Monday, May 29, 2017

మనం మళ్లీ పొందలేని మహానేతలు : వనం జ్వాలా నరసింహారావు

మనం మళ్లీ పొందలేని మహానేతలు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (30-05-2017)

          అలనాటి అంతర్జాతీయ స్థాయి "రోల్ మోడల్" నాయకత్వం, లీలా జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతోంది. అలాంటి ఉద్దండ నాయకులు, ఆ స్థాయి రాజనీతిజ్ఞత, వారి తరహాలో తమ-తమ దేశాలకు ప్రాతినిధ్యం వహించిన తీరు, తమ దేశాల వాణినే కాకుండా వారి-వారి ప్రాంతాల గురించి ఆ మహా నాయకులు పడ్డ ఆరాటం, వ్యక్తిగతంగా, ఉమ్మడిగా తాము పోరాడుతున్న అంశాల విషయంలో వారు ప్రదర్శించిన నిబద్ధత, బహుశా, ప్రస్తుత అంతర్జాతీయ స్థాయి నాయకుల్లో లోపించిందనడం అతిశయోక్తి కాదు. దురదృష్టవశాత్తు, రాజనీతి శాస్త్రం అధ్యయనం చేసే నేటి తరం విద్యార్థులు కాని, వర్తమాన చరిత్ర కారులు కాని, ఆ మాటకొస్తే సాధారణ చదువరి కాని, యువత కాని, గత కాలం నాటి మహా నాయకుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్న దాఖలాలు అంతగా కనిపించడం లేదు.

అప్పట్లో, అంతర్జాతీయ స్థాయిలో ఒక గోష్టి కాని, సమావేశం కాని, సదస్సు కాని, ప్రపంచ దేశాల సమ్మేళనం కాని, ఎప్పుడు-ఎక్కడ ఏ మూల జరిగినా, ఆ నిర్వహణలో కనిపించిన హంగూ-ఆర్భాటం, ఆనందం, అంగరంగ వైభవం ఇప్పట్లో లోపించిందనాలి. ఉదాహరణకు, బెల్ గ్రేడ్‌లో 1961 లో, జవహర్లాల్ నెహ్రూ, సుకర్ణో, నాజర్, ఎన్ క్రుమా, టిటోల సారధ్యంలో పురుడు పోసుకున్న అలీనోద్యమ సదస్సు పేర్కొన వచ్చు. ఆ ఐదుగురు ప్రపంచ నాయకులు, అగ్రరాజ్యాల ఆధిపత్యం తగ్గించడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నం, అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధాన్ని నివారించడానికి తెర పైకి తెచ్చిన అలీనోద్యమం తీరుతెన్నులు, నేటి తరంవారు, కనీసం తెలుసుకోవాలన్న, అవగాహన చేసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయడం లేదే? అలానే 1955 నాటి జెనీవా సదస్సు గురించి కాని, ఆ రోజుల్లో జరిగిన ఐక్య రాజ్య సమితి సర్వ సభ్య సమావేశాల గురించి కాని, కామన్ వెల్త్ దేశాధి నేతల సమావేశాల గురించి కాని, బాండుంగ్ సమావేశంగా పిలుచుకునే ఆప్రో-ఏషియన్ సమావేశం కాని, 1954 లో జరిగిన జెనీవా సమావేశం కాని, అలాంటి మరెన్నో అంతర్జాతీయ సమావేశాల గురించి కాని నేటి తరం యువత తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం విచారకరం.

          అలనాటి అంతర్జాతీయ స్థాయి అగ్ర నాయకుల పేర్లలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి: జవహర్లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరా గాంధీ, జాన్ ఫిట్జ్ గెరాల్డ్ కెన్నెడీ, నికితా కృశ్చేవ్, చార్లెస్ డి గాలె, డేవిడ్ బెన్ గ్యూరియన్, ఆయన వారసురాలు గోల్డా మీర్, మార్షల్ టిటో, గమాల్ అబ్దుల్ నాజర్, చౌ-ఎన్-లై, మావో సేటుంగ్, సిరిమావో బండార నాయికే, విల్లీ బ్రాండ్ట్, సుకర్ణో, క్వామే ఎన్ క్రుమా, ఫిడల్ కాస్ట్రో, హోచిమిన్, నెల్సన్ మండేలా.....లాంటి వారు.

          జవహర్లాల్ నెహ్రూ, భారత ప్రప్రధమ ప్రధాన మంత్రి. ఐక్య రాజ్య సమితి విధానాలకు ఆయన తన సంపూర్ణ మద్దతిచ్చేవారు. ప్రపంచ వ్యాప్తంగా, శాంతిత్వ వాదనకు, ఆయన పేరు పర్యాయపదం అనవచ్చు. అలీనోద్యమ వ్యవస్థాపకుడిగా, అలనాటి అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యా దేశాల ఆధిపత్యాన్ని ఎదిరించిన వాడిగా, ఆ రెండు దేశాలకు చెందకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలు మధ్యే మార్గాన్ని అనుసరిచేట్లు చేసిన వాడిగా, చరిత్రలో ఆయనో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. పొరుగునున్న చైనా దేశంతో "పంచశీల" పేరుతో శాంతి-సహజీవనం దిశగా ఒప్పందం చేసుకున్నాడాయన. ఆయన కూతురు ఇందిరా గాంధీ కూడా తండ్రి మార్గంలోనే అంతర్జాతీయ స్థాయి నాయకురాలిగా ఆయన తదనంతరం పేరు తెచ్చుకుంది. భారత దేశానికి మొదటి పర్యాయం మూడో ప్రధాన మంత్రిగా, ఆ తరువాత ఆరవ ప్రధాన మంత్రిగా హత్యకు గురయ్యేదాకా ఇందిరాగాంధీ పని చేశారు. ఆమె కాలంలో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దేశంగా భారత దేశానికి పేరొచ్చింది. రాజకీయ, ఆర్థిక, సైనిక పరంగా దక్షిణ ఏషియా ప్రాంతంలో ఒక గొప్ప రాజ్యంగా అవతరించింది భారత దేశం. బంగ్లాదేశ్ ఆవిర్భావం, పాకిస్తాన్ పై భారత్ గెలుపు ఆమె నేతృత్వంలో సాధించినవే. అలీనోద్యమానికి కూడా అమె చేసిన కృషి అమోఘం. అలానే పాలస్తీనా విమోచనోద్యమానికి ఆమె ఇచ్చిన మద్దతు మరువరానిది.

          జాన్ కెన్నెడీ అమెరికా దేశపు 35 వ అధ్యక్షుడుగా, తాను హత్యకు గురయ్యేవరకు పనిచేశారు. ఆయన కాలంలోనే "బే ఆఫ్ పిగ్స్" దాడి, క్యూబన్ మిస్సైల్ సంక్షోభం, బెర్లిన్ గోడ నిర్మాణం, ఆఫ్రికా-అమెరికా పౌర హక్కుల ఉద్యమం తో సహా వియత్నాం పైన యుద్ధంలో అమెరికా మితిమీరిన జోక్యం చోటు చేసుకున్నాయి. అతి పిన్న వయసులోనే అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన కెన్నెడీ, అచిర కాలంలోనే ప్రపంచ స్థాయి అగ్రనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తదనంతరం అమెరికాకు ఎంతో మంది అధ్యక్షులు వచ్చినప్పటికీ ఆయన కొచ్చిన గుర్తింపు ఇంతవరకు మరెవ్వరికీ రాలేదనవచ్చేమో! అగ్రరాజ్యంగా అమెరికా ఆయన నేతృత్వంలోనూ, ఆ తరువాత కాలంలోనూ వెలుగొందుతున్న నేపధ్యంలో, మరో అగ్ర రాజ్యంగా, అమెరికాకు పోటీగా వున్న సోవియట్ యూనియన్‌కు ప్రధాన మంత్రిగా నికితా కృశ్చేవ్ వుండేవారు. జర్మనీ ఐక్యత కొరకు కృశ్చేవ్ నిరంతరం కృషి చేసేవారు. ఆ దిశగా అమెరికాకు, ఇంగ్లాండుకు, ఫ్రాన్స్ దేశానికి ఒక అల్టిమేటం కూడా ఇచ్చారు.

          చార్లెస్ డి గాలె ఫ్రాన్స్ ఐదవ గణతంత్ర రాజ్య వ్యవస్థాపకుడి గాను, ఆ దేశానికి అధ్యక్షుడి గాను, ఫ్రెంచ్ సైన్యాధినేతగాను, ప్రముఖ రాజనీతిజ్ఞుడిగాను, ఆ రోజుల్లో యావత్ ప్రపంచానికి చిరపరిచితుడు. ఫ్రెంచ్ రిపబ్లిక్ స్థాపన జరగడానికి చాలా కాలం క్రితమే, ఆ దేశానికి, 1945 లోనే ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి కారణ భూతుడు డి గాలె. నాటో సైనిక కూటమి నుంచి ఫ్రాన్స్ దేశాన్ని ఉపసంహరించుకోవడమే కాకుండా, ఐరోపా సమాజంలో బ్రిటన్ దేశానికి ప్రవేశం కలగకుండా వీటో అధికారాన్ని ఉపయోగించిన వ్యక్తి డి గాలె. అమెరికా, సోవియట్ యూనియన్ దేశాల మధ్య సమతుల్యం పాటించుకుంటూ, ఒక పటిష్టమైన దేశంగా ఫ్రాన్స్ ను అభివృద్ధి చేయాలన్న విషయంలో డి గాలె ఎన్నడూ రాజీపడలేదు.


అలాగే...ఇజ్రాయిల్ కు చెందిన గోల్డా మీర్, బెన్ గ్యూరియన్ లు. ఆ దేశ నాల్గవ ప్రధాన మంత్రిగా అధికారంలో వున్న గోల్డా మీర్ ను ఇజ్రాయిల్ రాజకీయాలలో "ఐరన్ లేడీ" గా అభివర్ణించే వారు. గోల్డా మీర్ అనేక మంది ప్రపంచ నాయకులను కలిసి ఆమె కలలు కన్న రీతిలో, మధ్య ప్రాచ్య ప్రాంతంలో శాంతి స్థాపనకు కృషి చేశారు. ఆమెకు ముందు ప్రధానిగా పని చేసిన డేవిడ్ బెన్ గ్యూరియన్ ఇజ్రాయిల్ రాజనీతిజ్ఞుడిగాను, జాతి పిత గాను ప్రసిద్ధికెక్కాడు. అరబ్-ఇజ్రాయిల్ యుద్ధంలో తన దేశానికి నాయకత్వం వహించడమే కాకుండా, వివిధ జ్యూయిష్ సైనిక సంస్థలను, ఇజ్రాయిల్ సైన్యాన్ని కలిపి సమైక్యంగా పోరు సల్పారు.

          యుగోస్లేవియా విప్లవకారుడిగా, ఆ దేశ రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందిన మార్షల్ టిటో, చనిపోయేంత వరకు వివిధ హోదాలలో తన దేశానికి ఎనలేని సేవ చేశాడు. నెహ్రూ, నాజర్, ఎన్ క్రుమా, సుకర్ణో లతో కలిసి అలీనోద్యమ ప్రధాన నాయకుడిగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. అలీనోద్యమ ప్రప్రధమ సెక్రటరీ జనరల్ గా ఆయన ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా తిరుగులేని నాయకుడని పేరు తెచ్చుకున్నాడు. ఇక గమాల్ అబ్దుల్ నాజర్ విషయానికొస్తే...ఆయన, ఈజిప్ట్ దేశానికి రెండవ అధ్యక్షుడిగా చనిపోయేంత వరకు వున్నారు. అగ్ర రాజ్యాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, "సూయజ్‌ కెనాల్ కంపెనీ" ని జాతీయం చేయడంతో ఈజిప్ట్ లోను, మొత్తం అరబ్ ప్రపంచంలోను తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందాడు. సిరియాతో కలిసి "యునైటెడ్ అరబ్ రిపబ్లిక్" ను స్థాపించాడాయన. ఆయన మరణం ప్రపంచ నాయకులనెందరినో కదిలించింది. యావత్ అరబ్ ప్రపంచానికి చెందిన నేతలు ఆయన అంత్య క్రియలకు హాజరయ్యారు. జోర్డాన్ రాజు హుస్సేన్, పాలస్తీనా విమోచనోద్యమ నాయకుడు యాసర్ అరాఫత్ బహిరంగంగా కంట తడి పెట్టుకున్నారు. లిబియాకు చెందిన కల్నల్ గడాఫి ఉద్వేగంతో రెండు పర్యాయాలు స్పృహ తప్పి పడిపోయాడు!

          "పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా" ప్రప్రధమ ప్రధాన మంత్రిగా చౌ-ఎన్-లై చనిపోయేంతవరకు పదవిలో కొనసాగారు. కొరియా యుద్ధం నేపధ్యంలో, పశ్చిమ దేశాలతో శాంతి కొరకు ఆయన పాకులాడాడు. అమెరికాతో, తైవాన్‌తో, సోవియట్ యూనియన్‌తో, భారత దేశంతో, వియత్నాంతో తలెత్తిన సంఘర్షణల నేపధ్యంలో, చౌ-ఎన్-లై సామరస్య పూరకంగా సమస్యలను పరిష్కరించుకునే దిశగా కొన్ని విధాన పరమైన నిర్ణయాలను తీసుకున్నాడు. ఆయన మెంటర్...నాయకుడు, మావో సేటుంగ్ 1949 లో "పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా" వ్యవస్థాపకుడు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులలో మావో ఒకరు. మార్క్స్, లెనిన్‌ల సరసన కమ్యూనిజాన్ని వ్యాపింప చేయడంలో కృషి చేసిన త్రిమూర్తులలో ఆయనొకరు. ప్రపంచ చరిత్రకు ఆయన చేసిన తోడ్పాటు చరిత్ర గతినే మార్చిందనాలి.

పాలస్తీనా నాయకుడిగా, పాలస్తీనా విమోచన సంస్థ అధ్యక్షుడిగా యాసర్ అరాఫత్ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. పాలస్తీనా జాతీయ అథారిటీకి ప్రధమ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. పాలస్తీనా స్వయం ప్రతిపత్తి కొరకు తన జీవితాంతం ఇజ్రాయిల్‌తో ఆయన పోరాటం సాగించాడు. అసలు ఇజ్రాయిల్ ఉనికే వద్దన్న అరాఫత్ ఆ తరువాత రాజీపడి, ఐక్య రాజ్య   సమితి తీర్మానానికి అనుగుణంగా తన విధానాన్ని మార్చుకున్నాడు. శ్రీలంక ప్రధానిగా సిరిమావో బండారు నాయిక ఎన్నో సార్లున్నారు. ప్రధానిగా పనిచేయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

          విల్లీ బ్రాండ్ట్ జర్మనీ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, రాజనీతిజ్ఞుడు. 1969-1974 మధ్య కాలంలో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఛాన్స్ లర్‍ గా పనిచేశారు. పశ్చిమ జర్మనీ, సోవియట్ అనుకూల దేశాల మధ్య సయోధ్య కుదిరించడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, విల్లీ బ్రాండ్ట్ కు నోబెల్ శాంతి బహుమానం లభించింది. ఇండోనేషియా ప్రధమ అధ్యక్షుడిగా పనిచేసిన సుకర్ణో, ఆ పదవిలో 22 సంవత్సరాల పాటు కొనసాగారు. ఇండోనేషియాను వామపక్ష భావాల దిశగా మళ్లించి, ఇండొనేషియన్ కమ్యూనిస్ట్ పార్టీకి తన పూర్తి మద్దతిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో తన దేశానికి ప్రాముఖ్యత-గుర్తింపు తెచ్చేందుకు, సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా మూడో ప్రపంచ దేశాలను కూడగట్టాడాయన. అలీనోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు.


క్వామే ఎన్ క్రుమా ఘనా దేశానికి తిరుగులేని నాయకుడుగా వుండేవారు. బ్రిటీష్ వలస రాజ్యంగా వున్న ఘనాకు స్వాతంత్ర్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించిన ఎన్ క్రుమా ఆ దేశానికి ప్రధమ అధ్యక్షుడి గాను, ప్రధమ ప్రధాన మంత్రి గాను పనిచేశారు. ఆఫ్రికన్ యూనిటీ సంస్థ వ్యవస్థాపకుల్లో ఆయనొకరు. లో లెనిన్ శాంతి బహుమతిని అందుకున్నారు ఎన్ క్రుమా. వియత్నాం కమ్యూనిస్ట్ విప్లవ నాయకుడిగా ప్రసిద్ధికెక్కిన హో చి మిన్ ఆ దేశాధ్యక్షుడిగా, ప్రధాన మంత్రిగా పనిచేశారు. వియత్నాం స్వాతంత్ర్యం కొరకు పోరాటం సాగించిన హో చి మిన్, కమ్యూనిస్ట్ పాలనలోని వియత్నాం ప్రజాస్వామ్య రిపబ్లిక్ ను స్థాపించారు. ఫ్రాన్స్ దేశాన్ని ఓడించిన ఘనత ఆయనదే. ఎలిజబెత్ రాణి తర్వాత బహుశా ఎక్కువ కాలం అధికారంలో వున్న వ్యక్తి క్యూబాకు తిరుగులేని నాయకుడు ఫిడల్ కాస్ట్రోనే. లాటిన్ అమెరికాలో కాస్ట్రోను మించిన కమ్యూనిస్ట్ నాయకుడు మరొకరు లేరు. కమ్యూనిస్ట్ విప్లవ పంథాపై ఆయనకు గట్టి పట్టుంది. అప్పటి నుంచి తానే పదవిని ఆశించనని, చేపట్టనని ప్రకటన చేశారు. నెల్సన్ మండేలా గురించి ఎంత చెప్పినా తక్కువే. దక్షిణాఫ్రికా మహాత్మా గాంధీగా ఆయన్ను పిలిచేవారు. అలాంటి మహా నాయకులు అరుదుగా వుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే, గత కాలంలో ఇలాంటి మహా నాయకులు మరికొందరుండవచ్చు....ఏరీ అలాంటి నాయకులిప్పుడు?

2 comments:

  1. . . . . భారత దేశంతో, వియత్నాంతో తలెత్తిన సంఘర్షణల నేపధ్యంలో, చౌ-ఎన్-లై సామరస్య పూరకంగా సమస్యలను పరిష్కరించుకునే దిశగా కొన్ని విధాన పరమైన నిర్ణయాలను తీసుకున్నాడు. . . . .

    నాకు సరిగా అర్థం కాలేదు. అసలు 1962లో భారత్ పైన యుధ్ధం ప్రకటించిందే ఈ చౌ-ఎన్-లై మహాశయుడు కదా? తనే యుధ్ధానికి వచ్చి తనే శాంతికీ తహతహలాడా డంటున్నారా?

    పంచశీలపై చౌ-ఎన్-లై సంతకం చేసి ఆ తడి ఆరీఆరకముందే యుధ్ధానికి దిగినా మీరు ఆయన శాంతికాముకత్వాన్ని కీర్తిస్తున్నారే. నాకైతే నమ్మశక్యంగా లేదు.

    ReplyDelete
  2. . . . . గత కాలంలో ఇలాంటి మహా నాయకులు మరికొందరుండవచ్చు....ఏరీ అలాంటి నాయకులిప్పుడు? . . .

    వనం వారూ,
    ఇప్పటి నాయకుల గురించి రేపటితరాల్లోని చరిత్రవిద్యార్థులు చదువుకుంటారు లెండి. ఉన్నవీ తగుమాత్రం లేనివీ కలిపి పాఠాలు తయారు చేసి ఆసక్తికరంగా చదివిస్తుంటే అవి తప్పుల్రా పిల్లలూ అని సాధికారికంగా నమ్మకంగా చెప్పగల పెద్దలతరాలు దాటిపోయే దాకా ఆగాలి కదా అందమైన చరిత్రపాఠాలు సృష్టించి హడావుడి చేయటానికి?

    ReplyDelete