిస్తుందిందులో.

ఛందస్సు:      మానినికి ఏడూ "" గణాలు, ఒక గురువు. పదమూడో ఇంట యతి.
యుద్ధకాండాంత పద్యాలలో ఒక దాన్ని "మంగళ మహా శ్రీ వృత్తము" లో రాస్తూ, ఆ కాండలో మొత్తం 3006 పద్యాలున్నాయని అర్థమొచ్చె రీతిలో పద్య పదాలను కూరుస్తారు. ఆ పద్యం ఇలా సాగుతుంది.

మంగళమహా శ్రీవృత్తము:
ధీర! రసఖాభ్ర శుచి దృష్టిగతపద్యనుత దేవహిత ఘోరరణవృత్తా!
సూరకుల! దాశరథి సూరిహితతా శరధి శూర! వరధీ! విరథి! వైదే
హీరమణ! హీరమణి హేమరమణీయ వర హీరశయనా! వనధివాసా!
భూరమణవర్య! గుణ పూత శుభచర్య! నత భూమిరథ మంగళమహాశ్రీ!-138

తాత్పర్యం:    
"రస" అంటే షడ్రసాలనీ, దానర్థం ఆరు (6) సంఖ్య అనీ; "ఖ" అంటే ఆకాశం అనీ, దానర్థం శూన్యమనీ (0); "అభ్ర" అన్నా ఆకాశమే అనీ, అంటే శూన్యమే (0) అనీ; "శుచి దృష్టి" అంటే శివుడి మూడు కళ్ళు అనీ, అంటే మూడు (3) సంఖ్య అనీ విడమరుస్తారు కవి. ఇన్ని పద్యాలతో స్తోత్రం చేయబడినవాడా అని అర్థం. 6003 ను 3006 గా తిరగ చదివితే యుద్ధకాండలో అన్ని పద్యాలున్నాయన్న అర్థం స్ఫురిస్తుంది.
ఛందస్సు: మంగళమహా శ్రీ వృత్తానికి "భ, , , , , , , , , " గణాలు.
తొమ్మిదింట యతి.

రావణ వధానంతరం మునులు శ్రీరాముడిని ప్రశంసలతో, ఇంద్రజిత్తు మరణ వార్త వినగానే వారెలా సంతోషంలో-ఆనందాల్లో-ఆశ్చర్యంలో మునిగిపోయారో ఆయనతో తెలియచెప్పిన విషయాన్ని "మత్తకోకిలము" వృత్తంలో రాశారు కవి.
మత్తకోకిలము:        
ఎన్ని మాయలయందొ ప్రోడయు నెట్టివారి కజయ్యుఁ డున్
        గన్నుదోయికిఁ గానరాఁ డని గర్కశుండు సురేంద్రజి
        త్తన్ని శాచరుఁ డాజిఁ గూలుట యాలకించినయంత య
        న్నన్న! మమ్ముఁ బ్రమోదమున్ బర మాద్భుతంబును ద్రెక్కొనెన్-139

తాత్పర్యం:      ఎన్ని మాయలలోనో సమర్ధుడు, ఎటువంటి వారికైనా జయింప సాధ్యపడనివాడు, యుద్ధంలో కళ్లకు కనపడనివాడు, క్రూరుడు ఇంద్రజిత్తు. అలాంటివాడు యుద్ధంలో మరణించాడన్న వార్త వినగానే, ఆహా హా! ఏమి చెప్పాలి? మేమందరం సంతోషంలో, ఆశ్చర్యంలో మునిగిపోయాం.

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ", , , , , " గణాలు. పదకొండవ స్థానంలో యతి.
అగస్త్యుడు శ్రీరాముడికి రావణ జన్మాది వృత్తాంతం తెలియచేస్తూ, ఎన్నో విషయాలను చెప్పాడు. అందులో భాగంగా, ఒకానొక సందర్భంలో, దేవతలు శివుడి శరణు జొచ్చి, రాక్షసులు పెట్టే బాధలు సహించలేక, తమను రక్షించమని కోరే సందర్భంలో "కవిరాజవిరాజితము", "అంబురహము" వృత్తాలలో రెండు పద్యాలను రాశారు కవి.

కవిరాజవిరాజితము:
          సుతశతకంబునుగూడి నిశాచర శూరులు మువ్వురు గర్వితులై
        హితముఁ దలంపక బ్రహ్మవరంబున నెల్లజగంబుల రేఁ గి సదా
        గతిగతిఁ ద్రిమ్మరుచున్ ఋషిపన్నగ కాందములన్ సహశక్రమరు
        త్తతులను యక్షుల నేచిఁ రి వేఁ చిరి తాఁ చిరిపూఁ చి దురాసదులై-140

తాత్పర్యం:     ఆ ముగ్గురు రాక్షస శూరులు అనేకమంది కొడుకులతో కలిసి, గర్వంతో, మంచిచెడులాలోచింపక, బ్రహ్మ వరం వుందని విజృంభించి, గాలిలాగా అడ్డం లేకుండా, తిరుగుతూ ఋషులను, పన్నగులను, ఇంద్రాది దేవతలను భాదిస్తున్నారు.

ఛందస్సు:      కవిరాజవిరాజితమునకు ఒక్క "గణం, ఆరు "" గణాలు, ఒక్క "" గణం వుంటాయి. పద్నాలుగవ ఇంట యతి.

అంబురహము:
          వారలు పెట్టెడి బాధల నెల్ల సు పర్వకోటులు మౌనులున్
        సైరణ సేయఁ గ జాలక యెల్లరు సాధ్వసార్తులు నొక్కటై
        మారునివైరిఁ బురారిఁ ద్రినేత్రు ను మాధవున్ హరునిన్ జగ
        త్కారణు మారణు లోకనమస్కృతు దైవతాధిపు శంకరున్-141

తాత్పర్యం:     దేవతలు, మునులు వారు (రాక్షసులు) పెట్టే బాధలు సహించలేక, భయంతో అందరు కలిసి, మన్మధుడిని జయించిన-పురాలు దహించిన-మూడు కళ్ళు కల వాడిని, ప్రజాపతులలో చేరినవాడిని, జగత్తుకు కారణమైన వాడిని, కాలాగ్ని రుద్రుడై సంహారం చేయువాడిని, లోకాలలో పూజించబడేవాడిని, దేవతలకు అధిపతిని శివుడిని ప్రార్థించారు.

ఛందస్సు:      అంబురుహ వృత్తానికి నాలుగు "భ" గణాలు, ", , లగములు", పదమూడో ఇంట యతి స్థానం వుంటాయి.
నారదుడు రావణాసురుడికి మనుష్య వధ మానమని బోధించుతాడు. దానికి బదులు అందరినీ చంపే యముడిపై యుద్ధానికి పోయి అతడిని జయించితే అందరినీ జయించినట్లే అవుతుందంటాడు. నారదుడికి, రావణుడికి జరిగిన సంభాషణను "మానిని", "తరలము" వృత్తాలలో రాశారు కవి.


మానిని:
          కావున మోహనిరాకృతులం గడు కాఱియలం బడు మానవులన్
        నీవు జయించినవాఁ డవె చాల్, యము నిం గన నేగుదు రెల్లజనుల్
        నావచనంబున దండధరుం గద నంబున గెల్వు మవశ్యము నీ
        వా విభు గెల్చిన నందఱ గెల్చిన యట్ల యగుంజుమి నిక్కముగన్-142

తాత్పర్యం:      కావున, అజ్ఞానంతో, స్వరూపం పోయి, బాగా బాధలు పడుతున్న మనుష్యులను నీవు జయించినట్లే. రావణుడు మనుష్యులను జయించలేడని ఎవరూ అనరు. కావున నీ ప్రయత్నం మాను. ఎలాంటి వారైనా యముడిని చూడడానికి పోతారు. అందరినీ యముడు చంపుతాడు. కాబట్టి నువ్వు యముడిని యుద్ధంలో జయిస్తే అందరినీ జయించినట్లే.

ఛందస్సు:      మానినికి ఏడూ "" గణాలు, ఒక గురువు. పదమూడో ఇంట యతి.
తరలము:
          అనిన నవ్వుచు మ్రొక్కి పల్కె మ హాత్మ! గీతకళాప్రియా!
        ఘనవిదారణలాలసా! జయ కాంక్ష నేను రసాతలం
        బునకు నీ వచియించినట్టుల పోయి గెల్చి జగత్త్రయం
        బును సురాహుల నాదునానతి మోపఁ జేసి బలోద్ధతిన్-143

తాత్పర్యం:     అని (నారదుడు) చెప్పగా నవ్వుతూ, ఆయనకు మ్రొక్కి ఇలా అంటాడు (రావణుడు). మహాత్మా! సంగీత విద్యలో ప్రేమగలవాడా!  యుద్ధాలు చూడడంలో కోరికగలవాడా! నువ్వు చెప్పినట్లే జయంకొరకు పాతాళానికి పోయి మూడు లోకాలను, ఊర్థ్వ ములో దేవతలను, అధో లోకాలలో సర్పాలను గెల్చి, బల గర్వంతో, నా ఆజ్ఞకు లోబడి వుండేట్లు చేస్తాను.

ఛందస్సు:     తరలముకు ", , , , గజం" లు గణాలు. పన్నెండో అక్షరం యతి. మత్తకోకిలము వృత్తానికి ", , , , , " గణాలు. పదకొండవ స్థానంలో యతి. తరలము లోని మొదటి రెండు లఘువులను గురువుగా మారుస్తే మత్తకోకిలము అవుతుంది. అలానే మత్తకోకిలము లోని గురువును లఘువులుగా మారుస్తే తరలము అవుతుంది.

అగస్త్యాది మునులు శ్రీరాముడి అనుజ్ఞ తీసుకునివెళ్లిపోతారు. శ్రీరామచంద్రమూర్తి కొలువు తీరినప్పుడు ఎలా ఠీవిగా వున్నాడో, వివరించేందుకు కవి ఎంచుకున్న వృత్తం "తరలము". ఆ పద్యం ఇలా సాగుతుంది.


తరలము:      నిగమవృద్ధులు సత్కులీనులు నీరజాక్షుని హస్తముల్
                మొగిచి మ్రొక్కి నిజోచితాసన ముల్ గ్రహించి భజింపఁ గన్
                జిగి దొలంకఁ గ మౌనివర్యులు నిర్జరుల్ గొలువన్ దివిన్
                నగవిరోధిని మించి ఠీవిఁ ద నర్చె రాముడు గొల్వులోన్-144

తాత్పర్యం:     పౌరులలో ముసలివారు, గొప్ప వంశములలో పుట్టినవారు, శ్రీరామచంద్రుడికి చేతులు మోడ్చి, మ్రొక్కి, తమకు తగిన ఆసనాలపై కూర్చొని సేవిస్తుండగా, మునివర్యులు, దేవతలు కొలువగా స్వర్గాన వున్నఇంద్రుడిని మించిన ఠీవితో, రామచంద్రమూర్తి తన కొలువులో వెలిగాడు.

తరలముకు ", , , , గజం" లు గణాలు. పన్నెండో అక్షరం యతి. మత్తకోకిలము వృత్తానికి ", , , , , " గణాలు. పదకొండవ స్థానంలో యతి.
ఉత్తర కాండ చివరలో రాసిన పద్యం "సుగంధి" వృత్తంలో వుంది. ఆ కాండ మొత్తం పద్యాలున్న అర్థాన్ని స్ఫురిస్తూ రాసిన పద్యం అది.
సుగంధి:        రామ చంద్ర గోత్ర చంద్ర రమ్యపద్య గేయమా
                నామలోత్తర ప్రచార యాదిదేవ శ్రీహరీ
                రామ యొంటిమిట్టధామ రాజకన్య కాలస
                ద్వామభాగ దివ్యభోగ వాసు దాససేవథీ – 145

ఛందస్సు:      సుగంధికి  ర-జ-ర-జ-ర  గణాలు 9 వ అక్షరం యతి.
తాత్పర్యం:     ఎవరిలో సర్వం నశించునో, ఎవరు అంతటా నివసించునో, అతడే వాసుదేవుడు. అట్టివానికి కవి దాసుడని అర్థం. "రామ" అంటే మూడు (1) అని, "చంద్ర" అంటే ఒకటి (1) అని, "గోత్ర" అంటే ఏడు (7) అని,  "చంద్ర" అంటే ఒకటి (1) అని అర్థం చెపుతూ, కాండలో మొత్తం 1713 పద్యాలున్నాయని రాశారు ఆ పద్యాన్ని. అన్ని పద్యాలతో కీర్తించబడిన నిర్మలమైన, శ్రేష్టమైన గుణం కలిగినవాడనడంలో ఉత్తరకాండ అర్థాన్ని కూడా పద్యం సూచిస్తోంది.


ఉత్తరకాండ-ఆంధ్ర వాల్మీకి రామాయణం చిట్ట చివర పద్యాన్ని "మంగళ మహాశ్రీ వృత్తము" లో శ్రీ సీతారామాంజనేయులకు మంగళం చెప్పడం జరిగింది.

మంగళ మహాశ్రీ వృత్తము:

మంగళము రామునకు మంజుగుణధామునకు మాన్యసురసోమునకు నెందున్
మంగళము సీత కస మాన పరిపూతకును మాత కఘధూతకు సతంబున్
మాంగళము భ్రాతృహిత మండలసమేతునకు మారుతిసమర్చితునకున్ స
న్మంగళము భక్తజన మానసనివాసునకు మా నగుత మంగళమహాశ్రీ-146

ఛందస్సు: మంగళమహా శ్రీ వృత్తానికి "భ, , , , , , , , , " గణాలు.
తొమ్మిదింట తొమ్మిదింట యతి.

శ్లో.                నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై,

                నమోస్తు వాతాత్మభువే వరాయ, నమోస్తు వల్మీకభవాయ తస్మై .
END

1 comment:

  1. అద్భుతం మీ ప్రయత్నం 🙏🙏🙏

    ReplyDelete