Saturday, February 15, 2020

వాలిని శపించిన మతంగుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-17 : వనం జ్వాలా నరసింహారావు


వాలిని శపించిన మతంగుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-17
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (16-02-2020)   
          మహిషాసురుడు బలహీనుడయ్యాడని అర్థం చేసుకున్న వాలి వాడిని పిడికిటి పోటులతో చంపి, వాడి కళేబరాన్ని చేతులతో పైకెత్తి, ఆమడ దూరంలో పడేట్లు విసిరి వేశాడు. అప్పుడారాక్షసుడి నోటినుండి కారుతున్న నెత్తురు గాలికి కొట్టుకుని వచ్చి మతంగాశ్రమంలో పడింది. అది చూసి మునీశ్వరుడు బాగా కోపం తెచ్చుకున్నాడు. ‘దుష్టబుద్ధి, పాపి, బుద్ధిలేనివాడు, జ్ఞానహీనుడు, ఎవడిలా నామీద నెత్తురు పడేశాడు?’ అని ఆశ్రమం బయటకి వచ్చి చూస్తే, ప్రాణం పోయి కొండలాగా పడివున్న రాక్షసుడిని చూశాడు. మహిషాసురుడిని చూసి ఎవరీ పని చేశాడని ఆలోచించి, తన తపశ్శక్తితో బలోన్మత్తుడైన వాలి చేసిన పని ఇది అను గ్రహించాడు. వాలిమీద కోపం తెచ్చుకున్నాడు ముని. దుష్టబుద్ధితో రాక్షసుడి దేహాన్ని తన బలంతో ఇక్కడి ఆశ్రమంలో వేసి, ఇక్కడి చెట్లను విరిచి, భూమ్మీద నెత్తురు, మాంసం పడవేసిన అడవిని అసహ్యంగా చేసిన దుష్టుడు ఇక్కడికి వస్తే చచ్చిపోతాడు అని శపించాడు. ఆ ఆశ్రమ ప్రదేశం ఒక ఆమడ విస్తీర్ణం కలది. దానిలోపలికి వాలి వస్తే చచ్చిపోతాడు. అక్కడున్న వాలి పక్షాన వున్న కోతులను సూర్యోదయం లోపల ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లాలని, వెళ్లకపోతే అందరూ శిలలుగా వేల సంవత్సరాలు వుండిపోతారని కూడా శపించాడు”.

         “ఇలా మునీశ్వరుడు శపించడంతో అక్కడున్న కోతులు భయపడి వాలి దగ్గరకు పరుగెత్తిపోయారు. వాళ్లను చూసి వాలి ఎందుకిలా వచ్చారని అడిగాడు. వాళ్లు ముని శాపం గురించి వాలికి చెప్పారు. ఆ విషయాన్ని తెలుసుకున్న వాలి మునీశ్వరుడి దగ్గరకు పోయి, నమస్కారం చేసి, ‘దయాశాలీ నన్ను క్షమించు’ అని ఎన్ని విధాల వేడుకున్నా ఆయన కోపం వదలలేదు. అప్పటి నుండి వాలి ఇక్కడికి రాడు. దీని పక్క కన్నెత్తి కూడా చూడడు. వాలి ఇక్కడికి రాకూడదన్న విషయం నాకు తెలిసినందువల్ల భయం లేకుండా ఇక్కడ తిరుగుతున్నాను. అదిగో అదే ఆ రాక్షసుడి ఎముకల గూడు. నేలపడి వుంది చూడు. రామచంద్రా! వాలి భుజబలం ఎలాంటిదో నీకు చెప్పాను. అలాంటి మహాబలశాలి వాలిని నువ్వెలా చంపుతావో చెప్పు” అని అంటాడు సుగ్రీవుడు.


         వాలి లాంటి అల్పుడిని రామచంద్రమూర్తి ఎలా చంపగలడో అని అనుమానిస్తున్నాడే, ఇదేమి మూఢత్వం అని లక్ష్మణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు సుగ్రీవుడితో. “కీర్తిమంతుడా! రామచంద్రమూర్తి ఏం చేస్తే వాలిని చంపగలడని నువ్వు నమ్ముతావు?” అని అడిగాడు. అక్కడున్న మద్ది చెట్లలో ఒకదానిని రామచంద్రమూర్తి ఖండిస్తే తాను నమ్ముతానని అంటాడు సుగ్రీవుడు. అలాగే కొండలాగా పడివున్న రాక్షసుడి ఎముకల గూడును బెండులాగా రెండువందల ధనువుల (నాలుగు మూరలు) దూరం చిమ్ముతే వాలిని రామచంద్రమూర్తి చంపగలడని నమ్ముతానంటాడు సుగ్రీవుడు. ఇలా అంటూనే, వాలి బలపరాక్రమాలను గురించి వివరంగా చెప్పాడు. అవన్నీ విన్న రాముడు తనలో తానే నవ్వుకుని, తన బలాన్ని ఆయన నమ్మేట్లు ప్రదర్శిస్తానని సుగ్రీవుడితో అన్నాడు.

దుందుభి కళేబరాన్ని చిమ్మిన శ్రీరాముడు
          సుగ్రీవుడికి సమాధానం చెప్పిన శ్రీరాముడు, దుందుభి శరీరాన్ని దూదిలాగా తన వేలితో అవలీలగా ఎత్తి పది యోజనాల అవతల పడేట్లు చిమ్మాడు. అది చూసి సుగ్రీవుడు “రామచంద్రా! ఇది పూర్వం వాలి చిమ్మినప్పుడు పచ్చిది. నెత్తురు, మాంసం కలది. కొత్తది. అదీ కాకుండా వాలి ఎంతో శ్రమపడ్డాడు. దేహం తెలియక వున్నవాడు. ఇప్పుడు దీనిలో ఎముకలు మాత్రమే మిగిలాయి. నువ్వేమీ కష్టపడలేదు. కాబట్టి నువ్వు వాలికంటే బలవంతుడివన్న విషయంలో సందేహం పోలేదు. అప్పుడు పచ్చిది, ఇప్పుడు ఎండిపోయింది కాబట్టి మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో చెప్పలేకపోతున్నాను. నిజం చెప్తున్నాను. నువ్వు విల్లు ఎక్కుబెట్టి బాణం సంధించి, భుజబలంతో ఒక్క మద్ది చెట్టును పడగొట్టితే వాలికంటే నువ్వే బలవంతుడివి అని నమ్ముతాను. నిన్ను నమ్మి వాలిమీదకు యుద్ధానికి పోవడానికి భయం లేకుండా వుండడానికి, నమ్మకం కుదరడానికి అడుగుతున్నాను. నేను అడిగినట్లు చేస్తే, తేజస్సులో రవి, పర్వతాలలో హిమవంతుడు, నాలుగు కాళ్ల జంతువులలో సింహంలాగా రామచంద్రా! మనుష్యులలో నిన్ను మించినవాడు లేడు అని నమ్ముతాను” అంటాడు.

No comments:

Post a Comment