Friday, September 27, 2019

సెప్టెంబర్ 17, 1948 పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం .... (స్వర్గీయ మందుముల నరసింగరావు మాటల్లో) : వనం జ్వాలా నరసింహారావు


సెప్టెంబర్ 17, 1948 పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం
(స్వర్గీయ మందుముల నరసింగరావు మాటల్లో)
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (27,28 సెప్టెంబర్, 2019)
మందుముల నరసింగరావు ఆరు దశాబ్దాల రాష్ట్ర జాతీయోద్యమ ప్రజా జీవితంలో (1918-1976) విద్యార్థిగా, యువజన నాయకుడుగా, పాత్రికేయుడుగా, సాంఘిక రాజకీయ క్రియాశీలక కార్యకర్తగా, స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వామిగా, శాసన సభ మంత్రి మండలి సభ్యుడుగా, ఒక బహుళార్థ సాధకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రాసిన "ఏబై సంవత్సరాల హైదరాబాద్" అలనాటి విషయాలకు సంబంధించిన ఒక విజ్ఞాన సర్వస్వం. పుస్తకానికి ముందుమాటలను తెలుగులో ఉమ్మెత్తుల కేశవరావు, ఆంగ్లంలో మీర్ అక్బర్ అలీఖాన్ రాశారు. నరసింగరావు పుస్తకంలో సెప్టెంబర్ 17, 1948 పూర్వపు హైదరాబాద్ (రాష్ట్రం) గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి.

ఆసఫ్ జాహీ రాజులలో చివరి వాడు, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1911లో సింహాసనాన్ని అధిష్టించారు. ఉస్మాన్ అలీఖాన్ రాజ్యాధికారం దాదాపు 1947 లోనే అంతమైందనవచ్చు. మిగిలిన కొసరే తెలంగాణ విలీనం, లేదా, విమోచనం. 1914-1918 మధ్య కాలంలో జరిగిన ప్రధమ ప్రపంచ సంగ్రామ ప్రభావం హైదరాబాద్ పాలనపై కూడా పడింది. రాష్ట్ర పరిపాలనలో బ్రిటీష్ ప్రభుత్వం జోక్యం కలిగించుకుంది. ఆ రోజుల్లో ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, థియోసాఫికల్ సొసైటీ అనే మూడు సంస్థలు మాత్రం వుండేవి. విద్యారంగంలో, హైదరాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ ను మౌల్వీ మహమ్మద్ ముర్తజా స్థాపించారు. వామన నాయక్ అధ్యక్షతన హైదరాబాద్ యంగ్ మెన్స్ అసోసియేషన్ నెలకొంది 1916 లో. వివేక వర్ధని హైస్కూల్ స్థాపన జరిగింది కూడా అదే రోజుల్లో. సుల్తాన్ బజార్ లోని శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రభాషా నిలయం, సికిందరాబాద్ లోని ఆంధ్ర సంవర్ధనీ గ్రంధాలయం, తెలంగాణ ప్రాంతంలో చైతన్యం కలగడానికి దోహద పడ్డాయనాలి. రాష్ట్రంలో ఏర్పడిన మొట్ట మొదటి రాజకీయ సంస్థ, హైదరాబాద్ రాష్ట్ర సంస్కరణల సంఘం. అది కేవలం కాగితం సంస్థగానే మిగిలి పోయింది.

గాంధీ ప్రభావం హైదరాబాద్ మీద కూడా పడింది. భారత జాతీయ కాంగ్రెస్ జిల్లా కార్యాలయం హైదరాబాద్ లో ఆరంభం కావడం, దానికి వామన నాయక్, అంతు రామచందర్ రావు అధ్యక్ష-కార్యదర్శులుగా ఎన్నిక కావడం విశేషం. మహాత్మా గాంధి విజయవాడ- హైదరాబాద్ పర్యటన, 1921 లో ఖాదీ కేంద్రం, ఆంధ్ర జనసంఘం స్థాపనకు దారితీసింది. ఆంధ్రోద్యమంలో ఇది తొలి దశ ఐతే, మలి దశగా, ఆంధ్ర జన కేంద్ర సంఘం స్థాపన జరిగింది. ఆ దశలలో హైదరాబాద్ ప్రజల కోరిక, కేవలం, తమను సభ్యతగల దేశ నాగరికులుగా గుర్తించమని మాత్రమే!

డిసెంబర్ 1923 లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహా సభలో, హైదరాబాద్ రాష్ట్ర ప్రజా ఉద్యమాల గురించి, వాక్ స్వాతంత్ర్యంపై నిబంధనల గురించి, బహిరంగ సభలపై నిషేధం గురించి చర్చ జరిగింది. హైదరాబాద్ సంస్థానంపై బ్రిటీష్ ప్రభుత్వం జోక్యం, రాజకీయ ఉద్యమాలపై ప్రభుత్వ ప్రతిఘటన, పౌర హక్కులకు భంగం, మరింత పటిష్టంగా అమలు కావడం మొదలైంది. రాజకీయ చైతన్యం కలగరాదన్న భావనతో, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పత్రికలను ప్రభుత్వం నిషేధించింది. ఈ నేపధ్యంలో, డిసెంబర్ 1927 లో డాక్టర్ అన్సారీ అధ్యక్షతన మద్రాస్ నగరంలో కాంగ్రెస్ మహా సభలు జరిగాయి.

మొదటిసారి, దేశీయ సంస్థానాలలో రాజకీయ సంస్కరణలకు సంబంధించి, బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు దిశగా, ఒక తీర్మానం చేశారు. బ్రిటీష్ ఇండియాలో ఎన్ని మార్పులు వస్తున్నా హైదరాబాద్ లో అంతగా కదలిక రాలేదు. యూరప్ దేశాలలో ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్ తిరిగొచ్చిన అతివాద భావాలు గల సమాజ వాదులు కొందరు, అంజుమన్ తరఖ్కీ అనే సంస్థను నెలకొల్పారు. అలీయావర్ జంగ్, బాఖర్ అలీ మీర్జా, పద్మజా నాయుడు, ఫజ్లుర్ రహమాన్, లతీఫ్ సయ్యద్, బూర్గుల రామకృష్ణ రావు, శ్రీ కిషన్, మీర్ అక్బర్ అలీ ఖాన్, మందుముల నరసింగరావు లాంటి ప్రముఖులు ఆ సంస్థలో సభ్యులయ్యారు. స్వామీ రామానంద తీర్థ, బీడ్ జిల్లాలోని మోమినాబాద్ లో నెలకొల్పిన పాఠశాల, స్వాతంత్ర్య సమర యోధులను సృష్టించే కేంద్రంగా, పోరాటానికి సంబంధించిన కార్యకలాపాల వేదికగా తయారైంది. ఆయన 1929 లో ప్రజా జీవితంలో ప్రవేశించడంతో నూతనాధ్యాయం మొదలైంది.


మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘనం, దరిమిలా తొలి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కాంగ్రెస్ బహిష్కరించడం, మలి రౌండ్ టేబుల్ సమావేశం, గాంధీ-ఇర్విన్ ఒప్పందం, సంస్థానాల పాలకులకు గాంధీ పిలుపు, హైదరాబాద్ లో కూడా స్వదేశీ ఉద్యమానికి నాంది పలికాయి. పద్మజా నాయుడు అధ్యక్షతన స్వదేశీ లీగ్ స్థాపన జరిగింది. మెదక్ జిల్లా జోగిపేటతో ప్రారంభమై వరుస ఆంధ్ర మహాసభలు జరుగ సాగాయి. మొదటి మహా సభకు సురవరం ప్రతాప రెడ్డి, రెండవ దానికి బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించారు. సభలు జరుపుకోవడానికి అనుమతి పొందడం అవస్థలతో కూడిన పని. హైదరాబాద్ ప్రభుత్వం, యుద్ధ కాలంలో మాదిరిగా, పౌరుల స్వాతంత్ర్యంపై ఆంక్షలు విధించేవారు. ప్రజా ఉద్యమాల పట్ల ప్రభుత్వ వైఖరి ఇలా వుంటే, మరో వైపు యువకుల్లో పెల్లుబుకిన అసంతృప్తి ముల్కీ ఉద్యమానికి దారి తీసింది. ముల్కీ హక్కులను కాపాడేందుకు ఉద్భవించిన “నైజాం ప్రజల సమితి” ఎక్కువ కాలం మనుగడ సాగించ లేకపోయింది. డిసెంబర్ 1935 లో జరిగిన కరీంనగర్ ఆంధ్ర మహా సభలో, మాడపాటి రామచంద్ర రావు లాంటి యువకులు, నాయకుల వైఖరిని ప్రతిఘటించారు. మొత్తం మీద రాజకీయ చైతన్యానికి పునాదులు బలంగా నాటుకోవడానికి ఆ సభ దోహద పడింది. `విశాలాంధ్ర' స్థాపించే ఉద్దేశంతో, ఆంధ్ర మహా సభలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణ కూడా ప్రభుత్వ వర్గాలు చేశాయి. హైదరాబాద్ రాష్ట్రంలో, ఆ రోజుల్లో, ముస్లిమే తరులు జరుపుకునే ఏ ఉద్యమమైనా, ప్రభుత్వం అనుమానంతోనే చూసేది.

1935 భారత రాజ్యాంగ చట్టం, భారత దేశంలో ఒక వైపు పార్లమెంటరీ ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు, మరో వైపు నిరంకుశ ప్రభువుల పాలన సాగే దేశీయ రాజ్యాల "సమాఖ్య" స్థాపనకు నాంది పలికింది. అదో విచిత్ర పరిణామం. దేశీయ రాజ్యాలలో హైదరాబాద్ పెద్దది. రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకున్న రాష్ట్రం. ఎల్లప్పుడూ మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రం. "సమాఖ్య" అన్న పదమే నిజాంకు గిట్టేది కాదు. ప్రజాస్వామ్యానికి "సమాఖ్య" పునాదులు వేస్తుందనే భయమే దానికి కారణం. "సమాఖ్య" కు సంబంధించిన రాజ్యాంగ చట్టం అమల్లోకి రాగానే, అప్పటివరకూ రాజకీయేతర సంస్థగా వున్న "ఇత్తె హాదుల్ ముస్లిమీన్" రాజకీయ సంస్థగా మారిపోయింది. భారత సమాఖ్య సంవిధానంలో హైదరాబాద్ ను చేర్చాల్సి వస్తే, దాని రాజకీయాధికారంలో ఎలాంటి లోపం లేకుండా, ఆసఫ్ జాహీ వంశీకులే రాజుగా, సర్వ స్వాతంత్ర్యం గల రాజరికంగా వుండాలని ప్రకటించింది. ఈ నేపధ్యంలో డిసెంబర్ 1936 లో, షాద్ నగర్ లో ఐదవ ఆంధ్ర మహా సభ, ఇబ్బందులకు అతీతంగా జరిగింది. తెలంగాణ వాదుల అభ్యుదయానికి అనుగుణంగా తీర్మానాలనేకం చేయడం జరిగింది అక్కడ. అదే సంవత్సరం "హైదరాబాద్ ప్రజల విద్యా మహాసభ" లో స్వామీ రామానంద తీర్థ పాల్గొనడం జరిగింది. తర్వాత కొంతకాలానికి నిజామాబాద్ లో జరిగిన ఆంధ్ర మహాసభ ఆరవ సమావేశంతో అది రాజకీయ సంస్థగా పరిగణలోకి వచ్చింది.

జులై 1938 లో "హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్" పేరుతో ఒక తాత్కాలిక సంస్థ ఏర్పాటైంది. అందులో చేరిన సభ్యులందరూ ఆసఫ్ జాహీ పాలనలో బాధ్యతాయుత ప్రభుత్వ సాధనకై ఉద్యమించడానికి సిద్ధమయ్యారు. పౌరసత్వపు హక్కుల కొరకు, శాసనోల్లంఘనం కొనసాగించేందుకు, స్వామీ రామానంద తీర్థ సారధ్యంలో ఒక కమిటీ ఏర్పాటైంది. స్వామీజీ నాటినుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి, తన కార్యకలాపాల వేదికను మోమినాబాద్ నుంచి హైదరాబాద్ కు మకాం మార్చారు. ఈ నేపధ్యంలో, అప్పటి ప్రధాన మంత్రి హైదరీ, "నిజాం ప్రభుత్వం రాజకీయ సంస్కరణలకు వ్యతిరేకం కాదు" అని శాసనసభలో ప్రకటించారు. ఆ ప్రకటన ఆచరణలో నామ మాత్రంగానే మిగిలిపోయింది. ప్రభుత్వంతో మంచిగా వుంటూనే ఉద్యమాన్ని నడిపించాలన్న భావనతో, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కు జాతీయ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు లేవని బూర్గుల ప్రకటించారు. సెప్టెంబర్ 9, 1938 న జరగాల్సిన స్టేట్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల సమావేశం నిర్వహించే వీలు లేకుండా, రెండు రోజుల ముందర, సెప్టెంబర్ 7, సంస్థను "ప్రజా సంరక్షణ చట్టం కింద" చట్టవిరుద్ధమై నదిగా ప్రకటిస్తూ నిషేధించారు.

"హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్" ను నిషేధించడంతో ప్రత్యామ్నాయాలను అన్వేషించసాగారు. నిషేధాన్ని ధిక్కరించి, స్వామీజీ నాయకత్వంలో, ఆయనే దళ నాయకుడుగా, శాసనోల్లంఘనం చేయడం, జైలు శిక్షకు గురికావడం జరిగింది. మహాత్మా గాంధీ, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాన్ని ఆపు చేయాలని ఆదేశమివ్వడం, డిసెంబర్ 1938 లో ఆయన ఆదేశాలను అమలుచేయడం జరిగింది. తన నిర్ణయంతో ప్రభుత్వంలో హృదయ పరివర్తన కలిగి, నిషేధం ఎత్తి వేస్తారని గాంధీ భావించారు. దానికి విరుద్ధంగా, 1946 వరకు నిషేధం కొనసాగింది. అదే సమయంలో, ఉస్మానియా విద్యార్థుల "వందేమాతరం" ఉద్యమం మొదలవడం, పలువురు కళాశాలల నుంచి బహిష్కృతులు కావడం, వారిలో చాలా మంది నాగపూర్ విశ్వవిద్యాలయంలో చదువు కొనసాగించడానికి సిద్ధపడడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత, ప్రభుత్వం వందేమాతరం గీతం పాడడానికి అంగీకరించారు. ఆ ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలో రాజకీయ చైతన్యం కలిగించింది. స్టేట్ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంతో జరిపిన సంభాషణల ఫలితంగా, ప్రభుత్వం సూచన మేరకు, "హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్" పేరు "హైదరాబాద్ నేషనల్ కాన్ఫరెన్స్" గా మార్చారు. ఐనప్పటికీ ప్రభుత్వ ధోరణి మారకపోగా, నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకలాపాలు కూడా చట్ట విరుద్ధమైనవని ప్రకటించడంతో, దానిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, సత్యాగ్రహాన్ని కొనసాగించారు. ఈ నేపధ్యంలో, మతవాద-సామ్యవాద సిద్ధాంతాలకు దూరంగా, అతివాద భావాల మక్దూం మొహియుద్దీన్, రాజబహద్దూర్ గౌడ్, సయ్యద్ ఇబ్రహీం, ఆలం ఖుందుమీర్ లాంటి యువకులు కొందరు హైదరాబాద్ లో "కామ్రేడ్స్ అసోసియేషన్" పేరుతో ఒక చర్చా వేదికను నడిపేవారు.


రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమై, భారత బ్రిటీష్ ప్రభుత్వం అందులో చేరడం జరిగింది. తమ అభీష్టానికి వ్యతిరేకంగా యుద్ధ ప్రకటన చేశారని నిరసన తెలియచేస్తూ, 1935 చట్టాన్ని అనుసరించి రాష్ట్రాలలో ప్రభుత్వాలు నడుపుతున్న కాంగ్రెస్ మంత్రులు పదవులకు రాజీనామా చేశారు. యుద్ధానంతరం, "డొమినియన్ స్టేటస్" ను భారత దేశానికి ఇస్తానని బ్రిటీష్ ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని మహాత్ముడు "పోస్ట్ డేటెడ్ చెక్" గా వ్యాఖ్యానించారు. యుద్ధానికి మద్దతిస్తున్న సంస్థానాధీశులను-దేశీయ రాజులను గాంధీ విమర్శించారు. హైదరాబాద్ ప్రధాని అక్బర్ హైదరీ, తమ ప్రభుత్వ సంబంధాలు నేరుగా బ్రిటీష్ సార్వభౌమునితో నే వున్నాయని ప్రకటించాడు. "బ్రిటీష్ ప్రభుత్వంతో నేరుగా సంబంధాలు" అన్న నిజాం వాదనను స్టేట్ కాంగ్రెస్ నాయకులు తిరస్కరించారు. స్టేట్ కాంగ్రెస్ వారు ఉద్యమం పేరుతో-ప్రజాస్వామ్యం పేరుతో, అధిక సంఖ్యాకులైన హిందువులకు అధికారం అప్ప చెప్పే ఆలోచనలో వున్నారని ఇత్తె హాదుల్ ముస్లిమీన్ సంస్థ అధ్యక్షుడు విమర్శించారు. మరి కొంచెం ముందుకు పోయి, సమాజంలో ఉత్తమ స్థానం కలవారందరు, "రజాకారు" వ్యవస్థలో చేరాలని కూడా ఉద్భోధించారాయన. అంటే, రజాకారు ఉద్యమం 1940 లోనే ఆరంభమైందనవచ్చు-పోనీ పునాదులు పడ్డాయనవచ్చు.

రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశకు చేరుకునే సమయానికి, హైదరాబాద్ పరిస్థితిలో ఏ మార్పూ కనిపించలేదు. స్టేట్ కాంగ్రెస్ పైన నిషేధాజ్ఞలు కొనసాగుతూనే వున్నాయి. ఎన్ని నిషేధాజ్ఞలున్నా, ఉద్యమ ప్రభావాన్ని తగ్గించ లేకపోయింది ప్రభుత్వం. ప్రజలలో అలజడి తీవ్రమై, బాధ్యతాయుత ప్రభుత్వం కొరకు ఒత్తిడి పెరిగింది. 1941 లో కమ్యూనిస్ట్ యోధుడు రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో ఎనిమిదవ ఆంధ్ర మహాసభ జరిగింది. జాతీయ వాదులు, కమ్యూనిస్టులు అని రెండు గ్రూపులుగా ఆంధ్ర మహాసభలో పాల్గొన్న వారు విభజింపబడ్డారు. "క్విట్ ఇండియా" ఉద్యమం దేశవ్యాప్తంగా సాగుతున్నా, హైదరాబాద్ ప్రభుత్వంలో అంతగా పరివర్తన రాలేదింకా. ఇంతలో అక్బర్ హైదరీ ప్రధానిగా పదవీ విరమణ చేశారు. చత్తారి నవాబు ఆయన స్థానంలో నియమితులయ్యారు.

స్టేట్ కాంగ్రెస్ సమస్యపై సత్యాగ్రహం చేసిన స్వామీ రామానంద తీర్థ జైలులో వుండగానే, తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ రాష్ట్ర ప్రజలలో, కమ్యూనిస్ట్ భావాలు అధికం కావడంతో, నిజాం, ప్రజలకొక అభ్యర్థన చేసారు. రాజీ మార్గంలో పోదామని సూచించారు. స్వామీజీని నవంబర్ 1941 లో జైలు నుంచి విడుదల చేసింది ప్రభుత్వం. స్టేట్ కాంగ్రెస్ పైన నిషేధాజ్ఞలు ఎత్తివేయలేదు. క్విట్ ఇండియా ఉద్యమానికి స్వామీ జీ నాయకత్వం వహించేందుకు సిద్ధమయ్యారు. ఆగస్ట్ 1942 లో, బొంబాయి నగరంలో జరిగిన సమావేశంలో పాల్గొని, గాంధీ ఆదేశానుసారం, ఉద్యమం నిర్వహించేందుకు హైదరాబాద్ చేరుకున్నారాయన. ఉద్యమం ఆరంభించడానికి ముందర, జి. ఎస్. మెల్కోటే సంతకంతో నిజాం నవాబుకు ఒక లేఖ పంపారు. స్వతంత్ర భారత దేశంలో ఒక భాగంగా హైదరాబాద్ రాష్ట్రం కలిసిపోవాలని, రాష్ట్రంలో బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపన జరగాలని, వీటికి సంబంధించిన ప్రకటన నిజాం చేయాలని లేఖలో పేర్కొనడం జరిగింది. లేఖ అందగానే, మెల్కోటేను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. ఎం. ఎస్. రాజ లింగం, కాళోజీ నారాయణ రావు, భండారు చంద్రమౌళేశ్వర రావు ప్రభృతులు కూడా అరెస్టయ్యారు దరిమిలా.

1940 లో జరిగిన ఆంధ్ర మహాసభకు జాతీయ పక్షానికి చెందిన మందుముల రామచంద్ర రావు, 1941 లో జరిగిన సభకు కమ్యూనిస్ట్ పక్షానికి చెందిన రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన వహించారు. వీరిరువురి ఆదర్శాలలో కొంత భేదం వుండేది. మే నెల 1942 లో వరంగల్ సమీపంలో జరిగిన తొమ్మిదవ సభ నాటికి అవి ప్రస్ఫుటంగా కనిపించ సాగాయి. 1941-1942 మధ్య కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ బహిరంగంగానే పని చేయడం మొదలైంది. 1943 మధ్య కాలంలో నిషేధం కూడా తొలగించింది ప్రభుత్వం. కొంత గందరగోళం మధ్య ముగిసిన ఆ సభలకు మాదిరాజు రామకోటేశ్వరరావు రావు అధ్యక్షత వహించారు. క్విట్ ఇండియా తీర్మానాన్ని సభ బలపర్చింది. ఆ తర్వాత ఆరు నెలలకు హైదరాబాద్ లో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి, సత్యాగ్రహం చేసిన పద్మజా నాయుడు, మెల్కోటే సతీమణి, బూర్గుల రామకృష్ణారావు ప్రభృతులను అరెస్ట్ చేసి, రెండు-మూడు రోజుల తర్వాత విడుదల చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ లో జరిగిన పదో ఆంధ్ర మహా సభ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం, కమ్యూనిస్ట్ అభ్యర్థి బద్దం యెల్లారెడ్డిపై పోటీ చేసిన కొండా వెంకట రంగారెడ్డి ఎన్నిక కావడం జరిగింది. పదకొండవ మహా సభ కమ్యూనిస్ట్ నాయకుడు రావి నారాయణ రెడ్డి నాయకత్వంలో భువనగిరిలో జరిగింది. మితవాదులు, జాతీయ వాదులు ఆ సభను బహిష్కరించారు. మార్చ్ నెల 1945 లో, జాతీయ-మితవాదులందరు కలిసి, పన్నెండవ మహా సభను వరంగల్ సమీపంలోని మడికొండ గ్రామంలో, మాదిరాజు రామకోటేశ్వరరావు రావు అధ్యక్షతన నిర్వహించారు. అది జరిగిన నెల పదిహేను రోజులకు, "నిజాం రాష్ట్ర ఆంధ్ర మహా సభ" పేరుతో, రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన, ఖమ్మం లో మరొక ఆంధ్ర మహా సభ జరిగింది.

జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జనవరి 1946 లో ఉదయపూర్ లో, దేశీయ రాజ్యాల ప్రజల-ప్రతినిధుల మహా సభ జరిగింది. ఆ సభకు, హైదరాబాద్ రాష్ట్రం నుండి, కమ్యూనిస్ట్ నాయకుడు బద్దం యెల్లారెడ్డితో సహా రామానంద తీర్థ, మాడపాటి హనుమంత రావు, బూర్గుల, కాశీనాధ రావు వైద్య, దిగంబర రావు బిందు, మందుముల నరసింగ రావు ప్రభృతులు, హాజరయ్యారు. సభ జరిగిన కొద్ది రోజులకే, "అధికారం బదలాయింపు" ప్రస్తావనను బ్రిటీష్ ప్రధాని అట్లీ పార్లమెంటులో లేవనెత్తారు. భారత సంవిధాన సభ ఏర్పాటు ఆవశ్యకత కూడా ప్రస్తావనకొచ్చింది. మార్చ్ 24, 1946 న బ్రిటీష్ అధికారిక ప్రతినిధులు, ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశీయ రాజ్యాలతో సహా అన్ని ప్రాంతాలు, భారత భవిష్యత్ సంవిధానంలో భాగమేనని స్పష్టం చేశారు. మరో వారం రోజుల తర్వాత, బ్రిటీష్ మంత్రి మండలి సభ్యులను కలిసిన చత్తారి నవాబు హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను వెల్లడి చేశారు. దేశ విభజన జరిగితే, హైదరాబాద్ భౌగోళిక కారణాల వల్ల పాకిస్తాన్ లో చేరదని, సిద్ధాంత రీత్యా భారత్ లో వుండలేదని, అందువల్ల, స్వతంత్ర రాజ్యంగా వుంటుందని స్పష్టం చేశాడు. బ్రిటీష్ ఇండియాకు స్వతంత్రం ప్రకటించిన వెంటనే బ్రిటీష్ పరమాధికారం ముగుస్తుందనీ, ఆంతరంగిక శాంతి బధ్రతల పరిరక్షణ తమ చేతుల్లో వుండదని చత్తారి నవాబుకు తెలియ చేశారు.

రాష్ట్ర ఆంతరంగిక పరిస్థితులు ఇబ్బందికరంగా తయారయ్యాయి. కమ్యూనిస్ట్ ఉద్యమం తీవ్రమైంది. చత్తారి నవాబు పదవికి రాజీనామా చేశారు. తాత్కాలిక ప్రధానిగా అఖీల్ జంగ్ నియామకం జరిగింది. స్టేట్ కాంగ్రెస్ పై నిషేధాన్ని ఎత్తి వేశారు. సంస్థ అధ్యక్షుడుగా రామానంద తీర్థ ఎన్నికయ్యారు. సర్ మీర్జా ఇస్మాయిల్ ను ప్రధాన మంత్రిగా నియమించారు. మీర్జా కేవలం పది నెలలు మాత్రమే (ఆగస్ట్ 1946-మే 1947) ప్రధానిగా పని చేశారు. ఆయన ప్రతిపాదించిన సంస్కరణలను కాంగ్రెస్ వారు బహిష్కరించే ఉద్యమం మొదలైంది. శాసన సభకు జరిగిన ఎన్నికలలో వ్యక్తిగతంగా మాత్రమే కొందరు పాల్గొన్నారు. ఇంతలో ఖాసిం రజ్వీ ఇత్తె హాదుల్ పార్టీ నాయకుడుగా, శాసన సభలో ఆ పార్టీ లీడర్ గా ఎన్నికయ్యారు. పింగిళి వెంకట రామారెడ్డి, అబ్దుల్ రహీంలు మిర్జా ఇస్మాయిల్ మంత్రి మండలిలో చేరి, లాయఖ్ అలీ మంత్రి మండలిలో కూడా కొనసాగి, హైదరాబాద్ రాజ్యాధికారం పతనం ఐన తర్వాత పదవులను వదిలారు.

ఈ నేపధ్యంలో, తెలంగాణ ఆంధ్రోద్యమానికి సంబంధమున్న తుది (పదమూడవ) అంధ్ర మహా సభ, జమలాపురం కేశవ రావు అధ్యక్షతన, మే నెల 1946 లో మెదక్ జిల్లా కంది గ్రామంలో జరిగింది. ఆ తర్వాత ఆంధ్ర మహా సభ స్టేట్ కాంగ్రెస్ లో విలీనమైంది. కమ్యూనిస్టులు కూడా తమ పదమూడవ-చివరి మహా సభను బద్దం యెల్లారెడ్డి అధ్యక్షతన కరీంనగర్ లో జరుపుకున్నారు. అప్పటినుంచి ఉద్యమం పార్టీ పేరు మీదే సాగింది. కమ్యూనిస్ట్ ఉద్యమం తీవ్రతరం కావడం, ప్రజలలో అభిమానం పెరగడం, పెద్ద సంఖ్యలో ప్రజలు ఎర్ర జెండాలు పట్టుకుని తిరగడంతో, నవంబర్ 1946 లో పార్టీని నిషేధించింది ప్రభుత్వం.

బ్రిటీష్ ఇండియాకు లార్డ్ మౌంట్ బేటన్ ను వైస్రాయ్ గా నియమించింది. అవసరమొస్తే భారత దేశాన్ని విభజించైనా అధికారం అప్ప చెప్పడం జరుగుతుందని అట్లీ స్పష్టం చేశారు. జూన్ 2, 1947 న ఇదే విషయాన్ని మౌంట్ బేటన్ ఇండియన్ రేడియో ద్వారా ప్రకటించడం, నెహ్రూ దానికి అంగీకారం తెలపడంతో, నిజాం నవాబు హైదరాబాద్ రాష్ట్రం ఇండియా-పాకిస్తాన్ లలో దేని లోనూ చేరదని, స్వతంత్ర రాజ్యంగా వుంటుందని, జూన్ 11 న ఒక ఫర్మానా ద్వారా తెలియ చేశాడు. దానిని ఖండిస్తూ, హైదరాబాద్ లో స్టేట్ కాంగ్రెస్ నాయకులు, స్వామీ రామానంద తీర్థ అధ్యక్షతన బ్రహ్మాండమైన మహా సభను జూన్ 16, 17, 18 తేదీలలో నిర్వహించి, బూర్గుల దానికి అనుగుణంగా చేసిన ప్రతిపాదనను ఆమోదించారు. ఆగస్ట్ 7 న రాష్ట్రంలో జాతీయ జండా ఎగుర వేసి, నిజాం స్వాతంత్ర్యాన్ని తిరస్కరించారు. ఆగస్ట్ 15, 1947 న దేశానికి స్వతంత్రం ఇచ్చి బ్రిటీష్ వారు వెళ్లి పోయిన తర్వాత, మరొక మారు నిజాం తనను తాను స్వతంత్ర రాజుగా ఆగస్ట్ 27 న ప్రకటించుకున్నారు. రజాకార్ల దౌర్జన్యం మొదలై, ఉధృత రూపం దాల్చింది.

నిజాం ప్రయత్నాలకు రజాకార్ల మద్దతు లభించింది. దౌర్జన్యాలు మితి మీరి పోయాయి. జూన్ 1948 మౌంట్ బేటన్ స్థానంలో రాజగోపాలా చారి గవర్నర్ జనరల్ గా నియమితులయ్యారు. నిజాం తన కేసును ఐక్య రాజ్య సమితి దృష్టికి కూడా తీసుకెళ్లాడు. పరిస్థితులు చే జారి పోతుండడంతో, పోలీసు చర్య ఆరంభమై, సెప్టెంబర్ 13, 1948 న భారత సైన్యాలు హైదరాబాద్ రాష్టంలోకి ప్రవేశించాయి. యూనియన్ సైన్యానికి నిజాం సేనల-రజాకార్ల నుంచి నామ మాత్రపు ప్రతిఘటన ఎదురైంది. సెప్టెంబర్ 17 న మేజర్ జనరల్ జే ఎన్ చౌదరీ నాయకత్వంలోని సేనలు హైదరాబాద్ కు చేరుకోగానే, నిజాం లొంగిపోయి శరణు కోరాడు. ఖాసిం రజ్వీ, లాయక్ అలీ లను నిర్బంధంలోకి తీసుకున్నారు. చౌదరీ మిలిటరీ గవర్నర్ గా, సెప్టెంబర్ 18, 1948 న సైనిక ప్రభుత్వం ఏర్పడింది. రెండేళ్ల తర్వాత వెల్లోడి ముఖ్య మంత్రిగా సివిల్ పాలన మొదలైంది. 1952 లో ఎన్నికల అనంతరం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. బూర్గుల రామకృష్ణా రావు ముఖ్య మంత్రిగా 1956 అక్టోబర్ వరకు కొన సాగారు.

ఈ నేపధ్యంలో, భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణం కొరకు ఆందోళన మొదలైంది. ఫజలలీ కమీషన్ ఏర్పాటై, ప్రజాభిప్రాయ సేకరణకు సభ్యులు హైదరాబాద్ వచ్చి, ప్రముఖులతో చర్చలు జరిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు, వారు కోరుకున్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాలేదు. హైదరాబాద్ రాష్ట్రం కూడా మూడు ముక్కలైంది. కర్నాటక, మహారాష్ట్రలకు పోగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మిగిలిన ఎనిమిది (ఇప్పటి ఉమ్మడి పది) జిల్లాలను, ఆంధ్ర రాష్ట్రంలోని పదకొండు(ఇప్పటి పదమూడు) జిల్లాలతో కలిపి "ఆంధ్ర ప్రదేశ్" రాష్ట్రం ఏర్పాటైంది. సెప్టెంబర్ 17, 1948 న భారత దేశంలో నిజాం రాష్ట్రం "విలీనం" అయింది. ఎనిమిదేళ్లు గడవగానే, తెలంగాణ ప్రాంతాన్ని విశాలాంధ్ర లో విలీనం చేసారు. కేసీఆర్ నాయకత్వంలో 14 సంవత్సరాల శాంతియుత ఉద్యమం తర్వాత జూన్ 2, 2014 లో తెలంగాణ అరాష్ట్రం ఏర్పాటైంది. 

ఇన్నాళ్లూ అన్నదమ్ములవలె కలిసిమెలిసి వుంటున్న ఆంధ్ర, తెలంగాణ ప్రాంతం వారు, భౌగోళికంగా విడిపోయి, అన్నదమ్ముల్లానే, చిరకాలం కలిసిమెలిసి వుంటే మంచిదేమో!

No comments:

Post a Comment