Monday, January 29, 2018

రాక్షస స్త్రీల మాటలకు భయపడిన సీతాదేవి ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

రాక్షస స్త్రీల మాటలకు భయపడిన సీతాదేవి
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (29-01-2018)

మందతప్పి, ఒంటరిదైపోయి, తోడేలు పాలపడ్డ జింకలా, సీత రాక్షస స్త్రీల మధ్య చిక్కుకుని వణకసాగింది. మనస్సులోని విషాదాన్ని దూరంచేయడానికి, పూలబరువుకు వొంగిన ఓ పూల చెట్టుకొమ్మను పట్టుకుని, భర్తను తలచుకుని, శోకంతో, కన్నీళ్లతో స్తనాలను తడుపుతూ, భర్తను లోలోపలే స్మరించుకుంటూ, రాక్షస స్త్రీలు ఎప్పుదు ఏంచేస్తారో అన్న భయంతో, అరటిచెట్టు పెనుగాలికి వణికినట్లు వణకసాగింది. "రామా! లక్ష్మణా! అత్తా కౌసల్యాదేవీ! సుమిత్రా! నాపైన దయలేదా ఒక్కరికైనా!" అంటూ భయపడ్తూ గడగడలాతున్న సీతాదేవి కళ్లు వణకుతున్న కలువలను పోలి వున్నాయి. పొడవాటి ఆమె జడ నిలబడ్డ ఆమె భుజాలమీదకు దొర్లుతూ పెద్దపాములా కనిపించింది. (దీని అర్థం: బంధువులెవ్వరూ, ఎంత ఆప్తులైనా, "ఆత్మ" ను వుధ్ధరించలేరనే!)

సీతాదేవి రాముడిని స్మరిస్తూ ధ్యానంలో అనుకుంటుందీవిధంగా: "ఓర్పు నశించిపోయింది. రాక్షసుల బెదిరింపులు బాధిస్తున్నాయి. భర్తను వదిలి వుండాల్సి వచ్చెకద! ఈ మూడు కారణాల వల్ల ప్రాణం ఎప్పుడో పోవాల్సి వుంది. పోలేదంటే, అకాలమృత్యువు, స్త్రీనికాని, పురుషుడినికాని తాకదన్న పండితుల మాట సత్యం కావచ్చు. కాకపోతే, నాశరీరంలో ఇంకా ప్రాణం వుండటమేంటి? గొప్ప వ్రతం చేయబూని, పూర్తిచేయ లేనందువల్లే, వ్రతఫలం దక్కకుండా పోయి, భర్తతో ఎడబాటు కలిగి, నడి సముద్రంలో మునిగిన నావలాగా అయ్యాను. వ్రతం పూర్తిచేస్తే ఆ పుణ్యఫలం వల్ల నాభర్త నన్ను రక్షించేవాడేమో!"(దీన్నిబట్టి, స్త్రీలపాతివ్రత్యం, నోములఫలం, వారి భర్తలు తమను రక్షించేవిగా చేస్తున్నాయనీ, అట్టి ఫలం లేక పోతే, భర్తలున్నా రక్షించలేరనీ అర్ధం చేసుకోవాలి. "ఆడదాని అదృష్టం" అన్న నానుడి ఇందుకే ఏర్పడి వుండవచ్చు. ఆడది నిర్భాగ్యురాలైతే, మగవాడు ఎంత పుణ్యాత్ముడు, సమర్ధుడు అయినప్పటికీ, ఆ స్త్రీకి సుఖం లేదు. లోకంలో కొందరు దరిద్రులుగానూ, కొందరు ధనవంతులుగానూ, దుఃఖంతో కొందరు, సుఖిస్తూ కొందరు వున్నారు. ఇవి వారి-వారి పాప-పుణ్య ఫలాలు. బాగుపడటానికి, చెడిపోవటానికి, వారి-వారి పూర్వ కర్మలే కారణం.)

సీత ఇంకా ఇట్లా అనుకుంటుంది తనమనస్సులో: "శ్రీరామచంద్రుడి దర్శనం లేకపోవడం అటుంచి, రాక్షస స్త్రీలకు వశపడి బాధపడాల్సి వచ్చిందికదా! నదీ ప్రవాహానికి తెగిపోయిన వారధిలా, మరణించక ఎందుకు ప్రాణం నిల్పుకున్నాను? ప్రాణాలకు విభుడు భగవంతుడే! అట్టి భగవత్ సాక్షాత్కారం పుణ్యాత్ములకు కలుగుతుంది. భగవంతుడు నాలో వున్నా నేనెందుకు చూడలేకపోతున్నాను? నాపాపమే కారణమా? విషం తింటే తిన్నవాడి ప్రాణాలు పోతాయి. అట్లానే సమరసన్నిభుడు, భూపతి అయిన నాభర్తకు ఎడబాటైన ఈదేహంలో ప్రాణమెందుకుంది? ఇంత మహా దుఃఖాన్ని అనుభవించడానికి పూర్వజన్మలో నేనెంత ఘోరపాపం చేసానో? ఈవిధంగా మూర్ఖపు రాక్షస స్త్రీలు కావలికాస్తుంటే ఎక్కడో వున్న రాముడు రావడమేంటి? నన్ను రక్షించడమేంటి? కాబట్టి మృత్యుదేవతే నాకు దిక్కు. మనుష్య జన్మ ఎన్తపాపమైంది? అందునా పరవశమైన బ్రతుకేం బ్రతుకు? అనుకున్నప్పుడు చచ్చిపోయే శక్తి ఈయకూడదా?"

(సీతా విలాప రూపంలోని పై ఆలోచనలకర్థం....భగవత్ సాక్షాత్కారమయ్యేంత వరకు సంసార బాధ తొలగదని. ప్రకృతి బంధం మన ప్రయత్నంతో తొలగేది కాదు. భగవదనుగ్రహం తోనే తొలగాలి. ఒక దేహంలో "జీవాత్మ-పరమాత్మ" లిరువురూ వుంటారు. జీవాత్మ సంసారంలో మునిగి, ఈశ్వరుడిని చూడలేక, మోహంతో దుఃఖిస్తుంది. ఎప్పుడైతే, జీవాత్మ, పరమాత్మను దర్శిస్తుందో, అప్పుడే దాని శోకం తొలగిపోతుంది. ఇందు "ఆత్మగుణం, దేహగుణం" కలిపి చెప్పడంవల్ల, "సగుణ బ్రహ్మ" మే సేవించ తగిందనీ, అట్టి దానిని సాక్షాత్కరింప చేసుకొనగలవారే "పుణ్యాత్ములనీ, మోక్షార్హులనీ" అర్థం చేసుకోవాలి. పూర్వ జన్మ పాపంవల్ల కూడా ఇలా అనుభవిస్తున్నానని సీత అంటుందోసారి. అంటే, ఆమె కర్మ వశాత్తు పుట్టిందని కాదు. ఆమాట రాక్షస స్త్రీలను ఉద్దేశించి చెప్పబడింది. భక్తుడు తన సర్వస్వం ధారపోసినా, భగవంతుడు కనపడకపోతే ఆస్తికుడి లాగా భగవంతుడు లేడనుకోకూడదు. తనలోనే ఏదో లోపం వుందనుకోవాలి. మనుష్యులు సుఖమయినా, దుఃఖమయినా, "ప్రారబ్ధాన్ని" అనుభవించాల్సిందే కాని, బలాత్కార మరణంతోనో, ఇంకే విధంగానో దాన్ని తప్పించుకోలేరు.)



కళ్లనీళ్లు విపరీతంగా కారుతుంటే, తలవంచుకుని సీతాదేవి, నేలమీదపడి పొర్లాడే ఆడగుర్రంలా, పిచ్చెత్తినట్లు, పిశాచం పట్టినట్లు, వళ్లుతెలియక, మనస్సు దిగ్భ్రమ చెందిన దానిలా అయ్యి ఏడవసాగింది(ఇదంతా భక్తుల-ప్రపన్నుల స్థితి. భక్తి అతీతంగా పెరిగిపొతే, భక్తుడు దేహాభిమానాన్ని విడిచి నేలపైపడి పొర్లాడుతాడు. పిచ్చి పట్టినట్లు, దయ్యం పట్టినట్లు, వంటిమీద గుడ్డలున్నదీ, లేనిదీ తెలియకుండా ప్రవర్తిస్తాడు. ఇదే స్థితి సీతాదేవికి కలిగింది). ఏడుస్తూ తనస్థితిని తలచుకుందీ విధంగా:

"రామచంద్రమూర్తి నేను పట్టుదలపట్టడం వలనే ప్రమాదంలోకి పోవడంతో, కోరినరూపం ధరించగల రావణాసురుడు, నేను ఏడుస్తున్నా లెక్క చేయకుండా, బలాత్కారంగా తీసుకొచ్చాడు. ఇక్కడ రాక్షసులచేత చిక్కిన నాకు, రామప్రాప్తిలేకుండా రాక్షసులు భయపెడ్తుంటే నేనెట్లా బ్రతకాలి? నేను బ్రతికేదే రాముడికొరకు. ఆయన సేవకే నా ధనం. రామ కైంకర్యానికే నా సొగసులు. ఇవన్నీ రాముడిని సంతోషపెట్టడానికే అయినప్పుడు, ఆయనలేనందున నేనేడుస్తున్నప్పుడు, నాకెందుకివన్నీ? రాక్షసస్త్రీల మధ్య నేనేడుస్తుంటే నాగుండె పగలకపోవడానికి, అదేమన్నా ఇనుపగుండేమో! లేకపోతే, నాహృదయానికి ముసలితనం, చావూ లేవేమో? ఇది నాదౌర్భాగ్యం".

"రామచంద్రమూర్తి నన్ను విడిచి పోయాడంటున్నానేకాని, దానికి కారణం నాపాపమయమైన జీవితమేకదా! నేను పుణ్యాత్మురాలినే అయితే, ఆయన్ను పొమ్మని ఎందుకంటాను? అన్నా ఆయనెందుకు పోవాలి? ఆ నా పాప ఫలమే నన్ను ప్రాణాలు విడవనీయకుండా చేస్తున్నాయి. నేనెప్పుడైతే దేహమంత అభిమానంతో ప్రాణాలు నిలుపుకుంటున్నానో, అప్పుడే నేను అనార్య నయ్యాను....పతివ్రతను కాను.....సదాచారవతిని కాను. ఇట్టి శీలాదులులేని దిక్కుమాలిన బ్రతుకెందుకు? నా పతివ్రతమేమి వ్రతం? రామచంద్రమూర్తి సేవ మళ్లీ లభిస్తుందనే ఆశతో ప్రాణాలు నిల్పుకున్నాను. ఎందుకంటే బలవంతంగా విడువకూడదాయె! రావణుడేమో ఒక్క ద్వీపానికే అధిపతి. రాముడేమో భూమీతలానికంతా అధిపతి. అట్టివాడిని విడిచి శోకంతో బ్రతకలేను. రాక్షసులు నన్ను పీక్కుని తింటే తిననీ! ముక్కలుగా నరికితే నరకనీ! ఈ స్థితిలో నాకు పరుపులు, మంచాలు, సొగసులు కావాల్నా? ఈ పాడు ప్రాణమింత తీపా? (దీన్ని బట్టి భక్తుడి మనస్సు భగవంతుడి మీదుండాలికాని సుఖ-సౌఖ్యాల మీదకాదని అర్ధమౌతోంది)

         "రావణాసురుడిని నేను ఎడమకాలి గోటితోనైనా తాకను. అట్లాంటిది వాడిని ప్రేమించడమేంటి? ఛీ, ఇంత మాత్రం వాడికి అర్థం కావడంలేదు. వాడు సిగ్గులేని దుష్టుడవటమే దీనికి కారణం. చూడటానికే ఇష్టపడని స్త్రీ, మోహిస్తుందని ఎట్లా అనుకుంటున్నాడు? ఆమాత్రం జ్ఞానంకూడాలేదు. అంత ఊహాబలం లేకున్నా, ఛీ అని చీదరించినా తెల్సుకోలేకపోతున్నాడు. ఎటువంటి వంశంలో పుట్టాడు! వాడి గౌరవమేంటి? పిత్రార్జితం, స్వార్జితమైన గౌరవాన్నైనా ఆలోచించాలికద! ఈ ఆడదానిచేత చీవాట్లు పడటమెందుకని కూడా అనుకోవడంలేదు. ఇంకా నన్ను తన క్రూరత్వంతో వశపర్చుకోవాలనుకుంటున్నాడు. ఇదివాడి దోషంకాదు. యమపాశంతో ఈడ్వబడటానికీ, చావుకు సిధ్ధపడటానికీ, ఇటువంటి బుధ్ధికాక మంచి బుధ్ధి, చక్కటి ఆలోచన ఎట్లా కలుగుతుంది? కాల ప్రేరణవల్ల వాడు అలా చేస్తున్నాడు".

No comments:

Post a Comment