Thursday, July 11, 2019

ఆరోగ్య, అత్యవసర వైద్య సేవల అభివృద్ధి నిధి ఆవశ్యకత : వనం జ్వాలా నరసింహారావు


ఆరోగ్య, అత్యవసర వైద్య సేవల అభివృద్ధి నిధి ఆవశ్యకత  
వనం జ్వాలా నరసింహారావు
(ఇఎంఆర్ఐ పీపీపీ మాజీ లీడ్ పార్టనర్, కన్సల్టెంట్)
సూర్య దినపత్రిక (12-07-2019)
          108 అత్యవసర సహాయ సేవల అంబులెన్స్ నిర్వహణకు నోడల్ ఏజన్సీని ఎంపిక చేసేందుకు టెండర్ విధానం అవలంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. టెండర్ ప్రక్రియను ముందుకు తీసుకుపోవడానికి ఒక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు, ఆ కమిటీ టెండర్ల విధివిధానాలను, తత్సంబంధమైన డాక్యుమెంట్ తయారీని పర్యవేక్షించనున్నదని తెలుస్తున్నది. 108 అత్యవసర సహాయ సేవలను ప్రారంభించిన ఎమర్జెన్సీ మానేజ్మెంట్, రిసర్చ్ ఇన్స్టిట్యూట్ (ఇఎంఆర్ఐ) సంస్థలో నాలుగు సంవత్సరాలపాటు ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్య  ప్రక్రియ అంశాన్ని నిర్వహించిన వ్యక్తిగా ఆ సంస్థ ఆవిర్భావ, పరిణామక్రమాన్ని కొంత వివరించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం.  

         దశాబ్దంన్నర క్రితం, అప్పటి ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆసుపత్రులలో ప్రసవాలకు గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ-ప్రయివేట్ రంగంలోని ఆరోగ్య-వైద్య సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోక పోవడానికి ప్రధాన కారణం వారికి అందుబాటులో సరైన రవాణా సౌకర్యం లేకపోవడమే అని గుర్తించింది. దీన్ని అధిగమించడానికి “రిప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ కేర్” పథకం ద్వారా గ్రామీణ అత్యవసర ఆరోగ్య రవాణా సేవలను (ఆర్ఇహెచ్టీఎస్) గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో అమలు చేయాలని 2005 సంవత్సరంలో నిర్ణయించింది ప్రభుత్వం. సమీకృత, సమగ్ర ప్రాధమిక ఆరోగ్య రక్షణ సేవలను అందించేటందుకు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) లో అంతర్భాగమే ఆర్ఇహెచ్టీఎస్. ఈ సేవల ద్వారా గర్భిణీ స్త్రీలను, శిశువులను, 12 సంవత్సరాల వయసు లోపల వున్న పిల్లలను, వీరితో పాటు అత్యవసర సహాయ సేవల అవసరం వున్న వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి చికిత్స కోసం రవాణా చేయడం జరిగేది.         

         పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలోని కడప, కర్నూల్, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలలో, వాటితో పాటు తొమ్మిది జిల్లాలలో వున్న సమీకృత గిరిజనాభివృద్ధి ప్రాంతాలలో 2005 లో ప్రవేశపెట్టడం జరిగింది. రవాణా సేవలను అందించడానికి 122 అంబులెన్సులను ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో స్వచ్చంద సంస్థల ద్వారా వినియోగంలోకి తేవడం జరిగింది.     

ఇదిలా వుండగా, అదే రోజుల్లో, సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు ప్రారంభించిన ఇఎంఆర్ఐ సంస్థ తమ సొంత నిధులతోనే, అత్యవసర సహాయసేవలను ఉచితంగా అందించేందుకు ముందుకు రావడంతో, ఆర్ఇహెచ్టీఎస్ సేవలకు అదనంగా, ప్రభుత్వ ఆర్థిక సహాయం లేకుండా నిర్వహణ బాధ్యత చేపట్టేందుకు ఇఎంఆర్ఐని ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య పద్ధతిలో  “నోడల్ ఏజెన్సీ” గా ప్రభుత్వం గుర్తించింది. ఏప్రియల్ 2, 2005న ఇరువురి మధ్య మొదటి అవగాహనా ఒప్పందం (ఎం.ఓ.యు) కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, ఆగష్ట్ 15, 2005 న ప్రారంభించి జూన్ 2006 చివరికల్లా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో, తన సొంత నిధులతో, 70 అంబులెన్సులను రాష్ట్రవ్యాప్తంగా వున్న 50 నగరాలలోనూ, పట్టణాలలోనూ ఇఎంఆర్ఐ సమకూర్చిఅత్యవసర సహాయ సేవలను ఉచితంగా అందించసాగింది. అంబులెన్స్ సేవలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత టోల్ఫ్రీ నంబర్ 108 కేటాయించింది. ఆ నంబర్ తో ఆసేవలకు అమితమైన ప్రాచుర్యం కూడా లభించింది.   

ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం క్రింద ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో అమలు చేయాల్సిన “గ్రామీణ అత్యవసర ఆరోగ్య రవాణా సేవలను” ఇఎంఆర్ఐకి అప్పగించేందుకు ప్రతిపాదన చేసింది. అప్పటికే ఎంపిక చేసిన నాలుగు జిల్లాల్లోనూ, గిరిజన ప్రాంతాలలోనూ, స్థానిక స్వచ్ఛంద సంస్థల ద్వారా 122 వాహనాలను నడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం, వాటితో సహా, మిగిలిన జిల్లాల్లో కూడా నడపదల్చుకున్న మరో 310 అంబులెన్సులను ఇఎంఆర్ఐ నోడల్ ఏజెన్సీగా నామినేషన్ ప్రాతిపదికన, నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. మరో అవగాహనా ఒప్పందం ద్వారా ప్రభుత్వం ఇఎంఆర్ఐని తిరిగి నోడల్ ఏజన్సీగా నియమించింది సెప్టెంబర్ 22, 2006న. ఇంతకముందు ఎన్జీవోల నిర్వహణలో ఉన్న 122 అంబులెన్సులతో సహా ఇఎంఆర్ఐ సొంత 70 అంబులెన్సులను కలిపి మొత్తం 502 అంబులెన్సులను నడపడానికి ఒప్పందం కుదిరింది.

మరో ఎం.ఓ.యు పై ప్రభుత్వం, ఇఎంఆర్ఐ అక్టోబర్ 2007 లో సంతకాలు చేశాయి. దీంతో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ మరింత బలపడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “రాజీవ్ ఆరోగ్య శ్రీ” పథకం గొడుకు క్రింద 108 సేవలను తీసుకురావాలని, 2008 – 2009 ఆర్థిక సంత్సరం నుండి, ప్రభుత్వ సహాయంగా నిర్వహణ వ్యయంలో 95% వుండాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అప్పుడే. 95% క్రింద ఎంతుండాలన్న విషయం ప్రభుత్వాధికారులు, ఇఎంఆర్ఐ అధికారులు కలసి చర్చించి ఆ మొత్తాన్ని రూ. 1,12,499/- (రూ. లక్షా పన్నెండువేల నాలుగువందల తొంభై తొమ్మిది) గా నిర్ణయించారు. ఈ మొత్తం ఆ తరువాత రోజుల్లో అవసరాలకు అనుగుణంగా మారుతూ వచ్చింది. దరిమిలా అవసరమైనప్పుడల్లా మరిన్ని అంబులెన్సులను ప్రభుత్వం సమకూర్చింది. ఈ ప్రక్రియ అంతా ఇరువురి మధ్య ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య వ్యవహారంగానే జరిగింది కాని, ఎక్కడా టెండర్ ప్రస్తావన రానేరాలేదు.


తదనంతర కాలంలో ఇఎంఆర్ఐ తన నిర్వహణ కింద వున్న 108 అత్యవసర సహాయ సేవలను గుజరాత్, మధ్య ప్రదేశ్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, తమిళ్ నాడు, అస్సాం, ఉత్తరా ఖండ్, రాజస్తాన్, గోవా లాంటి పలు రాష్ట్రాలకు విస్తరించింది. ప్రస్తుతం ఈ సేవలు దాదాపు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో చాలా భాగం ఇఎంఆర్ఐ ద్వారా కానీ, లేదా, మరో నోడల్ ఏజన్సీ ద్వారా కానీ లభిస్తున్నాయి. చాల కాలం దాకా ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాగానే ఎక్కడా కూడా నోడల్ ఏజన్సీని ఎంపిక చేసేందుకు టెండర్ ప్రక్రియ అవలంభించలేదు. అంతా సంప్రదింపుల ద్వారానే జరిగింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ ఆరోగ్య వ్యవస్థ వనరుల కేంద్రం (ఎన్హెచ్ ఎస్ఆర్సీ) ఇఎంఆర్ఐ నిర్వహిస్తున్న 108 అత్యవసర సహాయ సేవలను ఒక చారిత్రాత్మక అధ్యాయంగా పేర్కొన్నది. అత్యవసర సహాయ సేవలను ఒక జాతీయ ఎజెండాగా మార్చిన ఘనత ఇఎంఆర్ఐదే అని అభివర్ణించింది. అంబులెన్సును “కరుణామయిగా, కారుణ్య దేవతగా” కీర్తించింది.    

108 సేవల విజయ రహస్యం అంతా ప్రభుత్వ-ప్రయివేట్ భావనలోనే వుందనాలి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య ప్రక్రియంటే ఏమిటన్న వివరాల్లోకి వెళ్తే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవచ్చు. ప్రభుత్వపరంగా నిర్వహిస్తూ అందించబడుతున్న వైద్య-ఆరోగ్యరంగ సేవలలోని కొన్ని లోటుపాట్లను అధిగమించేందుకు సంస్కరణలే శరణ్యమన్న నిర్ణయానికి ఆ రంగంలోని నిపుణులొచ్చారు. ఈ సంస్కరణలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం, తద్వారా సేవలనందించే ప్రయత్నం. ప్రభుత్వ విధానాలకనుగుణంగా ప్రైవేట్ పరంగా ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు రూపుదిద్దుకున్న ప్రక్రియే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం. తద్వారా, ప్రభుత్వపరంగా అప్పటివరకు ప్రజలకు అందుతున్న సేవల్లో కొన్నింటిని, మెరుగైన రీతిలో ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో లాభాపేక్షలేని ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల ద్వారా అందించే వీలు కలిగింది. ఈ కార్యక్రమాన్ని పటిష్ఠంగా అమలుపర్చేందుకు, ముందుకు తీసుకుపోయేందుకు, కావాల్సిన ప్రధాన సాధనం, ఇరుపక్షాల మధ్య, ఇరువురి అంగీకారంతో రూపుదిద్దుకున్న ఎం.ఓ.యు గా పిలువబడే “అవగాహనా ఒప్పందం”. దీనికి మంచి ఉదాహరణ ఇఎంఆర్ఐ సంస్థ అందిస్తూ వస్తున్న 108 అత్యవసర సహాయ సేవలు.

ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రాథమికంగా కావాల్సింది ఆ ప్రక్రియను ఆరంభించి కొనసాగించగలిగే సరైన వ్యక్తులు. అటు ప్రభుత్వపరంగా, ఇటు ప్రైవేట్ పరంగా నాయకత్వ పటిమగలిగి, నిబద్ధతతో, బాధ్యతాయుతంగా, దూరదృష్టితో భాగస్వామ్యాన్ని పటిష్టంగా కొనసాగించగలిగేవారు కావాలి. భాగస్వామ్యంలోని ఇరుపక్షాలలో ఒకరెక్కువ, మరొకరు తక్కువ అనే అభిప్రాయం అసలుండనేకూడదు. అరమరికలులేని అవాగాహన, బాధ్యతల నిర్వహణలో ఖచ్చితమైన నిబంధనలు, అవసరం మేరకు నియంత్రణలు, ప్రైవేట్ భాగస్వామికి రోజువారీ కార్యకలపాల నిర్వహణకు సంబంధించి పూర్తి స్వేచ్ఛ, ఏ రకమైన సేవలను ఎలా అందించాలన్న విషయంలో సంబంధిత ప్రభుత్వ శాఖల్లోని వివిధ స్థాయి అధికారుల అవగాహనా నైపుణ్యం, స్థిరమైన ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామి యాజమాన్య, నిర్వహణా నైపుణ్యం లాంటివి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం విజయవంతంగా పనిచేసేందుకు తోడ్పడుతాయి.

ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి సంస్థలను ఏ విధంగా తన భాగస్వామిగా ఎంపిక చేయాలన్న విషయంలో ఇదమిద్ధమైన నియమనిబంధనలున్న దాఖలాలులేవనవచ్చు. ప్రైవేట్ భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి మార్గాన్ని అనుసరించాలనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి వారి నియమనిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. ఏ రకమైన సేవలను ఏ రకమైన సంస్థ ఎంత మెరుగుగా అందించగలదో నిర్ణయించేందుకు వారి మార్గాలు వారికుంటాయి. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో లభిస్తున్న సేవలకు ప్రైవేట్ భాగస్వామిని ఎంపిక చేయడానికి టెండర్ విధానం కన్నా సంప్రదింపుల విధానమే మెరుగైందని నిపుణుల అభిప్రాయం. ప్రభుత్వపరంగా అందించాల్సిన సామాజిక, వైద్య, ఆరోగ్య సేవలనందించేందుకు నోడల్ ఏజన్సీతో ప్రత్యక్ష, పరోక్ష సంప్రదింపుల ద్వారా, ఇరుపక్షాల సామర్థ్యాన్ని, ఇతర సాధ్యాసాధ్యాలను అంచనావేసుకుని భాగస్వామిని ఎంపిక చేసుకోవడం ఉత్తమమని ఒక అధ్యయనంలో తేలింది. ఎక్కడెక్కడైతే టెండర్ ద్వారా పారదర్శకత, పోటీ విధానం అనుసరించారో అక్కడ సత్ఫలితాలు రాలేదని కూడా ఆ అధ్యయనంలో వెల్లడైంది. టెండర్ ప్రక్రియ లాభాలనర్జించేందుకుద్దేశించిన వాణిజ్యపరమైన ప్రాజెక్టుల విషయంలో మంచిదేమోగాని, వాణిజ్యేతర లాభాపేక్షలేని సేవల విషయంలో కాదని నిపుణుల అభిప్రాయం. అత్యవసర సహాయ సేవల లాంటివి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్వహించడానికి టెండర్ విధానమే అనుసరించాలనడం సరైంది కాదు.

ఇఎంఆర్ఐ 108 అత్యవసర సహాయ సేవలు బహుశా ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు ఒక చక్కటి ఉదాహరణ. ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైన ఆ సేవలు అన్ని రాష్ట్రాలకూ ఒక రోల్ మోడల్ అయ్యాయి. అడపాదడప వచ్చిన కొన్ని అడ్డంకులు మినహా ఆ ప్రక్రియ అన్ని ఆటుపోట్లను తట్టుకుని కొనసాగుతుందనే అనాలి. దురదృష్ట వశాత్తు ఆ సంస్థతో అనుబంధం వున్న కొందరితో సహా ఇతరులు కూడా ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ కొనసాగింపుకు, రకరకాల కారణాల వల్ల టెండర్ విధానం అవలంభించాలని సూచిస్తున్నారు. అన్నింటి కన్నా ముఖ్యమైంది, విధానం ఏదైనా ప్రభుత్వ నిధులు సక్రమంగా ఎలా వినియోగించుకోవాలా అనేది ప్రధానం. అన్నింటికన్నా అత్యుత్తమైన మార్గం ఎన్ఆర్హేచ్ఎం, రాష్ట్ర ప్రభుత్వ, ప్రయివేట్ వ్యక్తుల-సంస్థల ద్వారా లభ్యమయ్యే మొత్తంతో ఒక శాశ్వత “ఆరోగ్య, వైద్య, అత్యవసర సహాయ సేవల అభివృద్ధి నిధి” ఏర్పాటు చేయాలి. ఒకే ఒక్క వనరుతో, అదీ కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే, దీన్ని నడపడం దీర్ఘకాల ప్రాతిపదికన భావ్యం కాదు. అలాంటప్పుడు కేవలం ఒకే ఒక్క ఏకైక నోడల్ ఏజన్సీకి బదులు యాజమాన్య నైపుణ్యం వున్న ఒక అత్యుత్తమ కార్యనిర్వహణ అధికారిని పీపీపీ విధానంలో నియమించి, ఒక స్వయం ప్రతిపత్తికల ప్రక్రియ ద్వారా నిర్వహించడం మేలు.

108 సేవలు ఎప్పటికీ ఆగిపోకూడని పద్ధతిలో కొనసాగేందుకు దేనికైనా సిద్ధం అయినప్పుడే తప్పుడు సంకేతాలు పోకుండా అవి నిరంతరాయంగా అమలు కావడానికి వీలవుతుంది. ఆ దిశగా చర్యలు చేపట్టడం మంచిదేమో!  

No comments:

Post a Comment