Sunday, October 15, 2017

అశోకవనంలో ప్రవేశించిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలానరసింహారావు
సూర్యదినపత్రిక (16-10-2017)

ప్రాకారం పైనుండి నలువైపులా తేరిపార చూసిన హనుమంతుడికి పెద్ద-పెద్ద చెట్లున్న అశోకవనం కనిపించింది. అక్కడింకా వెతకలేదుకనుక, వెతకాలనుకుంటాడు. అదెందుకు విడవాలనుకుంటాడు. తక్షణమే అష్ట వసువులకు, ఏకాదశ రుద్రులకు, సహస్ర ఆదిత్యులకు, సప్త మరుత్తులకు, అశ్వనీ దేవతలకు నమస్కరించి, తనపని చేసుకునిపోయి రావణుడి గర్వం అణుస్తాననుకుంటాడు. రాక్షసులందరినీ తన పరాక్రమంతో బాదించి, వారందరూ భోరున ఏడుస్తుంటే, సీతాదేవిని ఆమె భర్తవద్దకు చేరుద్దామనుకుంటాడు. ఈవిధంగా కొంచెంసేపాలోచించి, అశోకవనంలో సీత తప్పక వుంటుందని నిశ్చయించుకుని, ఉత్సాహంతో లేచి ధ్యానం చేస్తాడీవిధంగా: "రామచంద్రమూర్తికి నమస్కారం, లక్ష్మణస్వామికి నమస్కారం. విదేహ రాజపుత్రి, శ్రీరామ ధర్మ పత్ని సీతమ్మకు నమస్కారం. ధర్మరాజుకు, ఇంద్రుడికి, మరుత్తులకు, వాయువుకు, రుద్రులకు, సూర్యచంద్రులకు, సుగ్రీవుడికి నమస్కారం".....”నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చతస్యై జనకాత్మజాయై” అని వాల్మీకం.

(హనుమంతుడు లంకను జయించాడంటే యోగి దేహాన్ని జయించినట్లే. దేహం వశ పడగానే ఆత్మావలోకనం లభించదు. హనుమంతుడు సీత కొరకై వెతుకుతున్నప్పుడు మండోదరిని చూసి సీతని భ్రమిస్తాడు. అంటే ఆయన అన్వేషణలో, శోదించే సమయంలో, కనిపించిన ఆత్మ తేజస్సు లాంటి తేజస్సును "ఆత్మ"ని భ్రమించ కూడదు. మున్ముందు మిక్కిలి హెచ్చరికతో, నిష్కాముడై, జితేంద్రియుడై వెతకాలి. ఇలా వెతుకుతుంటే, స్వప్రయత్నం ద్వారానే కార్యం సాధ్యమౌతున్నదనే భావనంటే, అది తొలగి పోయే వరకు, ఆత్మ దర్శనం కలగదు. అందుకే కార్య సిధ్ధికై, సీత-రామ-లక్ష్మణులకు, మొక్కి, కార్యమారంభించినాడు. కాబోయే సీత దర్శనానికీ, జరిగిన రామ దర్శనానికీ, సుగ్రీవుడే కారణం కనుక ఆయనకూ నమస్కరించాడు. హనుమంతుడు సంపాతి (జటాయువు సోదరుడు) మాటలందు నమ్మకంతో రావణుడి అంతఃపురంలో సీతను వెతికినట్లే, సాధకుడు గురు వాక్యం మీద నమ్మకంతో, "దేహంలో ఆత్మాన్వేషణ" చేయాలి. కనపడక పోతే, ప్రయత్న లోపం జరిగిందనుకొని, నిరుత్సాహ పడకుండా, కనిపించే దాకా వెతకాల్సిందే!)

ఈవిధంగా సమస్త దేవతలకూ నమస్కరించి, దిక్కులన్నీ తేరిపార చూసి, అశోకవనం పైనే దృష్టి సారించాడు. అనేక రాక్షసుల కాపలాలో పరిశుభ్రంగా వుంచబడి, మిగిలిన అన్ని వనాలకంటే మనోహరంగా వున్న ఆ వనంలో, సీత వుండడం నిశ్చయమని భావిస్తాడు. అశోకవనాన్ని, అందులో చెట్లను కావలివారు బాగా రక్షిస్తున్నారు. అక్కడ వాయుదేవుడు మెల్లగా వీస్తున్నాడు. ఆ కారణాన సీత వుండే వుంటుందని అనుకుంటూ, తన దేహాన్ని మరింత చిన్నదిగా చేసి, సీతాన్వేషణలో నిమగ్నమౌతాడు మళ్లా.

మునులను, సామాన్య దేవతలను, ఇంద్రుడిని, బ్రహ్మను, వాయువును, అగ్నిని, చంద్రుడిని, సూర్యుడిని, వరుణుడిని, రుద్రుడిని, మరుత్తులను, అశ్వనీ దేవతలను, కనిపించీ, కనిపించని దేవతలందరినీ, సమస్త భూతాలను, పరాత్పరుడిని, భగవంతుడిని తనకార్యం సఫలమయ్యేటట్లుగా చూడాల్సిందని ప్రార్ధిస్తాడు హనుమంతుడు. "సీతాదేవి వున్నతమైన నాసికను, తెల్లని దంతాలను, చిరునవ్వు మొలకలతో అందమైన తామర రేకుల్లాంటి కళ్లను, చంద్రుడివంటి ముఖారవిందాన్ని, నేనెప్పుడు చూడగలనో! గుణహీనుడు, నీచుడు, పరమపాపి, క్రూరుడు, తులువ, నిర్దయుడు, సాధుసన్యాసి వేషాన్ని ధరించి రావణుడపహరించిన సీతను, పతివ్రతను, ఖిన్నురాలిని, భూపుత్రిని, శ్రీరామచంద్రమూర్తి దేవిని, స్త్రీలలో వుత్తమురాలిని నేనెట్లుచూస్తానోకదా" అనుకుంటాడు హనుమంతుడు. అనుకొని ఆశతో ఎదురుచూడసాగాడు.



దిగులుపడి, తేరుకుని, ఆలోచించిన హనుమంతుడు మెల్లగా ఆ వుద్యానవనంలోని ప్రాకారం మీదకు గెంతుతాడు. అక్కడ నిలబడి దేహమంతా పులకరిస్తుండగా శోకనాశి అయిన అశోకవనాన్ని తేరిపార చూసాడు. వసంతకాలం ఆరంభంలో పూలతో వికసించే కొమ్మలున్న చెట్లెన్నో వున్నాయక్కడ. మద్దులు, చీకటిమ్రాకులు, తక్కోలాలు, గిరికతాటిచెట్లు, ఉద్దాలకచెట్లు, అశోకచెట్లు, తియ్యమామిడిచెట్లు, సంపెంగలు, కోతిమూతికాయలున్న చెట్లు, అనేక ఇతర చెట్లతో ఆ వనం చూడచక్కగా వుంది. వాటిని చూసిన ఆంజనేయుడు అల్లెతాడు విడిచిన బాణంలా , సూటిగా, వేగంగా అక్కడకు పోతాడు. పక్షుల కిలకిలారావాలతో, బంగారు, వెండి చెట్లతో, ఆశ్చర్యం కలిగించే పక్షులతో, మృగాలతో, ఉదయభానుని పోలిన చిగుళ్లతో, పసరుకాయలతో, దోరపండ్లతో, ముదిరిన పండ్లతో, కోకిలల, తుమ్మెదల, నెమళ్ల ధ్వనులతో నిండిన అశోకవనాన్ని చూసాడు హనుమంతుడు. ఆయన అలికిడికి చెట్లపైనున్న పక్షులు నిద్రలేచి కిల-కిల కూయడం మొదలెట్టాయి.(పక్షులు నిద్ర లేచాయంటే హనుమంతుడు కోతిరూపంలో చెట్టు మీదినుండి చెట్టు మీదికి దాటుతూ, కాపలా వున్న రాక్షసుల కంట బడకుండా, సీత తప్పక మేలుకునే వుంటుందని భావించి ఆమెను వెతకసాగాడని అర్ధమౌతున్నది)

హనుమంతుడు ఒక చెట్టు మీదినుండి మరో చెట్టు మీదికి దూకటంతో, ఆ అలికిడికి, కొమ్మలు కదిలి, పక్షులు లేచి, కిలకిల కూస్తూ, ఆకాశానికి ఎగిరిపోతుంటే, వాటి రెక్కల తాకిడికి, జలజలా రాలిన పూలనడుమనున్న అతడు పూలకొండలా కనిపిన్చాడు. భూతకోటికాతడు వసంతుడిలా, చెట్లపైనుండి రాలిన పూలతో నిండిన భూమి అలంకరించుకున్న స్త్రీలా వున్నాడప్పుడు. ఆయన వేగంతో కదిలిన చెట్లు హనుమంతుడి మీద పూలవాన కురిపించడంతో పాటు-పూలు, పండ్లు, ఆకులు రాలిపోసాగాయి.(పుష్ప వృష్టి, అలంకృత స్త్రీ దర్శనం శుభ శకునాలు)

రాలిన ఆకులతో, నేలరాలిన పూలతో, పండ్లతో నిండిన ఆ చెట్లు, సమస్తం ఓడిన చెడు జూదరిలా వున్నాయి. పక్షులన్నీ ఎగిరిపోగా, బోదెలుమాత్రమే వున్న చెట్లు, అందరూ వదిలిపెడ్తే మిగిలిపోయిన మానవుడిలా, సేవించ తగనివిగా వున్నాయి. లంకకు, అశోక వనానినికి రాబోయే దుస్థితిని సూచిస్తున్నాయా అన్నట్లున్నాయి. వనభంగం, లంకా వైధవ్యానికి సూచనగా మిగిలాయా చెట్లు. 

No comments:

Post a Comment