Sunday, January 7, 2018

తనను బెదిరించిన రావణుడికి పరుషంగా జవాబిచ్చిన సీత ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

తనను బెదిరించిన రావణుడికి పరుషంగా జవాబిచ్చిన సీత
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (08-01-2017)

సీతాదేవి కఠినంగా మాట్లాడుతుంటే, కోపించిన రావణుడు, అనరాని పరుషమైన మాటలతో, ఆమె పైన విరుచుకు పడ్డాడు. "పురుషుడు స్త్రీలను ఎంత బ్రతిమాలుతాడో, అంతగా వారికి వశమౌతాడు. ఎంత చక్కగా మాట్లాడితే అంతగా వారితో అవమానించ బడతారు. వీడు మనకు లోబడ్డాడని అవమానిస్తారు. అట్లానే నేను మంచి మాటలంటున్నకొద్దీ, నీనోటికొచ్చినట్లు వాగుతున్నావు. అయినా త్రోవతప్పుతున్న గుర్రాలను సారధి బిగించి పట్టుకున్నట్లు, నీమాటల వల్ల కలిగిన కోపాన్ని, నాలోని మంచి బిగించి పడ్తున్నది”. అంటాడు రావణుడు.

తనకోరికకు విఘ్నం కలిగించిన వారు చంపబడాల్సినప్పటికీ, కామాతిశయంతో, దయతో, స్నేహభావంతో, "దొంగతపస్విని లాంటి సీతను" అవమానించాల్సిన పరిస్థితి వున్నప్పటికీ, అలాచేయకుండా సహించి వూరుకున్నానంటాడు రావణుడు. సీత అన్న పరుషపు మాటలకు అప్పుడే చంపాల్సి వున్నప్పటికీ, తనలా చేయనంటూనే, వళ్లుతెలియకుండా బెదిరించసాగాడు ఈవిధంగా:

"జానకీ! ఇదివరకు పన్నెండు నెలల గడువిచ్చాను నీకు. ఇంకా రెండునెలలు మిగిలాయందులో. అంతవరకు నీమీద నమ్మకంతో వేచిచూస్తాను. ఈలోపల నువ్వు నాభార్యగా, నాపడకెక్కకపోతే, గడువు తీరిన మర్నాడే, నా వంటవాళ్లు నిన్ను, నా ఉదయం భోజనంలో నంచుకోవటానికి వండుతారు”. ఇలా భయపెడుతుంటే అక్కడున్న దేవగంధర్వ స్త్రీలు, భయంతో, దుఃఖంతో, వికారమైన కళ్లతో తపించిపోయారు. కొందరు దేవతాస్త్రీలు, కంటిసైగలతో, పెదవి విరుపులతో, మూతులు తిప్పుతూ, ఆమెకు ధైర్యం కలిగేటట్లు సూచిస్తూ, రావణుడికి లోబడవద్దని సలహా ఇచ్చారు.(దీన్ని బట్టి అక్కడున్నవారిలో కొందరు వాడికి భయపడి లోబడ్డా వాడిమీద ప్రేమలేదని అర్ధమౌతున్నది)

దేవతాస్త్రీలు చేసిన సైగల్తో ధైర్యం పెరిగింది సీతలో. రావణుడికి దేహబలముంటే తనకు పాతివ్రత్య బలముందికదా.....వీడు తననేమి చేయగలడన్న ధైర్యం కలిగి వాడితో ఈవిధంగా అంటుంది:"రావణా నీమంచి కోరేవారెవ్వరూ ఈవూళ్లోలేరు. నువ్వు తప్పుచేస్తుంటే, చెయ్యొద్దు అని ఒక్కరూ ఎందుకు చెప్పడంలేదు? నీ తప్పులను సరిదిద్దకుండా ఉపేక్షించడం కూడా తప్పే. ఈ పాపం నీ ఒక్కడితో పోదు. నీ పాప ఫలం ఉపేక్షిస్తున్నవారూ అనుభవించవలసిందే. ఇంద్రుడికి శచీదేవిలా, నేను శ్రీరామచంద్రమూర్తి భార్యను. ఇలాంటి నన్ను, మూఢుడవైన నీవు తప్ప, ఈప్రపంచంలో, మరెవ్వరూ కోరరు. నువ్వెన్నో చెడ్డమాటలంటున్నావు. ఆపాప ఫలం నిన్ను వదలదు. నువ్వెక్కడికిపోయినా నిన్ను వెన్నంటి మింగుతుంది".

"మదపుటేనుగుతో, పనికిరాని, అల్పమైన చెవులపిల్లి, యుద్ధం చేసే ప్రయత్నమెలావుంటుందో, నాభర్తతో నువ్వు పోరాడితే అంతేనని తెలుసుకో. వంచనతో నన్ను రామచంద్రమూర్తికి దూరం చేసావు. దొంగిలించి తెచ్చావు. ఆపని చేసినందుకు సిగ్గెందుకు పడవు? నీదీ ఒకపౌరుషమేనా? నువ్వు నన్ను దొంగిలించి తెస్తున్నప్పుడు, ఏమాత్రం నామగడి దృష్టిలో పడ్డా, ఆయనబాణంలోని చురుకుదనామ్, బలం తెలుసుకుని వుండేవాడివి".

"కామంతో నన్నేచూస్తున్న నీ వికారపు నలుపు, పసుపు రంగు కనుగుడ్లు ఎందుకు నేలపైన పడిపోవు? దశరధుడి కోడలినై, నిర్మల కీర్తిగల రాముడి ధర్మపత్నినైన నన్ను, పనికిమాలిన మాటలన్న నీనాలుక ఎందుకు రెండుభాగాలుగా చీలిపోదో? నిన్ను చంపడానికి శ్రీరాముడంతడి వాడు రావాల్నా? నేనే నిన్ను భస్మం చేయలేనా? ఆ శక్తి వున్నా ఎందుకు చేయడం లేదంటే, నేను కేవలం పరతంత్రురాలినైనందునే! నారక్షణ భారం నాభర్తపైన వేసాను. నేను స్వతంత్రించి నిన్ను చంపితే, నా పారతంత్ర్య వ్రతానికి హానికలుగుతుంది. నాప్రాణాలు పోయినా, స్వరూప-స్వభావాన్ని విడువను. అలాచేస్తే, నాకు స్వరూపహాని కలుగుతుంది. ఆపదలో నన్ను నేనే రక్షించుకోవాలనీ, దుష్టులను శపించాలనీ, నామగడు నాకు అనుమతి ఇవ్వలేదు. నేనాయన సొమ్మును. ఆయన నాదైవం, స్వామి. స్వామికాబట్టి, తనసొమ్ము తానే కాపాడుకోవాలి. సొమ్ముంటే అనుభవించేదాయనే. పోగొట్టుకుంటే నష్టపోయేదీ ఆయనే. నా ఉనికి ఆయన నిమిత్తమేకాని, నాకొరకు కానేకాదు. కాబట్టి ఆయన ఆజ్ఞలేని ఏపనైనా నేనెందుకు చేస్తాను? అందువల్ల నిన్ను భస్మం చేయడానికి కారణమున్నప్పటికీ, నేనుచేయగలిగి వున్నప్పటికీ, చేయకుండా వూరుకుంటున్నాను. "హతోభవ" అంటే చచ్చిపడి పోతావు. కాబట్టి నీవు నన్నేమిచేయగలవురా? నిన్ను చంపేందుకు దైవమే నిన్నిట్లాడిస్తున్నాడు. నీ అంతట నీవే నీ చావుకు సిధ్ధపడుతుంటే, నేనెందుకాపని చేయాలి? బెల్లం తినిచస్తానంటే, విషం ఎందుకివ్వాలి?""రామచంద్రమూర్తి అన్తటి శూరుడవు కావు. అయినప్పటికీ, శూరుడవన్న పేరుతెచ్చుకున్నావు. బలవంతుడివి. కుబేరుడి తమ్ముడివి. కుల, బలాల వల్ల ఇంతటిగొప్పవాడవైన నువ్వు, మోసం చేసి, పరస్త్రీని దొంగిలించి తేవడం సరైన పనికాదుకదా?" అని చెప్తుంది రావణుడికి.      (చెరలోవున్న దేవతాస్త్రీలో, విభీషణుడి భార్యో, కూతురో, "రావణాసురుడు శాపభయం వల్ల నిన్ను తాకడు, భయపడ వద్దని" రహస్యంగా చెప్పి వుంటారు సీతతో. రావణుడు చంపదల్చుకుంటే ఈ శాపం అడ్డం కాదు. చంపుతే చంపుతాడు....ఏమవుతుంది? తనపాతివ్రత్యానికి హాని కలగదుకదా అన్న ధైర్యం సీతకుంది).

నయాన-భయాన, సీతాదేవి చెప్పిన మాటలు రుచించని రావణుడు, క్రూరమైన తనకళ్లను పెద్దవిగాచేసి, గుడ్లు తిప్పుతూ, కోపంతో మండిపడ్తూ చూసాడు. ఆమెపై తన కోపాన్ని వెళ్లగక్కుతూన్న రావణుడి ఆకారం....నీలమేఘంతో సమానంగా, ఎత్తైన భుజాలు, మెడా కలిగున్నాడు. పెద్ద సింహంలాంటి వేగం, బలం కనిపించాయి ఆయనలో. మండుతున్న నాలుకకొన కళ్లున్నాయి. పూదండలు ధరించి, గంధం పూసుకుని, కదుల్తున్న కిరీటపు కొనలతో, బంగారు బాహుపురులు ధరించి, మందర పర్వతానికి చుట్టివున్న పాములాంటి నల్లని మొలత్రాడు ధరించి, పర్వత సమానుడై, బలసిన రెండు భుజాలతో, శిఖరంతో కూడిన మందరంలా, ముల్లోకాల్లోని జనాలను భయపెడ్తూ, పరుగెత్తేటట్లు చేస్తూ, ఎర్రని పూలు, చిగుళ్లున్న అశోకవృక్షాల కొండలా, బాలసూర్యుని వన్నెగల పోగులతో ఒప్పుతూ, మునులను కష్టపెట్టే ఆకారామ్తో, చందన చర్చితమైన శరీరామ్తో, వసంతుడంత సౌందర్యంతో, అందమైన సొమ్ములుండే శ్మశానంలోని మండపంలా భయం కలిగిస్తూ, రాజుకుంటున్న కోపాగ్నివల్ల కళ్లెర్రచేసి, తీవ్ర రోషంతో బుసకొడ్తూ, కంపించిన దేహంతో కనిపించాడు రావణుడు. వాడు సీతనిలా నిందించసాగాడు:

         "ఓ గుణహీనురాలా! ధనవంతుడిని, బలవంతుడిని, శౌర్యవంతుడిని, రూపవంతుడిని, లోకాలెల్ల హా! హా! అనిపించేవాడిని అయిన నన్ను అంగీకరించకుండా, నీతిలేనివాడిని, ధనంలేనివాడిని ఎందుకు కోరుకుంటావు? నాకన్టే గొప్పవాడంటావా? సూర్యుడు సంధ్యను హరించినట్లు, నిన్ను పట్టి నాశనం చేస్తాను చూడు. నీ ఆగడాలు నా ఎదుటనా? నేను రావణుడనని తెలియదా?" అంటూ అక్కడున్న నానారకాల రాక్షస స్త్రీలను ఆమెపైకి పురుగొల్పుతాడు. అణకువ మాటల్తోకాని, సామదాన వాక్కులతో కాని, భయపెట్టి కాని, అనుకూల, ప్రతికూల వాక్యాలతోకాని, తామర రేకులలాంటి కళ్లున్న సీతాదేవిని తనవశమయ్యేటట్లు చేయమంటాడు. ఇట్లా బెదిరిస్తూ, రాక్షస స్త్రీలను ఆజ్ఞాపిస్తూ, సీతను మళ్లీ, మళ్లీ చూస్తూ, అరుస్తున్న రావణుడిని అడ్డగిస్తుందో స్త్రీ.

ధాన్యమాలిని అనే రాక్షస స్త్రీ రావణుడి చిన్న భార్య. సీతను బెదిరిస్తున్న రావణుడిని అడ్డగించింది. కౌగలించుకుని: "రాజా! తుచ్ఛమనుష్య స్త్రీ, మహానిర్భాగ్యురాలు సీత నీకెందుకు? నాతో రమించి సుఖపడు. రావణుడు దిక్కులన్నీ గెలిచి తెచ్చిన ధనాన్ని అనుభవించే గీత బ్రహ్మదేవుడు సీత ముఖంపైన రాయలేదు. కామంలేని స్త్రీని కామించి, భోగిస్తే అలాచేసిన వాడి ఆరోగ్యం చెడుతుంది. కామం వున్న నన్ను నీమగతనం కొద్దీ రమించు” అని రావణుడిని అర్ధిస్తుంది. ఇలా అంటున్న ఆమెమాటలకు నవ్వుకుంటాడు రావణుడు. దేవగంధర్వ స్త్రీలు, రాక్షస స్త్రీలు, తనచుట్టూ సేవిస్తుండగా, సీతను అనుచితమైన రీతిలో బెదిరించి, మదనోద్రేకానికి గురై, తడపడ్తూ, బంగారంతో ప్రకాశిస్తున్న తన ఇంట్లోకి వెళ్లిపోతాడు రావణుడు. 

No comments:

Post a Comment