Sunday, October 29, 2017

సీతాదేవిని చూసి తర్కించుకుంటున్న హనుమంతుడు ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

సీతాదేవిని చూసి తర్కించుకుంటున్న హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (30-10-2017)

మాసిన చీరతో, ధైర్యం చెడిన మనస్సుతో, ఆహారం తీసుకోనందున శుష్కించిన దేహంతో,  నిట్టూర్పులతో, ఈమె సీతేనని గుర్తించలేని దేహకాంతితో, బాధిస్తున్న రాక్షస స్త్రీలమధ్యన కనిపించిందొక సుందరి హనుమంతుడికి. చంద్రుడి లాంటి కోమలమైన దేహంకల ఆ స్త్రీ, హోమధూమంతో కప్పబడి, అగ్నిశిఖలా అందంచెడి, మిక్కిలి బాధపడ్తూ కనిపించింది. పదినెలలుగా స్నానం లేక దుమ్ముతో మునిగిన దేహంతో, తామరపూలులేని కొలనులా, ఒంటి చీరెతో, దుఃఖంతో, శుష్కించిపోయి, అంగారకుడు పట్టుకున్న కాంతి విహీనమైన రోహిణిలాగుంది. కన్నీళ్లు కాలువలు కారుతూ ముఖమంతా ఆవరించి, దుఃఖంతో శోషించి, వెక్కి, వెక్కి ఏడుస్తూ, రాక్షస స్త్రీసమూహాలనే చూస్తూ, ఒంటరిగా, వేటకుక్కలకు చిక్కిన ఆడజింకలా అల్లాడుతూ, నడుంవరకు వ్రేలాడుతున్న నల్లటి త్రాచుపాములాంటి ఒంటి జడతో, శరత్కాలోదయాన కారడువుల్లోని భూమిని పోలి, స్నానంలేనందువల్ల సంపూర్ణంగా మాసిన దేహంతో వున్న స్త్రీని చూసాడు హనుమంతుడు. ఆమెను చూస్తున్టే: ఇంతవరకు దిగులంటే ఏంటో తెలియనిదానిలా, ఇప్పుడు తీవ్రమైన దిగులుతో మాడిపోతున్నదానిలా, మిక్కిలి సుఖానికి యోగ్యమైన దానిలా, మిక్కిలి దుఃఖంపడే స్త్రీలా అనిపించింది హనుమంతుడికి.

ఆహారంలేకుండా శుష్కించి, పదినెలలుగా స్నానం చేసినదానిలాలేని, మాసిన దేహంతోవున్న ఆ స్త్రీ, సీతేనా అని తర్కించుకుంటాడు హనుమంతుడు. ఆమె సీతాదేవేనని నిశ్చయించుకోవటానికి కారణాలు వెతుకుతాడు. ఆనాడు ఋశ్యమూకపర్వతం పైనుండి రావణుడు అపహరించుకుని పోతున్నప్పుడు చూసిన సుందరరూపాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు మొదలు. ఆ రూపమే ఈమెలో కనిపిస్తున్నదికదా అని మరల-మరల చూస్తాడు నిర్ధారణగా (ఈవిధంగా పోల్చి చూడటాన్నే "ప్రత్యభిజ్ఞ" అంటారు). ఆనాటి ఆస్త్రీరూపాన్ని గుర్తుతెచ్చుకుంటూ, ఇప్పుడు తనుచూస్తున్న స్త్రీని ఆ రూపంతో పోల్చుకుంటూ, ఆమెను వర్ణించుకుంటాడిలా: "పూర్ణచంద్రుడిలాంటి ముఖం, అందమైన కనుబొమ్మలు, వట్రువలగు స్తనాలు, పొడవైన నల్లటి వెంట్రుకలు, చీకటిని హరించే దేహకాంతి, దొండపండులాంటి పెదవులు, సింహం నడుములాంటి సన్నని నడుము, తీర్చిదిద్దిన పాదాలు, తామర రేకుల్లాంటి కళ్లు, రతీదేవిని పోలిన సౌందర్యం, సర్వజనులకు అభీష్టమైన చంద్రుడిలాంటి ముఖం, తపస్సు చేసుకునేదాని పోలికలు, తివాచీలు, చాపలు లేకపోవడంతో నిలబడేవున్న ఆకారం, పొగనిండిన అగ్నిలా తాపంతో సోంపు తగ్గిన వన్నె, అసత్యంలాంటి అపకీర్తి కారణాన ఆశచెడినదాని రూపంతో, బుసకొట్తున్న ఆడపాములా నిట్టూర్పులు విడుస్తూ" వున్నదామె.


ఆమెలో "స్థిరపడని, కుదుటపడని శ్రధ్ధ; సందేహం కలిగించే స్మృతి వాక్యమ్; క్షయించిన సంపద; కల్మషంతో కూడిన బుధ్ధి; విఘ్నమైనకార్యఫలంలో వుండే లక్షణాలను" చూస్తాడు హనుమంతుడు. శ్రీరామచంద్రుడి జాడ తెలియక పరితపిస్తూ, రావణుడి చేజిక్కి దిగులుపడుతూ, భర్త రాకపోతాడా అని నాలుగు దిక్కులు పరికించి చూస్తూ, ఒంటరిగా చిక్కి బెదురు చూపులు చూసే ఆడలేడి కళ్లలాంటి కళ్లతో, కన్నీరు కాల్వలై పారగా కనురెప్పలు తెరుస్తూ, మూస్తూ, వాడిపోయిన ముఖంతో దుఃఖిస్తూ, వేడి నిట్టూర్పులు వెంట-వెంట విడుస్తూ, దుమ్ములో మునిగిన దేహంతో, శోకంతో మలమల మాడుతూ కనిపించిందామె. శ్రేష్టమైన అలంకారాలకు అర్హురాలైనప్పటికీ, ఆభరణాలేవీ ఒంటిమీద లేనేలేవు. మేఘాల చాటునున్న చంద్రుడిలా ప్రభమాసి వుంది. అలవాటు తప్పి మతిమరుపుతో చదువుతున్నదానిలా వుంది. మాట్లాడే మాటలు వ్యాకరణ శుద్ధంకాకుండా వేరే అర్థం వచ్చేరీతిలో వున్నాయి. ఇలాంటి ఆమెను చూసిన హనుమంతుడు, ఈమె సీత కాదేమో, అవునేమో, లేక, రావణుడు బలాత్కారంగా తెచ్చిన స్త్రీలలో ఒకతేమో అనుకుంటాడు. సందేహం మాని, ఈమె సీతేనని నిర్ధారించుకుంటాడు. తన నిర్ణయానికి తానే కారణాలు వెతుక్కుని తృప్తి పడతాడు. తన నిర్ణయం సబబేనని తీర్మానించుకుంటాడు. 

(సీతాదేవి అని నిశ్చయించుకోవడానికి తగిన కారణాలను వెతుకుతున్న  హనుమంతుడికి తాను చూస్తున్న స్త్రీ ఎలావుందో వర్ణించుకుంటాడు. ఆమె తపస్సు చేసుకుంటున్న స్త్రీ లాగా వుందనీ, కుదుటపడని శ్రధ్ధ ఆమెలో కనిపించిందనీ, సందేహం కలిగించే స్మృతి కలదనీ భావిస్తాడు. తపస్సు చేసుకుంటున్న స్త్రీ లాగా వుందంటే, అది ఆమె జితేంద్రియత్వాన్నీ, భోగవిరాగాన్నీ, తెలియ చెప్పడమే. బుసకొడ్తున్న ఆడపామని అనడమంటే, పామును చేరదీసిన వాడు జీవించ లేనట్లే ఆమెను తెచ్చినవాడూ జీవించడని అర్థం. పొగక్రమ్మటంతో తెలియని అగ్నిలా వుందనడమంటే, పైన కాంతి కనబడకున్నా మనస్సు అగ్నిలా పరిశుధ్ధమైనదని అర్థం. అసత్యమైన అపకీర్తితో చెడినదంటే, ఈమెమీద నింద ఆరోపించిన వారు అసత్యవాదులని అర్థం.

కుదుటపడని శ్రధ్ధ: శాస్త్రాలలో చెప్పిన విధంగా ఫలానా పని చేస్తే ఫలానా ఫలితం కలుగుతుందన్న నమ్మకానికే "శ్రధ్ధ" అంటారు. ఆ శ్రధ్ధ ధృడంగా కుదరకపోతే, శాస్త్ర ప్రకారం చేయాలా-వద్దా? ఫలితం వస్తుందో-రాదో? అన్న మీమాంసలో పడిపోవడం జరుగుతుంది. సందేహం కలిగించు స్మృతి: ఇది హనుమంతుడి సందేహాన్నే తెలుపుతుంది. సీతాదేవి స్థితి ఇలావున్నని తెలుసుకోవాలి. ఐశ్వర్యవంతుడు దరిద్రుడైపోతే, వేషం-భాష మారిపోతుం. లోగడ చూసినప్పుడులాగా ఇప్పుడు వుండకపోవచ్చు. వేషం-భాష మారడంతో వాడు వీడేనా అన్న సందేహం కలుగుతుంది. బుధ్ధి నిష్కల్మశమై వుంటేనే నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. కల్మశంతో కూడినప్పుడు యదార్ధ జ్ఞానం కలగదు. సందేహమే తోస్తుంది. విఘ్నం చేసిన కార్యఫలమంటే: ఏదైనా కార్యం చక్కగా చేస్తే ఫలహానిలేదు. అదే విఘ్నమైపోతే ఆపని చేసినవాడికి ఫలితం ప్రాప్తించదు. అదేవిధంగా సీత.  సీతాత్వానికి ఏ విధమైన హాని లేదు. అయినా ఆమె సీతే అని తెలుసుకోలేని లోపం ఆ మూడుఢిదె. ఆత్మావలోకమవడానికి ముందర, ఆత్మ జ్యోతి లాగా కనిపించిన వెలుతురుని చూసి భ్రమ పడ కూడదు. మండోదరిని చూసి హనుమంతుడు సీతని భ్రమ పడినట్లు పడకూడదు. అదే ఆత్మని సంతోషిస్తే, భ్రష్టుడవుతాడు. ఆచార్యలక్షణం....శాస్త్రాలు చెప్పిన పధ్ధతిలో ఆలోచించి, స్వబుధ్ధితో తర్కించి, వూహించి, నిశ్చయించుకోవాలి. అదే చేస్తున్నాడు హనుమంతుడు.)

No comments:

Post a Comment