Sunday, February 9, 2020

తత్త్వనీతిని నేర్చుకుందాం! .... డాక్టర్ వాణి బి. వెల్దుర్తి

తత్త్వనీతిని నేర్చుకుందాం!
డాక్టర్ వాణి బి. వెల్దుర్తి
ఆంధ్రభూమి (10-02-2020)
         శ్రీమద్రామాయణం బహ్మ అనుమతితో వాల్మీకి మహర్షి రచించాడు.  రామాయణమే ఆదికావ్యం.

         వాల్మీకి రామాయణాన్ని శ్రీ వావిలి కొలను సుబ్బారావు (వాసదాసు) గారు యథావాల్మీకంగా తెనిగించారు. ఇది 1900-1908 మధ్య  కాలంలో జరిగింది. ఎనిమిదేళ్లలో రామాయణాన్ని నిర్వచనంగా తెనిగించి, అలనాటి కడప మండలంలోని ఒంటిమిట్ట  కోదండ రామస్వామికి అంకితం చేసారు.   ఆ  మహానుభావుడి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరాలన్నీ తెలుగునేల నాలుగు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని సంతరించుకొని, ఆయన జీవిత కాలంలోనే, నాలుగైదు సార్లు ముద్రించిబడింది.

         వంద సంవత్సరాలైన తరువాత వాసుదాసు గారి గ్రాంధిక తెలుగు నేటి తరానికి అర్థం  కావటం  కష్టమే.  ఆ కష్టాన్ని తీరుస్తూ, అందరు రామాయణాన్ని ఇష్టంగా చదివేట్లు చేసారుశ్రీ వాసుదాస స్వామి వారి రామాయణ మందర మకరందాన్ని సరళమైన, వ్యావహారిక తెలుగు భాషలోకి అనువదించిన  ‘అనువక్త-వాచవి’ శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు.  శ్రీసీతారామచంద్రుల అనుగ్రహం వలన, ఆయన 16 సంవత్సరాలు (2004-19) కృషి చేసి ఆరు  కాండలను మనకు అందించారు. 

         వాల్మీకి  రామాయణం 24,000 శ్లోకాలనిఆరు కాండలలో, 647  సర్గలలో రచించారు. 

         జ్వాలా నరసింహారావుగారి రామాయణ మందర మకరందం ఆరు కాండలను చదివితే రామ తత్వాన్ని, రామాయణ అంతర్థాన్నే కాకుండా, మరెన్నో అసక్తికరమైన విషయాలని తెలుసుకోవచ్చు.

         ‘రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా’’...  అనే తెలుగు సినిమా పాట వినగానే మనకు గుర్తుకు వచ్చేది ‘అహల్య కథ’.  గౌతముడు ఆమెను రాయిగా మారిపోతావని శపించడంరామ పాదం సోకిననాడు  మళ్లీ  పూర్వ రూపం వస్తుందని శాపవిమోచన ఇవ్వడం మన మనస్సులలో నాటుకుపోయిన కథ.  వాల్మీకి రామాయణంలో ఆమెను రాయిగా మారిపొమ్మని గౌతముడు శపించినట్లు లేనేలేదు.  గౌతముడు ఆమెను  గాలిని ఆహారంగా తీసుకుంటూ ఆ ప్రదేశంలోనే యెవరికీ కనిపించకుండా వుంటూ, రాముడు ఆశ్రమంలో ప్రవేశించగానే అహల్యకు శాపవిమోచనం కలుగుతుందని చెప్పినట్లు చెబుతుంది  వాల్మీకి రామాయణం.

         గౌతముడు ఆహల్యనే కాదు ఇంద్రుడిని కూడా శపించాడు.   అన్నది మనలో చాలమందికి తెలియని అంశం.  ఇంద్రుడు ఆమెకోసం కోడై  కూసాడని మనకు పెద్దలు చెప్పిన ఇతిహాసం.   కాని కాకై కూసాడని వాల్మీకి రామాయణంలో వుంది.  శాశ్వతంగా కాకి, రూపంలో జీవించమని ఇంద్రుడిని శపిస్తాడు గౌతముడు, కాని ఇంద్రుడు  కాకుండా, ఇంద్రుడి  కొడుకు కాకి  రూపంలోకి  మారతాడని  రామాయణంలో వుంది.

         సినిమాలలో చూసినట్లు సీతా స్వయంవర సభ ప్రసక్తి వాల్మీకి రామాయణంలో లేదు. 


         లక్ష్మణుడు పదునాలుగేండ్లు నిద్రాహారాలు మాని సీతారామ రక్షణలో జీవితం గడపాడని ప్రచారంలో వున్న కథనం. వనవాస సమయంలో లక్ష్మణుడు కూడా సీతారాములతో కలిసి  భుజించాడని వాల్మీకి రామాయణ కథనం.

         మాయలేడి వెంటవెళ్లిన రాముడికి  సహాయార్థం లక్ష్మణుడు పోతూ సీతాదేవి చుట్టూ గీత గీసి ఆ గీతను దాటి రావద్దని సీతమ్మను  ప్రార్థిస్తాడు.  ఆ గీతే  ‘లక్ష్మణరేఖ’ గా ప్రసిద్ధి చెందింది.   కాని  ఈ గీత గురించి  వాల్మీకి రామాయణంలో లేకపోవడం గమనార్హం.

          రావణుడు సీతాపహరణం సదర్భంలో సీతను తాకలేక భూమిని పెకలించుకుని వెళ్లాడని సినిమాలలో చూసాము.  వాల్మీకి  రామాయణం ప్రకారము సీతను  రావణుడు తన రథంలో ఎక్కించుకుని వెళ్తూ వుంటే, జటాయువు యుద్ధంలో ఆ రథాన్ని నాశనం చేస్తాడు.  అప్పుడు రావణుడు సీతను  చేతిలో పట్టుకుని ఆకాశమార్గాన వెళ్లిపోయాడని వాల్మీకి రామాయణంలో వుంది.   రామచంద్రమూర్తి మాయా మృగం వెంట పోయినప్పుడు అసలు సీతను దాచి మాయా సీతను ఆశ్రమంలో  వుంచాడనీ కొందరి వాదన.    సీతాదేవిని  రావణుడు అపహరించినది మాయా సీత అనడానికి వాల్మీకి  రామాయణంలో ప్రమాణం లేదు.

         సీత రావణుడికి బిక్ష ఇచ్చినట్లు కూడా రామాయణంలో లేదు.

         శబరి ఏరి కోరి తెచ్చిన మంచి  పండ్లను రాముడికి ఇచ్చిందని వాల్మీకి రామాయణం చెబుతున్నది.   ఎంగిలి పండ్లు తినిపించినట్లు ఎక్కడా లేదు. 

         సీతాదేవి తన ఆభరణాలన్ని మూటకట్టి వానరులున్న ప్రదేశంలో వేసింది.  వాటిని వారు  రాముడొచ్చినప్పుడు అందచేసారు.   ఎవరైనా తనను వెతుక్కుంటూ వస్తేగుర్తించేందుకు ఆమె ఆ పని చేసిందాఇంతవరకు అందరికి తెలిసిన విషయమే.  అయితే ఈమే సీత అని తనను వెతుక్కుంటూ వచ్చిన వారికి అర్థం కావటానికి, అక్కడ ఎడమ భాగం నగలు పడేస్తే, అశోకవనంలో కుడి భాగం నగలు వేలాడ కట్టింది.  

         హనుమంతుడు  రావణాసురిడిని సభలో కలిసినప్పుడు  రావణుడి సింహాసనం కన్నా ఎత్తుగా తన తోకను మడిచి  ఆసనంలా చేసుకొని కూర్చున్నాడని చాలా సినిమాలలో చూసాము.   కాని అటువంటి వర్ణన ఏది వాల్మీకి  రామాయణంలో లేదు.

         ఇంద్రజిత్తు  బాణాలకు  లక్ష్మణుడు  మూర్ఛపోతే  హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చాడని మనందిరికి తెలుసు.

         వాల్మీకి రామాయణం ప్రకారం ఇంద్రజిత్తు వేసిన నాగాస్త్ర ప్రయోగం వలన   రామలక్ష్మణులిద్దరు మూర్ఛపోతారు. సంజీవకరణిని తెప్పించమని సుగ్రీవుడికి సుషేణుడు చెబుతాడు.   కాని గరుత్మంతుడి రాక వలన వారిని చుట్టిన  పాపపు పాములన్నీ చెల్లాచెదురై భయంతో పరుగెత్తి పోతాయి.

         రావణుడు ప్రయోగించిన ‘శక్తి’ వలన లక్ష్మణుడు  మూర్ఛపోతాడు   అప్పుడు  హనుమంతుడు సంజీవిని  పర్వతాన్ని తెస్తాడు. 

         రాముడు ఎన్ని బాణాలు వేసిన రావణాసురిడి తలలు తెగటం, మళ్లీ పుట్టడం జరుగుతుంటే, విభీషణుడు వచ్చి, తన అన్న పొట్టలో అమృత కలశం వుందని, దానిని నాశనం చేస్తే వాడు చస్తాడని చెప్పాడని ప్రసిద్ధి చెందిన కథనం. 

         ఇంద్రుడికి బ్రహ్మదేవుడు, దాన్ని అగస్త్యుడికి, అగస్త్యుడు రాముడికి ఇచ్చిన బ్రహ్మాస్త్రం రాముడు రావణుని రొమ్ములో వేసి  చంపాడని  వాల్మీకి రామాయణం చెబుతోంది.  అంతే కాకుండా విభీషణుడు, సుగ్రీవుడు, ఇతరులు రామరావణ యుద్ధాన్ని దూరం నుండి చూస్తున్నారని కూడా చెబుతుంది. 

          ‘‘పతి ఆనతి తలదాల్చి అగ్ని దూకే సీతా’’ తెలుగువారు మరిచిపోలేని పాట.  వాల్మీకి రామాయణం ప్రకారం పతి ఆనతి లేకుండా సీత చేసిన ఒకానొక పని అగ్ని ప్రవేశం.

         పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఇంకా ఒకరికి స్థలం వుంటుందని ప్రచారం.   మంత్రపూతమైన పుష్పక విమానంలో ఎంతమంది  ఎక్కినా ఇరుకు లేకుండా సుఖంగా వుంటుందన్నది వాల్మీకి రామాయణ వువాచ.

         సీతాదేవి ముత్యాల హారం ఇస్తేహనుమంతుడు, దానిని కొరికి కొరికి, అందులో రాముడిని వెతికాడని సినిమాలలో చూసిన దృశ్యం.   సీతాదేవి ఇచ్చిన హారాన్ని ధరించి హనుమంతుడు ప్రకాశించాడు అన్నది వాల్మీకి రామాయణం.

          రామ పట్టాభిషేకం సమయంలో లక్ష్మణుడు నవ్వటం, దానికి నలుగురు నాలుగు విధాలుగా అనుకోవటం కూడా  వాల్మీకి రామాయణంలో చోటు చేసుకోలేదు. 

         ఇలా  సినిమాలకు పనికి వచ్చే సంఘటనే రామాయణం అనుకుని వాటిని పదే పదే తలుచుకొనే బదులు, వనం జ్వాలా నరసింహారావు గారు రాసిన రామాయణ  మందర మకరందాల ఆరు  కాండలను చదివి జీవితానికి పనికొచ్చే తత్వ నీతిని నేర్చుకోవటం ఉత్తమం.   మోక్షదాయకం.  రామాయణ మందర  మకరందం తత్వబోధా భాండాగారం.

(అనువక్త-వాచవిగా వనం జ్వాలా నరసింహారావు రాసిన ఆంధ్రవాల్మీకి రామాయణం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర కాండ, యుద్ధకాండ ‘మందర మకరందం’ పుస్తకాలను దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకాల మూలం ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు-వాసుదాసు గారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరాలు. ఈ పుస్తకాలు ఏవీ అమ్మకానికి లేవు. అన్నీ ఉచితంగా ఇవ్వడానికే వున్నాయి. ఓపిక చేసుకుని రచయితను (80081 37012) ఫోన్లో సంప్రదించి, మరింత ఓపిక చేసుకుని ఆయన ఇంటికి (ఫ్లాట్ నంబర్ 502, వాసవీ భువన అపార్ట్మెంట్స్, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్-500073) వస్తే వాటిని తీసుకుపోవచ్చు. చదవండి, చదివించండి....నచ్చితే ప్రోత్సహించండి అని అంటున్నారు రచయిత-సంపాదకుడు, ఆంధ్రభూమి)

No comments:

Post a Comment