Sunday, May 23, 2021

తనను చూడడానికి వచ్చిన విశ్వామిత్రుడి రాక కారణాన్నడిగిన దశరథుడు .... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-57 : వనం జ్వాలా నరసింహారావు

 తనను చూడడానికి వచ్చిన విశ్వామిత్రుడి రాక కారణాన్నడిగిన దశరథుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-57

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (24-05-2021)

ఇలా మంత్రులతో దశరథుడు ఆలోచన చేసే సమయంలో, ఆయన సంకల్పబలానికి అనుగుణంగానే, జగత్ప్రసిద్ధిగాంచిన - మహాతేజస్సుగల విశ్వామిత్ర మహర్షి ఆయనను చూడడానికి వచ్చాడు. వచ్చిన మహర్షి, ద్వారం వద్దనే నిలబడి, ద్వారపాలకులనుద్దేశించి, విశ్వామిత్రుడు వచ్చి వాకిటిలో నిలబడి వున్నాడని తమ రాజుతో చెప్పమన్న వెంటనే, వారు రాజు వద్దకు పరుగెత్తారు. వారు ఆయన పేరు వినగానే, భయంతోనూ - భక్తితోనూ, ఒకరికంటే మరొకరు కాలికొలది పరుగెత్తిపోయి, రాజగృహంలోకి ప్రవేశించి, మాట తడబడగా - కాళ్ళువణకగా - గుండెలు కొట్టుకుంటుంటే, "రాజా - రాజా, విశ్వామిత్రుడు వచ్చి వాకిటిలో నిలబడ్డాడు" అని దశరథుడికి విన్నవించుకుంటారు. ద్వారపాలకులు చెప్పిందాన్ని విన్న దశరథుడు సంతోషంతో, పురోహితులను వెంటబెట్టుకొని, బ్రహ్మకెదురెళ్ళి పిలిచే ఇంద్రుడిలాగా, విశ్వామిత్రుడిని సమీపించి, అర్ఘ్యపాద్యాదులతో పూజించి, గౌరవించి, సంతోషింపచేసి, రెండు చేతులు జోడించి నిలబడ్డాడు. వాటిని గ్రహించిన విశ్వామిత్రుడు దశరథుడిని, ఆయన భార్యా పిల్లల క్షేమ సమాచారాలను, అడిగి తెలుసుకున్నాడు.

" రాజేంద్రా" అని సంబోధిస్తూ: పట్టణ ప్రజల సంతోషం గురించి, ధనాగారం కొరతలేకుండా నిండుగా వున్న విషయం గురించి, పల్లె ప్రజల హాయైన జీవనం గురించి, అథిదులను ఆయన గౌరవంగా చూసుకుంటున్న విషయం గురించి, దేవతలను - మనుష్యులను పూజిస్తున్న సంగతి గురించి, శత్రువులను దండిస్తున్న వ్యవహారం గురించీ ప్రశ్నించి సరైన సమాధానం పొందుతాడు. దశరథుడి క్షేమ సమాచారాలను తెలుసుకున్న అనంతరం, విశ్వామిత్రుడు, వశిష్ఠ - వామదేవాది ఋషుల వద్దకు వెళ్ళి, వారినీ కుశలప్రశ్నలడిగి, ఉభయకుశలోపరి ముగిసిన పిదప, అందరూ కలిసి సభా భవనంలోకి ప్రవేశించి, సంతోషమతిశయింపగా వారివారి ఆసనాలపై కూర్చున్న తర్వాత, విశ్వామిత్రుడు తాను చెప్పదల్చుకున్న విషయాన్ని చెప్తాడీవిధంగా.

(ఇంతవరకు భగవదవతారాన్ని గురించే చెప్పబడింది. ఇక ఇక్కడినుంచి, చివరివరకూ, భగవదవతార ప్రయోజనం గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ ప్రయోజనాల్లో, శిష్ట రక్షణ - దుష్ట శిక్షణ - ధర్మ సంస్థాపన ముఖ్యమయినవి. ఈ ప్రయోజనాల్లో సేద్యం చేసేవారికి, ధాన్యంలాగా లభించే ప్రధాన ఫలం, శిశ్ఠపరిపాలనే. పైరు బాగుపడేందుకు ఏ విధంగానైతే కలుపు మొక్కలను పీకేస్తామో, అదేవిధంగా, శిష్ఠరక్షణార్థమై నడుమంత్రపు సిరైన దుష్ట శిక్షణ తప్పనిసరిగా జరగాల్సిందే).

కొడుకులు లేనివాడు దీర్ఘకాలం తర్వాత, కులంలోనూ, గుణంలోనూ, తనతో సమానమైన భార్యలద్వారా పుత్రులు కలిగినప్పుడు - నష్టపోయిన నిక్షేపం తిరిగి లభించినప్పుడు - ఎడారిలో వానకురిసినప్పుడు - అమృతం తాగినప్పుడు - అధికమైన మేలు కలిగినప్పుడు, ఎలాంటి సంతోషం కలుగుతుందో అలాంటి పరిపూర్ణానందం విశ్వామిత్రుడి రాకతో తనకు కలిగిందని అంటాడు దశరథుడు ఆయనతో. "మహానుభావా! నీవు నా దగ్గరకు రావడానికి కారణం: నన్ను కృతార్థుడను చేయడానికే కాని మరెందుకూ కాదు. ఏదో ఒక కారణం కల్పించుకొని, నాతో ఏదో ఒక మంచిపని చేయించి - దానివల్ల నాకు శ్రేయస్సు కలిగించేందుకు నీవొచ్చావు. నా శ్రేయస్సుకొరకు, నేను చేయాల్సిన పనిని, నేను చేస్తే - నాతో నీవు చేయిస్తే, నీకు కలిగేమేలుకాని, చేయకపోతే నీకు జరిగే నష్టం కానీ లేదు. అందుకే దయతో, నీవొచ్చిన పని తెలుపుతే, అది ఎట్లాంటిదైనా, నేను సంతోషంతో చేస్తాను. నన్ను మన్నించి నీవొచ్చిన పని చెప్తే, నీ పాదాలపై పడి ప్రార్థిస్తాను" అని దశరథుడంటాడు విశ్వామిత్రుడితో.

"మహానుభావా! నీవు ఇతర సామాన్య ఋషులలాంటివాడివి కావు. బ్రాహ్మణుడిగా జన్మించి - పుట్టినప్పటినుండే అడవుల్లో వనవాసం చేస్తూ-బాల్యంనుండే తపస్సు, వ్రతం, అనుష్ఠానపరుడై శిక్షణ పొందినవాడు బ్రహ్మర్షి కావడం పెద్ద విశేషం కాదు. అలాకాకుండా, నీవు, రజోగుణం అధికంగావుండే క్షత్రియుడివిగా పుట్టి - క్షాత్రంలో పెరిగి పెద్దై - రాజర్షివై - సుకుమారుడివై వున్నప్పటికీ, క్షణంలో రాజ్యం - భోగం-సర్వం త్యజించి, గొప్పతపస్సుచేసి, సత్త్వాతిశయంగల బ్రాహ్మణ్యాన్ని సంపాదించి, బ్రహ్మర్షివయ్యావు. ఇలా చేసినవాడు లోకంలో ఇంకెవరూ లేరు. అలా కావడం ఎంత దుస్సాధ్యమో ప్రపంచానికి తెలియచేసినవాడివి నువ్వే. అందుకే నువ్వు మరెంతగానో పూజింపతగినవాడివి. అంతటి మహానుభావుడివైన నువ్వు చేసుకోలేని పనికాని - పరులు నీకు చేయగలిగిన పనికాని ఏదీ లేదు. అవాస్తసమస్తకాముడవు నీవు. అఘటనాఘటన ధురీణుడవైన నువ్వు నా దగ్గరకు కార్యార్థివై రావడమంటే, నా జన్మ సఫలమైనట్లే”.

“నా జన్మ ఫలం నాకివ్వాళ లభించింది. నా జన్మ సార్థకమయింది. నువ్వేమన్నా సామాన్య ఋషివా? నాకేదో గొప్ప శుభం కలిగించేందుకు నావద్దకొచ్చావు. నీరాకతో నాకు తప్పక శ్రేయస్సే కలుగుతుంది. ఎలాంటి దానానికైనా - ఎంతటి దానానికైనా, నీవు యోగ్యుడవే. నీకివ్వతగని పదార్థం ఈలోకంలో లేనేలేదు. నాపూర్వజన్మలో నేను చేసిన గొప్ప పుణ్యం వల్లనే నువ్వు నావద్దకొచ్చావు. సనత్కుమార తేజా! నీ పాదం మాఇంటిలో పెట్టగానే మా గృహం పవిత్రమైంది. అది పవిత్రమవడమే కాకుండా, ఇతరులను పావనం చేసే సుక్షేత్రమయింది. దివ్య క్షేత్రాలలో నివసించేవారికి కలిగే ఫలం నాకు కలిగింది. నీ దర్శనం, దివ్య క్షేత్రాలలోని దేవతల దర్శనంలాంటిదే కనుక, నువ్వు నన్ననుగ్రహించి నీకోరికేదో తెలియచేయాలి. నీ కార్యాన్ని నేను చేస్తానో -లేదో - చేయిజాపి, అడిగి, లేదనిపించుకోవడం మంచిదేనా - వూరకుండడమే శ్రేయస్కరం కదా - చెప్పాల్నా - వద్దా, అని సందేహించ వద్దు. గాధినందనుడవైన నీవు నా పాలిట దేవుడవు. దేవుడే పని చెప్తే చేయని మనిషి వుంటాడా? నువ్వేదిచెప్పినా నెరవేరుస్తాను. నా శ్రేయస్సు కోరే నువ్వొచ్చావు కనుక, నువ్వు చెప్పింది నేను చేయకపోతే, నా శ్రేయస్సుకు నేనే భంగం కలిగించుకొన్నట్లవతుందికదా! ఏది ధర్మం అని నువ్వు భావిస్తావో, దాన్నే చెప్తావుకాని, అధర్మాన్ని చెప్పవు కదా! నువ్వు ధర్మమని చెప్పింది చేయడం వల్ల, నాకెంతో ధర్మాభివృద్ధి కలుగుతుంది." అని విన్నవించుకుంటాడు దశరథుడు విశ్వామిత్రుడితో.  

 

No comments:

Post a Comment