Monday, October 23, 2017

ఐక్య రాజ్య సమితి ఆవిర్భావం-పురోగతి :వనం జ్వాలా నరసింహారావు

ఐక్య రాజ్య సమితి ఆవిర్భావం-పురోగతి
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (24-10-2017)

          ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యదేశ హోదా దక్కాలంటే వీటో హక్కు కావాలని కోరరాదని అమెరికా సూచించిందని వార్తలొచ్చాయి. ప్రస్తుతం అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా దేశాలకు మాత్రమె వీటో హక్కుంది. ఒకవైపు ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు రావాలని చెప్తున్న అమెరికా తన దేశానికి మాత్రం వీటో హక్కుండాలి కాని ఇతరులకు వుండరాదని అనడం హాస్యాస్పదం. ఈ నేపధ్యంలో ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం, పురోగతి, ఒడిదుడుకుల గురించి తెలుసుకుంటే ఆసక్తికరమైన విషయాలు అవగతమౌతాయి.
అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక-సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమిష్టి కృషి లాంటి కార్యక్రమాలను చేపట్టి అమలు చేసేందుకు, ప్రపంచవ్యాప్తంగా వున్న పలు దేశాలు, సమష్టిగా ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితి. ప్రధమ ప్రపంచ సంగ్రామం ముగిసిన తర్వాత, ఏర్పాటు చేసుకున్న నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో విఫలం కావడంతో, దానికి ప్రత్యామ్నాయంగా, 1945లో ఐక్య రాజ్య సమితి స్థాపన జరిగింది. ప్రస్తుతం ఐక్య రాజ్య సమితిలో 193 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. సర్వ ప్రతినిధి సభ, భద్రతా మండలి, సచివాలయం, ధర్మ కర్తృత్వ మండలి, ఆర్థిక-సాంఘిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం ఐక్య రాజ్య సమితిలోని 6 ప్రధాన అంగాలు. సర్వప్రతినిధి సభలో ఐక్య రాజ్య సమితిలో చేరిన అన్ని దేశాలకు సమాన సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్లకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి యాంటోనియా గ్యూతెరాస్.
          రెండవ ప్రపంచ యుద్ధం ఇంకా జరుగుతున్న సమయంలోనే, 1941 ఆగష్టులో అమెరికా అధ్యక్షుడు థియోడోర్ రూజ్‌వెల్ట్, బ్రిటిష్ ప్రధాని విన్‌ స్టన్ చర్చిల్ అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశమై అట్లాంటిక్ ఛార్టర్ అనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రాదేశిక సమగ్రత కాపాడడం, యుద్ధ భయాన్ని తొలగించడం, శాంతిని నెలకొల్పడం, నిరాయుధీకరణ వంటి ఎనిమిది అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందమే తరువాత ఐక్య రాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందింది. తరువాత 1944లో వాషింగ్టన్ లోని డంబార్టన్ ఓక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి ప్రకటన పత్రం ముసాయిదాను రూపొందించారు. దరిమిలా, 1945 ఫిబ్రవరిలో యాల్టా సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా నేతలు ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించాలని తీర్మానం చేశారు. ఆ తర్వాత చైనా, అలనాటి సోవియట్ యూనియన్-నేటి రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అమెరికా దేశాలు ఈ సమావేశం ఆధారంగా తయారుచేసిన ఛార్టర్‌కు ఆమోదముద్ర వేశాయి. నేటి వరకూ ఆ ఐదు దేశాలు భద్రతామండలిలో శాశ్వత  సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో 1945 ఏప్రిల్ 25నుండి జూన్ 26 వరకు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో 50 దేశాల ప్రతినిధులు పాల్గొని ఐక్య రాజ్య సమితి ఛార్టర్‌పై సంతకాలు చేశారు. 1945 అక్టోబర్ 24న న్యూయార్క్ నగరంలో ఐక్య రాజ్య సమితి లాంఛనంగా ప్రారంభమైంది.
          ఐక్య రాజ్య సమితికి వున్న ఆరు ప్రధానాంగాలలో సర్వప్రతినిధి సభకు అత్యంత ప్రాముఖ్యముంది. సమావేశాలకు ప్రతి సభ్యదేశం గరిష్టంగా ఐదుగురు సభ్యులను ప్రతినిధులుగా పంపవచ్చు. ఈ సభ సంవత్సరానికి ఒక పర్యాయం, సాధారణంగా సెప్టెంబరు మాసంలో, సమావేశమౌతుంది. సభ్యదేశాలు ఎన్నుకున్న వ్యక్తి సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అన్ని రంగాలలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం దీని కర్తవ్యం. సర్వప్రతినిధి సభతో సమానంగా, ఆ మాటకొస్తే ఒకవిధంగా అధికంగా సమితిలో ప్రాధాన్యత వున్న మరో అంగం భద్రతా మండలి. సమితి ప్రారంభమయ్యేనాటికి ఇందులో సభ్యదేశాల సంఖ్య 11. ప్రస్తుతం 15 సభ్యదేశాలున్నాయి. అందులోని శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం వుంటుంది. సమితి ప్రారంభమైనప్పటి నుంచి ఇందులో ప్రధానమైన రెండు మార్పులు చేశారు. ప్రారంభంలో ఆరు తాత్కాలిక సభ్యదేశాలుండగా దాని సంఖ్యను దరిమిలా పదికి పెంచారు. నేషనలిస్ట్ చైనా స్థానంలో కమ్యూనిస్ట్ చైనాకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. తాత్కాలిక సభ్యదేశాలను సాధారణ సభ ఎన్నిక చేస్తుంది. ఏ దేశం కూడా వరుసగా రెండు పర్యాయాలు ఎన్నిక కాకూడదు. భద్రతా మండలి ఆదేశాలను పాటించని సభ్య దేశాలపై అది ఆంక్షలు విధిస్తుంది. సైనిక చర్య కూడా చేపట్టే అధికారముంది.
          మూడో అంగం సచివాలయం. ఐక్యరాజ్యసమితి సచివాలయ కార్యాలయం సమితి వ్యవహారాలు నిర్వహించే కార్యనిర్వాహక విభాగం. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. సచివాలయ ప్రధానాధికారిని సెక్రటరీ జనరల్ అంటారు. సమితికీ-దాని వివిధ విభాగాలకు, అనుబంధ సంస్థలకు కావాల్సిన సమాచారం, అధ్యయనం, సదుపాయాలు వంటి విషయాలు సచివాలయం అధ్వర్యంలోనే నిర్వహించబడతాయి. నాలుగో అంగం ధర్మ కర్తృత్వ మండలి. కొన్ని పాశ్చాత్య దేశాల వలస పాలన క్రింద కొనసాగిన భూభాగాల ప్రయోజనాలను కాపాడడం ఈ మండలి లక్ష్యం. ఇక్కడి ప్రజలను స్వీయ ప్రతిపత్తికి లేదా స్వయం పాలనకు లేదా స్వాతంత్ర్యానికి సిద్ధం చేయడం ఈ మండలి బాధ్యత. ఇది సంవత్సరానికి రెండు సార్లు సమావేశమవుతుంది. ఐదోది ఆర్థిక, సాంఘిక మండలి. ఇది సాధారణ సభ అధ్వర్యంలో పని చేస్తుంది. ఇందులో 54 మంది సభ్యులుంటారు. ఈ మండలి ఏటా రెండుసార్లు సమావేశమవుతుంది. ప్రజల జీవన స్థాయిని మెరుగు పరచడం, విద్య, సాంస్కృతిక, ఆరోగ్య రంగాలలో అంతర్జాతీయ సహకారానికి కృషి చేయడం, మానవ హక్కులను సమర్థించడం వంటివి ఈ మండలి ఆశయాలు. ఇక చివరిది-ఆరోది అంతర్జాతీయ న్యాయస్థానం. దీనిని సాధారణంగా "ప్రపంచ న్యాయస్థానం" అని అంటారు. ఐక్యరాజ్యసమితి యొక్క ప్రాధమిక తీర్పులను ప్రకటించే అంగం ఇది.
          ప్రత్యేక ఒప్పందాల ద్వారా ఏర్పడిన ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థలు అంతర్జాతీయ ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా, వైద్య రంగాలలో పని చేస్తుంటాయి. ఐక్య రాజ్య సమితి అంగాలలో ఒకటైన "ఆర్ధిక, సామాజిక మండలి" ఈ అనుబంధ సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఇందులో యునెస్కో-ఐక్య రాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ ప్రధానమైంది. విద్య, విజ్ఞానం, సంస్కృతి రంగాలలో అంతర్జాతీయ సహకారానికి, ప్రగతికి, శాంతియుత సంబంధాలకు ఈ సంస్థ కృషి చేస్తుంది. ప్రపంచ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కావలసిన శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధిని యునెస్కో ప్రధానంగా ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం న్యూఢిల్లీ, కైరో, జకార్తా, మాంటివిడియో, వెనిస్ లలో కార్యాలయాలున్నాయి. ప్రస్తుతం యునెస్కో లో 193 దేశాలకు సభ్యత్వం ఉంది.


          ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి లేదా ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి-యునిసెఫ్, లేదా, ఐక్య రాజ్య సమితి బాలల నిధి అభివృద్ధి చెందుతున్న దేశాలలో పిల్లలు, వారి తల్లుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి కృషి చేస్తుంది. ఐక్య రాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం-యుఎన్డిపి అనే మరో సంస్థ అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటి సంపదను వృద్ధి చేసుకొనేందుకు అవసరమైన శిక్షణ, వైజ్ఞానిక సహాయ కార్యక్రమాలకు నిధులు సమకూరుస్తుంది. ఐక్య రాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం-యుఎన్ఇపి, స్వీడన్ రాజధాని స్టాక్‌ హోమ్ లో, ఆహార, వ్యవసాయ సంస్థ-ఎఫ్‍ఏ‍ఓ ప్రధాన కార్యాలయం రోమ్ నగరంలో వున్నాయి. పౌష్టికాహారం అందించడం, జీవన ప్రమాణాలు మెరుగు పరచడం, గ్రామీణ ప్రజల స్థితిగతులను అభివృద్ధి చేయడం, ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిని, పంపిణీని మెరుగు పరచడం ఆహార, వ్యవసాయ సంస్థ లక్ష్యాలు. అంతర్జాతీయ కార్మిక సంస్థ-ఐఎల్ఓ కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండు దేశం జెనీవాలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికుల జీవన ప్రమాణాలు స్థాయిని పెంపొందించడానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. 1969లో ఈ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
          జెనీవాలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యు‍హెచ్‍ఓ, కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండు దేశం జెనీవాలో దీని ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందించడం, అంటు వ్యాధుల నివారణ ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. అందుకోసం వైద్య పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. మలేరియా, క్షయ, మశూచి వంటి వ్యాధులను నిర్మూలించడానికి ఈ సంస్థ కృషి చేసింది. ఐక్య రాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ-యునిడో, అభివృద్ధి చెందుతున్న, బాగా వెనుకబడిన దేశాల పారిశ్రామికీకరణకు, సంబంధిత పాలసీలకు ఈ సంస్థ సహకరిస్తుంది. ఇలాంటివే మరికొన్ని అంతర్జాతీయ సంస్థలున్నాయి.
          అఫ్గానిస్తాన్‍ నుంచి 1989 లో సోవియట్ సేనల ఉపసంహరణ విషయంలోను, 1992 లో కాంబోడియాలో యుద్ధ విరమణ పర్యవేక్షణ సందర్భంలోను, 1989 లో నికార్‍గుహలో ఎన్నికల పర్యవేక్షణ వ్యవహారంలోను, కాంగో విషయంలోను, సైప్రస్ వ్యవహారంలోను, ఇరాక్-ఇరాన్ యుద్ధంలో మిలిటరీ అబ్జర్వర్‌గా వ్యవహరించే విషయంలోను, ఇలాంటి మరి కొన్ని సందర్భాలలోను ఐక్య రాజ్య సమితి పాత్ర చెప్పుకో దగ్గది.  అదే విధంగా డిసెంబర్ 10, 1948 న సమితి ఆమోదించిన విశ్వవ్యాప్త మానవ హక్కుల పరిరక్షణ తీర్మానం, ఐక్య రాజ్య సమితి తీసుకున్న నిర్ణయాలలో అత్యంత ప్రాముఖ్యమైంది గా చెప్పుకోవాలి. ప్రతి ఏడాది ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల దినంగా జరుపుకుంటున్నాం.

          ఉత్తర కొరియా, అమెరికా దేశాధినేతలు ఒకరిపై మరొకరు కారాలు-మిరియాలు చల్లుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఒక వేల మరో ప్రపంచ యుద్ధానికి వారి కయ్యం దారితీస్తే ఐక్యరాజ్య సమితి పాత్ర ఎలా వుండబోతుండో ఉహించడం అంత సులభం కాదు. అవునన్నా-కాదన్నా ఐక్యరాజ్య సమితి అమెరికా కీలుబోమ్మే ఒక విధంగా. 

No comments:

Post a Comment