Sunday, July 7, 2019

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 108-అత్యవసర సహాయ సేవలపై నిర్వహించిన చిట్టచివరి సమీక్ష : వనం జ్వాలా నరసింహారావు


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి
108-అత్యవసర సహాయ సేవలపై నిర్వహించిన చిట్టచివరి సమీక్ష
వనం జ్వాలా నరసింహారావు
రెండో విడత అధికారం చేపట్టి, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిపించిన మర్నాడు-మే నెల 26, 2009, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇజ్రాయిల్ పర్యటనకు బయల్దేరడానికి ముందర, ఆ ఉదయం మమ్మల్ని అత్యవసర సహాయ సేవల సంగతి తెలుసుకునేందుకు రమ్మన్నారు. ఇక్కడొక విషయం చెప్పాలి. అంతకు నాలుగైదు రోజుల క్రితం ముఖ్యమంత్రికి సీఇఓ వెంకట్ గారు ఒక లేఖ రాశారు. మే నెల 5, 2008 న ఇ.ఎం.ఆర్.ఐ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్తూనే, సంస్థ అప్పట్లో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంలో, ప్రభుత్వ పరంగా సంస్థకు అదనపు నిధుల ఆవశ్యకతను వివరిస్తూ రాసిన లేఖ అది. ఆ రోజు వరకు అత్యవసర సహాయ సేవల ద్వారా 26 లక్షల మంది లబ్ది పొందారని, సుమారు 47 వేల ప్రాణాలు కాపాడ కలిగామని, ప్రభుత్వ సహాయంతో 752 అంబులెన్సులను నిర్వహిస్తూ ప్రతి రోజూ సుమారు సగటున 5420 ఎమర్జెన్సీలకు స్పందిస్తున్నామని-ఆసుపత్రులకు చేరుస్తున్నామని లేఖలో వివరించారు. రాజు గారు సంస్థ చైర్మన్ గా రాజీనామా చేసిన అనంతరం, జనవరి 8, 2009 న జరిగిన సమీక్షా సమావేశంలో, సరాసరి నిర్వహణ వ్యయంలో, అవసరమైతే 95% కు బదులు నూటికి 100% ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని లేఖలో గుర్తు చేశారు వెంకట్. అయితే అసలు-సిసలైన ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియలో విశ్వాసం వున్న ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం (రాజు గారు చైర్మన్ గా తొలిగానా) తమ వంతు వ్యయం చేయాల్సిన 5% నిర్వహణా పరమైన నిధులను-ఇతర యాజమాన్య పరమైన ఖర్చులను సమకూర్చే దాతల అన్వేషణ కొరకు నాలుగు నెలల వ్యవధి కోరిన విషయం కూడా లేఖలో గుర్తు చేశారు వెంకట్.

దురదృష్ట వశాత్తు తామెన్ని ప్రయత్నాలు చేసినా అంతవరకు అవి ఫలించలేదన్నారు. ఆ కారణాన తమ వంతు వాటాగా 2008-2009 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయాల్సిన 5% (సుమారు రు. 5 కోట్ల నిర్వహణ ఖర్చులు) నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నిర్వహణ వ్యయం కింద అప్పటి వరకు 2008-2009 ఆర్థిక సంవత్సరంలో ఐన రు. 90 కోట్ల వ్యయంలో రు. 85 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందని, మిగతా రు. 5 కోట్ల విడుదలకు ఆదేశాలివ్వాలని కోరారాయన. అదనంగా యాజమాన్య జీత-భత్యాల కొరకు మరో రు. 4 కోట్ల 8 లక్షలు ఖర్చయ్యాయని వివరించారు. ఆ వ్యయాన్ని తమ వంతు వాటాగా భావించాలని కూడా కోరారు. అప్పట్లో సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, ఆ ఐదు కోట్లను-అదనంగా మూల వ్యయం కొరకు మరో మూడు కోట్లను, మొత్తం ఎనిమిది కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసి-విడుదల చేసేందుకు ఉత్తర్వులివ్వాల్సిందిగా  వెంకట్ ముఖ్యమంత్రిని తన లేఖలో అభ్యర్థించారు. అందులోనే పిరమల్ ఫౌండేషన్ ప్రయివేట్ భాగస్వామిగా, ఇ.ఎం.ఆర్.ఐ బాధ్యతలు స్వీకరించడానికి ఆసక్తి కనబరిచిన విషయం-త్వరలోనే అది సఫలం కానున్న విషయం కూడా వివరించారు వెంకట్. కాకపోతే ఆ లేఖ పంపిన మర్నాడే, పిరమల్ ఫౌండేషన్ నిరాసక్తిని వ్యక్తపరుస్తూ వెంకట్ కు సందేశం ఇవ్వడం, ఆయన నిరాశకు గురి కావడం, ముఖ్యమంత్రితో సమావేశం జరుగు తే మంచిదని భావించడం, ఆయన కోరుకున్న విధంగానే-ఆయన అడగకుండానే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మే నెల 26, 2009 ఉదయం సమావేశం గురించి పిలుపు రావడం భగవదేఛ్చ అనుకోవాలి. లేదా వెంకట్ సంకల్ప బలం అనుకోవాలి !

ఆ ఉదయం సమావేశం జరిగిన తీరు "మరవలేని మరో అద్భుత సన్నివేశం". సమావేశం ఆరంభమవుతూనే వెంకట్ గారిని ఉద్దేశించి, తమ పార్టీ విజయానికి 108-అత్యవసర సహాయ సేవల అంబులెన్సుల పథకం ఎంతగానో తోడ్పడిందని అన్నారు (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. ఇంతకు ముందే రాసినట్లు, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు ప్రయివేట్ భాగస్వామ్య పరంగా నిధులను సమకూర్చే విషయంలో స్వయంగా జోక్యం చేసుకుని, అధికార బలాన్ని కాకుండా-వ్యక్తిగత ఆకర్షణ, పలుకుబడిని ఉపయోగించే పద్ధతిలో, జీ.వి.కె అధిపతి డాక్టర్. జీ. వి. కృష్ణారెడ్డి తో ఫోన్లో మాట్లాడి, బరువు-బాధ్యతలను ఆయన స్వీకరించేందుకు ఒప్పించారు రాజశేఖర రెడ్డి గారు. అయితే ఆ నిర్ణయం పూర్వ-ఉత్తర రంగాల్లో అత్యవసర సహాయ సేవల విషయంలో విలువైన సూచనలు చేశారు. అందులో ఎన్ని అమలుకు నోచుకున్నయో-ఎన్ని నోచుకోలేదో అన్న విషయం ప్రశ్నార్థకం?

రాజీవ్ ఆరోగ్య శ్రీ గొడుగు కింద పనిచేస్తున్న 108, 104, ఆరోగ్య శ్రీ పథకాలకు సంబంధించి నిరంతర ప్రభుత్వ మానిటరింగ్ జరగాలని, ఇవన్నీ ఒకే శాఖాధిపతి కింద వుండే వీలు గురించి పరిశీలన జరగాలని ఆ రోజున ముఖ్యమంత్రి సూచించారు. ఇ.ఎం.ఆర్.ఐ, హెచ్.ఎం.ఆర్.ఐ, ఆరోగ్య శ్రీ లకు కలిపి ఒక ప్రత్యేకమైన "ట్రస్ట్" ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించారు. అలా చేస్తే సేవలందించడంలో నైపుణ్యం, సామర్థ్యం, వృత్తి పరమైన దక్షత పెరిగే అవకాశం వుందన్నారు. వీటి సాధ్య-అసాధ్యాలకు సంబంధించి మేధ మథనం జరుగు తే మంచిదని కూడా సూచించారాయన. అయితే సంస్థల ప్రత్యేకత, ఆనవాలు-గుర్తింపు (ఐడెంటిటీ) కు భంగం కలగని విధంగా చర్యలు చేపట్టాలని, నియంత్రణల విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్య-వైద్య శాఖలకు చెందిన ఒక ప్రభుత్వాధికారిని ఇ.ఎం.ఆర్.ఐ గవర్నింగ్ బోర్డు సభ్యుడిగా చేయాలని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయం వెలిబుచ్చారు. ఆర్థిక పరమైన యాజమాన్య వ్యవహారాలను, వ్యయ నియంత్రణలను, నిర్వహణ సమస్యలను, ప్రభుత్వంతో సమన్వయం-సంఘటితం విషయాలను, సంస్థాగత నిర్మాణాన్ని, అధికారాలను, విధులను, బాధ్యతలను, పారదర్శకతను, జవాబుదారీ తనాన్ని, సంబంధిత ఇతర విషయాలను పర్యవేక్షించేందుకు ఎలాంటి కమిటీ వుంటే బాగుంటుందో పరిశీలించమని అధికారులను-ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆ కమిటీ రూపు-రేఖలు ఎలా వుండాలో ఆలోచన చేయమని కోరారు ముఖ్యమంత్రి.


ఒక వేళ "రాజీవ్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్" కు ఆ బాధ్యతలు అప్పగిస్తే, దరిమిలా ఆవిర్భవించనున్న "సంఘటిత (Integrated) పథకం" అమలు విషయంలో కుటుంబ సంక్షేమ శాఖ పాత్ర ఎలా వుండాలో నిర్ణయించాలని సూచించారాయన. ప్రభుత్వ పరంగా నిధులను సమకూర్చడంలో ఒక్కో ఏడాది గడిచినా కొద్దీ భారం పెరుగుతుంది కాబట్టి, అత్యవసర పరిస్థితి నుంచి ఆసుపత్రికి వైద్య సహాయం అందించే వరకు ప్రభుత్వ పరంగా-ఇ.ఎం.ఆర్.ఐ పరంగా సేవల ఉపయోగం విషయంలోను, మంచి-మంచి పద్ధతులను పంచుకోవడం విషయంలోను, మాన్యత (వాలిడేషన్) విషయంలోను, నిధుల సేకరణ విషయంలోను, కమ్యూనికేషన్ విషయంలోను, చేసిన తప్పులు సరి దిద్దుకునే విషయంలోను జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. ఆయన ఆనాడు చెప్పిన "ఆణి ముత్యాల లాంటి సూచనలు, సలహాలు, ఆదేశాలు" ఆ తర్వాత రూపొందించిన సమావేశ వివరణ పత్రం (మినిట్స్) లో కొన్ని మాత్రమే చోటు చేసుకున్నాయి. ఆ వివరాలు:

·      మే నెల 5, 2008 న ప్రభుత్వంతో ఇ.ఎం.ఆర్.ఐ కుదుర్చుకున్న ఎంఓయు గడువు ముగిసినందున, దాని అమలును, తగు సవరణలతో అవసరమైనంత కాలవ్యవధి వరకు పొడిగించాలి. ఎంఓయు అమలు కాలంలో సంభవించిన పరిణామాలను సవరణలు రూపొందించేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి.
·      నిర్వహణ వ్యయం భరించే విషయంలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం సిద్ధాంత ప్రక్రియకు అనుగుణంగా, ప్రభుత్వం-ఇ.ఎం.ఆర్.ఐ తమ-తమ వంతు వాటాగా 95%-5% నిష్పత్తి విధానాన్ని పాటించాలి. కాకపోతే, యాజమాన్య పరమైన వ్యయం కింద ఇ.ఎం.ఆర్.ఐ పెటుతున్న ఖర్చును సంస్థ సమకూర్చాల్సిన 5% వాటాగా పరిగణించాలి. ఇలా పరిగణించేటప్పుడు కింది నిబంధనలను పాటించాలి:
·      ఆంధ్ర ప్రదేశ్ ఆపరేషన్సుకు సంబంధించి ఇ.ఎం.ఆర్.ఐ చేస్తున్న ఖర్చును స్పష్టంగా నమోదు చేసి ప్రభుత్వానికి తెలియచేయాలి.
·      ఇతర రాష్ట్రాలలో కూడా  .ఎం.ఆర్.ఐ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నది కాబట్టి, ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన యాజమాన్య పరమైన వ్యయాన్ని, తగు నిష్పత్తిలో నమోదు చేయాలి.
·      .ఎం.ఆర్.ఐ యాజమాన్య నిర్వహణ బాధ్యతలు స్వీకరించబోయే భావి సంస్థల-వ్యక్తుల నుంచి, లోగడ ఇ.ఎం.ఆర్.ఐ కున్న రుణాల మొత్తాన్ని తీర్చేందుకు తగు ఆర్థిక సహాయాన్ని పొందే ఏర్పాటు చేసుకోవాలి.
·      అత్యవసర సహాయ సేవల నిర్వహణకు నియమించబడిన ఆపరేషన్స్ సిబ్బంది జీతభత్యాలు, ప్రతి నెల మొదటి తేదీన చెల్లించే విధంగా, ప్రభుత్వం అంగీకరించిన నిధులను విడుదల చేస్తుంది. 2009-2010 సంవత్సరానికి బడ్జెట్ తయారు చేసేటప్పుడు, ప్రభుత్వం తన బాధ్యతగా అంగీకరించిన నిధులను సమకూర్చే పద్ధతిలో, తగు ఏర్పాటు చేస్తుంది.
·      పారదర్శకతను మరింత స్పష్టంగా పాటించడానికి ఇ.ఎం.ఆర్.ఐ చొరవ తీసుకోవాల్సిన అంశాలు:
·      108-అత్యవసర సహాయ సేవల లబ్దిదారులకు ముఖ్యమంత్రి సంతకంతో ఉత్తరాలు పంపాలి. ఆరోగ్య శ్రీ పథకం లబ్దిదారుల నుండి  ఎలా "ఫీడ్ బాక్" తీసుకుంటున్నారో అలాంటి పద్ధతి ఇ.ఎం.ఆర్.ఐ కూడా అమలు పరచాలి.
·      పారదర్శకతను పెంపొందించేందుకు, ప్రజలందరు చూడడానికి అనువుగా "వెబ్ సైట్" ను రూపొందించి, అందులో ప్రతి ట్రిప్పుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరచాలి.
·      జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ 108-అత్యవసర సహాయ సేవలకు సమకూరుస్తున్న నిధులను తగ్గించే ప్రయత్నం చేయకుండా-లోగడ మాదిరిగానే బడ్జెట్ కేటాయింపులు జరగాలని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి సంతకంతో ప్రధాన మంత్రికి లేఖ వెళ్లాలి.
మినిట్స్ లో పొందుపరిచిన వాటిలోని అంశాలు, పొందు పరచకపోయినా ముఖ్యమంత్రి చేసిన సూచనలు, అమలుకు ఎంతవరకు నోచుకున్నాయో అన్న విషయాన్ని ధృవీకరించాల్సింది అటు ప్రభుత్వం-ఇటు ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ అంశాలపై ఎంతవరకు దృష్టి పెట్టిందో? ఈ అంశాలన్నీ అమలు జరిగుంటే ఇప్పుడు 108 సేవలు ఎదుర్కుంటున్న కొన్ని ఒడిదుడుకులకు ఆస్కారం వుండకపోయేదేమో !

No comments:

Post a Comment