Sunday, January 21, 2018

సీతాదేవితో కటువుగా మాట్లాడిన రాక్షస స్త్రీలు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

సీతాదేవితో కటువుగా మాట్లాడిన రాక్షస స్త్రీలు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (22-01-2018)

సీతాదేవి మాటలకు మిక్కిలి కోపంతో, రాక్షస స్త్రీలందరూ, భయంతో వణకుతూ, ఆమె చుట్టూచేరి, -గొడ్డళ్లు తిప్పుతూ, తొర్రికూతలు కూస్తూ, మీద, మీద పడ్తూ: "నువ్వెవతివే? మమ్మల్నీ, రావణుడునీ ఎదిరించి మాట్లాడటానికి? నీకు రావణుడెందుకు పనికిరాడే? వాడుమగవాడు కాదానే?" అని బెదిరిస్తారు. ఆమాటలకు, శోకంతో కన్నీళ్లు కారుతుంటే, భయంతో లేచి శింశుపావృక్షం చాటుకు పోతుంది సీతాదేవి.

ఆమె వెంటనే వచ్చిన "వినత" అనే వికటరాక్షసి చిర్రు, బుర్రులాడుతూ:"నీమగడిపై ప్రేమచూపిస్తున్నావు, మంచిదే. మెచ్చుకుంటున్నాను. ఏదైనా మితిమీరకూడదు. మగడిపైకూడా ఎంతవరకు ప్రేముండాలో అంతే వుండాలికాని అతిగా వుండకూడదు. మితిమీరిందేదైనా కీడుచేస్తుంది. మనుష్యస్త్రీల పాతివ్రత్యం గురించి చెప్పావు. బాగుంది. అంతకంటే మేలైంది ఇంకోటివుంది. ఇంద్రుడితో సమానమైన పరాక్రమవంతుడు, సుందరుడు, రావణుడిని నీవు భర్తగా స్వీకరించు. కనీసం ఒక్కపూటైనా అలాచేసిచూడు. ఇష్టంలేకపోతే వదిలెయ్యి. రావణుడు మహాదాత, భోగమందు ఆసక్తి వున్నవాడు, నేర్పరి. ఎంతమంది భార్యలనైనా సంతోషపెట్టగల ప్రియమైన ఆకారమున్నవాడు. దరిద్ర రాముడిని కట్టుకుని ఏడ్చే దానికంటే రావణుడుని చేసుకో" అంటుంది.

తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ, బుజ్జగిస్తూ అంటుంది సీతతో: "సువాసనగల గంధాన్ని పులుముకొని, బంగారు రత్నాలతో ప్రకాశిస్తున్న సొమ్ములు ధరించి, ఈక్షణం నుండే లోకాలను ఏలు. శచీదేవి ఇంద్రుడికెట్లానో, స్వాహాదేవి అగ్నికెలానో, నువ్వు రావణాసురుడికి అలానే ప్రియురాలివికా. ఎందుకు రాముడనే లోభిని, అల్పాయుష్కుడిని, తింటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలేనివాడిని, పట్టుకొని ఏడుస్తావు? నామాట వినకుండా ధిక్కరిస్తే, నిన్ను ముక్కలు-ముక్కలుగా నరికి ఫలహారంగా తింటాం".

వినత  మాటలు లక్ష్యపెట్టని సీతతో "అసుర" అనే మరో రాక్షసస్త్రీ వికటంగా నవ్వుతూ, గుద్దుతానని బెదిరిస్తూ, పరుషవాక్యాలతో అంటుంది: "ఓసీ దుర్బుధ్ధీ! మా రాక్షస రాజును నువ్వెన్నో మాటలన్నావు. అయినా, నీపై దయతో, సుకుమారివైన నీపై కోప్పడక నిన్ను చంపలేదు. రాముడొస్తాడు, నిన్ను తీసుకోపోతాడంటున్నావే? అదెలా సాధ్యం? ఆ ఒడ్డున వున్నవారికి సముద్ర తీరంలో వున్న ఈ లంక కనపడనేకనపడదు. ఒకవేళ సముద్రాన్ని దాటివచ్చినా, రావణుడి అంతఃపురంలో వున్న నిన్ను కల్సుకోలేడు. కల్సుకొనే ప్రయత్నం చేస్తే, ఇంతమంది కాపలా కాస్తున్న వారిని కాదని నిన్నెట్లు తీసుకోపోగలడు? పంజరంలో చిలకలా మాకు చిక్కావు. ఆ ఇంద్రుడుకూడా నిన్ను కాపాడేందుకు ఇక్కడకు రాలేడు. నేను వ్యర్థంగా మాట్లాడను. నీకు హితమేకాని, అహితం చెప్పను. నామాటలు చెవికెక్కించుకో. కన్నీళ్లు కార్చవద్దు. శోకం కీడుచేస్తుంది. నీకీ యవ్వనం శాశ్వతంకాదు. అదిపోకముందే విస్తార సౌఖ్యాలను అనుభవించు. అమరారినేతతో క్రీడించడం నీకేమైనా చేదా? రావణుడిని భర్తగా స్వీకరిస్తానని ఒక్క మాటను....ఏడువేల స్త్రీలొచ్చి నీ భజన చేస్తారు. మా మాటలు వినకపోతే, నీ రొమ్ములు చీల్చి, రుచిగల నీ రక్తాన్ని తాగుతా."


ఆ తర్వాత "చండోదరి" అనే మరో రాక్షసి భయంకరంగా త్రిశూలం తిప్పుతూ,"జింక కన్నుల లాంటి కళ్లున్న నిన్ను చూస్తుంటే ఎప్పుడు కొరుక్కుని తనివితీరా తిందామా" అనిపిస్తున్నది అంటుంది సీతతో. "ప్రఘస" అనే ఇంకొకతి:"ఈచర్చ ఎందుకు? సీత గొంతు నులిపేద్దాంచస్తుంది. అదే చచ్చిందని రావణుడితో చెప్పుదాం. తినండిపోయి అంటాడాయన. దీనికెందుకింత ఉపేక్ష?" అంటుంది. అంతా మాటలు చెప్పేవారే కాని చేసేవారెవరూ లేరని సాధిస్తూ "అజాముఖి" అనే రాక్షసి, "సారాయిలో వేసుకుని సీత మాంసం తిందాం. తొన్దరగా వెళ్లి ఊరగాయలు తెండి" అని ఇతరులను పురమాయిస్తుంది. అజాముఖి సత్యం చెప్పిందనీ, కల్లు తెచ్చుకుని, మాంసం కల్లులో నంజుకుంటూ "నికుంబిల" దేవాలయంలో గంతులు పెడ్తూ తిందామని "శూర్ఫణక" అనే రాక్షసి అంటుంది.

ఈ విధంగా రాక్షస స్త్రీలు బెదిరిస్తూ మాట్లాడుతుంటే, సీతాదేవి "రామా" అంటూ గొంతెండగా ఏడ్చింది. (లంకలో వున్న సీతాదేవి రాక్షస స్త్రీలతో పడ్డ బాధల్లాంటివే, దేహంలోని "బధ్ధజీవుడు" సంసారమనే ఇంద్రియాలతో పడే బాధలు. రావణుడు కానీ, రాక్షస స్త్రీలు కానీ, సీతను బెదిరించారే కాని, చంపలేక పోయారు. అదే విధంగా, "జీవాత్మ" ను ఏవీ చంపలేవు. బాధించ గలుగుతాయి. సీతాదేవి లాగా బధ్ధ జీవులు "ప్రారబ్ధ" మని, దృఢ చిత్తంతో, భగవంతుడే రక్షిస్తాడని అమిత విశ్వాసంతో వుండాలి. సీతాదేవి ఇన్ద్రియాలకు లోబడలేదని, భ్హగవన్తుడి మీదే విశ్వాసమ్ వున్చిన్దని దృఢ పడ్తున్నది. తర్వాత జీవుడు చేయాల్సిన భగవధ్యానమ్, సీతా విలాప రూపంలో మున్ముందు విశదమౌతుంది).

నీచ రాక్షసులకు, మనుష్యస్త్రీలకు పొత్తంటే, అది భూలోకంలోనే విపరీతంగా భావించాలనీ, ఆలోచనలేక రాక్షసస్త్రీలు చెప్తున్న మాటలను తాను వినే ప్రసక్తే లేదనివాళ్ళేం చేయదల్చుకుంటే అదే చేయొచ్చుననీ, వాళ్లిష్టమొచ్చినట్లు తినదల్చుకుంటే తినవచ్చనీ, ఎక్కెక్కి ఏడుస్తూ జవాబిస్తుంది సీత రాక్షసమూకకు. (రాక్షస స్థానంలో "ప్రకృతి", మనుష్య స్థానమ్లో "జీవాత్మ" వుందని గ్రహించడమే! మనుష్యులకు, రాక్షసులకు విజాతీయ భేదమున్నట్లే, అచేతనమైన "దేహాని" కీ, చేతనమైన "ఆత్మ" కు తారతమ్యం వుంటుంది). 

No comments:

Post a Comment