Monday, January 1, 2018

ప్రగతి పరుగు..సంక్షేమ వెలుగు : వనం జ్వాలా నరసింహారావు

ప్రగతి పరుగు..సంక్షేమ వెలుగు
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాన దినపత్రిక (01-01-2018)

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ప్రప్రథమంగా అనేక వినూత్నమైన ప్రాజెక్టులు, పథకాలు, కార్యక్రమాలను అమలు పరుస్తోంది. అన్ని రంగాల్లోనూ ప్రగతిదాయకంగా నిలుస్తూ, సంక్షేమ ఫలాలను అందిస్తూ ముందుకు సాగుతున్న వాటిలో కొన్నిటి గురించి…

2018 జనవరి 1 నుంచి వ్యవసాయం, ఇతర రంగాలకు 24 గంటల పాటు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా ఇలాంటి తరహా పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఖరీఫ్, రజీ సీజన్లలో రైతులకు ఎకరాకు రూ.8 వేల (ఒక్కో పంటకు రూ.4వేల చొప్పున) ను ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. తద్వారా వ్యవసాయ రంగం భవిష్యత్‌లో లాభాలను ఆర్జించే రంగంగా రూపుదిద్దుకోనుంది. రైతులకు ప్రభుత్వం పంట పెట్టుబడిని ఇస్తుండడం ఇదే ప్రప్రథమం. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమితులను ఏర్పాటు చేయడం దేశంలోనే ఓ విప్లవాత్మకమైన అడుగు. ఈ రైతు సమన్వయ సమితులు రైతులకు రూ.8 వేలను పంట రుణంగా ఇచ్చేందుకు పారదర్శకమైన విధానంలో భూ రికార్డుల నిర్వహణను పర్యవేక్షిస్తాయి. రైతులు తమ ఉత్పత్తులకు కనీస మద్దతుధర పొందేందుకు ఇది దోహదపడుతుంది.

తెలంగాణ తన వార్షిక బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి ఏడాదికి రూ.25 వేల కోట్లను కేటాయించింది. దీంతో తెలంగాణలో ఎత్తిపోతల పథకాల వంటి అనేక భారీ, పెద్ద, మధ్య తరహా, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడాకి దోహదపడుతోంది. రాష్ట్రంలో కోటి ఎకరాల వ్యవసాయ పొలాలకు సాగునీరందిం చే కలను సాకారం చేసుకునేందుకు సాయపడుతోంది. రాష్ట్రంలో ఉద్యానవనాల సాగుకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. పాలీ హౌస్‌లు, గ్రీన్ హౌస్‌లకు సబ్సిడీలను ఇస్తున్నది. ఎస్‌సి, ఎస్‌టి రైతులకు 95 శాతం, ఇతర రైతులకు 75 శాతం వరకు సబ్సిడీని అందిస్తోంది. ఇందుకు గాను భూ పరిమితిని కూడా ఎకరం నుంచి మూడు ఎకరాలకు పెంచింది. బిందు సేద్యానికి కూడా 80-100 శాతం సబ్సిడీని అందజేస్తున్నది. కాకతీయుల పాలనలో వేలాదిగా ఉన్న గొలుసు కట్టు చెరువుల్లో పూడికతీత ద్వారా వాటిని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం “మిషన్ కాకతీయ” పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 46 వేల చెరువులను అంటే ఏడాదికి 9 వేల చెరువులను పునరుద్ధరించి, వినియోగంలోకి తెస్తున్నది. మార్కెట్ కమిటీల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. భూ వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు, భూ రికార్డులను ప్రక్షాళన చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టింది.

వ్యవసాయాన్ని వృత్తిగా మార్చేందుకు, లాభాల బాట పట్టించేందుకు ప్రతి 5 వేల ఎకరాలకు ఒక కమతాన్ని ఏర్పాటు చేసి, రైతులకు సూచనలు అందించేందుకు కమతానికో వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని సెప్టెంబరు 2015 లో రూ.6 లక్షలకు పెంచింది. అలాగే, గీత కార్మికులు, మత్సకారులు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వతంగా వికలాంగులుగా మారినా రూ.6 లక్షలు అందిస్తోంది. హోంగార్డులు, జర్నలిస్టులు, నిర్మాణ రంగ కార్మికులు, డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షలు బీమా పరిహారం అందుతుంది. దారిద్య్రరేఖకు దిగువున ఉన్న ఉన్న కుటుంబాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా అమ్మాయి వివాహానికి రూ.51 వేల ఆర్థిక సాయాన్నిఅందిస్తున్న ప్రభుత్వం దీన్ని రూ.75,116 లకు పెం చింది. దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే వారికి అందించే సాయాన్ని కూడా రు. 50 వేల నుంచి ఒక లక్ష రూపాయలకు కు పెంచింది. 18 ఏళ్ల వయస్సు నిండి ఒంటరిగా ఉంటున్న, భర్తకు దూరంగా ఉంటున్న మహిళలకు పెన్షన్ పథకం కింద నెలకు రూ.1000లను ప్రభుత్వం అందిస్తోంది. దీని ద్వారా 1,20,000 మంది లబ్ధి పొందుతున్నారు. అలాగే, బీడీ కార్మికులకు నెలకు రూ.1000లు పెన్షన్ అంది స్తోంది.4.5లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. వృద్ధా ప్య, వికలాంగ, వితంతు, గీత, నేత, బీడీ కార్మికులు, ఎయిడ్స్ రోగులు, కళాకారులకు నెలకు రూ.1000లు ‘ఆసరా’ ద్వారా అందిస్తోంది.  ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్‌తో కలిసి ఈపథకానికి ప్రతినెలా రూ. 442 కోట్ల ను వెచ్చిస్తోంది. 40లక్షల మంది లబ్ధి పొందుతున్నారు.


పేదలకు ఉచితంగా రెండు పడకల ఇండ్లను అందిస్తోంది. 2017 జూన్ వరకు మొత్తం 2.66 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి సైతం సురక్షిత, స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు “మిషన్ భగీరథ” పథకాన్ని ప్రారంభించింది. నాబార్డు, హడ్కో, మరో 18 ఇతర బ్యాంకులు ఈ ప్రాజెక్టుకు నిధులను సమకూరుస్తుండగా, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. రెండు దశల్లో చేపట్టే ఈ పథకం మొదటి దశలో 2017 చివరి నాటికి 2500కు మించి హ్యాబిటేషన్లకు సురక్షిత, స్వచ్ఛమైన, మంచినీరు అందనుంది. రెండో దశలో భూగర్భ పైపులైన్ల నిర్మాణం 2018 మధ్య నాటికి పూర్తవుతుంది. “తెలంగాణకు హరితహారం” పథకం కింద 230 కోట్ల మొక్కలను నాటించడానికి పూనుకుంది. ప్రతి గ్రామానికి ఒక నర్సరీని ఏర్పాటు చేయనుండగా, కాంపా, తదితరాల ద్వారా నిధులు సమకూరుతున్నాయి.

దేశంలోనే ప్రప్రథమంగా రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించింది. రాష్ట్రమంతటా ఒక్క రోజులో నిర్వహించిన ఈ సర్వేలో కోటి తొమ్మిది లక్షల కుటుంబాలకు చెందిన సామాజిక-ఆర్థిక డేటాను సేకరించింది. శాసనసభ సభ్యుల కోసం ఆయా నియోజకవర్గాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసింది. తెలంగాణ రూపురేఖలను మార్చేందుకు, జిల్లా పాలనా యంత్రాంగాలకు మరింత ఊతాన్ని ఇచ్చేందుకు ప్రతి ఎంఎల్‌కు రూ.3 కోట్లను ముఖ్యమంత్రి కెసిఆర్ మంజూరు చేశారు. ఒంటరి మహిళలకు పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది.

రాష్ట్రంలోని దాదాపు 5 వేల ప్రార్థన మందిరాల్లో ఇమామ్, మౌజామ్‌లకు నెలకు రూ.1500 చొప్పున పెన్షన్‌ను ప్రభుత్వం అందిస్తోంది. రూ.1000 నుంచి రూ.1500లకు పెరిగిన ఈ పెన్షన్‌ను 8,934 మంది అందుకుంటున్నారు. 2014 సెప్టెంబరులో “సాంస్కృతిక సారథి” ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న 550 మంది కళాకారులకు దీని ద్వారా ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. అలాగే, హాస్టళ్లలో విద్యార్థులకు పోషకారాన్ని అందించేందుకు సన్నబియ్యాన్ని అందిస్తోంది.

అంగన్‌వాడీలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసింది. రాష్ట్రంలో ఇప్పుడు 32,569 విద్యా సంస్థల్లో 32,70,370 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. “న్యాయవాదుల సంక్షేమ నిధి” కి రూ.100 కోట్లను కేటాయించింది. అలాగే, జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్‌కు కూడా రూ.50 కోట్లను కేటాయించింది. బ్రాహ్మణ వెల్ఫేర్ ఫండ్‌కు ఏడాదికి రూ. 100 కోట్లను మంజూరు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అర్చకులకు కూడా నెలసరి వేతనాన్ని అందిస్తోంది. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీల కోసం రాష్ట్రంలో అదనంగా 542 రెసిడెన్షియల్ పాఠశాలలతోపాటు కళాశాలలను ప్రారంభించింది. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీల విద్యార్థుల కోసం ఇచ్చే ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ను రూ.20 లక్షలకు పెంచింది. తండాలు, గూడెంలను పంచాయతీలుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంబిసి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, దానికి 2017-18 సంవత్సరానికి రూ.1000 కోట్లను కేటాయించింది. యాదవ్‌లు, కుర్మలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేస్తున్నది. రూ.5 వేల కోట్ల బడ్జెట్ అంచనాతో ఈ పథకాన్ని 2017 జూన్ 20న ప్రారంభించింది. రూ.14.65 లక్షలతో వంద సంచార వెటర్నరీ క్లినిక్‌లను అందుబాటులోకి తెచ్చింది.


నూలు, రసాయనాలను 50 శాతం సబ్సిడీతో అందిస్తోంది. నేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1200 కోట్లను కేటాయించింది. ఆటోలు, ట్రాక్టర్లకు రవాణా పన్నును ఎత్తివేసింది. ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం కాలుష్య భత్యాన్ని, సెక్యూరిటీ వింగ్ పోలీసులకు 30 శాతం రిస్క్ అలవెన్స్‌ను అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయుల కోసం వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి,11,35,701 హెల్త్ కార్డులను జారీ చేసింది. సింగరేణి కాలనీ కార్మికులకు 2017-18 సంవత్సరానికి గాను లాభాల్లో 25 శాతం బోనస్‌ను ప్రకటించింది. మాజీ సైనికుల ప్రత్యేక నిధికి ఏడాదికి రూ.80 కోట్లను అందిస్తోంది. అంగన్‌వాడీ టీచర్లు, కార్మికులు, మున్సిపల్ కార్మికులు, విఆర్‌ఎలు, విఎఓలు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాధి హామీ కింద పని చేసే ఉద్యోగులు, ఆశావర్కర్లు తదితరుల వేతనాలను పెంచింది. మహిళా శిశు సంక్షేమం కోసం రూ.15వేల విలువైన కెసిఆర్ కిట్‌లను ప్రతి గర్భిణికి అందించింది. కొత్త పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసేందుకు టిఎస్ ఐపాస్‌ను ప్రారంభించింది. ఆదాయ ప్రగతి, సోలార్ పవర్ ఉత్పత్తిలలో నెంబర్ వన్‌గా నిలుస్తోంది. అత్యాధునిక సౌకర్యాలతో పోలీసు కమాండ్, కంట్రోల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది. వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్ పార్కు నెలకొల్పింది. హైదరాబాద్‌లో షీ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఎస్‌సి, ఎస్‌టి, బిసిల కోసం స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్ల వద్ద 11వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు అంకురార్పణ చేసింది. ఐటి ఎగుమతుల్లో 12 శాతం వాటాతో దేశంలోనే రెండవ స్థానం లో నిలిచింది. హైదరాబాద్‌లో ప్రప్రథమంగా టిహబ్‌ను ఏర్పాటు చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో ఉన్న పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజించింది.

No comments:

Post a Comment