Sunday, October 1, 2017

సీతాదేవి కనపడలేదని ప్రాణత్యాగం చేద్దామనుకున్న హనుమంతుడు ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలానరసింహారావు

సీతాదేవి కనపడలేదని ప్రాణత్యాగం చేద్దామనుకున్న హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలానరసింహారావు
సూర్యదినపత్రిక (02-10-2017)

సీత కనపడలేదని చెప్తే కీడు తప్పదు...చెప్పకపోతే దోషం కల్గుతుంది....అంటే, చెప్పినా, చెప్పకున్నా కీడే! చెప్పాల్నా? వద్దా? అన్న మీమాంసలో పడ్తాడు హనుమంతుడు. ఏవిధంగా ఆలోచనచేసినా ఆయన మనస్సు కుదుటపడలేదు. ఒక ఆలోచన చేస్తుంటే, దాన్ని బాధించే ఆలోచన మరోకటి వస్తున్నది. ఇలాంటి సందర్భాలలో కాలానుగుణమైన, యోగ్యమైన నీతి ఏమిటా అని మరీ-మరీ ఆలోచించ సాగాడు. తాను కిష్కిందకు పోతే కలిగే లాభమేంటి? సముద్రం దాటడం, లంకలో ప్రవేశించడం, సీతను వెతకడం, రాక్షస ముఖ్యులను చూడడం, ఇవన్నీ వ్యర్ధమైపోయి, సీతను చూడకుండా అక్కడకు పోతే, పుణ్యమా? పురుషార్ధమా? అని తలపోస్తూ, అనుకుంటాడీవిధంగా:

         "నేను పోయి సీత కనబడలేదనగానే, వానరులు, సుగ్రీవుడు, రామలక్ష్మణులు నన్నేమంటారు? లేనివస్తువు కనిపించలేదంటే దండిస్తారా? దండించక పోవచ్చునేమోకాని, ఆమాట విన్నంతనే శ్రీరాముడు ప్రాణం విడవడానికి సిధ్ధపడతాడు. చెవుల్లో కరిగించి పోసిన సీసంలాంటి మాటలువిని ఇంకా ప్రాణాలతో ఎలావుండ కలుగుతాడు?"

         "రామచంద్రమూర్తి మరణించాలని నిశ్చయించుకోగానే, అంతకు ముందే ఆయనపై అత్యంత ప్రేమున్న లక్ష్మణుడు రాముడి మరణవార్త వినడానికి ముందే, ప్రాణాలు తీసుకుంటాడు. అన్న-తమ్ములు మరణించారని తెలియగానే, భరత-శతృఘ్నులు ప్రాణాలు విడుస్తారు. కుమారుల చావు విన్న క్షణాన, కౌసల్య-సుమిత్ర-కైకేయిలు మిగలరు. వారు కొడుకులను పోగొట్టుకుని బ్రతకలేరుకదా? ఇతరుల మేలుమరవని, ఆడితప్పని సుగ్రీవుడు రామచంద్రుడి గతిచూసి తానూ మరణించుతాడు. ఆయన భార్య రుమాదేవి, వాలిచనిపోయాడనే ఏడుస్తున్న తార కూడ వుందరు. వారి మరణవార్త విన్న అంగదుడు చనిపోతాడు. కిష్కిందలోని ముఖ్యులందరు రాజుమరణ వార్తవినగానే, దుఃఖంతో పరితపిస్తూ, పిడికిళ్లతో, అరిచేతి దెబ్బలతో తలలు పగులకొట్టుకుని చచ్చిపోతారు. అరణ్యంలో చిరకాలం నివసిస్తున్న వారెందరో వున్నారు....వారూ మిగలరు. అట్లా అందరూ చావగా మిగిలిన కోతులు, కొండల్లో, అడవుల్లో గుంపులు-గుంపులుగా మునుపటిలాగా తిరుగలేవు. అందులో కొన్ని వురిపోసుకుని చస్తాయి. కొన్నిమంటల్లో దూకి, మరికొన్ని విషంతాగి, ఇంకొన్ని కత్తులపైన పడి చచ్చిపోతాయి

         "ఇప్పుడు నేను కిష్కిందకు పోతే ఎక్కడ చూసినా, విన్నా ఏడుపుధ్వనులే. దానివల్ల  ప్రయోజనమేంటి? ఇక్ష్వాకు  వంశం, వానరకులం నాశనమౌతుంది. కాబట్టి ఇక్కడినుండి కిష్కిందకు పోకపోవడమే ఉత్తమం. జానకిజాడ తెలుసుకోలేని నేను సుగ్రీవుడి ముఖం ఎట్లా చూడాలి? అంత సిగ్గు, బిడియం లేదానాకు? నేను పోకపోతే...హనుమంతుడు ఇవ్వాళో, రేపో, ఎల్లుండో వస్తాడన్న ఆశతో కొంత కాలమైనా జీవించి వుంటారు". ఇలా హనుమంతుడి ఆలోచనలు కొనసాగుతాయి. కిష్కిందకు పోయి అనర్ధాలు తెచ్చి పెట్టడంకంటే, ఇక్కడ చేయాల్సిన కార్యం ఆలోచించడం మేలని తీర్మానించుకుని తర్వాత ఏంచేయాలో నిశ్చయించుకుంటాడు హనుమంతుడు.

         (హనుమంతుడు సీతాదేవిని చూడలేకపోతే ఎంత కీడు జరిగేదో ఊహించే ఘట్టమిది. ఇందు కొన్ని సందేహాలు రావచ్చు. జరుగుతుందనుకున్న ఈ కీడు సీత కనిపించలేదన్న విషయం మీద ఆధారపడి వుంటుంది. సీతా వియోగంతో రాముడు మరణిస్తే ఈ అనర్ధం జరుగుతుంది. జీవించి వుంటే జరగదు. భార్య కనపడలేదనగానే శ్రీరాముడు ప్రాణాలు విడుస్తాడా? సీతాదేవి భూమాత వొడిలోకి పోయినతర్వాత రామచంద్రమూర్తి మరణించాడా? లేదే! ఆతర్వాత ఎన్నో వందల ఏండ్లు బ్రతికున్నాడుకదా! అందుకే రాముడు సీతకై ప్రాణం విడుస్తాడన్న ఊహ సరైంది కాదేమో! కాకపోతే రెండవ సారి సీతావియోగం రాముడు స్వబుధ్ధి పూర్వకంగా చేయడం, తదనంతర కధలో ఆమె భూమాత వొడిలోకి చేరడం జరిగింది. భార్య మరణిస్తే ఏడ్చేవాళ్లు వుంటారు కాని సన్యాసిగా మారి భార్యను త్వజిస్తే ఏడవరు కదా! ఇంకా ఆలోచించాల్సివస్తే, హనుమంతుడు సీతను చూడలేక మరలిపోయిన తర్వాత, ఈ వార్త తెలిసిన వానరులు సుగ్రీవుడి భయంతో ప్రాయోపవేశం చేయడమో, లేక, రాజదండనకు గురికావడమో జరిగేది. హనుమంతుడు మటుకు బ్రహ్మవరబలంతో జీవించే వుండి, సీత ఏమైందో అన్న ఆలోచనతో మనస్సు పాడుచేసుకోవాల్సిందేకదా! ) 


         ఇక్కడినున్డి తిరిగిపోక, ఎక్కడో-అక్కడ లంకలోనే వుండి, సీతాదేవిని కనుక్కోలేక పోయినందున, బ్రతుకు మీద ఆశవదిలి, ఓ చెట్టు క్రిందో, పుట్ట క్రిందో, నివసిద్దామనుకుంటాడు హనుమంతుడు. వానప్రస్థుడై వుంటున్న తనకు, కాయో, పండో నోట్లో పడితే తిందామని, లేకపోతే వూరికేవుందామని, అదే క్షేమమార్గమని తలుస్తాడు. ఫలాలు, కందమూలాలు బాగాదొరికే సముద్రతీరానికి పోయి, అక్కడ చితి పేర్చుకుని, దాంట్లో చావడం మేలనికూడా భావిస్తాడు. చెట్టు క్రింద కూర్చొని కాయలు పడ్తాయా, పండ్లు పడ్తాయా అని అభిమానం లేకుండా ఎదురుచూడడం సరైన పనికాదనుకుంటాడు. మరణించాలనే వుద్దేశ్యంతో, ఓచెట్టు క్రింద పడివుండి, ధైర్యంగా పులులు, సింహాలు, కాకులు, గద్దలు తనశరీరాన్ని పీక్కుతింటుంటే, కదలక-మెదలక కూర్చుందామని కూడా అనుకుంటాడు.

         "సీతాదేవిని ఇక్కడ చూడకపోతే, నీళ్లలో దూకి దేహాన్ని వదుల్తాను. రామకార్యార్ధినై ఇలా చేయడం మునీశ్వరులందరికీ సమ్మతమే కావచ్చు. స్వామికార్యానికై, అందునా రామకార్యానికై, ప్రాణం తీసుకోవడం పాపం కాదుకదా! అలా అని జటాయువులా నాది వీర మరణం కాదుకదా! అయ్యో నేనేం చేయాలి?" అనుకుని చింతిస్తాడు. లంకాధిదేవతను జయించడంతో శుభారంభం కలిగించి, మనోజమైన చంద్రుడి వెన్నెలతో నిండి, అందమై, నిద్రలేకుండడంతో దీర్ఘమై, లంకలో హనుమంతుడు ప్రవేశించాడన్న కీర్తిని తెచ్చిన ఆనాటి రాత్రి, సీతాదేవి దర్శన భాగ్యం లేకుండా వృధాగా పోతున్నదే అని దిగులుపడ్తాడు హనుమంతుడు. చేసేదేమీ లేక చెట్లమొదళ్లలో వ్రతదీక్ష పూని వుందామనీ, తిరిగిపోతే అంగదాదులు బ్రతకలేరనీ మళ్లీ అనుకుంటాడు. ఆహారం మాని దేహం విడిస్తే, చచ్చేం సాధిస్తామనీ, ప్రాణాలొదిల్తే పెక్కు దోషాలు కలుగుతాయనీ, బ్రతికుంటే మేలుకలుగుతుందనీ, ప్రాణాలు విడువరాదనీ, బ్రతికుంటేనే శుభం కలుగుతుందనీ నిర్ణయానికొస్తాడు.

         వేరేవిధంగా కూడా ఆలోచిస్తాడు. సీత వుందో-లేదోనన్న సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు ఇంత అనర్ధానికి కారణమైన రావణుడిని పట్టుకుని చావకొట్తే మంచిదనీ, ఇదే వాడి పాపానికి తగిన ప్రాయశ్చిత్తమనీ భావిస్తాడు హనుమంతుడు. "రావణుడిని చంపితే కలిగే లాభమేంటి? వాడిని రామచంద్రమూర్తి చంపుతానన్నాడే?" ఇదీసరైన ఆలోచన కాదనుకుంటాడు. యజ్ఞంలో అగ్నికి బలిచ్చేందుకు ఈడ్చుకుని పోయే మేకలా, రావణుడిని పట్టుకుని, సముద్రమ్మీదేసి, ఈడ్చుకుని పోయి రామచంద్రమూర్తి ఎదుట నిలబెట్టుదామనుకుంటాడు. ఆతర్వాత వాడినేంచేయాలన్న విషయం రాముడికే వదిల్తే సరిపోదా అని తలుస్తాడు.


         ఇలా పలుమార్లు అధైర్యంతో విచారపడ్తాడు. దిగులుపడ్తాడు. సీతకనిపించే దాకా వెతకాలనుకుంటాడు. సంపాతి మాట నమ్మి ఇక్కడకు వస్తే సీతలేదుకదా అని బాధపడతాడు. ఇంకా నయం...సంపాతి మాటలను నమ్మి, శ్రీరాముడినే ఇక్కడకు తెచ్చినట్లైతే, ఇక్కడ సీత కనిపించక పోతే, భయంకరమైన రాముడి కోపానికి వానరవీరులందరూ బలయ్యే వారేననుకుంటాడు. ఇలా అనుకుంటూ, అహార నియమం, ఇంద్రియ వ్యాపార నియమం కలిగి, ఇక్కడే వుండి, వ్యర్ధుడను కాకుండా, సుసంపన్నులగు రామలక్ష్మణులు చావకుండా చూద్దామని తీర్మానించుకుంటాడు హనుమంతుడప్పటికి.

No comments:

Post a Comment