Tuesday, February 4, 2020

ప్రైవేట్ భాగస్వామ్యం దిశగా... : వనం జ్వాలా నరసింహారావు


ప్రైవేట్ భాగస్వామ్యం దిశగా...
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (05-02-2020)
స్వాతంత్య్రం పొందిన కొత్తల్లో భారతదేశం కేవలం వ్యవసాయ ఆధారిత దేశం మాత్రమే. పారిశ్రామికంగా బాగా వెనుకబడ్డ దేశం. త్వరితగతిన పారిశ్రామికీకరణ జరగాలనీ, ఆర్థికంగా దేశం పరిపుష్టం కావాలనీ, ఆర్థికాభివృద్ధి వేగంగా జరగాలనీ, ఆర్ధిక స్వావలంభన చేకూరాలనీ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలనీ జాతియావత్తూ కోరుకుంటున్న రోజులవి. తదనుగుణంగానే 1948 లో ప్రకటించిన ప్రప్రథమ పారిశ్రామిక విధానంలో పారిశ్రామికాభివృద్ధికి విస్తృత వ్యూహం రూపొందించడం జరిగింది. దరిమిలా మంత్రిమండలి తీర్మానం ద్వారా 1950 లో ప్రణాలికా సంఘం ఏర్పాటు కావడం, 1951 లో పారిశ్రామిక చట్టం రూపుదిద్దుకోవడం చకాచకా జరిగిపోయాయి.

ఈ రెంటి ద్వారా పారిశ్రామికాభివృద్ధిని వేగవంతంగా, నియంత్రణ విధానంలో చేపట్టడానికి ప్రభుత్వానికి సాధికారత చేకూరింది. ప్రప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మదిలో మెదిలిన ఆర్ధిక విధానం అటు అమెరికా తరహా పెట్టుబడిదారీ విధానం కాకుండా, ఇటు సోవియట్ తరహా సామ్యవాద విధానం కాకుండా, మిశ్రమ ఆర్ధిక విధానంగా వుండేది. నెహ్రు జాతీయ పారిశ్రామిక విధానానికి అనుగుణంగా రూపుదిద్దుకున్న 1956–60 నాటి రెండో పంచవర్ష ప్రణాళిక, 1956 నాటి పారిశ్రామిక విధాన తీర్మానం, ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు, అభివృద్ధికి బీజం నాటాయి.

దరిమిలా ప్రభుత్వశాఖల్లో చోటుచేసుకున్న అలసత్వాన్ని, రెడ్ టేపిజాన్ని, కార్యనిర్వహణ పట్ల నెలకొన్న నిరాసక్తతను అధిగమించడానికి, పౌరులకు ప్రభుత్వపరంగా కన్నా మెరుగైన సేవలు అందించడమనే మహత్తర ఆశయంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొన్నాయి. అందులో రవాణా రంగంలో ఏర్పాటైన దేశవ్యాప్త ఆర్టీసీ సంస్థలు కూడా వున్నాయి. అలాగే భారత్ పెట్రోలియం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆయిల్ అండ్ నాచురల్ గాస్, ఇండియన్ ఆయిల్, బీహెచ్ఇఎల్, బీఇఎల్, నేషనల్ బిల్డింగ్స్ కనస్ట్రక్షన్, ఎన్ఎండీసీ, ఆయిల్ ఇండియా, షిప్పింగ్ కార్పోరేషన్, హెచ్ఎంటీ, ఐటీడీసీ, హెచ్సీఎల్, ప్రగాటూల్స్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు వున్నాయి. అయితే వీటిలో కొన్ని అనుకున్న లక్ష్యాలను, ఆశయాలను సాధించడంలో ఘోరంగా విఫలమైనందున ప్రభుత్వ రంగ సంస్కరణలను చేపట్టి, కొన్ని పిఎస్‌యులను మూసివేయడమో, పునర్వ్యవస్థీకరించడమో జరిగింది.

ప్రభుత్వరంగ సంస్థల నిర్వచనం, ఆవిర్భావం, ఆవశ్యకత, కాలానుగుణంగా రావాల్సిన మార్పులు రాకపోవడానికి కారణం, భవితవ్యం ఆధ్యయనపరంగా చాలా ఆసక్తికరంగా వుంటాయి. 50% పైగా ప్రభుత్వ భాగస్వామ్య వాటాతో, ప్రభుత్వమే యజమానిగా, హక్కుదారుడుగా వున్న కంపెనీలను ప్రభుత్వరంగ సంస్థ అంటారు. తమతమ ఆదాయాలనుండి పన్నులు చెల్లించే పౌరుల డబ్బునే ప్రభుత్వరంగ సంస్థలు విరివిగా వినియోగిస్తాయి.

దివంగత బ్రిటీష్ ప్రధానమంత్రి, ఆ దేశ రాజకీయాలలో “ఐరన్ లేడీ” గా ప్రసిద్ధికెక్కిన మార్గరెట్ థాచర్ ప్రభుత్వరంగ సంస్కరణలకు యావత్ ప్రపంచంలోనే ఆద్యురాలు. ఇటీవలి కాలంలో ప్రధాని మోడీని భారత థాచర్ గా పిలుస్తున్నారు. థాచర్ అధికారంలో వున్న రోజుల్లో ప్రభుత్వరంగ సంస్థల పనితీరుపై ఆగ్రహించి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సరైన సేవలను ప్రజలకు అందించడంలో ప్రభుత్వరంగ సంస్థలు ఘోరంగా విఫలమయ్యాయని థాచర్ తీవ్రంగా విమర్శించారు. వాస్తవానికి ఈ విమర్శ ఒక్క బ్రిటన్ కే పరిమితంకాదు. భారతదేశంతో సహా యావత్ ప్రపంచంలో చోటుచేసుకున్న వాస్తవం ఇది. తమ సంస్థలో పని చేస్తున్న సిబ్బంది జీతభత్యాలతో సహా యావత్ సంస్థ మనుగడకు అవసరమైన వనరులను పౌరుల పన్నుల రూపేణా సమకూరుతుందన్న విషయం వాళ్లకు పట్టకపోగా ఆ పౌరులకు సరైన సేవలను అందించడంలో సహితం పూర్తిగా విఫలమయ్యారు. అయితే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఒకే కోవకు చెందినవి కావు.   

ప్రభుత్వరంగ సంస్థల నుండి ప్రజలకు పేలవమైన సేవలు అందడానికి కారణం అక్కడ పనిచేసే సిబ్బంది తమ సంస్థ సేవలపై ఆధారపడ్డ ప్రజల ప్రయోజనాలకన్నా మిన్నగా వారి స్వంత ప్రయోజనాల సాధనకు ప్రాధాన్యత ఇవ్వడమే. ప్రభుత్వరంగ సిబ్బంది వైఖరి ఎలా వుంటుందంటే, తమ సేవలపై ఆధారపడిన పౌరులు వారికి ఇవ్వబడిన వాటిని, అవి ఎలాగున్నా సరే, అంగీకరించి తీరాలి, కృతజ్ఞతతో వుండాలి అని. తాము అందిస్తున్న సేవలపై తమకే గుత్తాధిపత్యం వున్నట్లు కూడా వారు ప్రవర్తించడం శోచనీయం. తమకు పోటీ ఎవరూ లేరని వారి భావన. అందుకే ఆరోగ్యకరమైన పోటీ వుండే విధానం రావాలని థాచర్ అభిప్రాయపడ్డది. ట్రేడ్ యూనియన్ల ఆధిపత్యం కూడా ప్రభుత్వరంగ సంస్థల వైఫల్యానికి ప్రధాన కారణం అని థాచర్ వాదన. యూనియన్ నాయకుల బ్లాక్మెయిల్ పద్ధతులు తరచూ ప్రభుత్వరంగ సంస్థల పనికి అవరోధంగా మారాయని థాచర్ అభిప్రాయం. సమ్మెలకు దిగమని వారు సిబ్బందిని ప్రోద్బలం చేస్తుంటే లక్షలాది మందికి వారి సేవలు ఆగిపోయి ఇబ్బందులు కలగడం తరచూ జరగడం వల్ల ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయని కూడా థాచర్ విమర్శించారు. 


ఈ నేపధ్యంలోనే థాచర్ ప్రభుత్వరంగ సంస్కరణల ఆవశ్యకతను నొక్కివక్కాణి౦చారు. ఆమె సూచనలు, సలహాలు ఇప్పటికీ, ఎప్పటికీ అనుసరణీయమే. ఆమె సూచనల్లో ప్రధానమైనది ప్రయివేట్ రంగంలో అనుసరిస్తున్న విధానాలను, పద్ధతులను, సాంప్రదాయాలను, అభ్యాసాలను ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా ప్రవేశపెట్టాలనేది. కొంతకాలం పన్నుల ద్వారా, ప్రభుత్వ ఖజానా ద్వారా ప్రభుత్వరంగానికి నిధులు సమకూర్చినప్పటికీ, సాధ్యమైనంతవరకు ప్రభుత్వరంగ సేవలను ప్రయివేట్ పద్ధతిలో నిర్వహించాలి. అప్పుడే వాటికి మనుగడ వుంటుంది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్ వాటికి దీటుగా పోటీలోకి దించాలి. ప్రయివేట్ కన్నా మెరుగైన సేవలు అందించేలా చూడాలి.     

ఈ నేపధ్యంలో, భారతదేశానికి సంబంధించినంత వరకు, దాదాపు మూడున్నర-నాలుగు దశాబ్దాల క్రితం విదేశీ పెట్టుబడులకు భారత ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరుచుకుంటున్న సమయంలో భారతీయ, విదేశీ కంపెనీల మధ్య కేవలం ఒక ఏడాదిలోనే పలు జాయింట్ వెంచర్లు ఏర్పాటయ్యాయి. కాకపోతే, ఆ తర్వాత అవి ఆశించిన ఫలితాలు అందించడంలో విఫలం కావడంతో ఐదేళ్లలోపే అవి విడిపోవడం మొదలయింది. జాయింట్ వెంచర్ల నిర్వహణ అత్యంత క్లిష్ట సాధ్యమని రుజువైంది. ప్రభుత్వరంగ సంస్థల, జాయింట్ వెంచర్ల అనుభవం నేపథ్యంలో ఇతర దేశాల మాదిరిగానే భారత దేశంలోకూడా “ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం” ఆలోచన రూపుదిద్దుకొని క్రమంగా బలపడుతూ వస్తోంది. ఈ విధానాన్ని సమర్థించే వారు పిపిపి విధానం వల్ల వనరులు, టెక్నాలజీ, నైపుణ్యం మెనేజ్‌మెంట్ విధానాలు, వ్యయ సామర్థ్యం తదితర రూపాల్లో ఒక దాని నుంచి మరొకటి లాభపడతాయని అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అనేది అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలలో అమలవుతున్న విధానమే. ఈ విధానంలో ప్రభుత్వ సేవలకు అవసరమైన నిధులను ప్రభుత్వం పూర్తిగాకాని, పాక్షికంగాని సమకూర్చి ప్రభుత్వం, ప్రైయివేట్ తోడ్పాటుతో, ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో అవి అమలవుతాయి. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రైవేటు సంస్థలతో పాటుగా చాలా కార్పొరేట్ సంస్థలు భారత్‌తో సహా చాలా ప్రజాస్వామిక, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పౌర సేవలను అందిస్తున్నాయి. వాటిలో కొన్ని సంస్థలు నిబద్ధతతో, సామర్థ్యంతో ఈ సేవలు అందించడాన్ని చూసిన ప్రభుత్వం సంప్రదాయంగా తామందిస్తున్న, ప్రభుత్వ కార్యకలాపాలుగా భావిస్తున్న సేవలను అందించడంలో వాటికి మరింత భాగస్వామ్యం కల్పించడానికి సిద్ధమయ్యేలా చేసింది. దీనితో పౌర సేవలను అందించాల్సిన ప్రభుత్వం, ప్రైవేటు సంస్థతో ఒక అర్థవంతమైన పద్ధతిలో చేతులు కలపడం ద్వారా ఆ సేవలను అందించడానికి వీలవుతుంది. ప్రయివేట్ నైపుణ్యం కూడా పనికొస్తుంది.

అలాంటి ఏర్పాట్లనే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలుగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ సేవలను అందించే బాధ్యత మాత్రం ప్రభుత్వం పైనే వుంటుంది. ప్రయివేట్ సంస్థ మౌలిక సదుపాయాలు, నాయకత్వం, సిబ్బందికి తగు శిక్షణ, టెక్నాలజీ అభివృద్ధి, తదితర సంబంధిత విషయాలలో పెట్టుబడి పెట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా అవసరమైన సేవలను అందించడం జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా ఎలాంటి ఆర్థిక భారం పడడం జరుగదు. ప్రభుత్వం దరిమిలా ప్రధాన సేవలను అందించే బాధ్యతను తన వద్ద ఉంచుకొంటూనే సంబంధిత సేవకు బడ్జెట్‌లో కేటాయించిన పెట్టుబడి, నిర్వహణ వ్యయం పరిమితిలోనే పిపిపి సాయమందించడం ద్వారా దాన్ని మరింత బలోపేతం చేస్తుంది.  

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పిస్తూ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యానికి సంబంధించి రెండు ప్రస్తావనలు చేశారు. భారతీయ రైల్వేలకు సంబంధించి ముంబై మరి కొన్ని చిన్న నగరాల్లో చేపట్టాల్సిన భారీ పనులను ఉదాహరణలుగా పేర్కొంటూ ఢిల్లీ మీరట్ మార్గంలో ప్రతిపాదించిన ర్యాపిడ్ రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టిఎస్) లాంటి స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పివి) ద్వారా సబర్బన్ రైల్వేలలో మరింతగా పెట్టుబడులు పెట్టడానికి రైల్వేలను ప్రోత్సహించడం జరుగుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ మేరకు మరిన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలను (పిపిపి)లు ప్రోత్సహించడం ద్వారా మెట్రో రైల్వే పథకాలలో పెట్టుబడులను పెంచడానికి ప్రతిపాదనలు చేయడంతోపాటు మంజూరైన పనులు పూర్తి అయ్యేలా చూస్తామని ఆమె అన్నారు.

అలాగే ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్ కింద రెండు కోట్ల మందికి పైగా గ్రామీణ భారతీయులకు ఇప్పటి వరకు డిజిటల్ పరిజ్ఞానాన్ని కల్పించడం జరిగిందని మరో ప్రస్తావనలో ఆర్థిక మంత్రి చెప్పారు. దేశంలోని ప్రతి పంచాయితీల్లోని స్థానిక సంస్థల్లో ఇంటర్‌నెట్ కనెక్టివిటీని యూనివర్శల్ సర్వీస్ ఆబ్లిగేషన్ 2019)ఫండ్ నుంచి సహాయంతో పబ్లిక్‌ప్రైవేటు భాగస్వామ్యం విధానం కింద వేగవంతం చేయడం జరుగుతుందని కూడా ఆమె చెప్పారు. దీనివల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరం తగ్గుతుందని మంత్రి చెప్పారు.

2018-2030ల మధ్య రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 50 లక్షల కోట్లు అవసరమని ఆమె చెప్తూ, ఏడాదికి రూ. 1.5 నుంచి 1.6 లక్షల కోట్లు మాత్రమే రైల్వేలు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో మంజూరయిన ప్రాజెక్టులు సైతం పూర్తి చేయడానికి దశాబ్దాల కాలం పడుతుందని అంటూ పిపిపి విధానాన్ని సూచించారు. రైల్వేలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి, రైలు మార్గాల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రోలింగ్ స్టాక్ (బోగీలు, ర్యాక్‌లు) తయారీకి, ప్రయాణికులు, సరుకు రవాణా సేవలు అందించడానికి పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుందని నిర్మలా సీతారామన్ తెలియజేశారు.

ఇక ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పీపీపీ కి సంబంధించి అనేక ప్రతిపాదనలు చేసారు. ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి అనుబంధంగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు. పీపీపీ పద్ధతిలో ఎఫ్‌సీఐ, కేంద్ర గిడ్డంగుల సంస్థ సంయుక్తంగా గోదాముల నిర్మాణం చేయడానికి, పీపీపీ భాగస్వామ్యంతో కిసాన్ రైలు ఆపరేట్ చేయడానికి ఆర్ధిక మంత్రి పచ్చ జెండా ఊపారు. అదనంగా ప్రయివేటీకరణకు కూడా కేంద్ర ప్రభుత్వ సంసిద్ధతను వ్యక్తం చేసారు నిర్మలా సీతారామన్. అందులో భాగంగా ప్రైవేటీకరణ దిశగా ఎల్‌ఐసీ ని ప్రతిపాదించి, ఎల్‌ఐసీ వాటా విక్రమాయానికి నిర్ణయం తీసుకుంది కేంద్రం. అంటే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని చేపట్టడానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారనేగా! రైల్వేల ప్రయివేటీకరణ కూడా జరుగుతుందని అంటున్నారు. కాకపొతే ఎల్ఐసీ లాంటి విజయవంతంగా నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడం ఆశింఛదగ్గ విషయం కాదేమో!    

ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం అంటే ప్రైవేటీకరణ కానే కాదు. ప్రభుత్వ బాధ్యతను తగ్గించడమనేది కూడా ఎంతమాత్రం కాదు. ప్రభుత్వ సేవలకు అనుబంధంగా, అదనంగా ప్రయివేట్ సేవలను ఉపయోగించుకోవడం. ప్రభుత్వరంగ సంస్థల వైఫల్యానికి ప్రత్యామ్నాయం ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం కావచ్చు! అది ఏఏ రంగాలలో అనేది ప్రభుత్వ ఇష్టాఇష్టాలపై ఆధారపడి వుంటుంది.  

No comments:

Post a Comment