Sunday, April 8, 2018

హనుమ-సీత తొలి సంభాషణ, ఉభయ కుశలోపరి ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? :వనం జ్వాలా నరసింహారావు


హనుమ-సీత తొలి సంభాషణ, ఉభయ కుశలోపరి
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (09-04-2018)

హనుమంతుడు తన భర్తను కీర్తించినందుకు, సంతోషించిన సీత, చెట్టుపైనున్న ఆయనతో తన గురించి చెప్పసాగింది ఇలా:
"కీర్తితో ప్రకాశించే రాజశ్రేష్టుడైన దశరధుడి కోడలను నేను. జనకరాజు కూతుర్ని. చంద్రబింబం లాంటి ముఖమున్న రామచంద్రుడి భార్యను. నాపేరు సీత. (స్త్రీ మొదట తన మామగారి పేరు చెప్పాలి-అలాంటి వారి కోడలిని అని చెప్పాలి. తరవాత తండ్రి పేరు, తన పేరు, ఆ తర్వాతనే భర్త పేరు చెప్పాలని పెద్దలంటారు. ఆ మర్యాదను పాటించి, ఆ క్రమంలో తన పరిచయం చేసుకున్నది సంస్కార సంపన్న అయిన సీతమ్మ) మనుష్యులనుభవించదగిన భోగ-భాగ్యాలన్నీ అనుభవిస్తూ, కోరికలను తీర్చుకుంటూ, పన్నెండు సంవత్సరాలు శ్రీరాముడింట్లో వున్నాను. పదమూడో ఏట దశరథుడు నా భర్తను రాజును చేయాలనుకున్నాడు. ఆయన్ను రాజును చేస్తే, నీళ్లు త్రాగను, తిండి తినను, ప్రాణాలు కూడా పోగొట్టుకుంటానన్నది దశరథుడి ముద్దుల భార్య కైకేయి. సత్యవర్తనుడవైన దశరథుడు తనకిచ్చిన మాటప్రకారం రామచంద్రమూర్తిని అడవులకు పంపాలని కోరుతుంది. ఆ కఠినమైన మాటలకు బాధపడ్డ దశరథుడు మూర్ఛలో మునిగి, తేలి, భార్యకేమీ సమాధానం చెప్పలేక, అయిష్టంగానే తనపెద్దకొడుకును రాజ్యం వదిలి పొమ్మంటాడు. నాభర్తకు రాజ్యాభిషేకం కంటే, తండ్రి మాట నెరవేర్చడమే ఎక్కువ కావటాన, ఆయన మాటప్రకారం నడుచుకోదల్చాడు. ప్రాణ రక్షణకోసం కూడా, నా మగడు ఇతరులకు అప్రియం చేసేవాడు కాడు. మంచితనంగా ఎవ్వరేమడిగినా, ఇచ్చేవాడే కాని, ఒకరిదగ్గర ఏమీ తీసుకునే మనిషి కాదు."

"తండ్రిపైనున్న భక్తి, గౌరవాల వల్ల, సమస్త ఐశ్వర్యాలను, భోగభాగ్యాలను, వెలగల వస్త్రాలను, వదిలిపెట్టి, తక్షణమే వనవాసానికి పోవడానికి కావాల్సిన, దర్భలు, జింకచర్మాలు తెప్పించుకున్నాడు రాముడు. నన్ను తన తల్లికి అప్పగించే ప్రయత్నం చేసాడుకాని, ఆ పుణ్యాత్ముడిని వదిలుంటే, నాకు స్వర్గం కూడా రుచిన్చదని భావిన్చాను. అన్దుకే శ్రీరాముడికన్టే నేనే మున్దుగా, అడవులకు బయల్దేరాను. ఆయన పైనున్న భక్తివల్ల, ఆయన్ను సేవించాలని హృదయమున్న లక్ష్మణుడు, అన్నకంటే ముందుగానే నారచీరెలు కట్టాడు. (నిజానికి రాముడి తర్వాతనే లక్ష్మణుడు నార బట్టలు ధరించాడు. కానీ సీతమ్మకు లక్ష్మణుడిపైనున్న సహృదయం, వాత్సల్యం వల్ల తమకంటే లక్ష్మణుడే ముందు అరణ్యానికి సిద్ధమైనాడనీ, నారబట్టలు ధరించాడనీ అంటుంది) ఇలా మేము ముగ్గురం వనవాస దీక్ష తీసుకుని, రాజాజ్ఞ ప్రకారం భయంకరమైన అడవిలో ప్రవేశించాం. రాముడి భార్యనైన నన్ను, వంచనతో, రావణాసురుడు దొంగతనంగా ఎత్తుకొచ్చాడు. అందుకే ఇక్కడ దిక్కులేక ఏడుస్తున్నాను. పన్నెండు నెలలు గడువిచ్చాడు వాడిమాట వింటానికి. అందులో ఇన్కా రెండునెలలే మిగిలి ఉన్నాయి. ఆ గడువు ముగిస్తే చస్తాను. ఈ లోపల రామచంద్రమూర్తి రాకపోతాడా అన్న ఆశతో చావకుండా బ్రతికున్నాను".

శ్రీరామలక్ష్మణుల కుశల వార్తను సీతాదేవికి చెప్పిన హనుమంతుడు
సీతాదేవి మాటలను విన్న ఆంజనేయుడు, ఆమెను ఊరడిస్తూ అన్నాడీవిధంగా:"దేవీ! రామచంద్రమూర్తి నీకోమాట చెప్పమని పంపినందువల్ల, ఆయన దూతగా నేనిక్కడకు వచ్చాను. ఆయన క్షేమమని నీతో చెప్పమన్నాడు. బ్రహ్మాస్త్రాలతో సహా, సకల అస్త్ర విద్యలు తెలిసినవాడూ, వేదార్ధాలను, సర్వవిషయాలను తెలిసిన జ్ఞానీ, ధర్మశాస్త్రాలు తెలిసిన వాడూ, అయిన శ్రీరాముడు, ఎప్పుడేపని చేయాల్నో తెలిసినవాడైనందున, నీ క్షేమసమాచారం తెలుసుకుని రమ్మన్నాడు. శౌర్యగర్వమే ధనంగా భావించే లక్ష్మణుడు, నీభర్తకు సేవచేస్తూ, ప్రియుడై వున్నాడు. ఆయన నీకు సాష్టాంగ నమస్కారమని చెప్పమన్నాడు. వారిరువురూ కుశలం. హనుమంతుడు చెప్పిన ఈమాటలను విన్న సీతాదేవి సంతోషపడి, తనువెల్ల పులకరిస్తుంటే ఇలా బదులు చెప్పుతుంది:


"ఆంజనేయా, బ్రతికుంటే, వందేళ్లకైనా మనిషి సంతోషం అనుభవించ వచ్చని ఓ సామెత విన్నాను. అది నిజమని అనిపిస్తున్నది. నేను ప్రాణాలు బిగపట్టుకుని బ్రతికి వుండబట్టేగదా ఈ సంతోషవార్త విన్నాను. చచ్చిపోతే ఈ భాగ్యం లేకపోయేదికదా!" శుభవార్త తెలిపిన హనుమంతుడిపై సీతాదేవికి ప్రేమకలుగుతుంది. ఒకర్నొకరు నమ్మి మాట్లాడుకోవడం ప్రారంభించారు. సీతాదేవి చెప్పిన మాటలను విన్న హనుమంతుడు, ఈమెకు తనమీద దృఢమైన నమ్మకం కుదిరిందన్న విశ్వాసంతో, ఆమెను బుజ్జగిస్తూ, ఆమె దుఃఖాన్ని అణచటానికి, కొద్ది-కొద్దిగా ఆమె దగ్గరకు పోసాగాడు. ఆయనలా దగ్గరకు వస్తుంటే, రావణాసురుడే ఈవేషంలో తనతో మాట్లాడడానికి వచ్చాడన్న భయం కలిగింది సీతాదేవికి.

హనుమంతుడిని రావణుడేమోనని శంకించిన సీత
హనుమంతుడు దగ్గరకొస్తున్నకొద్దీ, సీత తాను మోసపోయానేమో అనుకుంటుంది. రావణుడే మారువేషంలో, వచ్చాడనీ, ఇంతమాత్రం ఆలోచించక వీడితో చనువుగా మాట్లాడాననీ, రామదూతంటే ప్రేమతో నమ్మాననీ, ప్రమాదంలో పడ్డాననీ భయపడి, పట్టుకున్న చెట్టుకొమ్మను వదిలి, దుఃఖిస్తూ, నేలపై కూలబదిండి. శరీరం వణకుతూ, బాధపడుతున్న సీతను చూసి, హనుమంతుడు రెండు చేతులెత్తి నమస్కరిస్తాడు. సీతాదేవి అది చూడకుండానే, దుఃఖంతో నిట్టూర్పులు విడుస్తూ; "నువ్వెవరివో తెలిసిపోయింది. ఎందుకిట్లా దొంగ వేషం వేసుకుని, నన్ను బాధపెడ్తావు? దీనివల్ల నీకు కలిగే మేలేంటి? దండకారణ్యంలో నేనున్నప్పడు, సన్యాసివేషంలో వచ్చిన మాయలమారివి నీవుకాదా? బలం లేనిదాన్ని, తిండితిననిదాన్ని, ఏడుస్తున్నదాన్ని, నన్నీప్రకారం బాధపెట్టడం నీకు తగునా? " అంటుంది. ఇలా అంటూనే ఓ పక్క తాను తప్పుగా అనుకుంటున్నానేమో అనికూడా భావిస్తుంది. ఈవిధన్గా అంటుంది ఆంజనేయుడితో:

"ఒకవిధంగా చూస్తే నీవు రావణుడివి కావేమోనని అనిపిస్తున్నది. ఎందుకంటే వాడిని చూస్తేనే నామనస్సు చిర-చిరలాడుతుంది. కాని నిన్ను చూస్తుంటే ప్రేమ పుట్టుకోస్తోంది. నా అంతఃకరణ నన్ను మోసంచేయదు. నీవు నిజంగా రామదూతవే అయితే నాకు ప్రియమైన ఆయన గుణాలు వర్ణించు. అలాచేస్తే నాకు అమిత సంతోషం కలుగుతున్ది. రావణుడైతే రామచంద్రుడిని కీర్తించడు కద!" (భగవత్ గుణానుభవంలో అభిలాష వుండి, భగవద్గుణానుసంధానం చేస్తూ, శిష్యుడికి, భగవత్ గుణాలను వర్ణించి చెప్పేవాడే నిజమైన "గురువు-ఆచార్యుడు". అట్లా చేయకపోతే వారిని నమ్మకూడదు. దగ్గరకు రానీయ కూడదని దీనర్థం.)

గొప్ప ప్రవాహ వేగానికి ఆనకట్టనుగూడా ప్రవాహంలోకి ఈడ్చుకు పోయేటట్లుగా, సౌమ్యమైన హనుమంతుడి ఆకారం తనమనస్సును ఆయన వైపుకు లాగుతున్నదని అనుకుంటూనే, వేరేవిధంగా అలోచిస్తుందిట్లా: "ఇదేం భ్రాంతి? ఎంత భ్రమలో పడ్డాను? రాముడెక్కడ? ఆయన దూతెక్కడ? సముద్రాన్ని దాటి, లంక ప్రవేసించి, అంతఃపురంలోకి వచ్చి, ఈవనంలో, ఈమూల నేనున్న చోటుకు రావడం ఏన్టి? ఇది సాధ్యం కాదు. ఇది కలకావచ్చు. స్వప్నమే నాకు నిజమైన సుఖాన్నిస్తున్నదే! ఇన్నిరోజులకు, రామదూతనంటూ, ఒక కోతికలలోకి వచ్చిందికదా! కానీ నిద్రపోతే కదా కల వచ్చేది! కలక్కూడా నామీద కోపమా? కలలోకూడా రామలక్ష్మణులను చూడలేనిదాన్ని ప్రత్యక్షంగా ఎట్లా చూస్తాను? "

"ఇదికలకాదనుకుంటా. కలలో కోతిని చూస్తే కీడుకలగాలిగాని, ఈయనను చూస్తుంటే మనస్సుకు సంతోషం కలుగుతున్నదే! పోనీ నాకేమన్న పిచ్చి పట్టిందా? పిచ్చివాడికి తాను పిచ్చివాడినని ఎట్లా తెలుస్తుంది? ఇదేమన్న ఎండమావేమో! ఎండమావిలో నీళ్లు కనిపిస్తాయికాని కోతి ఎలా కనిపిస్తుంది? కాబట్టి ఇవ్వేవీకావు. నాస్మృతి చక్కగావుంది. కనిపించేది కోతే!" ఇలా అలోచిస్తూ: "ఇతడు రామదూతని నేను నమ్మిన తర్వాత, కాదని తెలిస్తే నాకపాయం కలుగుతుంది. నిజంగా రామదూతే అయితే, తను వచ్చినపని యధాతధంగా నాకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. నేనుమాట్లాడకపోతే నష్టం లేదు. నామనస్సులో కళంకం లేదు. సందేహంతో పనిలేదు." వచ్చింది రావణుడేనన్న అనుమానంతో సీత హనుమంతుడితో మాట్లాడకుండా వూరుకుంది.

No comments:

Post a Comment