Friday, September 20, 2019

జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు .... ఉస్మానియా విశ్వవిద్యాలయ బీఎల్లెస్సీ విద్యార్థిగా : వనం జ్వాలా నరసింహారావు


జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు
ఉస్మానియా విశ్వవిద్యాలయ బీఎల్లెస్సీ విద్యార్థిగా
వనం జ్వాలా నరసింహారావు
         ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గతంలో కూడా విద్యార్థిగా వున్నప్పటికీ అప్పట్లో విశ్వవిద్యాలయ కాంపస్ లో చదవలేదు. న్యూ సైన్స్ కాలేజీలో డిగ్రీ చదివాను. కాంపస్ లో చదవడం ఒక గొప్ప థ్రిల్ అయితే ఆర్ట్స్ కళాశాల భవనంలో చదవడం అంతకంటే గొప్ప థ్రిల్. మా క్లాసులు ఒకటి-రెండు రోజులు అక్కడ జరిగిన తరువాత అప్పటి కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ్ కరణ్ రెడ్డి ఆదేశాలమేరకు విశ్వవిద్యాలయ లైబ్రరీ బిల్డింగ్ కు మార్చారు. మధ్య-మధ్య ఒకటీ-అరా క్లాసులు ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ లో జరిగినా, చాలా వరకు లైబ్రరీ బిల్డింగ్ లోనే జరిగేవి. క్లాసిఫికేషన్, కాట్లాగింగ్, రిఫరెన్స్ లైబ్రరీ, బుక్ సెలెక్షన్, అకాడెమిక్ లైబ్రరీ....ఇలా అనేక అంశాలపై తరగతులుండేవి. ఆచార్య రాజు, వేణుగోపాల్, దొరితీఐజాక్ లతో పాటు గెస్ట్ లెక్చరర్స్ గా కొంతమంది క్లాసులు తీసుకునేవారు. విద్యార్థులలో కొందరి పేర్లు బాగా గుర్తున్నాయి. ఇద్దరు శంకర్ రెడ్డిలు, ఇద్దరు రమేష్ లు, పుల్లయ్య, ఉమాపతి, నరసింహారావు, హరికృష్ణారెడ్డి, స్వర్ణ, జయంతి తదితరులున్నారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా మా క్లాసులో వుండేవారు. బీఎల్లెస్సే పరిభాషలో వారిద్దరినీ “ఇ-కం-టుపీ” అని సంబోధించేవాళ్ళం.

         బీఎల్లెస్సీ లో చేరడమైతే జరిగింది కాని చదవడానికి ఆర్థికంగా ఇబ్బందులున్న రోజులవి. నాకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు పుట్టారు. ఇద్దరూ పసిపిల్లలే. అప్పటికి మూడు-నాలుగు సంవత్సరాల బట్టి పంటలు సరిగ్గా పండడం లేనందున నాన్నగారు కూడా ఆర్థికంగా నన్ను చదివించే పరిస్థితిలో అంతగా లేరు. మా శ్రీమతికి పెళ్లిలో పెట్టిన బంగారు ఆభరణం (గొలుసు) బాంక్ లో తాకట్టు పెట్టితే 1200 రూపాయలు వచ్చాయి. వాటితో ప్రారంభించాను చదువు. ఇక్కడ విశ్వవిద్యాలయానికి శలవులు ఇచ్చినప్పుడు ఖమ్మం వెళ్లి ఉద్యోగంలో చేరేవాడిని. ఆ కొన్నాళ్లు జీతం వచ్చేది. అక్కడ స్కూల్ కు శలవలు ఇచ్చినప్పుడు కూడా ఆటోమేటిక్ గా జీతం వచ్చేది. ఈ రెండూ కాకుండా అప్పటికి నాకు జమైన మెడికల్, ఇతర శలవులకు కూడా జీతం వచ్చేది. మొత్తం మీద ఇవన్నీ కలిపి బొటా-బొటీగా సంసారం సాగేది. నేను కొన్నాళ్లు ఒక్కడినే గీతారంగారావు అమ్మగారి ఇంట్లో ఒక గది అద్దెకు తీసుకుని వుండేవాడిని. మా శ్రీమతి, పిల్లలు ఖమ్మంలో మా ఇంట్లోనో, లేదా, మా మామగారి ఇంట్లోనో వుండేవారు. నేను సగం రోజులు హైదరాబాద్ లో, సగం రోజులు ఖమ్మంలో గడిపేవాడిని. మొదటి సంవత్సరం అలా గడిచింది.

         ఆ తరువాత రెండో ఏడాది హైదరాబాద్ లో కాపురం పెట్టాం. రాంనగర్ లో కృష్ణారావు గారింట్లో రెండు గదుల ఇల్లు అద్దెకు తీసుకున్నాం. అక్కడి నుండి దాదాపు చాలావరకు లైబ్రరీకి నడిచే పోయేవాడిని. లేదా బస్ లో పోయేవాడిని. మా ఇద్దరు చంటి పిల్లల ఆలనా-పాలనా మొత్తం మా శ్రీమతే చూసుకునేది. ఉదాహరణకు, వాళ్లకు చిన్నప్పుడు ఇవ్వాల్సిన వాక్సినేషన్లను ఆమె ఒక్కతే (లేదా మా ఇంటి ఓనర్ కూతురిని తోడు తీసుకుని) నారాయణగూడా లోని వైఎమ్సీఏ సమీపంలో వున్న ప్రివెంటివ్ మెడిసిన్ కేంద్రానికి వెళ్లి వేయించుకుని వచ్చేది. తనూ, పిల్లలూ అంతా బస్ ప్రయాణమే. రిక్షా ఖర్చు భరించే స్థితికాదప్పట్లో.

         రాంనగర్ లో వుంటున్నప్పుడు జరిగిన రెండు సంఘటనలు బాగా గుర్తున్నాయి. ఒకటి, మొట్టమొదటిసారిగా పుట్టపర్తి సత్యసాయిబాబాను దర్శించుకుంది అక్కడ వున్నప్పుడే. ఒకసారి బాబా నల్లకుంటలోని శివంకు వచ్చారు. అప్పటికి ఆయన ఇంకా అంత పాపులర్ కాలేదు. అయినా దాదాపు రాంనగర్ మొత్తం ఆయన్ను చూడడానికి పోయిందా అన్నట్లు ఆబాలగోపాలం శివంకు వెళ్లారు. ఏం జరుగుతున్నదో చూద్దాం అని మేం కూడా వెళ్లాం. చాలా బాగా దర్శనం అయింది.

         రెండోది చాలా ఆసక్తికరమైన విషయం. ఒకరోజున మా శ్రీమతి పెద్దక్క హైమావతి (మా వదిన గారు), అతి రక్తస్రావం సంబందించిన అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ మా ఇంటికి వచ్చింది. మేం ఆమెను సమీపంలోని దుర్గాబాయి దేశముఖ్ ఆంధ్ర మహిళాసభ ఆసుపత్రిలో చేర్పించాం. (ఆ తరువాతి రోజుల్లో అదే హాస్పిటల్ కు మా శ్రీమతి పెద్దన్నగారు డాక్టర్ ఏపీ రంగారావు చైర్మన్ గా పనిచేశారు). ఆమెను పరీక్షించిన డాక్టర్ (శ్రీమతి) పీఎం నాయుడు సాయింత్రంలోపల ఆమెకు అత్యవసర శస్త్ర చికిత్స చేయాలని, చేసి గర్భ సంచీ తొలగించాలని, లేకపోతే ప్రాణాపాయం అనీ చెప్పింది. ఆమె భర్త స్వగ్రామం కల్లూరులో వున్నాడనీ, (మగవాళ్లు ఎవరూ లేనందున) ఆయన వచ్చేదాకా ఆగమనీ నేనన్నాను. ఏంకాదు ఆపరేషన్ చేస్తానని చెప్పి మమ్మల్ని తయారుకమ్మని అన్నది. మాకేం పాలుపోలేదు.

తక్షణమే, మా వదినగారు ఎప్పుడూ కన్సల్ట్ చేసే హోమియోపతి (స్వర్గీయ) డాక్టర్ జగన్నాధరావును సంప్రదించాం. ఆయన వెంటనే వచ్చి రెండు డోసులు హోమియో పిల్స్ ఇచ్చి వెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆపరేషన్ చేయడానికి తయారై వచ్చిన డాక్టర్ పీఎం నాయుడు, ఆమెను పరీక్షించి చూడగా, అంతకు ముందున్న సమస్య పూర్తిగా మటుమాయం అయింది. డాక్టర్ కూడా ఆశ్చర్య పోయింది. రెండు డోసుల హోమియో పిల్స్ నిమిషాల్లో గర్భ సంచీ తొలగించాల్సిన ఆపరేషన్ జరక్కుండా పనిచేసింది. మరుసటిరోజు ఆమెను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. హాస్పిటల్లో వున్నప్పుడు ఆమె తన బంగారు గొలుసు పోగొట్టుకుంది. ఆ తరువాత మా వదినగారు పండంటి మగ పిల్లవాడిని కనింది. వాడిప్పుడు (ప్రశాంత్) ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లైబ్రరీ సైన్స్ చదువుతున్నప్పుడే, ఇంకా పరీక్షలు రాయకముండే బీహెచ్ఇఎల్ హైయర్ సెకండరీ స్కూల్ లో లైబ్రేరియన్ గా తాత్కాలిక ప్రాతిపదికమీద ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత 1974 జులై నెలలో పరీక్షలు రాయడం, యూనివర్సిటీ సెకండ్ రాంక్ సాధించడం జరిగింది. ఉద్యోగం కూడా పర్మనెంట్ అయింది.

No comments:

Post a Comment