Sunday, April 29, 2018

హనుమ ద్వారా రామలక్ష్మణుల చిహ్నాలను తెలుసుకుంటున్న సీత ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


హనుమ ద్వారా రామలక్ష్మణుల చిహ్నాలను తెలుసుకుంటున్న సీత
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (30-04-2018)
"తేజస్సు, యశస్సు, శ్రీ అనే మూడింటివల్ల వ్యాపించిన వాడు శ్రీరామచంద్రుడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలలో ధర్మార్ధకామాలను ఆలోచించి చేస్తాడు. కళ్లు, దంతాలు తెల్లగా వుంటాయి. పరిశుధ్ధమైన మాతా, పితృ వంశాలున్నవాడు. సత్యం వీడనివాడు. స్వధర్మమందు విశేషమైన ప్రీతిగలవాడు. ధనార్జనలోనూ, దానం చేయడంలోనూ మిక్కిలి అసమానుడు. శ్రీతో నిత్యయోగం కలవాడు. రామచంద్రమూర్తి సవతి తల్లి కొడుకైనప్పటికీ, సొంత సోదరుడిలాగా వుండే లక్ష్మణుడు యుధ్ధమందు అజేయుడు. సద్గుణంలొ, రూపంలో, ప్రేమలో, రాముడిలాంటివాడే. వారిరువురూ నీకోసమై భూమంతా వెతుక్కుంటూ, మేమున్న చోటుకు వచ్చారు".

(రాముడిని గురించి చెప్పిన హనుమంతుడు, అతడు "బ్రహ్మచర్యనిష్ట" కలవాడంటాడు. బ్రహ్మచర్యం రెండువిధాలయింది. మొదటిది గృహస్థుడు రుతుకాలంలో మాత్రమే తన భార్యతో సంగమించి, తక్కిన రోజుల్లో స్త్రీ సాంగత్యాన్నే మానడం. రెండోది స్త్రీ సంభోగాన్నే పూర్తిగా మానడం. స్త్రీకి రజోదర్శనమైన నాటినుండి పదహారు రోజులు రుతుకాలమంటారు. వీటిలో మొదటి నాలుగు రోజులు నిశిద్ధం. పదకొండు, పదమూడు రాత్రిళ్లుకూడా పనికిరావు. తక్కిన పదిరోజుల్లో: ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి పితృదినాలు కాబట్టి వదిలిపెట్టాలి. మిగిలిన రోజులు ప్రశస్తమైనవి. రుతుకాలంలో భార్యాభర్తలు ఆరోగ్యంగా వుండి, వీర్యాన్ని వ్యర్థం చేస్తే, భ్రూణహత్యా దోషం వస్తుంది. ఇదిముగ్గురు కొడుకులు కలిగేవరకేకాని ఆ తర్వాత ఈ నియమం లేదు. ఆ తర్వాత భార్యనుకూడా చెల్లెలి లాగానే చూడాలి. పరస్త్రీలను తల్లుల్లాగా చూడాలి. సరిదినాలందు కలిస్తే పుత్రులు, బేసిదినాలయితే పుత్రికలు కలుగుతారు. పదిహేనోరోజు రాత్రి పురుషుని కలిసిన స్త్రీకి, రాజపత్ని, పతివ్రత, శ్రేష్టులైన పుత్రులను కనే కూతురు కలుగుతుంది. పదహారోరోజైతే, విద్యాలక్షణ సంపన్నుడు, సత్యవాది, జితేంద్రియుడు, సర్వభూతాశ్రితుడగు కొడుకు పుడుతాడు.

ఇక స్త్రీ సంభోగమే మానడం రెండోరకమైన బ్రహ్మచర్యం. ప్రేమ, అభిలాష, రాగం, స్నేహం, ప్రేమం, రతి, శృంగారం, అనే ఏడురకాలైన సంభోగాలున్నాయి. అందగత్తెలను చూడాలన్న కోరికను "ప్రేమ" అంటారు. ఆ విషయమైన చింతే "అభిలాష". అలాంటివారితో సంగమించాలన్న బుధ్ధిని, "రాగ"మనీ, దానిపైనే మనస్సు వుంచడం "స్నేహ"మనీ, అట్టివారిని విడిచి వుండలేకపోవడం "ప్రేమం" అనీ అంటారు. వారితో కలిసి-మెలిసి తిరగడం, "రతి", క్రీడించడం, " శృంగారం ". ఈ ఏడింటినీ సంభోగమనే అన్టారు.

స్త్రీలతో ఒంటరిగా మాట్లాడడం, వారితో తల దువ్వించుకోడం, తలంటి పోయించుకోవడం, స్పృసించడం, నిశిద్దం. స్త్రీలు తల దువ్వుకుంటున్నప్పుడు, పడుకున్నప్పుడు, స్నానం చేసేటప్పుడు చూడరాదు. వయస్సున్న స్త్రీలను, పీనుగుల్లాగానన్నా చూడాలి  లేదా, ఐదారేళ్ల పిల్లవాడిలాగానన్నా వుండాలి. ఈ బ్రహ్మచర్య గుణాలన్నీ శ్రీరాముడిలో వున్నాయని హనుమంతుడు చెప్పాడు.

(హనుమంతుడు మొదలు, శ్రీరాముడి ఆత్మ గుణాలను వర్ణించి, తర్వాత దేహ గుణాలను వర్ణిస్తాడు. "తేజస్సు-యశస్సు-శ్రీ" ల వల్ల వ్యాపించినవాడంటాడు. బ్రహ్మచర్య నిష్ట గలవాడంటాడు. రాముడిని వర్ణించిన హనుమంతుడు, ఆయన్ని గురించి చాలా నిగూడంగా చెప్తాడు. స్పష్టంగా చెప్పి వుండేవాడే కాని, అలా చెప్తే చెప్పడం తెలియని వాడని, అడవి మనిషని, సీత అనుకొని వుండేది. "లింగం, వృషణం" గురించి కూడా చెప్పాడు. ఔచిత్యం పాటించక పోతే, " ఇటువంటివాడు రామ దూతగా వుండజాలడు " అని సీతాదేవి తీర్మానించేదే! అసలామె ప్రశ్న వేసింది కూడా హనుమంతుడెలా చెప్తాడని తెలుసుకునేందుకే! జరిగిన విషయాన్ని రామలక్ష్మణుల శుభ లక్షణాలను విలక్షణంగా వర్ణించిన హనుమంతుడు ఎక్కడా తన ఔన్నత్యాన్ని చెప్పుకోలేదు. ఆత్మస్తుతి చేసుకోలేదు. ఇంత ఘనకార్యంవర్ణించి చేసికూడా ఇదంతా రాముడి చలవే అని తలవంచి సవినయంగా విన్నవించగల నిరుపమ వినయశీలి హనుమంతుడు.)


శ్రీరామ సుగ్రీవులెలా కల్సుకున్నారో సీతాదేవికి చెప్పిన హనుమంతుడు
"సీతకొరకై వెతుకుతున్న శ్రీరామలక్ష్మణులు మేమున్నచోటుకు వచ్చారు. అన్నరాజ్యంలోంచి వెళ్లగొట్టబడి, ఋశ్యమూకాద్రిపై మేమందరం సేవిస్తుండగా, భయపడుతూ నివసిస్తున్న సుగ్రీవుడు, నారచీరెలు ధరించి, చేతులో బాణాలలతో వస్తున్న వారిని చూసాడు. చూసి భయపడి వారెవరో తెలిసికొనిరమ్మని నన్ను పంపాడు. నాకంటికి వారు మహాత్ముల్లాగా కనపడినందున, వినయంగా, చేతులు జోడించి, వారిదగ్గరకు పోయాను. నన్నాదరించి, గౌరవించిన వారిద్దరినీ, తీసుకునివచ్చి సుగ్రీవుడి ఎదుట నిలిపాను". (నేను-నేను, అను ఉత్తమ పురుష లక్షణం చెప్పడం అహంకారంతో కాదు. రామ, సుగ్రీవుల కలయికలో, తనకున్న సంబంధాన్ని, తాను లక్ష్మణుడిని ఎలా ఎరుగుదునన్న ప్రశ్నకు సమాధానంగా చెప్పడానికే అలా అన్నాడని అనుకోవాలి)

"కలిసిన రామ, సుగ్రీవులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, ఒకరినొకరు నమ్మారు. ఒకరి దుఃఖం ఇంకొకరికి చెప్పుకుని, సమాధాన పరుచుకున్నారు. తనభార్యను అపహరించాలనుకున్న ఆయన అన్న వాలి, సుగ్రీవుడిని వెళ్లగొట్టాడు. ఆ అవమానాన్ని సహించలేని సుగ్రీవుడిని నీ మగడు సమాధానపర్చాడు. వాలి, సుగ్రీవుల కలహకారణం ఇదే. నీ ఎడబాటుతో దుఃఖిస్తున్న శ్రీరాముడి చరిత్రను లక్ష్మణుడు సుగ్రీవుడికి చెప్పాడు. ఆ సంగతి విన్న సుగ్రీవుడు తేజోవిహీనుడయ్యాడు. గతంలో రావణాసురుడు, ఆకాశమార్గాన నిన్ను ఎత్తుకుని వెళ్తున్నప్పుడు, నువ్వు, భూమిమీద పడేసిన ఆభరణాలను నేను భద్రపరిచాను. వాటిని సుగ్రీవుడు రామచంద్రమూర్తికి చూపాడు. కాని, ఆయన మనస్సు సంతోషపడటానికి, నీ జాడ మాత్రం చెప్పలేకపోయాం. నీ ఆభరణాలను వళ్లో వుంచుకున్న రాముడు, శోకాగ్నితో కాలిన వాడిలాగా, వెక్కి, వెక్కి ఏడుస్తుంటే, స్మృతి తప్పినప్పుడు, నేనే, మూర్ఛపోకుండా చేసి ఓదార్చాను".

No comments:

Post a Comment