Wednesday, May 17, 2017

ప్రాజెక్టులకు ఇక రాచబాట : వనం జ్వాలా నరసింహారావు

ప్రాజెక్టులకు ఇక రాచబాట
వనం జ్వాలా నరసింహారావు
సాక్షి దినపత్రిక (18-05-2017)

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ భూసేకరణ, పునరావాసం, పునఃపరిష్కారంలో న్యాయ పరిహారం, పారదర్శకమైన హక్కు బిల్లుకు శాసనసభ పునః పరిశీలన తరువాత రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బుధవారమే గెజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కొత్త చట్టం రావడంతో, రాష్ట్రంలో భూసేకరణకు వున్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయి, వివిధ రకాలైన ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతమౌతాయి. చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకోగా, రెవెన్యూ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ కీలక పాత్ర పోషించారు. ఈ నేపధ్యంలో భూసేకరణ చట్టం పూర్వాపరాలు ఒక్క సారి అవలోకనం చేసుకుంటే బాగుంటుందేమో.

భారత రాజ్యాంగం ఆర్టికిల్ 298 ప్రకారం రాష్ట్రాలకు భూసేకరణ ద్వారా భూమిని కొనుగోలు చేసే అధికారం వుంది. తదనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్లు 123, 190, 191 ద్వారా భూసేకరణ చేపట్టింది. కాకపోతే కొన్ని రాజకీయ పక్షాలు ఈ జీవోల విషయంలో, వాటి అమలు విషయంలో కొన్ని సందేహాలు లేవనెత్తడం, తద్వారా ప్రజల్లో కొంత అపోహ కలగడం జరిగింది. వాటన్నింటినీ నివృత్తి చేయడానికి, భూసేకరణ విధానానికి ఒక చట్టరూపాన్ని తేవడానికి డిసెంబర్ 28, 2016 న భూసేకరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. వాస్తవానికి కేంద్రప్రభుత్వం కూడా ఈ 2013 చట్టానికి మూడు పర్యాయాలు ఆర్డినెన్స్ తీసుకొచ్చి, తరువాత చట్ట రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మొదటి ఆర్డినెన్స్ డిసెంబర్ 31, 2014 న, రెండవదిఏప్రిల్ 3, 2015 న, మూడవసారి మే 30, 2015 న తీసుకొచ్చింది కేంద్రం. కాకపోతే రాజకీయ కారణాల వల్ల ఈ ఆర్డినెన్సులు రాజ్యసభ ఆమోదం పొందలేదు.

          నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడి రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఈ ఆర్డినెన్సుల ప్రస్తావన తెచ్చి, వారి వారి రాష్ట్రాలలో, రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా సొంత చట్టాలను రూపొందించుకోవాలని సూచించారు. వాస్తవానికి రాష్ట్రాలకు రాజ్యాంగ బద్ధంగా అలాంటి అధికారం వుంది కూడా. కాకపోతే అలాంటి సందర్భాలలో రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలు తమ సొంత చట్టాలను చేసుకోవడం జరిగింది. సాక్షాత్తూ ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ తో సహా అనేక రాష్ట్రాలు చట్టాలను చేసుకున్నారు. ఇదేం కొత్త విషయం కాదు. గతంలో కూడా భూసేకరణ చట్టాలకు అనేక సవరణలు, రాష్ట్రపతి ఆమోదముద్ర మనం తీసుకున్నాం. ఉదాహరణలు చెప్పుకోవాలంటే: నాగార్జున సాగర్ భూసేకరణ 1956, భూసేకరణ 1959, వైజాగ్ స్టీల్ ప్రాజెక్ట్ చట్టం 1972, భూసేకరణ చట్టం 1976, భూసేకరణ చట్టం 1983 వున్నాయి. దీనర్థం...సులభంగా, వేగవంతంగా భూసేకరణ చేయడానికి ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి సవరణలు చాలా తెచ్చామని. ఇక ఇప్పుడు మనది కొత్త రాష్ట్రం. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు కొత్తగా వున్నాయి. తెలంగాణ ఉద్యమమే నీళ్లకు, నిధులకు, నియామకాలకు జరిగింది. ఏ నీళ్లకైతే తెలంగాణ ఉద్యమించిందో, ఆ నీళ్లకొరకు కావాలి నీటిపారుదల ప్రాజెక్టులు. వాటికి కావాలి భూసేకరణ. మరీ వివరంగా చెప్పాలంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించడానికి, భూసేకరణ వేగవంతం చేయాలి.

శాసనసభలో బిల్లును ప్రవేశ పెట్టిన సందర్భంగా చాలా విషయాలు ప్రభుత్వం స్పష్టంగా విశదీకరించింది. భూమి సొంతదారుడు స్వఛ్చందంగా తన భూమిని భూసేకరణ కొరకు ఇవ్వడానికి అంగీకరిస్తాడో, దానిని అమలు చేయడానికి 123, 190, 191 జీవోలున్నాయి. ఎక్కడైతే అలా కాకుండా 2013 చట్టం ప్రకారం కావాలని రైతులు కోరుకుంటారో అది కూడా అమలు చేసే వెసలుబాటు కలిగించింది ప్రభుత్వం. అసలింతకీ 2013 చట్టానికి సవరణ తేవాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. ఏ విధంగా చూసినా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఆ చట్టం, ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే "దాన్ని తాడూ, బొంగరం లేని వారు కూర్చుని చేశారు".

భూసేకరణ చట్టం వాస్తవికతను ప్రశ్నించేవారికి కొన్ని విషయాలు స్పష్టంగా తెలియడం మంచిదేమో! భూసేకరణ జరగకుండా ప్రాజెక్టుల నిర్మాణం జరగదనేది వాస్తవం. భూసేకరణ చేయబట్టే నాగార్జునసాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు కట్టుకున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద పునరావాసం జరిగిన ప్రాజెక్టుగా రికార్డుల్లోకి ఎక్కిన చైనా దేసపు "థ్రీ గార్జెస్ డాం" మూలాన పన్నెండు లక్షల కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. అదెందుకు జరిగిందంటే...ప్రజల అవసరాల కోసమే. తరతరాలకు ఉపయోగపడే పథకాలకు, మానవాళికి బహువిధ ప్రయోజనాలు సమకూరే పథకాలకు, తప్పకుండా కొందరికి నష్టం, కష్టం జరుగుతుంది. అలా జరుగుతుంది కదా అని ప్రాజెక్టులె వద్దు, భూసేకరణే వద్దు అనడం తప్పు.


అసలీ చట్టం తేవాలన్న ఆలోచన రావడానికి మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టులకొరకు జరుగుతున్న భూసేకరణను కొందరు రాజకీయం చేయడమే. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకొరకు 75% మంది రైతులు స్వఛ్చందంగా భూములిచ్చారు. మిగిలినవారి విషయానికొచ్చేసరికి రాజకీయాలు మొదలయ్యాయి. ప్రాజెక్టు పూర్తికాకూడదని. లిటిగేషన్ వుండాలని ఆలోచన మొదలైంది. ఆ ప్రాంతంతో సంబంధం లేనివారు, అసలు రైతులు కాని వారు, ఆందోళన చేయడం ఎంతవరకు సబబు?

వాస్తవానికి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో, ఏ ప్రాజెక్టుకూ ఇవ్వని పరిహారం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఉదాహరణకు మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో వున్న తపాస్ పల్లి రిజర్వాయర్ కింద భూమి కోల్పోయిన రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో ముట్టిన పరిహారం ఎకరాకు ఎనబై వేలు! మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం ఆరున్నర లక్షలు. అయినా ఆందోళనే! ఎందుకిలా చేయాలి? ప్రాజెక్టులు కట్టినప్పుడు కొన్ని చోట్ల భూములు పూర్తిగా, కొన్ని చోట్ల పాక్షికంగా మునిగిపోతాయి. గ్రామం కూడా పూర్తిగానో, పాక్షికంగానో మునిగిపోవచ్చు. గ్రామమంతా మునగకుండా, కొంత శివారు మిగిలివుంటే, అక్కడే రిహాబిలిటేషన్ కాలనీ కట్టించే చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంది. అయినా విమర్శలే!

కేంద్ర ప్రభుత్వ రూపొందించిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇందిరా ఆవాస్ యోజన కింద ఇంటికి ఇచ్చే పరిహారం లక్ష రూపాయలు మాత్రమేఅలాగే వారిచ్చే 200 గజాల జాగా ఖరీదు గ్రామాలలో 20 వేలకు మించదు. మొత్తం కలిపి లక్షా 20 వేలుంటుంది. అలాగే రిజిస్ట్రేషన్ విలువ ఎంతవుంటే అంతకు మూడు రెట్లు పెంచి పరిహారం ఇవ్వాలని ఆ చట్టంలో వుంది. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం, మూడు రెట్లకు బదులుగా, పదిరెట్లు పైగా పెంచి ఇచ్చింది. చాలామంది రైతులు అలా లాభపడ్దారు కూడా. సీఎం ఈ విషయాన్ని శాసనసభలో స్పష్ఠంగా ప్రకటించారు. రు. 60 వేల రిజిస్ట్రేషన్ విలువ వుంటే రు. 6 లక్షల 50 వేలు ఇచ్చింది ప్రభుత్వం. నిజానికి   2013 భూసేకరణ చట్టం ప్రకారం లక్షా 20 వేల రూపాయలిచ్చి చేతులు దులుపుకోవచ్చు. దీనికి అదనంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో జరుగుతున్నందున, వారికి నచ్చిన చోట ఆ తరహా ఇళ్లు కట్టుకునే వెసలుబాటును కూడా కలిగించింది ప్రభుత్వం. నిర్వాసితులకు నష్ఠం కలగకూడదనే ఉద్దేశంతో ఇంటి కొరకు మరో రు. 5.04 లక్షలిచ్చింది ప్రభుత్వం. ఇవన్నీ 123 జీవో ప్రకారం ఇచ్చినవే!

 123 జీవో అమలుపై న్యాయస్థానాలకు వెళ్లారు కొందరు. హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో చాలా స్పష్ఠంగా ఈ విషయాలన్నీ పేర్కొనడం జరిగింది. భూమిలేని నిర్వాసితులకు వన్ టైం పరిహారం కింద 2013 భూసేకరణ చట్టంలో వున్నదానికంటే మరో లక్ష రూపాయలు అదనంగా ఇస్తున్నట్లు కూడా అఫిడవిట్ లో పేర్కొంది ప్రభుత్వం. ఇదంతా ప్రజల మేరుకోరి చేసిందే కదా? ప్రజలను నష్ఠపరిచే ఆలోచన ప్రభుత్వానికి లేదనేది స్పష్ఠంగా బోధపడుతోంది. ఇంత చేసినా రాజకీయాలు చేయడం ఆగలేదు. కొన్ని రాజకీయ పార్టీల వైఖరిలో మార్పు రాలేదు. ప్రాజెక్టుల నిర్మాణం ఎలా ఆపుచేయాలా అన్న నిరంతర ఆలోచన కొనసాగించసాగారు. అడుగడుగునా అడ్దుపడసాగారు. ప్రాజెక్టుల వద్దకు వెళ్లి వివాదాలు సృష్ఠించసాగారు.కోర్టులకు పోవడమో, లేదా, గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లి స్టే తెచ్చుకుని ఆనందించడమో చేసారు. ఇది ప్రతిపక్షాలు చేసే పని కాదు.

చివరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించింది. 2013 భూసేకరణ చట్టం చాలా బాధ్యతారహితంగా చేసిన చట్టం అని కేంద్రం కూడా చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కూడా సీఎం చంద్రశేఖర రావు సంప్రదించారు. ఆయన సలహా తీసుకున్నారు. రాజ్యాంగబద్ధంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు లాంటి ఐదారు రాష్ట్రాలు 2013 భూసేకరణ చట్టానికి సవరణ చేసుకున్న విషయం వారిద్దరిమధ్య ప్రస్తావనకొచ్చినట్లు సీఎం శాసనసభలో చెప్పారు. భూసంబంధమైన అంశం కంకరెంటు జాబితాలో వున్నందున, ఆ రాష్ట్రాల నమూనాలో, తెలంగాణ కూడా చట్టానికి రాష్ట్రావసరాలకు అనుగుణంగా సవరణలు చేస్తే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయించుకోవచ్చని తేలింది. అంటే, కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు, సూచన మేరకు, చట్టానికి సవరణ తీసుకురావడం జరిగింది. చట్టానికి సవరణలు రూపొందించే పూర్వరంగంలో, ఏదో ఆషామాషీగా చేయకుండా, సుదీర్ఘ ప్రక్రియ ద్వారా దాన్ని తయారుచేసి సభముందుకు తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంబంధిత శాఖాధికారులు, ఢిల్లీకి వెళ్లి, అక్కడి కేంద్ర ప్రభుత్వ న్యాయ శాఖ, లాండ్ రికార్డుల శాఖ వారికి చూపించి, వారు అంగీకరించిన తరువాతే, తదనుగుణంగానే కేంద్ర ఆమోదం లభిస్తుందన్న హామీ లభించిన తరువాతే, బిల్లును డ్రాఫ్ట్ చేసి శాసన సభ ముందుకు తెచ్చింది ప్రభుత్వం డిసెంబర్ నెలలో.

బిల్లు ఉభయ సభల ఆమోదం పొందిన తరువాత కేంద్ర ఆమోదం కొరకు పంపించడం, వారి సూచనల మేరకు కొన్ని మార్పులు చేసి మళ్లీ ఏప్రిల్ 30, 2017 న మరోమారు ఉభయ సభల ఆమోదం పొందడం జరిగింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్రపతి ఆమోదంకొరకు పంపడం, దానికి రాజముద్ర పడడం జరిగింది. ఇక ఎవరడ్డొచ్చినా, వందకు వంద శాతం, ప్రాజెక్టులు పూర్తికావడం తధ్యం. తెలంగాణాలో కోటి ఎకరాలకు సాగునీరు అందడం కూడా తధ్యం.END


No comments:

Post a Comment