Tuesday, February 14, 2017

ప్రపంచ వ్యాప్త మహిళా సాధికారత....మహినేలిన మహిళలు : వనం జ్వాలా నరసింహారావు

ప్రపంచ వ్యాప్త మహిళా సాధికారత
నమస్తే తెలంగాణ దిన పత్రిక (14-02-2017)
మహినేలిన మహిళలు
మన తెలంగాణ దిన పత్రిక (14-02-2017)
వనం జ్వాలా నరసింహారావు

"మహిళా సాధికారత...మహిళలకు భరోసా....అధికారంలో భాగస్వామ్యమే లక్ష్యంగా" జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులతో మూడు రోజుల మహిళా సదస్సు అమరావతిలో జరిగింది. టిబెట్  బౌద్ధ మతగురువు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత దలైలామా సదస్సు ముఖ్య తిథిగా పాల్గొని స్ఫూర్తిదాయకమైన ప్రసంగం కూడా చేశారు. ఈ నేపధ్యంలో, ఒక్క సారి గతంలోకి తొంగి చూస్తే...సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ప్రపంచ వ్యాప్తంగా మహిళలు రాణించడం, చాలా రంగాల్లో పురుషులను అధిగమించడం గత శతాబ్దంలోను, ముఖ్యంగా ఈ శతాబ్దంలోను గమనించవచ్చు. ఇతర రంగాలకంటే కూడా, మహిళలు, రాజకీయంగా అంచలంచలుగా ఎదగడమే కాకుండా, అధికారంలోకి వచ్చిన పలు దేశాల్లో, అనేక సంస్కరణలకు శ్రీకారం కూడా చుట్టారు. మహిళలకు ఓటు హక్కు ఇవ్వండి అని పురుషులను ఒకానొక నాడు అడిగిన ఆ మహిళలే, అనేక హక్కులను తమకే కాకుండా, పురుషులకు కూడా వారే కలిగించే స్థాయికి ఎదిగారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం, సమానత్వం, దినదినాభివృద్ధి చెందుతున్నదనడానికి ఇంతకంటే నిదర్శనం మరోటి లేదు. ఈ నేపధ్యంలో, ప్రపంచ వ్యాప్తంగా, గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయ రంగంలో మహిళలు గణనీయంగా ఎదిగి, పలు దేశాలకు అధ్యక్షులుగానో, ప్రధాన మంత్రులుగానో కావడం, అలా అయిన వారిలో కొందరు ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందడం తెలిసిన విషయమే.

ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఒక మహిళ, 1960 లో, సిరిమావో బండార నాయకే, శ్రీలంక ప్రధాన మంత్రిగా, అధికారంలో రావడంతో అంతర్జాతీయంగా ఒక సంచలనం కలిగింది. ఎలా ఒక మహిళ ఆ ఉన్నత పదవిలోకి రాగలిగిందని, ఎలా పాలన చేయబోతున్నదని, ప్రపంచ వ్యాప్త చర్చ జరిగింది. ఆ తరువాత ఎందరో మహిళలు, సుమారు వంద మందికి పైగా, ప్రధానులుగానో, అధ్యక్షులుగానో, ఎన్నో దేశాల్లో అధికారం చేపట్టారు. ఇంకా అది కొనసాగుతూనే వుంది. మొన్న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలిచినట్లైతే, ఆ దేశ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలయ్యేది ఆమె. కారణాలేవైనా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ముందు వరుసలో వుండే అమెరికాలో ఇంతవరకు మహిళకు అధ్యక్ష పీఠం ఎక్కే అవకాశం రాలేదు. ఏదేమైనా...భవిష్యత్ లో పురుషాధిక్యత రాజకీయాలకు చాలా దేశాల్లో స్వస్తి చెప్పాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం, వర్తమాన ప్రపంచ దేశాల్లో సుమారు 20 మందికి పైగా దేశాధినేతలుగా వున్నారు. ఈ సంఖ్య పోను-పోను పెరుగుతుంది. ఇరవై-ఇరవై ఒకటో శతాబ్దాలలో గణనీయమైన సంఖ్యలో వివిధ దేశాల్లో ప్రధానులుగా, అధ్యక్షులుగా వున్న మహిళల్లో చాలా మంది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వారైనప్పటికీ, కొందరికి మాత్రమే తెలిసుండే వీలు కూడా వుంది. వారిలో కొందరు అతి తక్కువ కాలం అధికారంలో వుండగా, మరి కొందరు దీర్ఘకాలం పదవుల్లో వున్నారు. కొందరికి వారసత్వంగా లాభం చేకూరగా, మరికొందరు ఎన్నికల సమరంలో కొత్తగా దిగి గెలిచారు.


శ్రీలంక ప్రధాన మంత్రిగా సిరిమావో బండార నాయికే మూడు సార్లు ఆ పదవిలో వుంది. ఆ తరువాత ఆమె కూతురు చంద్రికా కుమార తుంగ కొంతకాలం అధ్యక్షురాలిగా, ప్రధానిగా వుంది. సెప్టెంబర్ 1959 లో భర్త హత్యానంతర పరిణామాలలో బండార నాయికే  రాజకీయాల్లోకి రావడం, తన భర్త అడుగుజాడల్లో ఆయన సామ్యవాద విధానాలనే కొనసాగిస్తానంటూ ఎన్నికల్లో ప్రచారం చేయడం, సానుభూతి కొరకు తరచూ కళ్ల నీళ్ల పర్యంతం కావడం, అప్పట్లో చర్చనీయాంశాలయ్యేవి. 1965 ఎన్నికల్లో ఓటమిపాలైన ఆమె, తిరిగి 1970 లో గెలిచి రెండోసారి ప్రధాని అయింది. శ్రీలంక అధ్యక్షురాలిగా 1994 లో ఎన్నికైన కూతురు చంద్రిక, సిరిమావోను మూడోసారి ప్రధానిని చేసింది.

ఒక తరం పైగా భారతదేశంలో నెహ్రూ కుటుంబీకులు, పాకిస్తాన్ లో భుట్టో కుటుంబీకులు, బంగ్లాదేశ్ లో ముజిబుర్ రెహ్మాన్ కుటుంబీకులు అధికారంలో వున్నారు. 20 వ శతాబ్దపు విశ్వవిఖ్యాత మహిళ ఇందిరా గాంధీ భారత ప్రధానిగా రెండు విడతలుగా బాధ్యతలు నిర్వహించింది. మొదట తండ్రి మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖల మంత్రిగా పదవిని చేపట్టిన ఇందిర, శాస్త్రి హఠాన్మరణం తరువాత ప్రధాని పదవి దక్కించుకుని, మొదటి విడతలో సుమారు 11 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసింది. ఎమర్జెన్సీ విధించి, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి 1977 ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఆమె ఓటమికి కారణమైన జనతా కూటమి రెండున్నర ఏళ్ల కన్నా ఎక్కువ అధికారంలో కొనసాగ లేకపోయింది. 1980 లో జరిగిన ఎన్నికల్లో గెలిచి మరో మారు ప్రధాని కాగలిగింది. 1984 లో దారుణ హత్యకు గురైంది. గొప్ప రాజనీతిజ్ఞురాలిగా ప్రపంచ వ్యాప్త మన్ననలను పొందింది. బంగ్లాదేశ్ విమోచన కారణ భూతురాలైంది. అపర దుర్గగా ప్రతిపక్షాల మెప్పును కూడా పొందింది. ఆమె కోడలు ప్రధాని కాలేకపోయినా అనధికారిక ప్రధానిగా పదేళ్లు యుపిఎ ఛైర్ పర్సన్ గా వుంది. అలానే ప్రతిభా పాటిల్ భారత రాష్ట్రపతిగా అరుదైన గౌరవం పొందారు. స్పీకర్ పదవిని అలంకరించిన మీరా కుమార్, సుమిత్రా మహాజన్ ప్రపంచంలోనే అలాంటి పదవులు పొందిన అతి కొద్దిమందిలో ఒకరు.

ఇజ్రాయిల్ దేశం వ్యవస్థాపకుల్లో ఒకరైన గోల్డా మీర్, మొదట్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ, భర్తతో పాటు ఉద్యమంలో పాల్గొనేది. రాజకీయాలలో కూడా చురుగ్గా వుండేది. 1948 లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రి అయింది. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత సోవియట్ యూనియన్ లో ఇజ్రాయిల్ రాయబారిగా గోల్డా మీర్ ను నియమించింది ప్రభుత్వం. దరిమిలా దేశానికి తిరిగొచ్చిన ఆమె లేబర్ పార్టీ జనరల్ సెక్రటరీ గా వుండగా, అప్పటి ప్రధాని హఠాన్మరణంతో, తన 70 వ ఏట, 1969 లో ఇజ్రాయిల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగింది. 1978 లో చనిపోయింది.


బ్రిటన్ మొట్టమొదటి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ రసాయన శాస్త్ర పరిశోధకురాలిగా, బారిస్టర్ గా పని చేసి, 1953 లో ఆ దేశ చట్ట సభ హౌజ్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికైంది. వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించింది. 1975 లో ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికైంది. 1979 లో ప్రధాని పదవి వరించిందామెను. పటిష్ఠ నాయకురాలిగా పేరు తెచ్చుకున్న థాచర్, అసంతృప్తిని అణచడంలో ఆరితేరిన మహిళగా ప్రసిద్ధికెక్కింది. 1990 లో ఆమె నాయకత్వాన్ని సవాలు చేసినప్పుడు, ప్రధానిగా రాజీనామా చేసి, హౌజ్ ఆఫ్ కామన్స్ నుంచి కూడా తప్పుకుంది. 1982 లో అర్జెంటినా నుంచి ఫాక్ లాండ్స్ ను వెనక్కు తీసుకోవడానికి ఆమె సైన్యాన్ని పంపింది. ఆమె ప్రవేశ పెట్టిన ప్రభుత్వ రంగ సంస్కరణలు నేటికీ పలు దేశాల్లో అమల్లో వున్నాయి. ఆమెను విమర్శించిన వారు సహితం వాటిని కొనసాగించారు. తనకు స్ఫూర్తి తన తండ్రి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుతో పాటు మార్గరెట్ థాచర్ అని నిజామాబాద్ లోక సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అమరావతిలో పేర్కొనడం గమనించాల్సిన విషయం.

సూంగ్ సోదరీమణులుగా ప్రసిద్ధికెక్కిన చైనా దేశానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లు, ఆ దేశంలోని అత్యంత శక్తిమంతులైన ముగ్గురు ప్రముఖులను వివాహం చేసుకున్నారు. వాళ్లు జీవించిన కాలంలో ఆ ముగ్గురూ ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కినవారే. అందరిలోకి పెద్దదైన సూంగ్ ఐ లింగ్, అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన చైనా దేశపు ఆర్థిక మంత్రి హెచెచ్ కంగ్ ను పెళ్లాడింది. ఆమె తరువాత రెండో సోదరి సూం చింగ్ లింగ్ చైనా జాతి పితగా పేరుగాంచిన, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మొదటి అధ్యక్షుడిగా పనిచేసిన సన్ యట్ సేన్ ను పెళ్లి చేసుకుంది. 1968 - 1972 మధ్య కాలంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సంయుక్త అధ్యక్షురాలిగా, 1981 లో గౌరవాధ్యక్షురాలిగా పనిచేసిందామె. చివరి సోదరి సూంగ్ మే లింగ్ కూడా ఒక ప్రముఖ రాజకీయ వేత్త. ఆమె ఒకప్పటి చైనా అధ్యక్షుడైన చియాంగ్ కై షేక్ ను పెళ్లి చేసుకుంది. నవ చైనా రాజకీయ, ఆర్థిక, వర్తమాన చరిత్రలో ఆ ముగ్గురు సోదరీమణులు ప్రముఖ పాత్ర వహించారు.

జుల్ఫికర్ అలీ భుట్టో కూతురు బేనజీర్ భుట్టో, తండ్రి వారసురాలిగా, 1988–90 , 1993–96 మధ్య కాలంలో రెండు పర్యాయాలు పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా పనిచేసింది. ప్రపంచంలోని ముస్లిం దేశాలలో ఆమె కంటే పూర్వం ఏ మహిళ కూడా ప్రధాని కాలేదు. బేనజీర్ కూ ఆ ఖ్యాతి దక్కింది. తండ్రిని ఉరితీసిన మూడేళ్లకు కేవలం 29 సంవత్సరాల వయసులోనే, తండ్రి స్థాపించిన రాజకీయ పార్టీ చైర్ పర్సన్ గా ఎన్నికై, దరిమిలా 1988 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలిపించి, ఆ దేశ ప్రధాని అయిందామె. 2008 ఎన్నికలకు రెండు వారాల ముందు, ఒక బాంబ్ పేలుడు సంఘటనలో మరణించింది బేనజీర్. 1991 - 1996,  2001 - 2006 మధ్య కాలంలో బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికైన బేగం ఖలీదా, బేనజీర్ తరువాత ఇస్లాం దేశాలలో  ఆ పదవిని చేపట్టిన రెండవ మహిళ. ఏడేళ్ల కింద అధికారంలోకి వచ్చి, ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా వున్న షేక్ హసీనా వాజేద్, ఆ దేశపు రెండవ మహిళా అధ్యక్షురాలు. బంగ బంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ పెద్ద కూతురామె. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో కొంతకాలం ఆమె ప్రతిపక్ష నాయకురాలిగా కూడా పనిచేసింది హసీనా.

న్యూజీలాండ్ 37 వ ప్రధానిగా 1999 లో పదవిలో కొచ్చిన హెలెన్ ఎలిజబెత్ క్లార్క్ వరుసగా మూడు సార్లు 2008 వరకు ఆ పదవిలో కొనసాగింది. ఎన్నికల్లో గెలిచిన తొలి మహిళా ప్రధాని హెలెన్. 2004 నుంచి 2010 వరకు మొజాంబిక్ అధ్యక్షురాలిగా వున్న లుఇసా డయాస్ డిఓగో ఆ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలు. జర్మనీ రాజకీయ నాయకురాలు ఎంజెలా డొరోథియా మెర్కెల్ 2005 నుంచి ఆ దేశ ఛాన్స్ లర్ గా వుంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తూర్పు జర్మనీ ప్రభుత్వంలో ఆమె అంతకు ముందు అధికార ప్రతినిధిగా కూడా పనిచేసింది. కమలా పర్సాద్ బిస్సెస్సార్ 2010 నుంచి 2015 వరకు ట్రినిడాడ్-టొబాగోల ఏడవ ప్రధానిగా వుంది. ఆమె ఆదేశపు మొదటి మహిళా ప్రధాని.... ఆ తరువాత ఆమె ప్రతిపక్ష నాయకురాలు. 2010 నుండి 2013 వరకు ఆస్ట్రేలియా 27 వ ప్రధానిగా వున్న జూలియా ఐలీన్ గిల్లార్డ్ మొదట్లో ఉప ప్రధానిగా కూడా పదవిలో వుంది.


ఇలా ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో వుండడం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్ లో మరి కొన్ని దేశాల అధ్యక్ష-ప్రధాన మంత్రులుగా మహిళలే ఎన్నిక కావాలని కోరుకుందాం. End

No comments:

Post a Comment