Saturday, January 25, 2020

వాలికి, తనకు, విరోధం కలిగిన కారణం శ్రీరాముడికి చెప్పిన సుగ్రీవుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-14 : వనం జ్వాలా నరసింహారావు


వాలికి, తనకు, విరోధం కలిగిన కారణం శ్రీరాముడికి చెప్పిన సుగ్రీవుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-14
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (26-01-2020)
   
 రామచంద్రా! పూజ్యుడైన మా తండ్రికి మేమిద్దరం కొడుకులం. మాలో వాలి జ్యేష్టుడు. నేను చిన్నవాడిని. మా తండ్రికి నాకు మిక్కిలి ప్రేమకలవాడై వాలి ప్రవర్తించేవాడు. మా తండ్రి మరణించగా, కపులు, పౌరులు, మంత్రులు సమ్మతించి కపిరాజ్యానికి వాలిని రాజుగా నిర్ణయించి అతడికి పట్టాభిషేకం చేశారు. వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యాన్ని వాలి పాలిస్తుంటే నేను ఆయన హితం కోరి ఆయనకు సేవలు చేస్తుండేవాడిని. ఇలా కొంతకాలం గడిచింది. ఆ తరువాత రామచంద్రా, మయుడి కుమారుడు, దుందుభి సోదరుడైన మాయావి అనేవాడు స్త్రీ కారణాన వాడికీ, వాలికీ వున్న విరోధాన్ని అడ్డం పెట్టుకుని ఒక అర్థరాత్రి అందరూ నిద్రించే సమయంలో వాలిమీదకు యుద్ధానికి వచ్చాడు. కోపంతో, రోషంతో వాలి నిద్రలేచి మాయావి మీదకు యుద్ధానికి పోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు నేను, ఆడవారు ఆయనకు నమస్కారం చేసి, రాక్షసులతో అర్థరాత్రి యుద్ధానికి పోవడం మంచిది కాదని నచ్చచెప్పాం. మా మాట వినకుండా మమ్మల్ని ధిక్కరించి, కింద పడవేసి, రివ్వున వాడిమీదకు యుద్ధానికి పోయాడు”.

“నడిరేయిలో ఒంటరిగా రాక్షసులమీడకు యుద్ధానికి పోతున్న అన్న వాలిని చూసి, ఆయనమీద వున్న భక్తి కారణాన నేను కూడా వెంటపోయాను.  ముందు నడుస్తూ తన మీదకు వస్తున్న వాలిని, వెనుక వున్న నన్ను చూసి, ఆ రాక్షసుడు భయంతో వేగంగా పరుగెత్తసాగాడు. వెన్నెల మాకు సహాయపడుతుంటే, మేం కూడా వాడి వెంట పోయాం. ఆ దానవుడు పరుగెత్తిపోయి భూమిలో తీగలతో కప్పబడి, పోవడానికి కష్టమైన ఒక బిలంలో ప్రవేశించాడు. అప్పుడు మా అన్న నన్ను చూసి రావద్దని, అక్కడే నిలవమని, దానవుడిని చంపి వస్తానని చెప్పి లోపలికి పోయాడు. నేను కూడా అయన వెంట పోవడానికి అంగీకరించమని ఎంత చెప్పినా వినలేదు. పైగా ఆయన పాదాల మీద ఒట్టు పెట్టాడు. అప్పుడు చేసేదేమీ లేక బిలంబైట నిలబడ్డాను. వాలిమాత్రం వాడితో యుద్ధానికి చేయడానికి రోషంతో బిలంలోకి పోయాడు”.


“ఒక సంవత్సరం నేనా బిలం బైటనే వుండిపోయాను. బిలంలోనుండి నెత్తురు భయంకరమైన నురుగుతో బయటకు రాసాగింది. రాక్షసుల సింహనాదాలు స్పష్టంగా వినపడ్డాయి. వాలి దీనమైన ఏడుపు వినపడ్డది. పరాక్రమం క్షీణించి వాలి రాక్షసుడి చేతిలో చిక్కాడని, మరణించాడని భావించి, మనస్సు బాధపడుతుంటే, కొంచంపాటి కొండను ఆ బిలానికి అడ్డంగా వేసి అక్కడి నుండి వెళ్లిపోయాను. నేనాయనకు నీళ్లు విడిచి, మెల్లగా నగరానికి వచ్చి, వాలి కథ ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టాను. మంత్రులు ఏదోవిధంగా వాస్తవాన్ని గ్రహించారు. నన్ను రాజ్యానికి రాజుగా చేసి, పట్టాభిషేకం చేశారు. ఆ విధంగా రాజునైన నేను రాజ్యాన్ని పాలిస్తున్నాను. ఇంతలో, మహాబలశాలి వాలి దైత్యుడిని చంపి, నగరానికి వచ్చి, రాజ్యాన్ని కోరి తనను విడిచి వెళ్ళిపోయానని సందేహించాడు. పట్టాభిషేకం చేసుకున్న నన్ను చూసి కోపంగా చూశాడు”.

“చూసి, దుష్టబుద్ధీ, ఎందుకురా ఇలా చేసావు? నువ్వు తమ్ముడివని నమ్మికదా, నిన్ను బిలం బైట వుండమన్నాను. నేను బలవంతుడితో పోరాటం చేస్తున్నప్పుడు నన్నావిధంగా ఒంటరిగా వదిలి రావడమే కాకుండా నేను బిలం వెలుపలికి రాకుండా పెద్ద కొండను పెట్టి మూసివేసావు. రాజ్యానికి వచ్చి రాజ్యసంపద, భోగాలను అనుభవిస్తున్నావా? దుష్టుడా! నువ్వు తమ్ముడివేనా? అని నన్ను తిట్టి, నా దగ్గరున్న మంత్రులందరినీ బంధించి, వాళ్లను చెరసాలలో వేశాడు. నేనప్పుడు ఆయన్ను మంత్రుల, బంధువుల, స్నేహితుల సహాయంతో అడ్డుకోగల స్థితిలో వున్నప్పటికీ, అన్న కదా, పొరపాటున ఇలా చేస్తున్నాడనీ, నిజం తెలుసకుని విచారపడక పోతాడా అని మౌనం వహించడం వల్ల, నాకు ప్రాణాపద సంభవించింది. వాస్తవానికి ఆయన తన భుజబలంతో దానవుడిని చంపి, నగరానికి వస్తున్న సమయంలో, ఆ విషయం తెలుసుకుని, ఆయనకు ఎదురేగి భక్తితో నమస్కారం చేసినా, నాతో వాలి ఒక్క మంచిమాటైనా అనలేదు. నా క్షేమసమాచారం అడగలేదు. మూతి బిగించుకుని నావంక చూడనైనా లేదు”.

No comments:

Post a Comment