Saturday, September 7, 2019

జటాయువును చూసిన రామలక్ష్మణులు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-77 : వనం జ్వాలా నరసింహారావు


జటాయువును చూసిన రామలక్ష్మణులు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-77
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (08-09-2019)
          శ్రేష్టమైన మంచి నీతి వాక్యాలను, వాటి అర్థాన్ని, చిన్నవాడైనా తమ్ముడు లక్ష్మణుడు చెప్పగా విన్న పెద్దవాడైన రామచంద్రమూర్తి, దాంట్లోని సారాన్ని గ్రహించి, కోపంతో లోగడ చేద్దామనుకున్న పనిని వదిలి, విల్లు ఆధారంగా నిలబడి, “నాయనా! లక్ష్మణా! సీతను వెదకడానికి ఏం చేయవచ్చు? ఎక్కడికి పోదాం?” అని అడిగాడు. శోకతప్తుడైన రామచంద్రమూర్తి ఇలా అడగ్గా, లక్ష్మణుడు జవాబుగా ఇలా చెప్పాడు. “ఈ జనస్థానంలో పెద్ద-పెద్ద మృగాలు, గుహలు, కొండలు, చొరలేని మార్గాలు వున్నాయి. కిన్నరుల ఇండ్లున్నాయి. భయంకరమైన రాక్షసుల దీనంలో వుందిది. పెద్ద-పెద్ద చెట్లున్నాయి. కాబట్టి రాక్షసులు సీతను తెచ్చి ఇక్కడే, ఎక్కడో దాచిపెట్టి వుంటారు. కాబట్టి సీతాదేవిని ఇక్కడే ఎక్కడో వెతకాలి. నీలాంటి బుద్ధి సంపదకలవాడు ఆపద వస్తే చలించాలా? ఎంత గట్టిగా గాలి వీచినా కొండలు కదులుతాయా?”. ఇలా చెప్పగా రామచంద్రమూర్తి తమ్ముడు తనవెంటరాగా అడవి ప్రదేశమంతా వెతికాడు.

         ఇలా వెతుక్కుంటూ పోగా-పోగా, ఆ పర్వతం దగ్గరే ఒకచోట పెద్ద కొండలాగా వున్న, నెత్తుటితో తడిసిన, పుణ్యాత్ముడిని, ప్రాణం పోయినా సరే స్వామికార్యం చేయాలన్న భక్తి కలవాడిని, పక్షి శ్రేష్టుడిని, జటాయువును చూశారు రామలక్ష్మణులు. చూసి తమ్ముడితో ఇలా అన్నాడు రాముడు. “విరోధులను శిక్షించినవాడా! చూశావా? వీడు రాక్షసుడు....సీతను మింగి, మనం చంపుతామేమోనని భయంతో గద్దలాగా హాయిగా కూచున్నాడు. వీడిని నా భయంకర బాణాలతో, తక్షణమే, ఆలస్యం చేయకుండా చీలుస్తాను”. ఇలా అంటూనే జటాయువుకు ఎదురుగా పోయి, ఒక తీవ్ర బాణాన్ని సంధించగా భూతలం వణికింది. అప్పుడు నెత్తురు చొంగ కక్కుతూ, మరణతాపంతో బాధపడుతూ, గద్గద స్వరంతో పక్షిరాజు రామచంద్రుడితో ఇలా అన్నాడు.

         “ఆయుష్మంతుడా! అడవిలో ఔషధిని వెదికిన విధంగా దేన్నైతే వెతుకుతున్నారో, ఆ సీతను, నా ప్రాణాన్ని, తెమ్టినీ రావణుడే అపహరించాడు. నువ్వూ, లక్ష్మణుడూ, పావనైన సీతను ఒంటరిగా అడవిలో విడిచిపోగా, రావణుడు బలవంతంగా ఆమెను ఎత్తుకుని ఆకాశమార్గాన పోసాగాడు. అది చూసిన నేను, విసురుగా వాడికి అడ్డం పోయాను. వాడిని ఎదిరించి వాడితో బలం కొద్దీ యుద్ధం చేసి వాడి రథాన్ని నేలపడగొట్టాను. వాడిని కింద పడేశాను. నేను విరిచిన విల్లు ఇక్కడే పడి వుంది. పొది కూడా ఇక్కడే పడిపోయి వుంది. నా రెక్కల దెబ్బకు చచ్చిన సారథి ఇక్కడే పడిపోయి వున్నాడు. ఇదే నేను విరగ్గొట్టిన రథం. నేను ముసలివాడినై అలసిపోయాను. అప్పుడు వాడు తన కత్తితో నా రెక్కలను తెగనరికి నేలమీద పడేసి, సీతను పట్టుకుని ఆకాశమార్గాన పరుగెత్తాడు. నీ భార్య కోసం ముందే రావణుడు నన్ను చంపాడు. నా స్నేహితుడైన దశరథుడి పుత్రా! చావడానికి సిద్ధంగా వున్న నన్ను నువ్వు కూడా చంపాలా?


         జటాయువు మాటలు విన్న రాముడు తన విల్లు దూరంగా పడవేసి, అతడిని కౌగలించుకుని, తమ్ముడితో కలిసి ఏడ్చాడు. “లక్ష్మణా! నా నిర్భాగ్యం ఎలాగుందో చూశావా? రాజ్యం పోవడం, భయంకర అరణ్యంలో దుఃఖపడడం, సీతను పోగొట్టుకొనడం, జటాయువు మరణం.....ఇవన్నీ, సర్వం దహించే అగ్నిహోత్రుడినైనా కాలుస్తాయి. సహించలేని ఈ తాపం చల్లార్చుకొనడానికి నేను సముద్రంలో దూకినా నా శరీరం వేడి వల్ల సముద్రం ఎండుతుంది కాని నేను చల్లబడను. ఎంత వెతికి చూసినా నా కంటే అదృష్టహీనుడు లోకంలో లేరు. జటాయువు మన తండ్రికి స్నేహితుడు. పుణ్యాత్ముడు. ముసలివాడు. పక్షిరాజు. నా నిర్భాగ్యం వల్ల కొట్టబడి నేలకూలాడు చూశావా?”

         అని లక్ష్మణుడితో అంటూ, రెక్కలు నరకబడి నెత్తురుకారుతున్న జటాయువును తన చేత్తో తుడిచి, “పుణ్యాత్ముడా! నా ప్రాణంతో సమానమైన సీత వృత్తాంతం చెప్పు” అని అడిగాడు.

1 comment:

  1. పిడకలవేట లో రామాయణం ఎందుకు కలపడం జ్వాలా? రామాయణం పోస్టులు మరో బ్లాగులో రాసుకోవచ్చు కదా.

    ReplyDelete