Sunday, September 29, 2019

ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిన బీహెచ్ఇఎల్ పాఠశాల .... జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-9 : వనం జ్వాలా నరసింహారావు


ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిన బీహెచ్ఇఎల్ పాఠశాల
జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-9
వనం జ్వాలా నరసింహారావు
          నాతో పాటే బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో అధ్యాపక ఉద్యోగంలో చేరిన వాళ్ల పేర్లు చాలావరకు గుర్తున్నాయి. వీరిలో కొందరు నాతోపాటు, నాకంటే ముందు చేరిన వాళ్లయితే, నేను చేరిన ఏడాది-రెండేళ్లకు చేరిన వాళ్లు కొందరున్నారు. నా సహాధ్యాయులు  చాలా మందితో నాకు ఇప్పటికీ కాంటాక్ట్ వుంది. పౌర సంబంధాల వృత్తిలో వున్న నాకు “get connected and stay connected” అన్న PR సిద్దాంతం మీద పూర్తి నమ్మకం వుండడం వల్ల దాదాపు చాలామంది పాత స్నేహితులతో అనుబంధం కొనసాగిస్తున్నాను. మేడం పద్మావతి గారు జీవించినంత కాలం దాదాపు ప్రతి ఏడాది బీహెచ్ఇఎల్ పాఠశాలకు చెందిన ఎవరో ఒకరి ఇంట్లో ప్రతి ఏటా ఒకనాడు కలిసి భోజనం చేసే అలవాటు కూడా వుండేది. ఈ మధ్యకాలంలో దాదాపు ప్రతి సంవత్సరం పాఠశాల ఆవరణలో పాత అధ్యాపక-విద్యార్ధి బృందాలు కలిసే ఆనవాయితీ కూడా కొనసాగుతున్నది. వీలున్నప్పుడల్లా నేను వాటికి హాజరవ్వడం జరుగుతుంటుంది. పాఠశాల విద్యార్థులు కూడా చాలామంది నాతో టచ్ లో వున్నారు.

         పాఠశాల అధ్యాపకులలో, కార్యాలయ సిబ్బందిలో గుర్తున్న కొన్ని పేర్లు:
         జగన్మోహన్ రావు, డేవిడ్, సాంబాబ్ (పీటీ), ఇన్నయ్య (పీటీ), నాగేశ్వర్ రావు (పీటీ), ఎస్ఏఏమ్వీ ప్రసాద్ రావు, ఆణంగరాచారి, జోపట్, యువీ రమణ, జీ సుబ్రహ్మణ్యం, పీ సుబ్రహ్మణ్య శర్మ, సూర్యప్రకాష్, విశ్వనాథం,  ఆహోబిలరావు, జయచంద్రన్, కమలాకర్, సీహెచ్ విశ్వేశ్వర్ రావు, రామ శర్మ, హరి సర్వోత్తం రావు, రెడ్డి ప్రసాద్, ఆంజనేయులు, ఎమ్మెస్ఎస్ నాగేశ్వర్ రావు, రఘుపతి, ఆఫీస్ కు చెందిన సుందరేశ్, విజయరాజు, సుబ్రహ్మణ్యంలు, సీవసంత (వైస్ ప్రిన్సిపాల్), డబ్ల్యు పార్వతి, ప్రభావతి, యానీ పద్మారావు, శ్యామల, జ్యోత్స్నా పాధ్యే, లాల్, అలీ, అక్కలక్ష్మి, సుబ్బలక్ష్మి, ఉషాథాకూర్, జమీలా సయీద్బిల్కీస్ అహ్మద్, జైనాబ్, అన్సా అల్లాద్దీన్, మణిప్రభ, మణిపుష్ప, గృహలక్ష్మి, పార్వతి, లలిత, అరుణా ఊర్మిళ, అరుణా వర్మ, చంద్ర ముఖి, మేరీ గ్రేస్, సుశీల, హితవచన, సత్య వాణి, ఝాన్సీ, ఎలెన్ పాండా, శోభ, ఇంద్రాణి, జయా చంద్ర శేఖర్, సుహాస్ చౌధురి, రాజకుమారి, వత్సలాదేవి, శైలజా బాలకృష్ణన్, తెలుగు టీచర్ రాజకుమారి, దేవకరుణ, మెశాక్, అంబిక శామ్యూల్, లిల్లీ రాయ్, నాగమణి, ఫాతిమా, ఉత్తర, దేవి, శేషు బాయి, స్వరాజ్య లక్ష్మి, రమణి, దీనా ప్రకాష్, రాజేశ్వరి, టీ పద్మ, రజనిరెడ్డి, భాస్కర్ రెడ్డి, వైద్యనాథన్  ... తదితరులు.

         జగన్మోహన్ రావు గారు సైన్స్ సబ్జెక్ట్ లోనే కాకుండా తెలుగు సాహిత్య ప్రియులు. తెలుగులో కవిత్వం అలవోకగా రాయగల సమర్థులు. చాలా వ్యాసాలూ, కథానికలు, కవితలు రాశారు. వాటిలో కొన్ని ప్రచురితమైనవి కూడా వున్నాయి. డేవిడ్ ఒక విలక్షణమైన అధ్యాపకుడు. ఎవరికీ తలొగ్గని మనస్తత్వం ఆయనది. పాఠశాలకు ఒక అసోసియేషన్ స్థాపించుకుంటే బాగుంటుందని ఆలోచన చేసిన వారిలో జగన్మోహన్ రావు, డేవిడ్, ఇన్నయ్య, నాగేశ్వర్ రావు, రామశర్మ, నేను ముందు వరసలో వున్నాం. జయా చంద్ర శేఖర్, పార్వతి, అక్కలక్ష్మి లాంటివారు బాగా తోడ్పడ్డారు. అసోసియేషన్ రిజిస్టర్ చేద్దామనుకున్నాం కాని వీలు పడలేదు. చివరకు ప్రతి సంవత్సరం ఒకరం కన్వీనర్ గా దాన్ని నడిపించాం. మొదటి ఏడాది జగన్మోహన్ రావు, తరువాత డేవిడ్, తరువాత నేను అలా కొనసాగం. మా ప్రధానమైన పోరాటం ఆరోజుల్లో, బీహెచ్ఇఎల్ తో సమానంగా హయ్యర్ సెకండరీ స్కూల్ సిబ్బందికి కూడా వేతనాలు తదితర బెనిఫిట్స్ ఇవ్వాలని. స్కూల్ సిబ్బందికి కూడా బోనస్ ఇవ్వాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని సుదీర్ఘ పోరాటం చేసాం. చివరికి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాం. కన్నభీరన్ మా అడ్వొకేట్. చివరకు కొన్ని అంశాలలో విజయం సాధించాం. ఉదాహరణకు గ్రాట్యుటీ సాధించగలిగాం. కాకపోతే కొంచెం ఆలశ్యంగా.  

         (నేను బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు నాకు టర్మినల్ బెనిఫిట్స్ ఏవీ ఇవ్వలేదు. కేవలం నా ప్రావిడెంట్ ఫండ్ మాత్రం ఇచ్చారు. ఆ తరువాత నేను గవర్నర్ కుముద్ బెన్ జోషి దగ్గర ఆమె అధ్యక్షతన వున్న చేతన స్వచ్చంద సంస్థకు ప్రాజెక్ట్-అడ్మినిస్త్రేటివ్ అధికారిగా పని చేశాను. నాలుగేళ్లు ఆ ఉద్యోగం చేసిన తరువాత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 1989-90 సంవత్సరంలో ఆయనకు పీఆర్వో గా వెళ్లాను. నన్ను రాజ్ భవన్ చెన్నారెడ్డి దగ్గరకు డెప్యుటేషన్ మీద పంపించింది. కాని పీఆర్వో ఉద్యోగం అయిపోయిన తరువాత వెనక్కు వచ్చేలోపు చేతన ప్రాజెక్ట్ అధికారి ఉద్యోగాన్ని, తదిర ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్లు చేతన యాజమాన్యం నాటి గవర్నర్ కృష్ణకాంత్ అధ్యక్షతన సమావేశమై నిర్ణయించింది. ఈ వివరాలన్నీ మరోమారు ప్రస్తావిస్తాను. అప్పుడు ఉద్యోగం పోగొట్టుకుని జీతం లేకుండా ఎలా గడపాల్నా అని ఆలోచిస్తున్న సమయంలో ఒకరోజు పోస్టులో బీహెచ్ఇఎల్ నుండి రు. 10,000 లకు చెక్కు వచ్చింది. విప్పి చూస్తే అది నా గ్రాట్యుటీ కింద పంపుతున్నట్లు కవరింగ్ లెటర్లో వుంది. అసలు విషయం ఏంటని విచారిస్తే, కోర్టు విచారణలో స్కూల్ సిబ్బందికి కూడా గ్రాట్యుటీ ఇస్తున్నట్లు బీహెచ్ఇఎల్ యాజమాన్యం పేర్కొన్నందున, అప్పటికి స్కూల్ ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిన వాడిని నేను ఒక్కడినే అయినందున, నాకు గ్రాట్యుటీ చెల్లించినట్లు చెప్పడానికి చెక్కు పంపారు. అనుకోకుండా అలా నాకు లాభం జరిగింది).

         అసోసియేషన్ పక్షాన స్కూల్ సిబ్బందిమి ఒకటి రెండు పర్యాయాలు బీహెచ్ఇఎల్ మెయిన్ గెట్ దగ్గరకు పోయి ధర్నా కూడా చేశాం. కాకపోతే మా అధ్యాపక బృందంలో కొద్ది మంది తప్ప చాలా మంది పద్మావతి గారి మీద భయంతోనో, భక్తితోనో ఉద్యమంలో కలిసి రాకపోయేవారు. మనసు మా పక్షాన, ఫిజికల్ గా ఆమె పక్షాన వుండేవారు. బీహెచ్ఇఎల్ మీద పోరాటం చేసిన ఒకానొక సందర్భంలో నన్ను చైర్మన్ పిలిపించారు. పోరాటం చేయడం శ్రేయస్కరం కాదన్నారు. నాకు కంపెనీలో ఉద్యోగం కూడా ఇస్తామన్నారు. అందరికీ బెనిఫిట్స్ ఇవ్వాలి కాని నా ఒక్కడికి కాదని తేల్చి చెప్పాను నేను అప్పట్లో.

         బీహెచ్ఇఎల్  హయ్యర్ సెకండరీ స్కూల్ సిబ్బందికి కూడా బీహెచ్ఇఎల్ సిబ్బందికి ఇచ్చినట్లే ఇళ్ళ జాగాలు ఇవ్వాలని డిమాండ్ చేసినా ఫలితం లేకపోతే, మేమే ఒక కోఆపరేటివ్ సొసైటీ స్థాపించాం. దానిపేరు “పద్మశ్రీ బీహెచ్ఇఎల్ స్కూల్ హౌజింగ్ సొసైటీ”. దాని వల్ల పెద్దగా ఫలితం లేకపోయినా చాలా కాలం దాన్ని విజయవంతంగా నడిపాం.

No comments:

Post a Comment