Wednesday, April 11, 2018

గుడి ప్రగతికి కొత్త ఒరవడి : వనం జ్వాలా నరసింహారావు


గుడి ప్రగతికి కొత్త ఒరవడి
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (12-04-2018)

ఒకప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ధీరుడు, శూరుడు, గొప్ప ఆధ్యాత్మికవేత్త, ధార్మిక వీరుడు, ధర్మ నిబద్ధత గల నేత అని పొగిడినవారే తెలంగాణ దేవాలయాలు దూప దీప నైవేద్యాలకి నోచుకోకుండా మూతపడిపోయాయనీ, ఒక వేళ మూతబడ్డ దేవాలయాలు ప్రభుత్వం తెరిపించ లేకపోతే వాటిని తెరిపించడానికి ఎవరో ఒక వ్యక్తి వచ్చేస్తాడనీ, గొర్రెలు-బర్రెలు ఇచ్చే ప్రభుత్వం గోవులను ఎందుకు రక్షించడం లేదనీ, రాష్ట్రంలో ఆధ్యాత్మిక లేదనీ అంటూ ఇటీవల కాలంలో పనికట్టుకుని విమర్శించడం హాస్యాస్పదం. అలా విమర్శిస్తున్న మహానుభావుడే నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ రవీంద్రభారతిలో పాలకుర్తి నృసింహరామశర్మ సత్కార కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ ధార్మిక ప్రస్థానాన్ని కొనియాడారు. దరిమిలా తనకు హైద్రాబాద్ లో ఆశ్రమం నిర్మాణానికి భూమి కావాలని కూడా కోరినట్లు వార్తలొచ్చాయి. ఆయనప్పుడు అలా ఎందుకు పొగిడారో, ఇప్పుడెందుకు విమర్శిస్తున్నారో ఆయనకే అర్థం కావాలి.   

తెలంగాణ రాష్ర్టం ఆవిర్భవించిన నాటి నుంచి ఆధ్యాత్మికతకు పెద్ద పీట వేస్తూ ఆదిశగా ఆలోచనలు సాగిస్తూ, రాష్ట్ర ప్రజల ఉజ్వల భవితను ఆకాంక్షిస్తూ కనీవినీ ఎరుగని రీతిలో సొంత ఖర్చుతో అయుత చంఢీయాగాన్ని అత్యంత నిష్టాగరిష్టలతో, సంప్రదాయబద్దంగా, పెద్ద ఎత్తున అయిదురోజుల పాటు నిర్వహిం చారి సీఎం కేసీఆర్. అటు లోక కల్యాణం, ఇటు ప్రజల సుఖశాంతులను ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఈ అయుత చండీయాగం ఫలితాలు ఆ తరువాతికాలంలో రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపించాయి. యాగంలో భాగంగా అనేకమంది పీఠాధిపతులను, బ్రాహ్మణులను, హైందవమాట పెద్దలను సత్కరించి, వారి ఆశీస్సులను అందుకున్న ముఖ్యమంత్రి ఆధ్యాత్మికత పట్ల తన నిబద్ధతను నిస్సందేహంగా ప్రదర్శించారు.

తన ఆధ్యాత్మిక కోణం పరంపరలో భాగంగా, బ్రాహ్మణుల, అర్చకుల, దేవాలయాల అభివృద్దికి, సంక్షేమానికి అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం గడచిన నాలుగేండ్లలో ప్రవేశపెట్టడం జరిగింది. మునుపన్నడూ ఎరుగని రీతిలో దేవాలయాలు కొత్త రూపాన్ని సంతరించుకొని భక్తకోటి ఆనందాన్ని, సంతోషాన్ని చూరగొంది. బధ్రాద్రి, యాదాద్రి, వేములవాడ, కొమరెల్లి మల్లన్న లాంటి దేవాలయాలను అభివృద్ధి దిశగా తీసుకుపోవడం జరిగింది-జరుగుతున్నది.

తెలంగాణ సమాజంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన పేదల అభ్యున్నతికి పాతుపడుతున్నట్లే, బ్రాహ్మణుల సంక్షేమానికి, ఆ సామాజిక తరగతిలోని పేదల అభివృద్ధికి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బ్రాహ్మణ సదన్ పేరుతో బ్రాహ్మణ సంక్షేమ భవన నిర్మాణానికి 6 ఎకరాల స్దలాన్నిచ్చి, నిర్మాణానికి రూ.10 కోట్లను కేటాయించటం జరిగింది. హైదరాబాద్ సమీపంలోని గోపన్నపల్లిలో బ్రాహ్మణ సదన్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. నిర్మాణం కొనసాగుతున్నది. ఇక్కడే పెద బ్రాహ్మణ విద్యార్థులకు వసతి, పీఠాధిపతులకు వసతిని ఏర్పాటు చేయనున్నారు.  బ్రాహ్మణ యువతీ, యువకుల నైపుణ్య అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.  అందులో భాగంగానే పెళ్లిళ్లకు కళ్యాణ మండపం, శుభకార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక హాలును నిర్మించనున్నారు. బ్రాహ్మణ పరిషత్ కు 2016-17, 2017-18 మరియు 2018-19 ఆర్థిక సంవత్సరాలలో వార్షిక పద్దుకింద రూ.100 కోట్ల చొప్పున కేటాయించటం జరిగింది. ఈ నిధులను బ్రాహ్మణుల సంక్షేమానికి, అభివృద్ధికి ఉపయోగిస్తారు.


దేవాలయాల అభివృద్ది, పునరుజ్జీవనానికి పెద్దపీట వేస్తూ తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవస్థానాలను అభివృద్ది చేయటానికి సంకల్పించింది రాష్ట్ర ప్రభుత్వం.

భద్రాచలం ఆలయానికి ఉన్న ప్రాశస్త్యం, ప్రపంచవ్యాప్తంగా శ్రీరామచంద్రుడిపై ప్రజలకున్న భక్తి ప్రపత్తులను పరిగణనలోకి తీసుకొని భద్రాద్రి ఆలయాన్ని దేశంలోనే ఒక అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించి,  ఖర్చులకు వెనుకాడకుండా భద్రాద్రి ఆలయాన్ని ఆధ్యాత్మిక దివ్యవైభవ క్షేత్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టింది. పరమహంస పరివ్రాజకులు, శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌స్వామీజీ సూచనల ప్రకారం ఆలయ శిల్పి ఆనందసాయి బృందం రూపొందించిన దేవాలయ అభివృద్ధి నమూనాల ఆధారంగా సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయాన్ని అభివృద్ధిచేయాలని సూచించారు. మూలవిరాట్టు కొలువై ఉన్న గర్భగుడి, చారిత్రాత్మక, పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యంగల కట్టడాలకు ఆటంకం కలుగకుండా నిర్మాణాలను చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. 2018-19 బడ్జెట్ లో భద్రాద్రి దేవస్థానానికి రూ.100 కోట్లు కేటాయించారు. అలాగే కొమురవెల్లి దేవస్థానానికి గాను 166 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దేవాలయ అభివృద్ది పనులకు రూ.10 కోట్లు మంజూరు చేసారు.

          సుందర పుణ్యక్షేత్రంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని తీర్చిదిద్దేందుకు గాను ప్రతి ఏటా బడ్జెట్‌లో 100 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా కేటాయిస్తూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టను సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దటానికి సంకల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. 2018-19 బడ్జెట్లో యాదాద్రి టెంపుల్ అథారిటీకి ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది. 13 ఎకరాల విస్తీర్ణంలో రాతితో చేపట్టిన ఆలయ నిర్మాణ పనులను చేపట్టింది. ఆలయ గోపురాలు, మండపాలు, ప్రాకారాల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో ఏడు గోపురాలు, ప్రాకారాలు, మండపాలు నిర్మిస్తున్నారు. ప్రధాన దేవాలయం, గోపురాలు,  ప్రాకారాలు, ప్రసాదం కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్,  శివాలయం, క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణం, రథ మండపం, మెట్ల మార్గం  తదితర పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

వరంగల్ భద్రకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి మొక్కులు సమర్పించారు. అలాగే తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు ఆభరణాలను స్వామివారికి సమర్పించారు. తిరుపతి పద్మావతి అమ్మవారికి విలువైన ముక్కు పుడకను సమర్పించారు. కురవి వీరభద్ర స్వామి దేవాలయానికి 75 వేల రూపాయల విలువైన 25 గ్రాముల బరువుండే బంగారు కోర మీసాలను సమర్పించారు. దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయ అభివృద్దికి రూ.51 కోట్లు విడుదల చేశారు. 2017-18 బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారు. 2018-19 బడ్జెట్లో వేములవాడ డెవలప్ మెంట్ అథారిటీకి రూ.100 కోట్లు కేటాయించారు.

రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ‘‘దూపదీప నైవేద్యం’’ పథకం కింద గతంలో కేవలం రూ.2500 అందజేస్తుండగా దానిని 6 వేల రూపాయలకు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. 1,805 ఆలయాలు ఈ పథకం పరిధిలో ఉన్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రతీ నెల రూ.1.08 కోట్లు వెచ్చిస్తున్నది. దూపదీప నైవేద్యం క్రింద మరో 3 వేల ఆలయాలకు నెలకు 6 వేల చొప్పున ఇవ్వనున్నారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 4805 దేవాలయాలకు దూపదీప నైవేద్యం పథకం వర్తిస్తుంది.

    దేశంలో ఏ ప్రభుత్వము కూడా తీసుకోలేకపోయిన సాహసోపేతమైన నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొని దేవాలయ అర్చకులకు, ఉద్యోగులకు వేతన వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్ర దేవాదాయశాఖ నిర్వహణలోని 646 దేవాలయాలలో పనిచేస్తున్న అర్చకులకు, ఉద్యోగులకు ఒకటవ తారీకునే జీతాలు ఇస్తున్నారు. నేరుగా వారి బాంక్ ఖాతాలలో వేతనాలు జమ అయ్యేవిదంగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అర్చకుడికి కనీస వేతనం రూ.25 వేలు లభిస్తున్నది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగికి రూ.25 వేలు జీతభత్యాలుగా లభిస్తున్నాయి. అదేవిధంగా అన్యాక్రాంతమైన ఆలయ భూముల వివరాలు సేకరించింది. ఇందుకోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది.

కామన్ గుడ్ ఫండ్ కింద నిధులను దేవాలయాల పునర్ణిర్మాణం, మరమ్మతులకు  వినియోగించడం జరుగుతుంది. ఈ నిధులనుండే దూపదీప నైవేధ్యానికి అయిన ఖర్చులు, వేదపాఠశాలల ఏర్పాటు వాటి నిర్వహణ చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం సిజిఎఫ్ నిధుల ద్వారా 1361 దేవాలయాల్లో పునరుద్దరణ పనులు గుర్తించగా అందుకు రూ.254.78 కోట్లు కేటాయించగా ఆ మొత్తం నుండి రూ.46.58 కోట్లు విడుదల చేశారు. డబ్య్లు.ఎస్.హెచ్.సి. పనుల నిమిత్తం 720 దేవాలయాలను గుర్తించగా వాటికి గాను 48.22 కోట్లు మంజూరు చేయగా అందులో రూ.6.90 కోట్లు విడుదల చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గానూ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సిజిఎఫ్ లో రూ.50 కోట్లు మంజూరు చేయగా అందులో రూ.7.50 కోట్లు చెల్లించటం జరిగింది.

          ప్రభుత్వ పెత్తనాన్ని తగ్గించడానికి ఇకపై దేవాలయాల నిర్వహణ, తదితర వ్యవహారాలన్నీ పర్యవేక్షించడానికి కొత్తగా ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసే ఆలోచనలో వుంది ప్రభుత్వం. ఈ పరిషత్ ఆధ్వర్యంలోనే ఇకపై దేవాలయాల నిర్వహణ ఉంటుంది. దీంతో దేవాలయాలపై ప్రభుత్వ ఆధిపత్యం తగ్గుతుంది.

బ్రాహ్మణుల సంక్షేమానికి, దేవాలయాల అభివృద్దికి, ఆద్యాత్మిక చింతన ప్రోత్సహించడానికి తోడ్పడటంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత పదవులలో నియమితులైన బ్రాహ్మణ అధికారులు రాష్ట్ర అభివృద్దిలో తమవంతు కృషిని అందించటం జరుగుతుంది. పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను తెలంగాణ రాష్ట్ర ప్రధాన సలహాదారుగా, మీడియా సలహాదారుగా-తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడిగా విశ్రాంత ఐఎఎస్ అధికారి కె.వి.రమణాచారిని,  పోలీసు వ్యవహారాల సలహాదారుడిగా మాజీ డీజీపీ అనురాగ్ శర్మను, ఇలా పలువురిని సీఎం ఉన్నత పదవుల్లో నియమించారు.

          అన్ని స్థాయిలలో బ్రాహ్మణుల సేవలను వినియోగించుకుంటూ, అర్చకులను ఆదుకుంటూ, దేవాలయాలను అభివృద్దిపరుస్తూ, ధూప-దీప నైవేద్యానికి నిధులను ఇస్తూ, వారి సమగ్ర వికాసానికి దోహదపడుతూ, ఆధ్యాత్మిక ఫరిడవిల్లేలా ఒక నూతన ఒరవడిని సృష్టిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం-దాని సారధి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

3 comments:

 1. dear sir very good blog and very good content
  Telangana Districts News

  ReplyDelete
 2. బ్రాహ్మణుల సంక్షేమానికి ఇంతగా వితరణ చేసిన కేసీఆర్ మూడు సంవత్సరాల నుండీ భద్రచలం కళ్యాణానికి ఎందుకు వెళ్ళలేదు ? విడిపోయిన జంటకి కళ్యాణం ఎందుకులే అని భావిస్తున్నారా ?

  ReplyDelete
 3. good afternoon
  its a nice information blog...
  The one and only news website portal INS media.
  please visit our website for more news update..
  https://www.ins.media/

  ReplyDelete