Monday, July 1, 2019

ఆచరణ శూన్యమై మిగిలిన నీతి ఆయోగ్ : వనం జ్వాలా నరసింహారావు


ఆచరణ శూన్యమై మిగిలిన నీతి ఆయోగ్
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (02-07-2019)
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (నీతి ఆయోగ్) గవర్నింగ్ కౌన్సిల్ సాధించిన అద్భుతాలేమైనా వున్నాయా అంటే, సమాధానం లేదు. 65 ఏండ్ల పాటు దేశానికి దిశానిర్దేశం చేసి దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ప్రణాళిక సంఘానికి స్వస్తి పలికి తన మానస పుత్రికగా నీతి ఆయోగ్ కు శ్రీకారం చుట్టారు మోదీ. రాష్ట్రాలను “టీం ఇండియా” గా ప్రధాని అభివర్ణించిన నీతి అయోగ్, గత నాలుగు సమావేశాలలో తీసుకున్న నిర్ణయాల సిఫార్సులను, కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు పరిగణలోకి తీసుకుని రాష్ట్రాలకు సహాయకారిగా వున్నదనేది ప్రశ్నార్థకం. గత నాలుగు సమావేశాలలో లాగానే ఐదవ సమావేశంలో కూడా అత్యంత ప్రాముఖ్యతాంశాలు చర్చలోకి వస్తాయని ఎజెండాలో పేర్కొనడం జరిగింది. కొంతమేరకు చర్చకు వచ్చాయి కూడా. నీతి ఆయోగ్ అపెక్స్ బాడీ అయిన గవర్నింగ్ కౌన్సిల్ లో సభ్యులుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు వుంటారు. 

ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ క్రమం తప్పకుండా సమావేశమవుతుంది. దాని మొదటి సమావేశం ఫిబ్రవరి 8, 2015 న జరిగింది. మొదటి సమావేశంలో ప్రధాని పేర్కొన్న కీలక అంశం, రాష్ట్రాల చురుకైన భాగస్వామ్యంతో, సహకార సమాఖ్య స్ఫూర్తితో, జాతీయ ప్రాముఖ్యత సంతరించుకున్న వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం. జూలై 15, 2015 న జరిగిన రెండో సమావేశంలో, మూడు ముఖ్యమంత్రుల ఉపసంఘాల, రెండు టాస్క్ ఫోర్సుల పనితీరు పురోగతిపై సుదీర్ఘ సమీక్ష జరిగింది. ఏప్రిల్ 23, 2017 న జరిగిన మూడో సమావేశంలో లోక్ సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఏక కాలంలో జమిలి ఎన్నికల నిర్వహణ గురించి ప్రధాని ఆలోచన మీద చర్చ జరిగింది. ఆర్ధిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుండి మార్చ్ వరకు కాకుండా జనవరి నుండి డిసెంబర్ నెల వరకు మార్చే విషయంలో కూడా, ఏవిధమైన నిర్ణయం తీసుకోని చర్చ జరిగింది. ఇక జూన్ 17, 2018 న జరిగిన నాలుగో సమావేశంలో రైతుల ఆదాయం రెట్టింపు అంశం మీద, ప్రభుత్వ ప్రధాన పథకాల అమలు పురోగతి మీద చర్చ జరిగింది. ఆ నాలుగు నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశాల ఫలితాలు ఏవీ కూడా ఇంతవరకు వాస్తవరూపం దాల్చలేదు. అవి కేవలం చర్చ గానే మిగిలిపోయాయి.

మొన్న జరిగిన ఐదో కౌన్సిల్ సమావేశం ప్రధానంగా చర్చించిన అంశాలు: జల యాజమాన్యం, వ్యవసాయం, ఆశాజనక జిల్లా కార్యక్రమం, వామపక్ష అతివాద ప్రభావిత రాష్ట్రాలైన ఝార్ఖండ్, చత్తీస్ఘడ్ లలో సెక్యూరిటీ సమస్యలు. వీటి వాస్తవరూప ఫలితాలకొరకు కొంతకాలం వేచి చూడాలి.

నీతిఆయోగ్ కౌన్సిల్ సిఫార్సులకు అతీగతీ లేదనడానికి, ఆచరణలో వాటికి విలువలేదనడానికి సరైన ఉదాహరణ తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయమే. ఇంటింటికి తాగునీటిని అందించే మిషన్ భగీరథ, చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకాలకు రు. 24,000 కోట్ల రూపాయల గ్రాంట్ ఇవ్వమని నీతిఆయోగ్ చేసిన సూచనను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం, ఆ పథకాలకు కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రపంచంలోనే అతి భారీ బహుళార్థ సాధక, బహుళ దశల, ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి జూన్ 21న ప్రారంభించిన భారీ ఎత్తిపోతల పథకం ఇది. దాని కింద 45 లక్షల ఎకరాలు సాగులోకి రావడంతో పాటు, పారిశ్రామిక, తాగునీటి అవసరాలు కూడా తీరుతాయి. అయినా, ఆ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా నీతి ఆయోగ్ చెప్పినా ఇవ్వలేదు కేంద్రం. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కలిగించాలన్న కేసీఆర్ డిమాండుకు అతీగతీ లేదు.

మూడవ నీతిఆయోగ్ సమావేశంలో, భారత దేశంలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి బయట పడేయడానికి కేసీఆర్ అనేక సూచనలు చేశారు. తెలంగాణాలో ఆ దిశగా చేపట్టిన పథకాలను సోదాహరణంగా వివరించారు. వ్యవసాయ రంగ, దాని అనుబంధ రంగాల, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి సాంప్రదాయంగా తరతరాల నుండి వస్తున్న కులవృత్తుల పునరుద్ధరణకు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు ఆ సందర్భంగా. అందులో ప్రధానమైనవి గొర్రెల పంపిణీ పథకం, చేపల పెంపకం, పాడి పరిశ్రమ అభివృద్ధి. వీటి కొరకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరారు ముఖ్యమంత్రి. అయినా అక్కడినుండి సహాయం లేదు. నీతిఆయోగ్ లో చర్చించిన వాటికి ప్రాముఖ్యత లేదనడానికి ఇదీ ఒక ఉదాహరణే.


ఇక నాల్గవ సమావేశంలో మరికొన్ని ప్రాదాన్యతాంశాలను ప్రస్తావించారు కేసీఆర్. త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు, అదనపు కేంద్ర డివొల్యూషన్ సర్దుబాటు చేయడం వీలుకాకపోతే, కనీసం  పన్నుల్లో ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. ఇలా చేయడం అంటే, రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడడమే అనీ, తద్వారా దేశాభివృద్ధి జరుగుతుందనీ ఆయన అన్నారు. వ్యవసాయం మీద మరింత దృష్టి కేంద్రీకరించడానికి నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, అలా చేస్తే అదొక సమీకృత రంగంగా అభివృద్ధి చెందుతుందని కూడా ఆ సమావేశంలోనే సూచించారు కేసీఆర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే-పదే వల్లిస్తున్న సహకార సమాఖ్య స్ఫూర్తి వాస్తవరూపం దాల్చాలంటే, విద్య, వైద్యం, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి లాంటి పథకాల అమలులో రాష్ట్రాలకు మరింత స్వయం ప్రతిపత్తి, స్వాతంత్ర్యం వుండాలని కూడా కేసీఆర్ అన్నారు అప్పుడే. తెలంగాణలో అమలు పరుస్తున్న రైతుబందు, రైతుభీమా పథకాల గురించి చెప్పి వాటిని ప్రోత్సహించాలని కోరారు. నీతిఆయోగ్ లో చేసిన ఈ సూచనలేవీ కేంద్రం పరిగణలోకి తీసుకున్న దాఖలాలు లేవు.

వాస్తవానికి నీతిఆయోగ్ వ్యవస్థపైనా, దాని ఏర్పాటుపైనా సీఎం కేసీఆర్ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒకానొకప్పుడు ప్రశంసల వర్షం కురిపించారు. సెప్టెంబర్ 2015 లో చైనాలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో “ఎమర్జింగ్ మార్కెట్స్ ఎట్ క్రాస్ రోడ్స్” అన్న అంశం మీద మాట్లాడుతూ నీతిఆయోగ్ భావనకు, దానిద్వారా ప్రధాని చేపట్టదల్చుకున్న కార్యక్రమాలకు మద్దతుగా పలు విషయాలు చెప్పారు. “ప్రణాలికా సంఘం స్థానంలో, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా, ప్రధానమంత్రి అధ్యక్షుడుగా,  నీతిఆయోగ్ వ్యవస్థ రూపుదిద్దుకుంది. దీన్ని మేం టీం ఇండియా అంటాం. మేమంతా కలిసి దేశాభివృద్ధికి, రాష్ట్రాల అభివృద్ధికి, ఉమ్మడిగా ప్రణాలికా రచన చేస్తాం” అని కేసీఆర్ ఆ సమావేశంలో ఘనంగా పేర్కొన్నారు. ఆయన కాంక్షించిన విధంగా నీతిఆయోగ్ పనిచేయగలుగుతున్నదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. నీతిఆయోగ్ కేవలం చర్చలకే పరిమితమైపోతున్నదా అన్న సందేహం కలుగుతున్నది.  

ఈ నేపధ్యంలో ఐదవ నీతిఆయోగ్ కౌన్సిల్ సమావేశం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జూన్ 15, 2019న న్యూధిల్లీ రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగింది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు 26 మంది హాజరైన ఈ సమావేశానికి, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం లాంటి ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణాన, బహుశా, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. ఈ సమావేశంలో కూడా, యధాప్రకారం, గతంలో జరిగిన సమావేశాలలో పేర్కొన్నట్లే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతాశయాలైన నీతిఆయోగ్ ప్రాముఖ్యతను, సహకార సమాఖ్య ఆవశ్యకతను, దేశాభివృద్ధికి ఆటంకంగా వున్న బీదరికానికి, నిరుద్యోగానికి, కరువుకు, కాలుష్యానికి, వ్యతిరేకంగా ఉమ్మడిగా-కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపిచ్చారు. కొత్తగా చెప్పిందేమీ లేదు.

గత సమావేశాలలో మాదిరిగానే ముఖ్యమంత్రుల నిర్మాణాత్మక చర్చను ఆహ్వానించిన ప్రధానమంత్రి, కౌన్సిల్ లో వారు చేసిన సూచనలను చిత్తశుద్ధితో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందనీ, ప్రభుత్వం తీసుకునే నిర్ణయ ప్రక్రియలో వాటిని చేరుస్తామని హామీ ఇచ్చారు. జల దుర్వినియోగం అరికట్టే విషయంలో, జల సంరక్షణ సాధనలో, వర్షపు నీటిని సద్వినియోగం చేసే విషయంలో ఏకాభిప్రాయ వచ్చింది సమావేశంలో. తమ తమ రాష్ట్రాలలో అవలంభిస్తున్న పథకాలలో వున్న ఉత్తమ విధానాలను పేర్కొన్న  ముఖ్యమంత్రులు దేశవ్యాప్తంగా వాటిని అమలు చేసే అంశాలను ప్రస్తావించారు. కరవు నివారణ చర్యలపైనా, సహాయ పునరావాస చర్యలపైనా కూడా కౌన్సిల్ చర్చ చేసింది. ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం అమలు విషయం మీదకూడా సమీక్ష చేసింది కౌన్సిల్. వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

అన్ని సమావేశాల మాదిరిగానే లాంచనంగా నమస్కార-ప్రతినమస్కారాల పర్వం, ముఖ్యమంత్రులకు సమావేశంలో పాల్గొన్నందుకు, సలహాలు-సూచనలు ఇచ్చినందుకు ప్రధాని ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల భాగస్వామ్యంతో భారత దేశాభివృద్ధికి ఉమ్మడిగా కృషి చేస్తుందని ప్రధాని పునరుద్ఘాటించారు.

రాష్ట్రాల నిరంతర మద్దతుతో, పటిష్టమైన రాష్ట్రాల ద్వారానే పటిష్టమైన జాతి అన్న నినాదంతో, సహకార సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించి, తప్పనిసరిగా రాష్ట్రాలకు టీం ఇండియా స్ఫూర్తితో మద్దతుగా వుండాలన్న నీతిఆయోగ్ ఆశయం నేరవేరిందా అన్నది ప్రశ్నార్థకమే! రాష్ట్రాలు అమలు చేస్తున్న ప్రజోపయోగ పథకాలకు అండదండలు అందించాలన్న భావనతో తెరమీదికి వచ్చిన నీతిఆయోగ్ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వానికి ఏ నాడూ, దిశానిర్దేశన చేయలేదు. భవిష్యత్ లో చేసే స్థోమత వున్నట్లు కూడా కనపడడం లేదు. సహకార సమాఖ్య పరమవాధిగా భావించాల్సిన నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఆ భావనకు తరచుగా మాత్రమే కట్టుబడి వుంటుంది అనక తప్పదు. నీతిఆయోగ్ లో చెప్పేది చాలా ఎక్కువ, ఆచరించేది మాత్రం అతి స్వల్పం. అలా అయితే ఫలితం ఏమిటి?       

No comments:

Post a Comment