Saturday, May 22, 2021

శ్రీమద్రామాయణాన్ని దీర్ఘ శరణాగతి అంటారా? : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీమద్రామాయణాన్ని దీర్ఘ శరణాగతి అంటారా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (22-05-2021) మధ్యాహ్నం ప్రసారం  

తాను చెప్పిన నీతి వాక్యాలను, రాజనీతిని, ధర్మ వాక్యాలను పట్టించుకోని సోదరుడు రావణుడిని వదిలి విభీషణుడు లక్ష్మణ సహితంగా వున్న రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు. తనను తిరస్కరించిన రావణుడి దగ్గర వుండవద్దనుకున్నాడు. శ్రీరామసేవే కర్తవ్యం అనుకున్నాడు. దుర్మార్గుడి తమ్ముడైనా విభీషణుడు సత్వగుణాధికుడు కాబట్టి సర్వ విధాలా హితోపదేశం చేశాడు. ఇవేవీ పనిచేయక పోవడంతో విభీషణుడు రామ సన్నిధికి వచ్చాడు. విభీషణుడు సకల ధర్మాలను తెలిసినవాడు. రావణుడిని వదలడంలో విభీషణుడికి దోషం తగలదని పెద్దలు అంటారు.

         విభీషణుడు బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం గొప్ప జ్ఞాన సంపన్నుడైనందున, సర్వ వేదాంత వేద్యుడై, సర్వ లోకేశ్వరుడై, సర్వ లోక శరణ్యుడై, ముక్త ప్రాప్యుడై, బ్రహ్మమైన శ్రీమన్నారాయణుడే లోకోజ్జీవనార్థమై శ్రీరాముడిగా భూమ్మీద అవతరించాడని ఎరిగినవాడు. ఇలాంటి విశేష జ్ఞానంకల విభీషణుడికి ఆయన అనుష్టించే ధర్మాలలో సామాన్య, విశేషాలను పరీక్షించి, దేనిని అనుష్టించాలో తెలుసు. అన్నను అనుసరించి వుండడం సామాన్య ధర్మం అయితే, పరమాత్మ అయిన శ్రీరాముడిని అనుసరించి వుండడం విశేష ధర్మం. అయితే ఈ రెండు ధర్మాలు ఆచరించాలి కాబట్టి, విభీషణుడు మొదలు రావణుడికి కావాల్సినంత హితోపదేశం చేశాడు. అసురస్వభావుడైన రావణుడు రాముడిమీద వైరంతో విభీషణుడి హితోపదేశాన్ని ఏమాత్రం వినలేదు. ఇది గమనించిన విభీషణుడు రామవిరోధైన రావణుడిని తానూ అనుసరిస్తే రావణుడిలాగా తనకూ రాముడితో విరోధం తప్పదనుకున్నాడు. అందుకే దుర్మార్గుడైన రావణుడి సాంగత్యం వదిలి విశేష ధర్మమైన రామసేవే చేద్దామనుకున్నాడు. ఇందులో తప్పేమీ లేదు. విభీషణుడిలో ఎలాంటి దోషం లేదు.

         విభీషణుడు రావణుడిని వదిలి ఆకాశానికి ఎగిరినప్పుడే సుగ్రీవాది వానరులు అతడిని కనిపెట్టారు. రాక్షసులు ఏ పక్కనుండైనా రావచ్చునని వానర నాయకులు కనిపెట్టి వుండాలని రామచంద్రమూర్తి ఆజ్ఞాపించాడు. అందుకే పది దిక్కులనూ పరిశీలిస్తూ, హెచ్చరికతో వున్న వానర శ్రేష్ఠులు విభీషణుడిని దూరం నుండే చూశారు. ఆయనే కాకుండా మరి నలుగురిని తీసుకొస్తున్న అతడిని చూసి సుగ్రీవుడు వెంటనే వానరులతో కలసి ఆలోచించాడు. ఆలోచిస్తూనే హనుమంతుడితో, ఇతరులతో ఇలా అన్నాడు. “ఈ మనుష్య భక్షకుడు నలుగురు రాక్షసులతో, సమస్తాయుధాలతో నిజంగా మనల్ని చంపడానికే వస్తున్నాడు”. అలా ఆయన అనగానే వానరులంతా రాళ్లు, చెట్లు తీసుకుని వారిని చంపడానికి సిద్ధమై, ఆజ్ఞ ఇవ్వమని సుగ్రీవుడిని కోరారు.

         ఇలా వానరులు సమాయత్తమవుతున్న సమయంలో విభీషణుడు వారితో తన గురించి వివరంగా చెప్పుకున్నాడు. తన మాట వినని రావణుడిని, తన భార్యను, బిడ్డలను, తల్లితండ్రులను, ధనధాన్యాదులను, లంకను, సర్వాన్ని వదిలి శ్రీరామచంద్రమూర్తే రక్షకుడని వచ్చి ఆయన శరణుజొచ్చానన్నాడు. “రఘువంశంలో పుట్టిన ఉత్తముడైన శ్రీరామచంద్రమూర్తికి శరణాగతుడై విభీషణుడు వచ్చాడని నా స్థితి తెలపమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను” అని వానరులను కోరాడు. 

         విభీషణుడి మాటలు విన్న సుగ్రీవుడు వెంటనే రాముడి దగ్గరికి పోయి, లక్ష్మణుడు వింటుండగా ఇలా అన్నాడు. “విభీషణుడు అనే పేరుకలవాడు వచ్చాడు. రావణాసురుడి తమ్ముడట. నలుగురితో కలిసి వచ్చి నీ శరణుజొచ్చాడు. దేవా! అతడు రావణుడు పంపిస్తే వేగులవాడిలాగా వచ్చాడో, లేక, తనంతట తానే మనలో కలిసిమెలిసి వుండి, నమ్మకం కలిగించి, సమయం చూసి మనం హెచ్చరికగా లేనప్పుడు మనల్ని చంపడానికే వచ్చాడో తెలియదు. వీడు నిజమైన భక్తితో రాలేదు. ఎందుకు విభీషణుడిని చేర్చుకోకూడదంటావేమో? శత్రువులు పంపిన సేనను నమ్మకూడదు. కీడు కలుగుతుంది. నిజమైన భక్తి శ్రద్ధలు కలిగి శరణు కోరినవారిని రక్షించడం మన విధి. అది నేను కాదనను. ఈ విభీషణుడు రావణుడి వేగులవాడు. నువ్వు ఆయన్ను శరణాగతుడని నమ్మి చేరదీస్తే ఏదో వంచన చేసి మనల్ని తప్పక చంపుతాడు. కాబట్టి వీడిని ఇప్పుడే చంపడం మంచిదని నా అభిప్రాయం”.

         జవాబుగా శ్రీరాముడు వానరుల అభిప్రాయం అడిగాడు. రాముడంతటి గొప్పవాడికి తాము చెప్పాల్సిన అవసరం లేదని ఆయన్నే నిర్ణయం తీసుకోమ్మనీ అన్నారు వారు. అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుడితో “నీ మంత్రులంతా చక్కగా ఆలోచించి చెప్పగల సమర్థులు. బుద్ధిమంతులు. మాటలు చెప్పడంలోనే కాకుండా కార్యాలు చేయడంలోనూ సమర్థులు కాబట్టి అంతా కలిసి ఒక్కటిగా చెప్పడం కంటే ఒక్కొక్కడు ఫలానా కారణం చేత విభీషణుడిని చేర్చుకోవచ్చనో, చేర్చుకోకూడదనో వారి-వారి అభిప్రాయాలు చెప్పడం మంచిది”.

         రామచంద్రమూర్తి మాటలకు జవాబుగా అంగదుడు ఇలా అన్నాడు. “దేవా! విభీషణుడు మన శత్రువుల దగ్గర నుండి వచ్చాడు కాబట్టి సందేహించాల్సిన వాడే. ఆయన పూర్వోత్తరాలు విచారించకుండా తటాలున నమ్మకూడదు. ఎందుకంటే, ద్రోహులు తమ యథార్థస్థితి దాచి మారువేషం వేసి సమయం చూసి దెబ్బతీస్తారు. కాబట్టి కీడు కలుగుతుంది. అందుకే కొత్తవారిని చేర్చుకునేటప్పుడు వాడితో గొప్ప పనులు చేయించి అవి వాడెలా చేస్తాడో, వాడి నడవడి ఎలాంటిదో చక్కగా నిర్ధారించి, గుణవంతుడైతే చేర్చుకోవచ్చు. దురభిప్రాయం కలవాడని తేలితే తిరస్కరించవచ్చు”.

         ఈ మాటలు విన్న శరభుడు ఇలా అన్నాడు. “రామచంద్రా! ఇతడిని మనలో ఇప్పుడే కలుపుకోకుండా దూరంగా వుంచి, సూక్ష్మబుద్ధికల వేగులను నియమించి పరీక్షించి ఇతడి నడవడులన్నీ వారు పరీక్షించి తెలుసుకొన్న తరువాత ఇతడిలో అనుమానించాల్సిన కారణం లేదని తేలితే చేర్చుకోవచ్చు”. ఆ తరువాత జాంబవంతుడిలా చెప్పాడు. “రావణుడికి మనమీద మాత్సర్యం వుంది. విరోధంగానే వుండాలని కంకణం కట్టుకున్నాడు. అలాంటి వాడిని విడిచి రావడానికి సరైన కారణం ఇతడు చెప్పలేదు. ఇంతదూరం వెతుక్కుంటూ రావడానికి కారణం కనిపించడం లేదు. ఇతడు రావడానికి ఇది సరైన సమయం కూడా కాదు. కాబట్టి మీరు ఇతడిని నమ్మకూడదు”.

         ఇలా అంతా చెప్పిన తరువాత శాస్త్రజ్ఞానం తెలిసినవాడు, మంత్రులందరిలో శ్రేష్టుడైన హనుమంతుడు ఇలా అన్నాడు. “రామచంద్రా! రావణుడు సర్వరాక్షస నాశనకరమైన సీతాపహరణం వల్ల, తరువాత ఆమెను ఇవ్వడానికి తిరస్కరించడం వల్ల దుష్టుడిగా అయినందున, ఖరవాలి వధ వల్ల నువ్వు శూరుడివైనందున, ఈ విషయాలన్నీ విభీషణుడికి చక్కగా తెలిసే వుండాలి. కాబట్టి, గుణాల వల్ల గొప్పవాడివైన నిన్ను, ఏ సమయంలో చేరాల్నో ఆ సమయంలోనే, ఏ ప్రదేశంలో చేరాల్నో ఆ ప్రదేశంలోనే చేరాడు. ఇతడి సౌమ్య బుద్ధికి ఇదే తగింది. విభీషణుడు మాట్లాడేటప్పుడు వాడిది దుష్ట స్వభావం కాదని ఇంగితం చెప్తుంది. కాబట్టి ఇతడు నిర్దోషి అని నా అభిప్రాయం. ఇతడు దుష్టుడని సందేహించడానికి హేతువు కనబడడం లేదు. మంచి అభిప్రాయంతో చేరదీయవచ్చు. దేశం, కాలం ఆలోచించి కార్యం చక్కగా చేస్తే ఫలితం కూడా త్వరగానే సిద్ధిస్తుంది. ఇతడిని తిరస్కరించకుండా చేర్చుకుంటే మేలు, ఫలం కనబడుతుంది కాని కనబడకపోదు. మహాత్మా! నీకు చెప్పగలవాడినా నేను? నువ్వు చేస్తున్న గొప్ప ప్రయత్నం, రావణుడి నీతిమాలిన పనులు చూసి, రావణుడు తప్పక చస్తాడని తెలిసి నువ్వు లోగడ దుర్నీతిపరుడైన వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చినట్లే రావణుడిని చంపి తనకు రాజ్యం ఇమ్మని ప్రార్థించడానికి బుద్ధిపూర్వకంగా వచ్చాడు. ఇతడిని చేర్చుకోవాలో, వద్దో నువ్వే ఆలోచించు”.

         ఆంజనేయుడు చెప్పిన (న్యాయంతో కూడిన) మంచిమాటలు విన్న రామచంద్రుడు, ఇలాంటి సందర్భాలలో శాస్త్రాలు ఏమి చెప్పాయో, పూర్వులు ఎలా ఆచరించారో, వసిష్ఠాది పెద్దలవల్ల విన్నవాడైనండున, చేయాల్సిన పని చేయడానికి నిశ్చయించుకుని, ప్రసన్నమైన మనస్సుతో వానరులతో ఇలా అన్నాడు. “విభీషణుడిని గురించి నా అభిప్రాయాన్ని నేను చెప్తాను. నిజమైన మైత్రికలవాడుకాని, మిత్రుడిలాగా నటించేవాడు కానీ, సమీపించి వచ్చినా, దూరంలోనే వున్నా, శరణాగతుడిని విడవను. దానివల్ల నాకు మేలే కలుగుతుందా, కీడు కలుగుతుందా అని నెపం పెట్టి శరణాగతుడిని తోసిపుచ్చరాడు. అలా తోసిపుచ్చితే నేను దుష్టులలో చేరుతాను. విభీషణుడు, రావణుడు జ్ఞాతులు కాబట్టి విరోధులే. ఆ కారణాన వీడు మనదగ్గరికి వచ్చాడు కాని, రావణుడు పంపితే వాడిమీద ప్రేమతో రాలేదు. విభీషణుడు నిర్మల మనస్కుడైనా రావణుడు దుష్టుడు కాబట్టి ఇతడిని సందేహించాడు. సందేహించి వెడలగొట్టాడు. విభీషణుడు రావడానికి ఇదీ కారణం. ఇతడు రావణుడితో కలిసి వుండకుండా వేరుపడి నన్ను చేరడానికి వచ్చాడు. ఆ కారణాన వీడిని గ్రహించవచ్చు”. శరణాగత రక్షణ సర్వసామాన్య విషయమని చెప్పిన శ్రీరామచంద్రుడు ఆ విషయంలో తన విధానం చెప్పాడు.

(ఇలా శరణాగతి గురించి విశేషంగా చెప్పడం వల్లే శ్రీమద్రామాయణానికి దీర్ఘ శరణాగతి అని పేరు వచ్చింది. అంటే, ఆది నుండి అంతం వరకు శరణాగతే ఎన్నో రకాలుగా, ఎన్నో చోట్ల చెప్పడం జరిగింది).

రామచంద్రమూర్తి తన వ్రతం ఇదేనని చెప్పడంతో సుగ్రీవుడు మళ్లీ ఏమీ చెప్పకపోవడమే కాకుండా ముఖాన్ని ప్రసన్నం చేసుకోవడంతో ఇతడి సందేహం తీరిందని శ్రీరాముడు భావించాడు. అందుకే విభీషణుడిని పిలుచుకు రమ్మని సుగ్రీవుడినే పొమ్మన్నాడు. “సుగ్రీవా! నువ్వే విభీషణుడి దగ్గరికి పోవాలి. పోయి పిలుచుకునిరా. వీడు రావణుడి తమ్ముడైనా సంతోషమే, లేదా, రావణుడే ఈ వేషంలో వచ్చినా సంతోషమే. శరణన్నప్పుడే వాడికి నేను అభయమిచ్చాను. మీ సందేహం తీర్చడానికి ఇంతసేపు మాట్లాడాను”.

శ్రీరాముడి దయాగుణాన్ని అర్థం చేసుకున్న సుగ్రీవుడు, “విభీషణుడు ఈ క్షణం నుండి మా స్నేహితుడై మాతో కలిసిమెలిసి, మాతో సమానంగా వుంటాడు. ఇది నాకే కాకుండా వానరులందరికీ సమ్మతమైన కార్యం” అంటాడు. అని చెప్పి పోయి సుగ్రీవుడు విభీషణుడితో, “విభీషణా! నీకు శ్రీరామచంద్రమూర్తి అభయమిచ్చాడు. నావెంటరా” అన్నాడు. ఆ మాటలకు సుకీర్తి అయిన రామచంద్రమూర్తి సంతోషించాడు. విభీషణుడికి ఎదురుగా పోయి ఆయన వైపు చేతులు చాచి స్నేహం చేశాడు.

         వచ్చిన విభీషణుడు రామచంద్రమూర్తి పాదాలను ఉద్దేశించి శరణమే ప్రయోజనం అనుకున్నవాడై సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈ విధంగా ఆలశ్యంచేయకుండా శరణాగత ధర్మంలో నిశ్చయ బుద్ధికలవాడు, రక్షకుడిని వెతుకుతున్నవాడైన విభీషణుడు, తన వెంటవచ్చిన నలుగురు రాక్షసులతో కలిసి శ్రీరామచంద్రమూర్తి పాదాలమీద వాలి, శరణాగత ధర్మలక్షణయుక్తం, యోగ్యమైన మంచిమాటలను ఇలా చెప్పాడు. “రామచంద్రా! నేను రావణుడి తమ్ముడిని. అతడు నన్ను అవమానించిన కారణాన సర్వాన్ని వదిలి వచ్చాను. కాబట్టి నాకెవ్వరూ రక్షకులు లేరు. నేను, నా సుఖజీవనాన్ని, నా పాలనకు లోబడిన సమస్త ఉపకరణాలను, భోగాలను అన్నీ నీ స్వాధీనం చేశాను. ఇక నా యోగక్షేమాలకు నువ్వే దిక్కు. పుణ్యచరిత్రా! నా శరీరంలో ప్రాణాలున్నంతదాకా నువ్వు శత్రు సేనలో దూరి లంకను, రాక్షసులను చంపడంలో సహాయం చేస్తాను” అని అంటాడు.

ఇలా అన్న విభీషణుడిని రామచంద్రమూర్తి కౌగలించుకున్నాడు. ఆ తరువాత లక్ష్మణుడిని పిలిచి వేగంగా సముద్ర జలాలను తెమ్మన్నాడు. తెచ్చి, విభీషణుడిని రాక్షస రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేయమన్నాడు. లక్ష్మణుడు రామాజ్ఞప్రకారం వానర సేన మధ్య విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. వానరులంతా రాముడి దయాగుణాన్ని మెచ్చి కేకలు వేశారు. అప్పుడు సుగ్రీవ, హనుమంతులు విభీషణుడితో వానరసేనతో సహా ఈ సముద్రాన్ని దాటే ఉపాయం చెప్పమని అడిగారు. ఈ సముద్రాన్ని సగర కుమారులు తవ్వారనీ, వారి వల్లే ఇతడికి ఈ రూపనామం వచ్చిందనీ, సముద్రుడు అందువల్ల కృతజ్ఞుడు కాబట్టి రామచంద్రమూర్తి ప్రార్థిస్తే తగిన ఉపాయం చెప్తాడనీ విభీషణుడు అంటాడు. వారు విభీషణుడి సూచన సబబే అంటారు. సేతువు కట్టాలంటారు.

         ఇక ఆలశ్యం చేయడం ఎందుకని భావించిన రామచంద్రమూర్తి వేదిలోని అగ్నిహోత్రుడిలాగా దర్భశయనంలో పడుకోవడానికి ప్రయత్నం చేశాడు.

శ్రీరామాయణ పారాయణ ఫల శ్రుతి

         నారద మహర్షి వాల్మీకికి రామాయణాన్ని ఉపదేశించినప్పుడు ముందు భూతకాలం చెప్పి, తరువాత భవిష్యత్కాలం చెప్పాడు, వాల్మీకి ప్రశ్న వేయడానికి ముందే “ఎవ్వడీ ధారుణిని యీకాలంలో” అనే ప్రశ్నించాడు కాని, గడిచినవారి గురించి కాని, రాబోయేవారిని గురించి కానీ ప్రశ్నించలేదు. అవతారానికి ముందే రామాయణం రచించినట్లయితే కొంత భూతార్థకంలో, కొంత వర్తమానార్థకంలో, కొంత భవిష్యత్ అర్థకంలో చెప్పాల్సిన పనిలేదు. అవతారానికి ముందే రామాయణం రచించడం జరిగిందని అంటే చాలా విరోధాలు వస్తాయి. అలా చెప్పడానికి ఒక్క ఆధారమైన రామాయణంలో లేదు. రామాయణం వేదంలాగా స్వతఃప్రమాణం. దానిలోని విషయాలను ఋజువు చేయడానికి ఇతర ప్రమాణాలు లేవు.

         రామాయణమే ఆదికావ్యం. వేదార్థం ఇందులో విస్తరించి చెప్పడం జరిగింది. వాల్మీకి మహర్షి దీన్ని అశ్వమేధయాగం చేయడానికి పూర్వం రచించి బహిర్గతం చేశాడు. ఇది పుణ్యం కలిగించి ఆయువును వృద్ధి చేస్తుంది. ఇది మిక్కిలి కీర్తికరం. రాజులకు గెలుపు కలిగిస్తుంది. దీన్ని చదువుతే (పఠిస్తే) సకల పాపాలు తొలగిపోతాయి. కొడుకులు కావాలనుకున్నవారికి కొడుకులు, ధనం కోరినవారికి ధనం లభిస్తుంది. రామాభిషేక విధానం విన్న రాజు శత్రువులను గెలిచి రాజ్యం పాలిస్తాడు. రామాయణం ప్రజలు వింటే, వారి ఆయువు వృద్ధి అవుతుంది. కోపాన్ని జయించి, శ్రద్ధగా, ఏకాగ్ర మనస్సుతో, వేదార్థం విస్తరించిన, వాల్మీకి మహర్షి చెప్పిన రామాయణాన్ని మంచి మనసుతో చదివేవాడు సమస్త దుఃఖాలను దాటుతాడు. మరణించిన తరువాత మోక్ష సుఖం కలుగుతుంది. జీవించిన కాలంలో శ్రీరామ కటాక్షం వల్ల వాడి కోరికలన్నీ నెరవేరుతాయి. ఇది సత్యం సత్యం అని స్వానుభవం వల్ల ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు ఆయన రచించిన ఆంధ్రవాల్మీకి రామాయణంలో పేర్కొన్నారు. ఆయనగారు సంకల్పించిన మహాకార్యం అతడి శక్తికి మించినవైనా లోకోత్తరంగా అన్నీ నెరవేరాయి.

         రామాయణ కావ్యం వినేవారిని గురించి దేవతలు సంతోషిస్తారు. వారి ఇండ్లలో దుష్టగ్రహాలు నిలవలేక పారిపోతాయి. రాజు వింటే భూమిని జయిస్తాడు. పరదేశంలో వున్నవాడు ఆపదలేక ప్రయాణం చేస్తాడు. ముట్టు స్నానం చేసిన వయసు స్త్రీ వింటే ఆమెకు ఉత్తమ గుణాలుకల కొడుకులు పుట్తారు. ఎవరైతే ఈ రామాయణాన్ని ఇష్టంగా పఠిస్తాడో వాడి పాపాలన్నీ హరిస్తాయి.

శ్రీరాముడు ఏనాడో మరణించాడు కదా! అలాంటివాడు తనను సేవించినవారికి ఎలా సహాయం చేస్తాడు? అని ప్రశ్నించేవారికి సమాధానం రామాయణంలోనే వుంది. రామచంద్రమూర్తి నారాయణుడు. సమస్త భూతాలకు స్థానమై సర్వం తానై వుండేవాడు. కాబట్టి ఆనాడున్నాడు, నేడు లేడని అనకూడదు. సమస్త ప్రపంచానికి ప్రభువైన రాముడు లేకపోతే లోకం అనాయకమౌతుంది. అవతారానికి ముందు కాని, తరువాత కాని రామచంద్రమూర్తి లేకపోలేదు. రామచంద్రమూర్తి లేడంటే భగవంతుడు లేడని అర్థం. ఎందుకంటే ఆయనే ఆదిమదేవుడైన హరి. బ్రహ్మరుద్రాదులు లేనికాలంలో ఆయన వుండి వీరందరి జన్మకారకుడైనాడు. ఆయనే ఒక కాలంలో లేడంటే ఇక వుండేది ఏమిటి? దీర్ఘబాహుడైన యితడు సాకారుడు కాని నిరాకారుడు కాదు. ఈయన లక్ష్మీపతి. ఒంటరివాడుకాదు. లక్ష్మీ విశిష్టుడు. నరసింహాతారంలో లాగా సర్వాంతర్యామి అయివుంటాడు. ఒక కాలంలో వుండి వేరే కాలంలో లేకుండా వుండడు. ఇలాంటివాడు శ్రీరామచంద్రమూర్తి.

శుభకరమైన ఈ కావ్యాన్ని వింటే ధనధాన్య వృద్ధి, సంతాన వృద్ధి కలుగుతుంది. సద్గుణాల స్త్రీ సాంగత్యం, ఉత్తమ సౌఖ్యం లభిస్తుంది. పరమార్థమైన మోక్షం ప్రాప్తిస్తుంది. క్షేమ పద్ధతిన ఆయువు, కీర్తి, ఆరోగ్యం లభిస్తాయి. ఇది సోదర స్నేహం, సౌఖ్యం, సాదుబుద్ధి, తేజస్సు కలిగిస్తుంది. పుణ్యలాభం కోరి దీన్ని వినే సత్పురుషులు నియమంగా చపలత లేని మనస్సుతో గ్రంథమంతా వినాలి. రామాయణ శ్రవణ పఠనం వల్ల దుష్ట రోగాలు మానుతాయి. ఇది ప్రమాణానుభవ సిద్ధం.

రామాయణం పురావృత్తమణి అని చెప్పడం జరిగింది. పురావృత్తాలెన్నో వున్నాయి. అవి రామాయణానికి సరికావు. ఎందుకంటే, శ్రీమద్రామాయణం బ్రహ్మ అనుమతితో వాల్మీకి మహర్షి రచించాడు. ఈ కావ్యంలో అనృతం కొంచెమైనా వుండదని బ్రహ్మ వరం. ఇది వేదం స్వరూపం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి యోగ్యత, మహాత్మ్యం, గాయత్రీ ప్రణవ మంత్రాది సంపుటీకరణ ఇతర గ్రంథాలలో లేవు. సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో వున్నప్పుడు రాసింది కాబట్టి ఇది పురాతన చరిత్ర అన్నారు. రామాయణ పఠనం వల్ల, రామ కథా శ్రవణం వల్ల సర్వ సుఖాలు కలుగుతాయి. ఈ విధంగా వేదార్థం తెలిపే ఈ రామాయణ కావ్యం పూర్వం వాల్మీకి మహర్షి లోకులకు ఉపకారం చేయడానికి దాన్ని సంహితగా రచించాడు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

(ఆంధ్రవాల్మీకి రామాయణ రసరమ్య గాథలు రేడియోలో ఇంతటితో సమాప్తం)

 

          

 

No comments:

Post a Comment