Monday, May 1, 2017

అనంతకోటి బ్రహ్మాండానికి "పరబ్రహ్మం" ఒక్కడే! ....ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

అనంతకోటి బ్రహ్మాండానికి "పరబ్రహ్మం" ఒక్కడే!
ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (01-05-2017)

బ్రహ్మాస్త్ర బంధాలు వీడిపోయి, తాళ్లతో, పగ్గాలతో కట్టబడిన హనుమంతుడు, కొలువు కూటంలో వున్న రావణాసురుడికి, "నయానా-భయానా" బుధ్ధి చెప్తూ, "కాళరాత్రి"అనే పదం వాడుతాడు. రావణుడి వశమందున్న  జానకీదేవి, "ఉత్తమ స్త్రీ" అనీ, ఆమె లంకనంతా పాడు చేసేందుకు వచ్చిన "కాళరాత్రి" అనీ అంటాడు. ప్రళయ కాలంలో కాళరాత్రి ఏవిధంగా లోకాన్నంతా నాశనం చేస్తుందో అట్లాగే సీతాదేవి, లంకనంతా నాశనం చేయ బోతున్నదనీ, ఆమె రావణుడి మెడలో తగులుకున్న "యమపాశమని" చెప్తూ, లంకను కాపాడు కోవాలన్నా, రావణుడికి బ్రతకాలని ఆశ వున్నా, ఆమెను వదిలి పెట్టడమొక్కటే మార్గమని సలహా ఇస్తాడు. "కాళరాత్రి" అంటే, ప్రళయ కాలంలో సర్వసంహారం చేసే "భగవంతుడి" శక్తి. ఈమే "విష్ణుశక్తి", భగవంతుడి మహామాయ. ఆయన ఆజ్ఞానుసారమే నడుస్తుంది. ఆయన సంకల్పం ప్రకారమే పనిచేస్తుంది. "మహావిష్ణువు క్రీడా శరీరం", "బ్రహ్మాదులకు అగోచరం". ఎవరైతే విష్ణువును భజిస్తారో, వారే "మహామాయ"ను దాటగలరు. ఇతర "ఉపాయాలు" ఎన్నైనా దాటలేరు. "విష్ణుశక్తే" లోక కల్యాణంకొరకు, "సత్వ"గుణాన్ని అంగీకరించి, "లక్ష్మి, శ్రీ, భూమి, రుక్మిణి, సీత" లాంటి రూపాలు సంతరించుకొని అవతరిస్తుంది. సంహార సమయంలో "తమో" గుణాన్ని పూనుతుంది. అప్పుడే "కాళరాత్రి" లాంటి పేర్లను ధరిస్తుంది.

హనుమంతుడు రావణుడితో, శ్రీరాముడు సమస్త ప్రపంచాన్ని తన శక్తితో, "సంహరించ గలడనీ, సృష్టించ గలడనీ", ఆయనతో రావణుడికి పోలికే లేదనీ అంటాడు. ఇది కేవలం భయ పెట్టడానికి చెప్పిన మాటలేం కావు. యదార్ధం కూడా. "సృష్టించేవాడు బ్రహ్మ, సంహరించేవాడు రుద్రుడు" అనుకుంటారందరు. అయితే ఇవి రామ కార్యాలుగా హనుమంతుడు చెప్పటంలో అతిశయోక్తి లేదు....తగిన కారణం వుంది. అనంతకోటి బ్రహ్మాండానికి "పరబ్రహ్మం" ఒక్కడే! అతనికి సమానుడూ, అధికుడూ ఎవరూ లేరు. గడ్డిపోచ కదలాలన్నా ఆయనే కారణం. ఆయనే సృష్టికొక అధికారిని, సంహరించడానికొక అధికారిని నియమించాడు. "బ్రహ్మ, రుద్రులు" నిమిత్త మాత్రులు. భగవంతుడైన "విష్ణుమూర్తి", రజోగుణం విశేషంగా వుండే జీవులందు ప్రవేశించి వారితో సృష్టి కార్యాన్నీ, తమోగుణం వున్నవారిలో ప్రవేశించి సంహార కార్యాన్నీ, సత్వగుణం వున్నవారిలో ప్రవేశించి రక్షించే పనినీ చేస్తాడు. అందుకే సమస్త ప్రయోజకర్త వాస్తవానికి ఆ "భగవంతుడే" ! అతడే విష్ణువు. ఆ విష్ణువే శ్రీరామచంద్రుడిగా అవతారమెత్తాడు.


రాక్షసులు హనుమంతుడి తోక కాల్చిన సంగతి తెల్సిన సీత, తాను పతివ్రత నైతే, "అగ్ని" దేవుడు హనుమంతుడి పట్ల చల్ల పడాలని ప్రార్ధిస్తుంది. అలా సీతాదేవి మాట మాత్రంగా అడిగితే, అగ్ని ఆంజనేయుడిపట్ల చల్లబడింది. ఎంతటి మహాత్ములైన పురుషులకు కూడా సాధ్య పడనిదీ, పతివ్రతలైన స్త్రీలకు సాధ్య పడుతుందని దీనివలన తెలుస్తున్నది. ఇదొక అగ్నిపరీక్ష. సీతమ్మకే కాదు...రాముడికి కూడా. "నేనే పతివ్రతనైతే...నాకు తపశ్సక్తి వుంటే....అదృష్టవంతురాలినైతే.....తార వుత్తమురాలైతే ....సుగ్రీవుడు సత్యవంతుడైతే....ఇవన్నీ నిజమైతే" అగ్ని తన సహజ స్వభావాన్ని ఉపసంహరించుకోవాలి. అంతేకాదు...చల్లబడిపోవాలి. అందరిపట్ల అన్ని విషయాలలో కాదు. కేవలం హనుమంతుడి పట్ల మాత్రమే చల్లబడమంది ఆ తల్లి. అంతే చక్కగా చల్లబడ్డాడు. ఆమె అన్న మాటలన్నీ సత్యం అని నిరూపించేశాడు అగ్నిదేవుడు. రామాయణంలో ఇదొక అత్యంత ఆశ్చర్యకరమైన సన్నివేశం. మరొక రహస్యం కూడా వుందిక్కడ. "శీతోభవ" అని సీతమ్మ ఆజ్ఞాపిస్తే అగ్ని విధేయుడై చల్లబడ్డాడు హనుమంతుడి విషయంలో. మరి అలాంటప్పుడు "దగ్ధోభవ దశాసన" అని అగ్నిని ఆజ్ఞాపిస్తే రావణుడు బూడిద అయ్యేవాడు కద! అందువల్లనే ఆ తల్లి అన్నది...."నాకు శ్రీరాముడి ఆజ్ఞ లేదు. అందుకే శపించడం లేదు" అని. రావణుడికి గుండె పగిలేంత దిగులు పట్టుకుంది దీనివల్ల. అంతేకాదు...మున్ముందు సీత అగ్నిప్రవేశం చేయాల్సివచ్చే సమయంలో అగ్ని సీతమ్మను దహింపలేడనే విషయం కూడా ఋజువైంది.

"అష్టాక్షరి" మంత్రంలో "ప్రణవం, నమస్సు, నారాయణపదం" వున్నాయి. "ప్రణవం" అంటే జీవాత్మ పరమాత్మకే వుపయోగ పడాలనీ, ఆయన సేవకే వినియోగపడాలనీ అర్ధం. "నమస్సు" అంటే స్వాతంత్ర్య రాహిత్యాన్నీ, పారతంత్రాన్నీ తెలుపుతుంది. "నారాయణపదం" భగవత్ ప్రియమైన భాగవత సేవను తెల్పుతుంది. భాగవత సేవ భగవత్ ప్రీతికరం. "ప్రణవం"...లక్ష్మణుడు...యావజ్జీవితం అన్నకు శుశ్రూష చేసాడు. సర్వవిధ సేవలు చేసాడు. లక్ష్మణుడిని వాల్మీకి మహర్షి "లక్ష్మణుడు...లక్ష్మీవర్ధనుడు అని సంబోధిస్తాడు. లక్ష్మి అంటే సిరిసంపదలని మనం భావిస్తాం. అలాంటి సిరిసంపదలను లక్ష్మణుడు ఎప్పుడైనా కోరుకున్నాడా? అనుభవించాడా? వాటికోసం ఆరాటపడ్డాడా? అంటే లేదనే సమాధానం వస్తుంది. కాని లక్ష్మి అంటే సేవచేసే భాగ్యం అని మన పెద్దలు తేల్చేశారు. కాబట్టి లక్ష్మణుడు లక్ష్మీవర్ధనుడు. అంటె అతడు భగవదతారమైన శ్రీరాముడి సేవానిరతుడనీ, భగవత్ కైంకర్యాన్ని అవిఛ్చన్నంగా సాగించే "కైంకర్య లక్ష్మీవర్ధనుడు" అనీ, అర్థం చేసుకోవాలి. "నమస్సు"...భరతుడు...కేవలం పరతంత్రుడై రాముడులేని అయోధ్యలో, వానప్రస్థుడి లాగా ఉన్నాడు. "నారాయణపదం"...శత్రుఘ్నుడు...రామ పరతంత్రుడై, భాగవతుడైన భరతుడికి ప్రీతిగా ప్రవర్తించాడు. ఈ మూడింటినీ ఒక్క సీతాదేవి అనుష్టించి చూపింది. పతి సేవ చేసే స్త్రీనని అగ్నిహోత్రుడికి తెలిపి రామకైంకర్యాన్ని స్థిరపర్చింది. రావణుడిని దగ్ధం చేయననీ, హనుమంతుడి వెంట రాననీ చెప్పి తన పారతంత్ర్యాన్ని ప్రకటించింది. రామదాసుడగు హనుమంతుడికి అపాయం లేకుండా చేసి భాగవత ప్రీతిని కనపర్చింది.


లంకాదహనం చేసిన హనుమంతుడు, ఆ మంటల్లో తగులుకొని సీత కూడా నశించే వుంటుందని భయపడ్డాడు. జానకి అశోకవనంలో వున్నదన్న ఆలోచన లేక, తెలివి తక్కువగా క్రూరమైన పని చేసానని కుమిలి పోతాడు. అయితే, రామానుగ్రహానికి పాత్రురాలై, సత్య వాక్య సంపద వల్ల సమస్త లోకాలనే జయించే శక్తి గలదై, పాతివ్రత్య మనే తపస్సు చేస్తున్నదైన సీతాదేవి తల్చుకుంటే అగ్నిహోత్రుడినే దహించ గలదని మళ్లీ అనుకుంటాడు. ఇలా అనుకుంటూనే, సీతాదేవి వున్న ప్రదేశానికి పోయి, "శింశుపా వృక్షం" కింద క్షేమంగా వున్న ఆమెకు నమస్కరిస్తాడు. అంటే...సీతాదేవి మాత్రమే క్షేమంగా వుండడమే కాకుండా, ఆమెను ఆశ్రయించిన కారణం వల్ల, శింశుపా వృక్షం, అశోక వృక్షాలతో సహా వాటి చుట్టు ప్రక్కలున్న చెట్లు కూడా కాలిపోక, విరిగిపోక నిల్చి వున్నై. సీతారాములనాశ్రయించిన వారే కాకుండా, వారిని ఆశ్రయించిన వారు కూడా చెక్కు చెదరరనే సత్యాన్ని ఈ సన్నివేశం నిర్ధారిస్తున్నది. విభీషణుడే కాకుండా, ఆయన వెంట వచ్చిన వారందర్నీ రక్షిస్తాడు శ్రీరాముడు. విష్ణు భక్తులను ఆశ్రయించిన పశు, పక్ష్యాదులు, మనుష్యులు కూడా వారి వెంట విష్ణుని పరమపదానికి పోతారు.

No comments:

Post a Comment