Friday, February 3, 2017

"అయ్యదేవర" చలవతో అద్భుత పదకోశం : వనం జ్వాలా నరసింహారావు

"అయ్యదేవర" చలవతో అద్భుత పదకోశం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (04-02-2017)

ఐదు దశాబ్దాల క్రితం, అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం- నాటి అసెంబ్లీ స్పీకర్ ఆయ్యదేవర కాళేశ్వరరావు ఆదేశాల మేరకు (1963 లో) ప్రచురించిన 820 పేజీల శాసన, న్యాయ, పరిపాలనా సంబందమైన (తెలుగులో) పారిభాషిక పదకోశం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. బహుశా అప్పటికీ, ఇప్పటికీ, తత్సంబంధమైన మొట్టమొదటి, చిట్ట చివరి పుస్తకం ఇదే కావచ్చునేమో! ఆ తరువాత తెలుగులో అలాంటి పుస్తకాలు ప్రభుత్వ పరంగా కాని, ప్రయివేట్ పరంగా కాని, ప్రచురించిన దాఖలాలు లేవు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం రాజకీయ శాస్త్రం విభాగంలో రిజిస్ట్రార్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఎనబై ఏళ్ల ఆచార్య మారంరాజు సత్యనారాయణరావుకు ఈ పుస్తకం కాపీ ఒకటి, హైదరాబాద్ ఆబిడ్స్ సెకండ్ హాండ్ బుక్ స్టాల్ లో దొరికింది ఓ మూడేళ్ల క్రితం. అప్పటినుంచి ఆయన దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి, ఎవరైనా పునర్ముద్రణ చేయిస్తారేమోనని చాలా మంది దగ్గర ప్రస్తావించినా ఫలితం లేకపోయింది. ఆయన దగ్గర ఆ పుస్తకాన్ని తెచ్చుకుని చూసి, కొంత చదివిన తరువాత పుస్తకానికి సంబంధించిన అంశాలను పదిమందితో పంచుకోవాలనిపించింది.

పుస్తక ప్రచురణ పూర్వ రంగంలో చాలా కృషి జరిగింది. శాసన, న్యాయ, పరిపాలనా సంబంధమైన పారిభాషిక పదాలకు తెలుగులో "సమానార్థకాలు" రూపొందించేందుకు తొలుత తెలుగు పారిభాషిక పదకోశ సంఘం ఏర్పాటైంది. మొదట, 24 మంది సభ్యులుగా, 6 మంది సహ సభ్యులుగా, ఈ సంఘాన్ని, శాసనసభ అధ్యక్షుడిగా వున్న స్వర్గీయ ఆయ్యదేవర కాళేశ్వరరావు అక్టోబర్ 30, 1957 న నియమించారు.  దానికి అధ్యక్షుడుగా శాసన సభ స్పీకర్ గా వున్న కాళేశ్వరరావు వ్యవహరించారు. సంఘానికి నిర్దేశించిన అంశాలలో ప్రధానమైంది శాసనసభ ఆధ్వర్యం కింద ప్రచురించేందుకు తెలుగులో పదకోశం తయారు చేయడమే కాగా, మరోటి సాధారణంగా సమావేశాలు హైదరాబాద్ లోనే జరగాలనేది. శాసనసభ కార్యదర్శిగా పనిచేస్తున్న జీవీ చౌదరిని సంఘానికి కార్యదర్శిగా నియమించారు.

సంఘంలో సభ్యులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, చాలామంది ప్రముఖులుండడం విశేషం. వారిలో....డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి (నాటి ఆర్థిక మంత్రే కాకుండా సాహిత్య అకాడమీ అధ్యక్షుడు కూడా), జెవి నరసింగరావు (మంత్రి), డి సంజీవయ్య (మంత్రి), ఎమ్మెల్యేలు పీవీ నరసింహారావు (తరువాతి కాలంలో ప్రధాన మంత్రి), రావి నారాయణరెడ్డి, సాహిత్య అకాడమీ కార్యదర్శి దేవులపల్లి రామానుజరావు, పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు, బోయి బీమన్న (అప్పట్లో ప్రభుత్వ అనువాదకుడు), డాక్టర్ గిడుగు సీతాపతి, మామిడిపూడి వెంకటరంగయ్య, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కాళోజీ నారాయణరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, ఖండవల్లి లక్ష్మీ రంజనం, మాడపాటి హనుమంతరావులు వున్నారు. ఒక ఏడాది తరువాత, నిర్దేశించిన కార్యక్రమం పురోగతిలో వుండగానే, పని మరింత వేగవంతంగా కొనసాగేందుకు, మొదట నియమించిన కమిటీని రద్దు చేసి 14 మంది సభ్యులుతో కొత్త సంఘాన్ని డిసెంబర్ 12, 1958 న ఏర్పాటు చేశారు సభాపతి కాళేశ్వరరావు. మొదటి కమిటీ సభ్యుల్లో కొందరు, కొత్తవారు కొందరు అందులో వున్నారు. భీమన్న, రావి, దేవులపల్లి, కాళోజీ, పీవీ లాంటి వారు ఈ కమిటీలోనూ కొనసాగారు. మొదట ఏర్పాటు చేసిన సంఘంలోని సభ్యుడు బెజవాడ గోపాలరెడ్డి రాజీనామా చేయడం వల్ల ఆయన స్థానంలో వేమరాజు భానుమూర్తిని నియమించారు స్పీకర్.

పుస్తకానికి తొలిపలుకు నాటి శాసనసభ కార్యదర్శి జీవీ చౌదరి రాయగా, తెలుగు పారిభాషిక పదకోశ సంఘం నివేదిక పేరుతో మలిపలుకు సభాపతి అయ్యదేవర రాశారు. ఆలోచన నుంచి కార్యాచరణవరకు, చివరకు పుస్తకంగా వెలువడేందుకు దోహదపడ్ద అనేక అంశాలను ఆయన అందులో ప్రస్తావించారు. "" నుంచి "జడ్" వరకున్న దాదాపు 26, 000 ఆంగ్ల పదాలకు హిందీ సమానార్థకాలతో పార్లమెంటరీ సంఘం పదకోశం తయారు చేసిందనీ, దీనిని లోక సభ సచివాలయం ప్రచురించిందనీ, ఆ ఆంగ్లపదాలే తెలుగులో ప్రచురించిన పదకోశానికి ప్రామాణికమని, ప్రాతిపదిక అనీ కాళేశ్వరరావు పేర్కొన్నారు.

మొదట ఏర్పాటు చేసిన సంఘం డిసెంబర్ 2, 1957 న పని ప్రారంభించి, మొత్తం 18 సమావేశాలు జరిపింది. కడపటి సమావేశం జులై 25, 1958 న జరిగింది. ఆంగ్ల పదాలతో సమగ్రమైన ఒక జాబితాను రూపొందించి, వాటికి సరైన తెలుగు పదాలను తయారు చేసేందుకు, సంఘం తన మొదటి సమావేశంలో ఆరుగురు సభ్యులుతో ఒక ఉపసంఘాన్ని నియమించింది. పద్మభూషణ మాడపాటి హనుమంతరావు అధ్యక్షుడుగా, భోయి భీమన్నసమావేశకర్తగా ఏర్పాటైన ఉపసంఘంలో హేమాహేమీలైన ఖండవల్లి లక్ష్మీరంజనం, దేవులపల్లి రామానుజరావు, కాళోజీ నారయాణరావు, పీవీ నరసింహారావు సభ్యులు. డిసెంబర్ 16, 1957 నుంచి డిసెంబర్ 28, 1957 వరకు ఉపసంఘం ఆరు సమావేశాలు జరిపి తెలుగు సమానార్థకాలతో వంద ఆంగ్ల పదాల పట్టికను రూపొందించింది. లోక్ సభ సచివాలయం ప్రచురించిన పదకోశంలోని కొన్ని పదాలకు కూడ ఈ ఉపసంఘం తెలుగు సమానార్థకాలను రూపొందించింది. జనవరి 4, 1958 న జరిగిన సమావేశంలో పదకోశాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అవలంభించవలసిన పద్ధతులను గురించి చర్చ జరిగిన అనంతరం, ఉపసంఘం రద్దు చేయడం జరిగింది. దాని స్థానంలో నాలుగు వేరే ఉపసంఘాలు ఏర్పాటయ్యాయి. వీటిలో రెండు హైదరాబాద్ లోను, మరో రెండు విజయవాడలోను ఏర్పాటయ్యాయి. అదనంగా కొద్ది రోజుల తరువాత ఒక సంపాదకీయ ఉపసంఘం కూడా ఏర్పాటైంది. ఒక ఉపసంఘానికి విశ్వనాథ సత్యనారాయణ, రెండో దానికి జీవీ సీతాపతి, మూడో దానికి-సంపాదకీయ ఉపసంఘానికి మాడపాటి హనుమంతరావు, నాలుగో దానికి ఖండవల్లి లక్ష్మీ రంజనం అధ్యక్షులుగా నియామకం జరిగింది.

విజయవాడ ఉపసంఘాలు రెండు కలిసి 60 సమావేశాలు, హైదరాబాద్ ఉపసంఘాలు 62 సమావేశాలు నిర్వహించింది. ఆంగ్ల వర్ణమాల లోని "ఏ" కింద వున్న అన్ని పదాలకు, "సీ" కింద వున్న 603 పదాలకు హైదరాబాద్ ఒకటవ ఉపసంఘం తెలుగు సమానార్థకాలను రూపొందించగా, రెండవ ఉపసంఘం "బీ", "డీ" ల కింద గల పదాలన్నింటికీ సమానార్థకాలను రూపొందించింది. ఇక విజయవాడ మొదటి ఉపసంఘం "సీ" కింద గల చాలా పదాలకు, రెండవ ఉపసంఘం "సీ" కింద గల 700 పదాలకు సమానార్థకాలను రూపొందించింది. సంపాదకీయ సంఘం 19 సమావేశాలు జరిపి "ఏ" నుంచి "డీ" వరకు గల ఆంగ్ల పదాలకు మూడు ఉపసంఘాలు రూపొందించిన సమానార్థకాలను సంకలనం చేసి తుది రూపమిచ్చింది. "" నుంచి "డీ" వరకు ఒక సంపుటిగా ప్రచురించాలని మొదట అనుకున్నప్పటికీ, పునఃపరిశీలన తరువాత, "ఇ" నుంచి "జడ్" వరకు గల పదాలకు కూడా సమానార్థకాలను రూపొందించిన తరువాతే అంతా కలిపి ఒకే సంపుటిగా వేయాలని నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. అందుకొరకే మొదట నియమించిన కమిటీని రద్దు చేసి 14 మంది సభ్యులుతో కొత్త సంఘాన్ని డిసెంబర్ 12, 1958 న ఏర్పాటు చేశారు సభాపతి.


రెండవ సారి ఏర్పాటైన తెలుగు పారిభాషిక పదకోశ సంఘం ఫిబ్రవరి 9, 1959 న పని ప్రారంభించి, జూన్ 4, 1960 వరకు మొత్తం 14 సార్లు సమావేశమైంది. తొలి సమావేశంలో హైదరాబాద్ లో రెండు, విజయవాడలో ఒకటి, మొత్తం మూడు ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. అలాగే నవంబర్ 28, 1959 న జరిగిన తొమ్మిదో సమావేశంలో మరొక ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఖండవల్లి లక్ష్మీ రంజనం అధ్యక్షుడుగా వున్న హైదరాబాద్ ఉపసంఘం 94 సమావేశాలు జరిపి. "ఇ, ఎఫ్, ఆర్, ఎస్" కింద గల పదాలకు, అలానే సాధారణ పరిపాలన శాఖ సూచించిన అనుబంధ జాబితాలోని "ఏ" నుంచి "ఓ" వరకు గల పదాలకు తెలుగు సమానార్థకాలను రూపొందించింది. కాళోజీ నారాయణరావు అధ్యక్షతన ఏర్పాటైన హైదరాబాద్ ఉపసంఘం 85 సమావేశాలు జరిపి "జీ, హెచ్, , పీ" కింద గల పదాలకు, జీఏడి సూచించిన అనుబంధ జాబితాలోని "పీ" నుంచి "జడ్" వరకు గల అన్ని పదాలకు సమానార్థకాలను తయారుచేసింది. డీ శివరావు అధ్యక్షతన గల విజయవాడ ఉపసంఘం 133 సమావేశాలు జరిపి "జె, కె, ఎల్, ఎమ్, ఎన్, , క్యు, టి, యు, వీ, డబ్ల్యు, ఎక్స్, వై, జడ్" ల కింద గల ఆంగ్ల పదాలకు సమానార్థకాలను రూపొందించింది.

బోయి భీమన్న అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక ఉపసంఘం 107 సమావేశాలు జరిపి, మిగతా ఉపసంఘాలు రూపొందించిన, రెండు ప్రధాన సంఘాలు పరిశీలించిన అన్ని తెలుగు సమానార్థకాలను సంకలనం చేసి, వాటికి తుది రూపమిచ్చింది. పదాలన్నింటినీ క్షుణ్ణంగా చదివి, ముద్రణకు వీలుగా చేసి, రాత తప్పులను సవరించి, వచ్చిన పదమే తిరిగి రాకుండా చేసి, అవసరమైన చోట్ల ఆయా పదాలను సవరించి, చివరలో ఈ ఉపసంఘం కీలకమైన పని చేసింది. పదకోశ ముద్రణా కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యత, పదకోశం తొలి కూర్పును తగిన రూపంలో వెలువరించే బాధ్యత కూడా ఈ ఉపసంఘమే తీసుకుంది. ఈ ఉపసంఘంలోని ఇతర సభ్యులలో కాళోజీ, పీవీ, దేవులపల్లి రామానుజరావులు కూడా వున్నారు. జులై 20, 1960 కల్లా అప్పగించిన పనిని పూర్తి చేసిందీ ఉపసంఘం.

ప్రధాన పదకోశ సంఘాలు, ఉపసంఘాలు, తమ కృషిలో భాగంగా అనేకానేక నిఘంటువులు, చారిత్రక, న్యాయ శాస్త్ర గ్రంథాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు, ఇతర రకమైన అనేక ప్రచురణల లోని పలు అంశాలను సందర్భానుసారంగా ఉపయోగించుకున్నారు. వాటిలో కొన్ని పేర్కొనాలంటే: ఆంధ్ర వాచస్పత్యము, సివిల్ ప్రొసీజర్ కోడ్, వార్డన్స్ లా లెక్సికన్, శబ్దార్థ చంద్రిక, కౌటిల్య అర్థశాస్త్రం, డిక్షనరీ ఆఫ్ లీగల్ టర్మ్స్, సంస్కృత-ఇంగ్లీష్ డిక్షనరీ, దస్తావేజోంకె నమూనే వున్నాయి. సంఘం సాధారణంగా తెలుగులో వాడుకలో వున్న పదాలనే సమానార్థకాలుగా నిర్ణయించడానికి ప్రయత్నించిందని, కొన్ని ఆంగ్ల పదాలను అలానే వుంచడం జరిగిందని, కొన్ని సందర్భాలలో దేశీయ ప్రత్యామ్నాయ పదాలు ఇవ్వబడ్డాయని, అయ్యదేవర కాళేశ్వరరావు తన మలిపలుకు లో రాశారు.

ఫిబ్రవరి 9, 1961 న స్పీకర్ ఆదేశాల మేరకు ఈ తెలుగు పదకోశం 5000 కాపీలు ముద్రించడానికి అంగీకరించి, రు.35, 200 మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 2000 కాపీలు శాసన మండలి సచివాలయానికి, 3000 కాపీలు సాధారణ పరిపాలన శాఖకు పంపకం చేయాలని స్పీకర్ ఆదేశాలిచ్చారు. పుస్తకం ధర కేవలం 12 రూపాయలే! ఆయన ఆదేశాల మేరకే పుస్తకం ముద్రణ జరిగింది. ఇప్పుడేమైనా కాపీలు మిగిలున్నాయో? లేదో?


అయ్యదేవర కాళేశ్వరరావు స్వాతంత్ర్య సమర యోధుడు. 1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయవాడకు ప్రాతినిధ్యం వహించాడు. విజయవాడ పురపాలక సంఘ అధ్యక్షుడిగానూ, మద్రాసు శాసనసభకు చీఫ్ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. 1939లో మద్రాసు శాసనసభకు విజయవాడ- బందరులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నికై, మద్రాస్ ప్రధానమంత్రి రాజగోపాలాచారికి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 1955లో విజయవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభకు స్పీకర్‌గా ఎన్నికయ్యాడు. 1956 నుండి 1962 వరకు రాష్ట్ర శాసనసభ స్పీకరుగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1962లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు, కానీ ఫలితాలు వెలువడడానికి ముందురోజే తుదిశ్వాస వదిలాడు. ఆ మహనీయుడి కృషి ఫలితంగా, రూపుదిద్దుకున్న శాసన, న్యాయ, పరిపాలన పారిభాషిక పదకోశాన్ని అవసరమైన మార్పులు చేర్పులతో పునర్ముద్రిస్తే చట్ట సభల సభ్యులకు చాలా ఉపయోగంగా వుంటుంది. ఆ దిశగా గౌరవ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ స్పీకర్లు చొరవ తీసుకుంటే మంచిదేమో!   

No comments:

Post a Comment